Friday, April 30, 2010

అలుపెరగని పోరాట కెరటం అలసిన వేళ….

Posted by Picasa

అలుపెరగని పోరాట కెరటం అలసిన వేళ….

"మేధావులారా! నాగరీకులారా! అమాయకులైన ఈ పిల్లల నుదటన ఈ విధమైన రాత రాయడానికి , వాళ్ళ జీవితాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవడానికి మీరెవరు? వాళ్ళేమైనా మీ పెంపుడు కుక్క పిల్లలా? వాళ్ళ కింత తిండి పడేసి, బట్టలిచ్చి, కలర్‌ టీవీల్లో సినిమాలు చూపిస్తే మీ (దొర) బిడ్డల సేవలు చేయడానికి? ” (భూమిక పిల్లల ప్రత్యేక నుంచి) ఫిరంగి గుళ్ళలాంటి ఇలాంటి మాటలు రాయగల్గిన, చెప్పగల్గిన గుండె నిబ్బరం వున్న ఏం. ఏ. వనజ శారీరకంగా మన నుంచి దూరమై పోయిందంటే నమ్మ బుద్దయిత లేదు. చాలా రోజులుగా తన గొంతు వినబడక పోవడం వెనుక తన అనారోగ్యముందని తెలిసినా, ఆ గొంతును శాశ్వతంగా పోగొట్టుకున్నామంటే చెప్పలేనంత దు:ఖంగా వుంది.” సత్యవతిగారూ! ఆ… బాగున్నరా” అంటూ నోరారా పల్కరించడం- ఫోన్‌లోనైనా , ఎదుట పడినా అదే తీరు. ”దిశ” మొదటి సంచిక ప్లాన్‌ చేసినపుడు, తర్జనిగా మార్చినపుడు ఆర్‌ఎన్‌ఐకి సంబంధించిన వ్యవహారాల్లో సలహాల కోసమొచ్చినపుడు - ఆ పత్రిక పట్ల తన ప్రేమ, దానిని ఏ విధంగా తీర్చిదిద్దాలనే దానిమీద తన నిబద్ధమైన ప్లానింగు. నాకు మొదటి నుంచీ తెలుసు. ఆ పత్రికని నలుగురిలోకి తీసుకెళ్ళాలనే తపనతో ఎవరెన్ని కాపీలు పోస్ట్‌ చెయ్యగలరని ఆరాటపడడం- తను చేసే పనులకి అనారోగ్యం అడ్డమని ఏ రోజూ కంప్లయింట్‌ చెయ్యలేదు. తను చెయ్యదలుచుకున్న పనుల్ని మొండిగా, పట్టుదలగా చెయ్యాలి. అంతే. వనజలో వున్న ఆ నిబద్ధత, పట్టుదల, శ్రమ పడే గుణం ఒక్క పదిమందిలో వున్నా చాలు అద్భుతాలు చేసి చూపించొచ్చు. బాధితుల కన్నీళ్ళు తుడవడంలో, కష్టాల్ని పంచుకోవడంలో - వాళ్ళు గృహహింస బాధితులా, చట్టబాధితులా, బాల్య వివాహ బాధితులా, వికలాంగులా, మరుగుజ్జు మనుష్యులా ఎవరైనా కానీ వాళ్ళ కోసం వున్న చట్టాలని బయటకు తీసి అవి అమలయ్యేలా అవిశ్రాంత పోరాటం చేసింది వనజ.

వనజకి చాలా సీరియస్‌గా వుందని, అడ్వకేట్‌ మంజుల ఫోన్‌ చేసి చెప్పగానే మెడ్విన్‌ హాస్పిటల్‌కి పరుగెత్తాను. దిగులు ముఖాలతో వనజ అమ్మగారు, అన్న వాసు కన్పించారు గానీ తనని చూడడానికి వీలవ్వలేదు. మహిళల హక్కుల కోసం కోర్టుల్లోనో, మానవ హక్కుల కమీషన్‌లోనో పోరాడే వనజ మృత్యువుతో పోరాడుతోందని, ముఖ్య అవయవాలు సరిగా పనిచెయ్యడం లేదని వాసు చెప్పినపుడు చాలా దిగులేసింది. ఆ మర్నాడే వనజ ఇంక లేదని తెలిసి ఎంతోమందిమి తల్లడిల్లుతూ ఆమె ఇంటికెళ్ళాం. అక్కడి కెళ్ళేవరకు మాకు ఎవరికీ తెలియదు వనజ తనంత తానుగా శాశ్వతంగా సెలవు తీసుకుందని. తను రాసిన ఆఖరి ఉత్తరం అక్కడున్న అందరి గుండెల్ని పిండేసింది. వెక్కి వెక్కి ఏడ్పించింది. తన మనశ్శరీరాలతోనే కాదు వ్యవస్థతోను అలుపెరగని పోరాటం చేసిన వనజ ముఖం ఆ క్షణంలో ఎంతో ప్రశాంతంగా వుంది. 38 ఏళ్ళ జీవిత కాలంలోనే వందేళ్ళ పనిచేసి, ఏక్టివిస్ట్‌ అంటే ఇలా వుండాలి, అడ్వకేట్‌ అంటే ఇలా పని చెయ్యాలి, ప్రభుత్వం చేత ఇలా పని చేయించాలి అంటూ తన జీవితాన్నే ప్రమాణంగా చేసి చూపించడం తన ప్రత్యేకత. బాలల హక్కులతో మొదలుపెట్టి, బాల్య వివాహాల నాపే దిశగా అడుగేసి, హింసలో మగ్గే స్త్రీల కోసం నల్లకోటుతో ఉద్యమించిన వనజ ముట్టని అంశం లేదు. రాయని సబ్జెక్టు లేదు. తన తర్జని పత్రికని కార్యకర్తల కరదీపికగా మలిచింది. సమాచార చట్టం గురించి రాసినా, పనికి ఆహార పధకం గురించి రాసినా, గృహహింస చట్టం గురించి రాసినా, బాల్యవివాహాల గురించి రాసినా అదే పదును. ఓ కొత్త ఒరవడి. తన ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదంఉన్నా విశాఖ ఏజన్సీలో విషజ్వరాల ప్రబలినపుడు పాడేరు వెళ్ళి వచ్చి నాతో ఆ విషయం చెప్పినపుడు నా గుండె ఝుల్లుమంది. ఈ పిల్లకు ఎంత తెగింపు, ఎంత ధైర్యం అన్పించింది. భూమిక హెల్ప్‌లైన్‌లో స్వచ్ఛందంగా ఎంతోమంది అడ్వకేట్‌లు పనిచేస్తూ, బాధితులకు న్యాయసలహాలు అందించడం వెనుక వనజ కృషి ఎంతో వుంది. తనే చాలామందిని భూమికకి పరిచయం చేసింది.

ఏప్రిల్‌ 24న జరిగిన వనజ సంస్మరణ సభ వనజతో పెనవేసుకున్న వివిధ వ్యక్తుల జ్ఞాపకాల వెల్లువ. సభలోని వారందరి కళ్ళు చెమ్మగిల్లుతూనే వున్నాయి. వనజ అమ్మగారు తన గురించి రాసిన ఉత్తరాన్ని చదువుతుంటే చెమ్మగిల్లని నయనం ఆ సభలో లేదు. వేదికమీద కట్టిన ప్లెక్సీ బ్యానర్‌లోంచి సూటీగా, తీక్షణంగా ఆమె కళ్ళు అందర్ని చూస్తూనే వున్నాయి. ఆమె గురించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ - నీ ఆశయాలను సాధిస్తాం, నీ బాటను విడువం అంటూ వాగ్ధానాలు చేస్తున్న అందరికీ ఓ హెచ్చరికనా అన్నట్టుంది ఆ చూపులోని తీక్షణత.

మానవ హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, బాలల హక్కుల కోసం ఉద్యమించి, కలవరించి, పలవరించి పుస్తకాల రాసి, డాక్యుమెంటరీలు తీసిన వనజ- ఇన్ని పనులు సంపూర్ణారోగ్యైశ్వర్యాలతో తులతూగుతూ చేయలేదు. పంటి బిగువున బాధని అదిమిపెట్టి, కన్నీటిని సైతం శాసించి నిరంతరం చిర్నవ్వుతూనే తాను చెయ్యదలిచిన వాటినన్నింటినీ పూర్తి చేసింది. మనందరి కోసం దారులేసి వుంచింది. ఆమె నడిచిన దారి ముళ్ళదారే- ఆమె పాదాల నిండా ఎన్నో ముళ్ళు కసుక్కున దిగే వుంటాయి. మహిళలపై హింసా రూపాలు నిరంతరం మారుతున్న ఈ రోజున - యాసిడ్‌ దాడులు, ప్రేమ దాడులు, పెళ్ళి దాడులు, లైంగిక దాడులు రకరకాల దాడుల్లో మహిళలు ఉక్కిరి బిక్కిరై దిక్కుతోచక అల్లాడుతున్న వేళ, వేనవేల వనజలు కావాల్సి వున్న వేళ - వనజా! నువ్వు ఇంత చిన్న వయస్సులో వెళ్ళి పోవడం మహిళల బాలల ఉద్యమానికి తీరని లోటు. తర్జని పత్రికని నడిపించడం, బాధితుల కోసం నువ్వుందించిన సేవల్ని కొనసాగించడమే నీకు నిజమై నివాళి.. ఈ పనుల్ని మితృలంతా కొనసాగిస్తారని బలంగా నమ్ముతూ… తన చివరి ఉత్తరంలో ఎంతో హుందాతనాన్ని, సెల్ఫ్‌డిగ్నిటినీ ప్రదర్శించిన వనజ జ్ఞాపకం మరణం తర్వాత కూడా అంతే హుందాగా కొనసాగేలా తన మితృలంతా కృషి చెయ్యాలని ఆశిస్తూ… కన్నీళ్ళతో…

Tuesday, April 20, 2010

జూ పార్క్ లో వెదురుపూల వెల్లువ

జూ పార్క్ లో జంతువులే కాదండోయ్ వెదురుపూలు వెల్లువెత్తాయ్.
నిన్న పేపర్ల లో వార్త చదివాను జూ పార్క్ లో ఉన్న అసంఖ్యాకమైన వెదురు చెట్లు విపరీతంగా పూసాయని.
ఈశాన్య రాష్ట్రాల్లో కదా వెదురు పూలు పూస్తాయని ఇంతకాలం అనుకున్నాను.వెదురు పూలు పూసినపుడు అక్కడ పండగ కూడా చేస్తారని చదివాను.40 సంవత్సరాలకు ఒక సారి పూస్తాయట.
జూ ఓపెన్ అయ్యాక ఈ చెట్లు ఎప్పుడూ పుయ్యలేదట.
హమ్మో!!! ఇప్పుడు చూడకపోతే ఇంతేసంగతులు.మనం నలభై కాదు పదేళ్ళు బతికి ఉంటామన్న గ్యారంటి లేదు.అంతే!! సిరికిన్ చెప్పక అనంట్టుగా ఈ రోజు ఉదయం జూ కి పరుగెత్తను.నేను కాదు లెండి పాపం ఆ ఎర్రటి ఎండలో నా కారు
జూ కి దౌడు తీసింది.
500 వందలు కారుకి చెల్లించుకుని కారుతో సహ లోపలికి వెళ్ళి జూ అంతా తిరిగి బోలెడు ఫోటోలు తీసుకున్నాం.నాతో పాటు నా ఫ్రెండ్ గీత కూడా ఉంది.
అబ్బో!!!! వెదురు పూలని చూసి మనసు ఉప్పొంగిపోయింది.
మేమిద్దరం హాయిగా పూల మధ్య తిరుగుతుంటే టివి 9 వాళ్ళు మా వెంట పడ్డారు.ఈ పూల గురించి ఎవ్వరిని అడిగినా మాట్లాడ్డం లేదు మీరు మాట్లాడండి ప్లీజ్ అంటే మేం మహా పోజుగా ఇంటర్వ్యూ ఇచ్చేసాం.
మీ కోసం ఇవిగో వెదురుపూలు.
అన్నీ ఎండిపోతున్నాయ్.అగ్గి రాజుకుంటుందేమోనని చెట్లని కొట్టేస్తున్నారు.
అర్జంటుగా వెళ్ళి చూసేయండి .ఆలసించిన ఆశాభంగం.
Posted by Picasa
Posted by Picasa

zoo paark lo veduru poola velluva

Posted by Picasa

Monday, April 19, 2010

అండమాన్ ఓ మహా ఆకర్షణ

అండమాన్‌ దీవుల ప్రయాణం గురించి రాద్దామనుకున్నపుడుడల్లా ఏవో పనుల హడావుడి అడ్డం పడుతూనే వుంది.

జీవితం ఎంత వేగవంతమైపోయిందో! అనుభవాలు వ్యక్తీకరించకుండానే ఒక దానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి.

అండమాన్‌ వెళ్ళి వచ్చిన తరువాత జైపూర్‌ కూడా వెళ్ళాను. అయినా అండమాన్‌ సందర్శనానుభవాలు ఇంకా అలా ఫ్రెష్‌గా గుండెల్లో వుండిపోయాయి. రాయమనే పోరు లోపల జరుగుతూనే వుంది. ఆ అనుభవాలను మిత్రులతో పంచుకోవాలని నాకు చాలా అన్పిస్తోంది. అందుకే రాయడానికి కూర్చున్నాను.
అండమాన్‌ ఒక గాయం. సునామీ మిగిల్చి వెళ్ళిన గాయం గురించి నేను మాట్లాడటం లేదు. సెల్యూలర్‌ జైలు చూశాక, ఆ జైలులో ఖైదీలు అను భవించిన వర్ణనాతీత వేదనలు విన్నాక అండమాన్‌ ఎర్రటి పుండు మానిన గాయం లాగానే అన్పించింది నాకు. వందల సంఖ్యలో ఉరితీయబడిన ఖైదీలు, భయానక బాధల నడుమ కూడా చైతన్యంతో ఉద్యమాలు నడిపిన ఖైదీలు వీరసావర్కార్‌ లాంటి ధిక్కార స్వరాలు క్రౄర,కసాయి బ్రిటిష్‌ జైలర్లు. అండమాన్‌లో అడుగిడిన సాయంత్రమే సెల్యులర్‌ జైలును చూడడం, లైట్‌ అండ్‌ సౌండ్‌ ప్రోగ్రామ్‌లో జైలు చరిత్ర, ఖైదీల ఆర్తనాదాలు సజీవంగా ముందుకు రావడంతో మనసు వికలమై పోయింది. ఆ రాత్రి కలల నిండా ఖైదీలే. వారి హృదయ విదారక ఆర్తనాదాలే. పోలీసుల కరకు బూట్లచప్పుడు గుండెల మీద ఆనుతున్నట్టుగా అన్పించి చాలాసేపు నిద్రపట్టలేదు.

ఆ తర్వాత తిరగిన సుందర ప్రదేశాలు మొదటి రోజు చేదు అనుభవాన్ని కొంతవరకు తగ్గించేయి. సెల్యూలర్‌ జైలు చూడ్డానికి వెళ్ళకముందు సన్‌సెట్‌ పాయింట్‌కి వెళ్ళాం. మేమున్న గెష్టహౌస్‌కి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుంది. మెలికలు తిరిగిన రోడ్లు. దట్టమైన అడవిగుండా మా ప్రయణం సాగింది. కొబ్బరి చెట్లు, ఆకాశన్నంటే పోక చెట్లు దారిపొడుగునా ఉన్నాయి. నాకెంతో ఇష్టమైన మొగలి పొదలు చాలా కన్పడ్డాయి. అయితే ఈ పొదలు కొబ్బరి చెట్లంత పొడవున్నాయి. పెద్ద పెద్ద ఆకుల్తో పొడవుగా ఎదిగిన ఈ చెట్ల నుండి మొగలి పొత్తుల్ని ఎలా కొస్తారా అని తెగ ఆశ్చర్యపోయాన్నేను. కొబ్బరి, పోక, మొగలి ముప్పేటలా అల్లుకున్న ఆ తోటల్లోంచి మా కారు చాలా వేగంగా దూసుకెళ్ళసాగింది. అపుడపుడూ సముద్రం కూడా దర్శనమిస్తోంది. అకాశం రంగులో నీళ్ళు. స్వచ్ఛంగా వున్నాయి. ఓ నలభై నిముషాలు ప్రయాణం చేసాక సూర్యాస్తమయ ప్రదేశం వచ్చింది. ఎదురుగా నీలిరంగు సముద్రం. సముద్రానికి అటువేపు చిన్న దీవి. ఆ చిన్న దీవిలో ఎత్త్తైన కొండవెనక్కి సూర్యుడు జారిపోతున్న అద్భుతదృశ్యం కంటపడింది. టైమ్‌ చూస్తే నాలుగున్నరే అయ్యింది. మరి కాసేపట్లో చీకట్లు అలుముకున్నాయి. ఐదింటికల్లా చీకటిపోయింది. అప్పటివరకు నీలాకాశం రంగులో కనబడిన సముద్రం నల్లటి దుప్పటి కప్పుకుని పడకేసీనట్లనిపించింది. సన్‌సెట్‌ పాయింట్‌ దగ్గర అటవీశాఖవారి అందమైన అతిధి గృహం వుంది. బయట లాన్‌లో కూర్చుంటే నల్లటి దుప్పట్లో దూరిన సముద్రం గురకలు పెట్టినట్టుగా చిరు కెరటాలు తీరాన్ని తాకుతూ విరుగుతున్న సవ్వడి విన్పిస్తుంది. వేడిగా ఓ టీ తాగేసి మేము తిరుగు ప్రయాణమయ్యా౦. చీకటి దట్టమైపోయింది. కొబ్బరి చెట్లు, పోక,. మొగలి పొదలు ఏకమైపోయాయి. చల్లటి సముద్రగాలిని ఆస్వాదిస్తూ ఓ గంట తర్వాత మా గెస్ట్‌ హవుస్‌కి వచ్చేం.

మేము బస చేసిన గెస్ట్‌ఔస్‌ సముద్రానికి ఆనుకుని వుంది. మేమున్న రూమ్‌ పేరు నికోబార్‌. పెద్ద పెద్ద చెట్లతో గెస్ట్‌హౌస్‌ చాలా బావుంది. మేము రూమ్‌లో కెళ్ళగా ఓ కుర్రాడొచ్చి తలుపు తట్టాడు. ''నమస్కారం సార్‌'' అంటూ పలకరించాడు. తెలుగోడివా అంటే ''మాది విజయనగరం. ఇక్కడ క్యాంటీన్‌లో వంట చేస్తా. ఏమేం స్పెషల్స్‌ కావాలో చెప్పండి.'' అన్నాడు. మాకు బోలెడంత సంతోషం వేసింది. అతని పేరు మల్లిఖార్జున్‌. మేమున్నన్ని రోజులు మంచి భోజనం పెట్టాడు. చేపలు, పీతలు, నాటుకోడి అన్నీ ఆంద్రా స్టయిల్‌లో వండి వడ్డించే వాడు కాంటీన్‌లో.

మర్నాడు హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళ్ళాలనేది మా ప్రోగ్రామ్‌. పోర్ట్‌ బ్లయర్‌ నుంచి హేవ్‌లాక్‌కి షిష్‌మీద రెండు గంటల ప్రయాణం. ఉదయం ఎనిమిందింటికి షిిప్‌ బయలురుతుందని రెడీగా వుండమని చెప్పి వెళ్ళాడు ప్రొటోకాల్‌ చూస్తున్న భండారి.

మర్నాడు ఉదయం తొందరగా బ్రేక్‌ఫాష్ట్‌ చేసేసి షిప్‌ బయలుదేరే ప్రదేశానికి వెళ్ళాం. అక్కడంతా చాలా రష్‌గా, గోలగా వుంది. వివిధ ప్రదేశాలకు బయలుదేరే షిప్‌లు అక్కడ ఆగివున్నాయ్‌. మా షిప్‌ పేరు వండూర్‌ అని, అది హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళుతుందని భండారి చెప్పి మమ్మల్ని అందులో ఎక్కించాడు. మేము లోపలి కెళుతుండగా ఓ కబురు కూడా చెప్పాడు. విఐపి లాంజ్‌లో ఖాళీలేవని, ఒక రూమ్‌ వున్నా అది శుభ్రంగా లేదని, పబ్లిక్‌తో పాటు కూర్చోవాల్సి వుంటుందని చెప్పాడు. ఏం ఫర్వాలేదు. ఇంతటి జలరాశిని వదిలి పెట్టి రూమ్‌ల్లో ఏం కూర్చుంటాంలే అని అతనితో చెప్పి మేము మాకిచ్చిన రూమ్‌లో కెళ్ళి మా బ్యాగు పెడుతుండగానే షిప్‌ బయలుదేరింది. ఇంతలో ఇంజన్‌ రూమ్‌లో వుండే అటెండెంట్‌ వచ్చి పైకి వెళదాం రండి అని మమ్మల్ని కెప్టెన్‌ కేబిన్‌ల్లోకి తీసుకెళ్ళాడు. కనుచూపు మేరంతా నీలం రంగులో పరుచుకున్న బంగాళాఖాతం. నేను కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తుంటే ''ఏం సార్‌ తెలుగువారా?'' అనే పిలుపు వినబడింది. ''అవును. ఎలా గుర్తు పట్టారు'అన్నాం. తెలిసిపోతుంది సార్‌. మాది వైజాగు. నా పేరు స్వామినాథం నేను ఈ షిప్‌ కెప్టెన్‌ని'' అంటూ పరిచయం చేసుకున్నాడు. 'ఆహా! బావుందండి.చూస్తుంటే అండమాన్‌లో ఆంధ్రవాళ్ళు బాగానే వున్నట్టున్నారు. ''అవును. చాలామంది వున్నారు. వైజాగు నించి షిప్‌లో వస్తుంటారు.'' అంటూ ఆయన కబుర్లలోకి దిగారు.

మా కోసం కుర్చీలు తెప్పించి వేయించారు. నేను కన్నార్పకుండా ఆ మహాసాగరాన్ని చూస్తున్నాను. మా షిప్‌ చాలా వేగంగా వెళుతోంది. మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు ఎదురౌతున్నాయి. దట్టమైన అడవులు కన్పిస్తున్నాయి. నీలపు నీళ్ళు అంచుల వెంబడి విస్తరించిన ముదురాకుపచ్చ అడవుల సౌందర్యం చూసి తీరాల్సి౦దే. నేను చాలా బీచ్‌లు చూసాను గాని కెరటాలను తాకుతూ వుండే అడవుల్ని ఎక్కడా చూడలేదు. ఒడ్డుకు చాలా దూరంగా కొబ్బరి తోటలు చూసాను కానీ ఇలాంటి అడవుల్ని చూళ్ళేదు. నీళ్ళల్లో మునిగి వుండే మంగ్రవ్స్‌ మొక్కల్ని కూడా నేను అక్కడే చూసాను.
'వంగర్‌' సాగర జలాలను చీల్చుకుంటూ హేవలాక్‌ ద్వీపం వైపు వెళుతోంది. వేడి వేడి కాఫీ వచ్చింది. సముద్రపు గాలి చల్లగా వొంటిని తాకుతుంటే, వెచ్చటి కాఫీ తాగడం ఎంత బాగుందో. ఆంధ్ర కెప్టెన్‌ మాకు బోలెడన్ని మర్యాదలు చేసాడు. షిప్‌ అంతా తిప్పిచూపించాడు. ఇంజన్‌ రూమ్‌లోకి తీసుకెళ్లగానే ఆ వేడికి నా శరీరం కాలిపోతుందేవె అన్పించింది. ఆ శబ్దానికి చెవులు చిల్లులడిపోతాయని భయమేసింది. అంత వేడిగా, అంత భయంకరమైన చప్పుడుగా వుందక్కడ.చెవులకి రక్షణగా కప్స్‌ తగిలించుకున్నాగాని ఆ హోరు వినబడుతూనే వుంది. అలాంటి స్థితిలో కూడా పనిచెయ్యక తప్పని మనుష్యులున్నారక్కడ. మేము కొంచెం సేపు అటు ఇటు తిరిగి పైకి వచ్చేసాం.
ఇంకో పది నిముషాల్లో హేవలాక్‌ ఐలాండ్‌లో వండూర్‌ ఆగింది. 'సాయంత్రం మా షిప్‌లోనే రండి' అంటూ మా కెప్టెన్‌ ఆహ్వానించాడు. మేము వసతి దొరికితే రాత్రిని హేవలాక్‌లోనే గడుపుదామనుకున్నాం. 'మేము సాయంత్రం బయలుదేరితే వంగర్‌లోనే వస్తామని' చెప్పి షిప్‌దిగి బయటకొచ్చాం. అక్కడంతా హడావుడిగా, రద్దీగా వుంది. షిప్‌లోంచి దిగిన యాత్రికులు,కారు హారన్‌ వెతలు గందరగోళంగా వుంది. కొంచెం దూరంలో మా పేర్లు రాసిన ప్లేకార్డు పట్టుకుని ఓ కుర్రాడు నిలబడ్డాడు. మేము అతని దగ్గరకెళ్ళాం. 'ఆయియెమే౦సాబ్‌' అంటూ మమ్మల్ని ఆహ్వానించి కారు దగ్గరకు తీసుకెళ్ళాడు. అతని పేరు జెయిమ్‌. కారు అతనిదే. చక్కటి హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. మేము కారులో కూర్చోగానే ప్రోగ్రామ్‌ ఏంటని అడిగాడు. గెస్ట్‌హౌస్‌కి వెళదామంటే, రూమ్‌లు దొరకడం కష్టమని,ప్రెసిడెంటు పర్యటన సందర్భంగా ఎవరికీ రూమ్‌లివ్వడం లేదని అన్ని గెష్ట్‌ హౌస్‌లు రిపేర్‌ చేస్తున్నారని చెప్పాడు జెయిమ్‌ . ప్రయత్నం చేద్దాంపద అంటే సరే అని బయలుదేరాడు. హేవలాక్‌ ద్వీపం చుట్టూ సముద్రం.ద్వీపం లోపల దట్టమైన అడవిలాగా పెరిగిన కొబ్బరి,పోకచెట్లు. ఎంత పచ్చగా వుందంటే-ఆ పచ్చదనానికి గుండెలయ తప్పుతుంది. ఆ ప్రకృతితో ప్రేమలో పడి మిగిలిన ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేయగల తన్మయం కల్గుతుంది. నేను ఆ చెట్లల్లో, పుట్టల్లో పడి పారవశ్యంలో మునిగిన వేళ మా కారు అంతకన్నా అద్భుతమైన ప్రదేశంలో ఆగింది. నీలి సముద్రం ఒడిలో కెరటాల లాలిపాటలో ఒదిగివున్న డాల్ఫిన్స్‌ గెష్టహౌస్‌కి మమ్మల్ని తెచ్చాడు. గెస్ట్‌హౌస్‌కి ఎదురుగా ఎండలో మిల మిల మెరిసిపోతున్న సాగరం. అబ్బ! ఈ గెస్ట్‌హౌస్‌లో ఒక్కరోజున్నా చాలు కదా! ఇంత సౌందర్యం, ఇంత నిశ్శబ్దం, కెరటాల చప్పుడు తప్ప మరేమీ వినబడని ఈ నిరామయ ప్రదేశం.
 వెంటనే ఆ ప్రాంతంతో ప్రేమలో పడిపోయాను. నేనలా తన్మయంలో మునిగివుండగానే జెయమ్‌ రూమ్‌లివ్వరట. గెష్టహౌస్‌ మూసేసారట అని చెప్పాడు. నాకు చాలా కోపమొచ్చింది. ఎప్పుడో వారం తర్వాత వచ్చే ప్రెసిడెంట్‌ కోసం ఇప్పట్నించే పర్యాటకుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏం భావ్యం? ఇంత అందమైన ప్రాంతం వారం రోజులు బోసిపోవాల్సిందేనా? జనాలను చుట్టూ పక్కలక్కుడా రానీయడం లేదట. రూమ్‌కోసం చాలా

ప్రయత్నాలు చేసి చేసేదేంలేక కనీసం ఇక్కడి సముద్రాన్నయినా తాకుదాం. ఇంత స్వచ్ఛంగా మెరిసిపోతున్న జలాలను తాకకుండా ఎలా అనుకుంటూ నీళ్ళలోకి దిగి కెరటాలతో కాసేపు ఆడి, అక్కడి నుండి అయిష్టంగా బయలుదేరాం. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెల్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న నీలి రంగు నీళ్ళు. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, కళ్ళనీళ్ళొచ్చాయి అలా వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. ఆ బీచ్‌లోనే నాకో పెద్ద శంఖం దొరికింది. దాన్ని తాకినపుడల్లా నాకు డాల్ఫిన్స్‌ బీచ్‌ కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.



మధ్యాహ్నం అవుతోంది. లంచ్‌కోసం మంచి హోటల్‌కి తీసుకెళ్ళమని జెయిమ్‌కు చెప్పాం. దట్టంగా అల్లుకున్న పొదలు, చెట్లు, పక్షుల కిలకిలా రావాల సంగీతం వినబడుతున్న చక్కటి పొదరిల్లులాంటి హోటల్‌కి తీసుకెళ్ళాడు.



అక్కడికి సమీపంలోనే సముద్రం. పక్షుల పాటల్తో పోటీ పడుతూ కెరటాల హోరు వినబడుతోంది. అంత హాయైన ప్రదేశంలో ఆకలేం వేస్తుంది? అయినా వాళ్ళు పెట్టిందేదో తిని మళ్ళీ మా వాహనంలో కొచ్చి పడ్డాం.

''జెయిమ్‌! ఇపుడెక్కడికి తీసుకెళతున్నావ్‌?''

'కోరల్స్‌ చూడ్డానికి ఎలిఫెంటా బీచ్‌ కెళుతున్నాం'అన్నాడు. ''కోరల్స్‌'' ఎక్కడున్నాయ్‌? సముద్రం లోపలికెళ్ళాలి. ''హేవ్‌లాక్‌నుంచి ఓ గంట ప్రయాణ౦. పడవలో ఎలిఫెంటా బీచ్‌కెళ్ళాలి.'' ఈ మహా సముద్రంలో పడవ మీదా?'' 'అవును . పడవలోనే వెళ్ళాలి. సముద్రంలోపలి కెళితే గాని కోరల్స్‌ కనబడవు.''అంటుండగానే ఉదయం మేము షిప్‌ దిగిన ప్రాంతానికి వచ్చాం. ఇక్కడినుంచే పడవ మాట్లాడుకోవాలి'అన్నాడు జెయిమ్‌. మేము కారుదిగి నిలబడగానే ఓ కుర్రాడు మా దగ్గరకు వచ్చాడు.'ఇతను సురేష్‌. పడవ ఇతనిదే. మిమ్మల్ని ఎలిఫెంటా బీచ్‌కి తీసుకెళ్ళి, కోరల్స్‌ చూపిస్తాడు''.చెప్పాడు జెయిమ్‌.రానూ పోనూ మాట్లాడుకొని మేము అతను తెచ్చిన గటిపడవ ఎక్కాం. పడవ ఎంతో అందంగా వుంది. పసుపు. ఎరుపు రంగు గడుతో ఆకర్షణీయంగా వున్న మర పడవ. జెయిమ్‌ కూడా మాతో పాటే పడవెక్కాడు. మోటార్‌ ఆన్‌ చేయగానే పడవ సముద్ర గర్భంవేపు దూసుకెళ్ళసాగింది. మేము కూర్చున్న ఎడమ చేతివేపు సముద్రతీరం వెంబడి దట్టమైన అడవి. నీళ్ళల్లోకి చొచ్చుకొచ్చిన మంగ్రస్‌ చెట్లు. ఎగిసిపడుతున్న కెరటాల మీద ఎగిరెగిరి పడుతున్న పడవ. ఇటీవల ప్రళయకావేరిలో పడవ ప్రయాణం గుర్తొచ్చింది. ఈ సముద్ర కెరటాలు మరింత ఎత్తుగా రావడంతో పడవలోకి నీళ్ళు చిప్పిల్లుతున్నాయి. సముద్ర మధ్యంలోకి ఇంత చిన్న పడవలో ప్రయాణం చేయడం సాహసమే. పడవ ఎగిరినపుడల్లా గుండె ఝుల్లుమంటోంది. చుట్టూ అల్లుకున్న ఈ అనంత జలరాశి, నీలపు రంగుతో అందమైన డిజైన్లు, నడినెత్తిమీదున్న సూర్యుడి కిరణాలకి మిల మిల మెరిసిపోతున్న నీళ్లు. ఎగిరెగిరి పడుతున్న మా గటి పడవ. ప్రకృతి సౌందర్యాన్ని, బీభత్సాన్ని, గగుర్పాటుని, సాహసాన్ని ఒకేసారి అనుభవించడం అంటే ఏమిటో అవగతమైన క్షణాలవి. మా పడవ వూగుత, వయ్యరాలు పోత ఎలిఫెంటా బీచ్‌కి చేరింది. బీచ్‌ని ఆనుకుని అడవి. ఈ అడవిలోంచి ఏనుగులతో కట్టెల్ని మోయిస్తారట. లోపల్నించి ఏనుగులు మోసుకొచ్చిన పెద్ద పెద్ద మానుల్ని పడవలమీద ఎగుమతి చేస్తారట. ఒకప్పుడు చాలా ఏనుగులుండేవట. మాకయితే ఒక్కటీ కనబడలేదు. బహుశ అడవి లోపల ఉండొచ్చు.









పడవని కట్టేసి సురేష్‌ వచ్చాడు. అతని చేతిలో ఆక్సిజన్‌ మాస్క్‌ వుంది. ''ఇదెందుకు సురేష్‌ అంటే సముద్రం లోకి వెళ్ళాలి కదా! అన్నాడు. కోరల్స్‌ ఎక్కడున్నాయి? అంటే అక్కడ అంటూ కడలి వేపు చూపించాడు. అమ్మో! అంతలోపలికా అంటే 'ఫర్వాలేదు నేనున్నాను కదా! భయపడకుండా నా చెయ్యి పట్టుకుని వచ్చేయండి అన్నాడు. 'మళ్ళీ తనే మీరు చీరతో లోపలికి రాలేరు. అదిగో అక్కడ డ్రస్‌లు అద్దెకిస్తారు. వెళ్ళి మార్చుకురండి అన్నాడు. నాసహచరుడు హాయిగా నిక్కరేసేసుకుని కెరటాలమీద ఈత కొడుతున్నాడు. నేను బట్టలు అద్దెకిచ్చే చిన్న పాక దగ్గరికెళ్ళి ఓ నిక్కరు, టీ షర్ట్‌ తీసుకుని వేసుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలామందే వున్నారక్కడ. ఎవ్వరికీ వొంటిమీద ఏం వేసుకున్నామన్న స్పృహే లేదు. నీళ్ళతో ఆడుతూ, ఇసుకలో దొర్లుతూ, సముద్ర గర్భంలోకి వెళుతూ అందరూ మహానందనంలో మునిగివున్నారు. కెరటాలతో సయ్యాటకి చీరెంత అడ్డో నేను వేరే డ్రస్సులోకి మారాక అర్ధమైంది. ఇంక లోపలికి వెళదామా అంటూ సురేష్‌ వచ్చాడు. నువ్వు ముందువెళ్ళు అన్నాడు రావ్‌. నా తలకి ఆక్సిజన్‌ మాస్క్‌ తగిలించాడు. నీళ్ళల్లో మునిగి ప్రాక్టీస్‌ చెయ్యమన్నాడు. మొదటిసారి మునగ్గానే నోట్లోకి ఉప్పునీళ్ళు వెళ్ళిపోయి ఉక్కిరిబిక్కిరైపోయాను. అలా నాలుగైదు సార్లు ప్రాక్టీస్‌ చేసాక కాస్త అలవాటయింది.

'సరే వెళదాం పద'అన్నాను. సురేష్‌ చేయి అందించాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇంతకు ముందెప్పుడూ చూడని, కలలో సైతం ఊహించని ఓ అద్భుత ప్రపంచం లోకి చేపపిల్లలా ఈదుకుంటూ వెళ్ళిపోయాను. ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోను నోరు తెరవకుండా మొదటిసారి నీళ్ళల్లోకి మునిగి కళ్ళముందు కనబడిన అపూర్వదృశ్యానికి అబ్బురపడి 'వావ్‌' అంటూ నోరు తెరవడంతో నోట్లోకి నీళ్ళు పోయి ఉక్కిరి బిక్కిరై పైకి వచ్చేసాను. సురేష్‌ హెచ్చరికని పాటించి మళ్ళీ నీళ్ళ అడుగుకి వెళ్ళాను. అబ్బ! బతికివున్న రంగు రంగుల కోరల్స్‌. రకరకాల చేపలు. సదుల్లా కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. గుత్తులు గుత్తులుగా, రంగు రంగుల పూల గుత్తుల్లా జీవంతో తొణికిసలాడుతున్న కోరల్స్‌. సురేష్‌ చేతిని గట్టిగా పట్టుకుని అతని వెంబడి అలా అలా నీళ్ళమీద నడుస్తూ, సాగర సంపదని కన్నార్పకుండా చూస్తూ మైమరచిపోయాను. ఇలాంటి దృశ్యాలను డిస్కరరీ ఛానల్‌లో చూస్తూ పరవశించడమే ఇంతకాలం తెలుసు. ఇపుడు నేను కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నానే, తాకగలుగు తున్నానే అనే ఆనందం అణువణువు లోను నిండి పోయింది. అతను నన్ను సాగర గర్భంలోకి, కోరల్స్‌ కమనీయదృశ్యాల్లోకి ఎంతసేపలా లాక్కెళ్ళి పోయాడో గాని గాలి పీల్చుకోవడం కోసం నీళ్ళపైకి రాగానే తీరం చాలా దూరంగా కనబడింది. రావ్‌ చాలా దూరంలో కనబడతున్నాడు. ఇంత లోపలికికొచ్చేసామా అంటూ ఆశ్చర్యపడుతూ, మళ్ళొకసారి నీళ్ళల్లో మునిగి సూర్యకాంతితో సమానంగా మెరుస్తున్న కోరల్స్‌ని తనవితీరా చూసి ఓ చిన్న ముక్కని పీకడానికి ప్రయత్నించాను కానీ రాలేదు. సురేష్‌ అవలీలగా ఓ చిన్న కోరల్‌ని పీకాడు. దాన్ని వెసుకుంటూ నీళ్ళ మీది కొచ్చేం. మెల్లగా ఈదుకుంటూ తీరం చేరాం. ఎలా వుంది అని రావ్‌ అడిగాడు. అద్భుతం, అపూర్వం అన్నాను. తర్వాత రావ్‌ని తీసుకుని, సురేష్‌ వెళ్ళాడు. నేను ఆ అద్భుతానందాన్ని గుండెల్లోకి ఒంపుకుంటూ కెరటాలతో ఆటాడుతూ నిలబడ్డాను. అక్కడ తీరం వెంబడి రకరకాల ఆకారాలతో చనిపోయిన కోరల్స్‌ వెదజల్లి నట్టున్నాయి. బోలెడన్ని కోరల్స్‌ ఏరాను. వాటన్నింటినీ బాగులో వేసుకున్నాను. రావ్‌ కూడా తిరిగొచ్చాక, మా పడవలో హేవలాక్‌ బయలుదేరాం.

ఆ రోజు పౌర్ణమి.సముద్రం మంచి పోటు మీదుంది. కెరటాలు మరింత ఎత్తుకి లేస్తూ పడవని ఢీ కొడుతున్నాయి. నీళ్ళు ఎగిరొచ్చి మమ్మల్ని తడుపుతున్నాయి. హఠాత్తుగా పడవ బోల్తా పడితే? ఏముంది పోయి ఆ కోరల్స్‌ మీదేగా పడతాం. 'ఇక్కడ పడవలెప్పుడైనా బోల్తాకొట్టాయా? సురేష్‌ని అడిగాం. ఊహూ..డరనా నహీ ..కుచ్‌ నైహోగా అన్నాడు''. హమ్‌ నహీడరరే. ఊరికే అడుగుతున్నాం'' అన్నాను నేను.జెయిమ్‌ అందుకుని ''కోరల్స్‌ బావున్నాయా? మీకు నచ్చిందా?'' అన్నాడు. నేను సమాధానం చెప్పేలోగానే సురేష్‌ 'మేడమ్‌! మీకు బతికిన కోరల్‌ ఇచ్చాను కదా! అది ఎవ్వరికీ చూపించొద్దు.'' అన్నాడు. ''ఏమౌతుంది చూపిస్తే..'' ''బతికిన కోరల్స్‌్‌ సముద్రంలోంచి తియ్యడం నేరం. పోలీసులు పట్టు కుంటారు''.''అరే! వాటిని తియ్యకూడదా?మాకు తెలియదు కదా! ఇక్కడ బోర్డు కూడా పెట్టలేదు!'' ''ఫర్వాలేదు. ఏమీకాదు. మీరు ఉప్పునీళ్ళల్లో దాన్ని వేయండి. అది బతుకుతుంది.''అన్నాడు. మేమిలా మాటల్లో వుండగానే మా పడవ హేవలాక్‌ తీరం చేరింది. జెయిమ్‌ వెళ్ళి కారు తెచ్చాడు. మేము పడవ దిగి కారులో ఎక్కగానే ''మనమిప్పుడు రాధానగర్‌ బీచ్‌ కెళుతున్నాం'' అన్నాడు.

బాగా ఆకలిగా వుంది. ఏమైనా తిందామంటే అక్కడ బీచ్‌లో హొటల్స్‌ వుంటాయని అక్కడ తినొచ్చని చెప్పాడు. 'అయితే నేను కొబ్బరి బొండాం తాగుతాను! అంటే బొండాలమ్మే బండి దగ్గర ఆపాడు. మన ప్రాంతపు బొండాం కన్నా రెండింతలు పెద్దగా వుంది. లీటర్‌ నీళ్ళుపైనే వున్నాయి. తియ్యగా, చల్లగా చాలా బావున్నాయి కొబ్బరినీళ్ళు. ఓ పెద్ద అడవి, కొండ దాటి రాధానగర్‌ చేరాం. మేము అక్కడ హొటల్‌లో తింటున్నపుడు 'హాయ్‌! అంటూ ఓ విదేశీయుడు పలకరించాడు. అతను ఎలిఫెంటా బీచ్‌ దగ్గర కన్పించాడు. చేతిలో కర్రతో ఇంకొకతనితో కలిసి అడవిలోంచి, కొండదిగి మాకంటే ముందే వచ్చేసాడు. 'u came before us.how can it be possible?అంటే yah.everything is possible with this'అంటూ తన కర్ర చూపించాడు. అతను ఫ్రాన్స్‌నించి వచ్చాడట. పెయింటింగు పని చేస్తాడట. సంవత్సరమంతా పనిచేసి డబ్బు కూడబెట్టి నెలరోజులు ఇలా దేశాలు తిరుగుతాడట.'ఆహా! అన్పించింది నాకు.

టిఫిన్‌ తినడం అయ్యాక బీచ్‌లోకి వెళ్ళాం చాలా అందమైన బీచ్‌. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెలు. స్వచ్ఛంగా , తేటగా వున్న నీళ్ళు, నీళ్ళనానుకుని అడవి. ఎక్కడా ఒక్క ప్లాస్టిక్‌ కవర్‌గాని, చెత్తా చెదారంగాని కనబడలేదు. శుభ్రంగా చీపురుతో ఊడ్చినంత నీట్‌గా వుంది బీచ్‌. కళ్లముందు కనబడుతున్న వివిధ రంగులు, బంగారం రంగు ఇసుక, ఆ ఇసుకను తాకుతూ తెల్లటి మల్లెపువ్వు ల్లాంటి కెరటాలు, ఆ కెరటాలను తరుముతున్న నీలం రంగు నీళ్ళు, కొంచెం కన్నుసారిస్తే ఆకుపచ్చటి అడవి. నేనలా మంత్రముగ్ధనై, ప్రకృతి సోయగానికి పరవశమై కళ్ళల్లో నీళ్లు బుకుతుంటే రెప్పవేయకుండా చస్తుండి పోయను. విస్తారమైన ఆ బీచ్‌ కెరటాల సంగీతం తప్ప మహా నిశ్శబ్ధంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాల్సిందే.

శ్శబ్దాన్ని ప్రేమించటానికి, మనలో పేరుకు పోయిన శబ్ద కాలుష్యాన్ని కడుక్కోడానికైనా రాధానగర్‌ బీచ్‌ కెళ్ళాలి. మేమలా చిత్తరువుల్లా కూర్చుని వున్నపుడు జెయిమ్‌ వచ్చాడు. మేము మెల్లగా లేచి మా కారువేపు నడవసాగాం. నేను బోలెడన్ని డెడ్‌ కోరల్స్‌ ఏరుకున్నాను. రకరకాల డిజైన్లవి. మాకు గెష్టహౌస్‌ దొరకలేదు కాబట్టి పోర్ట్‌ బ్లేయర్‌కి తిరిగి వెళ్ళాలి.


మా కారు షిప్‌ ఎక్కాల్సిన యార్డ్‌ వేపు వెళుతోంది. జెయిమ్‌ ఆ ద్వీపం గురించి ముచ్చట్లు చెబుతున్నాడు. అక్కడ అందరూ కష్టపడి పనిచేస్తారని, పని లేకపోవడమంటూ వుండదని చెబుతూ, కొబ్బరికాయలు తీయడం, ఏరడం, పోకకాయలు తెంపడం,
వాటిని సేకరించడంలాంటి పనులు సంవత్సరమంతా వుంటాయట. టూరిష్ట్‌లకు సంబంధించి కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మా హేవలాక్‌లో ఎవ్వరూ పేదవాళ్ళు లేరు అంటూ చాలా గర్వంగా చెప్పాడు. పోకచెట్టు మీద ఎగబాకుతున్న మనిషి, ఓ చెట్టునుండి ఇంకో చెట్టుకు దూకుతూ కంటబడ్డాడు. సన్నగా, రివటలాగా వుండే పోక చెట్టు చాలా సులువుగా ఒంగుతుంది. ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుకు చాకచక్యంగా దూకుతుంటారు. మేము కారు దిగి కొన్ని పోకకాయలు ఏరి తెచ్చుకున్నాం. మేము షిప్‌ ఎక్కే ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఐదుగంటలైంది. వండూర్‌ రెడీగా వుంది. స్వామినాధం మా కోసమే ఎదురు చూస్తున్నాడు. జెయిమ్‌కి డబ్బు చెల్లించేసి అతనికి గుడ్‌బై చెప్పాం. షిిప్‌ ఎక్కడానికి నిలబడినవారిని, ఆ ద్వీపానికి చెందినవారిని గమనిస్తుంటే అందరి నోళ్ళు ఒకే లయలో కదలడం చూసి జెయిమ్‌ని అడిగాం ఏం తింటున్నారు అందరూ అని. 'గుట్కా', పాన్‌పరాగు అన్నాడు నవ్వుతూ. హేవలాక్‌లో ప్రతి వొక్కర గుట్కా తింటారని. గుట్కా వ్యాపారం చేసి లక్షలు సంపాదిస్తారని కూడా చెప్పాడు.

మేం షిప్‌లోకి ఎక్కగానే అది బయలుదేరింది. సూర్యాస్తమయ సమయం. పడమటి దిక్కు సింధరం రంగులోకి మారింది. అప్పటివరకు నీలి ఆకాశంతో పోటీ పడిన సాగర జలాలు క్రమంగా నలుపు రంగుకి మారుతున్నాయి. షిప్‌ వేగంగా వెళుతోంది. చల్లటిగాలి హాయిగా తాకుతోంది. అపుడే ఓ అద్భుతాన్ని చూసాన్నేను. పడమటి ఆకాశంలో అస్తమించే సూర్యుడు అచ్చం చంద్రుడిలాగానే వున్నాడు. తూర్పు దిక్కుకు చూద్దునుకదా వెండివెన్నెలలు వెదజల్లుతూ పౌర్ణమి చంద్రుడు.రెండు బింబాలు ఒకేలా వున్న అపూర్వ దృశ్యమది. క్రమంగా సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు. చుట్టూ దీపాలులేని అఖండజలరాశి.సముద్ర మధ్యంలో మా షిప్‌. నీళ్ళల్లోకి మిల మిల మెరుస్తూ కురుస్తున్న వెన్నెల. నేను నిశ్శబ్దంగా ఒక మూలకి కూర్చుండిపోయి, ప్రకృతిలో లీనమైపోయను. రావ్‌ హైదరాబాద్‌నుంచి వచ్చిన ఒక పోలీసాఫీసర్‌తో కబుర్లలో పడ్డాడు. నేను మాత్రం మాట పలుకు లేకుండా బంగాళాఖాతం మీద మనోహరంగా కురుస్తున్న వెన్నెల్లో తడుస్తూ, తన్మయమౌత తరించిపోయాను. నా ఆనందాన్ని నా ఆత్మీయ నేస్తాలతో పంచుకున్నాను. సముద్రం మధ్యలో సెల్‌ఫోన్‌లు పనిచేయడం ఆశ్చర్యమే. నా కళ్ళతో నేను అనుభవించిన ఆనందాన్ని నా మిత్రుల చెవుల్లో విన్పించడానికి సెల్‌ఫోన్‌ భలే ఉపయోగపడింది. సంతోషం ఇతరులతో పంచుకోవడానికే అని గాఢంగా నమ్ముతాను. వెన్నెల్లో గోదారిని చూసాను గాని వెన్నెల్లో సముద్రం అందాన్ని ఇప్పుడే చూస్తున్నాను.క్రమంగా దీపాలు కనబడసాగాయి. దూరంగా పోర్ట్‌బ్లేయర్‌ ఐలాండ్‌ కనబడుతోంది. దీపాలు దగ్గరయ్యే కొద్దీ వెన్నెల వెలుగులు మసక బారసాగాయి. మా వెంట తెచ్చు కున్న అరిశెలు, మురుకులు స్వామినాధానికిచ్చేసాం. అతను చాలా సంతోషపడిపోయాడు. మాకిచ్చిన ఆతి ధ్యానికి ధన్యవాదాలు చెప్పి మేము 'వండూర్‌'' దిగేసాం.

మర్నాడు మా ప్రోగ్రామ్‌ జైలు లోపలి కెళ్ళి చూడ్డం. రోస్‌ ఐలాండ్‌, పీక్‌ పాయింట్‌ (ఎతైన ప్రదేశం) చూడ్డం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌్‌ చేసి సెల్యూ లర్‌ జైలుకి వెళ్ళాం. మొదటి రోజు రాత్రిపూట సౌండ్‌ అండ్‌ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌లో చూసిన జైలు. ఏడు పొడవాటి గోడల్లాగా ఒక వైపు మాత్రమే సెల్‌ తలుపు లుండేలా చాలా ప్లాన్డ్‌గా కట్టిన కరకు నమూనా. ఖైదీలు ఒకరి ముఖాలొకరికి కనబడవు. వందలాది ఖైదీలను బంధించి, చిత్రహింసలు పెట్టి, ఉరితీసిన భయంకరమైన ఆ జైలు సందర్శనం ఒంటిని జలదరింపచేసింది. ఖైదీలను ఏ విధంగా హింసించేవారో చూపించే బొమ్మలు వున్నాయక్కడ. ఒకేసారి ముగ్గురిని ఉరితీసే గది, వాసానికి వేలాడుతున్న ఉరితాళ్ళు. వీరసావర్కార్‌ గది. ఆవరణలో ఓ పెద్ద రావిచెట్టు వుండేదని, ఈ జైలులో జరిగిన అకృత్యాలను మౌనసాక్షి అదేనని గైడ్‌ చెప్పాడు. సునామీకి ఆ చెట్టు కూలిపోయి, దాని స్థానంలో ఓ పిల్లచెట్టు మొలిచింది. చాలా సేపు ఆ చెట్టు ముందు లబడ్డాను. నాతో ఏదో చెప్పాలన్నట్లు ఆకులు గలగల లాడాయి. గుస గుసగా ఏదో చెప్ప ప్రయత్నించాయి.

మనసంతా భారమైపోయింది. అదే మూడ్‌తో సునామీకి బాగా దెబ్బతిన్న రాస్‌ఐలాండ్‌ చూడ్డానికి వెళ్ళాం. పోర్ట్‌ బ్లెయిర్‌కి కన్పిస్తూ వుంటుంది ఈ చిన్న ద్వీపం. అక్కడ బ్రిటిష్‌ వాళ్ళ ప్రాభవ చిహ్నాలు చాలా వున్నాయి. క్లబ్‌లు, చర్చి, వాళ్ళ క్వార్టర్స్‌, టెన్నిస్‌ కోర్టుల్లాంటివన్నీ ప్రస్తుతం కూలిపోయి, ఆ శిధిలాల్లోంచి చెట్టు మొలుచుకొచ్చాయి. ఆ చెట్లు భవనాల ఆకారంలో గమ్మత్తుగా వున్నాయి. సునామీ తీవ్రంగా తాకిన ద్వీపమిది. అక్కడ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ వుంది. అందులో సునామీ కెరటాల్లో తన కళ్ళ ముందే తన భార్య ఎలా కొట్టుకుపోయిందో ఓ భర్త రాసిన ఉత్తరం వుంది.అన్నింటికన్నా నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అక్కడి నుండి స్ఫష్టంగా కనబడే సెల్యూలర్‌ జైలు, సెంట్రల్‌ టవర్‌. జైలరు, అధికారులు ఇక్కడి నుండి కూడా జైలును కంట్రోలు చేసేవారని అర్ధమైంది. ప్రస్తుతం ఇక్కడ జనమెవ్వరూ నివసించడంలేదు. టూరిష్ట్‌లు మాత్రమే తిరుగుతున్నారు.



అక్కడి నుండి పోర్ట్‌బ్లెయిర్‌ మొత్తం కనబడే 'పీక్‌ పాయింట్‌' కి వెళ్ళాం. చిక్కటి అడవిలోంచి కొండెక్కడం, ఆ కొండమీంచి సముద్రం, చిన్నా చితకా ఐలాండ్స్‌ కనబడ్డాయి. పోర్ట్‌బ్లెయిర్‌ చుట్టూ వుండే సముద్రం కన్పడింది. అడవిలోంచి ఏవో జంతువుల అరుపులు, పక్షుల కిలకిలలు కింద సముద్ర కెరటాలు. చాలా అందమైన ప్రదేశం. మేం తిరుగు ప్రయాణంలో కొండ దిగుతుంటే''తెలుగు ప్రాధమికోన్నత పాఠశాల'' పేరుతో తెలుగులో రాసి వున్న బోర్డ్‌ కన్పడింది. భండారిని అడిగితే ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారని చెప్పాడు.

మర్నాడు మ్యూజియమ్‌ చూసాం. అండమాన్‌ చరిత్రకి అద్దం పడుతూ ఎంతో సమాచారముందక్కడ. ఇక్కడ ఈ దీవుల చరిత్ర కొంత రాయాల్సి వుంటుంది. అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌ గురించి 1777 వరకు బయట ప్రపంచానికేమీ తెలియదు. 1777లో బ్రిటిష్‌ వాళ్ళు జరిపిన సర్వేలోనే ఇవి బయట పడ్డాయి. అంతవరకు ఈ ద్వీపాల్లో బయట నుంచి అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. ఆదిమ మానవులుగా పిలవబడే ''నెగ్రిటాస్‌'' ''మంగోలాయిడ్స్‌'' జాతి ఆదివాసులు శతాబ్దాలుగా ఇక్కడ బతుకుతుండేవారు. ఇక్కడ మొదట అడుగు పెట్టింది ఇంగ్లీషు వాళ్ళే. వారి రాజకీయ అవసరాల కోసం, ఖైదీలను ఉంచడం కోసం సెంటిల్‌మెంటుగా దీన్ని మార్చేసారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వేలాది దేశ భక్తుల్ని ఈ సెటిల్‌ మెంట్లలో నిర్భధించేవారు. ఆ తర్వాత సెల్యూలర్‌ జైలు కట్టారు. ఆ తర్వాత జపాన్‌ వాళ్ళు దాడి చేసి ఈ దీవుల్ని ఆక్రమించు కున్నారు.1947లో భారతదేశానికి సిద్ధించిన స్వతంత్రంతోపాటు అండమాన్‌, నికోబార్‌లు కూడా స్వతంత్రయ్యాయి.



అండమాన్స్‌కి వలస వచ్చిన వాళ్ళలో బెంగాలీయులే అధికులు. ప్రభుత్వ పాలసీ ప్రకారం, పునరావాస కార్యక్రమాల్లో భాగంగా 'సెట్లర్స్‌'గా వీళ్లు వచ్చారు. ఈ పునరావాస కార్యక్రమం 1949 నుండి 70 వరకు కొనసాగింది. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌) నుండే ఎక్కువ మంది ఇక్కడికొచ్చారు. అలాగే ఎంతోమంది 'ఎక్స్‌సర్వీస్‌మెన్‌' నికోబార్‌ దీవుల్లో పునరా వాసం పొందారు. వీరిలో పంజాబీలు, మరాఠీలు, మళయాళీలు, తమిళులు, తెలుగు వాళ్ళు వున్నారు. ఇలా బ్రిటీష్‌వాళ్ళు అడుగుపెట్టి, ఈ దీవుల ఉనికిని కనుక్కుని, తన రాజకీయ అవసరాలకు వాడుకున్న తరువాత , ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులు ఇక్కడ చొరబడ్డారు. ఈ నాగరీకుల ప్రవేశంతో అప్పటివరకు స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసులు లోపల్లోపలికి కుంచించుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అండమాన్స్‌లో వున్న 572 దీవుల్లో ఆదివాసులు కొన్ని దీవుల్లో మాత్రమే వున్నారు. నికోబార్‌ ఐలాండ్స్‌లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. జరువాలు, షోమ్‌పెన్‌, గ్రేట్‌ అండమానిస్‌, ఓగ్గ్సు, సెంటీనలీస్‌ అనే ఐదు తెగలకు చెందిన ఆదిమమానవులు, నాగరీక సెట్లర్స్‌ చర్యల వల్ల ప్రమాదంలో వున్నారని ఇటీవల భారత ప్రభుత్వ ఆదివాసీ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తెగలవారిని ''కుతూహలంగా'' చూసేవారే తప్ప వారి సమస్యలు వీరికి అర్ధం కావని కూడా పేర్కోనడం గమనించాలి.



నికోబార్‌ ఐలాండ్‌కి మేము వెళ్ళలేక పోయా౦ కానీ అక్కడి ఆదివాసులకు సంబంధించి అనేక చిత్రాలు మ్యూజియంలో ప్రదర్శించారు. వారి ఇళ్ళు, ఆహారపుటల వాట్లు వస్త్రధారణ ఎంతో భిన్నంగా వుంటాయి. సునామీలో వేలాదిగా నికోబార్‌లో వుండే ఆదివాసులు చనిపోయరని, కొన్ని ద్వీపాలు శాశ్వతంగా సముద్రంలో కలిసి పోయాయని రాసివుంది. నికోబార్‌ ఐలాండ్‌ వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి, రక్షణ ఏర్పాట్లు అవసరమని, ఆదివాసులు ఎవరినీ నమ్మరని, ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదమని భండారి మాకు చెప్పడంతో మేము ఆ ప్రస్తావన వదిలేసుకున్నాం.



అద్భుతానుభవాల్ని గుండెల్లో పదిల పరుచుకుని అండమాన్‌ ద్వీపానికి, గెష్ట్‌హౌస్‌ సిబ్బందికి వీడ్కొలు పలికి మేము చెన్నైె విమానం ఎక్కాం. విమానం అనంతజలరాశి మీద ఎగురుతుంటే దాని నీడ చేపలాగా నీళ్ళల్లో కనబడింది. ఎన్నో ద్వీపాలు. నీలిరంగు నీళ్ళు చుట్టుకున్న ఆకుపచ్చటి ఐలాండ్స్‌. అండమాన్‌లో గాల్లో ఎగిరి చెన్నైలో దిగేవరకు రవ్వంత భమి కనబడదు. నీళ్ళే నీళ్ళు. చెన్నైలో దిగేటప్పుడు ఓ గమ్మత్తు జరిగింది. ల్యాండ్‌ అవడానికి విమానం చాలా కిందకి దిగింది. అయితే ఎందుకనో దిగకుండా కిందే ఎగురుతూ తిన్నగా వెళ్ళసాగింది. నెల్లరు దాటి పులికాట్‌ మీదుగా వెళ్ళి వెనక్కి తిరిగింది. నాయుడుపేట, తిరుపతి రోడ్డు స్ఫష్టంగా కన్పడుతుంటే నాకు ప్రతిమ గుర్తొచ్చింది. ప్రతిమా! మీ ఊరి మీద ఎగురుతున్నానని అరిచి చెప్పాలన్పించింది.సెల్‌ఫోన్‌ వాడనిస్తే ఫోన్‌లో చెప్పేదాన్నేమో! చెన్నై చుట్టూ చక్కర్లు కొట్టి లాండ్‌ అయ్యిుంది విమానం. మేము హైదరాబాద్‌ ప్లయిట్‌ కోసం ఎదురుచస్తూ లాంజ్‌లో కూర్చున్నాం.



ఓ మహా నిశ్శబ్ధ్దంలోంచి, పచ్చటి ప్రకతిలోంచి, నీలాల సంద్రపు కౌగిలిలోంచి విడివడి మళ్ళీ జనారణ్యంలోకి అడుగు పెట్టడంతో మా అండమాన్‌ ద్వీపాలయత్ర ముగింపుకొచ్చింది. జనాభాతో కిటకిట లాడుతున్న ఈ ప్రాంతాలెక్కడ 572 ద్వీపాలకు కలిపి నివసిస్తున్న నాలుగు లక్షల మంది ఎక్కడ. అందులో బెంగాలీలు, మళయాలీలు, తెలుగు వాళ్ళు, ముస్లిమ్‌లు, క్రిష్టియన్‌లు కలిసి మెలిసి సామరస్యంగా జీవించే అండమాన్‌ ఓ అద్బుత యత్రా స్థలం. ప్రకృతికి అతి సమీపంగా, శబ్దరాహి త్యంలో తరించాలనుకునే వాళ్ళకి చక్కటి గమ్యం. ప్రకృతి ప్రేమికులను పారవశ్యంలో ముంచేయగల మహాసంద్రం బంగాళాఖాతం అడుగడుగునా పాదాలను తాకుత మనల్ని పునీతుల్ని చేస్తుంది. పునరాగమనకాంక్షని రగిలిస్తుంది. మళ్ళెపుడు...అంటూ మనల్ని బలంగా తనవేపు లాక్కెళ్ళిపోగల మహా ఆకర్షణ అండమాన్‌.






Saturday, April 10, 2010

ప్రగతి రిసార్ట్స్ లో పరవళ్ళుతొక్కిన బాల్యం( రిలాక్షేషన్ వర్క్ షాప్ 2)


డియర్‌ ఫ్రెండ్స్‌,


హార్సీలీ హిల్స్‌లోనో, శ్రీశైలం అడవుల్లోనో మరో మూడు రోజుల ఉల్లాసపు వర్క్‌షాప్‌ నిర్వహించాలనుకున్నాను. మార్చి నెల మన ఉత్సాహాన్ని మింగేసింది. మీటింగుల మీద మీటింగులు. మీరంతా మహా బిజీ. ఏం చేద్దాం! మూడు నెలలుగా వేసిన నా ప్లానింగు నీళ్ళ పాలయ్యింది. ఆఖరికి అందరం ప్రగతి రిసార్ట్స్‌లో తేలాం. ఓ రాత్రి, ఓ పగలు హాయిగా, రిలాక్స్‌డ్‌గా గడపగలిగినా చాలు అనుకున్నాను. శుక్రవారం రాత్రి సరదాగా డాన్సులేసాం. పాటలు పాడాం. ''లాగూన్‌ విల్లా''లో మనమే వున్నాం. మనల్ని ఎవరూ డిస్టర్బ్‌ చెయ్యలేదు. మనిష్టమైనట్టు అల్లరి చేసాం.

ఉదయం ఐదన్నరకే నేను తయారై బయట కొచ్చేసాను. మీలో కొందరైనా అప్పటికే చెట్లతోనో, పుట్లతోనో కబుర్లాడుతుంటారని అనుకున్నాను. కానీ బయట ఎవ్వరూ లేరు. ప్రకృతి పచ్చగా, తాజాగా వెలిగిపోతోంది. తూర్పుదిక్కు నుండి ఉదయభానుడు వస్తున్నా, నీకు తోడుగా వస్తున్నానంటూ దర్శనమిచ్చాడు. ఒక్కదాన్ని, కాదు కాదు నాకు తోడుగా చెట్లు, పిట్టలు, బాతులు, నెమళ్ళు, సూర్యుడు. ఒక్కో మొక్కని పలకరిస్తూ, ఒక్కో పిట్టతో ముచ్చట్లాడుతూ ఆ ఉదయపు ఏకాంత ప్రశాంతతని వాటితో పంచుకుంటూ నేను పొందిన ఉల్లాసపు అనుభవం, ఆ అనుభవం ఇచ్చిన ఎనర్జీని నేను మాటల్లో చెప్పలేను. అక్షరాల్లోకి అనువదించలేను. మీరంతా ఇంతటి పాజిటివ్‌ ఎనర్జీనీ మిస్‌ అయ్యారని చాలాసార్లు అనుకున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్‌ ఏమిటంటే మీరు ఎక్కడికెళ్ళినా, ఏ మీటింగుకెళ్ళినా, ఏ ప్రాంతానికెళ్ళినా, ఎంత పని వత్తిడిలో వున్నా ఇలాంటి ఉదయాలని, ప్రకృతితో ఏకాంతాన్ని కోల్పోకండి. అనుభవించి చూడండి. ఈ చెట్లు ఎపుడూ చూసేవే! ఈ పిట్టలు ఎక్కడా వుండేవే! ఈ సూర్యుడు రోజూ వచ్చేవాడే. కొత్తదనం ఏముంది అనుకోవద్దు. ప్రకృతి నిత్య చైతన్య స్రవంతి. ఆ వైవిధ్యం మన ఊహకు అందనిది. మనం వయస్సుని మర్చిపోయి, మన అస్థిత్వాన్ని మర్చిపోయి ప్రకృతిలో మమేకమైపోవాలి. చిన్న పిల్లల అమాయకత్వంతో ప్రతీదాన్ని సరికొత్తగా చూడ్డం నేర్చుకుంటే ప్రపంచం ఎప్పటికీ కొత్తగా మన ముందు ఆవిష్కృతమవుతుంది. అక్కడ అద్భుతమైన ఔషధమొక్కలున్నాయి. నేను ఇదంతా రాసి మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. ఇక ముందైనా ఇలాంటి ఉదయాలని బద్ధకంగా నాలుగు గోడల మధ్యనో, టివీ ముందో కూర్చుని వ్యర్ధపరుచుకోకుండా, హాయిగా, వినీలాకాశం కింద, ఉదయపు శీతగాలి మన శరీరాన్ని ప్రేమగా తాకుతుంటే ఆ ఏకాంతాన్ని గాఢంగా మీరంతా అనుభవించాలన్నదే నా కోరిక. అంతే!

మీ బాల్యం గురించి చెప్పండి అనగానే అందరి ముఖాల్లోను ఒక లాంటి వెలుగును నేను చూసాను. కష్టాలున్నా సుఖాలున్నా, దు:ఖం గూడు కట్టుకుని వున్నా సరే మన బాల్యాలను తడుముకుంటే గొప్ప సంతోషం కల్గుతుంది. బాల్య స్మృతులు కొన్ని కలవరపెట్టినా చాలావరకు మనకు సంతోషాన్నిస్తాయి. ఒక్కో ఘటనని తవ్వుకుంటూ పోతే మసిబొగ్గులుండొచ్చు, మాణిక్యాలూ వుండొచ్చు. ఆ జ్ఞాపకాలు మనసును ఉద్వేగంలో ముంచెత్తుతాయి. గుండె వాకిళ్ళు తెరుచుకుని అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉబికి, ఉరికి వస్తుంటాయి. ఆ వొరవడిని ఆపడం ఎవరి తరం. అందుకే మనం అపుడపుడూ చిన్న పిల్లలమైపోవాలి. మన బాల్యాలను వెతికి పట్టుకోవాలి. ఆ జ్ఞాపకాలలో తడిసిముద్దయి పోవాలి. అందుకే నేను మీ బాల్యం గురించి అడిగాను. మన పని వొత్తిళ్ళను తగ్గించగలిగిన దివ్యౌషధం మన బాల్యం. మీలో చాలామంది చాలా ఉద్వేకంగా మాట్లాడారు. నిరాశగా వున్నపుడు, బతుకు నిస్సారంగా అన్పించినపుడు బాల్యం తాలుకు ఉద్వేగ స్మృతులు మనకి కొత్త శక్తి నిస్తాయి. మన తొలి అడుగు ఎక్కడ పడింది, మలి అడుగు ఎటు మళ్ళింది. ప్రస్తుతం ఎక్కడున్నాం అనే ఎరుకను కల్గిస్తుంది. ఈ ఎరుకను కల్గివుండడం మనలాంటి వాళ్ళకు చాలా అవసరం.

మీ రిలాక్సేషన్‌ పాయింట్స్‌ గురించి చెప్పమన్నపుడు అందరూ రకరకాలుగా స్పందించారు. చేస్తున్న పనిలో రిలాక్స్‌ అవుతున్నామని చెప్పినవాళ్ళు నిజంగా రిలాక్స్‌ అవుతున్నట్టు కాదు. పనిలో మునిగిపోయి దాన్నే రిలాక్సేషన్‌ అనుకుంటున్నట్టు నాకు అనిపించింది. పని వేరు. సేద తీరటం వేరు అని నేననుకుంటాను. పనిని, వ్యక్తిగత జీవితాన్ని కలిపేసుకోకూడదని నేను భావిస్తాను. ఒక్కోసారి పనిని ఇంటికి మోసుకెళ్ళడం తప్పక పోవచ్చు. ఎపుడూ అదే జరిగితే జీవితం యాంత్రికమైపోతుంది. ఇల్లు, పని తప్ప మరోటి ఏదీ కనబడదు. పని చెయ్యాలనే ఉత్సాహం నాశనమైతుంది. పనిని, వ్యక్తిగత జీవితాన్ని విడగొట్టుకోవడం చాలా అవసరం. అలాగే మనం ఎక్కడ ఊరట పొందుతాం అనేది గుర్తించడం చాలా అవసరం. మనకి ఊరటని, రిలాక్సేషన్‌ని ఇచ్చే ప్రాంతాలని, వ్యక్తుల్ని మనమే గుర్తించాలి. ఆ ప్రాంతాల్ని, ఆ వ్యక్తుల్ని ప్రాణప్రదంగా చూసుకోవాలి.

మీకు తెలుసా?

*  నేను ఆకాశమల్లె పూలు ఎప్పుడు పూస్తాయా అని ఎదురు చూస్తుంటాను. ఆ ఎదురు చూడ్డంలో ఎంతో ఆనందం వుంటుంది. ఆ చెట్ల కింత కూర్చుంటే ఆయాచితంగా ఆనందాన్ని జలజలా రాలుస్తుంది ఆకాశమల్లె చెట్టు. ఒక్కో పువ్వు సువాసనలు వెదజల్లుతూ మన శరీరాన్ని తాకుతుంటే ఎంత బావుంటుందో ఒక్కసారి అనుభవించి చూడండి.

*  పొగడపూలు రాలడాన్ని మీరెపుడైనా చూసారా? గాఢమైన ఆ పూలవాసనని అనుభవించారా? ఆ పూలని ఏరడంలో ఎంత సంతోషముందో, వాటిని పుస్తకాల్లో పెట్టి ప్రెస్‌ చేసి మీ ప్రియమైన నేస్తానికి ఓ గ్రీటింగు కార్డ్‌ చేసి ఇచ్చారా ఎపుడైనా? ట్రై చేయండి ప్లీజ్‌.

*  నేను హడావుడిగా ఏదో మీటింగుకి వెళ్ళుతుంటాను. హఠాత్తుగా ఆకాశం నిండా మబ్బులు కమ్మి వర్షం మొదలౌతుంది. నెక్లెస్‌ రోడ్‌లోకి వచ్చేటప్పటికి వాన ఆగిపోతుంది. చిన్న తుంపర పడుతుంటుంది. ఒక వేపు తుంపర. మరో వేపు సూర్యకిరణాలు. ఇంకేముంది హుస్సేన్‌సాగర్‌ మీద ఏటవాలుగా పరుచుకున్న ఇంద్రధనస్సు. ఏడు రంగుల్లో వొంగిన అద్భుత దృశ్యం. నేను ఆ దృశ్యాన్ని గుండెల్లో ఇంకించుకున్నాకే మీటింగుకెళ్ళేది. గొప్ప ఆనందాన్ని ఓ అరగంట అనుభవిస్తే తప్పేంలేదని నేననుకుంటాను. మీటింగులకేముంది రోజూ అవుతూనే వుంటాయి. ఇంద్రధనస్సు రోజూ వస్తుందా? వచ్చినా మన కంట పడుతుందా?

ఎంత బిజీగా వున్నా, ఎన్ని పనుల్లో మునిగి తేెలుతున్నా మన ప్రియమైన నేస్తాలని మర్చిపోకూడదని నేను అనుకుంటాను. గాఢమైన స్నేహం గొప్ప రిలాక్సేషన్‌. మనల్ని మన బలాలు, బలహీనతలతో సహా స్వీకరించగలిగిన ప్రాణనేస్తాలు ఒకరిద్దరైనా వుండాలి. స్నేహం చెయ్యడం గొప్ప కాదు. దాన్ని నిలుపుకోవడం, ఎన్ని సంవత్సరాలైనా నిత్యనూతనంగా వుంచుకోగలగడం గొప్ప విషయమని నేను భావిస్తాను. మనం నవ్వినపుడు నవ్వేవాళ్లే కాదు, మనం ఏడ్చినపుడు తమ భుజాన్ని మనకి ఇవ్వగలిగినవాళ్ళే నిజమైన నేస్తాలు. మన దు:ఖ ఉధృతి ప్రియ నేస్తం కరస్వర్శతో తప్పక తగ్గుతుంది. ఇలాంటి స్నేహాన్ని మనం సంపాదించుకుంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనల్నేమీ చెయ్యలేవని నేను నమ్ముతాను.

మన కుటుంబాలు, కుటుంబ సభ్యులు, సహచరులు, పిల్లలు వీళ్ళందించే తోడ్పాటుకు తోడు బయట నుండి కూడా మనకు పైవన్నీ కావాలి. మనం రోజూ ఎందరో బాధితులను కలుస్తుంటాం. వారి బాధల్ని, సమస్యల్ని వింటూ వుంటాం. ఒక్కోసారి వారి దు:ఖం మనల్ని విచలితుల్ని చేస్తుంది. ఒక ట్రాఫికింగు కేసులో ఓ చిన్న పిల్ల దు:ఖం భానుజను ఎంత కుదిపేసిందో నేను చాలా దగ్గరగా చూసాను. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురౌతుండొచ్చు. మేమూ హెల్ప్‌లైన్‌లో ప్రతి రోజూ దు:ఖ సముద్రాలని దాటుతూ వుంటాం. మన చుట్టూ , స్త్రీల జీవితాల చుట్టూ కష్టాలూ, కన్నీళ్ళు వున్నపుడు అవి తప్పకుండా మనల్ని తాకుతాయి. బాధిత స్త్రీల పక్షాన మనం పనిచెయ్యాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ బాధలు మనని తాకుతుంటాయి. తప్పదు.

మరి మన మానసిక వొత్తిళ్ళ మాటేమిటి? మన కన్నీళ్ళకి ఔట్‌లెట్‌ వుండాలి కదా! మన మనసులకి అపుడపుడూ ఉల్లాసం కావాలి కదా! అందుకే ఇలాంటి రిలాక్సేషన్‌ వర్క్‌షాప్‌లు చాలా అవసరం. మనం మొత్తం మొద్దుబారిపోకుండా వుండాలంటే మన లోపలికి మనం చూసుకోవడం చాలా అవసరం. మనం చేసే పని యాంత్రికంగా మారిపోకూడదంటే మనకి కొంత రిలీఫ్‌ అవసరం.

రిలీఫ్‌ ఎక్కడ దొరుకుతుంది? రిలాక్సేషన్‌ పాయింట్స్‌ ఎక్కడుంటాయి అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. నా వరకు ఏం చేస్తానో రెండు మూడు అంశాలు రాసాను. మీరేం చేస్తారో మీ ఇష్టం. మనందరం కలిసి ఒక సామూహిక శక్తిగా పనిచెయ్యాలి కాబట్టి మన మనో ప్రపంచాలను తప్పకుండా బలోపేతం చేసుకోవాలి.

మీతో గడపడం, మీకోసం వర్క్‌షాప్స్‌ నిర్వహించడం నాకు మంచి అనుభవాన్నిచ్చాయి. మీరందరూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఐక్యంగా వుండాలని కోరుకుంటూ...



సత్యవతి

Tuesday, April 6, 2010

నవ్వుల నది లో పువ్వుల వాన దిండి వర్క్ షాప్

ఆ రోజు ఉదయం ఎనిమిదింటికి గిరిజ దగ్గర నుండి ఫోన్‌ వచ్చింది. ఆక్స్‌ఫామ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసరు గిరిజ గొంతులో సుడులు తిరుగుతున్న దు:ఖ సవ్వడి స్పష్టంగా విన్పిస్తోంది. ”ఏమైంది గిరిజా! మీ గొంతు అలా వుందేమిటి అని అడగ్గానే ”నాగమణి గారు చనిపోయారండి. నేను ఎ.పి వుమెన్స్‌ నెట్‌వర్క్‌ దగ్గరున్నాను” అన్నారు. నేను ఆశ్చర్య పోయాను. వారం క్రితం నాగమణిని ఒక మీటింగులో కలిసాను. ఆవిడ ఇంత హఠాత్తుగా చనిపోవడమేమిటి? చిన్న వయస్సే. కేవలం 42 సంవత్సరాలు. నేను వెంటనే బయలు దేరి తార్నాకాలో వున్న ఎపి వుమెన్స్‌ నెట్‌వర్క్‌ ఆఫీసు కెళ్ళాను. నాగమణి నిద్రపోతున్నట్టుగా వుంది గానీ చనిపోయినట్టునిపించలేదు. స్నానం చేసి బాత్‌రూం నుండి బయటికి వచ్చి పడిపోయిందని, ఆస్త్మా ఎటాక్‌ వచ్చిందని చెప్పారు.

నెట్‌ వర్క్‌ సభ్యులు చాలామంది వున్నారక్కడ. కుమిలి కుమిలి ఏడు స్తున్నారు. కొంతమంది బిగ్గరగా ఏడుస్తూ ”మా బతుకులు కూడా ఇంతే. నాగమణికి పట్టిన గతే మాకూ పడుతుంది. ఏదో మీటింగుకి వచ్చి, ఎవరూ లేకుండానే చస్తాం. ఈ పని వొత్తిళ్ళు, డెడ్‌లైన్లు మమ్మల్ని కూడా చంపేస్తాయి. అసలు మేమెందుకు సంఘాలు నడపాలి? వొత్తిళ్ళతో చావడానికా?” ఈ మాటలు నాకు సూటీగా తాకాయి. నాగమణి మరణం కల్గించిన దు:ఖం ఒక వైపు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నెట్‌వర్క్‌ సభ్యుల్లో కొందరి హృదయవిదారక దు:ఖ వ్యాఖ్యలు. ఆశ్చర్యంతో కూడిన బాధ నన్ను చుట్టు ముట్టింది. ‘వుమెన్‌ హెడెడ్‌ ఎన్‌జిఓలు’ గా వున్న వీళ్ళంతా ఎన్నెన్నో పనుల్లో, ప్రోగ్రాంల్లో మునిగితేలుతూ వుంటారు. ఉదయం లేచిన దగ్గరనుండి మీటింగుల్లో ,ట్రయినింగుల్లో బిజీగా వుంటారు. వీళ్ళేమిటి ఇంత బేలగా, నిస్సహాయంగా రోదిస్తున్నారు అనుకుంటూ చాలా ఆశ్చర్యపోయాను. నాగమణి పనివొత్తిడి వల్లే చనిపోయిందా? ఇంత స్త్రెస్‌తో వీళ్ళు పనిచేస్తుంటారా? అసలు వీళ్ళంతా రిలాక్స్‌ అవుతారా? ఎప్పడూ ప్రాజెక్టుల్లో కొట్టుకుపోతుంటారా? ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టు ముట్టాయి. మనం చేసే పనే మన మరణానికి దారి వేసేదైతే ఆ పనిని అలా కాకుండా ఇంకో విధంగా చెయ్యలేమా? ఆ పని నుండి కొంత విరామం తీసుకుని, రీచార్జ్‌ అయితే ఇంకా బాగా చెయ్యగలుగతాం కదా. ఎన్నో పనులు చేసే వీళ్ళు రిలాక్స్‌షన్‌, కెపాసిటీ బిల్డింగు మీద దృష్టిి పెట్టడం లేదు అన్పించింది.

నా బుర్రను తొలుస్తున్న ఆలోచనల్ని గిరిజతో పంచుకున్నాను. ”దీని గురించి ఏదైనా చెయ్యాలన్పిస్తోంది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో స్పష్టత రావడం లేదు. రచయిత్రుల క్యాంప్‌లాగా, వీళ్ళందరికి రిలాక్స్‌షన్‌ క్యాంప్‌ పెడితే ఎలా వుంటుంది.” ”చాలా బావుంటుంది. ప్లాన్‌ చెయ్యండి” అంది గిరిజ. అదేమాట సిడబ్లుఎస్‌ సుచరితతో అన్నపుడు ”బావుంటుంది. మీరొక ప్రపోజల్‌ ఇవ్వండి” అన్నారు. ఇంకేముంది. ప్రపోజల్‌ ఇవ్వడం, ఒప్పుకోవడం అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. రెండు వర్క్‌షాప్‌లు ప్లాన్‌ చెయ్యమన్నారు.

ఈ వర్క్‌షాప్‌ ప్లాన్‌ చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. ఎపి వుమెన్స్‌ నెట్‌ వర్క్‌ సభ్యులేమీ చిన్నస్థాయి వాళ్ళు కాదు. తమ తమ రంగాల్లో అద్భుతంగా పని చేస్తున్నవాళ్ళు. కొందరు హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ట్రాఫికింగుమీద పిల్లలతో, స్త్రీలతో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బాధితులతో పనిచేస్తున్నవాళ్లు వున్నారు. నిత్యం బాధితులను వింటునో, బాధితుల పక్షాన మాట్లాడుతూనో, బాధితుల కోసం ఉద్యమాలు చేస్తూ విపరీతమైన ఎక్స్‌పోజర్‌ వుండే సభ్యులకోసం నేను వర్క్‌షాప్‌ పెడితే అది ఎలా వుండాలి? అసలు నేను పిలిస్తే వీళ్ళు వస్తారా? అనే శంకతోనే సభ్యులందరికీ ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాసాను. వారు నిర్వహించుకునే సమావేశానికి వెళ్ళి నేను ఎందుకు ఈ వర్క్‌షాప్‌ నిర్వహించాలనుకుంటున్నానేె చెప్పాను. నాగమణి మరణం నాటి రోజు నాకు ఎదురైన అనుభవం గురించి చెప్పాను. ఆశ్చర్యంగా అందరూ ముక్త కంఠంతో నా నిర్ణయాన్ని స్వాగతించారు, నేను రాసిన ఉత్తరం తమని కదిలించిందని తమ జీవితాల గురించి తామే ఆలోచించడం మర్చిపోయిన సందర్భంలో మా గురించి మీరింత బాధపడటం, శ్రద్ధగా వర్క్‌షాప్‌ నిర్వహించాలని నిర్ణయించుకోవడం మమ్మల్ని కదిలించింది. కన్నీళ్ళు పెట్టించింది. మేము తప్పక వర్క్‌షాప్‌కి వస్తాం, అంటూ వాగ్దానం చేసారు. నాకు చాలా సంతోషమేసింది. వర్క్‌షాప్‌ పనులు మొదలు పెట్టేసాను.

ఇదేమీ రోటీన్‌గా నిర్వహించే వర్క్‌షాప్‌ కాదు. పేపర్‌ ప్రజెంటేషన్‌లు, చర్చోపచర్చలు, వాదోపవాదాలు, సమయపాలనలు లాంటివేమీ వుండని భిన్నమైన వర్క్‌షాప్‌. పాల్గొనే సభ్యుల మన:శరీరాలను మొత్తంగా రిలాక్స్‌ చెయ్యగలిగేరీతిలో దీన్ని ప్లాన్‌ చెయ్యాలనుకున్నాను. నగర కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా, నీళ్ళకి అతి సమీపంగా వుండే స్థలం కోసం వేట మొదలుపెట్టాను. తలకోన, హార్సీలీ హిల్స్‌, మామండూరు, అరకు ఇంకా ఎన్నో పేర్లు గుర్తొచ్చాయి. అయితే అంతకు కొంతకాలం ముందు నేను వెళ్ళొచ్చిన దిండి గుర్తొచ్చింది. అద్భుతమైన ప్లేస్‌. చుట్టూ పచ్చటి కొబ్బరి తోటలు, మధ్య గోదావరిగట్టు మీద టూరిజమ్‌ వాళ్ళు కట్టిన ‘దిండి’ గెస్ట్‌హౌస్‌ ఈ వర్క్‌షాప్‌కి కరెక్టుగా సరిపోతుందనిపించింది. చకాచకా బుకింగులయిపోయాయి. నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్‌లు, మిగిలిన ఏర్పాట్లు వేగంగానే జరిగిపోయాయి.

సెప్టెంబరు 21 నుండి 23 వరకు మూడు రోజులు దిండిలోనే వుండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబరు 20న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మా ప్రయాణం మొదలైంది. డా. యు. వింధ్య, డా. అర్వింద్‌ (నాసిక్‌)లు రిసోర్స్‌ పర్సన్‌గా మాతోనే బయలుదేరారు. మొత్తం ఇరవై మందిమి ఇక్కడి నుండి బయలు దేరితే మరి కొందరు డైరెక్టుగా దిండికి వచ్చేలా ప్లాన్‌ చేసుకున్నారు. జ్వరాల కారణంగా కొంతమంది చివరి నిమిషంలో ఆగిపోయారు. నర్సాపూర్‌లో ట్రయిన్‌దిగి బస్సులో ‘దిండి’ గ్రామం చేరాం. చించినాడ గ్రామం దగ్గర కట్టిన బ్రిడ్జి మీదకి బస్సు రాగానే గోదారమ్మ దర్శనమై అందరూ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత గోదావరి ఒడిలో వున్న భ్రమ కల్గించే దిండి గెస్ట్‌హౌస్‌ని చూడగానే అందరి ముఖాలు వికసించాయి. గెస్ట్‌హౌస్‌కి ఎదురుగా వున్న కొలనులో పూసిన రంగు రంగుల కలువ పూలు కనువిందు చేస్తుంటే అందరం రూమ్‌ల్లో సర్దుకున్నాం.

మొదటి రోజు పదకొండు గంటలకి మొదటి సెషన్‌ మొదలైంది. నిజానికి ఈ వర్క్‌షాప్‌ని నేను గంటలుగా విభజించలేదు. ఇదీ అంశమని నిర్ణయించలేదు. మొదటి రోజును రిసోర్స పర్సన్‌గా వచ్చిన వింధ్యకే వదిలేసాను. పరస్పర పరిచయాలనే నా పేరు… అంటూ కాకుండా చాలా భిన్నంగా వాళ్ళు ఇష్టపడే ఆహార పదార్ధం పేరు చెప్పి మొదలు పెట్టేలా తను ప్రోత్సహించింది. తన కిష్టమైన తిను బండారం గురించి చెబుతూ, తనకి ముందు చెప్పిన వారందరికి ఇష్టమైనవి కూడా చెప్పాలి. దీనిద్వారా ఏకాగ్రతగా ఎదుటివాళ్ళు చెప్పేది వినాల్సి వుంటుంది. ఉదా.సత్యవతికి చేపలకూర, శివకుమారికి రొయ్యల వేపుడు, మేరికి బెండకాయ, భానుజకి గుత్తి వంకాయ నాకేమో మైసూర్‌పాక్‌ ఇష్టం నా పేరేమో అంటూ ఇలా సరదాగా పరిచయాల కార్యక్రమం నవ్వుల మధ్య జరిగింది. ఎవరికేది ఇష్టమో గుర్తు పెట్టుకుంటూ, ఆ విషయం చెబుతూ తన గురించి చెప్పుకోవడమనే ఈ ప్రక్రియ వల్ల పరిచయాలు రొటీన్‌గా కాక సరదాగా, గలగల నవ్వుల మధ్య జరగడంతో వర్క్‌షాప్‌ ఉల్లాసంగా మొదలైంది.

వింధ్య రకరకాల ఆటలు, పాటలు, ఎక్స్‌ర్‌సైజులద్వారా పార్టిసిపెంట్స్‌ ఈ వర్క్‌షాప్‌ద్వారా ఏమి ఆశిస్తున్నారు? వాళ్ళ ఆశలు, భయాలు, ఆశయాలు, సంకోచాలు ఏమిటనేవి రాబట్టారు. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఒక పేపర్‌ మీద రాయించి, వాటన్నింటినీ చార్టులమీద కెక్కించి విశ్లేషిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఒక సంస్థ నిర్వాహకులుగా ఉంటూ, నిత్యం బాధితుల మధ్య, బాధితుల్ని వింటూ, వారికి సహాయం చేస్తూ, కౌన్సిలింగు చేస్తూ వుండడంవల్ల, ఎక్కువ సమయాన్ని దానికే కేటాయించడంవల్ల ”నేనేమిటి? నా జీవితం ఏమిటి? నాకేం కావాలి?” అని ఆలోచించ డానికి సమయం లేకుండాను తమ తమ సామర్ధ్యాలను మించి ప్రాజెక్టులు తీసుకుంటే, అవి పెంచే వొత్తిడిని తట్టుకోవడం కష్టమౌతుందని చెబుతూ ఇంటిని, ఆఫీసుని అంతా కలగాపులగం చేసుకోవడంవల్ల జరిగే అనర్ధాల గురించి చిన్న చిన్న ఎక్సర్‌సైజుల ద్వారా చక్కగా తెలియచెప్పింది. కుటుంబానికి, కార్యాలయానికి మధ్య శాఖని గీయకుండా ఆఫీసుని ఇంటికి, ఇంటిని ఆఫీసుకి మోసుకురావడంవల్ల కుటుంబ సభ్యుల్లో ఎలాంటి అసంతృప్తి మొదలవుతుందో వివరించారు. ఇరవై నాలుగు గంటలూ వీటిల్లో మునిగితేలితే ”మనకోసం” అంటూ ఏమైనా మిగులుతుందా? మనకోసం సమయాన్ని కేటాయించుకోవడం నేరంగా, అపరాధభావం మనలో కల్గించే పరిస్థితుల మధ్య మనం ఘర్షణ పడుతుంటాం. మనం చేెయదల్చుకున్న పనులు చెయ్యాలిగాని, మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. మనం చేసే పనిలో నైపుణ్యాల్ని పెంచుకోవాలి. మన ఇష్టాఇష్టాలు, మనం మర్చిపోయిన ఆకాంక్షలు, చిన్న చిన్న కోరికలు వీటికి కూడా ప్రాధాన్యమివ్వాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. పరిపోషించుకోవడం చాలా అవసరం అనే ఫెమినిస్ట్‌ కాన్సెప్ట్‌ని గాఢంగా మన జీవితంల్లోకి అనువదించుకోవాలి అనే విధంగా వింధ్య సెషన్‌ నడిచింది.

మన మనస్సు ఎక్కడ సేద తీరుతుందో, మనలోకి మానసిక వొత్తిడి ఎక్కడ కరుగుతుందో అలాంటి చోట్లని మనం కనిపెట్టాలి. ఉదా. ప్రియనేస్తంతో కాసేపు కబుర్లాడితే కొందరు సేదతీరొచ్చు. మంచి పుస్తకం చదివితేనో, పండు వెన్నెల్లో నడిస్తేనో, పసిపిిల్లల్తో ఆడుతూనో, పాటపాడితేనో ఇలా ఎన్నో పనుల్లో మనసు సేదతీరుతుంది. టైమ్‌ లేదని అవన్నీ వొదిలేసి, అభిరుచుల్ని చంపేసుకుని పొద్దస్తమానం ఇంటి పనుల్లోనో, ఆఫీసు పనుల్లోనో మునిగి తేలితే మిగిలేది గానుగెద్దులాంటి యాంత్రిక జీవితమే. ‘పర్సనల్‌ నర్చరింగు ఆవశ్యకతని, అవసరాన్ని చక్కగా అర్ధం చేయించింది వింధ్య మొదటి రోజు సెషన్‌లో.

సూర్యాస్తమయమౌతున్నప్పుడు, నారింజ రంగు కిరణాలు పడి గోదావరి మిల మిల మెరుస్తున్నవేళ బోటుమీద షికారెళ్ళాం. నవ్వుల్తో, పాటల్తో హోరెత్తి పోయింది. చీకటి పడుతున్నపుడు బోటు దిగి అక్కడ పిల్లల కోసం అమర్చిన ఉయ్యాలలు తదితరాల మీద ఎక్కి కూర్చుని ఇంత పెద్ద ఎన్జీవో నాయకురాళ్ళు పిల్లల్లా గెంతుతూ, కేరింతలు కొట్టారు. జోకులూ, నాటకాలు ఆడుతూ తుళ్ళి తుళ్ళి పడుతూ, విరగబడి నవ్వుతూ సర్వం మర్చిపోయినట్టు కనిపించారు.

మర్నాడు అరవింద్‌ రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించాడు. లెక్కలేనన్ని ఆటలు ఆడించాడు. ముఖ్యంగా టైమ్‌మేనేజ్‌మెంట్‌, పరస్పర సహకారం, సపోర్ట్‌, బాల్యాన్ని గుర్తు చేసుకోవడం, నడిచి వచ్చిన జీవితం గురించి పంచుకోవడం మొదలైన అంశాలతో ఎక్స్‌ర్‌సైజుల్ని మిళితం చేసి క్లాసు నడిపించాడు. మోకాళ్ళ మీద కింద కూర్చుని ఒకరి వీపునకు ఇంకొకరి వీపు ఆనించి చేతులు కింద ఆన్చకుండా ఒకరిని ఇంకొకరు సపోర్ట్‌ చేసుకుంటూ పైకి లేవాల్సిన ఆటని ప్రతినిధులంతా ఎంతో ఉత్సాహంగా ఆడారు. ఒకరు పైకి లేవాలంటే ఇంకొకరి సహకారం తప్పని సరిగా వుండాలి. లేకుంటే పడిపోతారు. పైకి లేవలేరు అని చెప్పే ఈ ఆట ద్వారా మన మధ్య పరస్పర సహకారం ఎలా వుండాలో చక్కగా వివరించాడు అరవింద్‌. కొన్ని పాత ఫోటోలు చెల్లా చెదరుగా కింద చల్లేసి అందుల్లోంచి వాళ్ళ కిష్టమైన, తమని తాము పోల్చుకునే ఫోటోలను ఎంపిక చేసుకుని వాటి గురించి చెప్పమని ప్రోత్సహించే ఒక గేమ్‌ కూడా ఆడించాడు. తలొక ఫోటో తీసుకుని తమ బాల్యాన్ని, తాము పొందలేకపోయిన వాటిని, తాము ఆశించిన వాటిని, తమ సొంత ఊరుని గుర్తు చేసుకుంటూ చెప్పమని అడిగినపుడు అందరూ చాలా ఉత్సాహంగా తమ గురించి చెప్పుకొచ్చారు.

టైమ్‌ మానేజ్‌మెంటు మీద చక్కటి వివరణలతో అతను వివరించాడు. సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి? ప్రపంచంలో ఎవ్వరికీ 25గం.లు దొరకవు. అందరికీ 24 గం. మాత్రమే వుంటాయి. ప్రాధాన్యతలు మనమే నిర్ణయించుకోవాలి. మనం చేసే ప్రాజెక్టుల్ని బట్టి సమయం పాలన, సమయం నిర్దేశం నిర్దారించుకోవాలి. ఏవి ముఖ్యమైనవి, ఏవి అప్రధానమైనవో వర్గీకరించుకుంటూ వాటికి అనుగుణమైన సమయ నిర్దేేశం ఎలా చేసుకోవాలో ఉదాహరణలతో సహ అరవింద్‌ వివరించాడు. అలాగే పర్సనల్‌ విషయాలల్లోకి ఆఫీస్‌ వ్యవహారాలు రాకుండా చూసుకోవాలని దాని కోసం ఆపీసుకి, వ్యక్తిగతానికి మధ్య విభజన రేఖని గియ్యాలని లేకుంటే జీవితం యంత్రంలా తయారై వొత్తిళ్ళతో అనారోగ్యాల పాలవుతామని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పర్సనల్‌ షేరింగులో కొంతమంది ప్రతినిధులు తమ జీవితానుభవాలను పంచుకున్నారు. వింటున్నవాళ్ళ కళ్ళు చెమర్చి, హృదయాలు భారమైన సన్నివేశమది. తమ సహచరుల వ్యక్తిగత జీవితం లోని వేదన, ఘర్షణ, కలలు, కన్నీళ్ళు, ఆశలు, ఆశయాలు గురించి సహానుభూతిలో విన్నపుడు, అర్ధంచేసుకున్నప్పుడు వారి మధ్య ఒక గాఢమైన బంధం అల్లుకునే అవకాశం వుంటుంది. వ్యక్తులుగా వేరు వేరు అయినప్పటికీ వారొక సమూహంగా, ఒక నెట్‌వర్క్‌గా కలిసి మెలిసి పనిచెయ్యడానికి ఈ సహానుభూతితో వినడం అనేది చాలా చక్కగా ఉపయోగపబుతుంది. సానుభూతి వేరు సహానుభూతి వేరు. సానుభూతి నాలుక చివరి నుండి వస్తే సహానుభూతి గుండెలోతుల్లోంచి ఉబికి వస్తుంది. పర్సనల్‌ షేరింగు తర్వాత ఆ రోజు సెషన్‌ ముగిసింది.

సంధ్యవేళ మా గుంపంతా స్విమ్మింగు ఫూల్‌ మీద దాడి చేసింది. నేను స్విమింగు సూట్‌ తీసుకెళ్ళాను కాబట్టి హాయిగా దూకి స్విమ్‌ చేసాను. కొంతమంది హోటల్‌ నుంచి అద్దెకు తీసుకుని పూల్‌లో దిగారు. అల్లరి, నీళ్ళల్లో కేరింతలు, ఫోటోలు, స్మిమ్మింగు రానివాళ్ళు సైతం ట్యూబులు తగిలించుకుని చేతులు కాళ్ళు టప టపా కొడుతూ చిన్న పిల్లలై పోయారు. నీళ్ళల్లో చిందులేసారు. చీకటి చిక్కపడేవరకు నీళ్ళల్లో చేపల్లా కొట్టుకుని బయటకొచ్చాం. డిన్నర్‌ వరకూ మీ ఇష్టం అంటూ అందరిని వదిలేసి, నేనూ గీత ఉదయం ఏరుకొచ్చిన తాటిపండును కాల్చే పనిలో పడ్డాం. హరిశ్చంద్ర ప్రసాద్‌ అనే రూమ్‌ బాయ్‌ని పట్టుకుని, కొబ్బరాకుల్తో మంటేసి తాటి పండుని కాల్చేసాం. మా రూమ్‌లోకి తీసుకెళ్ళి అందరిని పిల్చాం గానీ అరవింద్‌ ఒక్కడే వచ్చాడు. ముగ్గురూ మూడు టెంకలు తీసుకుని ఉడతల్లా తిన్నాం. కమ్మగా, తియ్యగా, భలే వుంది తాటి పండు. డిన్నర్‌లో అందరికి రుచి చూపించాం కూడా.

మూడో రోజు సెషన్స్‌ ఏమి పెట్టలేదు. రోజంతా బయట తిరిగే ప్రోగ్రాం పెట్టాం. ఆ..అన్నట్టు రెండో రోజు, మూడో రోజు ఉదయం యోగా, ప్రాణాయాయం క్లాసు నేనే తీసుకున్నాను. అందరూ శ్రద్ధగా ప్రాణాయాయం నేర్చుకున్నాను. ప్రతి రోజు తప్పక చేస్తామని ప్రామిస్‌ చేసారు. తొమ్మిదింటికల్లా తయారై బ్రేక్‌పాస్ట్‌ చేసేసి బస్సులో అంతర్వేదికి బయలు దేరాం. బయలు దేరే ముందు ఫోటో సెషన్‌ నడిచింది. కొలనును, కలువల్ని, కొలను పక్క ఇంటిని ఫోటోల్లో బంధించాం. అంతర్వేదిలో గుడికెళ్ళే వాళ్ళు వెళ్ళారు. తర్వాత ప్రత్యేకంగా లాంచి మాట్లాడుకుని అఖండ గోదారి, బంగాళా ఖాతంలో కలిసే ”అన్నాచెల్లెలు” గట్టుకు ప్రయాణమయ్యాం. గోదావరి మీద లాంచి ఊగుతోంది. దూరంగా సముద్రపు అలలు నురగల్లా కన్పిస్తున్నాయి దగ్గరకెళ్లే కొద్దీ లాంచి చిన్న బోటులా ఎగిసి పడసాగింది. సముద్రపు ఆలలు ఊపేస్తున్నాయి. పాటలు పాడుతూ, పడవ ఊగినప్పుడల్లా కెవ్వుమని కేరింతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ అనుభూతిని గుండెల్లో దాచుకున్నాం. అన్నాచెల్లెలు గట్టుకి అతి సమీపంగా, గోదావరి లోంచి సముద్రంలోకి వెళ్ళినపుడు మా గుండెల్లోనే గోదారి ఉరకలేసినట్టునిపించింది. గోదావరి పుట్టుక స్థలం నుంచి వచ్చిన అరవింద్‌ తమ ఊళ్ళో పుట్టిన గోదావరి అక్కడ సముద్రంలో లీనమౌతున్న దృశ్యాన్ని తన్మయంగా చూడడం నేను గమనించాను. గొప్ప సంతోషాన్ని మూట గట్టుకుని, ఆ ముటని తలమీద మోస్తూ తన్మయమవుతూ మేం వెనుతిరిగాం.

అంతర్వేదిలో వశిష్టాశ్రమం నిర్వహిస్తున్న ప్రసాదరాజు గారు ఎంతో అప్యాయంగా, ఆత్మీయంగా తామే స్వయంగా కొసరి కొసరి వడ్డిస్తూ మాకు లంచ్‌ ఏర్పాటు చేసారు. గోదావరి ఒడ్డున వున్న ఆ అశ్రమం గురించి తమ కార్యకలాపాల గురించి వివరించారు. ప్రతి పున్నమికి అనేక మంది జంటలుగా ఇక్కడికొస్తారని పౌర్షమి స్నానం చేస్తారని, ఒకరికొకరు మనసువిప్పి మాట్లాడుకునే ఏర్పాటు వుంటుందని వచ్చే పున్నమికి మీరు కూడా రండి అని మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పి నర్సాపూర్‌ వేపు సాగిపోయాం. మా ఊరు సీతారమపురంలో వున్న లేస్‌ పార్క్‌కి తీసుకెళ్ళినపుడూ అందరూ బోలెడన్ని లేస్‌ వస్తువులు కొనుక్కున్నారు. అక్కడి నుండే స్టేషన్‌కెళ్ళి 6.30కి రైలెక్కేసాం. దీనితో మూడు రోజుల యాత్ర ముగింపుకొచ్చింది. ప్రతినిధులందరూ చాలా రిలాక్స్‌ అయ్యామని, మూడు రోజులు మా కోసమే గడపడం అనేది చాలా అపూర్వమని, ఈ పచ్చటి పరిసరాలు, గోదావరి తీరం చాలా ఆనందాన్నిచ్చాయని పేర్కొన్నారు. ఇంకో వర్క్‌ షాప్‌కోసం ఎదురు చూస్తామని, మా కోసం మేము ఆలోచించుకోవడం మానేసిన వేళ, మీరు మా కోసం ఇంత చక్కటి వర్క్‌షాప్‌ని ప్లాన్‌ చెయ్యడం బావుందని అందరూ చెప్పారు.

ఆ తర్వాత వచ్చిన ఉత్తరాలు, ఫోన్‌ సంభాషణలుపై అభిప్రాయాన్నే బలపరిచేవిగా వున్నాయి. నేను అనుకున్న విధంగానే మొదటి వర్క్‌షాప్‌ జరగడం నాకు చాలా తృప్తినిచ్చింది.పచ్చటి చెట్లు, గోదావరిగట్లు, సముద్రకెరటాలు, చందమామకిరణాలు, సూర్యోదయాలు, చల్లటి పిల్లగాలులూ, వెరశి ప్రకృతితో మమేకం ప్రకృతికి దగ్గరవ్వడం వీటిని మించిన స్ట్రెస్‌ రిలీఫ్‌ వేరే ఏమైనా వుందా? మనుష్యులతో కలిసి పనిచెయ్యడం, ప్రకృతిలో సేద తీరడం - దీన్ని మించిన మందు మరేదైనా వుందా? పని చేసేటపుడు గాడిదలాగా పనిచెయ్యాలి. సేద తీరేటపుడు చిన్న పిల్లలమైపోవాలి. గాఢస్నేహమెంత గుండె నిబ్బరాన్నిస్తుందో అనుభవించి చూడా ల్సిందే! ప్రియనేస్తం కరస్పర్శ కన్నీటి సముద్రాల్ని సైతం జయిస్తుంది. ఇది నా అనుభవం.నా ఆచరణ.

మన చుట్టూ జీవితం సంక్షోభమయం, విషాదమయం, సమస్యలమయం. మనం నిత్యం మసిలేది బాధితులలోనే అయినపుడు మన గుండె ఎప్పుడూ రాచపుండే. ఆ పుండుకి మనమే మందేసు కోవాలి. మాన్పుకోవాలి. అపుడు కదా మనం బాధితుల పక్షాన నిలబడగలం. మనమే కుప్పకూలుతుంటే… మనమే జావగారు తుంటే…

ఈ వర్క్‌షాప్‌ నిర్వహణలో ఎందరో మాకు సహకరించారు. ముఖ్యంగా ఆర్ధిక వనరులు అందించిన సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీకి కృతజ్ఞతలు. ఆక్స్‌ఫామ్‌ గిరిజకి ధన్యవాదాలు. భూమిక టీమ్‌ అపార కృషిి వల్లే ఇది సాధ్యమైంది. డా. వింధ్యకి, నాసిక్‌ నుండి వచ్చి మూడు రోజులు మాతోనే వున్న అరవింద్‌కి ధాంక్స్‌. అన్ని ఏర్పాట్లులో సహకరించి భీమవరంలో వేడి వేడి డిన్నర్‌ అందించిన నా కజిన్‌ బాబు, కడప నుంచి వచ్చి జ్వరం పాల్పడ్డ సుగుణని ఆసుపత్రికి తీసుకెళ్ళి, ఆ రాత్రికి తమతోనే తమింట్లో వుంచుకున్న, నా తమ్ముడు అబ్బులు, బుజ్జిలకు ధాంక్స్‌ చెప్పి తీరాలి. అంతర్వేదిలో భోజన ఏర్పాటు చేసిన ప్రసాదరాజుగారికి, ఈ ఏర్పా టుకి కారకులైన డా. చినిమిల్లి సత్యనారాయణగార్కి ధన్యవాదాలు. వాహన సహకారం అందించిన కె.ఎస్‌. (కాశబ్బు)కి ధాంక్స్‌.

చివరగా, నా ప్రియనేస్తం , భూమిక జాయింట్‌ సెక్రటరీ గీత తోడు లేకుండా వుంటే నేనీ వర్క్‌షాప్‌ని ఇంత అపూర్వంగా నిర్వహించ గలిగివుండేదాన్ని కాదు. తనకి మరింత స్నేహాన్ని తప్ప ఇంకేమి ఇవ్వగలను?

Sunday, April 4, 2010

ఏ బ్లాక్ ఇన్ హార్ట్( A BLOCK IN HEART)

అనుకోకుండా, హఠాత్తుగా
ఈరోజు నీ హ్రుదయాన్ని చూసాను
సీటి యాంజియో యంత్రం
నీ గుండెను పొరలు పొరలుగా విప్పి చూపిస్తుంటే
నేను రెప్పవేయడం మర్చిపోయాను
నువ్వు నా గుండెల్లోనే ఉన్నావని
నువ్వెప్పుడూ అనే మాట గుర్తొచ్చి
ఏ పొరలో ఉన్నానా అని వెతుకుతుంటే
నీ హ్రుదయ కవాటం లబ్ డబ్ మంటూ
ఒకే లయలో మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటే
ఏ కవాటం నా ముఖాన్ని చూపిస్తుందా
అనుకుంటూ ఊపిరి బిగబట్టి చూస్తుంటే
ఒక చోట ఎర్రటి సర్కిల్ కనబడింది
యా!! దిసీజ్ ద బ్లాక్! స్టాప్ దేర్
అనే మాట నా చెవుల్లో పడింది
నీ హ్రుదయంలో నన్ను నేను వెతుక్కుంటుంటే
నీ రక్తనాళాల్లొ కొవ్వు ముద్ద కనబడి
ఓ క్షణం నా గుండె లయ తప్పింది
గుండెల్లో కొలువుండేది మనుష్యుల ముఖచిత్రాలు కాదని
మంచు ముద్దల్లాంటి కొవ్వు కణాలని అర్ధమై
నా కళ్ళు శ్రావణ మేఘాలే అయ్యాయి.

Saturday, April 3, 2010

భల్లుగూడ బాధిత మహిళల మౌన ఘోష

జనవరి 22న విశాఖ జిల్లా భల్లుగూడలో వాకపల్లి పునరావృతమైంది. మావోయిష్టులకు ఆశ్రయమిస్తున్నారనే నెపాన్ని చూపించి గ్రౌహౌండ్స్‌ పోలీసులు గిరిజన గ్రామాలమీద దాడి చేసి, పురుషుల్ని హింసలకి గురి చేయడం, అరెస్టులు చెయ్యడం, స్త్రీల మీద లైంగిక అత్యాచారాలకి పాల్పడడం సాధారణమైపోయింది. వాకపల్లిలో 11 మంది గిరిజన స్త్రీల మీద అత్యాచారం చేసిన పోలీసులు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వాకపల్లి స్త్రీల గుండెఘోష ఆ కొండల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వుంది. తమపై అత్యాచారం చేసిన పోలీసుల్ని శిక్షించమని గొంతెత్తుతూనే వున్న వారి న్యాయమైన డిమాండ్‌ పట్టించుకునే వ్యవస్థే కరువైంది. వాకపల్లి ఉదంతం మరవక ముందే అదే బీభత్స సంఘటన భల్లుగూడాలో జరిగింది. నలుగరు ఆదివాసీ స్త్రీల మీద పోలీసులు అత్యాచారం చేసారనే వార్త నిర్ఘాంతపరిచింది.

ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం కలిసి విశాఖ బయలు దేరాం. భల్లుగూడలో అత్యాచార బాధిత స్త్రీలను కలవాలని, వారి దు:ఖాన్ని పంచుకోవాలన్నదే మా ప్రయాణ కారణం. పాడేరుకి 80 కిలోమీటర్ల దూరంలో భల్లుగూడ వుంది. ఆ ఊరికి చేరాలంటే పది కిలోమీటర్లు కొండలు ఎక్కి, అడవి దాటి కాలినడకన వెళ్ళాలని ముందే హెచ్చరిక అందింది. మేము వెళ్ళడం కష్టం అవుతుందని, బాధిత స్త్రీలు పాడేరుకి వస్తారని, అక్కడ వారిని కలవొచ్చని అడ్వకేట్‌ లక్ష్మి చెప్పింది.

మేము విశాఖ నుంచి రెండు టాటా సుమోల్లో పాడేరు బయలు దేరాం. అప్పటికీ సమయం 9.30 అయ్యింది. లంచ్‌ టైమ్‌కి పాడేరుచేరాం. అయిదే మేము భల్లుగూడ వెళ్ళాల్సి వుందని, తొందరగా బయలు దేరితే మంచిదని చెప్పారు. చిన్న హోటల్‌ మీద పడి, వేడి వేడి అన్నం తిని, పాడేరు నుంచి భల్లుగూడా బయలు దేరాం. నాలుగ్గంటలకి ఒక ఊరి దగ్గర వాహనాలు ఆగి పోయాయి. అక్కడి నుండి భల్లుగూడ దాదాపు పది కిలోమీటర్లు వుంటుందని, వాహనాలు వెళ్ళవని, రెండు కొండలెక్కి ఓ అడవి దాటి వెళ్ళాలని మాతో వచ్చిన లక్ష్మి చెప్పింది. సగం దూరం నడిస్తే మధ్యలో భల్లుగూడ బాధిత స్త్రీలు కలిసే అవ కాశం వుందని కూడా తను చెప్పడంతో అందరం నడక మొదలు పెట్టాం. మొదటి కొండ ఎక్కి దిగేసరికి మాలో సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం ఏడుగురం మాత్రం పట్టువదలకుండా నడక సాగించాం. దారంతా రాళ్ళు, రప్పలు. దట్టంగా అల్లుకున్న చెట్లు తీగెలు. వాకపల్లి ప్రయాణాన్ని మించిన ప్రయాస పడ్డాం. చుట్టూ కొండలు, లోయలు ఎంతో అందమైన ప్రాంతం. నిర్మానుష్యమైన ప్రదేశం. ఇలాంటి నిశ్శబ్ద ప్రాంతంలో తమ బతుకు తాము బతుకుతున్న ఆదివాసీలను ఇటు మావోయిస్టులు, అటు పోలీసులు కల్లోల పరచడం, పోలీసులు అత్యాచారాలకు తెగబడ్డం చాలా అన్యాయం.

సూర్యాస్తమయమై, చిరు చీకట్లు కమ్ముకుంటున్న వేళ మేము భల్లుగూడ చేరాం. ఊరంతా మా కోసం ఎదురు చూస్తోందా అన్నట్టు గ్రామస్తులంతా ఒక చోట గుమి గూడారు. దారిద్య్రం తాండవిస్తున్న చిన్న గూడెం అది. మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాం. మా చుట్టూ ఊరంతా చేరారు. చంకల్లో పిల్లలతో అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ముఖాల్లోని అమాయకత్వం, ఏ భావమూ లేని ముఖ కవళికలు నన్ను చాలా కలవరపెట్టాయి. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు, మా దు:ఖాన్ని మీరెవ్వరూ తీర్చలేరు అన్నట్టు నిరామయంగా కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాం. వాళ్ళకి తెలుగు రాదు. తమ దు:ఖగాధని మాతో పంచుకునే భాష కరువైంది. రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులు తమ పట్ల ఎంత దారుణంగా వ్యవహరించింది వివరించారు. వంతల డోమిని, వంతల రామి, వంతల ముక్తలు తోడికోడళ్ళట. అందులో ఒకరి చేతుల్లోని పసిగుడ్డుని తుప్పల్లోకి విసిరేసారని, ఇద్దరి భర్తల్ని బాగా కొట్టి, అరెస్ట్‌ చేసారని, ప్రస్తుతం విశాఖ జైలులో వున్నారని రాంబాబు చెప్పాడు.

జనవరి 22న తెల్లవారు ఝూమున దాదాపు 80 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు, స్థానిక ఎస్‌.ఐతో సహా భల్లుగూడ గ్రామం మీద దాడి చేసి మగవాళ్ళని, మగపిల్లల్ని దగ్గరలోని స్కూల్‌లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత ఆదివాసీల ఇళ్ళల్లోకి జొరబడి నలుగురు స్త్రీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు మగవాళ్ళని అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళుతూ ఇక్కడ జరిగిన విషయాలను బయట పెడితే పరిణామాలు దారుణంగా వుంటాయని బెదిరించారని చాలా భయపడుతూ గ్రామస్తులు వివరించారు. తమకి పోలీసులంటే చాలా భయమని, పదేళ్ళ క్రితం ఇలాగే తమ గ్రామం మీద పడి ఊళ్ళోని పెద్ద వాళ్ళని దారుణంగా కొట్టారని, ఆ సంఘటనని తాము ఎప్పటికీ మర్చిపోలేమని, తమకు మావోయిష్టుల గురించి ఏమీ తెలియదని గద్గద స్వరాలతో వివరించారు.

డోమిని, రామి, ముక్తలతో మాట్లాడాలని ఎంతగా అన్పించినా భాష అడ్డం వచ్చింది. వారి ముఖాల్లో, కళ్ళల్లో 22 నాటి భయానక సంఘటన తాలుకూ భయం స్పష్టంగా కనబడుతోంది. నిశ్శబ్దంగా దు:ఖాన్ని అనుభవిస్తున్న ఆ ముగ్గురు స్త్రీలను చూస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

రెండేళ్ళ క్రితం ఇదే విధమైన దారుణ సంఘటన వాకపల్లిలో జరిగినపుడు ఆ మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ''భూమి చెప్పితే ఆకాశం నమ్మదా'' అంటూ సభ్య సమాజాన్ని నిలదీసారు. భల్లుగూడ డోమిని, రామి, ముక్తలు కన్నీళ్ళను సైతం కోల్పోయారా అన్నట్లు అన్పించారు. మేము కూడా మౌనంగానే వారి దు:ఖాన్ని పంచుకుని, వారికి న్యాయం జరిగేలా కృషిి చేస్తామని, ఈ మారు మూల ఆదివాసీ గ్రామంలో పోలీసులు జరిపిన భీభత్స కాండ గురించి ప్రపంచానికి తెలియచెబుతామని వారికి చెప్పి తిరుగు ప్రయాణమయ్యాం. చిక్కటి చీకటిలో చుక్కలే తోడుగా ఆ కొండలెక్కి, అడవిదాటి నడక సాగించాం. నేను భల్లుగూడ నుంచి తెచ్చుకున్న కర్రసాయంతో నడుస్తూ, రెండుసార్లు పడబోయి నిలదొక్కుకున్నాను. పాములు తిరుగుతాయని ఎలుగుబంట్లు దాడి చేస్తాయని చెబుతుంటే భయమన్పించలేదు. కౄరమృగాలకు  భయపడని ఆదివాసీలు పోలీసు మృగాల ముందు భయకంపితులవ్వడం, వారి అత్యాచారాలకు గురవ్వడం ఆశ్చర్యమే. మృగాలు వారి నేస్తాలే. పోలీసు మృగాలు మాత్రం వారి పట్ల పరమ శతృవులై ప్రవర్తించడం శోచనీయం.

అలిసిపోయి, అన్నాలు తినకుండానే అర్ధరాత్రి వైజాగు చేరాం. భల్లుగూడ మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన గ్రేహౌండ్స్‌ పోలీసులను అరెస్ట్‌ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాం. వైజాగు జైలో వున్న వారికి బెయిల్‌ దొరికిందని, షూరిటీల కోసం చూస్తున్నామని ఆ తర్వాత రాంబాబు ఫోన్‌ చేసి చెప్పాడు. భల్లుగూడ బాధిత స్త్రీలకు న్యాయం జరిగేలా కృషి చేయమని పౌరసమాజాన్ని, రచయితల్ని, మేధావుల్ని కోరుతున్నాం.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...