Wednesday, August 27, 2008

ఖుషీ కా దిన్ జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు......
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.

( సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)

Sunday, August 24, 2008

పోలేపల్లి ప్రత్యేక ఆర్ధిక మండలి

పోలేపల్లి ప్రత్యేక ఆర్ధిక మండలి
గురించి మీరు వినే ఉంటారు.ఆగష్ట్ 7న పోలేపల్లి ఫార్మా సెజ్ దురాగతాలపై పబ్లిక్ హియరింగ్ జరిగింది.పోలేపల్లి,గుండ్ల గడ్డ తాండ,ముదిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తమ దుఖ గాధల్ని వినిపించారు.తమ జీవనాధరమైన పొలాలని కోల్పోయి కూలీలుగా మారిన దైన్య స్థితిని వినే వాళ్ళ గుండెలు బరువెక్కేలా వివరించారు.
హైదరాబాదు నుంచి దాదాపు 100 మందిమి ఆ రోజు ఆ పబ్లిక్ హియరింగ్ కి హాజరయ్యాం.నేను ఆ రిపోర్ట్ ను వివరంగా భూమికలో రాస్తున్నాను.
ఆ రోజున అక్కడ పాడిన ఓ పాట మీకోసం (పాట పాడింది నేను కాదు)పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన వాళ్ళు పాడిన పాట ఇది.

నీ లొల్లి నా లొల్లి సెజ్‌ల నెల్లగొట్టే లొల్లి
పొలమాక్రమించి నోన్ని
పొలిమేర దాటెల్లగొట్టు
పల్లె పల్లె లొల్లి బెట్టు || నీ లొల్లి… ||

వాన పాములు నత్త గుల్లలు
అడవి ఎలుక పిల్లలురా
మా గుట్టల మీద కుందేలు
దుంపులు ఏడ పొయెనుర
సింతమాను సిగురు మీద
ఉడుత పిల్ల గూడేది
మద్ది మాను కింద ఊరె
మంచినీటి బుగ్గేది

ఆ పల్లె అంచు జొన్న సేలో
వాలే ఊర పిట్టాలేవి || నీ లొల్లి… ||

దుందుభి నది అలల మీద
దూకులడె పిల్లలురా
దూప దీర్చె పెద్ద వాగు
దూరమై పోయెనురా
సీతా ఫలకాల ఏస్తె
సింతె లేదు కూటికిరా
బంఢ్ల కొద్ది పండ్ల తోని
భాదలు తీరు తుండేరా

బండి బాయే బతుకు బాయే
సీతా ఫల తోపులు పాయే || నీ లొల్లి… ||

వానకాలం వాగులేట
గళా లేసే పిల్లలురా
కట్టలు గట్టి గుంపే
సెలిమ గుంత లేడ పాయేరా
పారుతున్న నీటి కేదురు
పరుక పిల్ల పరుగు సూడు
ఆపదోచి నట్లు గొండ్ర కప్ప అరుపు సూడు

ఆ వాగు బాయె అలుగు బాయే
వానకాలం పంటలు బాయే || నీ లొల్లి… ||

పచ్చని జొసేలు పంతే
పల్లెకెంత అందమురా
అగడగడేరు కునే
అద్దంపంట బాయేరో
కద్దిలి పట్టి కావాలి గాసే
కాలమేడ బోయేనురా
కూత బేడితే ఉరికే
పందుల గుంపులేడ బోయేనురా

మంచే బాయే మనిషి బాయే
మాటు గాసే డొక్కలు బాయే || నీ లొల్లి… ||

మండగాయలు ఇప్పపూలు
ఏరుకొని బతికేటోళ్లు
సుతమన్న సీత సిగురు
జాడ లేక పాయేరా
నడుముకు బట్టా కట్టుకోని
కల్లలేంట తిరిగే తల్లికి
గింజలేక గంజిలేక
జీవ పొయీనాదన

దుబ్బ భూమే దుక్కి బాయే
దున్న పోతుల మోట బాయే || నీ లొల్లి… ||

అవ్వ జస్తె బోకట
అడుగు జాగ లేక పాయే
తతాను పాతి పేట్టిన సొటు
సూతమన్న కన రాదు
ఊరు చుట్టు కంచే పాతి
ఆడుకునే బీడు లేదు
అంత వాని ఆస్తిలాగ
ఆక్రమించుకున్నరు

ఊరోడయ్యె ఊరోడయ్యె
ఊరులేమొ పరాయయ్యె || నీ లొల్లి… ||

ఈదులల్ల కల్లు తాగి
ఇంటి జాగ మరిసేటొళ్ళు
కానుగు చెట్ల నీడలకింద
కంటి కునుకు తీసేటోళ్ళు
ఈత సాపలు ఈత బరుగులు
ఇంటి ఆస్తి పాస్తులురా
గుడిసె కాపుకుంటే
వాన సినుకురాలకుండేరా

ఈతకమ్మల ఇదులు బాయే
తాటి కమ్మల గుడిసేలు బాయే || నీ లొల్లి… ||

భుములిస్తమని చెప్పి
ఉన్న భూముల గుంజిడ్రు
ఊరుకుంటే ఊర్లు కూడ
పంచుకుంటరోరన్న

పంచినోల్ల అంతు చూడ
భూమి కొరకు పోరు చేయి || నీ లొల్లి… ||

Saturday, August 16, 2008

ఇది ప్రాణాంతక హింస

"టీజింగ్" అంటే అర్థం వేళాకోళం చేయడం.అదీ సరదాగా. కానీ మనం మాత్రం రోడ్ల మీద,బస్సుల్లోను,వుమెన్స్ కళాశాలల దగ్గర ఒక చోట అనేమిటి సర్వాంతర్యామిలా వెర్రితలలు వేసిన ఒక హింసకు ' ఈవ్ టీజింగ్' అని ముద్దు పేరు పెట్టుకున్నాం.అయితే ఈ బాధ అనుభవించేవాళ్ళకే అర్థమవుతుంది.'ఈవ్ టీజింగ్'కు పాల్పడే వారికి స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపు,ఏం చేసినా తిరగబడరులే అన్న భరోసా,ఆడపిల్లల్ని ఏడిపించడం మగతనంగా భావించే తప్పుడు ధోరణులు..ఇవన్నీ కారణాలే.ఆడ, మగపిల్లలు కలిసిమెలిసి తిరిగే పరిస్థితులు లేకపొవడం కూడా ముఖ్యకారణంగా అర్థం చేసుకోవచ్చు.
గ్మగపిల్లల వద్ద స్వేచ్చగా ఉండలేక ముడుచుకుపొతుంటారు.వాళ్ళేమైన కామెంట్ చేసినా కన్నెర్ర చేసి ఖబడ్డ్దార్ అనడంచేతకాక కన్నీళ్లను మాత్రమే కారుస్తుంటారు

ఆడపిల్లలతో స్నేహం చేయడం తెలియని ఆకతాయి కుర్రాళ్లు వాళ్లను నానారకాలుగా మాటలతోను,చేతలతోను హింస పెడుతుం ఈవ్టీజటారు.ఈ హింస ఎన్నోరూపాల్లొ విస్తరించి,ఒక్కోసారి మితిమీరి ఆత్మహత్యల దాకా వెళుతుంది? ఆడపిల్లలు కూడా తక్కువేమీ తినలేదు.వాళ్ళూ ఏడిపిస్తుంటారని కొందరు వాదనకు దిగుతారు.అయితే.. ఎక్కువ శాతం హింసను ఎవరు అనుభవిస్తున్నారో అర్ఠం చేసుకుంటె ఈ వాదన అర్ఠం లేనిదనిపిస్తుంది.టీజింగ్ భరించలేక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటె ఆ చావుకు కారకులెవ్వరు?సమాజమా?తల్లిదండ్రులా?వేయితలలతో విస్తరించిన పురుషాధిక్య భావజాలమా

వాహనాలు నడిపే అమ్మాయిల మీద జరిగే దాడులు అమానుషంగ ఉంటాయి.వాహనాలను ఢీకొట్టడం,చున్నీలు లాగడం లాంటి పనులు వల్ల ప్రమాదాలు జరగ డం.ప్రాణాలు కోల్పోవడం కూడా మనం విన్నాం.కొంత కాలం క్రితం భోపాల్ యూనివర్సిటీ క్యాంపస్లో కూర్చొని ఉన్న అమ్మాయి మీద నుండి జీప్ పోనివ్వడం,అలాగే ఆమెను చాలదూరం ఈడ్చుకుపోవడంతో ఆ అమ్మయి అక్కడే మరణించింది.దేశంలొ ఏదో ఒక మూల ఇలాటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఇంత అమానుష చర్యని ఈవ్ టీజింగ్ అని పిలవడం సమంజసమేనా? నిత్యం స్త్రీలు అనుభవించే ఈ మానసిక హింసను చాలా తేలికైన విషయంగాను,చాల సహజమైనదిగాను తీసుకోవడం వల్ల ఈ హింసకు పాల్పడేవారి పట్ల కఠిన వైఖరి లేకుండా పోయింది.

తమ అక్కాచెల్లెళ్ళ చుట్టూ రక్షక కవచాలు,ముళ్ళ కంచెలు కట్టి 'కాపాడే' సహోదరులు ఎదుటివారి అక్కచెల్లెళ్ళ పట్ల ఎందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? పబ్లిక్ ప్రదేశాల్లో అచ్చోసిన ఆబోతుల్లా అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోవడం కాక ఆడపిల్లల్ని గౌరవించాలన్న ప్రాథమిక పాఠాన్ని తమ పుత్రరత్నాలకు నేర్పాల్సిన బాద్యత కన్నవాళ్ళదే కదా!ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వాళ్ళుగా,గుండె నిబ్బరంతో కొండల్ని సైతం ధిక్కరించే గుండె ధైర్యం ఉన్న వాళ్ళుగా పెంచిన రోజున ఈవ్ టీజింగ్ అనే పదం డిక్షనరీ లోంచి పారిపొకుండ ఉంటుందా?

ఈ నిత్యహింసను ఎదుర్కొనే మార్గం ఒక్కటే.అమ్మాయిలు ఆత్మస్థైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకొవడం.అబ్బాయిలు వెంటబడి వేధిస్తున్నపుడు తిరగబడి పబ్లిక్లొ నిలదీయడం,వాళ్ళు ఏదో అనగానే ముడుచుకుపోయి కన్నీళ్ళను ఆశ్రయించడం కాక కన్నెర్ర చేసి ధీటుగా సమాధానం చెప్పడం అలవర్చుకోవాలి.ఈవ్ టీజింగ్ ను లైంగిక వేధింపు లేక లైంగిక హింసగానే అర్ధం చేసుకోవాలి తప్ప ఇదేదో సరదా వ్యవహారంగా చూడకూడదు.శిక్షలతో నయమయ్యే జబ్బు కాదిది.శారీరక శిక్షల కన్న మానసిక వికాసం చాలా ముఖ్యం.

ఆడపిల్లలంటే అరచిగోల పెట్టి,వేధించడం మాత్రమే తెలిసిన అబ్బాయిలు,వాళ్ళతో స్నేహం చేస్తే ఎంత బావుటుందో అర్థం చేసుకోవాలి.అమ్మాయిలు తమలాంటి మనుషులేనని,తమలాగే స్వేచ్చగా సంచరించే హక్కు వాళ్ళకూ ఉందని అర్ధం చేసుకోవాలి. మగ పిల్లల ఆలోచనా ధోరణిలో ఆడపిల్లలు తప్పకుండా మార్పురావాలి.
బయటికొచ్చే ఆడవాళ్ళూ గానీ,చదువుకొనే ఆడపిల్లలు కాని బయట ప్రపంచంలో అనుక్షణం ఎదురయ్యే ఈవ్ టీజింగ్ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి కానీ క్రుంగిపోవడం,విలువైన ప్రాణాన్ని బలిపెట్టడం చెయ్యకూడదు.తలవంచుకుంటే దెబ్బకొట్టడం తేలిక.గుండె నిబ్బరంతో తలెత్తి నడిచేవాళ్ళను ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు.మనం అత్యవసరంగా,అనివార్యంగా అలవరుచుకోవాల్సింది ఆత్మస్థైర్యాన్నే.

Monday, August 4, 2008

స్త్రీ పక్షపాతానికి అసలైన కోణం

ఆడవాళ్ళు అందాన్ని ఎరగా వేసి అందలాలెక్కేస్తున్నారంటూ
పర్ణశాల బ్లాగ్ లో చదివాక అక్కడ స్పందిచే కన్నా నా బ్లాగ్ లో నా భావాలు రాయాలనిపించింది.
అందాన్ని చూపించి,గోముగా అడిగేసి కొంత మంది ఆడవాళ్ళు తమ పనులు పూర్తి చేసేసుకుంటారని కత్తి మహేష్ కుమార్ గారు రాయడం నాకు చాల ఆశ్చర్యాన్ని కలిగించింది.అందరూ అలాగే ఉంటారని కాదు అంటూ ఆ కొందరి గురించి అందరికి తెలిసినవే ఎందుకు రాయడం?స్త్రీలు 498ఏ ను,గ్రుహహింస నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారంటూ గుండెలు బాదుకోవడం లాంటిదే ఇది కూడా. ఇల్లాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు?మెజారిటీ స్త్రీల పరిస్థితి ఎలా ఉంది?
సగటు గ్రామీణ స్త్రీ పరిస్తితి ఏంటో వీరికి తెలియదనుకోవడానికి లేదు.
ఇంటా బయటా ఎంత దారుణ హింసని మెజారిటీ స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నారో మీకు అర్ధం కాదా?
మొన్ననే నేను మా ఊరెళ్ళి వచ్చాను.
ఒక గ్రామీణ స్త్రీ ఉదయం లేచిన దగ్గరనుండి చేసే పనుల్ని ఎప్పుడైనా లెక్కించారా ఎవరైనా?
ఉదయం లేచి ఇల్లూ వాకిలీ ఊడ్చి,కళ్ళాపు చల్లీ,అంట్ల గిన్నెలు కడిగి,పొయ్యి రాజేసి,కాఫీలు,టిఫిన్లూ అన్నం,కూరలూ వండి వార్చి,(అందరికి గ్యాస్ పొయ్యిలున్నాయని భ్రమపడకండి)భొజనాలు వడ్డించి,మళ్ళి తిన్న పళ్ళలు వండిన గిన్నెలు కడిగి,బట్టలుతికి ఆరేసి,(ఒక్కో సారి చెరువుకెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి.)పశువులుంటే వాటి పని,పిడకలు చెయ్యడం.ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రమౌతుంది.మళ్ళి వంట,పిల్లలికి మొగుడికి ముసలి వాళ్ళకి వడ్డించడం,అన్నింటికి మించి ఏపూటకాపూట పొయ్యి మీదికి పొయ్యి కిందకి వెతుక్కోవాల్సిన పని ఉండనే ఉంటుంది.
మగవాళ్ళు పొలానికెళతారు.పనిచేసినా చెయ్యక పోయినా,సంపాదించినా సంపాదించక పోయినా వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత మాత్రం ఆడవాళ్ళదే.మంచి మొగుడైతే బుద్ధిగా ఇంటికొస్తాడు.కానీ చాలా కుటుంబాల్లో మగవాళ్ళు పూటుగా తాగే వస్తారు.ఉదయం నుండీ వొళ్ళు హూనం చేసుకున్న ఆమెకు సందెకాడ నుండి,అర్ధరాత్రిదాకా దొరికేవి తిట్లూ,తన్నులూ,తాగి పొర్లే మొగుడి లైంగిక అత్యాచారాలే.
సగటు గ్రామీణ స్త్రీ బతుకు ఇంతే.ఇంతకంటే గొప్పగా ఉండదు.
మన జనాభా 80% గ్రామాల్లోనే కదా ఉంది.అంటే 80% స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లోనే కదా ఉన్నారు.
కత్తి మహేష్ కుమార్ గారూ! అందాన్ని ఎరగా వేసి కొందరు స్త్రీలు బతికేస్తున్నారని రాసిన స్త్రీల శాతం ఎంత?
ఎంతమందుంటారు? వాళ్ళు ఎక్కడుంటారు?మీలాంటి వాళ్ళు రాయాల్సింది మెజారిటీ స్త్రీల భయానక జీవితాల గురించి కాదా?చెదురుమదురు సంఘటనలను పీకి పాకం పట్టి వడ్డించడం మీకు తగునా?

Sunday, August 3, 2008

నీ స్నేహం




ఆత్మీయతలో ముంచి తీసినట్టుగ వుంటుంది

కనుచూపుమేరంతా

పరుచుకున్న పచ్చదనంలా వుంటుంది

గుండెకి సంబంధించిన

సుతిమెత్తని సవ్వడి లా వుంటుంది

భుజమ్మీద వాలిన

వెచ్చని స్పర్శలా వుంటుంది

గాయాలు కన్నీళై ప్రవహించేవేళ

చల్లని ఓదార్పులా వుంటుంది

నిస్సారంగా గడిచిపోయే మధ్యాహ్న్నపు వేళ

ముంగిట వాలే ఉత్తరంలా వుంటుంది

ఏకాంతపు సాయంత్రాల్ని

ఇసుకతిన్నెల మీదికి నడిపించే

సమ్మోహన శక్తిలా వుంటుంది

దిగులు మేఘాలు కమ్ముకున్నపుడు

చెప్పలేని చింతలేవో చీకాకుపెట్టేటప్పుడు

పెదవి మీద మొలిచే చిరునవ్వులా వుంటుంది

నీతో స్నేహం.......

అపూర్వం, అపురూపం

అది నా అంతరంగానికి, ఆత్మకి సంబంధించింది

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...