Sunday, June 26, 2011

జైళ్ళతో నా అనుభవాలు.


నేను చాలా కాలంగా వివిధ జైళ్ళను సందర్శిస్తూ ఉన్నాను.
మొట్టమొదట నేను వెళ్ళిన జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్.
ఆ తర్వాత సందర్శించినది ఢిల్లీలోని ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్ జైలు.ఓ రోజంతా తీహర్ జైల్లో ఉండి మరీ చూసాను.
మూడవది విశాఖపట్టణంలోని అందమైన పరిసరాల్లో ఉండే విశాఖ సెంట్రల్ జైల్.
నాలుగవది ఇటీవలి కాలం లో రెగ్యులర్ గా విజిట్ చేస్తున్న చంచల్ గూడా మహిళా జైలు.
ఈ నాలుగు జైళ్ళ గురించీ రాయాలని చాలా కలంగా అనుకుంటున్నాను.
ఈ రోజు ఈ వారం వీక్ మేగజైన్ లో వివిఐపీ లు తీహార్ జైల్లో ఏంచేస్తున్నారు?అనే ఆసక్తికరమైన కధనం చదివాకా తీహార్ గురించి నా అనుభవాలు రాయాలనిపించింది.
నేను 1985 లో ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా అరెష్ట్ అయ్యాను కాని జైల్లో లేను.పోలీస్ కంట్రోల్ రూం లో నేరస్తుల మధ్య ఓ రాత్రి గడిపాను.మర్నాడే బెయిల్ దొరికింది కాబట్టి జైల్లో చిప్ప కూడు తినలేదు.
మొదట రాజమండ్రి జైల్లో నా అనుభవాలు రాస్తాను.

Tuesday, June 21, 2011

ఇదేం ప్రేమ రోగం!అంటు రోగం లా ఉంది.

ఈ రోజు ఉదయం నుండి భూమిక హెల్ప్ లైన్ కి వచ్చిన కేసులు చూస్తుంటే,వింటుంటే మనసు పచ్చి పుండు లాగా సలుపుతోంది.
నాకు డిప్రెషన్ వచ్చేలా ఉంది.
ఉదయాన్నే ఓ భార్యా భర్తా ఇద్దరు చిన్నపిల్లలు వచ్చారు.
"నా కూతురిని అత్తింట్లో ఉరేసి చంపేసారు.నాలుగేళ్ళ ఈ పిల్లవాడు కళ్ళారా అంతా చూసాడు.ఎలా చంపారో పోలీసులకు చెప్పాడు.మహిళా పోలీస్ ష్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన నాలుగు రోజుల్లో చంపేసారు.నా కూతురు మమ్మల్ని ఎదిరించి ప్రేమ పెళ్ళి చేసుకుంది."
అమ్మమ్మ,తాతయ్యల వేపు చూస్తూ కూర్చున్న చిన్నారులు.
రెండు గంటలు గడిచాక ఓ తల్లి కూతురూ వచ్చారు.కూతురుకి 20 ఏళ్ళుంటాయ్.6 నెలల గర్భంతో ఉంది.
ఆరు నెలల (అప్పటికే గర్భం)క్రితం ప్రేమించిన వాడిని దండల పెళ్ళి చేసుకుంది.
నువ్వు నాకిపుడొద్దు.నాకు ఇంకో అమ్మాయి మీద ప్రేమ కలిగింది.నేను ఆమె ని పెళ్ళి చేసుకుంటాను అని ఆ మొగుడు ఈమెని గెంటేసాడు.
మధ్యహ్నం దాటాక హెల్ప్ లైన్ కి ఓ కాల్ వచ్చింది.ఓ తల్లి మాట్లాడింది.
నా కూతురు ప్రేమ పెళ్ళి చేసుకుంది.ఇద్దరు పిల్లలు.నా అల్లుడు మా పక్క ఊర్లో ఉండే మరో ఆమెని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు.ఆమెకి ముగ్గురు పిల్లలు.పెళ్ళాన్ని,పిల్లల్ని వదిలేసి నా అల్లుడు మొగుణ్ణి ముగ్గురు పిల్లల్ల్ని వదిలేసి ఆమే ఊరొదిలి వెళ్ళిపోయారు.
నా సమస్య ఏంటంటే నా అల్లుడు ఫోన్ చేసి నా కూతురిని రమ్మంటున్నాడు.
నాకు నీ మీదా ప్రేమ ఉంది.ఆమెనీ ప్రేమిస్తున్నాను.నువ్వు వచ్చెయ్ అంటున్నాడు.ఏం చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు"
మరో భయంకరమైన కేసు.ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ భర్త తన భార్య వక్షోజాలు చాలా పెద్దగా ఉన్నాయని వేధించి ఆమెకి ప్లాస్టిక్ సర్జరి చేయించాడు.
ఆ సర్జరి తర్వాత ఏమయ్యిదో,ఏ మందులు వికటించాయో ఆమె రెండు కిడ్నీలు పాడైపోయాయి.
డయాలసిస్ లేకుండా బతకలేని స్థితికొచ్చింది.
ఆమె అల్లంటి కండిషన్ లో వదిలేసి మొగుడూ హైదరాబాద్ వచ్చేసాడు.
ఆ పిల్ల పెళ్ళినాటీ ఫోటోలు చూపించి ఇంత బావుండేదాన్ని.
ఎంత ప్రేమించానో వీడిని అంటూ ఏడ్చింది.
రోజూ ఇలాగే మా చెవుల్లోను,మా కళ్ళ ముందు దుఖ సముద్రాలు పొంగిపొర్లుతుంటాయి.
గాయాల నదులు ప్రవహిస్తూంటాయి.
ప్రేమ ఇంత దుఖాన్ని ఇస్తుందా??
ఇదేం ప్రేమో అర్ధం కాక జుట్టు పీక్కోవాల్సి వస్తోంది.
ప్రేమలో,ప్రేమ పెళ్ళిళ్ళల్లో కూడా స్త్రీలు ఇంతటి భయానక హింసని అనుభవించడం నన్ను డిప్రషన్ లో ముంచుతోంది.

Monday, June 20, 2011

మనీషా మహానందంగా స్కూల్ కి

మనీషా ని ఈ రోజు 8200/-రూపాయలు ఫీజు కట్టి కీస్ హై స్కూల్ లో 7 వ క్లాస్ లో జాయిన్ చేసాను.
ఆ పిల్ల ముఖంలో కనబడిన సంతోషానికి ఖరీదు కట్టే శక్తి నాకు లేదు.
సంతోషం చిప్పిల్లే ఆ ముఖం లోని వెలుతురు నాకు ఎనలేని తృప్తినిచ్చింది.
నేను పిల్లల్ని కనలేదు.పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన అనుభవం లేదు.ఎంతో మందికి చదువు కోసం సహాయం చేసాను కానీ నేనే ఒక పిల్లని ఈ రోజు జాయిన్ చేస్తుంటే గమ్మత్తుగా అనిపించింది.
నేను మనీషాని జాయిన్ చేసి బయట కొస్తుంటే ఎవరో ఆవిడ మా పాపకి కూడా ఫీజ్ కడతారా అని అడిగినపుడు నా నోట మాట రాలేదు.
ఎంత మంది పిల్లలు చదువుకు దూరమౌతున్నారో తలుచుకుంటే దుఖం వస్తుంది
ప్రభుత్వాలు చేయాల్సిన పనులు వ్యక్తులుగా ఎంత మంది చెయ్యగలుగుతారు??

Sunday, June 19, 2011

చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన మా నాన్న

ఈ రోజు తండ్రుల దినమట.ఇలాంటి దినం ఒకటుందని నాకు ఇంతవరకు తెలియదు.

'మనసులో మాట సుజాత' బజ్ లో రాసేవరకు తెలియదు.
తనే రాయమని కూడా అందులో కోరారు.
సరే.మా నాన్న గురించి ఎప్పుడూ రాయలేదు.
మా అమ్మ గురించి చాలా సార్లు రాసాను.
నిజానికి నేను మా నాన్న గురించి చాలా రాయాలి.
ఆయన చెయ్యి పట్టుకుని 1975 లో ఈ మహా నగరానికి వచ్చాను.
అంతర్జాతీయ మహిళా సంవత్సరం (1975) సందర్భంగా ఆడవాళ్ళకి పిలిచి ఉద్యోగాలిచ్చేస్తారని మా నాన్న నమ్మి నన్ను వెంటబెట్టుకుని హైదరాబాద్ బండెక్కేసాడు.
నా జీవితంలో పెను మార్పు కి మా నాన్న అలా బాట వేసాడు.
అది సరే. మా నాన్న పేరు చెప్పలేదు కదా!
ఆయన పేరు కొండవీటి శ్రీ రామ మూర్తి.మా అమ్మ కొండవీటి అన్నపూర్ణ.
మా నాన్న ఆరుగాలం కష్టపడే నికార్సైన రైతు.
మా తాతకి ఏడుగురు కొడుకులు.తాత కొందరు కొడుకుల్ని ప్రేమగాను,కొందరిని పని వాళ్ళుగాను చూసేవాడట. మా నాన్న పనివాడుగానే చూడబడ్డాడు.
అంటే పగలంతా పొలం పనులు, ఇంటికొస్తూ పశువులకి గడ్డి కోసుకుని,దాన్ని తలమీద మోసుకుని తేవడం,పాలుపితకడం వగైరా పనులన్నీ చేసే వాడు.పాలేర్లు కూడా ఉండే వారు.
ఒక్కోసారి మా నాన్న మిట్ట మధ్య్యాహ్నం వేళ పచ్చ గడ్డి మోసుకొచ్చి చెమటలు కక్కుతూ అలా మా వీధి అరుగు మీద పడి నిద్రపోయేవాడు.ఆయన వొంటి మీద చాలా సార్లు గోచీనే ఉండేది.
మా తాత కొడుకులకి అందరికీ కలిపి కొన్నే చొక్కాలు కుట్టేంచేవాడట.నేను మా నాన్న ఒంటి మీద చొక్కాని చాలా తక్కువ సార్లే చూసిన గుర్తు.నానా ఆదమరిచి గోచీ పోగుతో అలా వీధి అరుగు మీద పడి నిద్రపోయే దృశ్యం నాకిప్పటికీ కనిపిస్తూ ఉంటుంది.
మా నాన్న చాలా కష్ట జీవి.మా ఇంటి ఆవరణలోనే బోలెడన్ని కూరగాయలు పండించేవాడు.నేను మా నాన్నకి సహాయంగా ఉండేదాన్ని.నూతుల్లోంచి బుడ్ల జోడు(రెండు కుండలు)తో నీళ్ళు తెచ్చి పాదులకు పోసేవాళ్ళం.నాకు మా నాన్న చేసే పనులన్ని చాలా ఇష్టంగా ఉండేవి.గొడ్డలితో కట్టెలు కొట్టడం,ఆయన పశువుల కోసం చిట్టు,తవుడు కలిపేటప్పుడు నేనే కుడితి పోసేదాన్నీ.
మా నాన్న నన్ను తిట్టిన, కోప్పడిన సందర్భాలేమీ లేవనే చెప్పాలి.ఒక్క సారి మాత్రం ఆయన కోపాన్ని చూసాను.
ఒక సారి నాన్న ఆవు పాలు పితుకుతుంటే నేను దూడని పట్టుకున్నాను.దూడ సడెన్ గా నా చేతుల్లోంచి వదిలించుకుని తల్లి పొదుగులో దూరింది.నాన్న చేతిలో పాల తపేళా కిందపడిపోయింది.దాన్ని బెరించడానికి కర్ర తెమ్మంటే నేనేమో పెళుసుగా ఉన్న కర్ర తెచ్చి ఇచాను.ఆ కర్రతో కొట్టబోతే అది విరిగిపోయి ఓ కర్ర ముక్క బలంగా నాన్న చాతీని తాకింది.ఆయన పళ్ళు నూరుతూ నా మీదకోచ్చాడు గానీ నన్ను కొట్టలేదు. నాన్న నన్నెప్పుడూ కొట్టలేదు.తిట్టలేదు.
నాన్న కి నన్ను చదివించాలని చాలా కోరికగా ఉండేది.నేను చదువుకుంటానని బాగా గొడవ చేసే దాని. కానీ ఆయన ఆర్ధికంగా అస్వతంత్రుడు.పని చెYYఅడమే తప్ప పైసలు కళ్ళ చూసిన వాడు కాదు.
నాపోరు పడలేక ఒక క్రిష్టియన్ స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి తీసుకెళ్ళాడు.అయితే వాళ్ళు నేను బొట్టు,పువ్వులు పెట్టుకోకూడదని ఆంక్ష పెట్ట్టేసరికి నేను అక్కడ చదువుకోనని పెద్ద పేచీ పెట్టాను.
అప్పుడు మా నాన్న నన్ను నర్సాపురం తెసుకెళ్ళి "హిందు స్త్రీ పునర్వివాహక సహాయ సంఘం స్కూల్"అనే సంస్కృత పాఠ శాలలో జేర్పించాడు.అక్కడ సంస్కృతం తప్ప వేరే ఏమి చెప్పరు.నేను లెక్కలుగాని,సైన్స్ గాని,సొషల్ స్టడీస్ గానీ ఏమీ చదువుకోలేదు.మొత్తం అంతా సంస్కృతం మయం.
సరే ఈ చదువు సంగతి మరో సారి రాస్తాను.
మొత్తానికి మా నాన్న నాకు చదువు బిక్ష పెట్టాడు.
నన్ను ధైర్యంగా తెచ్చి మహానగరం నడిబొడ్డున వదిలి ప్రపంచాన్ని గెలుచుకోమన్నాడు.
నిన్ను నువ్వు నిరూపించుకో,ఉద్యోగం సంపాదించుకో అంటూ నన్ను మా సీతారమపురం నుంచి తీసుకొచ్చి నేను కొత్త జీవితం వేపు అడుగులేసేలా పరోక్షంగా ప్రోత్సహించినవాడు మా నాన్న.
మా నాన్న నన్ను ఆడపిల్లగానో, మొగపిల్లవాడుగానో పెంచలేదు.మనిషిగా పెంచాడు.నేను అన్ని మగ వేషాలేసేదాన్నీ. అది వేరే సంగతి.కట్టెలు కొట్టడం,చేపలు పట్టడం,చెట్లెక్కడం,ఇలాంటి పనులే నా వన్ని. అచ్చంగాయలు,గుజ్జెన గూళ్ళు,లక్కపిడతలాటలు చచ్చినా ఆడేదాన్ని కాదు.కోతికొమ్మొచ్చులు,గూటింబిళ్ళలు,గోలీకాయలు,పేకాటలు ఇవి నాకు ఇష్టమైన ఆటలు.
మా నాన్న నువ్వాడపిల్లవి,ఇలాంటి ఆటలు ఆడకూడదు అని ఏరోజూ అనలేదు.
మేము మహా రౌడిల్లాగా ఎండు సరుగుడు ఆకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టి సిగరెట్ లాగా తయారు చేసి పొగ ఊదేవాళ్ళం.
నిజానికి మేము ఆడిది ఆటా పాడింది పాట గా మా బాల్యం గడిచింది.
మా అమ్మ మా నాన్న నన్ను చెట్టు మీద స్వేచ్చగా ఎగిరే పిట్టల్లే పెంచారు.
అందుకే నా మొదటి కధల సంపుటి "ఆమె కల" వాళ్ళకి అంకితమిస్తూ"నన్ను చెట్టు మీద పిట్టల్లే పెంచిన అమ్మా నాన్నలకి అంకితం" అని రాసాను.
మా నాన్న సరైన వైద్య సౌకర్యం అందక 50 ఏళ్ళకే నాకు దూరమయ్యాడు.అప్పట్లో ఖరీదైన వైద్యం చేయించడానికి మా దగ్గర డబ్బు లేదు.
ఇప్పుడు అన్ని ఉన్నాయి కాని నాన్నే లేడు.
నాన్న జ్ఞాపకం మా ఊరులోని తోటలంత పచ్చగా నాలో మిగిలే ఉంది.
నాకు బతుకునీ,ఉనికినీ ఇచ్చిన మా నాన్నకి ఇదే నా నివాళి.

Friday, June 17, 2011

మనీషా ఆత్మ గౌరవం-చదువు కోసం ఆరాటం

ఓ నెల క్రితం ఆంధ్ర జ్యోతి నవ్య పేజీ లో మనీషా అనే అమ్మాయి గురించి భువనేశ్వరి అనే జర్నలిష్ట్ ఓ కధనం రాసింది.మనీషా గురించి చదివి నేను ఆ అమ్మాయిని కలిసాను.చూడ ముచ్చటగా ఉంది మనీషా. ఎంతో చురుకైంది.

భువనేశ్వరి ఏమి రాసిందంటే మనీషా వాళ్ళమ్మతో కలిసి చెప్పులు కుడుతుంది. వాళ్ళ నాన్న తాగుడు కోసం అప్పులు చేసి ఈ మధ్యనే చనిపోయాడు.చెప్పులు కుట్టడమే వాళ్ళ వృత్తి.అదే జీవనాధరం.చిన్న పిల్లవు కదా చదువుకోకుండా చెప్పులు కుడుతున్నావేంటి అని జర్నలిష్ట్ అడిగినపుడు నా స్కూల్ ఫీజు కోసమే చెప్పులు కుడుతున్నాను.నాకు పని ఇవ్వండి నా డబ్బు నేనే సంపాదించుకుంటాను.చదువుకుంటాను.అని చాలా ఆత్మ గౌరవంతో చెప్పింది.
ఆ మాటే నన్ను ఆ పిల్లని కలిసేలా చేసింది.చాలా మందిని కదిలించింది.అప్పట్లో చాలా మంది ఆ పిల్లని చదివిస్తామని ముందుకొచ్చారు.ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడటం లేదు అని చెప్పింది ఈ రోజు.
మనీషాకి దాదాపు 9000/- వేలు డొనేషన్ కట్టాలి.నెల నెలా ఫీజు ఎన్ టి ఆర్ ట్రష్ట్ వాళ్ళు కడతామని చెబుతున్నారు.
సోమవారం డొనేషన్ కట్టి ఆ పిల్లని కీస్ హై స్కూల్ లో 7 వ తరగతి లో జాయిన్ చేద్దామనుకుంటున్నాను.
ఎవరైనా మనీషాకి సహాయం చెయ్యదలుచుకుంటే భూమిక హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పొచ్చు.(1800 425 2908)

Wednesday, June 15, 2011

భూమిక ఆధ్వర్యంలో రక్షక్ పోలీసులకు జెండర్ ట్రెయినింగ్






హైదరాబాద్ నగర పోలీస్ ష్టేషన్ల పరిధిలో దాదాపు 250 మంది రక్షక్ పోలీసులు పనిచేస్తున్నారు.

వీరు నాలుగు చక్రాల వాహనాల్లో, ద్విచక్ర వాహనాల్లో(వీరిని బ్లూ కోట్స్ అంటారు)
పెట్రోలింగ్,బందోబస్తు,లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ జాం మొదలైన విధుల్లో ఉంటారు.
రోడ్ల మీద సమస్యల్లో ఉన్న మహిళలు కనబడితే వారితో ఎలా వ్యవహరించాలో,వారిని ఎక్కడకు పంపాలో వీరికి తెలియదు.ఇళ్ళల్లో హింస జరుగుతున్నట్టు కనబడితే,హింసకు గురౌతున్న మహిళను ఎలా ఆదుకోవాలి,ఎక్కడకు పంపాలి అనే అవగాహన లేదు.
మహిళలతో ఎంత సున్నితంగా మెలగాలనే జెండర్ స్పృహ వీరికి అస్సలు లేదు.
గృహ హింస చట్టం గురించి గాని,రక్షణాధికారుల వ్యవస్థ గురించి కానీ,ప్రభుత్వ వసతి గృహాల గురించి గానీ వీరికి
అవగాహన లేదు.
సిటి పోలీస్ కమీషనర్ ఏ.కే ఖాన్ గారితో ఈ అంశమై చర్చినపుడు మీరు అందరూ రక్షక్ లకూ జెండర్ శిక్షణ నివ్వండి అన్నారు.
నిన్న మొదటి బాచ్ కి ట్రయినింగ్ ఇచ్చాము.అలాగే హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ,ప్రభుత్వేతర సపోర్ట్ సిష్టంస్ సమాచారంతో చిన్న బుక్ వేసి వారికి కిచ్చాము.
60 మంది పోలిసులు హాజరయ్యారు.
హాఫ్ డే ట్రయినింగ్ విజయవంతంగా జరిగింది.


Tuesday, June 14, 2011

ప్రేమ భాష్యం


ఒకరినొకరు ప్రేమించండి
అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి
మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య
కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ
ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా
ఒకరికొరకై ఒకరు
వేర్వేరు మధుపాత్రలు
నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది
మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది
అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు
కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో
ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!
ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం
విడి విడిగానే స్పందిస్తాయి కదా!
మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది
కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.
మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన
గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!
ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను
సరదా సమీరాలను కలిసి స్వీకరించండి
అయితే
నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం
విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!
ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు
వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!

- ఖలీల్ జీబ్రాన్

Tuesday, June 7, 2011

ఉద్యమ కేదారంలో పూసిన మందారం-తాపీ రాజమ్మ

మితృలనదరికీ నమస్కారం.

తాపీ రాజమ్మ గారి గురించి కొండపల్లి కోటేశ్వరమ్మ గారు
నవంబరు 2009 లో రాసిన వ్యాసాన్ని మీకోసం ఇక్కడ పోష్ట్ చెస్తున్నాను.
ఆవిడ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు.ఈ వ్యాసాన్ని భూమిక వెవ్ సైట్ లో కూడా చదవొచ్చు

భూమిక November 2009

కొండపల్లి కోటేశ్వరమ్మ

రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ ఒకచోట కూర్చున్నా… విజయవాడను గూర్చీ… విజయవాడలో ఆవిర్భవించిన ఉద్యమాల ప్రాభవాల గూర్చీ వినిపిస్తూ ఉండేది. విజయవాడ వీధివీధి తనను పలకరిస్తున్నట్లుగా కనిపిస్తుందని చిరునవ్వుతో పలికేది.
”విజయవాడంటే… ‘నీకెంతిష్టం’ రాజమ్మా!” అని నేనంటే… నీకు లేదా? అని అడిగేది.
గంగానదిలాగ పుచ్చలపల్లి సుందరయ్య గారు, యమునానదిలాగ చండ్ర రాజేశ్వరరావుగారు, సరస్వతీనదిలాగ (అంతర్వాహిని) మద్దుకూరి చంద్రశేఖరరావు గారు ఆ నగరంలో సంగమించారనీ తరంగించీ ప్రవహించీ ఆ నగరాన్ని శుభ్రపరిచారనీ… మానవజాతి మనుగడకై మంచి పంటలు పండించను యోగించారనీ చెప్పింది.
కుళ్ళుకంపు కొట్టే పాత ఆచారాలనూ, విర్రవీగి తిరిగే రౌడీమూకలనూ అణచడానికి, అంతం చేయడానికి యువతీ యువకులను ఉత్తేజపరిచింది వారేనని చెప్పింది…
వారు నగరంలోనే కాక రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజాసంఘాలు నెలకొల్పారని… ఆ సంఘాల అభివృద్ధికోసం ఆఫీసులను పెట్టాలని ప్రజల చైతన్యపరిచేదానికోసం పత్రికలను నడపాలని యోచించారని చెప్పింది.
ఆ మహనీయులు వారికున్న ఆస్తులను అమ్మి సొమ్ముగ మార్చి వాటి నిర్మాణం కోసం, వాటిని నడపడం కోసం వినియోగించారని చెప్పింది. ఆ త్యాగమూర్తులు భోగభాగ్యాలకోసం, అధికారాలకోసం చూడలేదనీ వాటిపై వారికి ఎలాంటి వ్యామోహం లేదనీ… స్వాతంత్య్ర సముపార్జన కోసం, సమసమాజ నిర్మాణం కోసం వారు చూశారనీ పనిచేశారనీ చెప్పింది.
ఆ నిరాడంబరులు నిర్మించిన ఆఫీసులకు వచ్చే యువకులతోనూ, వారు జరిపే సభలకొచ్చే జనంతోనూ సందడించిన వీధులూ…, వారిచ్చిన స్ఫూర్తితో ఎర్రజెండాల తలపాగాలెట్టుకుని అందగించిన ఇంద్రకీలాద్రి పర్వతాలూ అందరికీ సుస్వాగతమంటుంటే… ఆ నగరంవైపు చూడని వారుంటారా? అంది.
”ఎర్ర జండాల రెపరెపలతో కనువిందు చేసే… విజయ వాడంటే… నాకెంతో ఇష్టం. నీక్కూడ ఇష్టమే. కాదంటావా?” అని అడుగుతూనే వినిపించింది.
”కర్నూలు జిల్లాలో నేను పుట్టినా… కన్నతల్లికంటె మిన్నగ కమ్యూనిస్టు పార్టీ నన్ను పెద్దదాన్ని చేసింది. ఆ పార్టీకి విజయవాడ కేంద్రమైంది. నాలాంటివారికోసం రాజకీయ పాఠశాలలు నడిపింది. ఆత్మీయంగా పెంచిన అమ్మనూ, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలనూ విస్మరించే మనుష్యులు వుంటారా? అని ప్రశ్నించింది. ఇలా నా స్మృతిపథంలోని రాజమ్మను చూస్తుంటేనూ, రాజమ్మకు ఇష్టమైన విజయవాడను తలుచుకుంటుంటేనూ… నా మనసులోకి ఎన్నో ఆలోచనలు చొరబడుతున్నాయి.
రాజమ్మా నేనూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లోకి వెళ్లడానికి మమ్మల్ని ఉత్సాహపరచీ నచ్చచెప్పీ ఆ రంగాల్లోకి మేము ప్రవేశించడానికి దోహదం చేసిన మద్దుకూరి చంద్రం గారు - శ్రీశ్రీ సాహిత్యాన్ని గూర్చి మాకు చెపుతూ… శ్రీశ్రీ బాల్యాన్ని గూర్చి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
”శ్రీశ్రీ 1910లో ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలో అప్పల కొండమ్మ అనే ఆమెకు పుట్టాడట. శ్రీశ్రీ పుట్టిన ఆరుమాసాలకే అప్పల కొండమ్మ చనిపోయిందట. శ్రీశ్రీ ఎందిరి తల్లుల పాలో తాగుతూ ఎదుగుతున్నాడట. శ్రీశ్రీ తండ్రి సుభద్రమ్మ అనే ఆమెను రెండవసారి పెండ్లి చేసుకున్నాడట. సవతితల్లి సుభద్రమ్మ శ్రీశ్రీని కుమారునిగ చూడక పరాయివానిగ చూస్తూ బాధపెడుతుందని బంధువుల్లో కొందరు అంటూ వుండేవారట. బంధువులంటున్నట్లు గాకుండా సుభద్రమ్మ శ్రీశ్రీని కన్నతల్లికంటే ఎక్కువగ చూసేదట. ఆమె ప్రేమతో పెరుగుతున్న శ్రీశ్రీ బంధువులను లెక్కచేయక ఆమెను మరింత ప్రేమగ చూసేవాడట” అంటూ చెప్పారు.
ఈ కారణాల వల్లనే శ్రీశ్రీ సాహిత్యంలో ముఖ్యంగా మహాప్రస్థానంలో మాతృస్పర్శ తొంగిచూస్తుందని పరిశీలకులు అన్నట్లుగా చంద్రంగారు చెపుతూ శ్రీశ్రీ కవిత్వంలోని రసధునీ, మణిఖనీ, జననీ, కవితా, ఓకవితా… అనేవి వినిపించారు.
చంద్రంగారు చెప్పిన శ్రీశ్రీ బాల్యాన్ని గుర్తుచేసు కుంటుంటే…తాపీి రాజమ్మ కూడా తల్లికి దూరమైనా…కమ్యూనిస్టు పార్టీకి చేరువై ఆ పార్టీ నాయకులకు అభిమాన పుత్రికై ఆ పార్టీకి కేంద్రమైన విజయవాడను పుట్టిల్లుగ భావిస్తుందేమో…కన్నవారిగ పార్టీ నేతలను చూస్తూ విజయవాడలోనే ఎక్కువ రోజులు వుండాలని కోరుకుంటుందేమో అనిపించింది.
ఎగరేసిన ఎర్రని జండా…రుద్రాలికనైన జ్వాలిక
కావాలోయ్‌ నవకవనానికి” అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గీతాన్ని గానం చేసిన రాజమ్మ విజయవాడ వీధుల్లో ఎర్రజండాను ఎగరేసిన రాజమ్మ విప్లవం వర్ధిల్లాలని నినదించిన రాజమ్మ ”విజయవాడ వీధివీధి నన్ను పలకరిస్తున్నట్లు కనిపిస్తుంది” అనడానికి గల కారణాలైనవి కొన్ని నా కండ్లకు కనిపిస్తున్నాయి.
తొలి రాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ గాంధీనగరం జింఖానా గ్రౌండ్‌లో జరుగుతున్నప్పుడు రాజమ్మ సభావేదికపై ప్రజాకళాకారులతో కలిసి ఫాసిస్టు వ్యతిరేక గీతాలను పాడి, ప్రదర్శనల్లో పాల్గొని హిట్లరు, ముస్సోలిని ఇంత దుర్మార్గులా…? అనేటట్లుగ ప్రేక్షకులను ముగ్దులను చేసింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని గూర్చి ఆలోచింపచేసింది.
విజయవాడ ప్రతి సెంటరులోనూ తిరుగుతూ…ప్రజాశక్తి పత్రికల నమ్ముతూ స్త్రీల వెంటబడే రౌడీలను లెక్కచేయకుండాను భయపడకుండాను ఎక్కువ పత్రికలు అమ్ముడుపోవడానికి ‘పాలపేణి లాంటిది ప్రజాశక్తంటూ’ పాడుతూ పత్రికలను అమ్మింది.
హనుమంతరాయ గ్రంథాలయంలో మహాకవి గురజాడ వర్ధంతిని అభ్యుదయ రచయితల సంఘం జరుపుతుంటే… ఆ సభలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథను గానంచేసి బాల్యవివాహాలు నశించాలని పిలుపునిచ్చింది. దేశభక్తి గీతం పాడి దేశభక్తిని రేకెత్తించింది. దేశభక్తి గీతం ప్రార్థనాగీతం కావాలనే సంకల్పం పెద్దలకు కలిగించింది.
మొగల్‌రాజపురంలో ప్రజాశక్తి నగరం ఏర్పడడానికి సహకరించింది. ఆ నగరంలో కమ్యూన్‌ నడిపే బుల్లెమ్మగారికి కుమార్తెగా తోడ్పడుతూ కమ్యూన్‌ నడపడానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. అక్కడ భోజనం చేసే కామ్రేడ్సుకు వేళకు భోజనం సమకూర్చుతూ, పెడుతూ వారికి తల్లిగ చెల్లిగ కనిపిస్తూ వారి మన్ననల నందుకుంటూ అక్కడే కొన్నాళ్లు వుంది.
సూర్యారావుపేట (డాక్టరు అచ్చమాంబ గారి ఇంటిదాపున)లో మహిళాసంఘం ఆఫీసులో పనిచేస్తూ అక్కడుంటూ అచ్చమాంబ, మానుకొండ సూర్యావతి లాంటి మహిళా కార్యకర్తలకు తన సహకారాన్ని అందించింది. రాష్ట్ర మహిళా మహాసభ జరుగుతుంటే… వేయిమందితో నడుస్తున్న ఊరేగింపులో పాల్గొని ”ఈనాడే స్త్రీలంత ఏకమవ్వాలి. ధారాళముగ శక్తి ధారబోయాలి. పోరాటముల మధ్య పోరి గెలవాలి.” అంటూ నినాదాలిస్తూ పోలీసుల లాఠీదెబ్బలు తింటూ జైలుకెళ్లి సమరయోధురాలనిపించుకుంది.
ఈ విధంగా విజయవాడలో 1943 నుండి జరిగిన అఖిల భారత రైతు మహాసభ దగ్గర నుండి 1948 వరకు పార్టీ జరిపిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ నటిగ, గాయనిగ, వాలంట్రీగ, కార్యకర్తగ పనిచేసింది. నిస్వార్ధంగ నిబద్ధతతో పనిచేసింది రాజమ్మ అనిపించుకుంది.
రాజమ్మను విజయవాడ వీధివీధి పలకరించడానికి కారణాలు యివేనేమో? అని నేను అనుకుంటున్న సమయంలోనే…
రాజమ్మను మరణించే వరకూ విజయవాడే గాకుండ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలు సైతం స్వాగతం పలికాయి గదా? అనే ప్రశ్న నాముందుకొచ్చింది.
మన్యపు వీరుడు అల్లూరి సీతారామరాజు కథను, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేసిన ఆ వీరుని విప్లవాగ్నిని బుర్రకథ రగడలో పొదిగి రాజకీయాలలో మేళవించి దేశభక్తి పెంపొందగ రాగయుక్తంగ కథాగానం చేస్తూ వందల వేదికలపై రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో పార్టీ నిర్ణయించిన స్థలాల్లో డక్కపై తాళంవేస్తూ వినిపించినందుకూ…
తెలంగాణా సాయుధపోరాటాన్ని బలపర్చుతూ ”దున్నేవానికే అన్ని హక్కులంటూ, దోచేవానికి దోహదం ఈయమంటూ” మా భూమి నాటకంలో సీతమ్మై పోరాటయోధులకు ఊతమిస్తూ… ”ఒక వీరుడు మరణిస్తే… వేలకొలది ప్రభవింతురు. ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు” అంటూ సమరయోధులకు విశ్వాసాన్ని కలిగిస్తూ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకూ…
రాష్ట్ర మహిళా సంఘ కార్యవర్గ సభ్యురాలుగా మహిళాభ్యు దయంకోసం, మహిళా సంఘం పెరిగేదానికోసం మూఢనమ్మకాలు, మూఢాచారాలు నశించేదాని కోసం గ్రామాల్లోనూ పట్నాల్లోనూ పాటలు పాడుతూ, ప్రసంగిస్తూ మహిళా సంఘ సభ్యత్వాన్ని పెంచుతూ, విరాళాలు స్వీకరిస్తూ పట్టుదలగ పనిచేసినందుకూ…
మంచిని పెంచే తత్వం గల రాజమ్మను మంది ప్రేమిస్తూ అవసరమనుకున్నప్పుడు ఆహ్వానిస్తున్నారనేదే… ఆ ప్రశ్నకు సమాధానమనుకున్నాను.
తెలుగువారి కళా, సంస్కృతీ దీప్తి చెందడం కోసం, కమ్యూనిస్టు పార్టీ విలువలు దశదిశల నింపడం కోసం అవిశ్రాంతిగ పనిచేసిన తాపీ రాజమ్మ నా స్నేహితురాలు కావడం నా అదృష్టంగా భావించాను.
1952లో కమ్యూనిస్టు పార్టీపైనున్న నిషేధాలను ప్రభుత్వం వారు తొలగించారనీ, అజ్ఞాతవాసం చేసే నాయకులు, జైళ్ళల్లో వున్న నాయకులు బైటికొస్తున్నారనీ, పార్టీ ప్రముఖులు విజయవాడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారనే వార్త విన్న తాపీి రాజమ్మ అంబరమంత సంబరంతో సభావేదిక దగ్గరకొచ్చింది. ప్రజాకంటకుడు పళని యప్పన్‌ చేతికి చిక్కకుండా ప్రాణాలతో బైటకొచ్చిన తన ప్రియతమ నాయకులను చూసింది. ఆనందాశ్రువులు రాల్చుతూ చెంగుచెంగున వేదికనెక్కింది. తన మామగారు (తాపి ధర్మారావుగారు) ఇచ్చిన బంగారు ఆభరణాలను వంటిపైనుండి తీసి (శ్రీనివాసునకు భక్తులు సమర్పిస్తున్నట్లుగ) సుందరయ్యగారికిస్తూ ‘వందనం’ అంది. కరతాళధ్వనులతో సభాప్రాంగణం మ్రోగుతుండగా సభలో ఓ పెద్దాయన లేచి రాజమ్మవైపు చూస్తూ… ఈమె ”ఉద్యమ కేదారంలో పూసిన మందారం” అన్నాడు. ఆ మాటవిన్న నాకూ ఆనందం కలిగింది. రాజమ్మ కళ్లనుండి జారినట్లుగానే నా కళ్లనుండీ ఆనందాశ్రువులు రాలాయి.
ఇలా సమసమాజ నిర్మాణం కోసం రాజమ్మేసిన అడుగులనూ అంకితభావంతో రాజమ్మ నడిచిన తీరునూ నేను చూస్తుంటే… నా గొంతు నుండి నా పెదవుల మీదికి… శ్రీశ్రీ రాసిన

”పసిడి రెక్కలు విసిరి కాలం
పారిపోయిన జాడలేవి?
ఏవి తల్లీ” అన్నవి వచ్చాయి.
ఏవి తల్లీ? నిరుడు పూసిన ఎర్రమందారాలు.
ఎక్కడమ్మా రౌడీలనణచిన యువకిశోరాలు. అనేవి
అప్రయత్నంగ.. పెదవులు దాటి.. బైటకొచ్చాయి….

ముద్దమందారంలాగా పెద్దలకు కనిపించిన రాజమ్మ ఈ లోకాన్ని వీడి అమరురాలయ్యే రెండురోజులముందు కూడ తన చిన్నకుమార్తెను ”దేశమును ప్రేమించు”మనే గురజాడ వారి దేశభక్తి గీతాన్ని గానం చేయమని కోరిందట. కుమార్తె పాడుతుంటే… ”వరస తప్పినట్లుందమ్మా!” అందట. వరస వినిపించడానికి ప్రయత్నించి ”గొంతు సహకరించడం లేదమ్మా!” అందట. మరణశయ్యపైన నరకయాతన పడుతూ కూడా దేశభక్తినీ, సంగీత, సాహిత్యాలను మరిచిపోని రాజమ్మ అమరురాలైనా… మరోలోకానికి వెళ్లినా మరచిపోలేమనిపిస్తుంది.
”మరో ప్రపంచం పిలిచిందంటూ” మరచిపోని, మరణంలేని సాహిత్యాన్నిచ్చిన శ్రీశ్రీని మహాప్రస్థానం అట్టమీదున్న ఫోటోలు చూస్తూ ఇక్కడ కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు శ్రీశ్రీ శతజయంతి వుత్సవాలు జరుపుతున్నారు గదా!
మరో లోకమంటూ ఒకటుంటే… అమరులైన మావాళ్లంతా అక్కడుంటే… అమరురాలై అక్కడున్న మా రాజమ్మ శ్రీశ్రీ కవితలను గానం చేసిన రాజమ్మ శ్రీశ్రీని చూస్తూ శతజయంతి వుత్సవాలను గూర్చి యోచించకుండా వుంటుందా? వుండదు గాక వుండదు.
మర్దుకూరి చంద్రం గారితో సంప్రదిస్తుంది. వుత్సవ ఏర్పాట్లను సుంకర సత్యం గారిని చేయమని కోరుతుంది. తాతాజీ అధ్యక్షతను, ఆరుద్ర, ఆత్రేయ, క్రిష్ణశాస్త్రీ మొదలైనవారి ఉపన్యాసాలతో గరికిపాటి రాజారావుగారి ”పొలాలనన్నీ హలాలదున్ని” అనే గేయనృత్యంతో, శ్రీశ్రీ గారి శతజయంతి మహాసభ జరుగుతుందనీ, అమరులంతా ఆహ్వానితులేనంటూ ప్రకటన చేయిస్తుంది. నిండుసభలో ఉన్నతాసనంపై శ్రీశ్రీని కూర్చోబెట్టి తుమ్మల వెంకట్రామయ్య గారితో ఇంతలేసి కళ్లతో చూస్తున్న శ్రీశ్రీకి ఘనసత్కారం చేయిస్తుంది. తాను…”

ఆనందం ఆర్ణవమైతే…అనురాగం అంబరమైతే
అనురాగపు అంచులు చూస్తామ్‌. ఆనందపులోతులు తీస్తాం”

 నే గీతం గానం చేస్తుంది. అమరలోకంలో మహాకవి శతజయంతి అందంగా జరిగిందని పత్రికలతో అనిపిస్తుంది. అని అనుకుంటుంటే… నా మనసుకు ఏదో తృప్తిగా వుంది.
ఈ ఊహల నుండి వాస్తవంలోకొచ్చిన నేను
”నిజంగానే నిజంగానే నిఖిలలోకం హసిస్తుందా?
మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా?”
అనుకుంటూ… సృజనాత్మకమైన వచన, పద్య, కవితా ప్రక్రియల్లో సూరీడై వెలుగుతూ… యుగకవిగ, మహాకవిగ పిలుపించుకుంటున్న శ్రీశ్రీని
ఆశయం, త్యాగం ఆభరణాలుగ అలంకరించుకుని ఉద్యమ కేదారంలో పూసిన మందారమనిపించుకున్న తాపీ రాజమ్మని నా… జ్ఞాపకాల్లో చూస్తూ… విప్లవాభివందనాలర్పిస్తున్నాను.

Sunday, June 5, 2011

ఈనాడు సండే మేగజైన్ లో "మెలకువ సందర్భం" మీద వచ్చిన రివ్యూ.


ఈ రోజు ఈనాడు సండే మేగజైన్ లో నా రెండో కధల సంపుటి "మెలకువ సందర్భం" మీద వచ్చిన రివ్యూ.
http://www.eenadu.net/htm/2vnewhomoe.asp

Saturday, June 4, 2011

"హాయేరే వొ దిన్ క్యోం న ఆయీ"



పాట వింటున్నపుడల్లా గుండెల్లో ఏదో లుంగచుట్టుకుంటున్న.
ఫీలింగ్
లతా గొంతు లోని ఆవేదనతో రవి శంకర్ సంగీతం కలగలసి
నరాలను మెలిపెడుతున్న అనుభూతి.
చేజారిపోయిన మధుర క్షణాలను
తలచుకుంటూ ఒంటరితనంలో వేగిపోతూ అనురాధ ఆలపించే ఈ పాట సూటిగ గుండెల్ని తాకుతుంది.
విన్న ప్రతి సారీ అవ్యక్తమైన బాధతో గుండె అదురుతున్న అనుభూతి.
వేల గొంతులొక్కసారిగా తమ ఆత్మ ఘోషల్ని ఆర్ద్రంగా ఒకే గొంతుకలో
ఒలికించినంత అనుభూతి
గుండె చిక్కబట్టడం అంటే ఇదే కాబోలు
వేలాది స్త్రీల అంతరంగ సంఘర్షణని తన గానంలో ఒలికించిన లత
నరాల మీద నాట్యం చేసిన రవిశంకర్ సంగీతం
అన్నీ కలగలసి ఈ పాట నా లోపల్లోపల
ఒక అలజడిని ఒక కల్లోలాన్ని రేపింది.
మసక మసకగ ఓ ఆత్మీయ స్త్రీమూర్తిని నా కళ్ళ ముందు ఆవిష్కరించింది.
చిద్రమౌతున్న మానసంబంధాల సంక్షోభాన్ని
నగ్నంగా నా ముందు సాక్షాత్కరింప చేసింది
ప్రేమ రాహిత్యపు విక్రుత పార్శ్వాన్ని
నా నట్టెదుట నిలబెట్టిన ఈ పాట
నా మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది.
(ఈ పాట అనురాధ అనే హిందీ సినిమా లోది)

Thursday, June 2, 2011

స్త్రీల చైతన్యానికి ప్రతీకలు ఈ కథలు



నా రెండో కధల సంపుటి "మెలకువ సందర్భం".
ఈ పుస్తకాన్ని ఎమెస్కో వారు పబ్లిష్ చేసారు.
ఈ పుస్తకం వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది.
భూమికలో శిలాలోలిత రాసిన సమీక్ష ఇది.
డా.శిలాలోలితస్త్రీల హక్కులగురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి తన గొంతును వినిపిస్తూ, ఆ దిశలో కృషి చేస్తున్న జీవనయానం ఆమెది. కొండవీటి సత్యవతిలో చిన్నచిన్న సంఘటనలను కథలుగా మలిచే నేర్పు వుంది. తాత్త్వికత, ఆర్ద్రగుణం, స్పష్టత, సూటిదనం ఈమె కథలను, సాధార ణమైన కథలుగా కాక, చర్చనీయాంశమైన కథలుగా నిలుపుతున్నాయి.
పాత్రల్లోకి ప్రవేశించి వాటిలోని ఘర్షణను, నిబద్ధతను రూపొందించే నైపుణ్యం వలన, కథల్లో ఎన్నుకొన్న పాత్రలు ఘర్షణ నుండి ఏర్పడిన తాత్వికాంశతో మన ముందు నిలబడతాయి. తమనుతాము స్థిరంగా నిలుపుకుంటాయి, కథలోని వస్తువును తేలికగా పాఠకుడు అర్థంచేసుకునే సౌలభ్యంతో పాటు, కథకురాలి ప్రాపంచిక దృక్పథమేమిటో కథల్లో స్పష్టంగా తెలుస్తుంది.
పాఠకుడికి ఇవన్నీ తన చుట్టూ రోజూ జరుగుతున్నవేనని, కన్పిస్తున్నవేననే భావన కలగడంతో పాటు, తాను ఆయా ప్రత్యక్షపరోక్ష సందర్భాల్లో స్పందించి వ్యవహరించే తీరును గుర్తుచేసుకుని, ఆత్మవిమర్శ చేసుకునే అవసరాన్ని ఈ కథలు కలగజేస్తాయి. దీనివల్ల కథల్ని ఎవరికి వారు తమ కథలుగా, సజీవమైన జీవితానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా భావించుకునే స్థితివుంది. ఇదంతా కథకురాలి రచనాశిల్పం వల్లనే సాధ్యమైంది. స్థలకాలాల పరిమితుల్నిదాటి పరిశీలించిన కథలుగా మాత్రమేకాక, మనిషి అంతర్లోకాల సంఘర్షణని రచయిత్రి ఆవిష్కరించడం ఇందువల్లనే సాధ్యమైంది.
ప్రత్యేకంగా ఇందులోని స్త్రీ పాత్రల గురించి ప్రస్తావించాలి. ‘విందుతర్వాత’… కథలోని మాధవి, ‘సౌందర్యీకరణహింస’లో అరుణ, ‘గూడు’లో చందన, ‘గంగకు వరదొచ్చింది’లో గంగ, ఈ పాత్రలు తమచుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని చూడలేక ప్రశ్నించడానికి ఉద్యుక్తమయ్యే పాత్రలు. మాధవి ఆదర్శంగా చూపబడుతున్న అంశాల్లోని చీకటి కోణాల్ని అసహ్యించుకుంటుంది. తెచ్చిపెట్టుకున్న ఔదార్యాలలోని డొల్లతనాల్ని, మానవత్వం పేరుతో చెలామణి అవుతున్న అంశాల్ని చర్చలోకి తెస్తుంది. చందన-అరుణల పద్ధతి కూడా ఇదే! ఇళ్ళు కట్టించే ప్రభుత్వపథకాలవల్ల సగటుమనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, నీడకోసం పాకులాడుతూ, కూడే లేని పరిస్థితిలోకి నెట్టబడటం వంటి సూక్ష్మమైన అంశాలవైపు చందన దృష్టి మరల్చి, చర్చలోకి తెస్తుంది.
అరుణ’ మనిషితనంపై లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యంగా అనిపించినా సామాన్యమైనవి మాత్రమే కావు. కనీసవసతులు కరువైన జీవితాలవైపు దృష్టి సారించమనే విషయాన్ని చర్చకు పెట్టడంతోపాటు, ‘అభివృద్ధి’ నినాదంతో సాగుతూ ప్రభుత్వాలు ఏయే వాస్తవకోణాల్ని విస్మరిస్తున్నాయో చూపడం అరుణలోని అసలు లక్ష్యం. ఆ లక్ష్యం కోసం గొంతెత్తడం మినహా మరోదారి లేదంటుంది. ‘గంగ’ పాత్రలోని సంఘర్షణ నుంచి చర్చకు వచ్చే అంశం, స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలోని అడ్డంకులు. పథకాలు ఎంతగా స్త్రీలలోని మానసిక ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయో చూపుతాయి. అంతే కాకుండా, తరతరాలుగా స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన మానసికప్రపంచం సంసిద్ధమై లేకపోవడం, అందువల్ల ఎదురవుతున్న పరిస్థితులు. అటువంటి స్థితి వల్ల ఒకడుగు ముందుకు వేసినట్లు కన్పిస్తుంది. ఈ కథలో గంగ, ఆదెమ్మ వంటివారు ఎదుర్కొన్న పరిస్థితులు ఇందులోని భాగమే. డ్వాక్రా పథకంలో ముందుకు వేసిన అడుగులు, మైక్రోఫైనాన్స్‌ విషయంలో అవగాహన కొరవడటం వల్ల వెనకడుగులు వేయడం గమనించవచ్చు. స్త్రీలకు నాయకత్వ నైపుణ్యం వున్నా, అవగాహనచైతన్యం రూపుదిద్దకుండా, పథకాల్ని ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే దుష్పరిణామాల్ని గంగ మానసికసంక్షోభంలో చూడవచ్చు.
ఈ పాత్రలు సామాజిక అంశాలను చర్చకు పెట్టినవి అయితే, స్త్రీల జీవితాల్లోని అంతర్లోకాలను, పాలపుంతలోని మధుర, ‘చీకటిలోంచి చీకటిలోకి’ లోని ఊర్మిళ. ‘ఐతే’ లోని జానకి పాత్రలలో చూడవచ్చు. హెచ్‌.ఐ.వి. బారిన పడిన మధురలోని మానసిక పరిపక్వత, స్త్రీపురుషుల మధ్య నెలకొనాల్సిన అపురూపమైన ప్రేమను నిర్వచించగలిగిన స్థిరచిత్తం అబ్బురపరుస్తాయి.
”సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే వుంటుంది. దాన్ని గుర్తించడంలోనే వుంది మన తెలివంతా” అంటుంది - ‘మధుర’. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల్ని కూడా మరిచిపోయేంత జీవననానుకూల దృక్పథం ఈమెలో తొణికిసలాడుతుంది. అందువల్లే తనలాగే వ్యాధి బారిన పడిన -వయసులో తనకన్నా చిన్నవాడైన యువకుడితో సహజీవనం చేయడం కోసం సన్నద్ధమైంది. ఆత్మవిశ్వాసప్రతీకగానే కాక, జీవితపు ఆర్ద్రమైన ఆత్మీయకోణం ఏమిటో ఈమె మాటల్లోంచి కూడా ఆమె జీవనానందాన్ని ప్రోది చేసుకో గలుగుతుంది. ‘చీకట్లోంచి చీకటిలోకి’లో ఊర్మిళ ఆచారవ్యవహారాల వ్యవస్థలోని లోపాలను, తప్పనిసరితనంలోని విసుగును కప్పి పుచ్చుకుని కుటుంబం కోసం నిలబడుతుంది. పైకి నోరెత్తకుండా వున్నట్లువున్నా ఆమెలో లోలోపలి పెనుగులాటను, కుటుంబవ్యవస్థలో స్త్రీ స్థితికి ప్రతీకగా చూడవచ్చు. ఏ భర్త క్షేమంకోసమైతే తాను అనారోగ్యంగా వున్నా, వ్రతం చేసిన నాగలచ్మి, అదే భర్త చేతుల్లో దెబ్బలు తిని చనిపోతుంది. ఇవన్నీ నేటి స్త్రీ పరిస్థితికి వాస్తవరూపాలు. ఆచార వ్యవహారాలోని లొసుగుల్ని చూపడంతో పాటు, అందులో భాగంగా స్త్రీల మానసికతను దర్శింపచేయడం ద్వారా కథాలక్ష్యం నెరవేరింది.
‘ఐతే- కథలో జానకి పాత్ర స్త్రీవాదప్రతీక. తమ ప్రేమ రాహిత్యంతో బతుకువెళ్ళమార్చలేక పెనుగులాడుతున్న స్త్రీలకు ప్రతీక. తాను యిష్టపడిన బాలసుబ్రహ్మణ్యంతో అరవై ఏళ్ళవయసు వచ్చినా, జీవితం పంచుకోవడానికి సిద్ధపడుతుంది. దీనివెనుక గడిచిన జీవితసంఘర్షణ వుంది. భార్యగా తాను పడిన మానసికసంక్షోభం వుంది. పురుషుడి వైపే అన్ని వేళలా మొగ్గు చూపే సమాజవ్యవస్థ ప్రభావం వుంది. పురుషుడి లోపాలను కూడా సహించగలిగిన సానుకూలవ్యవస్థ వుంది. పురుషుడికి లేని, స్త్రీకి మాత్రమే వర్తింపజేసే నీతిసూత్రాల వల్లింపు వుంది. వీటన్నింటినీ నిరాఘాటంగా అమలుపరిచే పితృస్వామిక అధికారపు హంగువుంది. వీటిని ఎదిరించే తెగువను జానకి ప్రదర్శించి, దానివల్ల ఎదురైన కష్టనష్టాల్ని ఎదుర్కొని, ఒక్క కూతురుతప్ప తనకు తోడు నిలవని స్థితిలో సైతం తాను కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతుంది. కూతురి అండ కేవలం ఆ సందర్భంలోకి పరిమితమై చూడలేం. స్త్రీ ముందడుగులోని భవిష్యత్తును దర్శింపచేసిన ప్రతీకగా కూతురిని చూడాలి.
స్త్రీవాద ఉద్యమం లేవనెత్తిన అంశాలు, ఉద్యమించిన సందర్భం, స్త్రీ స్వేచ్ఛ కోసం ఎడతెరిపి లేకుండా జరుగుతున్న చర్చల నేపథ్యం - ఈ కథకు ప్రేరణలు. సత్యవతి ఈ కథను ముగించిన తీరు ప్రశంసనీయం. తరాల తర్వాత స్త్రీ సగర్వంగా నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటుండడం వెనుక వున్న సంఘర్షణకు అద్దం పట్టింది ఈ కథ.
”నేను దుఃఖంలోంచి సుఖంలోకి, స్వేచ్ఛలోకి వెళ్ళాలను కుంటున్నాను. నన్ను ఆపకండి. నాకు విడాకులు కావాలి” జానకి 60 ఏళ్ళుగా తనలో దాచుకున్న పెనుగులాటలోంచి సాధించుకున్న స్వేచ్ఛకు ప్రతిరూపమైన మాటలివి. ఈ మాటల సారాంశం స్త్రీవాద ఉద్యమం ఎగరేసిన బావుటా.
‘ఎగిసిపడిన కెరటం’ - కథ ఒక ఉద్వేగతరంగమే. మనం కూడా అనసూయత్త జీవితంలోకి నేరుగా ప్రవేశిస్తాం. సంఘర్షిస్తాం. విచలితులమవుతాం. పరిష్కార మార్గంతో ఏకీభవిస్తాం. అలాగే, ఆదర్శాలు కరిగిపోయి రమేష్‌లోని అసలురంగు బయటపడినప్పుడు భార్యగా కొనసాగలేననే నిర్ణయం తీసుకున్న అరుణ, ఆ నిర్ణయం తీసుకోవడంలో చూపిన తెగువ ‘మెలకువ సందర్భం’ కథలో కన్పిస్తుంది. ఎక్కడా తన జీవితం మీద తనకు నమ్మకం లేనితనం కన్పించదు. అలాగని భవిష్యత్తులో ఏమైపోతానో అనే దిగులులేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడేతనం అరుణలో నిండివుంది. అందువల్లే జానకిలా జీవితచరమాంకం వరకూ ఎదురుచూడకుండా తాను ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో తక్షణమే అవగాహన చేసుకుని, దాని కనుగుణంగా తాను తీసుకోదగిన నిర్ణయం వెనువెంటనే తీసుకొంది. ‘హమ్‌ చలేంగే సాథ్‌ సాథ్‌’లో కలిసి జీవించడానికి ముందే, చర్చించుకోవడం, జీవనసాఫల్యాన్ని సాధించుకున్నదిశగా పయనించడం స్పష్టంగా కన్పిస్తుంది. తరాలు మారుతున్న కొద్దీ స్త్రీ మానసికంగా దృఢమవుతున్న పరిణామాన్ని ఈ మూడు పాత్రల్ని విశ్లేషించుకుని రూఢిపరచుకోవచ్చు.
స్త్రీవాద దృక్పథంతో, చైతన్యంతోవున్న ఈ కథల్లోని స్త్రీలు, పిరికివాళ్ళు కాదు. సర్దుకుపోయే గుణాలు లేవు. ప్రశ్నించడం నేర్చుకున్న వాళ్ళు. గొప్ప చైతన్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంకోసం, స్వేచ్ఛకోసం, తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలిగే తెలివైన స్త్రీలు, బుద్ధిజీవులు, అంతర్గతచైతన్యాన్నుంచి, ఘర్షణ నుంచి జీవితసాఫల్య నవనీతాన్ని సాధించుకున్న ధీరవనితలు. సమాజంలో నేడున్న స్థితిలో స్త్రీలు తమతమ జీవితాలను మణిదీపాలుగా వెలిగించుకోవడమే కాక, తోటి స్త్రీల బ్రతుకుల్లో కూడా ఆత్మవిశ్వాసం తొంగిచూడాలనే ఆకాంక్షను ధ్వనిస్తాయి ఈ కథలు. కొండవీటి సత్యవతి కథకురాలుగా చూపిన పరిణితిని ఈ పై కథల్ని చర్చించడం ద్వారా ఎత్తిచూపడం నా ఉద్దేశ్యం. అంతేకాక చర్చనీయాంశాలైన అనేక సమస్యల్ని ఈమె కథావస్తువులుగా ఎంచుకొని, ఏరుకున్న సంకేతాలుగా ప్రదర్శించి చూపారని చెప్పడం మరో ఉద్దేశ్యం.
‘భూమిక’ స్త్రీవాదపత్రిక సంపాదకురాలుగా, హెల్ప్‌లైన్‌ నిర్వాహకు లుగా మహిళా ఉద్యమంలో భాగస్వామిగా దశాబ్దిన్నర కాలంనుండి పనిచేస్తూ వికసనం చెందిన మానసిక ప్రపంచాన్ని ఈ కథల ద్వారా ముందుకు తెచ్చారు కొండవీటి సత్యవతి. ‘ఉత్తమ జర్నలిస్ట్‌ అవార్డ్‌’, సంపాదకీయాలకు ఉత్తమ ‘లాడ్‌లీ’ అవార్డ్‌, జెండర్‌ సెన్సిటివిటీకి ‘నేషనల్‌’ అవార్డ్‌, ‘ఆమెకల’ కథాసంపుటికి ‘ఉత్తమరచయిత్రి’ అవార్డ్‌ (తె.యూ.) రంగవల్లి అవార్డ్‌ వంటి ఎన్నో ఈమె సాహితీకృషికి మచ్చుతునకలు మాత్రమే.
పరిణిత దృక్పథంతో పాటు, అనువైన రచనాశిల్పంవల్ల ఈ కథల్లో వస్తువుగా తీసుకున్న అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. చర్చను ప్రేరేపిస్తాయి. కథలలోని వస్తువులు సుపరిచితంగా కన్పించినా, వాటిని మలిచిన తీరువల్ల ‘అట్టడుగున కాన్పించని కోణాలెన్నో దర్శించే అవకాశం ఈ కథలలో కలిగింది. జానకి, మధుర, వసుధ, చందన. వసంత, అనసూయ, ఊర్మిళ, సంహిత, నాగలచ్మి, విశాల, అరుణ పేరేదైతేనేం? అందరూ ఒక్కరూపాన్ని ఒకే రకమైన బాధని, ఒకేరకమైన వివక్షని, అణచివేతని, ఒక రకమైన భావజాలాన్ని తొడుక్కొని మనముందున్న అసలు సిసలైన ప్రతీకలు. మీరూ ఓ సారి వాళ్ళ ఈ జీవితపు మారుమూల పార్శ్వాలను చూద్దురుగాని రండి. వాళ్ళే మీకు సమస్తాన్నీ వివరించుకుంటూపోతారు.

Wednesday, June 1, 2011

అమెరికాలోను మన ఆడపిల్లకి ప్రాణగండమే!



భారత దేశం సరే వెనుకబడిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఆడపిల్లల్ని తల్లిదండ్రులే చంపి పాతేస్తున్నారు. పిండాల్నయితే కడుపులోనే కరిగించేస్తున్నారు. ఒక్కళ్ళా? ఇద్దరా? 2005 నుండి 2011 వరకు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 78,847 మంది ఆడపిండాల్ని గుట్టుచప్పుడు కాకుండా గర్భంలోనే చంపేసారు. 2001లో 1000 మందికి 927 వుంటే, 2011లో దారుణంగా 914కి పడిపోయింది. ఆడపిల్లల్ని చంపుకోవడంలో చాలా అభివృద్ధిని సాధించాం. మహిళల మీద పెరిగిపోతున్న హింసల్లో అత్యంత అభివృద్ధిని సాధించాం.

భారతదేశం మొత్తం మీద 2005-11 మధ్య కాలంలో 1,078,378 మంది ఆడపిల్లలు పుట్టకుండా హతమైపోయారు. అందులో 78,847 మంది పిల్లలు మన రాష్ట్రంలోనే చంపేయబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధమవుతోంది. వీధి వీధికీ అల్ట్రాసౌండ్‌ మిషన్‌లు పెట్టి పుట్టబోయేది ఆడో, మగో తెలుసుకుని ఆడపిండాల్ని అంతం చేసేస్తున్నారు.

అన్ని రకాలుగాను వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2004-08 మధ్యకాలంలో స్కానింగ్‌ సెంటర్లు 146% పెరిగాయని, అదే విధంగా నల్గొండ, అనంతపూర్‌,కడప జిల్లాల్లో కూడా విపరీతంగా స్కానింగ్‌ మెషీన్లు వెలిసాయి.మహబూబ్‌నగర్‌లో ఇన్ని స్కానింగ్‌ మిషన్లు ఎలా చేరాయి? ఎందుకు చేరాయి? ఆ సెంటర్లలో ఏం జరుగుతోంది అనే ఆరా గానీ, సవ్యమైన పర్యవేక్షణగానీ లేవు. గర్భం దాల్చిన ప్రతి మహిళకి అల్ట్రా సౌండ్‌ టెస్ట్‌ చేసి ఆడో, మగో చెబుతున్న డాక్టర్లు అసలు నేరస్థులు. వేలల్లో ఆడపిల్లల్ని ప్రతి రోజు హత్య చేస్తున్న ఈ డాక్టర్లు- నిజానికి ఒక మహోన్నతమైన వృత్తికోసం మలచబడిన వాళ్ళు. వీళ్ళు హంతక ముఠాల్లా మారి ఆడపిల్లల్ని మాయం చేస్తున్నారంటే డబ్బు కోసం ఎంతటి నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతోంది. వీళ్ళ డబ్బు లాలస, తల్లిదండ్రుల కొడుకు ప్రేమ కలగలసి సమాజంలో ఎంతటి అసమతుల్యానికి కారకులవుతున్నారో వీళ్ళకర్ధమవుత్నుట్టు లేదు. ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్న వీళ్ళు కిరాయి హంతక ముఠాలకేమీ తీసిపోరు. వాళ్ళు డబ్బు కోసం హత్యలు చేస్తారు. వీళ్ళూ డబ్బుకోసమే హత్యలు చేస్తున్నారు.

నిన్నటికి నిన్న ”లాన్సెట్‌ మ్యాగజైన్‌” భారతదేశంలో తగ్గిపోతున్న సెక్స్‌ రేషియో గురించి గగుర్పొడిచే అంశాలు బయట పెట్టింది. బాగా డబ్బున్న, బాగా చదువుకున్న కుటుంబాల వాళ్ళే ఎక్కువగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి ఆడపిండాలను చంపుతున్నారట. ముఖ్యంగా మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే రెండో బిడ్డ ఖచ్చితంగా మగపిల్లాడే వుండాలట. ఒక వేళ కడుపులో ఆడపిండం వుంటే అంతే సంగతులు. ఆడపిండాన్ని అబార్షన్‌ చేసేసి, మళ్ళీ గర్భం ధరించడం మళ్ళీ ఆడపిల్లయితే మళ్ళీ అబార్షన్‌. ఇలా మగ పిల్లాడు పుట్టేవరకు ఈ హత్యల పరంపర కొనసాగుతుంది. ఇంట్లో ఖచ్చితంగా మగపిల్లాడుండాలి. ఆడపిల్ల లేకపోయినా ఫర్లేదు. ఇదీ వీళ్ళ కుతంత్రం.

‘లాన్సెట్‌’ ఇంకా ఏం చెప్పిందంటే, వాళ్ళు నిర్వహించిన అధ్యయనం ప్రకారం 1980 నుంచి 2110′ వరకు ఇలాంటి అబార్షన్ల సంఖ్య కనీసం 40 లక్షలు అత్యధికం ఒక కోటి ఇరవై లక్షలు ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాక గత ముఫ్పై ఏళ్ళల్లో ఇలాంటి అబార్షన్లు పెరగడంతో పాటు ఉత్తర భారతం నుంచి ఈ జాడ్యం దక్షిణ భారతదేశానికి కూడా పాకిందట. ఇటీవలి సెన్సెస్‌ సమాచారంతో పాటు 2.5. లక్షల పుట్టుకలను వారు విశ్లేషించినపుడు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసాయి. కుటుంబంలో రెండో సంతానం ఉన్నపుడు బాలిక-బాలురకు నిష్పత్తిని గమనించారు. 1990 లో ప్రతి 1000 బాలురకు 906 మంది బాలికలుండగా 2005 నాటికి బాలికల సంఖ్య 836కి పడిపోయింది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో తిష్ట వేసిన భారతీయుల్లో కూడా ఆడపిల్లల పట్ల ఇవే ధోరణులుండడం. అక్కడ కూడా గర్భస్థ ఆడపిండాలని యధేచ్ఛగా గర్భంలో చంపేస్తున్నారు. భారతదేశంలో కనీసం పిసిపిఎన్‌డిటి చట్టం అమలులో వుంది. (దీని అమలు ఎంత ఘోరమో అది వేరే విషయం) అమెరికాలో ఇలాంటి చట్టాలేమీ లేవు. తమకి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి 40% మంది అబార్షన్‌లు చేయించుకున్నారట. మొదటి సంతానం ఆడపిల్లవుంటే గర్భవతులు రెండోసారీ కూడా గర్భంలో ఆడపిల్లే వుంటే కనుక 89% గర్భస్రావం చేయించుకుంటున్నారు.
ఆడపిల్లకి (ఆడపిండానికి) ఆంధ్ర అయినా అమెరికా అయినా ప్రాణరక్షణ లేదనేది ఈ అధ్యయనం రుజువు చేసింది.
ఆడపిల్లలకి ఆస్థి హక్కు ఇవ్వరు. ఇచ్చినా అమలు చేయరు. చదువు చెప్పించరు. చెప్పించినా సంపాదించుకోనివ్వరు . సంపాదించుకున్నా నిర్ణయాధికారమివ్వరు. పెళ్ళి పేరుతో నిప్పుల కొలిమిలోకి కట్నమిచ్చి మరీ తోస్తారు. అదనపు కట్నం తెమ్మని వాడు చిత్రహింసలు పెడుతుంటే అత్తింట్లోనే చావమని శాసిస్తారు. పుట్టింటి గౌరవాన్ని పాడు చెయ్యొద్దంటారు. గొంతు కోసేవాడొకడు, గొంతు నులిమే వాడొకడు. దెబ్బ కనబడకుండా ఎముకలు విరగ్గొట్టే వాడొకడు. ముక్కలుగా నరికి సూట్‌ కేసుల్లో పెట్టేవాడొకడు. ఇన్ని చావులు చచ్చే ఆడపిల్లలని అన్ని దశల్లోను పరమ కిరాతకంగా హత్యలు చేస్తున్న ఈ సమాజం, భారతీయ సమాజం పురోగమించిందని, అభివృద్ధి పధంలోకి దూసుకెళుతోందని ఎవరురా కూసింది. జనాభాలో సగ భాగం చావుబతుకుల్లో కొట్టుమిట్ట్లాడుతుంటే, పుట్టకుండానే ఆడపిల్లల్ని చంపేసే దరిద్రగొట్టు కాదు కాదు మదమెక్కిన ధనిక ప్రపంచం దృష్టిలో ”అభివృద్ధి” జరుగుతోందేమో కాని ఆడవాళ్ళ పరంగా మనమింకా అథ:పాతాళంలోనే వున్నాం.






తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...