Sunday, April 29, 2012

శారదా శ్రీనివాసన్ గారితో ఓ సాయంత్రం





శారదా శ్రీనివాసన్ గారితో సాయంత్రం

నిన్న ఎందుకో అలా డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే హిమాయత్ నగర్ దగ్గరకొస్తూనే 
శారద గారు గుర్తొచ్చారు. చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు.
ప్లాన్ చేస్తే పనులవ్వడం లేదు కాని చెప్పకుండా వెళ్ళి ఆశ్చర్యపరుద్దామనుకున్నాను.
లేడికి లేచిందే పరుగు లాగా శారద గారింటికెళ్ళడం డొర్ బెల్ కొట్టడం 
.. సత్యా అంటూ ఆవిడ నన్ను ఆత్మీయంగా హత్తుకోవడం 
పది నిముషాల్లో జరిగిందంటే నమ్మండి.
తర్వాత కబుర్ల జలపాతం,నవ్వుల జల్లులు.
ఇంతకీ శారద గారు ఎవరో చెప్పలేదు సుమండి.
ఎవరి గొంతు వినాలని ఆనాటి తరం రేడియోల ముందు నిశ్శబ్దంగా కూర్చునే వారో,
ఆవిడ నాటకాలని వినడానికి ఆదివారం 3 గంటలకి రేడియోకి అతుక్కుపోయేవారమో 
శారదా శ్రీనివాసనే నండి.
నాకు మంచి మితృరాలు.మా స్నేహానికి 20 ఏళ్ళు.
ఆవిడ నటించి జీవించిన పురూరవ నాటకం విన్నారా మీరు.
"
నా రేడియో అనుభవాలు" అంటూ ఇటీవల అద్బుతమైన పుస్తకం రాసారు.
చదివారా మీరు.
పుస్తకాన్ని దాదాపు 6 గంటపాటు స్టూడియోలో చదివి సీడి కూడా తెచ్చారు.
నిన్న నాకు సీడి ఇచ్చారు.
దానిని వినడం గొప్ప అనుభవం.
మీకు కావాలంటే చెప్పండి.
ఆవిడకి మార్కెటింగ్ చేసుకోవడం అస్సలు రాదు.
అందరం కలిసి కొన్ని సీడి లు కొంటే బావుంటుంది కదా.
నేనీ మాట అంగానే వద్దులే సత్యా అన్నారు కానీ నేనే చొరవ తీసుకుంటున్నాను.

Saturday, April 28, 2012

''భూమి చెబితే ఆకాశం నమ్మదా??''



''భూమి చెబితే ఆకాశం నమ్మదా?'' అంటూ నలభై మంది రచయిత్రుల ముందు కన్నీటి సంద్రాలైన వాకపల్లి అత్యాచార బాధిత మహిళల గుండె ఘోషను విని, విశ్వసించిన మహిళా న్యాయమూర్తికి జేజేలు పలకాల్సిన తరుణమిది. ఎలాంటి గాయాలు, వీర్యఅవశేషాలు లేవంటూ అబద్ధపు రిపోర్టులిచ్చిన పోలీసుల్ని నమ్మకుండా, ఎలాంటి గాయాలు లేకుండా అత్యాచారం జరగొచ్చు అంటూ కాగ్నిజబుల్‌గా యువ మేజిస్ట్రేట్‌ కేసును తీసుకోగానే నిందిత పోలీసులు 2008లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో స్టే పొందారు. అప్పటినుండి కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నిలిచిపోయింది.
నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసు హైకోర్టులో ఫైనల్‌ హియరింగ్‌కి వచ్చింది.పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, నిందిత పోలీసుల తరఫు న్యాయవాది తమ పాత వాదనలే విన్పించినప్పటికీ, గిరిజన మహిళ తరఫున వాదిస్తున్న బొజ్జా తారకంగారు తమ వాదనని బలంగా విన్పిస్తూ బాధిత మహిళల మీద గాయాలే లేవని, వీర్యాల అవశేషాలు లేవని కారణం చూపిస్తూ ప్రాసిక్యూషన్‌ అవసరం లేదనడం భావ్యం కాదని, నిందితుల్ని ప్రాసిక్యూట్‌ చెయ్యడానికి ఈ కారణం అడ్డంకి కాదని వాదించారు. కోర్టు బాధిత స్త్రీల స్టేట్‌మెంట్‌ని నిర్ద్వంద్వంగా నమ్మి తీరాలని కూడా వాదించారు.
ఈ వాదనని అంగీకరించిన జస్టిస్‌ శేషశయనారెడ్డి బాధితులకు అనుకూలంగా స్పందించి తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులైన 21 మంది పోలీసుల్లో 13 మంది మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ చేపట్టాల్సిందిగా ఆదేశాలు యిచ్చారు న్యాయమూర్తి.
వాకపల్లి గిరిజన మహిళలపట్ల అమానుషంగా వ్యవహరించిన 13 మంది పోలీసులు సామూహిక అత్యాచారం, ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ చట్టం కింద నేరారోపణలతో విచారణని ఎదుర్కొబోతున్నారు.
గిరిజన మహిళలు చేసిన దీర్ఘకాలిక న్యాయపోరాటం, మహిళా, పౌరహక్కుల సంఘాల సంఘీభావం, ''మీ పక్షాన మా అక్షరాలను మోహరిస్తామంటూ'' వాకపల్లి మహిళల పక్షాన నిలిచిన నలభైమంది రచయిత్రుల స్పందన వల్ల ఈ రోజు హైకోర్టులో ఈ ఆశావహక నిర్ణయం వెలువడింది. కొద్దిపాటి సాక్ష్యముంటే చాలు ''న్యాయనిర్ణయాలు'' (judicial decisions ) చెయ్యొచ్చని రుజువు చేసిన పాడేరు మేజిస్ట్రేట్‌కి, హైకోర్టు న్యాయమూర్తికి బాధితుల తరఫున వందనాలు. అభివందనాలు.

Friday, April 27, 2012

వానప్రస్థాశ్రమం అంటే ఇలా ఉండాలి



ఓ చక్కటి ఊరు.
పేరు పెన్నాడ అగ్రహారం.
పచ్చటి ఊరు.
ఊరినిండా కూరగాయల పాదులు.
పచ్చటి ఊరులో ఆకుపచ్చటి కూరగాయల మళ్ళు.
ఈ ఊరుకు ఇంకో ప్రత్యేకత ఉంది.
అక్కడ నెలకొని ఉంది ఓ ప్రసాంతమైన సీనియర్ సిటిజన్ ఆశ్రమం.
నేను మా ఊరు వెళ్ళినపుడల్లా ఈ జ్నానానంద ఆశ్రమానికి వెళుతుంటాను.
ఈ జ్నానానంద  గారి గురించి మరోసారి వివరంగా రాస్తాను.






ఈ ఆశ్రమం చూడండి ఎంత హాయిగా ఉందో.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...