Friday, June 25, 2021

ప్రేమ వలయాలు 1


మాలిని...
శిరీష పుష్పమంత సున్నితంగా కనిపిస్తుంది కానీ చేసే పని మాత్రం కొండల్లో, కోనల్లో,ఆదివాసీలతో...
చాలా బలమైన వ్యక్తిత్వం తనది.
నాకు తెలియకుండా చాలా సంవత్సరాల క్రితమే మాలిని నా జీవితం లోకి వచ్చింది.
కానీ నాకు గుర్తు లేదు.
భూమిక హెల్ప్ లైన్ కి వాలంటీర్ గా ఉన్నాను,చాలా సార్లు భూమిక మీటింగ్స్ కి వచ్చానమ్మా అంటుంది.
నాకెందుకు గుర్తు లేదో ..చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.
ప్రశాంతి విషయంలో కూడా అలాగే జరిగింది.చాలా సంవత్సరాలుగా నీ చుట్టూనే తిరుగుతున్నాను అమ్మూ...నువ్వు నన్ను పట్టించుకోలేదు అంటుంది ఎప్పుడూ.
2013 వరకు ప్రశాంతి స్నేహాన్ని నేను గుర్తుపట్టలేకపోయాను.
మాలిని విషయం లోను అంతే జరిగింది.
బహుశా నాకున్న స్నేహితుల వలయం వల్ల అలా జరిగిందనుకునటాను.
ఆలస్యంగా నైనా నేను మీ ఇద్దరి ప్రేమని గుర్తించగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
మాలినీ ...నీ ప్రేమ చాలా సున్నితంగా,గాఢంగా నన్ను తాకుతుంది.
నన్ను వెతుక్కుంటూ ఓ రాత్రి నువ్వు జంగిల్ బెల్స్ అడవికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.
జంగిల్ బెల్స్ రిసార్ట్ లో ఫోన్ పనిచేయదు.చిమ్మ చీకటి.నువ్వొస్తావని నాకు తెలియదు.
నేను జంగిల్ బెల్స్ లో ఉన్నానని నీకు ఎలా తెలిసింది,నేనే చెప్పానా నాకు గుర్తు లేదు.
హటాత్తూగా నువ్వు నా ముందుకొస్తే నాకు కలిగిన ఆశ్చర్యానందాలను నేను దాచుకోలేదు.
నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు నాకు కొత్తగా అనిపించలేదు.
నీ స్నేహాన్ని అప్పుడు నేను గుర్తుపట్టగలిగాను.
ఆ రోజు చాలా సంతోషం.బోలెడు కబుర్లు చెప్పుకున్నాం.
చిమ్మ చీకట్లో ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోయావ్.
కానీ ఆనాటి ఆ అనుభూతి నాలోపల అలాగే ఉండిపోయింది.
ఆ తర్వాత మనం చాలా కాలం కలవలేదు.
ఒక రోజు ఫోన్ చేసి మార్చి 8 కి పాడేరు రమ్మని పిలిచావ్.
అదే రోజు నాకు విజయనగరం లో ప్రోగ్రాం ఉంది కాబట్టి రెండింటిని దృష్టి లో ఉంచుకుని నేను ఒప్పుకుని నీ వెంట అరకు,పాడేరు వచ్చాను.నీ పని ప్రాంతమంతా చూసాను.ఆదివాసీ ప్రాంతంలో పనిచేయడం ఎంత కష్టమో అర్ధం చేసుకోగలిగాను.
ఇద్దరం ఆ కొండల్లో,కోనల్లో భలే తిరిగాం.
నువ్వు తిరిగే ప్రాంతాలన్ని నాకు చూపించావ్.నిజానికి ఆ సమయంలో నేను చాలా దిగులుతో ఉన్నాను.
మా తమ్ముడి కొడుకు చనిపోయిన దుఖం లో ఉన్నాను.కానీ నీతో ఆ కొండల్లో,అడవుల్లో తిరుగుతూ అన్నీ మర్చిపోయాను.
నీ ప్రేమ నన్ను సేదతీర్చింది మాలినీ...
ఇద్దరం రోజంతా తిరిగి సాయంత్రం విజయనరం వచ్చాం.అక్కడ నాకు సన్మానం.
అక్కడ నీలాగే,నన్నెంతో ప్రేమించే మరో అమ్మాయి ఉందని నాకు తెలియదు.
మన మధ్య ముప్పేట స్నేహబంధం ఏర్పడబోతున్నదని నాకు తెలియదు.
అదొక అద్భుతమైన సందర్భం.
ఉమ నా జీవితంలోకి వచ్చింది ఆ సందర్భంలోనే.
మన ముగ్గురి మధ్య ఎంత అందమైన బంధం అల్లుకుపోయిందో మనకే తెలుసు.
ఇప్పుడు ఈ అమరికలోకి జయ కూడా వచ్చి చేరడం ఎంతో విచిత్రమైన విషయం.
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని ఈ స్నేహబంధం ఎంత హాయిగా అనిపిస్తుందో.
వైజాగ్ వస్తే ఎంత సంబరంగా ఉంటుందో.
మనం,సముద్రం ఇంకా ఎన్నో ఎన్నో.
నేను పిల్లల్ని కడుపులోంచి కనలేదు.మనసు లోంచి కన్నాను.
నన్ను మీరిద్దరూ ఎంత అపురూపంగా చూసుకుంటారో నాకు తెలుసు.
ఆ అనుభూతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
నేనెవరు?నన్నెందుకు వీళ్ళు ప్రేమిస్తారు? ప్రాణంగా ఎందుకు చూసుకుంటారు?
ఉమ ఇంట్లో కానీ మాలిని ఇంట్లో కానీ ఉంటే నాకు మా సీతారామపురంలో ఉన్నంత హాయిగా ఉంటుంది.
జయ ఇల్లు నా సొంత ఇల్లులాగానే ఉంటుంది.40 సంవత్సరాల స్నేహమది.
మాలినీ ... నాకు చాలా సార్లు అనిపిస్తుంది. మీరిచ్చినంత ప్రేమని నేను మీకు ఇస్తున్నానా ?? ఇవ్వడం లేదు కదా!!
చాలా సంవత్సరాల పాటు అపరిచితులంగా ఉండి అనూహ్యంగా కలిసి ఓ అద్భుతమైన బంధంగా రూపుదిద్దుకోవడం చాలా చిత్రమే.
మొన్న కరీం నగర్ వెళ్ళినప్పుడు పద్మావతి చూపించిన ఆత్మీయత గురించి ఆశ్చర్యపడుతూ ఉమతో చెప్పినప్పుడు తను ఒక మాటంది.
"అమ్మా!! మీరు ఎక్కడెక్కడో ఉన్న పువ్వుల్ని మాలగా కట్టి మా అందరినీ మీ ప్రేమతో కలుపుతున్నారు.ఇంకెన్ని పువ్వుల్ని గుది గుచ్చుతారో వేచి చూడాల్సిందే" అంది.
నిజమా!!! నాకు తెలియదు.
పోలవరం పెద్దలతో నన్ను లింక్ చేయడం, అక్కడ 300 మంది జ్యేష్ట పౌరుల్ని చేరగలగడం వెనక ఉన్నది ముమ్మాటికీ నువ్వే మాలినీ.
ఆ రోజు నువ్వు,నేను,ఉమ సముద్రపు ఒడ్డున గెష్ట్ హౌస్ లో సరదాగా,సంబరంగా కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు వెంకట లక్ష్మి రావడం,పోలవరం పెద్దల గురించి చెప్పడం,ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నామని,సపోర్ట్ చెయ్యమని అడగడం వెంటనే ఒప్పేసుకున్నాను.
ఈ రోజు పోలవరం లో 13 గ్రామాల్లో 300 మందికి భోజనం పెట్టగలగడం మాకు ఎంత తృప్తిని,సంతోషాన్ని ఇస్తున్నదో ఎలా నీకు చెప్పను?
మా ఈ ఆనంద కారకురాలవు నువ్వే మాలినీ.
పోలవరం వెళ్ళినప్పుడల్లా నేను గొప్ప సంతోషాన్ని పొందుతాను.
బహుశా నాకు ఈ ఆనందాన్ని ఇవ్వడం కోసమే నువ్వు నా జీవితంలోకి వచ్చావనుకుంటాను.
అమ్మా!! అంటూ ఎంతో ఆర్తితో మీరు పిలిచినపుడు నాలోపల ఏదో జిగేల్మని మెరుస్తుంది.ఈ అనుభవం గమ్మత్తుగా ఉంటుంది. ఇంత సమర్ధులైన,ప్రియమైన కూతుర్లు నాకుండగా నాకేంటి అనిపిస్తుంది.
రక్త సంబంధాలే మహా విధ్వంశంగా మారిపోతున్న నేపధ్యంలోంచి చూసినప్పుడు ప్రేమ స్పర్శ తో పెనవేసిన మన బంధం ఎంతటి మహత్తరమైందో నాకు అనుభవం లోకి వస్తోంది.
వైజాగ్ అంటే జయ,ఉమ,మాలిని, సముద్రం,భీమిలి,బీచ్ రోడ్,తొట్లకొండ ఇంకా ఎన్నో ఎన్నెన్నో .
నా మీద ప్రకృతి కురిపించే అనంతమైన ప్రేమలాంటిదే మీ ప్రేమ అన్న ఎరుకతో...
మాలినీ!! నువ్వు గుర్తొచ్చినపుడల్లా నాకు అరకు,పాడేరు,లంబసింగి లాంటి సౌందర్యభరితమైన అడవులు గుర్తొస్తాయి.
నీకూ,నాకూ అడవంటే ప్రాణమనీ గుర్తొస్తుంది.
అడవులంత వైల్డ్ గా మన స్నేహం కొనసాగాలని ...
ప్రేమగా...
అమ్మ.
May be an image of 2 people, including Malini M Chaitanyashravanthi and people smiling
Uma Nuthakki, Prasuna Balantrapu and 28 others
6 Comments
Like
Comment

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...