Thursday, July 25, 2019

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ


ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు మాట్లాడింది అబ్బూరి వరదరాజేశ్వరరావుగారితో. ‘లోహిత’నుప్రారంభించినప్పుడు జయ ప్రభతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఛాయాదేవిగారింటికి వెళ్ళినపుడు ఆయన గలగలా మాట్లాడుతుంటే ఆవిడ లోపల్నించి తినడానికి ప్లేటులో అమర్చిన జంతికలో, మురుకులో తెచ్చారు. అంతకుముందు ఫోటోలో చూసానేమోగానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆవిడ ముఖంలో ఆవరించి ఉన్న ప్రశాంతత, మెత్తటి మాట.. నా మనసులో ముద్రపడిపోయింది. ఆరోజు ఆవిడ ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడారు. పచ్చటి కుటీరంలో ప్రశాంత మూర్తిని చూసాను.
ఛాయాదేవి గారితో నా పరిచయం అలా మొదలైంది. రెండున్నర దశాబ్దాల అనుబంధం. ఎన్ని సార్లు ఆ ఇంటికెళ్ళానో, ఏమేమి కబుర్లు చెప్పుకున్నామో! కాలింగ్‌బెల్‌తో సహా ఎంత కళాత్మకంగా ఆ ఇంటిని అలంకరించుకున్నారో… ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళకు చుట్టుకునే ఆమె పెంపుడు పిల్లలు. తనకి ఇష్టమని ఎక్కడి వెళ్ళినా ఏదో ఒక పిల్లి బొమ్మని తెచ్చి ఇస్తే ఎంత సంబరపడిపోయేవారో! పిల్లులంటే ఎంత ప్రేమో!
భూజానికి ఒక బ్యాగ్‌ తగిలించుకుని బాగ్‌లింగంపల్లి రోడ్లమీద నడయాడిన ఛాయదేవిగారు ఎవ్వరికీ ఏ పనీ చెప్పేవారు కాదు. పోస్టాఫీసుకి, బ్యాంకుకి, షాప్‌లకి అలా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాటర్‌ బిల్లు కరెంటుబిల్లు కట్టడానికి కూడా తనే వెళుతుంటే నాకివ్వండి నేను కట్టిస్తాను అంటే ‘అబ్బే! ఎందుకమ్మా. మీకు శ్రమ నడిస్తే ఆరోగ్యంకదా!’ అని ఏదో ఒక జోక్‌ వేసేవారు. చాలా తరచుగా భూమిక ఆఫీసుకు వచ్చేవారు. ఏదో పుస్తకం కావాలని తీసుకునే వారు. ఫోన్‌ చేసి ఈ పుస్తకం తెచ్చిపెట్టు అని ఏనాడూ అడగలేదు. తన పనులన్నీ తనే చేసుకోవాలి. మూర్తీభవించిన ఆత్మగౌరవరూపం.
భూమికతో అలరారిన రెండున్నర దశాబ్దాల ఆత్మీయ అనుబంధం. భూమిక సంపాదక సభ్యులుగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు నేనేమీ చేయడం లేదంటూ, నా పేరు తీసేయమంటూ అడిగేవారు. మీరేమీ చెయ్యక్కరలేదు మీరు భూమికకు ఎంతో చేసారు. భూమిక ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మీరే కదా ఆదుకున్నారు. మీ పేరు తియ్యం అని నేను పోట్లాడేదాన్ని. కానీ మొన్న మే నెలలో నా పేరు సంపాదవర్గంలో తీసేయండి. ఇంకెవరినైనా పనిచేసేవాళ్ళని పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్‌ ప్లీజ్‌ నా మాట వినండి అంటూ బలవంతంగా తన పేరు తీసేయించారు. ఆవిడ అంత గట్టిగా కోరుతుంటే కాదనలేకపోయాను. పేరు తీసేసినంత మాత్రాన భూమికతో తన అనుబంధం తగ్గిపోతుందా ఏమిటి? తన లైబ్రరీ అంతా భూమికకే ఇచ్చారు. లైబ్రేరియన్‌గా తన అనుభవాన్ని రంగరించి కాటలాగ్‌ ఎలా తయారుచేసుకోవాలో, పుస్తకాలు ఎలా అమర్చుకోవాలో ఎన్నోసార్లు నేర్పారు. ఆవిడ క్రమశిక్షణలో ఆరోవంతు కూడా నాకు అలవడకపోవడానికి కారణం నా స్వభవం వల్లనే.
ఛాయాదేవిగారితో నా అనుబంధం, నా అనుభవాలు ఈ సంపాదకీయంలో ఎక్కడ ఇముడుతాయి. జ్ఞాపకాలు ఒక దానికి ఇంకొకటి ఒరుసుకుంటూ కళ్ళ ముందుకొస్తున్నాయి. మనసంతా కిక్కిరిసి పోతోంది. అక్షరాలుగా అమరాలంటే… ఇక్కడ చాలదు. ఓ పుస్తకంమే రాయల్సి ఉంటుంది. ఆవిడతో నా జ్ఞాపకాలు 2012కి ముందు ఆ తర్వాతగా విడిపోయాయి. బాగ్‌లింగంపల్లి ఇంట్లోను, అన్ని సాహిత్య సమావేశాల్లోను రోడ్ల మీద నడుస్తూ, తన పనులు చేసుకుంటూ తిరిగిన ఛాయదేవిగారు, అన్నీ వదిలేసి, ఆఖరికి తన జ్ఞాపకాలతో నిండిన పచ్చటి పొదరిల్లులాంటి ఇంటిని హఠాత్తుగా అమ్మేసి, సి.ఆర్‌. ఫౌండేషన్‌లో ఓ గదికి పరిమితమైపోయిన ఛాయదేవి గారుగా నా జ్ఞాపకాలు విడిపోయాయి. కానీ అది నా భ్రమ మాత్రమే. ఎంతో ప్రేమగా, కళాత్మకంగా అమర్చుకున్న ఇంటితో బంధాన్ని పుటుక్కున్న తెంపేసుకుని, ఎలాంటి వేదనని, మానసిక క్షోభని మచ్చుకైనా కనబడనివ్వకుండా తన ఒకే ఒక గదిని మరింత కళాత్మకంగా అమర్చుకున్న ఛాయదేవి ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. తనెక్కడున్నా ఆ పరిసరాల్ని సృజానాత్మకంగా తయారుచేసుకోగల అద్భుతమైన కళాహృదయం ఆమెకే పరిమితం. జిడ్డు కృష్ణమూర్తి జీవన తాత్వికతని పుణికిపుచ్చుకుని, తన జీవితంలోకి, తన మార్గంలోకి అనువదింపచేసుకున్న అపురూప వ్యక్తిత్వం ఆమెకే సొంతం.
ఆవిడ కథల గురించి, ఆవిడ సాహిత్యం గురించి, ఆవిడకొచ్చిన అవార్డుల గురించి నేను రాయబోవడం లేదు. ఆమె సాహిత్యాన్ని తూకం వేసే పని నేను చెయ్యదలుచుకోలేదు. వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా మాత్రమే నేను రాయాలనుకుంటున్నాను. చరిత్ర చీకటిలో మరుగున పడిపోయిన భండారు అచ్చమాంబను వెలుగులోకి తెచ్చింది, నా చేత అచ్చమాంబ జీవిత చరిత్రను రాయించిందీ ఛాయాదేవిగారే అని మాత్రం సగర్వంగా చెప్పదలచుకున్నాను. ఒకానొక కథా వర్క్‌ షాప్‌ రిపోర్ట్‌ని యధాతధంగా యాభైపేజీలు రాసిన ఛాయాదేవి గారు కె. లలిత ప్రస్తావించిన అచ్చమాంబ కథ గురించి రాయడం, అది చదివి నేను చాలా ఉత్సాహంగా అచ్చమాంబ గురించి శోధించి ఓ పెద్దవ్యాసం రాయడం, బ్రౌన్‌ అకాడమీ కోసం పుస్తకం రాయమని ఛాయాదేవి గారు అడగడం ఫలితం, అచ్చమాంబ ‘సచ్ఛరిత్ర పుస్తకర’ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. ఆవిడకు శిరస్సువొంచి నమస్కరించడం మినహా ఏమి చెయ్యగలను.
2012లో బాగ్‌లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్ళిపోయినప్పుడు తనని చూడడానికి వెళ్ళినప్పుడు ‘మీ పేరుమీద రెండు
ఉత్తరాలు పోస్ట్‌ చేసాను నిన్ననే. మీరొస్తారని తెలియదు. తెలిస్తే మీకే ఇచ్చేదాన్ని’ అన్నారు. భూమికకు ఏదైనా కథో, వ్యాసమో రాసి పంపారేమో అనుకున్నాను. కానీ అది కథకాదు. ‘ఈహోమ్‌కి వచ్చాక వాళ్ళు ఒక ఫారమ్‌ ఇచ్చి పూర్తి చేయమన్నారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే ”మీకు అనారోగ్యం కలిగినా, ఇంకేమైనా ప్రమాదం జరిగినా వెంటనే మేము తెలియచేయాల్సిన వ్యక్తి పేరు, ఫోన్‌, అడ్రస్‌ రాయమన్నారు. నేను మీ పేరు రాయాలని అనుకున్నాను. ఆ విషయమే మీకు ఉత్తరం రాసాను” అన్నారు. ”తప్పకుండా మీరు నా పేరు రాయండి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనొచ్చేస్తాను.” అని చెప్పాను.
చాలా సార్లు ఆ ఉత్తరం చదవాలనుకునేదాన్ని ఇప్పుడెందుకులే అని విరమించుకునేదాన్ని, ఆవిడ కన్నుమూసాకే ఆవిడిచ్చిన కవర్‌ తెరిచాను. ఇప్పుడు నాతోపాటు అందరూ చదివారు. నా మీద ఆవిడకున్న నమ్మకం, విశ్వాసం, నన్ను తన కూతురుగా భావించిన ఆ విశాలత్వం నన్ను వివశురాలిని చేసాయి. అందరి సహకారంతో ఆవిడ కోరుకున్న విధంగా ఎలాంటి కర్మకాండలూ లేకుండా, తన కళ్ళని ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఆసుప్రతికి, తన పార్థివ శరీరాన్ని వైద్యవిద్యార్థుల పరిశీలనార్థం ఇఎస్‌ఐ మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేసాం. ఇంక ఆవిడ నా మీద పెట్టిన పెద్ద బాధ్యత తను రాసిన విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆయా వ్యక్తులకు అందించడం. వీలు వెంబడి ఆ పని పూర్తి చేస్తాను.
అబ్బూరి ఛాయాదేవి గారితో నాకున్న మానసిన సాన్నిహిత్యం, అనుబంధం గురించి రాయడానికి ఈ సంపాదకీయం సరిపోదు. భూమిక సంపాదక సభ్యులుగా తన స్మ ృతికి నివాళిగా మాత్రమే ఇది సరిపోతుంది.
మనందరికీ అత్యంత ఆత్మీయురాలు, గొప్ప మానవీయతతో అలరారే అద్భుత చైతన్యమూర్తి
అబ్బూరి ఛాయాదేవి గారికి నా అశ్రునివాళి.

Monday, November 5, 2018

నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… –

మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్‌. అయినా సరే వెళ్ళాలి. నల్లమల కళ్ళముందు కొచ్చింది. రా… రా… అని పిలవడం మొదలుపెట్టింది. ఆకురాలు కాలం… అడివంతా నగ్నంగా, నిజరూపంతో సాక్షాత్కరించే కాలం. పచ్చదనం మచ్చుకైనా కనబడదు. అయినా సరే వెళదామని నిర్ణయించుకున్నాను.

ప్రశాంతితో అన్నాను ఓ రెండు రోజులు ఎటైనా పోదామా? అని. ‘సై’ అంది. కర్నూల్‌, మహానంది, అహోబిలం… ర్నూల్‌లో మహా ఎండలు. ఫర్వాలేదు… పోదామ్‌… అనుకున్నాం. ఏప్రిల్‌ నాలుగో సోమవారం… ఆఫీసులో కొన్ని పనులున్నాయ్‌. పన్నెండింటికల్లా పూర్తయిపోయాయి. మిట్ట మధ్యాహ్నం వేళ కారులో కర్నూల్‌ బయలుదేరాం. ప్రశాంతి చాలాసార్లు కర్నూల్‌ వెళ్ళింది కానీ, మహానంది, అహోబిలం చూళ్ళేదట. కర్నూల్‌లో ఆగకుండా మహానంది వెళ్ళిపోయాం. అప్పటిదాకా మండిన సూర్యుడు మహానంది కొండల్లోకి జారిపోయాడు. ఆ కొండల్లోంచి 365 రోజులూ జాలువారే నీటి చెలమల్లోకి సూర్యుడు పారిపొయ్యాడన్నమాట వేడి భరించలేక.
మేం మహానందిలో దిగేసరికి కొంచం చీకటి పడుతోంది. పెద్దగా జనం లేరు. ఉన్నవాళ్ళు కొలనులో ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. మహానందిలో వున్న గొప్ప ఆకర్షణ నిత్యం పారే నీటిబుగ్గ… ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. గుడి ఆవరణలో వున్న తటాకంలో ఎప్పుడూ ఒకే స్థాయిలో మిలమిలా మెరిసే స్వచ్ఛమైన నీళ్ళు… తటాకం అడుగు కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. నడుములోతు మాత్రమే నీటిలోతు ఉంటుంది. ఎప్పుడూ అది పెరగదు… తరగదు. అందులోంచి గుడి బయటవున్న రెండు తటాకాల్లోకి నీళ్ళు మహాఫోర్స్‌గా వస్తుంటాయి. అక్కడి నుండి కాలువద్వారా నీళ్ళు పొలాల్లోకి పారుతుంటాయి. కొన్ని వందల ఎకరాలకు ఈ నీరు పారుతుంది. మహానందిలో పెంచే అరటి తోటలన్నీ ఈ నీటితోనే పెరుగుతాయి.
మహానంది గుడిమీద నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండదు. ప్రశాంతి గుడిలోకి వెళదామంది. అక్కడ గుడి వెనక ఓ పెద్ద నాగమల్లి చెట్టుంది. ఆ చెట్టు చుట్టూ పాముల బొమ్మలుంటాయి. నాకు ఈ చెట్టు కూడా ఆకర్షణే. ఇద్దరం కాసేపు కొలను నీళ్ళల్లో నిలబడ్డాం. మొత్తం దిగి ఈత కొట్టాలనిపించింది. కానీ అడవి దాటి అహోబిలం చేరాలి. మహానందిలో మాకు సహకరించిన శ్రీనుకి వీడ్కోలు చెప్పి అహోబిలం వేపు సాగిపోయాం. మా కోసం అహోబిలంలో ఎదురు చూస్తున్న నాగరాజుకి వచ్చేస్తున్నామని కాల్‌ చేసి చెప్పాం. చీకటి పడిపోయింది. అమావాస్యకి ముందు రోజులు… చిమ్మచీకటిగా వుండి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశాంతి, నేను కబుర్లలో పడ్డాం. ప్రశాంతి దెయ్యాల కబుర్లు మొదలెట్టింది. కొరివి దెయ్యాలగురించి చెబుతుంటే డ్రైవర్‌ యాదగిరి జడుసుకున్నాడు. ”మేడం! నాకు దయ్యాలంటే చాలా భయం. చెప్పకండి” అంటూ వొణికాడు. మేం విరగబడి నవ్వుకున్నాం. ఎనిమిదిన్నరకి దిగువ అహోబిలం చేరుకున్నాం. నాగరాజు మా కోసం రూమ్‌ బుక్‌ చేసాడు. రోజంతా ప్రయాణం… స్నానం చేసి వేడి వేడి చపాతీలు తిని నిద్రపోయాం. ఆరింటికి ఎగువ అహోబిలం వెళదామని తయారుగా వుండమని, యాదగిరికి చెప్పాం.
మర్నాడు నాలుగింటికే మెలకువ వచ్చేసింది. తయారైపోయి రూమ్‌ బయటకి వచ్చేసరికి ఎదురుగా నెలపొడుపునాటి నెలవంక… ఇదేంటి ఇప్పుడు నెలవంక అనుకుంటూ ఆశ్చర్యపోయి ”మన స్నేహం మొదలైంది నెలపొడుపునాడే కదా! మనల్ని పలకరిద్దామని వచ్చినట్టుంది” అన్నాను. ఇంకా తెల్లవారలేదు. దిగువ గుళ్ళోంచి సుప్రభాత హడావుడి వినిపిస్తోంది. నెలవంకని చూస్తూ… సంతోషపడుతూ కారెక్కగానే ఎగువ అహోబిలంవైపు కారు బయలుదేరింది. పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి. ఆకులు రాలిపోవడంవల్ల అడవి పల్చగా కనబడుతోంది. ఆరింటికల్లా పైకి వెళ్లిపోయాం. నేను చాలాసార్లు అహోబిలం వెళ్ళాను. రకరకాల గ్రూప్స్‌తో వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా చూసిన ప్రతిసారీ కొత్తగానే వుంటుంది. తొలిసారి చూస్తున్న ప్రశాంతి ఆనందాశ్చర్యాలకి లోనైంది. మెట్లెక్కుతున్నప్పుడు చేతికందుతున్న ఆ కొండచరియ, ఆ అమరిక ప్రశాంతిని అబ్బుర పరిచాయి.
అహోబిలం వచ్చినప్పుడల్లా గుడి వెనకున్న అడవి మొత్తం తిరగాలని అన్పించేది. ఎత్తైన కొండలతో నిండివుండే నల్లమల అడివి మొత్తం తిరగాలని. చివరి శిఖరం వరకు ఎక్కాలని కలలు కంటుండేదాన్ని. కానీ ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు. దానికి కారణం ఆ కొండలెక్కడం కష్టమని, ఆ అడవిలో తిరగడం ప్రమాదకరమని చాలామంది భయపెట్టడమే. మామాలుగానే ఎత్తులెక్కడం నాకు కష్టం. జ్వాలా నరసింహుని కొండ ఎక్కడం అసాధ్యం అని తేల్చేయడం వల్ల… అమ్మో! నేను ఎక్కలేనులే అని నిర్ణయించేసుకుని అడవిలో సమీపంలో వుండే జలపాతం వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసే వాళ్ళం. ఇంతకు ముందు నేను వెళ్ళిన బృందాల్లో ఎవ్వరూ సాహసం చెయ్యలేదు. కానీ… ఈసారి ప్రయత్నం చెయ్యాలి. నన్ను గెలిపించడానికి నాతో ప్రశాంతి వుంది. జ్వాలా నరశింహ కొండ ఎక్కడం నాకు గొప్ప విజయమే. ”అమ్మూ! నేనున్నా కదా! ప్రయత్నం చేద్దాం… జాయేంగే… జీతేంగే…” అంటూ ఉత్సాహపరిచింది.
ఆ అడవి గర్భంలోకి గైడ్‌ లేకుండా వెళ్ళడం అసాధ్యం. ఎక్కడ దారి తప్పుతామో, ఎటు వెళ్ళిపోతామో అంతు చిక్కదు. గైడ్‌ని చూడమని నాగరాజుకు అంతకు ముందే చెప్పాం. మేం కొండపైకి వచ్చేసరికి గైడ్‌ తయారుగా వున్నాడు. చిన్న పిల్లాడు… నేనే గైడ్‌ అన్నాడు. ”నువ్వా!” అని మేము ఆశ్చర్యపోతే… ”నేనే మేడం… చాలా రోజుల్నించి గైడ్‌గా చేస్తున్నా… అడవిలో నాకంతా తెలుసు” అన్నాడు. ఆ పిల్లాడి పేరు సంజీవ్‌, వాళ్ళన్న ముందుకొచ్చి అన్నాడు. ”మేడం… వాడికి అంతా తెలుసు. మీకు బాగా చూపిస్తాడు” అనడంతో మేం సంజీవ్‌ వెంట అడవిలోకి బయలుదేరాం. దారిలో ఊత కర్రలు తీసుకున్నాడు.
మూడో కాలుని టిక్‌ టిక్‌ మనిపిస్తూ నడక మొదలుపెట్టాం. మొదటగా దర్శనమిచ్చే జలపాతం కనబడలేదు. ”వర్షాలు లేవు మేడం… జలపాతం ఇంకిపోయింది” అన్నాడు సంజీవ్‌.
నడక మొదలైంది. బండలమీద వొడుపుగా నడుస్తున్నాం. ఇంతకు ముందొచ్చినపుడు, జలపాతం సమీపంలో కూర్చుని మెడిటేషన్‌ చేస్తూ నేను ఫోటోలు తీయించుకున్న ప్రదేశం దగ్గర కొచ్చాం. చాలా సన్నగా నీళ్ళు కారుతున్నాయి. అక్కడ మళ్ళీ ఫోటోలు తీసుకున్నాం. అక్కడ ఓ చెట్టుకి పెద్ద తొర్ర ఏర్పడి వుంది. ప్రశాంతి అందులోకి దూరి ఫోటో తీసుకోవాలనుకుంది. కానీ సంజీవ్‌ వారించాడు తొర్రలో ఏమైనా జంతువులు, పాములు ఉండొచ్చు, లోపలికి వెళ్ళొద్దన్నాడు.
పెద్ద పెద్ద బండరాళ్ళ మీద నడుస్తున్నాం. సూర్యుడు ఇంకా అడవిలో అడుగు పెట్టలేదు. అయినా విపరీతంగా చెమటలు కారుతున్నాయి. చెట్లు చాలా వరకు ఆకులు రాలిపోయి, ఎండిపోయినట్లు కనబడుతున్నా చాలా చెట్లు పచ్చగానే వున్నాయి. ఆకురాలిన చెట్లకి సన్నటి కిసలయాలు తొంగి చూస్తున్నాయి. కొన్ని చెట్లకి ఎర్రటి ఆకులు, ముదురు మెరూన్‌ కలర్‌లో ఆకులు, పచ్చటి చిగుర్లు… అడివంతా రంగుల మయంగా వుంది. ఎన్నో రకాల అడవి పూలు… చాలా విలక్షణమైన పూలగుత్తులు. ఆ మత్తులో నడుస్తున్న మమ్మల్ని ‘పాము, పాము, ఆగండి’ అంటూ హెచ్చరించాడు సంజీవ్‌. అందరం ఎక్కడివాళ్ళమక్కడే ఆగిపోయాం. కర్రతో కొట్టగానే పాము ఓ బండ కిందికి జర జరా పాక్కుంటూ వెళ్ళిపోయింది. అలాంటి బండల మీదే మేము నడుస్తున్నాం. ఏ బండ కింద ఏ పాముందో! ”నాకు పాములంటే చాలా భయం” ప్రకటించాడు యాదగిరి. కాసేపు పాముల మీద చర్చ నడిచింది.
ఇటీవల తమ పొలంలో కన్పించిన పాముల గురించి చెప్పింది ప్రశాంతి. బండల మీద కాళ్ళు వేస్తుంటే జారుతుందనే భయంతో పాముల భయం కూడా తోడైంది. మేం జాగ్రత్తగా నేలమీద, బండలమీద దృష్టి పెట్టి నడుస్తున్నపుడు మా ఎదురుగా హఠాత్తుగా సీతాకోక చిలుకల గుంపు కనబడింది. అన్నీ ఒకే రంగులో
ఉన్నాయి. కొన్ని నేల మీద వాలి, మరికొన్ని వాటి చుట్టూ ఎగురుతున్నాయి. నేను వాటి దగ్గరగా వెళ్ళాను. ”ఇక్కడ సీతాకోకచిలుకలు చాలా వుంటాయి. నాకు రోజూ కన్పిస్తాయి” అన్నాడు సంజీవ్‌. వాటి దగ్గరకెళ్ళగానే అన్నీ ఒక్కసారి లేచాయి. పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఒక్కటీ దొరకలేదు. వాటిని పట్టుకునే ప్రయత్నాన్ని ప్రశాంతి వీడియో తీసింది. అన్ని సీతాకోక చిలుకలు ఎగురుతూ, నేలమీద వాలుతూ వాటి హడావుడిలో అవి మునిగినప్పుడు మేము ముందుకు సాగాం.
అడవి మధ్యలో కట్టిన ఒక బ్రిడ్జి మీదికి వచ్చాం. ”అదిగో చూడండి ఉగ్రస్తంభం… అక్కడే నరశింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అక్కడి వరకు వెళ్ళడం కష్టం. జ్వాలా నరశింహ కొండ వరకు వెళ్ళొచ్చు. ఆ కొండ ఎక్కడానికి 600 మెట్లున్నాయి” ఉన్నాడు సంజీవ్‌. ”ఆరువందల మెట్లా? అమ్మో! నేను రాను” అనేసాను. అనడమే కాదు ఒకచోట కూర్చుండి పోయాను. ”అమ్మూ! ఇటురా!” అని పిలిచింది ప్రశాంతి. నేను లేచి వెళ్ళాను. అప్పటికి కొంచం ఎండ పెరుగుతోంది. ఇద్దరం బ్రిడ్జి మధ్య వరకూ నడుచుకుంటూ వెళ్ళాం. ”అదిగో చూడు! ఉగ్రస్తంభం అని సంజీవ్‌ చెప్పిన కొండ. భలే వుంది… మెల్లగా వెళదాం… నేనున్నాగా అమ్మూ…” అంది. ”నేను రాను… అన్ని మెట్లెక్కి అంత ఎత్తుకు రావడం నావల్ల కాదు” అంటూ భీష్మించాను. ఉగ్ర స్తంభకొండని ఫోకస్‌ చేసి బోలెడు ఫోటోలు దిగాం. బ్రిడ్జి మీద నుంచి నల్లమల మహాద్భుతంగా కనిపిస్తోంది. ఎత్తైన కొండలు విభిన్న రంగుల ఆకులతో చెట్లు… కొన్ని చెట్లకి ఎర్రటి తురాయి పువ్వులాంటి ఆకులు… పండుటాకుల్లోంచి తొంగి చూస్తున్న లేత చిగురుటాకులు. అడవి పచ్చగా, వొత్తుగా వున్నపుడు పచ్చదనం మాత్రమే కనబడుతుంది. ఆకురాలు కాలంలో అడవి అందం భిన్న వర్ణాల మేళవింపులో కళ్ళకు విందు చేస్తుంది. ఈ సౌందర్యం చూడాలనే కదా ఎండల్లో నల్లమల ట్రిప్‌ వేసాం.
బ్రిడ్జి మీద నుంచి చుట్టూ పరుచుకున్న అపార సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నవేళ ప్రశాంతి నా భుజం చుట్టూ చెయ్యేసి ”అమ్మూ! పద వెళదాం. నువ్వు ఎక్కగలవు. ఆయాసమొస్తే ఆగుదాం… కూర్చుందాం. నేనున్నాగా” అంటూ నన్ను మెట్ల వేపు నడిపించింది. ఆ మెట్ల వేపు, ఆ ఎత్తు వేపు చూడగానే నా గుండె ఝల్లుమంది. అప్పటికే గుండె దడదడ కొట్టుకుంటోంది. మైసూర్‌లోని శ్రావణ బెళగొల కొండ ఎక్కినప్పటి అనుభవం పదే పదే గుర్తుకొస్తోంది. ఆ రోజు సగం దారిలో స్పృహతప్పి పడిపోయిన దృశ్యం కళ్ళముందు కదలాడుతోంది. బహుశా అదే నాలో ఒక ఫోబియాలాగా తయారైందనుకుంటాను. ప్రశాంతి నా చెయ్యి పట్టుకునే వుంది. నేను మెల్లగా మెట్లెక్కడం మొదలు పెట్టాను. యాదగిరి, నాగరాజు, సంజీవ్‌లు మా ముందు నడుస్తూ ”మేడం! వచ్చేసాం… ఇంకొంచం దూరమే” అంటూ ఉత్సాహపరుస్తున్నారు.
వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. చేతిలో కర్ర చెమటకి జారుతోంది. పది మెట్లెక్కడం… ఆయాసంతో కూర్చుండి పోవడం… అలా కూర్చున్నప్పుడు, చుట్టూ పరుచుకున్న అడవి సౌందర్యం చాలా సేద తీర్చేది. జ్వాలా వరకు నేను వెళ్ళగలనా అనుకుంటూ చాలాసార్లు ”ఇంక నేను రాను… మీరు వెళ్ళి రండి… ఇక్కడ కూర్చుంటాలే” అనేదాన్ని. అడవి మధ్యలో ఒక్కదాన్ని కూర్చోడానికి సిద్ధమయ్యాను కానీ మెట్లెక్కాలంటే… ”అమ్మూ! నువ్వు రాగలవు… నీకేమీ కాదు. అసలు నువ్వు భయపడడమేమిటి?” అంటుంది ప్రశాంతి. భయమేనా? కాదు భయం కాదు. నా గుండె పనితీరు మీద నాకున్న అపనమ్మకం. ఆయాసంతో గుండె ఆగిపోతుందనే సంశయం… నాది నార్మల్‌ గుండె కాదు కదా! మాటేయించుకున్న ఓటి గుండె… చాలా సంవత్సరాలు జరిగిపోయినా… నాలో ఆ ఫీలింగ్‌ పోలేదు. అందుకే ఎత్తులకి ఎక్కాలంటే… గుండె ఏమవుతుందో అనే బెదురు అలాగే
ఉండిపోయింది. అలా అని నాకు చావంటే భయం లేదు. కానీ అప్పుడే ఈ సౌందర్యాన్నంతా అర్థాంతరంగా వదిలేసి పోవాలనీ లేదు. ఈ భయాన్ని మోస్తూనే నా సాహసాలన్నీ చేస్తుంటాను.
ఆగుతూ, కూర్చుంటూ చుట్టూ పరుచుకున్న అడవి అందాన్ని చూస్తూ నాలుగొందల మెట్లు ఎక్కేసాను. మళ్ళీ ఆగిపోయాను. కింద లోయ, ఎదురుగా ఎత్తైన కొండ… ఆ కొండమీంచి లోయలోకి రివ్వుమంటూ ఎగిరొచ్చింది ఓ పసుప్పచ్చటి పిట్ట. ”అరే! ఎంత పచ్చగా ఉందో ఈ పిట్ట” అని ఆశ్చర్యపోతుంటే దాని తోడు పిట్ట కూడా ఎగిరొచ్చి నా ఎదురుగా వున్న చెట్టుమీద వాలింది. ముందు ఎగిరిన పిట్ట కూడా వచ్చి చేరింది. వాటి సోయగాన్ని చూస్తూ చాలాసేపు నా అలసటని మర్చిపోయాను. ”అమ్మూ! పద ఎండ పెరుగుతోంది. దిగడం కష్టమౌతుంది” అంది ప్రశాంతి. ఎక్కడం మొదలు పెట్టాం. ఉగ్రస్తంభం ఎదురుగా కనిపిస్తోంది. కుడిచేతివైపున ఓ ఎత్తైన కొండ… ఆ కొండ వాలుల్లో బహుశా తేనెపట్టులుండి వుంటాయి. చిగురు శివాజీ రాసిన ఆర్టికల్‌ గుర్తొచ్చింది. 2002 లో అనుకుంటాను ఆయన నల్లమల అడవుల్లో చెంచులు తేనె తీసే విధానం గురించి ఓ అద్భుతమైన వ్యాసం రాసారు. ఆ వ్యాసాన్ని తీసి మళ్ళీ భూమికలో వెయ్యాలి అనుకుంటూ మెల్లగా మెట్లెక్కుతున్నాను. ప్రశాంతి నా భుజం చుట్టూ చెయ్యేసి నాతో పాటే నడుస్తోంది. ”అమ్మూ! అదిగో జ్వాలా నరశింహ గుడి, వచ్చేసాం” అంది. ఆ వెంటనే కొండమీంచి జరజరా బండలు దొర్లుతూ లోయలో పడుతున్న శబ్దం. ”ఏంటవి? బండలు దొర్లి పడుతున్నాయ్‌” అంటే… ”అంతే మేడం… అలా పడుతుంటాయ్‌… అలా కిందికి చూడండి… ఆ పెద్ద బండ పైనుంచి పడి పెద్ద చెట్టుని మొత్తం విరక్కొట్టేసింది… ఆ చెట్టు మొదలు చూడండి ఎంత లావుగా వుందో” సంజీవ్‌ చెప్పాడు. ”మేడం! వచ్చేసాం… మీరు మెట్లన్నీ ఎక్కేసారు” అంటూ అరిచాడు యాదగిరి. నాలో గొప్ప సంతోషం ఉప్పొంగింది. కర్రను కింద పడేసి ఏదో ఎవరెస్ట్‌ ఎక్కినంత ఉద్వేగంతో ”ఐ డిడ్‌ ఇట్‌…. ఐ యామ్‌ సో హ్యాపీ” అంటూ ప్రశాంతిని వాటేసుకుని ”నువ్వు నాచేత గొప్ప సాహసం చేయించావే. ఎన్నో సంవత్సరాల కలని సాకారం చేయించావ్‌… లవ్‌ యూ బంగారం…” అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టాను. ఇద్దరం వొకరి నొకరం పట్టుకుని డాన్స్‌ చేసాం. ఆ క్షణాల్లో నాలో వెల్లువెత్తిన ఉత్సాహం, నామీద నాకు గొప్ప నమ్మకం… నేను మాటల్లోకి అనువదించలేను. ఎంతో కాలంగా నాలో గూడు కట్టి ఉన్న (నేను ఎత్తులెక్కలేను అనే భయం) భయం పటాపంచలైన సందర్భం. ఈ కష్ట సాధ్యమైన ప్రయాణానికి ఓ అర్థం దొరికిన సందర్భమన్నమాట.
మెట్లన్నీ అయిపోయాక చదును నేలమీదకి వచ్చాం. కుడి చేతి వేపున ఉగ్రస్థంభం… నిట్టనిలువుగా వుంది. అక్కడికి వెళ్ళడానికి మెట్లుగానీ, దారి కానీ లేదట… కానీ చాలా మంది బండలమీద, అడవిలో నడుచుకుంటూ పైవరకు వెళతారట. మేం కొండ వాలు మీంచి జాగ్రత్తగా నడుస్తున్నాం. బండలు జారుతున్న శబ్దం… చూస్తే గుడి పక్కన కాపురముంటున్న చెంచు కుటుంబం చుట్టుపక్కల శుభ్రం చేస్తూ బండల్ని లోయలోకి తోస్తున్నారు. ”ఈ గుడిని చూసుకుంటూ ఓ చెంచు కుటుంబం ఇక్కడే కాపురముంటోంది. వాళ్ళు అప్పుడప్పుడూ కొండ దిగుతుంటారు తమ అవసరాల కోసం” సంజీవ్‌ చెప్పాడు. మేం నడుస్తున్న కొండ కింద చల్లగా, తేమగా వుంది. కొండల్లోంచి చిరుధారల్లో నీళ్ళు పడుతున్నాయి. వర్షాకాలమైతే పెద్ద ధారతో జలపాతం జాలువారుతుందట. నేను ఆ ధార కింద తలపెట్టి ముఖం కడుక్కున్నాను. చల్లటి నీళ్ళు తగలగానే అలసట అంతా మాయమైంది. గుడి వేపు వెళ్ళాం. జ్వాలా నరశింహస్వామి ఆలయం అని రాసి వుంది. చిన్న గుడి. నేను గుడి వెనక చెంచుల ఇంటి వేపు వెళ్ళాను. చిన్న గుడిశె లాంటి ఇల్లు. ఊయల వేలాడుతోంది. ఇంట్లో మహిళలెవరూ కనబడలేదు. ఇద్దరు మగ వాళ్ళు ఆవరణలో వున్న చిన్న చిన్న రాళ్ళని తొలగిస్తూ లోయలోకి తోస్తూ కనబడ్డారు. ఆ ఇంట్లో ఉండే చెంచు వ్యక్తి పేరు కిషన్‌ అని తర్వాత ప్రశాంతి చెప్పింది. తన పనిలో చాలా బిజీగా ఉన్నాడతను. గుడి మెట్లు దిగుతుంటే… ”మేడం! పూజారి గారొస్తున్నారు వెనక్కి రండి” అంటూ సంజీవ్‌ పిలిచాడు. దూరంగా మెట్లకివతల పూజారి కనబడ్డాడు. ఆయన రోజూ రాడట. ఎవరైనా పైకి వస్తే చూసి వస్తాడట. ”నేను రానులే… ఆ మేడం ఉందిగా” అంటూ నేను నీటిధారవేపు వెళ్ళాను. ఓ పది నిమిషాల తర్వాత అందరూ గుళ్ళోంచి బయట కొచ్చారు. ”మేడం ఈ గుహలో నీటి గుండం చూడండి… నరశింహస్వామి హిరణ్య కశిపుడిని చంపాకా ఈ నీళ్ళల్లో చేతులు కడుక్కున్నారు. చూడండి నీళ్ళు ఎర్రగా ఉంటాయి” అన్నాడు సంజీవ్‌. కొండగుహలో స్వచ్ఛంగా వున్న నీళ్ళు కనిపించాయి. దానికి ఇనుప జాలీలతో చేసిన చిన్న తలుపులు పెట్టి కట్టి వుంచారు. ”చాలా లోతుంటుంది. 365 రోజులూ ఆ నీళ్ళు అలాగే ఉంటాయి. తగ్గవు, పెరగవు… మహానందిలో నీళ్ళలాగానే” అన్నాడు నాగరాజు. ప్రశాంతి లోపలికెళ్ళి దోసిలి నిండా నీళ్ళు తెచ్చి తాగుతూ భలే తియ్యగా
ఉన్నాయి” అంటూ నా నోట్లో కొన్ని పోసింది. చల్లగా తియ్యగా
ఉన్నాయి. ”తొందరగా వెళ్ళాలి. ఎండ పెరిగితే దిగలేరు” అన్నాడు సంజీవ్‌. టైమ్‌ చూస్తే ఎనిమిదిన్నర. మెట్లన్నీ దిగాలని దిగులు పడుతుంటే ”మేడం! వేరే దారిలో తీసుకెళతాను. ఎక్కువ మెట్లుండవు కానీ కొంచం పైకి ఎక్కి దిగాలి” అన్నాడు సంజీవ్‌.
వచ్చిన దారి కాకుండా కొత్త దారిలో దిగడం మొదలు పెట్టాం. వెనక నించి ఎండ చుర్రుమని కాలుతోంది. ఒక గుహ దగ్గర ఆగి ”ఇది ఎలుగుబంటి గుహ… లోపల ఉందేమో అన్నా” అంటూ కెవ్వుమన్నాడు యాదగిరి. ఉందేమో చూస్తానంటూ ప్రశాంతి గుహలో తలపెట్టింది… ”ఏం లేదు… యాదగిరి నువ్వనవసరంగా భయపడుతున్నావ్‌” అంది. వచ్చేటప్పుడు ప్రశాంతి కొన్న బిస్కట్‌లు తిని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక మొదలు పెట్టాం. చిన్న చిన్న ఎత్తుల్ని ఎక్కేసాను. ఎక్కువ భాగం చదునుగానే వుంది. రకరకాల చెట్లు… రంగు రంగుల ఆకులు, తీగలు… దట్టమైన నల్లమల అడవి గర్భంలో నడుస్తున్నాం. మధ్యలో ఇంకో గుడి దగ్గర ఆగాం. అక్కడి నుంచి ఏకబిగిన దిగేశాం. మేం కొండ దిగుతున్నపుడు ఎదురుగా మరో కొండమీద మెట్లు కనిపించాయి. మనుష్యులు కన్పిస్తున్నారు. ఒక ఆకుపచ్చటి చీర కదిలినట్లు ఒక చెంచు మనిషి అంత ఎత్తు మీంచి పచ్చటి వెదురు బొంగుల్ని ఈడ్చుకుంటూ మెట్లు దిగుతూ కనిపించాడు ప్రశాంతికి. ”అమ్మూ! అటు చూడు… ఆ వ్యక్తి వెదురు బొంగుల్ని ఎంత వేగంగా ఆ మెట్ల మీంచి లాక్కొస్తున్నాడో … చూడు” అంటూ చూపించింది. ”ఎంత కష్టమో కదా! ఈ అడవిలో ఎక్కడా వెదురు కనబడలేదు. వెదురు కోసం చాలా ఎత్తు కెళ్ళాలేమో! మామూలుగా శ్రీశైలం నుంచి అటు ఆత్మకూరు కానీ, ఇటు హైదరాబాదు కానీ ప్రయాణిస్తే అద్భుతమైన వెదురు పొదలు కన్పిస్తాయి. అహోబిలం అడవుల్లో వెదురు లేదనుకున్నాను. పైన ఉంది కాబోలు” అన్నాను నేను. మన్ననూర్‌ దగ్గర టైగర్‌ రిజర్వ్‌ ఫారెష్టులో కూడా ఎక్కువగా వెదురు పొదలు కనిపిస్తాయి. దిగుతున్నంత సేపు అటు వేపు మెట్లమీద జారుతున్న వెదురును చూసాం.
తొమ్మిదిన్నరకి దిగువ అహోబిలం చేరిపోయాం. ఎండబాగా పెరిగిపోయింది. చెమటతో వొళ్ళంతా తడిసి పోయింది. కింద గుళ్ళోకి వెళ్ళాం. యాదగిరి గుట్టలో ఉన్నట్టు ఇక్కడ కూడా గర్భగుడి కొండ గుహలో ఉంటుంది. గుహలోపల చల్లగా ఉంటుంది. ప్రశాంతి కోసమే నేను అన్ని గుళ్ళల్లోకి వెళ్ళాను.
సంజీవ్‌కి ఐదు వందలిచ్చి ”ఈ పని చేస్తే చేసావ్‌ కానీ బాగా చదువుకో… చదువుకుంటే ఇంకా బాగా రాణిస్తావ్‌” అని చెప్పి దిగువ అహోబిలం వేపు బయలుదేరాం. మరో గంటలో ఆళ్ళగడ్డ వేపు బయలుదేరాం. ఆళ్ళగడ్డలో భోజనం చేసి హైదరాబాదు బయలు దేరేటప్పటికి రెండయింది. బైక్‌ ఉందంటూ నాగరాజు అహోబిలంలోనే ఉండిపోయాడు. మేమిద్దరం మండుతున్న ఎండలో నల్లమల కబుర్లు చెప్పుకుంటూ హైదరాబాదు బ

Wednesday, May 16, 2018

అమ్మ...అమెరికా


--కొండవీటి సత్యవతి
........................................
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.
ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.
నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.
ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.
ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు.
నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు.
ఆయన తల్లి ఆశ్రమం లో ఉన్నారు.ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన.
ఆయనతో మాట్లాడాలనిపించింది.ఆశ్రమం బయట ఉన్న గుట్టల వేపు నడుస్తూ వెళ్ళాం.
"మీ అమ్మ గారికి ఇప్పుడెలా ఉంది" అడిగాను.
"బాగానే ఉంది.వయసు మీదపడింది.ఓల్డేజ్ రిలేటెడ్ ప్రోబ్లంస్ అంతే." అన్నాడు.
"ఆమెకి హటాత్తుగా ఏమైనా అయితే ఎలా?"
"హోం వాళ్ళు చూసుకుంటారు.నాకు ఇంఫార్మ్ చేస్తారు.జూబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లుంది ప్రోపర్టీస్ ఉన్నాయ్..హటాత్తుగా డాడి చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం."
"అమెరికా తీసుకెళ్ళొచ్చుగా."
"ప్రయాణం చేయలేనంది"
"ఇక్కడ ఇల్లుంది,ఆస్తులున్నాయ్ కదా ఇంక అమెరికాలోనే ఎందుకుండడం.?"
రఘురాం చివ్వున తలెత్తి నా వేపు చూసాడు.
"ఇక్కడుండలేమండీ"
"ఎందుకుండలేరు?'
"నా వైఫ్,పిల్లలు రారు.అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం."
"ఏముందక్కడ?"
"ఏమి లేదో చెప్పండి."
"మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా"
"వస్తూ పోతూ ఉంటాగా"
"సారీ...నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి.నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోంలు తిరుగుతుంటాను.ఎంతో మంది తల్లితండ్రులతో మాట్లాడుతుంటాను.వాళ్ళ అనుభవాలు,పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంటాయి.లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్ధిస్తుంటారు."
"మా అమ్మ కూడా అంతేనండి"
"అమ్మలందరూ అంతే రఘురాం గారూ. ఇక్కడ కూర్చుందామా .మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది" అన్నాను.
"తప్పకుండా,అమ్మ కూడా నిద్రపోతోంది" అన్నాడు రఘురాం.
అక్కడున్న ఓ బెంచీ మీద కూర్చున్నాం.
మా అమ్మ నాన్నలకి నేనొక్కడినే.పిజి చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను.పిజి అయిపోయింది,మంచి ఉద్యోగమొచ్చింది.పెళ్ళి చేసారు,పిల్లలు పుట్టుకొచ్చారు.విలాసవంతమైన జీవితం,వీకెండ్ పార్టీలు,ప్రయాణాలు.అప్పుడప్పుడూ ఇండియా రావడం,చుట్టాల్లా ఉండి వెళ్ళడం.నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసేవాళ్ళకి లోటులేదు.ఓ రాత్రి నాన్న హటాత్తుగా గుండె పోటుతో చనిపోయాడు.శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది.షాక్ లోకి వెళ్ళిపోయింది.నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు.
మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా,నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు"అంది.నాకు ఏడుపు తన్నుకొస్తోంది.అమ్మ ఏడవడం లేదు.హాస్పిటల్ కి పోదామంటుంది.
అమ్మ చుట్టూ బంధువులున్నారు.అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు.
ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడిపోయింది. నాన్న లేడని అర్ధమైంది.
అంతా ముగిసిపోయింది.అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను.రానంది.ఈ ఇంటితో, మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధం నాది.ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ రానంది.
నా పరిస్థితి మీరూహించగలరనుకుంటాను.అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులేసుకుంటుంది.నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా.ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను...
వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను.మళ్ళీ వెళ్ళాను.మళ్ళీ వచ్చాను.
నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి.నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోయాయి.
అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు.
తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని.
నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ,లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది.
ఓ రొజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను.
"నానీ తో స్కైప్ లో మాట్లాడొచ్చుగా డాడీ" అని మాత్రమే అన్నారు.
"నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను."
"వాట్...ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడుచేసుకుంటావా?"అంది నా భార్య.
"డాడీ...ఆ డర్టీ ఇండియాకి మేము రాం."ఇద్దరూ ఒకే సారి అరిచారు.
రోకీ నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా?
ముగ్గురూ బిత్తరపోయారు.
నేను మిమ్మళ్ని రమ్మని అడగడం లేదు.మీ చదువులు పాడవుతాయని నాకూ తెలుసు.మీరు ఇక్కడే ఉండండి.
నేను వెళతాను.
దాని మీద చాలా అర్గుమెంట్స్ జరిగాయి.
"ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావ్ ఏముంది డాడీ అక్కడ" అంది నా కూతురు
"అక్కడ మా అమ్ముంది. నా మీద ప్రాణాలన్ని పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ.
నన్ను కని పెంచిన నా కన్నతల్లిని వొంటరిగా వదిలేయలేనమ్మా"
అంటూ ఏడ్చాను.గుండెలవిసేలా ఏడ్చాను.
ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని,ఉద్యోగానికి రెజైన్ చేసీ ఇండియా వచ్చేసాను.
నేనొచ్చి ఐదేళ్ళయ్యింది.మా నాన్న మీద బెంగతో,అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది.
అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని,సంతోషాన్ని ఇచ్చాయి.
ఆ తర్వాత నా భార్యా పిల్లలూ కూడా వచ్చేసారు.
చాలా కాలం గా ఇలా ఓల్డేజ్ హోం లు తిరుగుతూ నా కధ చెబుతుంటాను.
అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను."
రఘురాం కళ్ళల్లో నీళ్ళు.
నన్ను వదిలేసి వడి వడిగా వాళ్ళమ్మ గది వైపు వెళ్ళిపోయాడు.
********************

Tuesday, September 12, 2017

రేపటి కల


 -కొండవీటి సత్యవతి


హాలంతా చప్పట్లతో మారుమోగుతుంటే అశ్విని నిటారుగా నడుస్తూ స్టేజిమీదకు వెళ్ళింది. ”యువనాయకురాలు” పురస్కారం స్వీకరించింది. మరోసారి చప్పట్లు… ఆగకుండా. ముందు వరుసలో కూర్చున్న అనన్య కళ్ళల్లో నీళ్ళుబికాయి. కన్నీళ్ళ మధ్య అశ్విని ముఖం మసకబారినట్లయింది. జర్నలిస్టుగా తాను సాధించిన విజయాల్లో అశ్విని కథ చాలా గొప్పది.
‘అశ్విని విజయం వెనక స్ఫూర్తి ప్రదాత అనన్య స్టేజి మీదకు రావాలి’ ప్రకటన విని ఒక్క ఉదుటున లేచి స్టేజి మీదకు వెళ్ళి అశ్వినిని గట్టిగా హత్తుకుని అభినందించింది. కెమెరాలు క్లిక్‌క్లిక్‌మంటూ ఫ్లాష్‌లైట్లు వెలిగించాయి. తనకిచ్చిన మెమొంటోను తీసుకుంటూ ‘అశ్విని గురించి రెండు మాటలు చెప్పాలని ఉంది. మహబూబ్‌నగర్‌లో ఒక మారుమూల గ్రామంలో మొదటిసారి తనను చూసాను. నా వృత్తిలో భాగంగా ఒక స్టోరీ కోసం ఆ గ్రామానికి వెళ్ళినపుడు, నా పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తున్నపుడు అశ్విని తమ్ముడ్ని చంకనేసుకుని నా దగ్గరకొచ్చింది. చింపిరి జుత్తు, సన్నగా, రివటలాగా ఉంది.’
‘మేడమ్‌! మేం ఏం చెప్పినా మీరు పేపర్లో రాస్తారా’ అని అడిగింది.
‘అవును.. రాస్తాను. నేను జర్నలిస్టును. అంటే పేపర్‌లో రాసే ఉద్యోగం నాది. ఏమైనా చెబుతావా?’ అన్నాను.
‘మేడమ్‌! వచ్చే వారం మావోళ్ళు నాకు పెండ్లి చేయాలనుకుంటుడ్రు. నాకేమో సదువుకోవాలని ఉంది’ అని అంది.
‘నీకు పెళ్ళా! నీ వయసెంత?’
‘పధ్నాలుగు… ఏడు వరకు చదువుకున్నా. ఈడి కోసం చదువు మానిపించి, ఇప్పుడు పెళ్ళంటోంది మాయమ్మ’
ఆ మాట విని వెళ్ళిపోతున్నదాన్ని ఆగిపోయాను. ఆ ఊరిలో చెలరేగిన అంటువ్యాధుల గురించి రాయాలని వెళ్ళిన నేను అశ్విని మాటలతో మళ్ళీ వెనక్కు వచ్చాను.
‘మీ అమ్మ ఎక్కడ?’
‘పనికాడికి బోయింది.’
‘మీ నాయన?’
‘లేడు… సచ్చిపోయిండు.’
ఉస్సూరంటూ ఒక చెట్టు కింద కూర్చుండిపోయాను. ఏం చేయాలి?
”అలాంటి అశ్విని ఈ రోజు యంగ్‌ అచీవర్‌ అవార్డు తీసుకుంది. షి ఈజ్‌ ఎ ఫైటర్‌. తను చైతన్యవంతురాలై ఎంతోమంది తనలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలిచింది. టెన్త్‌ పూర్తి చేసింది. థాంక్యూ… నిర్వాహకులకు ధన్యవాదాలు” అంటూ అనన్య అశ్వినితో సహా స్టేజి దిగిపోయింది.
***********
అనన్య అశ్విని మాటల్ని సీరియస్‌గా తీసుకుంది. ఆరోగ్య సమస్యలు సరే… బాల్య వివాహాల మీద ఓ కథనం రాస్తే ఎలా
ఉంటుందా అని ఆలోచించింది. ముందు ఆ పిల్ల పెళ్ళి ఎలా తప్పించాలా అని ఆలోచనలో ఛైల్డ్‌ లైన్‌లో పనిచేసే తన ఫ్రెండ్‌ మాధురికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

”ఆ గ్రామాల్లో అంతే.. పధ్నాలుగు పదిహేనేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తారు. మేము వెళ్ళి ఆపినా, మళ్ళీ ఎప్పుడో చేసేస్తారు” అంది తేలిగ్గా తీసుకుంటూ.
”కరక్టే. నాకూ తెలుసు ఆ విషయం. కానీ అశ్విని చాలా ధైర్యంగా వచ్చి నాతో విషయం చెప్పింది. పెళ్ళి ఆపమని అడిగింది. ఆ పిల్ల ధైర్యం నాకు నచ్చింది.”
”సరే నేను మా టీమ్‌ని పంపిస్తాలే” అంటూ ఫోన్‌ పెట్టేసింది.
*********
ఆ రాత్రి అనన్యకి నిద్ర పట్టలేదు. అశ్విని కళ్ళల్లో మెదులుతోంది. ఎంత బలహీనంగా ఉంది. పెళ్ళి చేస్తే, ఆ వెంటనే వచ్చే గర్భంతో… ఊహించలేకపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి… ఈ ఆలోచనలతో తను రాయాల్సిన రిపోర్టును రాయలేకపోయింది. మర్నాడు అశ్విని వాళ్ళ గ్రామానికి బయలుదేరింది. వాళ్ళమ్మ పనికి వెళ్ళకముందే ఆమెను కలవాలి, మాట్లాడాలి. తేలికగానే ఇల్లు కనుక్కుంది. అశ్విని తల్లి ఇంట్లోనే ఉంది. ఒక్కటే గది, చిన్న వంటగది…
”ఎవరు నువ్వు? ఏం కావాలి?”
”అశ్విని లేదా?”
”ఎందుకు? బయటికి పోయింది.”
”మీతో మాట్లాడాలి”
”ఏం మాట్లాడాలి.? ఎవరు మీరసలు” అనుమానంగా చూసింది. ఆమె కూడా ఎముకల పోగులాగా ఉంది. వొంట్లో ఇంత కండ కూడా కనబడ్డం లేదు.
ఒక చంకలో తమ్ముడు, మరో చేత్తో కల్లు సీసాతో అశ్విని ఇంట్లో కొచ్చింది.
”మేడం మీరా! మళ్ళీ వచ్చారా?”
కల్లు సీసా లాక్కుని ”ఎవలే? ఎందుకొచ్చింది మనింటికి” కూతురుతో కల్లు సీసా తెప్పించుకున్న ఆ తల్లిని చూసి అనన్యకి నోట మాట రాలేదు.
”ఎల్లుండ్రి.. నే పనికి పోవాల”
”మీ కూతురికి పెళ్ళి చేస్తున్నారంట కదా! చిన్న పిల్ల అపుడే పెళ్ళేంటి?”
”ఎవరు చెప్పారు? పెళ్ళీ లేదు గిళ్ళీ లేదు. ఎళ్ళండి” కరకుగా అంది.
”ఈ వయసు పిల్లకి పెళ్ళి చేస్తే జైల్లో పెడతారు తెలుసా?”
”నా పిల్ల నా ఇష్టం. ఎల్లండింక” విసురుగా అంటూ కల్లు తాగసాగింది. అది తాగి పనికెళ్ళుతుందా?
అశ్విని అయోమయంగా చూస్తూ నిలబడింది. ఇంకిప్పుడు ఆమెతో ఏమీ మాట్లాడలేనని అనన్య బయటకొచ్చింది. అశ్విని రాబోయింది.
”ఏడకి పోతున్నావ్‌.. ఆగ్కడ” అంటూ అరిచింది. అశ్విని ఆ మాటలేమీ పట్టించుకోకుండా అనన్య వెనకాలే బయటికి వచ్చింది. ఎదురుగా ఉన్న వేపచెట్టు కింద కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు చేరారు. అందరిముందు కల్లు సీసాలు… పట్టపగలు, పిల్లలముందే తాగుతున్నారు.
”ఏంటిది? రోజూ ఇంతేనా?”
”అంతే మేడమ్‌.”
అనన్యకి దిమ్మతిరిగినట్లయింది. ఊరినిండా అంటువ్యాధులు, అంటురోగాలు, ఇలా తాగుతుంటే… అది నిజంగా కల్లేనా? ఈ చుట్టుపక్కల తాటి చెట్లే లేవు. అంత కల్లు ఎక్కడినుంచి వస్తోంది. జర్నలిస్టు బుర్ర చకచకా ఆలోచిస్తోంది.
”మేడమ్‌… నా పెళ్ళి ఆపుతారా?”
కల్లు సీసాల మీంచి కళ్ళను మళ్ళించి అశ్విని వైపు చూసింది.
”ఒక్క నిమిషం” అంటూ మాధురికి ఫోన్‌ చేసింది. ఫోన్‌ ఎంగేజ్‌.
అశ్విని తల్లి బయటికొచ్చి ”ఆమెతో నీకేంది పని. తమ్ముడ్ని తీస్కో. నే పనికి పోవాల” అంటూ పిల్లాడిని వదిలేసి పనికెళ్ళిపోయింది. ఆ పూట పనికెళ్ళకపోతే ఆమెకి గడవదు.
”మీ అమ్మ ఇంటికెప్పుడొస్తుంది”
”పొద్దుమీకి… చేను పనికిపోతది”
మాధురి ఫోన్‌ చేసింది. ”మా వాళ్ళు ఎస్‌.ఐ. దగ్గరకెళ్ళారు. అతను లేడట. ‘నువ్వు ఎక్కడున్నావ్‌?”
”నేను ఇక్కడే ఉన్నాను. అశ్విని వాళ్ళమ్మతో మాట్లాడాను. ఆమె పెళ్ళీలేదు గిళ్ళీలేదు అంటోంది. ఇప్పుడే పనికి పోయింది” అంది అనన్య.
”సరే… నువ్వక్కడే ఉండు. మా వాళ్ళకి చెబుతాను” అంది.
ఈ లోపు కల్లు తాగుతున్న వాళ్ళతో కాసేపు మాట్లాడదామనిపించింది అనన్యకి.
వేపచెట్టు కిందకు నడిచింది. కల్లు వాసన గుప్పుమంటోంది. అనన్యకి కడుపులో తిప్పినట్లయింది. తనకి నీరా అంటే ఇష్టమే. అప్పుడే తీసిన ఫ్రెష్‌ కల్లు కూడా తాగింది చాలాసార్లు. కానీ ఈ కల్లేంటి ఇంత భయంకరమైన వాసనొస్తోంది.
అనన్యని చూసి ఒకామె కల్లు సీసాతో సహా లేచి వచ్చి ”చూడు బిడ్డా! నాకు పనిలేదు. నా చేను ఎండిపోయింది. నా కొడుకు సచ్చిండు. నా బిడ్డకి పెండ్లి చేయాలే.. ఎట్లా… నువ్వెవరు సర్కారోళ్ళ…” అంటూ ఏవేవో మాట్లాడసాగింది.
మళ్ళీ తనే ”నీకెరికేనా… ఇదే వారంలో ఈ పిల్ల పెండ్లి. భద్రమ్మ అదుృష్టం. నా బిడ్డ పెండ్లి ఎట్లనో” అంటూ సీసా ఎత్తి గటగటా తాగింది.
”నీ పేరేందమ్మా? నీ బిడ్డ ఏడుంది?”
”ఇస్కూల్‌కి పోయింది. అస్తది” అంది.
”మేడమ్‌! ఆమె బిడ్డ నాకన్నా సిన్నది. ఎనిమిది సదూతుంది” అంది అశ్విని తమ్ముడ్ని చంకనేసుకుని.
”ఏందమ్మా! ఎనిమిదో క్లాసు చదివే పిల్లకి పెళ్ళి సేస్తవా? జైల్లో ఏస్తరు సూడు మరి” అనన్య ఆమె భాషలోనే మాట్లాడింది.
”జయిల్లో ఎందుకేస్తరు? నా బిడ్డ నా ఇష్టం. నీకెరికేనా, ఈ పిల్లలు ఇస్కూలుకి పోయి అటే పోతాన్రు. ఎవడైనా లేపుకుపోతే ఏం సేసేది సెప్పు. అందుకే లగ్గం సేసెయ్యాల”.
కాసేపటికి ఛైల్డ్‌లైన్‌ టీం వచ్చారు.
”ఎస్‌.ఐ. ఇంకా రాలేదు. మీరేనా కంప్లయింట్‌ చేసింది”.
”అవును నేనే. ఈ ఊళ్ళో చాలానే పెళ్ళిళ్ళు ఉన్నట్లున్నాయి. ఇదిగో ఈ అమ్మాయి పేరు అశ్విని. వచ్చే వారం ఈమె పెళ్ళంట. పదిహేను సంవత్సరాలు కూడా లేవు”.
”మేడమ్‌! ఈ ఊళ్ళో పరిస్థితి ఘోరం. మేం చాలాసార్లు వచ్చాం. పెళ్ళిళ్ళు ఆపాం. కానీ పక్క రాష్ట్రం కర్నాటక వెళ్ళి పెళ్ళి చేసేస్తారు”.
”ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ వాళ్ళకి చెప్పాం. ఎస్‌.ఐ.కి చెప్పాం. తల్లిదండ్రులతో మాట్లాడతాం. చట్టం గురించి చెబుతాం. వినకపోతే పోలీసులు కేసు పెడతారు”.
అశ్విని వాళ్ళవైపు చూస్తోంది. పోలీసులు, కేసు అంటుంటే ఆ పిల్లకి భయమేసింది. తల్లిని పోలీసులు తీసుకెళ్ళిపోతారేమో అనుకుని ‘వద్దులే మేడం! మా అమ్మని ఏమీ చేయొద్దని చెప్పండి’ ఆమె కళ్ళనిండా నీళ్ళు.
”ఏం కాదులే! మీ అమ్మని పోలీసులు తీసుకెళ్ళరులే. నీ పెళ్ళి చేయొద్దని చెబుతారంతే” అని ”ఇదిగో పెద్దమ్మా! నీ కూతురికి పెళ్ళి చెయ్యకు. చదువుకోనీయ్‌. లేదంటే.. పోలీసులొస్తారు. జైల్లో వేస్తారు” అంది.
ఆమె ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఇంకో సీసా తెచ్చుకుని తాగుతోంది.
”మీ పని మీరు చెయ్యండి. నేను వెళ్ళాలి. అశ్వినీ భయపడకు. వీళ్ళు మీ అమ్మతో మాట్లాడతారులే. నేను మళ్ళీ వస్తాను”. అశ్విని సరేనంది.
*********
మర్నాడు పేపర్‌లో అనన్య రాసిన వ్యాసం వచ్చింది. ”బాల్యానికి ఉరితాడు” పేరుతో ఆమె రాసిన కథనం జిల్లాలోని బాల్య వివాహాలకి అద్దం పట్టింది. అదే వ్యాసంలో అనన్య రాసిన ”బాల దండు” గురించిన వివరాలు చాలా అసక్తికరంగా అన్పించాయి. బాల్యవివాహాల మీద చాలా లోతైన వ్యాసం రాస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ ఇటీవలే బాల్యవివాహాల నిరోధానికి కృషి చేస్తూ గ్రామాల్లోని ఆడ, మగపిల్లలతో కలిపి ఏర్పాటు చేసిన ‘బాలదండు’ గురించి రాసింది. కొన్ని గ్రామాల్లో ‘బాలదండు’ ఆపిన పెళ్ళిళ్ళ వివరాలు కూడా రాసింది. అనన్య ఆ పేపర్‌ తీసుకుని అశ్విని దగ్గరకు వచ్చింది.
అశ్విని అనన్యతో మాట్లాడ్డానికే భయపడింది. పిలిస్తే కూడా రాలేదు.
”ఏమైంది అశ్వినీ?”
”మా అమ్మ నన్ను మస్తు కొట్టింది మేడమ్‌”
”ఎందుకు?”
”మొన్న వచ్చినోళ్ళు సాయంత్రం దాకా ఉండి మా అమ్మతో మాట్లాడారు. అమ్మ చాలా గొడవ చేసింది. తిట్టింది. కానీ ఆళ్ళు బెదిరించి చెప్పారు. పెళ్ళి చేస్తే కేసుపెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆళ్ళు ఎల్లిపోయాక మా అమ్మ నన్ను బాగా కొట్టింది” అంటూ ఏడ్చింది.
”అయ్యో! ఏదీ చూడనియ్‌. మీ అమ్మ ఇంట్లో ఉందా?”
ఆ పిల్ల వీపుమీద దెబ్బల చారలు… దద్దురుల్లా లేచాయి.
”మా అమ్మ లేదు. నన్ను కొట్టి తమ్ముడ్ని తీసుకుని ఎటో ఎల్లిపోయింది”.
”ఎక్కడికి వెళ్ళింది. నిన్ను ఎల్లిపోయింది”.
”ఎప్పుడంతే మేడమ్‌. అలాగే చేస్తది”
”రాత్రికి వచ్చేస్తుంది కదా! ఒక్కదానికి వుండగలవా?”
”ఆ ఉండగలను. నాకు అలవాటే… అమ్మ అట్లానే పోతుంటది. మా మామ ఊరికాడికెల్తా అప్పుడప్పుడూ…”
”సరే అశ్విని. ఇది నా ఫోన్‌ నంబర్‌. అవసరమైతే ఫోన్‌ చెయ్యి. మీ అమ్మ రాత్రికి వచ్చేస్తుందిలే”.
అనన్య బయలుదేరింది వెళ్ళడానికి.
ఙ ఙ ఙ
అశ్విని వేపచెట్టు దగ్గరకొచ్చింది. అందరూ కూర్చుని కల్లు తాగుతున్నారు. అమ్మ ఎప్పటికొస్తదో! ఊర్లోనే ఉండే తన ఈడుపిల్ల రమణి కనిపించింది. అశ్విని సంతోషంగా రమణి దగ్గరకెళ్ళి ”మా అమ్మ ఇంట్లో లేదు. మా ఇంటికి పోదాం పా..” అంటూ రమణి చెయ్యి పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళింది.
”ఏంటే అశ్వినీ… నీ పెళ్ళంట కదా! ఎవడే వాడు?” అంది నవ్వుతూ.
”పెళ్ళీలేదు, గిళ్ళీ లేదు. నేను చేసుకోను.” నేను సదువుకుంట
”మీ అమ్మ ఊర్కుంటదా? నాతోపాటు స్కూల్‌కొస్తే ఇప్పటికి తొమ్మిదికి వచ్చేదానివి”
”మా అమ్మ బాగా కొట్టింది పెళ్ళి చేసుకోనన్నానని. అయినా సరే చేసుకోను. ఒక మేడం.. పేపర్లలో రాస్తది. ఆమె కూడా చెప్పింది. నిన్న ఎవరో ఛైల్డ్‌లైనంట ఆళ్ళు వచ్చిన్రు. అమ్మ ఆళ్ళనీ తిట్టింది” అశ్విని గొంతులో దుఃఖం.
”అశ్వినీ! నీకో మాట చెప్పాలే. మా స్కూల్‌కి హైదర్‌బాద్‌ కెల్లి కొందరు మేడమ్స్‌ వచ్చిన్రు. మా హెడ్‌మాస్టర్‌ వాళ్ళతో మీటింగ్‌ చేసిండు. మేమంతా కూడా పోయినం. చిన్నప్పుడే పెళ్ళి చేస్తే మంచిది కాదని, మన ఆరోగ్యం పాడవుతుందని ఇంకా ఏవో హక్కులని, బాలల హక్కులని చెప్పారు. మొదట మాకు అర్థం కాలేదు. రెండోసారి వచ్చినపుడు బొమ్మలు తెచ్చి చూపించారు.అప్పుడు బాగా అర్థమైంది. ఆళ్ళకి హెల్ప్‌లైన్‌ ఉందంట. దానికి ఫోన్‌ చేయమని చెప్పారు. అది ఫ్రీ అంట. మనకేమీ పైసలు పడవంట. ఎక్కడైనా చిన్న పిల్లలకి పెండ్లి చేస్తే ఫోన్‌ చెయ్యమని చెప్పారు” రమణి ఉత్సాహంగా గబగబా చెప్పుకుంటూ పోయింది.
అశ్విని కళ్ళు విప్పార్చుకుని విన్నది.
”నీకు ఇంకో ముచ్చట చెప్పాలే. మా స్కూల్‌లో అబ్బాయిలు, అమ్మాయిలతో కలిసి ‘బాలదండు’ అని ఒకటి పెట్టారు”
”బాలదండా? అదేంటిదే?” ఆశ్చర్యంగా అడిగింది అశ్విని.
”చెప్పాను కదే! హైదరాబాద్‌ కెళ్ళి వచ్చారని. ఆళ్ళే దీన్ని పెట్టారు. నేను కూడా అందులో ఉన్నాను తెలుసా?” గర్వంగా అంది రమణి.
”ఏం చేస్తరు మీరు”
”మొన్ననే ఒక మీటింగ్‌ చేసిన్రు. మేమంతా ఒకకాడ కూర్చుని బాల్యవివాహాలు… అదే చిన్నతనంలోనే పెళ్ళి గురించి మాట్లాడుకున్నం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నం. నీకు తెలుసా? ఆళ్ళ ఆఫీసు బస్టాండు కాడ ఉంది. నేను చూసాను”
అశ్విని విచారంగా ఎటో చూస్తోంది.
”రమణీ! ఆళ్ళు నా పెళ్ళి ఆపుతారా? నేను చదువుకుంటే నువ్వు చెప్పిన ముచ్చట్లన్నీ నాకూ తెలుస్తాయి కదా!”
”ఏయ్‌ రమణీ! ఏందా ముచ్చట్లు. ఇటు రావే” అంటూ రమణి వాళ్ళమ్మ గట్టిగా కేకేసింది.
”అశ్వినీ! రేపు నేను మా బాలదండు వాళ్ళతో చెబుతా. సరేనా…అమ్మ కొడుతాది ఎళ్ళకపోతే” అంటూ రమణి వెళ్ళిపోయింది.
*********
రాత్రి బాగా పొద్దుపోయాక భద్రమ్మ ఇంటికొచ్చింది. నిద్రపోతున్న కొడుకుని భుజాన వేసుకుని తలుపుకొట్టింది. అశ్విని మంచి నిద్రలో ఉంది. ఉలిక్కిపడుతూ లేచి తలుపు తీసింది. భద్రమ్మ ఏమీ మాట్లాడకుండా పిల్లాడిని పడుకోబెట్టి అశ్విని పక్కన పడుకుంది. అశ్వినిని దగ్గరగా పొదుపుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తల్లి ఏడుస్తోందని గమనించిన అశ్విని ఆశ్చర్యపోయింది.
”అమ్మా ఏమైంది? ఎందుకేడుస్తున్నవ్‌”
”ఏంలేదులే బిడ్డా! పడుకో” అంటూ కళ్ళు తుడుచుకుంది.
తల్లి అంత మెత్తగా ఎప్పుడూ మాట్లాడదు. ఏమైందో… అనుకుంటూ తల్లిని గట్టిగా వాటేసుకుని హాయిగా నిద్రపోయింది. ఙ ఙ ఙ
”మేడం! మీరు ఒకసారి మా ఇంటికొస్తరా? మాయమ్మ రమ్మంది” అశ్విని గొంతులో ఉత్సాహం ఫోన్‌లో స్పష్టంగా తెలుస్తోంది.
”అవునా! ఎందుకు అశ్వినీ…”
”తెల్వదు గానీ… రాత్రి బాగా పొద్దయ్యాక అమ్మ ఇంటికొచ్చింది. వచ్చిన సంది ఏడుస్తోంది. నాతో కోపంగా లేదు. నా దెబ్బలకి కొబ్బరి నూనె రాసి మళ్ళీ ఏడ్చింది”
అనన్య జర్నలిస్టు బుర్ర చకచకా ఆలోచించింది. ”ఏమై ఉండొచ్చు.. రాత్రికి రాత్రి అంత మార్పెలా సాధ్యం. సర్లే… ఆలోచనలెందుకు. పోదాం పద” అనుకుంటూ అశ్విని ఇంటికి బయలుదేరింది.
వేపచెట్టు కింద ఎవరూ లేరు. ఇంకా చేరలేదు. పొంగుతున్న మురుగు కాల్వలో పందులు పొర్లుతున్నాయి. దుర్వాసనకి ముక్కు మూసుకుంటూ అనన్య భద్రమ్మ ఇంటివైపు నడిచింది. దూరం నుంచే అశ్విని అనన్యను చూసింది. పరుగు పరుగున ఎదురొచ్చింది.
”మేడం! రాత్రి నుంచి మా అమ్మ ఏదోలా ఉంది. ఊరకే ఏడుస్తది. పనికి పోలేదు. కల్లు తాగలేదు. నన్ను తిట్టలేదు. పడుకునే ఉంది. తెల్లారంగానే నాకు చెప్పింది. మొన్న మనింటికొచ్చింది కదా! ఆమె అస్తదేమో అడుగు. నీ తాన ఆమె ఫోన్‌ నంబరుందా” అంది.
”ఎందుకమ్మా అంటే.. రమ్మను. నిన్ను తీసకపోతానందిగా అడుగుతాను” అంది.
”మేడమ్‌! మిమ్మల్ని పిలిచి తిడతదేమో భయంగా ఉంది. కానీ మాయమ్మ కోపంగా లేదు. ఏమైతదో నాకైతే సమజైతలేదు”
”ఫర్వాలేదులే అశ్వినీ. నేను మాట్లాడతాను.”
ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
”అమ్మా! మేడమొచ్చింది”
”అశ్వినీ! నా పేరు చెప్పాను కదా. నన్ను అక్క అని పిలువు చాలు”
”అలాగే అక్కా! అమ్మా” అంటూ పిలిచింది.
భద్రమ్మ మెల్లగా లేచింది. ఆమెకి వంట్లో బాగోలేనట్లుంది అనుకుంది అనన్య. మొన్న కోపంగా, చిరాకుగా విరుచుపడినన భద్రమ్మ ముఖం ఈ రోజు అలా లేదు. బాగా ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి.
”ఆడ కూసుందాం పాండి’ అంటూ ఇంటి బయటకు నడిచింది.
అశ్విని ఆశ్చర్యంగా తల్లిని చూస్తోంది. అమ్మ ఎప్పుడూ ఇలా లేదు. ఏమైంది అమ్మకి?
”అశ్వినిని తీస్కపోయి చదివిపిస్తమన్నారు కదా ఆ దినం… నిజమేనా” సూటిగా అడిగింది.
”నిజమే చెప్పాను. హాస్టల్‌లో వేస్తే చదువుకుంటది. పెళ్ళి చెయ్యకండి” అంది అనునయంగా.
”పెండ్లేడ చేస్త ఇగ. తీస్కపోండి. బడిలో ఏయుండ్రి. అందరొచ్చి చెప్పినా ఇనకపోతిని. నే పోతే పిల్ల బతుకెట్టా అనుకుంటే పెల్లి సేస్తే బరువుపోద్దనుకుంటి. అది నిజం కాదని నిన్న మా అన్న ఊర్ల పిల్లలు చెప్పిన్రు”
అశ్విని కళ్ళు విప్పార్చుకుని తల్లిని చూస్తోంది.
”ఏ పిల్లలు చెప్పారు” అంది అనన్య.
”ఇస్కూలు పిల్లలు. ఊరి మధ్యన నాటకాలేసిండ్రు”.
అనన్యకి అర్థమైంది. బాలదండు పిల్లలు బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ‘మల్లెమొగ్గ’ నాటకం వేస్తారని, ఆ నాటకం చూస్తూ అందర ఏడుస్తారని, ఆ నాటకంలో చిన్న వయస్సులో పెళ్ళైన అమ్మాయి గర్భమొచ్చి కనలేక చనిపోయే దృశ్యం నాటకం ఆడేవాళ్ళని కూడా ఏడిపిస్తుంది. భద్రమ్మ ఆ ప్రభావంలో ఉందని అర్థమైంది.
”నాకు సుత సిన్నప్పుడే లగ్గమైంది. సానా కష్టాలు పడ్డా. నా మొగుడు తాగితాగి సచ్చిండు. మా ఊర్ల అందరూ తాగుతరు. కల్లు తాగుతరు. తాగకపోతే పనెట్టా చెయ్యాలి. పనికెళ్ళకపోతే తిండి లేదు. ఏటి సెయ్యాల? ఈ పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు నా మొగుడు పోయిండు. నేను సస్తే ఈ పిల్లకెట్టా? అందుకే లగ్గం సేద్దామనుకున్నాను. ఆడికి పెళ్ళాం పోయింది. ఇద్దరు పిల్లలు. దీన్ని చేస్కుంటానన్నడు. సేస్తే పాయె అనుకున్నా”.
”అంత పెద్దవాడికిద్దామనుకున్నారా?”
”అవ్‌…ఏం సేయాల మరి? సరే.. నిన్నటి సంది నా మనసు మారింది. ఈ పెండ్లి చేయ. పిల్లని ఇస్కల్‌లో ఏస్తానన్నావ్‌ కదా! ఏస్తవా మరి”
”చాలా సంతోషం. ఒక్క నాటకం చూసి మీరు ఇంతలా మారిపోయారు. తప్పకుండా వేస్తా. హాస్టల్‌లో వేస్తా…”
”పిల్లలు ఎంత బాగా సెప్పిండ్రు. సచ్చిపోయిన పోరి నా అశ్వినిలాగా కనబడ్డది. అప్పటి సందు ఏడుస్తనే ఉంటి” భద్రమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
”అమ్మా” అంటూ అశ్విని తల్లి ఒళ్ళో చేరింది. అనన్య సంభ్రమంగా భద్రమ్మవైపు చూసింది.
”నిన్న బిడ్డని గొడ్డుని బాదినట్టు బాదాను. తిట్టాను” అశ్విని వీపును నిమురుతూ భద్రమ్మ అంది.
”మీ దుఃఖం అలాంటిది. నేను అశ్వినిని ఆడపిల్లలుండే హాస్టల్‌లో చేరుస్తాను. అక్కడే చదువుకుంటుంది.మీరు వెళ్ళి చూస్తుండొచ్చు. మీ కొడుకుని కూడా అంగన్‌వాడిలో వదలండి. వాళ్ళు చూసుకుంటారు. మీరు పనికి వెళ్ళొచ్చు” అంది అనన్య.
అశ్విని ముఖం సంతోషంతో విప్పారింది.
”నన్ను నిజంగా ఇస్కూల్‌ల ఏస్తవా అక్కా!” సంబరంగా అంది.
”బాగా చదువుకుంటావా మరి..”
”ఆ.. చదువుకుంటా. నిన్న రమణి నాకు చెప్పింది. వాళ్ళ స్కూల్‌లో బాలదండున్నరని. నేనూ బాలదండవుతా”.
భద్రమ్మ గురించి స్టోరీ చెయ్యాలని అనన్య డిసైడ్‌ అయిపోయింది. తల్లీ కూతుళ్ళ ఫోటోలు తీసుకుంది.
”సరే! నేను వెళతాను. రెండు, మూడు రోజుల్లో వస్తాను. అప్పుడు అశ్వినిని ఎక్కడ చేర్చాలో చెబుతాను. మీరూ నాతో వద్దురు. అశ్వినీ…అవసరమైతే ఫోన్‌ చెయ్యి. సరేనా?”
”సరే అక్కా! నేనిప్పుడే పొయ్యి రమణికి చెబుతా” అంటూ చెంగు చెంగున ఎగురుతూ రమణి ఇంటివైపు పరిగెత్తింది.
భద్రమ్మ ఏమీ మాట్లాడకుండా కూతురిని చూస్తుండిపోయింది.
అశ్వినిలో అణగారిపోయిన బాల్యం తిరిగి ఉరకలెత్తినట్లనిపించింది అనన్యకి. ఈ టైటిల్‌ బావుండేట్టుంది తన రేపటి కథకి అనుకుంటూ అనన్య కూడా బయలుదేరింది.
***********

Sunday, September 3, 2017

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండుమా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను. ఆయన చనిపోయాడని నాకు చెప్పకుండా నన్ను ఊరికి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి మా నాన్న లేడు. మా అమ్మని మా పడిమీద వసారాలో చీకట్లో కూర్చోబెట్టారు. ఎవరెవరో రావడం, మా అమ్మ, అక్కలు, వదిన గొల్లుమంటూ ఏడవడం. నాకు అలా ఏడవడం రాదు. మా వీథి అరుగుమీద కూర్చుని మా నాన్నని తల్చుకునేదాన్ని. ఆయన అదే అరుగుమీద చాపలాంటిదేదీ వేసుకోకుండానే ఆదమరిచి నిద్రపోయే దృశ్యాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండేదాన్ని. నా చిన్ననాటి నేస్తం భారతి నాతో ఉండేది. నాలుగైదు రోజులు గడిచాక నాన్న చనిపోయిన పదో రోజో, పదకొండో రోజో ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే తర్జన భర్జనలు మొదలయ్యాయి. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. బోలెడు మంది కజిన్స్‌… పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు.
మా అమ్మకి ఏదో తంతు చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారని అర్థమైంది. మా అన్న, నేను తీవ్రంగా వ్యతిరేకించాం. అమ్మ ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలి. ఏమీ మార్పులుండవ్‌. అమ్మని కాలువ దగ్గరికి చీకట్లో తీసుకెళ్ళి గాజులు పగలగొట్టడాలు లాంటివి చేస్తే మర్యాద దక్కదని గొడవ పెట్టాను. చివరిసారి అంటూ ముఖమంతా పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పూలు పెట్టి సోకాల్డ్‌ ముత్తయిదువులు వెళ్ళి చూడడం… మళ్ళీ అవన్నీ తీసేసి అమ్మ నెత్తిమీద వైధవ్యం ముద్ర వేయడం… ఇలాంటివన్నీ జరగనివ్వలేదు. దానికి చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. నాన్న పోయిన దుఃఖంలో మునిగి ఉండి కూడా ఈ పోరాటం చేయడం… నేను చాలా డిప్రస్‌ అయిపోయాను. దానినుండి బయటపడి మళ్ళీ మామూలు మనిషిని కావడానికి, హైదరాబాదు తిరిగి రావడానికి చాలాకాలమే పట్టింది. అమ్మ మామూలుగానే రంగు రంగు చీరలు కట్టుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిచ్చింది.
నా జీవితంలో నాకు ఎదురైన ఈ అనుభవం నా ఒక్కదానిదీ కాదని నాకు తెలుసు. మనసును మెలిపెట్టే ఇలాంటి అనుభవాలు ఎదురుకాని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు. భర్తల్ని కోల్పోయిన ఆడవాళ్ళ పట్ల మన సమాజం అనుసరించే దుర్నీతి, అమానవీయ పద్ధతులు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుండడం వెనుక ఉన్నది ఆధునిక తరం నిర్లిప్త వైఖరి. తమ కుటుంబాల్లో స్త్రీల పట్ల అమలౌతున్న అమానుష పద్ధతుల్ని ఆధునికులు కూడా ఆమోదించడం, వాటిని ఆచారాలుగా, కట్టుబాట్లుగా అంగీకరించి తమ తమ కుటుంబాల్లో భర్తలు చనిపోయిన స్త్రీల పట్ల అత్యంత అమానవీయ పద్ధతుల్ని ఆచరించడం సిగ్గుచేటు.
హిందూ మతావలంబికులే ఈ దారుణ ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు. భర్త చనిపోయిన స్త్రీ ముఖంమీద ‘విధవ’ ముద్రవేసి ఆమె జీవితాన్ని మోడులాగా మార్చేస్తారు. ఆమె తిరిగి చిగురించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా కుటుంబం, సమాజం ‘అరిష్టం’ ‘అనర్ధం’ పేరుతో ఆ చిగుళ్ళను చిదిమిపారేస్తారు.
ఏది అరిష్టం? ఏది అనర్ధం? ఏది అశుభం? భార్య చనిపోతే నెల తిరక్కుండా పెళ్ళి చేసుకునే మగవాడు వైధవ్యపు ముద్రలేమీ మొయ్యకుండానే కాలరెత్తుకుని తిరగడం ‘అరిష్టం’ ఎందుకు కాకుండా పోయింది. ఉదయాన్నే అతని ముఖం చూడడం ‘అశుభం’ ఎలా కాకుండా పోయింది. భార్య చనిపోయిన దుఃఖపు ఛాయలు కనబడకుండా మామూలుగానే ఎలా మసలగలుగుతాడు. భర్త చనిపోయిన స్త్రీ మాత్రం ఆ దుఃఖాన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు వ్యక్తం చెయ్యాల్సిన దుస్థితి ఎందుకు? ఒక్కోసారి ఆమెకు దుఃఖం కలగకపోయినా ‘రుడాలి’లా గుండెలు బాదుకుంటూ ఎందుకేడవాలి? భార్య చనిపోయిన మగాడు మహా అయితే పది రోజులు గడ్డం పెంచుకుని దుఃఖ వ్యక్తీకరణ చేస్తాడేమో! అంతకు మించి ఏడుపులు, పెడబొబ్బలు చెయ్యడు కదా!
ఒకసారి నాకెదురైన ఓ అనుభవం ఇప్పటికీ నా రక్తాన్ని మరిగిస్తుంది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు. ఎవరో పేరంటం పిలుపులంటూ మా ఇంటికొచ్చారు. నేను, మా అమ్మ ఇంట్లో ఉన్నాం. వచ్చినవాళ్ళు నాకు బొట్టు పెట్టడానికి వస్తే నేను పెట్టించుకోను అన్నాను. అలా అనకూడదు.’అరిష్టం’ అంది ఒకామె. అరిష్టమంటే ఏంటి? చెబుతావా? అని అడిగాను. మా అమ్మ అక్కడే ఉంది. ఆమె వైపు కూడా చూడకుండా ”సర్లే అమ్మాజి! (నన్ను ఇంట్లో అమ్మాజి అని పిలుస్తారు) నీతో వాదించలేను. ఏం చేయను మరి నువ్వు పెట్టించుకోనంటున్నావ్‌’ అంటూ మా వీథి గడపకి బొట్టు పెట్ట్టింది. మా అమ్మకి పెట్టలేదు. ఆమె చేతిలో ఉన్న పసుపు, కుంకుమ పెట్టిన పళ్ళాన్ని ఎగిరి తన్నాలన్నంత కోపమొచ్చింది నాకు. కానీ వాళ్ళంతా మా చుట్టాలు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆవరించి అమ్మవైపు చూడలేకపోయాను. అమ్మకన్నా గడప విలువైందన్నమాట. చెక్కముక్కకి బొట్టు పెట్టొచ్చు కానీ నాన్న లేని అమ్మ ముఖాన పెట్టకూడదన్నమాట.
ఈ చెత్త ఆచారాలను భోగి మంటలో వేసి తగలెయ్యాలి. స్త్రీలు తమకు తెలియకుండానే ఎలా పితృస్వామ్య భావాల ప్రభావంలో ఉంటారో, తోటి స్త్రీని అవమానిస్తున్నామనే స్పృహ లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో అర్థమయ్యాక వాళ్ళ పట్ల జాలి కలిగింది. చూడడానికి ఇవన్నీ స్త్రీల పట్ల స్త్రీలే దారుణంగా వ్యవహరిస్తున్నట్లు కనబడినా అంతర్లీనంగా ప్రహించేది పితృస్వామ్య భావజాలమే. స్త్రీలందరూ మేము ఈ దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం, సాటి స్త్రీలను అవమానించం అని తీర్మానించమనండి… పురుషస్వామ్య, పితృస్వామ్యం బ్రాహ్మణీయ భావజాలం పడగ విప్పుతుంది. విషం కక్కుతుంది. ముత్తైదువులనీ, పునిస్త్రీలనీ, విధవలనీ విడగొట్టి వికటాట్టహాసం చేస్తుంది. మీరు వీటిని వ్యతిరేకిస్తే మీ భర్తలకి అరిష్టం, ప్రాణ నష్టం అంటూ ఊదరగొట్టి, స్త్రీలందరూ అనివార్యంగా సోకాల్డ్‌ ”మంగళసూత్రాల”ను కళ్ళకద్దుకుని తమ క్రూర పద్ధతులను కొనసాగించేలా భయభ్రాంతులను చేస్తారు. భర్తకంటే ముందు చనిపోయిన స్త్రీల కర్మకాండలను పండగలా చేసి కేవలం భర్తలున్న ”సోకాల్డ్‌ సుమంగళు”లనే పిలిచి వారికి పసుపు, కుంకాలు, కానుకలు ఇచ్చి సత్కరించి, భర్తలు లేని స్త్రీలను అత్యంత హీనంగా అవమానించే పరమ నికృష్ట ఆచారమిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. భర్త లేని స్త్రీని అవమానించే ”సుమంగళి” మొగుడు శాశ్వతంగా బతికి ఉంటాడా? తనకు ఈ దుస్థితి ఎదురుకాక తప్పదని తెలిసీ పురుషస్వామ్యం చేతిలో పాచికలా పనిచేస్తుంది కదా! అదే అత్యంత విషాదం.
నాకు ఎదురైన మరో భయానక అనుభవం. నేనూ, మా పెద్దక్క ఏదో పెళ్ళికి వెళ్ళాం. మా బావ చనిపోయాడు. ఆయన చనిపోకముందు మా అక్క ”పెద్ద ముత్తైదువ” హోదాలో చాలా యాక్టివ్‌గా అన్నింట్లో పాల్గొనేది. అదరూ తనను అన్ని ”శుభ” కార్యాలలో ముందుంచేవారు. మా బావ చనిపోగానే ఆమె దేనికీ పనికిరాకుండా పోవడమే కాక అనేక అవమానాలను ఎదుర్కొంటోంది. నేను పైన రాసిన పెళ్ళిలో పురోహితుడు సోకాల్డ్‌ మంగళసూత్రాలు పట్టుకుని జనంలోకి వచ్చి ”ముత్తైదువుల” మెడలకు తాకిస్తూ మా దగ్గరకొచ్చాడు. నేను నాకు తాకించొద్దని తల అడ్డంగా ఊపాను. నా పక్కనే ఉన్న అక్కకు ఎక్కడ తాకించేస్తాడో అని అక్క పక్క కూర్చున్న ఆమె ”పంతులుగారూ! ఆవిడకి వద్దులెండి” అంటూ కంగారుపడిపోయి తన మెడకి ఆనించుకుంది. నిజం చెప్పొద్దూ… మా అక్కని అవమానించిన ఆ సూత్రాన్ని లాక్కుని నేలకేసి కొట్టాలన్నంత ఆవేశాన్ని ఆపుకుంటూ ఆ పెళ్ళిలోంచి లేచి వెళ్ళిపోయాను. ఇలాంటి పెళ్ళిళ్ళకు వెళ్ళడం మానేసి చాలాకాలమైంది. నేను వెళ్ళడం మానేసినంత మాత్రాన అవమానాలు ఆగిపోతాయని కాదు కానీ ఆ బీభత్సాలను, ఆ అమానవీయ దృశ్యాలను చూసి తట్టుకోలేక గొడవ పడతానేమో అనే భయంతోనే మానేసాను.
నాకు చాలా దగ్గరి స్నేహితుడు ఒకరి తల్లికి జరిగిన అవమానం అతనిని కూల్‌గానే ఉంచింది కానీ నా రక్తాన్ని మరిగించింది. ఆవిడకు నలుగురు కొడుకులు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆవిడ భర్త హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు. చాలా కష్టపడి పిల్లల్ని పెంచి, చదువు చెప్పించింది. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే కొడుకుల పెళ్ళిళ్ళ సమయంలో ఆవిడ పట్ల ప్రవర్తించిన తీరు ఘోరం. ఆవిడ పెళ్ళి మండపంలోకి రాకూడదట. అక్షింతలు వెయ్యకూడదట. ఆవిడ ఆహుతుల్లో ఒకరిగా కూర్చోడానికి కూడా అర్హురాలు కాదట. పెళ్ళిపందిట్లో ఆర్భాటంగా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉండిపోయింది. నా ఫ్రెండ్‌ పెళ్ళిలో నేను అతనిని ”మీ అమ్మేది” అని అడిగినపుడు ”అమ్మెలా వస్తుంది. నాన్న లేడుగా” అన్నాడు. ”ఓరి మూర్ఖుడా! నాన్న ఎలాగూ లేడు. అమ్మరావాలి కదా!” అంటే ”భలేదానివే! అలా వస్తే కోడలికి అరిష్టమట. పిన్ని చెప్పింది.” నా కోపం నషాళానికి అంటింది. ”కోడలికి అరిష్టమంటే ఏంటి? నువ్వు చస్తావా?” అందామనుకుని తమాయించుకున్నాను. ఆ తల్లి పడే మానసిక వేదన, అవమానం, దుఃఖం చదువుకున్న మూఢులకు కూడా అర్థం కాకపోవడమే అసలు విషాదం. రాసుకుంటూపోతే ఎన్నో అనుభవాలు ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉంటాయి.
వైధవ్యం పేరుతో తరాల తర్వాత తరాలు ఎలాంటి మార్పు లేకుండా భర్తల్ని కోల్పోయిన మహిళల పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఆచారాలు, అరిష్టాలు, అశుభాలు, కట్టుబాట్లు లాంటి పడికట్టు పదాలు ఈ స్త్రీల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. మతం, సమాజం, కుటుంబం ఎన్నో అంశాలలో మారుతున్నా, మార్పును ఆహ్వానిస్తున్నా ”వైధవ్యం” అనే పదం పట్ల శిలాజరూపంలోనే ఉండిపోయింది. దీనిని బద్దలు కొట్టాల్సిన అవసరముంది. పితృస్వామ్య భావజాల మత్తులో మహిళలు తోటి మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆచరిస్తున్న ఘోరకృత్యాల అసలు రూపాన్ని అర్థం చేసుకోవాలి.
స్రీలను ముత్తయిదువులు, విధవలు అంటూ విభజించే క్రూర సంస్కృతికి సమాధి కడదాం… రండి… ఆలోచించండి… వ్యతిరేకించండి…

Sunday, June 19, 2016చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.
.........
ఈ రోజు తండ్రుల దినమట.
మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.
ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.
పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.
మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.
మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.
మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు బావిలోంచి బుడ్లజోడుతో (మట్టి కుండలు) నీళ్ళు ముంచి పోస్తుంటే నేనూ ఓ కుండ తీసుకుని ఆయన వెనకే నీళ్ళు పోసిన జ్ఞాపకాలు...
నన్ను స్కూల్లో చేర్పించడానికి నరసాపురం తీసుకెళ్ళి అది ఏ స్కూలో తెలియకుండానే ఓ కొండపల్లి చేంతాడంత పేరున్న "హిదూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూల్" లో (అది ఓరియంటల్ స్కూల్ అని తెలిసో తెలియకో) నన్ను జాయిన్ చేసిన జ్ఞాపకం.
(అందరూ నన్ను విడో హోం లో చదువుతోంది అని వెక్కిరించేవారు.అప్పటికి విడోస్ అంటే ఎవరు అని నాకు తెలియదు.)
నేను కష్టాతి కష్టం గా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉన్నప్పుడు "పద హైదరాబాద్ పోదాం నీకు ఉద్యోగమొస్తుంద"ని నన్ను ఈ మహానగరానికి తెచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నన్ను మా చిన్నాన్న ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకం..
.నా జీవిత గమనం...గమ్యం నిర్ణయమైన సమయం..
మా అక్కలు..అన్న, తమ్ముళ్ళు నాన్న గారూ అని పిలిచినా
నేనొక్కదాన్నే నాన్నా...నువ్వు అని పిలిచిన నాన్న...మా దొడ్డమనిషి.
వ్యవసాయం చేసిన రైతు...
అప్పుడప్పుడూ వ్యాపారం చేసి అమాయకంగా మునిగిపోయిన నాన్న.
నాన్న 50 ఏళ్ళకే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆయనకి ఖరీదైన వైద్యం చేయించే స్థోమత మాకు లేదు.
బిపి పెరిగి తలలో నరాలు చిట్లి చనిపోయాడు నాన్న.
నేను ఆయన్ని చివరి చూపు కూడా చూడలేదు.
నేను చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి వెళ్ళినా అప్పటికే అంతా అయిపోయింది.
నాన్న చాలా అరుదుగా షర్ట్ వేసుకునేవాడు.
షర్టులుండేవి కాదు.
నన్ను ఆడపిల్లగా కాకుండా మనిషిగా పెంచిన నాన్న..
చెట్లెక్కడం..చేపలు పట్టడం...సైకిల్ తొక్కడం...
గొడ్దళ్ళతో కట్టెలు కొట్టడం నేర్పిన నాన్న...
నువ్వాడపిల్లవి..అది చేయొద్దు.. ఇది చేయొద్దు... అలా తిరగొద్దు అని ఏనాడు చెప్పకుండా నన్ను చెట్టు మీద పిట్టల్లే స్వేచ్చగా పెంచిన నాన్న...
నన్ను హైదరాబాద్ తెచ్చి నా జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిన నాన్నని తలుచుకుంటే ఎంత సంతోషమో నాకు.
నా దగ్గర ఉన్న నాన్న ఒకే ఒక్క ఫోటో ఇది.వెనక రైలుపెట్టెల్లాగా ఉన్న మా ఇల్లు...
మండువా లోగిలి.
ఎడం వైపు నుండి రెండో వ్యక్తి మా నాన్న.పేంటు వేసుకున్న వాడు మా ఆఖరి చిన్నాన్న

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...