Sunday, August 24, 2008

పోలేపల్లి ప్రత్యేక ఆర్ధిక మండలి

పోలేపల్లి ప్రత్యేక ఆర్ధిక మండలి
గురించి మీరు వినే ఉంటారు.ఆగష్ట్ 7న పోలేపల్లి ఫార్మా సెజ్ దురాగతాలపై పబ్లిక్ హియరింగ్ జరిగింది.పోలేపల్లి,గుండ్ల గడ్డ తాండ,ముదిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తమ దుఖ గాధల్ని వినిపించారు.తమ జీవనాధరమైన పొలాలని కోల్పోయి కూలీలుగా మారిన దైన్య స్థితిని వినే వాళ్ళ గుండెలు బరువెక్కేలా వివరించారు.
హైదరాబాదు నుంచి దాదాపు 100 మందిమి ఆ రోజు ఆ పబ్లిక్ హియరింగ్ కి హాజరయ్యాం.నేను ఆ రిపోర్ట్ ను వివరంగా భూమికలో రాస్తున్నాను.
ఆ రోజున అక్కడ పాడిన ఓ పాట మీకోసం (పాట పాడింది నేను కాదు)పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన వాళ్ళు పాడిన పాట ఇది.

నీ లొల్లి నా లొల్లి సెజ్‌ల నెల్లగొట్టే లొల్లి
పొలమాక్రమించి నోన్ని
పొలిమేర దాటెల్లగొట్టు
పల్లె పల్లె లొల్లి బెట్టు || నీ లొల్లి… ||

వాన పాములు నత్త గుల్లలు
అడవి ఎలుక పిల్లలురా
మా గుట్టల మీద కుందేలు
దుంపులు ఏడ పొయెనుర
సింతమాను సిగురు మీద
ఉడుత పిల్ల గూడేది
మద్ది మాను కింద ఊరె
మంచినీటి బుగ్గేది

ఆ పల్లె అంచు జొన్న సేలో
వాలే ఊర పిట్టాలేవి || నీ లొల్లి… ||

దుందుభి నది అలల మీద
దూకులడె పిల్లలురా
దూప దీర్చె పెద్ద వాగు
దూరమై పోయెనురా
సీతా ఫలకాల ఏస్తె
సింతె లేదు కూటికిరా
బంఢ్ల కొద్ది పండ్ల తోని
భాదలు తీరు తుండేరా

బండి బాయే బతుకు బాయే
సీతా ఫల తోపులు పాయే || నీ లొల్లి… ||

వానకాలం వాగులేట
గళా లేసే పిల్లలురా
కట్టలు గట్టి గుంపే
సెలిమ గుంత లేడ పాయేరా
పారుతున్న నీటి కేదురు
పరుక పిల్ల పరుగు సూడు
ఆపదోచి నట్లు గొండ్ర కప్ప అరుపు సూడు

ఆ వాగు బాయె అలుగు బాయే
వానకాలం పంటలు బాయే || నీ లొల్లి… ||

పచ్చని జొసేలు పంతే
పల్లెకెంత అందమురా
అగడగడేరు కునే
అద్దంపంట బాయేరో
కద్దిలి పట్టి కావాలి గాసే
కాలమేడ బోయేనురా
కూత బేడితే ఉరికే
పందుల గుంపులేడ బోయేనురా

మంచే బాయే మనిషి బాయే
మాటు గాసే డొక్కలు బాయే || నీ లొల్లి… ||

మండగాయలు ఇప్పపూలు
ఏరుకొని బతికేటోళ్లు
సుతమన్న సీత సిగురు
జాడ లేక పాయేరా
నడుముకు బట్టా కట్టుకోని
కల్లలేంట తిరిగే తల్లికి
గింజలేక గంజిలేక
జీవ పొయీనాదన

దుబ్బ భూమే దుక్కి బాయే
దున్న పోతుల మోట బాయే || నీ లొల్లి… ||

అవ్వ జస్తె బోకట
అడుగు జాగ లేక పాయే
తతాను పాతి పేట్టిన సొటు
సూతమన్న కన రాదు
ఊరు చుట్టు కంచే పాతి
ఆడుకునే బీడు లేదు
అంత వాని ఆస్తిలాగ
ఆక్రమించుకున్నరు

ఊరోడయ్యె ఊరోడయ్యె
ఊరులేమొ పరాయయ్యె || నీ లొల్లి… ||

ఈదులల్ల కల్లు తాగి
ఇంటి జాగ మరిసేటొళ్ళు
కానుగు చెట్ల నీడలకింద
కంటి కునుకు తీసేటోళ్ళు
ఈత సాపలు ఈత బరుగులు
ఇంటి ఆస్తి పాస్తులురా
గుడిసె కాపుకుంటే
వాన సినుకురాలకుండేరా

ఈతకమ్మల ఇదులు బాయే
తాటి కమ్మల గుడిసేలు బాయే || నీ లొల్లి… ||

భుములిస్తమని చెప్పి
ఉన్న భూముల గుంజిడ్రు
ఊరుకుంటే ఊర్లు కూడ
పంచుకుంటరోరన్న

పంచినోల్ల అంతు చూడ
భూమి కొరకు పోరు చేయి || నీ లొల్లి… ||

1 comment:

Unknown said...

your articles are very interesting to read-goverdhan-zphs Honnajipet

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...