ఆడవాళ్ళు అందాన్ని ఎరగా వేసి అందలాలెక్కేస్తున్నారంటూ
పర్ణశాల బ్లాగ్ లో చదివాక అక్కడ స్పందిచే కన్నా నా బ్లాగ్ లో నా భావాలు రాయాలనిపించింది.
అందాన్ని చూపించి,గోముగా అడిగేసి కొంత మంది ఆడవాళ్ళు తమ పనులు పూర్తి చేసేసుకుంటారని కత్తి మహేష్ కుమార్ గారు రాయడం నాకు చాల ఆశ్చర్యాన్ని కలిగించింది.అందరూ అలాగే ఉంటారని కాదు అంటూ ఆ కొందరి గురించి అందరికి తెలిసినవే ఎందుకు రాయడం?స్త్రీలు 498ఏ ను,గ్రుహహింస నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారంటూ గుండెలు బాదుకోవడం లాంటిదే ఇది కూడా. ఇల్లాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు?మెజారిటీ స్త్రీల పరిస్థితి ఎలా ఉంది?
సగటు గ్రామీణ స్త్రీ పరిస్తితి ఏంటో వీరికి తెలియదనుకోవడానికి లేదు.
ఇంటా బయటా ఎంత దారుణ హింసని మెజారిటీ స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నారో మీకు అర్ధం కాదా?
మొన్ననే నేను మా ఊరెళ్ళి వచ్చాను.
ఒక గ్రామీణ స్త్రీ ఉదయం లేచిన దగ్గరనుండి చేసే పనుల్ని ఎప్పుడైనా లెక్కించారా ఎవరైనా?
ఉదయం లేచి ఇల్లూ వాకిలీ ఊడ్చి,కళ్ళాపు చల్లీ,అంట్ల గిన్నెలు కడిగి,పొయ్యి రాజేసి,కాఫీలు,టిఫిన్లూ అన్నం,కూరలూ వండి వార్చి,(అందరికి గ్యాస్ పొయ్యిలున్నాయని భ్రమపడకండి)భొజనాలు వడ్డించి,మళ్ళి తిన్న పళ్ళలు వండిన గిన్నెలు కడిగి,బట్టలుతికి ఆరేసి,(ఒక్కో సారి చెరువుకెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి.)పశువులుంటే వాటి పని,పిడకలు చెయ్యడం.ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రమౌతుంది.మళ్ళి వంట,పిల్లలికి మొగుడికి ముసలి వాళ్ళకి వడ్డించడం,అన్నింటికి మించి ఏపూటకాపూట పొయ్యి మీదికి పొయ్యి కిందకి వెతుక్కోవాల్సిన పని ఉండనే ఉంటుంది.
మగవాళ్ళు పొలానికెళతారు.పనిచేసినా చెయ్యక పోయినా,సంపాదించినా సంపాదించక పోయినా వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత మాత్రం ఆడవాళ్ళదే.మంచి మొగుడైతే బుద్ధిగా ఇంటికొస్తాడు.కానీ చాలా కుటుంబాల్లో మగవాళ్ళు పూటుగా తాగే వస్తారు.ఉదయం నుండీ వొళ్ళు హూనం చేసుకున్న ఆమెకు సందెకాడ నుండి,అర్ధరాత్రిదాకా దొరికేవి తిట్లూ,తన్నులూ,తాగి పొర్లే మొగుడి లైంగిక అత్యాచారాలే.
సగటు గ్రామీణ స్త్రీ బతుకు ఇంతే.ఇంతకంటే గొప్పగా ఉండదు.
మన జనాభా 80% గ్రామాల్లోనే కదా ఉంది.అంటే 80% స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లోనే కదా ఉన్నారు.
కత్తి మహేష్ కుమార్ గారూ! అందాన్ని ఎరగా వేసి కొందరు స్త్రీలు బతికేస్తున్నారని రాసిన స్త్రీల శాతం ఎంత?
ఎంతమందుంటారు? వాళ్ళు ఎక్కడుంటారు?మీలాంటి వాళ్ళు రాయాల్సింది మెజారిటీ స్త్రీల భయానక జీవితాల గురించి కాదా?చెదురుమదురు సంఘటనలను పీకి పాకం పట్టి వడ్డించడం మీకు తగునా?
2 comments:
ఈ టపా రాసి మీరు చర్చని మరొ అడుగు ముందుకేయించారు. ఇప్పటివరకూ మీ బ్లాగులో కామెంట్ డిసేబుల్ అవటం మూలంగా నా టపాలో కామెంటాను,ఈ క్రింది లంకె ద్వారా చూడగలరు
http://parnashaala.blogspot.com/2008/08/blog-post_4769.html
hai madam ur scripting is super
Post a Comment