Friday, June 25, 2021

చుక్కల వెలుతుర్లోనించి సౌరశక్తి వెలుగుల్లోకి చుక్కలపాడు

 

****************************************
మొదటిసారి వెంకటేష్, సుభానిగార్లతో చుక్కలపాడు వెళ్ళినప్పుడు పిల్లలు (సహజంగానే) నన్ను ఆకట్టుకున్నారు. దాదాపు ముఫ్ఫైమంది వరకు ప్రాధమిక బడి వయసు పిల్లలు ఉన్నారు, కాని అక్కడ బడి లేదు. కారణం ఈ ఊరు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండడం, ఇక్కడి ఆదివాసీ కుటుంబాలు అడవి నరికి పోడు వ్యవసాయాన్ని జీవనోపాధిగా చేపట్టడం.
ఇది ఈ రోజు కథ కాదు... దాదాపు ఇరవై ఏళ్ళ కిందట చత్తిస్గడ్ నించి ఐదారు మురియా (గుత్తికోయ) తెగ కుటుంబాలు ఇక్కడికి వలసవచ్చి పోడుకొట్టి వ్యవసాయం చేసుకోడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారి బంధువుల కుటుంబాలు కూడా వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు. ఈ క్రమంలో వీరికీ అటవీశాఖ వారికి మధ్య చాలాసార్లే గొడవలు జరిగాయట. ఏదైతేనేమి, ఈ గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ లో, నాన్-షెడూల్డ్ జాబితాలో ఉండడంతో వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి మౌలిక సదుపాయాలూ అందవు. ఐతే, వారికి ఓటరు కార్డులు మాత్రం ఉన్నాయండోయ్!
అదలా ఉంచితే పిల్లలెక్కడున్నా పిల్లలే కదా! విద్యాహక్కుకి అర్హులే కదా! మరి వారినెలా చదువుకి దూరం చేస్తారని అవేశపడ్డాను. ఆ తర్వాత ఏంచేశానో ఇంకోసారి పంచుకుంటాను.
ఈ ఊరికి మూడోసారి... లెర్నింగ్ సెంటర్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు నాతో అమ్ము కూడా ఉంది. మాతోపాటు ఫ్రెండ్ విజేత, ఆ గ్రామ పంచాయతి సెక్రెటరి వీరేంద్ర కూడా ఉన్నారు. ఉత్సవంలా ఊరందరి సమక్షంలో జరిగిన ఆనాటి కార్యక్రమంలో వారితో మాట్లాడుతూ మీకున్న అత్యవసరాలేంటి అని అడిగితే ముందు ఆడవాళ్ళు మెల్లగా చెప్తే, ఆ వెంటే మగవాళ్ళు గట్టిగా చెప్పింది ఒక్కటే! నీళ్ళకోసం బోరింగ్ కావాలని, చీకట్లో ఉండకుండా కరెంటు వేయించమని... మామూలుగా ఐతే రెండూ పెద్ద సమస్య కాదు. ప్రభుత్వమే వారికి ఆ సదుపాయాలు కల్పించాలి, కల్పిస్తుంది కూడా. కాని చుక్కలపాడులో వీరున్న పరిస్థితికి ఈ కనీస సదుపాయాలు కూడా అందని ద్రాక్ష చందమే. ఇదేమాట వీరేంద్రతో అంటే నీళ్ళు, కరెంట్ ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ ఇలాంటి గ్రామాలతో ఇతరత్రా ఇష్యూస్ ఉన్నాయి, అందుకే ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేసరికి అనేక ఆటంకాలు ఉండడం నిజమే కనుక మేమూ ఏమీ అనలేకపోయాం.
చీకటి పడీపడకముందే లైట్లు వేసుకునే, కరెంటు పోయినా ఇన్వర్టర్ల సాయంతోనో ఎమర్జెన్సీ లైట్లతోనో ఇళ్ళల్లో చీకట్లని పారదోలే నగరాలనించి వెళ్ళిన మనకి చీకటిరాత్రుల జీవితాలు నిజంగా అర్ధం కావు. అందులోనూ ఇటువంటి ఊర్లల్లో ఎటువంటి పరిస్థితులుంటాయో ఊహించుకోడమే తప్ప అనుభవంలోకి రావు. ఐతే దాదాపు ఇరవై ఏళ్ళుగా వీరు రాత్రుళ్ళు చీకట్లో చుక్కలవెలుగులోనే గడుపుతున్నారన్నది వాస్తవం... ఇది జీర్ణించుకోడానికి పెద్ద సమయం పట్టలేదు మాకు.
చీకటి పడకముందే అన్ని పనులూ చక్కబెట్టుకోవాలి. వంటా వార్పూ ముగించుకుని ఎక్కడివి అక్కడ సర్దేసుకోవాలి. కోళ్ళు కమ్మేసుకోవాలి. మేకలు, పశువుల్ని కొట్టాల్లో సురక్షితంగా కట్టేసుకోవాలి. పిల్లా పాపలకి, పెద్ద వయసువారికి, అనారోగ్యంతో ఉన్నవారికి ముందు తినబెట్టెయ్యాలి. అడవికి దగ్గరగా ఉన్నారు కదా! ఎటునించి ఏ ఆపదొస్తుందో చెప్పలేంకదా! వయసులో ఉన్నవారైతే ఏదోలా సర్దుకోగలరు కాని ఇంకొకరిపైన ఆధారపడున్నవారు, సహాయం అవసరమైనవారు చీకట్లో ఇబ్బందిపడతారు కదా! నిండు నెలల గర్భిణీలు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే చీకటి పడుతోందంటే వారి మనసుల్లో ఒకలాంటి గుబులు... అందులోనే పుట్టి అందులోనే పెరిగినా వారి అనుభవాలు అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తూనే ఉన్నాయి. గుబులు రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఈ చీకట్లనించే కదా తంత్ర విద్యలు, వాటిపట్ల నమ్మకాలు, భయాలు పాతుకుపోయాయి. మూఢంగా వాటికి బలిపెట్టడమో, బలైపోడమో కూడా చూస్తూనే ఉన్నాం కదా.
వీటినించి బయటపడడానికేనేమో రాత్రైతే చాలు గుంపంతా ఒకదగ్గర చేరి నెగడు వేసుకుని పాటలు నాట్యాలతో సాధ్యమైనంత రాత్రిని గడపుతుంటారనుకుంటా. విని అందంగా ఊహించుకునే వారికి అదో వేడుకలా ఉంటుంది కాని అందులోనే జీవితం గడిపేవారి నిగూఢ పరిస్థితి అర్ధంచేసుకోడం ఒకపట్టాన సాధ్యంకాదని నా భావన.
మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు... పిల్లలమీద, ఆడవారి మీద ఈ చీకటి ప్రభావం ఎలా ఉంటుంది? లైంగిక వేధింపులు, దాడులు జరిగే అవకాశం లేకపోలేదేమో అని కూడా అనిపించింది. వారు చెప్పకపోయినా మా మనసు పొరల్లో ఇది పోరు పెడుతోంది. అమాయకంగా అడిగిన ఓ ప్రశ్నకి ఆడవారు పెద్దగా స్పందించకపోయినా మగవారు మాత్రం అలాంటివేమీ జరగవు అని చెప్పేశారు. ఈ అలోచనలతోపాటు నిస్సహాయంగా వారి పరిస్థితిని వివరిస్తుంటే ఆగలేకపోయాం.
వెంటనే స్పందిస్తూ అమ్ము కరెంట్ ఐతే మేము తీసుకురాలేము కాని సోలార్ లైట్లు ఇస్తే ఉపయోగపడతాయా అని అడిగింది. అక్కడ చేరిన వారందరిలో ఒక మెరుపు. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న మహిళల్లో ఒక కదలిక. అకస్మాత్తుగా నీటి ప్రవాహంలాంటి సన్నని హొరు. అందరూ ఒకేసారి ఏదో ఒక శబ్దంతో వారి అవసరాన్ని, అంగీకారాన్ని, ఉత్సుకతని ఒకరితో ఒకరు పరస్పరం వ్యక్తీకరించుకుంటూంటే వచ్చిన అందమైన సంగీతంలాంటి సన్నని హోరు అది... ఇదంతా కేవలం ఒక నిమిషంకన్నా తక్కువసేపే. లైట్లు అవసరం మాకు అని ఆర్ద్రంగా అంది నెలల బిడ్డని ఎత్తుకున్న ఓ పాతికేళ్ళ యువతి. అప్పుడే ఆ ఊరి పటేలు కూడా ‘ఉపయోగపడతాయి, అవసరం’ అన్నాడు. ఐదారుగురు యువకులు కూడా ‘అవును... చాలా ఉపయోగం. మీరు మాకు లైట్లు ఇవ్వగలిగితే మాకు వెలుగు ఇచ్చినవారవుతారు’ అన్నారు.
ఈ లోపు నేను, అమ్ము, విజేత, వీరేంద్ర మాట్లాడుకుని అక్కడున్న కుటుంబాలకి సోలార్ లైట్లు ఇవ్వడానికి ఎంత ఖర్చువస్తుందో అంచనా వేశాము. 25 కుటుంబాలు ఉన్నాయని, దాదాపు 80,000/- అవసరమౌతుందని అనుకున్నాము. వెంటనే అమ్ము తనకొచ్చే పెన్షన్ నించి ఆ మొత్తాన్ని తను ఇస్తానని అందుకు అవసరమైన ఏర్పాట్లని చూద్దామని అంది. అదే విషయాన్ని అక్కడున్నవారందరికి చెప్పాము. గొప్ప సంతోషంతో అందరూ చప్పట్లుకొట్టారు. కొందరైతే అందర్నీ దాటుకుంటూ దగ్గరకి వచ్చేసి కూర్చున్నారు. ఒకవైపు అబ్బురంతో, మరోవైపు పిసరంత అనుమానంతో ఒకరిద్దరు ‘ఎప్పుడిస్తారు... మళ్ళీ వస్తారా’ అని చిన్నగా అడిగారు. ‘అనుమానం ఒద్దు, త్వరలోనే చుక్కలపాడుకి వెలుగులొస్తాయి’ అని అమ్ము హామీ ఇచ్చింది. దాన్ని బలపరుస్తూ నేనుకూడా ‘నెల్రోజుల్లోనే మళ్ళీ మీదగ్గరకి వస్తాము, ఇప్పుడు విజ్ఞానాని పెంచే పుస్తకాలు తెచ్చాము, అప్పుడు వెలుగులు నింపే దీపాలు తెస్తాము. మేము మాటిస్తున్నాము, మరి మీరూ ఒక మాటివ్వాలి’ అని నేను అనగానే ఏదో మెలిక పెట్టేలా ఉందని కొంచెం అనుమానంగా చూస్తున్న ఆ ఆదివాసీలతో ఒక మాటిమ్మని అడిగాను. ఊర్లో ఉన్న పిల్లలందరిని సెంటర్ కి పంపమని, నెలరోజుల్లో లైట్లు తీసుకుని మళ్ళీ వచ్చేసరికి కొంచెం పెద్ద పిల్లలు కనీసం వాళ్ళ పేర్లు, అమ్మ నాన్న పేర్లు నేర్చుకోవాలని, కనీసం పదివరకు అంకెలు నేర్చుకోవాలని అడిగాను. పిల్లలంతా హుషారుగా చక్కటి నవ్వుతో తమ సంసిద్ధత తెలిపారు. పిల్లలకి నేర్పించడానికి తొమ్మిది వరకు చదువుకున్న అమ్మాయి ఉందని ఆమె చెప్పొచ్చని పెద్దమనుషులు కొందరు అన్నారు.. ఆమె కూడా ఒప్పుకుంది. నా ఎత్తు పారినందుకు సంబరపడిపోతూ నేను చప్పట్లు కొట్టాను. నా వెనకే అందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని తెలిపారు.
అక్కడ్నించి వచ్చేయడంతోనే మా పని ప్రారంభమైంది. నేనైతే ఇంకా కొన్ని గ్రామాల్లో పని చూసుకోడానికి మరో వారం రోజులు అక్కడే ఉండిపోయా. అయినా ఫోన్లో లైట్లపని నడుస్తూనే ఉంది. నాణ్యమైన సోలార్ లైట్లని అందించే ప్రణామ్య ఎలక్ట్రికల్స్ గురించి చెప్తే వాళ్ళని కలవడం, రేటు మాట్లాడడం, పని పురమాయించడం అమ్ము తీసుకుంది.
నేను ఆ అడవుల్లో ఆదివాసీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుదు మరో రెండు గ్రామాల్లో కూడా ఈ లైట్లు అందించాలని నాకనిపించింది. ఆ గ్రామాలకి నాతో వచ్చిన లిట్డ్స్ యేసురత్నంగారు కూడా ఇస్తే చాలా బాగుంటుందని, ఆర్ధికంగా కాకపోయినా తామూ సహకరిస్తామన్నారు. అంటే మరో 50 లైట్లు, వీటికి జియస్టి, రవాణా చార్జీలతో కలిపి 1,82,000/- ఇంకా కావాలి. దీక్ష - సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ యాక్షన్ ద్వారా దీన్ని చేపట్టాలని అనుకున్నాను. నా ఆలోచనని చెప్పగానే నా కుటుంబ సభ్యులు, కజిన్స్, ఆప్తమిత్రులు చెయ్యందించారు. అదే ఏజెన్సీకి ఎందుకైనా మంచిదని మరో 55 లైట్లకు ఆర్డర్ ఇచ్చేశాను. ఇంతలో శ్రీనివాసరావు సజ్జా తన తరుఫున 50,000/-, ఒక ఫ్రెండ్ ఇచ్చిన 5,000/- కలిపి మొత్తం 55,000/- ఇస్తానన్నారు. పర్వాలేదు మిగతా 1,27,000/- దీక్ష నించి పెట్టుకోవచ్చు అనుకున్నాను.
సరిగ్గా నెల్లాళ్ళ తర్వాత వెళ్ళడానికి ఒకరోజు ముందుగానే లైట్లు ఎలా పనిచేస్తాయో స్వయంగా చూడాలని ప్రణామ్య ఎలక్ట్రికల్స్ సుమన్, లావణ్యలతో డెమో కావాలని అడిగి వారిదగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకుని వచ్చాను.
ఆ రోజు రానే వచ్చింది. వెళ్ళేముందు ఆ గ్రామాలవారికి సమాచారం ఇద్దామంటే చుక్కలపాడులో ఎవరిదీ ఫోన్ లేదు. ముందుసారి ఎంతో సపోర్ట్ ఇంచ్చిన విజేత కొండమీద కట్టిస్తున్న స్కూల్ పనిలో ఉండడంతో తనూ అందుబాటులో లేదు. వీరేంద్రకి డెంగీ జ్వరం వచ్చి తన సొంతూరులో ట్రీట్మెంట్లో ఉన్నాడు. అయినా తన బాధ్యతగా ఆ పంచాయతి మహిళా పోలీస్, గ్రామ వాలంటీర్ని నాకు అటాచ్ చేస్తానన్నాడు. సరే అనుకుంటే తీరా చింతూర్ వెళ్ళాక వీరెంద్ర ఫోన్ కాని, ఏసురత్నంగారి ఫోన్ కాని కలవక ఎటూ పాలుపోక కొంచెం గడబిడ అయింది. ఆ పంచాయతిలోని వారెవరి ఫోన్ నంబర్లు నా దగ్గర లేవు. ఈ పరిస్థితిలో విషయం షేర్ చెయ్యగానే గంటలో పరిస్థితిని చక్కదిద్దారు రమణ ఆకుల, ఐటిడిఎ పి.ఒ. అంతలోనే ఏసురత్నంగారు ఆ తర్వాత గ్రామ మహిళా పోలీస్ అశ్విని కూడా కాల్ చెయ్యడంతో అన్నీ సర్దుకున్నాయి.
అనుకున్నరోజుకి అనుకున్నట్లుగా లైట్లతో వ్యాన్ ఏడుగుర్రాలపల్లికి వచ్చేసింది. 30.03.2021 ఉదయం 10.30కి చుక్కలపాడుకి చేరుకున్నాం. ఏసురత్నంగారు, లిట్డ్స్ వాలంటీర్ కూడా వచ్చారు. గ్రామ మహిళా పోలీస్, VRO, అంగన్వాడి టీచర్, ఆశతొ పాటు అన్ని శాఖలకి చెందిన గ్రామస్థాయి అధికారులందరూ ఉన్నారు. ఆ రోజు ఆ గ్రామంలో విలేజ్ వాక్ నిర్వహిస్తున్నారట అందుకే అందరూ ఉన్నారు. ఊరివారందరూ సమావేశమై ఉన్నారు. ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుంది ఇచ్చిన మాట నెరవేర్చడానికి!
నాకంటే కొన్ని నిమిషాల ముందు చేరుకున్న వ్యాన్ ఎందుకొచ్చిందో వారికి అర్థమైనట్లు లేదు. కాని నన్ను చూడడంతోనే గ్రామస్థులు అలెర్ట్ అయిపోయారు. నవ్వుతూ పలకరించి మీకోసం లైట్లు వచ్చినాయని చెప్తే అబ్బురంతో ఒకరకమైన అచేతనం అయిపోయారు. నమ్మశక్యం కానట్లుంది... మరి అక్కడ రెగ్యులర్గా పని చేయని మనం, రెండుమూడుసార్లు మాత్రమే కలిసిన మనం, మాటిచ్చినట్లుగానే నెల్లాళ్ళలో లైట్లతో దిగిపోయేసరికి నమ్మశక్యంగా లేదనుకుంటా! వారు ఈ వెలుగుల కోసం ఎంత తపించి ఉంటారో... ఇప్పుడు ఒక్కసారిగా కళ్ళముందుకు వచ్చేసరికి ఎలా స్పందించాలో కూడా తెలియనట్లయిందనుకుంట! ఏదో భావం నా గొంతులో ఉండకట్టినట్లు అయింది. ఆ దృశ్యం ఇంకా కళ్ళముందు సజీవంగా ఉంది.
చాలా దుఃఖం అనిపించింది. ఇదంతా అమ్ము మిస్ అయిందని కూడా బాధనిపించింది. అమ్ముని బాగా మిస్ అయ్యాను. కవర్ చేసుకుంటూ అశ్వినితో మాటలు కలిపా, పిల్లల్తో ఆటల్లో పడ్డా. ఇంతలో లైట్లు తెచ్చిన జగదీష్ డ్రైవర్ తో కలిసి మెటీరియల్ అంతా దించాడు. ఒక సెట్ తీసి డెమో ఇమ్మంటే తబ్బిబ్బయ్యాడు. ఏజెన్సీ ఏరియాకి రావడం మొదటిసారట, ఈ మురియా ఆదివాసీలని చూసి, ఆ గ్రామాన్ని చూసి, ఆ అడవి దారి చూసి, వారి భాష విని ఏమీ అర్ధం కానట్లయిందట! సరే వచ్చేముందు నేను డెమో చూసిరావడం మంచిదైంది. నేనే జగదీష్ ఇచ్చిన సెట్ ని తీసి ఏసురత్నంగారు, రాజేష్, అశ్విని కూడా సపోర్ట్ చేయగా సోలార్ ప్యానల్, బ్యాటరీ యూనిట్, బల్బులు, వైర్లు అన్నీ అరేంజ్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా వినియోగించాలో వైర్లు కనెక్ట్ చేసి, స్విచ్లు ఆన్ ఆఫ్ చేసి పూర్తిగా డెమో ఇచ్చాను. ఒక్కో సెట్లో ఐదేసి మీటర్ల వైరుతో కూడిన మూడు బల్బులున్నాయి. అంటే ప్రతి ఇంటికి అవసరాన్ని బట్టి మూడు చోట్లకి బల్బులు పెట్టొచ్చు. ప్రతి బల్బుకి కంట్రోల్ స్విచ్ ఉంది. సెల్ చార్జింగ్ కి కూడా ఫెసిలిటీ ఉంది.
ఆశ వర్కరు, అంగన్వాడి టీచర్ని తమ దగ్గరున్న లిస్టు ప్రకారం పిలవమని అడిగాను. వారు పిలుస్తుండగా ఒక్కో కుటుంబం నించి భార్యాభర్తలిద్దరూ వచ్చి లైట్ల సెట్ అందుకుంటుంటే వారి కళ్ళల్లో సంబరం... అందుకోడంలో కృతజ్ఞత... వాటిని పట్టుకోడంలో అపురూపం... దాచాలన్నా దాగని వ్యక్తీకరణ అది. అప్పటికి పదకొండున్నర అయింది. ఒక వైపు ఎండ మండిపోతోంది. వేడి ఆవిర్లొస్తున్నాయి. చెమటలు దిగకారిపోతున్నాయి. మరో వైపు వారి అనేక భావాల జడి... నా కళ్ళు ఎర్రబడిపోయాయని నాకు తెలుస్తోంది. చెమ్మ నీరై కారకుండా ఎండ వేడి అడ్డుకుంది, నన్నాదుకుంది!
చుక్కల వెలుగులో ఉంటున్న చుక్కలపాడుకి సౌరశక్తి వెలుగులు వచ్చేశాయి. 25 అనుకున్న కుటుంబాలు 30 అయ్యాయి. మొదటి లెక్క తప్పింది. నేను ఎక్కువ ఆర్డర్ చేయడం మంచిదైంది. అమ్మూ కాంట్రిబ్యుషన్ కి దీక్ష ద్వారా అమ్మ సహకారం తోడయ్యింది. నా ఇద్దరమ్మల మంచి మనసులు చుక్కలపాడులో రాత్రి పూట వెలుగులు నింపాయి. అయితే ఈ వెలుగులు చూడ్డానికి ఒకసారి చీకటి పడ్డాక వెళ్ళాలి. ఇదో గట్టి కోరిక... ఎప్పడు సాకారమౌతుందో చూడాలి.
ఇక్కడ చెప్పుకోవలసిన మంచి విషయం ఇంకోటుంది... మనకి ఈ లైట్లని సప్లై చేసిన లావణ్య, సుమన్ లు వారి వంతుగా 15,000/- ఖరీదు చేసే ఒక పెద్ద సోలార్ స్ట్రీట్ లైట్ చుక్కలపాడు కోసం పంపారు. ఇది రిమోట్ తో పనిచేస్తుంది. చీకటి పడగానే ఆటోమాటిగ్గా వెలుగుతుంది. ఎంతసేపు వెలగాలో టైం సెట్ చేసుకోవచ్చు. వెలగడం ఆగిపోయాక కూడా దాని కిందనించి ఎవరైన వెళ్తుంటే వెంటనే వెలుగుతుంది. ఇది వారందరికి ఒక మాయా ప్రపంచాన్ని తెచ్చి చుక్కలపాడులో నిలిపినట్లు ఉంది.
భాషతో పనిలేదు, మాటతో పనిలేదు, వారి నవ్వులు చాలు వారి భావం తెలుసుకోడానికి. అయినా వారి భాషలో, యాస తెలుగులో, హిందీలో ఎన్నెన్నో కృతజ్ఞతలు చెప్పారు. నేనుకూడా వారికి సేవ చేసే ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పి అందరికీ నోరు తీపిచేసే బిస్కెట్లు పంచి అందరం మరో గ్రామాం చిన్న ఏడుగుర్రాలపల్లికి బయలుదేరాం. మిగిలిన రెండు గ్రామాలలో ఏమి జరిగిందో తర్వాతి పోస్ట్స్ లో షేర్ చేస్తాను.
చుక్కలపాడుకి వెలుగులిద్దామని సంకల్పించించడమే కాక దాన్ని సాకారం చేయడంలో మెజారిటీ ఖర్చుని భరించిన అమ్మూకి, తనవంతు చేయూతనిచ్చిన అమ్మకి ప్రేమపూర్వక కృతజ్ఞతలు. చక్కటి హోం లైటింగ్ ని అందించిన లావణ్య సుమన్లకి ధన్యవాదాలు. ఈ ప్రయత్నంలో రకరకాలుగా సహాయాన్ని అందించిన రమణగారు, ఏసురత్నంగారు, జాన్, అశ్విని, విజయగారు, రాజేష్, జగదీష్, వీరేంద్ర, గ్రామాధికారులందరికి పేరుపేరునా థాంక్స్.
Uma Nuthakki, Aparna Thota and 69 others
22 Comments
Like
Comment

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...