Saturday, December 24, 2022

ప్రెషర్‌ కుక్కర్లు కొనివ్వడం కాదు ఇంటిపనిలో భాగస్వాములవ్వాలి

 – కొండవీటి సత్యవతి

ఇద్దరు మిత్రులు పొలం గట్లమీద మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అటూ ఇటూ పచ్చటి పంట పొలాలు. కళ్ళకి ఎంతో ఇంపుగా కనబడుతున్నాయి.

ఆ మాటా ఈ మాటా దొర్లాక ‘‘అరేయ్‌! సుధాకర్‌! కిందటి ఆదివారం వస్తనంటివి. రానేలేదు. ఏదో ట్రైనింగుకి పోవాలి, రాను అన్నావ్‌ కదా! నీకేం ట్రైనింగురా’’ అడిగాడు రమేష్‌.
‘‘అదా! చెప్పాలిరా నీతో.’’
‘‘ఆడ బాయికాడ కూర్చుందాం పా. ఈ లోపు రంగయ్యొస్తాడు కల్లు దింపనీకి.’’
‘‘కల్లు సంగతి తర్వాతరా. నేను ట్రైనింగులో విన్న ముచ్చట నీకు చెప్పాలి’’ అన్నాడు కూర్చుంటూ.
‘‘కల్లు మర్చిపోయేంత గొప్ప ముచ్చటేందిరా’’ నవ్వాడు రమేష్‌.
‘‘మీ చెల్లి కడుపుతో ఉంది కదా’’
‘‘అవును. నాకు తెలుసుగా’’
‘‘అంటే, ఎలా చెప్పాలిరా? భార్యలు గర్భంతో ఉన్న భర్తలతో ఆ మీటింగ్‌ జరిగింది’’ అన్నాడు సిగ్గుపడుతూ.
‘‘అదేందిరోయ్‌. భార్య గర్భానికి, నీ మీటింగ్‌కి ఏందిరా సంబంధం. గమ్మత్తుగా ఉందే’’
‘‘చెబుతా ఆగు మరి’’
దూరంగా రంగయ్య వస్తూ కనబడ్డాడు.
‘‘అడిగో రంగయ్య కూడా వచ్చాడు’’
‘‘ఏందయ్యో! దోస్తులిద్దరూ సందె కల్లుకోసమొచ్చారా. ఈ రోజు కల్లు లేదు. ఊరికే చూసి పోదామని వచ్చా’’ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు రంగయ్య.
‘‘అట్లానా! సరేలే. నువ్వు కూడా కూర్చో. సుధాకర్‌ ఏదో ముచ్చట చెబుతాడట. చెప్పరా’’.
రంగయ్య కూడా సుధాకర్‌ వైపు ఆసక్తిగా చూశాడు.
‘‘ఎలా మొదలెట్టాలో సమజైతలేదు. సర్లే… చెప్పేస్తా. మా బస్తీలో అంగన్‌వాడి టీచర్‌ ఉంటది గదా! నా భార్య గర్భంతో ఉంది, అంగన్‌వాడి సెంటర్‌కి వెళ్తుంది కదా! పది రోజుల క్రితం నన్ను పిలిపించింది. ఎందుకా అనుకుంటా పోయినా. ఈ ట్రైనింగ్‌ పోవాలని చెప్పింది. తప్పనిసరిగా పోవాలని చెప్పింది. ఏమి ట్రైనింగ్‌, నేనెందుకు పోవాల, నేను పోను అని కొట్లాడినా. చాలాసేపు సంజాయించింది. నీతోపాటు చాలామంది ఉంటారులే అని ఒప్పించింది. అలా మొన్న ఆదివారం నాడు పోయినాను’’ అంటూ నవ్వాడు సుధాకర్‌.
‘‘ఆడోళ్ళంతా కట్టగట్టుకు పోతుండే మీటింగ్‌లవి. మొదటిసారి ఇంటున్నా మొగోళ్ళు మీటింగ్‌లకి పోవుడు’’ అన్నాడు రంగయ్య.
‘‘అదే కదా’’ అన్నాడు రమేష్‌.
‘ఆగండాగండి. ఇది వేరే తీరుగున్న మీటింగ్‌. గర్భంతో ఉన్న ఆడవాళ్ళలో రక్తం… కాదు అదేంటది రక్తహీనత ఎక్కువగా ఉంటే పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంతో పుడతారంటూ మొదలుపెట్టి ఎన్నో విషయాలు చెప్పబట్టె. మొదట్లో ఏమీ అర్థం కాలేదు. ఆమెకి రక్తం తక్కువుంటే నేనేం చెయ్యాల, మందులేసుకోవాలి. నాకెందుకు చెబుతున్నారని తొలుత కోపమొచ్చింది. నాతోపాటు ఇరవై మంది మగాళ్ళుండె. అందరూ వాదించబట్టె. కానీ ఆ మేడం… పేరు మర్చిపోయా చాలా శాంతంగా సంజాయించింది. మమ్మల్ని సానా ప్రశ్నలడిగింది.’
‘‘మీ ఇంట్లో వంటెవరు చేస్తారు?’’
‘‘నా భార్య చేస్తుంది.’’
‘‘ఎవరు వడ్డిస్తారు?’’
‘‘ఆమెనే వడ్డిస్తుంది.’’
‘‘ముందెవరు తింటారు?’’
‘‘పిల్లలు. ఇంట్లో పెద్దలుంటే వాళ్ళు.’’
‘‘తర్వాత?’’
‘‘నాకు పెడుతుంది.’’
‘‘మీరంతా తిన్నాక తనకి ఎవరు వడ్డిస్తారు?’’
‘‘భలేగా అడిగారే. ఆమే తింటుంది. ఆమెకి ఎవరు పెడతారు’’
‘‘ఆమె ఏం తింటుందో, ఎంత తింటుందో మీకు తెలుసా?’’
‘‘మాకు పెట్టిందే ఆమె తింటుంది.’’
‘‘ఆమెకు తినడానికి ఏమైనా మిగులుతాయా. మీరు ఎప్పుడైనా మీ భార్యని నువ్వు తిన్నావా? నీకు కూర సరిపోయిందా? అని అడుగుతారా?’’
‘‘నేనెందుకడుగుతా. ఆమెకు కావలసింది ఆమె తింటది.’’
ఇలాగా ఎన్నో ప్రశ్నలు అడిగారు. మస్తు కోపమొచ్చింది. ఏందీ పిచ్చి ప్రశ్నలు అని కూడా అనిపించింది.
‘‘నిజమే గదా! ఏందా పిచ్చి ప్రశ్నలు. గదేం ట్రైనింగ్‌’’ రంగయ్య అన్నాడు తుపుక్కున ఊస్తూ.
‘‘ఆగాగు రంగన్నా. ముందు కోపమొచ్చినా తర్వాత ఆలోచనొచ్చింది. నిజమే కదా! మనం తినుడే గానీ ఎన్నడైనా ఆళ్ళ గురించి మనం పట్టించుకుంటామా అనిపించింది.’’
రమేష్‌, రంగయ్య ఆశ్చర్యంగా చూశారు సుధాకర్‌ వైపు.
‘‘నా ఇంటిది కడుపుతో ఉంది కదా. ఆమె గురించి మస్తు ప్రశ్నలడిగారు తెలుసా?’’
‘‘ఏమన్నారేంటి సుధాకర్‌?’’
‘‘అదే చెబుతున్నా’’
‘‘ఆ మేడం అడిగింది కదా! నీ భార్య కడుపుతో ఉంది కదా! ఎన్నో నెలో నీకు తెలుసా?’’
‘‘గా ముచ్చట నీకెందుకంటా’’ రంగయ్య అన్నాడు.
‘‘నేనూ అదే అన్నాను. నాకు తెల్వది. ఆమెకెన్నో నెలపడ్డదో ఆళ్ళమ్మకి తెలుస్తది. నాకు తెల్వదు.’’
‘‘గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉందా? నీ భార్య ఆరోగ్యం మంచిగా ఉన్నదా? ఆమె బరువెంత పెరిగింది. ఏమి తింటున్నది. మంచి ఆహారం సరిపడా తింటున్నదా? ఆసుపత్రికి తీసుకెళ్ళావా? డాక్టర్‌ ఏమి చెప్పింది. ఓయబ్బో ఎన్ని ప్రశ్నలడిగిందనుకున్నారు. ఏంటది పోషకాహారం అంట, తింటున్నదా అని కూడా అడిగింది. పోషకాహారమంటే ఏందో నాకేమెరుక. నేను ఏమీ చెప్పలేకపోయాను. మస్తు సిగ్గుపడ్డాను. కానీ నాతోపాటు ఉన్న మురళి చాలా బాగా చెప్పిండు తెలుసా?’’
‘‘ఏ మురళి? మన వెంటకయ్య కొడుకా?’’
‘‘అవును ఆడే. మేడం అడిగిన అన్నింటికీ టకటకా చెప్పిండు.’’
‘‘అవురా. ఆడు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు కదా!’’ నవ్వాడు రమేష్‌.
‘‘అదే మాట మేడం కూడా అనిందిరా. మర్చిపోయా. మా పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో కూడా అడిగింది. పెద్దలు చేసిన పెళ్ళా, ప్రేమ పెళ్ళా అని కూడా అడిగారు. మురళి, ఇంకో ఇద్దరు ప్రేమ పెళ్ళి అని చెప్పారులే.’’
‘‘అదా సంగతి’’ అన్నాడు రంగయ్య.
‘‘తర్వాతేమైందిరా’’ అన్నాడు రమేష్‌.
‘‘వస్తున్నా, ఆడికే వస్తున్నా. మస్తు ప్రశ్నలు, సమాధానాలు అయ్యాక మాతో కొన్ని పనులు చేపిచ్చారు’’
‘‘పనులు చేపించారా? ఏం పనులురా’’
‘‘కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్లు మా ముందు పెట్టి చాకుతో కొయ్యమన్నారు. చాలామందికి కోపమొచ్చి సర్రున లేచి వెళ్ళబోయారు. అప్పుడు మేడం ఏమన్నదంటే, ఎందుకు కోపమొచ్చింది. కూరగాయలు, పండ్లు కట్‌ చేయడం చెడ్డపనా?’’ అంది.
‘‘కాకపోతే ఏంటి మరి. అది ఆడోళ్ళ పని. మేమెందుకు చెయ్యాలి. మా పరువు తియ్యాలనుకుంటున్నారా’’ అంటూ అరిచాడు ఒకాయన.
వెంటనే మురళి లేచి ‘‘తప్పేముంది. పెద్ద పెద్ద వంటల్లో మగాళ్ళు కోస్తారుగా. హోటళ్ళలో చూళ్ళేదా? మేడం నేను కోస్తాను. ఇంట్లో నేనే కూరలు కోస్తే నా భార్య వండుతుంది. ఇపుడామె కడుపుతో ఉంది. ఎక్కువసార్లు వంట కూడా చేస్తాను. ఆమెకి వికారంతో వాంతులవుతాయి. పొద్దుగాలప్పుడు చాలా నీరసంగా ఉంటుంది. అందుకే చాలా పనులు నేను చేస్తా ఇంట్లో’’ అంటూ కూరగాయలు చకచకా కోసి చూపించాడు.
‘‘మేడం! ఉల్లిపాయలు మాత్రం నా వల్ల కాదు. కళ్ళ నుండి నీళ్ళొస్తూనే ఉంటాయి’’ అంటూ నవ్వాడు మురళి.
మురళిని చూసి కొంతమంది ముందుకొచ్చి కూరలు తరగడానికి ప్రయత్నం చేశారు. ఒకాయన వేలు కట్‌ చేసుకుని కెవ్వుమన్నాడు. అందరూ నవ్వారు. మేడం అతని చేతికి బ్యాండ్‌ ఎయిడ్‌ వేసింది. ఆ తర్వాత పండ్లు కోయమన్నది. కొంతమందే కోయగలిగారు.
‘‘మీలో ఎంతమందికి ఇల్లు ఊడ్వడం తెలుసు.’’
‘‘మీరు మరీ ఘోరం మేడం. నా భార్య ఉండగా ఇల్లు నేనెందుకు ఊడుస్తాను.’’
‘‘నేనూడ్చినా ఆడంగి వెధవా, నీకేం ఖర్మరా అని మా అమ్మ తిడుతుంది’’ అన్నాడొకడు.
‘‘మగ పుట్టుక పుట్టి చీపురు పట్టుకునే ఖర్మ మాకేంటి మేడం’’ అన్నాడొకతను.
‘‘అద్సరే గానీ నువ్వేమన్నావ్‌రా సుధాకరూ’’ అడిగాడు రంగయ్య.
‘‘ఇదేం ట్రైనింగురా! మగవాళ్ళని ఆటపట్టించనీకా’’ అన్నాడు రమేష్‌.
‘‘నాకూ ఆ పనులేవీ రావు కదా! అదే చెప్పాను. నేను పొద్దుగాల పనికి పోతా. సాయంత్రమొస్తా. ఈ పనులు చెయ్యనీకి నాకు టైమెక్కడిది’’ అన్నాను.
మేడం వెంటనే ‘‘నీ భార్య కూడా బయటికెళ్ళి పనిచేసి సాయంత్రం వస్తుంది కదా! మరి ఆమె ఎలా చెయ్యగలుగుతుంది. పైగా ఇప్పుడు కడుపుతో ఉంది కూడా’’ అని అందరివైపు తిరిగి ‘‘మీరేమంటారు?’’ అంది.
‘‘అవన్నీ ఆడాళ్ళేగా చెయ్యాలి. మేం చేస్తే చులకన అయిపోమా? అయినా అవేం గొప్ప పనులా. ఆడాళ్ళు ఈజీగా చేసేస్తారు.’’
చీపుర్లు బయటికి తీసి ‘‘ఊడ్చడానికి ప్రయత్నం చెయ్యండి. అదెంత కష్టమైన పనో, ఎంత నడుం నొప్పి వస్తుందో మీకు అర్థమౌతుంది’’ అంది మేడం.
కొందరు కోపంగా బయటకు వెళ్ళిపోయారు. మురళి చక్కగా ఊడ్చి మేం పారేసిన కూరగాయ ముక్కల్ని చేటలో ఎత్తిపెట్టాడు. అది చూసి కొంతమంది చీపురు తీసుకున్నారు. చాలామందికి పట్టుకోవడం రాలేదు. నడుం ఒంచి ఊడ్వడం రాలేదు.
‘‘నువ్వేం చేసినావురా. ఊడ్చావా’’ హేళనగా అన్నాడు రంగయ్య.
‘‘ప్రయత్నం చేశా. నడుం ఒంగలే. చేతిలో చీపురు నిలవలే. ఊడ్చడం అంత తేలిక కాదని అర్థమైంది. కడుపుతో కమల… అదే నా భార్య ఇల్లూడ్వడానికి ఎంత కష్టపడుతుందో అర్థమైందిరా’’ అన్నాడు సుధాకర్‌.
శ్రోతలిద్దరూ నోళ్ళు వెళ్ళబెట్టి విన్నారు. రంగయ్య కొడుకు కల్లు తీసుకొచ్చాడు. రెండు సీసాల్నిండా కల్లు. ‘‘ఏంది అందరూ అంతలా మాటల్లో మునిగారు’’ అన్నాడు సాయి.
‘‘పొయ్యిరా కల్లు. గీ సుధాకర్‌ చెప్తున్న మాట వింటుంటే పిచ్చెక్కేట్టుంది’’ అన్నాడు రంగయ్య.
నాలుగు మోదుగాకులు తెంపుకొచ్చి కల్లు పోసిచ్చాడు సాయి.
‘‘నిజమే రంగన్నా. ఉదయం మీటింగ్‌ మొదలైనప్పుడు నాకూ కోపం, చిరాకు వచ్చాయి. పిచ్చి పట్టినట్టనిపించింది. ఎందుకంటే ఇసుంటి మాటలు ఎప్పుడూ వినలే. కానీ సాయంత్రానికి మంచిగనిపించింది. చివర్లో మేడం మాటలు చాలా మంచిగనిపించాయి అందరికీ. కోపంగా బయటకు పోయినోళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు.’’
‘‘ఏం చెప్పిందేంటి’’ రమేష్‌ అడిగాడు.
అన్ని ప్రశ్నలడిగినందుకు, అన్ని పనులు చేపిచ్చినందుకు క్షమించమంది. మీకు అర్థం చేయించనీకే అలా చేశాం. మాటలతో మార్పు రాదని మీరు ఆ పని చేస్తే మీకు తెలుస్తుందని చేయించాం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీకు తెలుసా మన దేశంలో గర్భం దాల్చాక ఎనీమియా… అదే పోషకాహారం తినకపోవడం వల్ల తల్లీ పిల్లలు చాలామంది చనిపోతున్నారు. గర్భం వచ్చిన మనిషికి కుటుంబం అంతా తోడుగా ఉంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె తిండీ తిప్పల గురించి, ఆమె ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోకపోతే ఎలా చెప్పండి. ఆమెకు ఉన్నంతలో మంచి భోజనం ఏర్పాటు చెయ్యడం, క్రమం తప్పకుండా డాక్టర్‌కి చూపించడం, బరువు చెక్‌ చెయ్యడం… నిజానికి ఇవన్నీ చెయ్యడానికి అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు ఉంటారు. కానీ మీరు శ్రద్ధ చూపించి వాళ్ళను చెకప్‌లకు తీసుకెళ్తే ఆమె కూడా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. కుటుంబంలో గర్భిణీ ఉంటే ఆమె బాగోగులను కుటుంబం మొత్తం చూసుకోవాలి. ముఖ్యంగా భర్తగా మీరు ఇంటి పనిలో, వంట పనుల్లో బాధ్యత తీసుకుంటే ఆమెకు కొంచెం రెస్ట్‌ దొరుకుతుంది. ఇవన్నీ మీతో మాట్లాడాలనే ఈ ట్రైనింగ్‌ అంటూ మేడమ్‌ చాలా విషయాలు మాట్లాడిరది.
‘‘మాకూ చెయ్యాలనే ఉంటుంది మేడం. కానీ మా అమ్మ తిడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కిరిస్తారు. అదే భయం’’ అన్నాడొకాయన.
‘‘చుట్టుపక్కలందరం చెయ్యడం మొదలుపెడితే ఎవరెక్కిరిస్తారు’’ అన్నాడు మురళి.
‘‘కరెక్ట్‌, ఈ మీటింగ్‌కి ఇరవై మంది వచ్చారు. తర్వాత మీటింగ్‌కి నలభై మంది రావొచ్చు. ఇలా కదా మార్పు వచ్చేది’’ అంది మేడం.
నిజమే కదా! అనిపించింది నాకు. కమలకి అన్నింట్లో సహాయం చెయ్యాలనిపించింది. ట్రైనింగ్‌ గురించి మీకు చెప్పాలనిపించడమే నాలో మార్పు వచ్చిందనడానికి నిదర్శనం. చిన్న చిన్న పనుల్లో కమలకి సహాయం చెయ్యడం, తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం కమలకీ సంతోషంగానే ఉంది. చివర్లో మేడంని ఓ ప్రశ్న అడిగాను.
‘‘ఇలాంటి ట్రైనింగ్‌లు ఎప్పుడో మొదలుపెట్టి ఉండాల్సింది. మా అమ్మలకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మమ్మల్ని సరిగ్గా పెంచేవాళ్ళు. మా నాన్నను చూసే మేము నేర్చుకున్నాం. మా అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా ఆయన కొట్టేవాడు. ఒకసారి కడుపుమీద కొట్టాడట తాగొచ్చి. ఈ ట్రైనింగ్‌లో నేను చాలా నేర్చుకున్నాను. చాలా విషయాలు అర్థమయ్యాయి. నా ఫ్రెండ్స్‌ అందరికీ చెబుతాను థాంక్స్‌ మేడం’’ అని చెప్పాను అన్నాడు సుధాకర్‌.
వింటున్న ముగ్గురూ వింతగా చూసినా సుధాకర్‌ చెప్పిందంతా అర్థం చేసుకున్నారు. సాయి మోదుగాకుల్లో మళ్ళీ కల్లు నింపాడు. అతనికి ఇటీవలే పెళ్ళయింది. సుధాకర్‌తో మళ్ళీ మాట్లాడాలి అనుకున్నాడు.
‘‘అవునురా సుధాకర్‌! నువ్వు చెప్పిన కొన్ని విషయాలు బానే ఉన్నాయి. మనక్కూడా ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేకపోతే మనకెలా అర్థమౌతాయి’’ అన్నాడు.
‘‘ఔనురా! నువ్వు చెప్పిన విషయాలు నాక్కూడా మంచిగన్పించాయి. రానిస్తే ఈసారి మీటింగ్‌కి నేనూ వస్తా’’ అన్నాడు రమేష్‌.
మాటలు కొనసాగిస్తూ నలుగురూ ఇళ్ళవైపు నడవసాగారు.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...