Monday, May 12, 2008

అండమాన్‌ -ఓ మహా ఆకర్షణ

అండమాన్‌ దీవుల ప్రయాణం గురించి రాద్దామనుకున్నపుడుడల్లా ఏవో పనుల హడావుడి అడ్డం పడుతూనే వుంది.
జీవితం ఎంత వేగవంతమైపోయిందో! అనుభవాలు వ్యక్తీకరించకుండానే ఒక దానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి.
అండమాన్‌ వెళ్ళి వచ్చిన తరువాత జైపూర్‌ కూడా వెళ్ళాను. అయినా అండమాన్‌ సందర్శనానుభవాలు ఇంకా అలా ఫ్రెష్‌గా గుండెల్లో వుండిపోయాయి. రాయమనే పోరు లోపల జరుగుతూనే వుంది. ఆ అనుభవాలను మిత్రులతో పంచుకోవాలని నాకు చాలా అన్పిస్తోంది. అందుకే రాయడానికి కూర్చున్నాను.

అండమాన్‌ ఒక గాయం. సునామీ మిగిల్చి వెళ్ళిన గాయం గురించి నేను మాట్లాడటం లేదు. సెల్యూలర్‌ జైలు చూశాక, ఆ జైలులో ఖైదీలు అను భవించిన వర్ణనాతీత వేదనలు విన్నాక అండమాన్‌ ఎర్రటి పుండు మానిన గాయం లాగానే అన్పించింది నాకు. వందల సంఖ్యలో ఉరితీయబడిన ఖైదీలు, భయానక బాధల నడుమ కూడా చైతన్యంతో ఉద్యమాలు నడిపిన ఖైదీలు వీరసావర్కార్‌ లాంటి ధిక్కార స్వరాలు క్రౄర,కసాయి బ్రిటిష్‌ జైలర్లు. అండమాన్‌లో అడుగిడిన సాయంత్రమే సెల్యులర్‌ జైలును చూడడం, లైట్‌ అండ్‌ సౌండ్‌ ప్రోగ్రామ్‌లో జైలు చరిత్ర, ఖైదీల ఆర్తనాదాలు సజీవంగా ముందుకు రావడంతో మనసు వికలమై పోయింది. ఆ రాత్రి కలల నిండా ఖైదీలే. వారి హృదయ విదారక ఆర్తనాదాలే. పోలీసుల కరకు బూట్లచప్పుడు గుండెల మీద ఆనుతున్నట్టుగా అన్పించి చాలాసేపు నిద్రపట్టలేదు.

ఆ తర్వాత తిరగిన సుందర ప్రదేశాలు మొదటి రోజు చేదు అనుభవాన్ని కొంతవరకు తగ్గించేయి. సెల్యూలర్‌ జైలు చూడ్డానికి వెళ్ళకముందు సన్‌సెట్‌ పాయింట్‌కి వెళ్ళాం. మేమున్న గెష్టహౌస్‌కి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుంది. మెలికలు తిరిగిన రోడ్లు. దట్టమైన అడవిగుండా మా ప్రయణం సాగింది. కొబ్బరి చెట్లు, ఆకాశన్నంటే పోక చెట్లు దారిపొడుగునా ఉన్నాయి. నాకెంతో ఇష్టమైన మొగలి పొదలు చాలా కన్పడ్డాయి. అయితే ఈ పొదలు కొబ్బరి చెట్లంత పొడవున్నాయి. పెద్ద పెద్ద ఆకుల్తో పొడవుగా ఎదిగిన ఈ చెట్ల నుండి మొగలి పొత్తుల్ని ఎలా కొస్తారా అని తెగ ఆశ్చర్యపోయాన్నేను. కొబ్బరి, పోక, మొగలి ముప్పేటలా అల్లుకున్న ఆ తోటల్లోంచి మా కారు చాలా వేగంగా దూసుకెళ్ళసాగింది. అపుడపుడూ సముద్రం కూడా దర్శనమిస్తోంది. అకాశం రంగులో నీళ్ళు. స్వచ్ఛంగా వున్నాయి. ఓ నలభై నిముషాలు ప్రయాణం చేసాక సూర్యాస్తమయ ప్రదేశం వచ్చింది. ఎదురుగా నీలిరంగు సముద్రం. సముద్రానికి అటువేపు చిన్న దీవి. ఆ చిన్న దీవిలో ఎత్త్తైన కొండవెనక్కి సూర్యుడు జారిపోతున్న అద్భుతదృశ్యం కంటపడింది. టైమ్‌ చూస్తే నాలుగున్నరే అయ్యింది. మరి కాసేపట్లో చీకట్లు అలుముకున్నాయి. ఐదింటికల్లా చీకటిపోయింది. అప్పటివరకు నీలాకాశం రంగులో కనబడిన సముద్రం నల్లటి దుప్పటి కప్పుకుని పడకేసీనట్లనిపించింది. సన్‌సెట్‌ పాయింట్‌ దగ్గర అటవీశాఖవారి అందమైన అతిధి గృహం వుంది. బయట లాన్‌లో కూర్చుంటే నల్లటి దుప్పట్లో దూరిన సముద్రం గురకలు పెట్టినట్టుగా చిరు కెరటాలు తీరాన్ని తాకుతూ విరుగుతున్న సవ్వడి విన్పిస్తుంది. వేడిగా ఓ టీ తాగేసి మేము తిరుగు ప్రయాణమయ్యా౦. చీకటి దట్టమైపోయింది. కొబ్బరి చెట్లు, పోక,. మొగలి పొదలు ఏకమైపోయాయి. చల్లటి సముద్రగాలిని ఆస్వాదిస్తూ ఓ గంట తర్వాత మా గెస్ట్‌ హవుస్‌కి వచ్చేం.

మేము బస చేసిన గెస్ట్‌ఔస్‌ సముద్రానికి ఆనుకుని వుంది. మేమున్న రూమ్‌ పేరు నికోబార్‌. పెద్ద పెద్ద చెట్లతో గెస్ట్‌హౌస్‌ చాలా బావుంది. మేము రూమ్‌లో కెళ్ళగా ఓ కుర్రాడొచ్చి తలుపు తట్టాడు. ''నమస్కారం సార్‌'' అంటూ పలకరించాడు. తెలుగోడివా అంటే ''మాది విజయనగరం. ఇక్కడ క్యాంటీన్‌లో వంట చేస్తా. ఏమేం స్పెషల్స్‌ కావాలో చెప్పండి.'' అన్నాడు. మాకు బోలెడంత సంతోషం వేసింది. అతని పేరు మల్లిఖార్జున్‌. మేమున్నన్ని రోజులు మంచి భోజనం పెట్టాడు. చేపలు, పీతలు, నాటుకోడి అన్నీ ఆంద్రా స్టయిల్‌లో వండి వడ్డించే వాడు కాంటీన్‌లో.

మర్నాడు హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళ్ళాలనేది మా ప్రోగ్రామ్‌. పోర్ట్‌ బ్లయర్‌ నుంచి హేవ్‌లాక్‌కి షిష్‌మీద రెండు గంటల ప్రయాణం. ఉదయం ఎనిమిందింటికి షిిప్‌ బయలురుతుందని రెడీగా వుండమని చెప్పి వెళ్ళాడు ప్రొటోకాల్‌ చూస్తున్న భండారి.

మర్నాడు ఉదయం తొందరగా బ్రేక్‌ఫాష్ట్‌ చేసేసి షిప్‌ బయలుదేరే ప్రదేశానికి వెళ్ళాం. అక్కడంతా చాలా రష్‌గా, గోలగా వుంది. వివిధ ప్రదేశాలకు బయలుదేరే షిప్‌లు అక్కడ ఆగివున్నాయ్‌. మా షిప్‌ పేరు వండూర్‌ అని, అది హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళుతుందని భండారి చెప్పి మమ్మల్ని అందులో ఎక్కించాడు. మేము లోపలి కెళుతుండగా ఓ కబురు కూడా చెప్పాడు. విఐపి లాంజ్‌లో ఖాళీలేవని, ఒక రూమ్‌ వున్నా అది శుభ్రంగా లేదని, పబ్లిక్‌తో పాటు కూర్చోవాల్సి వుంటుందని చెప్పాడు. ఏం ఫర్వాలేదు. ఇంతటి జలరాశిని వదిలి పెట్టి రూమ్‌ల్లో ఏం కూర్చుంటాంలే అని అతనితో చెప్పి మేము మాకిచ్చిన రూమ్‌లో కెళ్ళి మా బ్యాగు పెడుతుండగానే షిప్‌ బయలుదేరింది. ఇంతలో ఇంజన్‌ రూమ్‌లో వుండే అటెండెంట్‌ వచ్చి పైకి వెళదాం రండి అని మమ్మల్ని కెప్టెన్‌ కేబిన్‌ల్లోకి తీసుకెళ్ళాడు. కనుచూపు మేరంతా నీలం రంగులో పరుచుకున్న బంగాళాఖాతం. నేను కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తుంటే ''ఏం సార్‌ తెలుగువారా?'' అనే పిలుపు వినబడింది. ''అవును. ఎలా గుర్తు పట్టారు'అన్నాం. తెలిసిపోతుంది సార్‌. మాది వైజాగు. నా పేరు స్వామినాథం నేను ఈ షిప్‌ కెప్టెన్‌ని'' అంటూ పరిచయం చేసుకున్నాడు. 'ఆహా! బావుందండి.చూస్తుంటే అండమాన్‌లో ఆంధ్రవాళ్ళు బాగానే వున్నట్టున్నారు. ''అవును. చాలామంది వున్నారు. వైజాగు నించి షిప్‌లో వస్తుంటారు.'' అంటూ ఆయన కబుర్లలోకి దిగారు.

మా కోసం కుర్చీలు తెప్పించి వేయించారు. నేను కన్నార్పకుండా ఆ మహాసాగరాన్ని చూస్తున్నాను. మా షిప్‌ చాలా వేగంగా వెళుతోంది. మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు ఎదురౌతున్నాయి. దట్టమైన అడవులు కన్పిస్తున్నాయి. నీలపు నీళ్ళు అంచుల వెంబడి విస్తరించిన ముదురాకుపచ్చ అడవుల సౌందర్యం చూసి తీరాల్సి౦దే. నేను చాలా బీచ్‌లు చూసాను గాని కెరటాలను తాకుతూ వుండే అడవుల్ని ఎక్కడా చూడలేదు. ఒడ్డుకు చాలా దూరంగా కొబ్బరి తోటలు చూసాను కానీ ఇలాంటి అడవుల్ని చూళ్ళేదు. నీళ్ళల్లో మునిగి వుండే మంగ్రవ్స్‌ మొక్కల్ని కూడా నేను అక్కడే చూసాను.
మా 'వంగర్‌' సాగర జలాలను చీల్చుకుంటూ హేవలాక్‌ ద్వీపం వైపు వెళుతోంది. వేడి వేడి కాఫీ వచ్చింది. సముద్రపు గాలి చల్లగా వొంటిని తాకుతుంటే, వెచ్చటి కాఫీ తాగడం ఎంత బాగుందో. ఆంధ్ర కెప్టెన్‌ మాకు బోలెడన్ని మర్యాదలు చేసాడు. షిప్‌ అంతా తిప్పిచూపించాడు. ఇంజన్‌ రూమ్‌లోకి తీసుకెళ్లగానే ఆ వేడికి నా శరీరం కాలిపోతుందేవె అన్పించింది. ఆ శబ్దానికి చెవులు చిల్లులడిపోతాయని భయమేసింది. అంత వేడిగా, అంత భయంకరమైన చప్పుడుగా వుందక్కడ.చెవులకి రక్షణగా కప్స్‌ తగిలించుకున్నాగాని ఆ హోరు వినబడుతూనే వుంది. అలాంటి స్థితిలో కూడా పనిచెయ్యక తప్పని మనుష్యులున్నారక్కడ. మేము కొంచెం సేపు అటు ఇటు తిరిగి పైకి వచ్చేసాం.

ఇంకో పది నిముషాల్లో హేవలాక్‌ ఐలాండ్‌లో వండూర్‌ ఆగింది. 'సాయంత్రం మా షిప్‌లోనే రండి' అంటూ మా కెప్టెన్‌ ఆహ్వానించాడు. మేము వసతి దొరికితే రాత్రిని హేవలాక్‌లోనే గడుపుదామనుకున్నాం. 'మేము సాయంత్రం బయలుదేరితే వంగర్‌లోనే వస్తామని' చెప్పి షిప్‌దిగి బయటకొచ్చాం. అక్కడంతా హడావుడిగా, రద్దీగా వుంది. షిప్‌లోంచి దిగిన యాత్రికులు,కారు హారన్‌ వెతలు గందరగోళంగా వుంది. కొంచెం దూరంలో మా పేర్లు రాసిన ప్లేకార్డు పట్టుకుని ఓ కుర్రాడు నిలబడ్డాడు. మేము అతని దగ్గరకెళ్ళాం. 'ఆయియెమే౦సాబ్‌' అంటూ మమ్మల్ని ఆహ్వానించి కారు దగ్గరకు తీసుకెళ్ళాడు. అతని పేరు జెయిమ్‌. కారు అతనిదే. చక్కటి హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. మేము కారులో కూర్చోగానే ప్రోగ్రామ్‌ ఏంటని అడిగాడు. గెస్ట్‌హౌస్‌కి వెళదామంటే, రూమ్‌లు దొరకడం కష్టమని,ప్రెసిడెంటు పర్యటన సందర్భంగా ఎవరికీ రూమ్‌లివ్వడం లేదని అన్ని గెష్ట్‌ హౌస్‌లు రిపేర్‌ చేస్తున్నారని చెప్పాడు జెయిమ్‌ . ప్రయత్నం చేద్దాంపద అంటే సరే అని బయలుదేరాడు. హేవలాక్‌ ద్వీపం చుట్టూ సముద్రం.ద్వీపం లోపల దట్టమైన అడవిలాగా పెరిగిన కొబ్బరి,పోకచెట్లు. ఎంత పచ్చగా వుందంటే-ఆ పచ్చదనానికి గుండెలయ తప్పుతుంది. ఆ ప్రకృతితో ప్రేమలో పడి మిగిలిన ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేయగల తన్మయం కల్గుతుంది. నేను ఆ చెట్లల్లో, పుట్టల్లో పడి పారవశ్యంలో మునిగిన వేళ మా కారు అంతకన్నా అద్భుతమైన ప్రదేశంలో ఆగింది. నీలి సముద్రం ఒడిలో కెరటాల లాలిపాటలో ఒదిగివున్న డాల్ఫిన్స్‌ గెష్టహౌస్‌కి మమ్మల్ని తెచ్చాడు. గెస్ట్‌హౌస్‌కి ఎదురుగా ఎండలో మిల మిల మెరిసిపోతున్న సాగరం. అబ్బ! ఈ గెస్ట్‌హౌస్‌లో ఒక్కరోజున్నా చాలు కదా! ఇంత సౌందర్యం, ఇంత నిశ్శబ్దం, కెరటాల చప్పుడు తప్ప మరేమీ వినబడని ఈ నిరామయ ప్రదేశం.
నేను వెంటనే ఆ ప్రాంతంతో ప్రేమలో పడిపోయాను. నేనలా తన్మయంలో మునిగివుండగానే జెయమ్‌ రూమ్‌లివ్వరట. గెష్టహౌస్‌ మూసేసారట అని చెప్పాడు. నాకు చాలా కోపమొచ్చింది. ఎప్పుడో వారం తర్వాత వచ్చే ప్రెసిడెంట్‌ కోసం ఇప్పట్నించే పర్యాటకుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏం భావ్యం? ఇంత అందమైన ప్రాంతం వారం రోజులు బోసిపోవాల్సిందేనా? జనాలను చుట్టూ పక్కలక్కుడా రానీయడం లేదట. రూమ్‌కోసం చాలా
ప్రయత్నాలు చేసి చేసేదేంలేక కనీసం ఇక్కడి సముద్రాన్నయినా తాకుదాం. ఇంత స్వచ్ఛంగా మెరిసిపోతున్న జలాలను తాకకుండా ఎలా అనుకుంటూ నీళ్ళలోకి దిగి కెరటాలతో కాసేపు ఆడి, అక్కడి నుండి అయిష్టంగా బయలుదేరాం. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెల్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న నీలి రంగు నీళ్ళు. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, కళ్ళనీళ్ళొచ్చాయి అలా వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. ఆ బీచ్‌లోనే నాకో పెద్ద శంఖం దొరికింది. దాన్ని తాకినపుడల్లా నాకు డాల్ఫిన్స్‌ బీచ్‌ కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
మధ్యాహ్నం అవుతోంది. లంచ్‌కోసం మంచి హోటల్‌కి తీసుకెళ్ళమని జెయిమ్‌కు చెప్పాం. దట్టంగా అల్లుకున్న పొదలు, చెట్లు, పక్షుల కిలకిలా రావాల సంగీతం వినబడుతున్న చక్కటి పొదరిల్లులాంటి హోటల్‌కి తీసుకెళ్ళాడు.
అక్కడికి సమీపంలోనే సముద్రం. పక్షుల పాటల్తో పోటీ పడుతూ కెరటాల హోరు వినబడుతోంది. అంత హాయైన ప్రదేశంలో ఆకలేం వేస్తుంది? అయినా వాళ్ళు పెట్టిందేదో తిని మళ్ళీ మా వాహనంలో కొచ్చి పడ్డాం.

''జెయిమ్‌! ఇపుడెక్కడికి తీసుకెళతున్నావ్‌?''
'కోరల్స్‌ చూడ్డానికి ఎలిఫెంటా బీచ్‌ కెళుతున్నాం'అన్నాడు. ''కోరల్స్‌'' ఎక్కడున్నాయ్‌? సముద్రం లోపలికెళ్ళాలి. ''హేవ్‌లాక్‌నుంచి ఓ గంట ప్రయాణ౦. పడవలో ఎలిఫెంటా బీచ్‌కెళ్ళాలి.'' ఈ మహా సముద్రంలో పడవ మీదా?'' 'అవును . పడవలోనే వెళ్ళాలి. సముద్రంలోపలి కెళితే గాని కోరల్స్‌ కనబడవు.''అంటుండగానే ఉదయం మేము షిప్‌ దిగిన ప్రాంతానికి వచ్చాం. ఇక్కడినుంచే పడవ మాట్లాడుకోవాలి'అన్నాడు జెయిమ్‌. మేము కారుదిగి నిలబడగానే ఓ కుర్రాడు మా దగ్గరకు వచ్చాడు.'ఇతను సురేష్‌. పడవ ఇతనిదే. మిమ్మల్ని ఎలిఫెంటా బీచ్‌కి తీసుకెళ్ళి, కోరల్స్‌ చూపిస్తాడు''.చెప్పాడు జెయిమ్‌.రానూ పోనూ మాట్లాడుకొని మేము అతను తెచ్చిన గటిపడవ ఎక్కాం. పడవ ఎంతో అందంగా వుంది. పసుపు. ఎరుపు రంగు గడుతో ఆకర్షణీయంగా వున్న మర పడవ. జెయిమ్‌ కూడా మాతో పాటే పడవెక్కాడు. మోటార్‌ ఆన్‌ చేయగానే పడవ సముద్ర గర్భంవేపు దూసుకెళ్ళసాగింది. మేము కూర్చున్న ఎడమ చేతివేపు సముద్రతీరం వెంబడి దట్టమైన అడవి. నీళ్ళల్లోకి చొచ్చుకొచ్చిన మంగ్రస్‌ చెట్లు. ఎగిసిపడుతున్న కెరటాల మీద ఎగిరెగిరి పడుతున్న పడవ. ఇటీవల ప్రళయకావేరిలో పడవ ప్రయాణం గుర్తొచ్చింది. ఈ సముద్ర కెరటాలు మరింత ఎత్తుగా రావడంతో పడవలోకి నీళ్ళు చిప్పిల్లుతున్నాయి. సముద్ర మధ్యంలోకి ఇంత చిన్న పడవలో ప్రయాణం చేయడం సాహసమే. పడవ ఎగిరినపుడల్లా గుండె ఝుల్లుమంటోంది. చుట్టూ అల్లుకున్న ఈ అనంత జలరాశి, నీలపు రంగుతో అందమైన డిజైన్లు, నడినెత్తిమీదున్న సూర్యుడి కిరణాలకి మిల మిల మెరిసిపోతున్న నీళ్లు. ఎగిరెగిరి పడుతున్న మా గటి పడవ. ప్రకృతి సౌందర్యాన్ని, బీభత్సాన్ని, గగుర్పాటుని, సాహసాన్ని ఒకేసారి అనుభవించడం అంటే ఏమిటో అవగతమైన క్షణాలవి. మా పడవ వూగుత, వయ్యరాలు పోత ఎలిఫెంటా బీచ్‌కి చేరింది. బీచ్‌ని ఆనుకుని అడవి. ఈ అడవిలోంచి ఏనుగులతో కట్టెల్ని మోయిస్తారట. లోపల్నించి ఏనుగులు మోసుకొచ్చిన పెద్ద పెద్ద మానుల్ని పడవలమీద ఎగుమతి చేస్తారట. ఒకప్పుడు చాలా ఏనుగులుండేవట. మాకయితే ఒక్కటీ కనబడలేదు. బహుశ అడవి లోపల ఉండొచ్చు.

పడవని కట్టేసి సురేష్‌ వచ్చాడు. అతని చేతిలో ఆక్సిజన్‌ మాస్క్‌ వుంది. ''ఇదెందుకు సురేష్‌ అంటే సముద్రం లోకి వెళ్ళాలి కదా! అన్నాడు. కోరల్స్‌ ఎక్కడున్నాయి? అంటే అక్కడ అంటూ కడలి వేపు చూపించాడు. అమ్మో! అంతలోపలికా అంటే 'ఫర్వాలేదు నేనున్నాను కదా! భయపడకుండా నా చెయ్యి పట్టుకుని వచ్చేయండి అన్నాడు. 'మళ్ళీ తనే మీరు చీరతో లోపలికి రాలేరు. అదిగో అక్కడ డ్రస్‌లు అద్దెకిస్తారు. వెళ్ళి మార్చుకురండి అన్నాడు. నాసహచరుడు హాయిగా నిక్కరేసేసుకుని కెరటాలమీద ఈత కొడుతున్నాడు. నేను బట్టలు అద్దెకిచ్చే చిన్న పాక దగ్గరికెళ్ళి ఓ నిక్కరు, టీ షర్ట్‌ తీసుకుని వేసుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలామందే వున్నారక్కడ. ఎవ్వరికీ వొంటిమీద ఏం వేసుకున్నామన్న స్పృహే లేదు. నీళ్ళతో ఆడుతూ, ఇసుకలో దొర్లుతూ, సముద్ర గర్భంలోకి వెళుతూ అందరూ మహానందనంలో మునిగివున్నారు. కెరటాలతో సయ్యాటకి చీరెంత అడ్డో నేను వేరే డ్రస్సులోకి మారాక అర్ధమైంది. ఇంక లోపలికి వెళదామా అంటూ సురేష్‌ వచ్చాడు. నువ్వు ముందువెళ్ళు అన్నాడు రావ్‌. నా తలకి ఆక్సిజన్‌ మాస్క్‌ తగిలించాడు. నీళ్ళల్లో మునిగి ప్రాక్టీస్‌ చెయ్యమన్నాడు. మొదటిసారి మునగ్గానే నోట్లోకి ఉప్పునీళ్ళు వెళ్ళిపోయి ఉక్కిరిబిక్కిరైపోయాను. అలా నాలుగైదు సార్లు ప్రాక్టీస్‌ చేసాక కాస్త అలవాటయింది.
'సరే వెళదాం పద'అన్నాను. సురేష్‌ చేయి అందించాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇంతకు ముందెప్పుడూ చూడని, కలలో సైతం ఊహించని ఓ అద్భుత ప్రపంచం లోకి చేపపిల్లలా ఈదుకుంటూ వెళ్ళిపోయాను. ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోను నోరు తెరవకుండా మొదటిసారి నీళ్ళల్లోకి మునిగి కళ్ళముందు కనబడిన అపూర్వదృశ్యానికి అబ్బురపడి 'వావ్‌' అంటూ నోరు తెరవడంతో నోట్లోకి నీళ్ళు పోయి ఉక్కిరి బిక్కిరై పైకి వచ్చేసాను. సురేష్‌ హెచ్చరికని పాటించి మళ్ళీ నీళ్ళ అడుగుకి వెళ్ళాను. అబ్బ! బతికివున్న రంగు రంగుల కోరల్స్‌. రకరకాల చేపలు. సదుల్లా కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. గుత్తులు గుత్తులుగా, రంగు రంగుల పూల గుత్తుల్లా జీవంతో తొణికిసలాడుతున్న కోరల్స్‌. సురేష్‌ చేతిని గట్టిగా పట్టుకుని అతని వెంబడి అలా అలా నీళ్ళమీద నడుస్తూ, సాగర సంపదని కన్నార్పకుండా చూస్తూ మైమరచిపోయాను. ఇలాంటి దృశ్యాలను డిస్కరరీ ఛానల్‌లో చూస్తూ పరవశించడమే ఇంతకాలం తెలుసు. ఇపుడు నేను కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నానే, తాకగలుగు తున్నానే అనే ఆనందం అణువణువు లోను నిండి పోయింది. అతను నన్ను సాగర గర్భంలోకి, కోరల్స్‌ కమనీయదృశ్యాల్లోకి ఎంతసేపలా లాక్కెళ్ళి పోయాడో గాని గాలి పీల్చుకోవడం కోసం నీళ్ళపైకి రాగానే తీరం చాలా దూరంగా కనబడింది. రావ్‌ చాలా దూరంలో కనబడతున్నాడు. ఇంత లోపలికికొచ్చేసామా అంటూ ఆశ్చర్యపడుతూ, మళ్ళొకసారి నీళ్ళల్లో మునిగి సూర్యకాంతితో సమానంగా మెరుస్తున్న కోరల్స్‌ని తనవితీరా చూసి ఓ చిన్న ముక్కని పీకడానికి ప్రయత్నించాను కానీ రాలేదు. సురేష్‌ అవలీలగా ఓ చిన్న కోరల్‌ని పీకాడు. దాన్ని వెసుకుంటూ నీళ్ళ మీది కొచ్చేం. మెల్లగా ఈదుకుంటూ తీరం చేరాం. ఎలా వుంది అని రావ్‌ అడిగాడు. అద్భుతం, అపూర్వం అన్నాను. తర్వాత రావ్‌ని తీసుకుని, సురేష్‌ వెళ్ళాడు. నేను ఆ అద్భుతానందాన్ని గుండెల్లోకి ఒంపుకుంటూ కెరటాలతో ఆటాడుతూ నిలబడ్డాను. అక్కడ తీరం వెంబడి రకరకాల ఆకారాలతో చనిపోయిన కోరల్స్‌ వెదజల్లి నట్టున్నాయి. బోలెడన్ని కోరల్స్‌ ఏరాను. వాటన్నింటినీ బాగులో వేసుకున్నాను. రావ్‌ కూడా తిరిగొచ్చాక, మా పడవలో హేవలాక్‌ బయలుదేరాం.

ఆ రోజు పౌర్ణమి.సముద్రం మంచి పోటు మీదుంది. కెరటాలు మరింత ఎత్తుకి లేస్తూ పడవని ఢీ కొడుతున్నాయి. నీళ్ళు ఎగిరొచ్చి మమ్మల్ని తడుపుతున్నాయి. హఠాత్తుగా పడవ బోల్తా పడితే? ఏముంది పోయి ఆ కోరల్స్‌ మీదేగా పడతాం. 'ఇక్కడ పడవలెప్పుడైనా బోల్తాకొట్టాయా? సురేష్‌ని అడిగాం. ఊహూ..డరనా నహీ ..కుచ్‌ నైహోగా అన్నాడు''. హమ్‌ నహీడరరే. ఊరికే అడుగుతున్నాం'' అన్నాను నేను.జెయిమ్‌ అందుకుని ''కోరల్స్‌ బావున్నాయా? మీకు నచ్చిందా?'' అన్నాడు. నేను సమాధానం చెప్పేలోగానే సురేష్‌ 'మేడమ్‌! మీకు బతికిన కోరల్‌ ఇచ్చాను కదా! అది ఎవ్వరికీ చూపించొద్దు.'' అన్నాడు. ''ఏమౌతుంది చూపిస్తే..'' ''బతికిన కోరల్స్‌్‌ సముద్రంలోంచి తియ్యడం నేరం. పోలీసులు పట్టు కుంటారు''.''అరే! వాటిని తియ్యకూడదా?మాకు తెలియదు కదా! ఇక్కడ బోర్డు కూడా పెట్టలేదు!'' ''ఫర్వాలేదు. ఏమీకాదు. మీరు ఉప్పునీళ్ళల్లో దాన్ని వేయండి. అది బతుకుతుంది.''అన్నాడు. మేమిలా మాటల్లో వుండగానే మా పడవ హేవలాక్‌ తీరం చేరింది. జెయిమ్‌ వెళ్ళి కారు తెచ్చాడు. మేము పడవ దిగి కారులో ఎక్కగానే ''మనమిప్పుడు రాధానగర్‌ బీచ్‌ కెళుతున్నాం'' అన్నాడు.
బాగా ఆకలిగా వుంది. ఏమైనా తిందామంటే అక్కడ బీచ్‌లో హొటల్స్‌ వుంటాయని అక్కడ తినొచ్చని చెప్పాడు. 'అయితే నేను కొబ్బరి బొండాం తాగుతాను! అంటే బొండాలమ్మే బండి దగ్గర ఆపాడు. మన ప్రాంతపు బొండాం కన్నా రెండింతలు పెద్దగా వుంది. లీటర్‌ నీళ్ళుపైనే వున్నాయి. తియ్యగా, చల్లగా చాలా బావున్నాయి కొబ్బరినీళ్ళు. ఓ పెద్ద అడవి, కొండ దాటి రాధానగర్‌ చేరాం. మేము అక్కడ హొటల్‌లో తింటున్నపుడు 'హాయ్‌! అంటూ ఓ విదేశీయుడు పలకరించాడు. అతను ఎలిఫెంటా బీచ్‌ దగ్గర కన్పించాడు. చేతిలో కర్రతో ఇంకొకతనితో కలిసి అడవిలోంచి, కొండదిగి మాకంటే ముందే వచ్చేసాడు. 'u came before us.how can it be possible?అంటే yah.everything is possible with this'అంటూ తన కర్ర చూపించాడు. అతను ఫ్రాన్స్‌నించి వచ్చాడట. పెయింటింగు పని చేస్తాడట. సంవత్సరమంతా పనిచేసి డబ్బు కూడబెట్టి నెలరోజులు ఇలా దేశాలు తిరుగుతాడట.'ఆహా! అన్పించింది నాకు.

టిఫిన్‌ తినడం అయ్యాక బీచ్‌లోకి వెళ్ళాం చాలా అందమైన బీచ్‌. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెలు. స్వచ్ఛంగా , తేటగా వున్న నీళ్ళు, నీళ్ళనానుకుని అడవి. ఎక్కడా ఒక్క ప్లాస్టిక్‌ కవర్‌గాని, చెత్తా చెదారంగాని కనబడలేదు. శుభ్రంగా చీపురుతో ఊడ్చినంత నీట్‌గా వుంది బీచ్‌. కళ్లముందు కనబడుతున్న వివిధ రంగులు, బంగారం రంగు ఇసుక, ఆ ఇసుకను తాకుతూ తెల్లటి మల్లెపువ్వు ల్లాంటి కెరటాలు, ఆ కెరటాలను తరుముతున్న నీలం రంగు నీళ్ళు, కొంచెం కన్నుసారిస్తే ఆకుపచ్చటి అడవి. నేనలా మంత్రముగ్ధనై, ప్రకృతి సోయగానికి పరవశమై కళ్ళల్లో నీళ్లు బుకుతుంటే రెప్పవేయకుండా చస్తుండి పోయను. విస్తారమైన ఆ బీచ్‌ కెరటాల సంగీతం తప్ప మహా నిశ్శబ్ధంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాల్సిందే.

నిశ్శబ్దాన్ని ప్రేమించటానికి, మనలో పేరుకు పోయిన శబ్ద కాలుష్యాన్ని కడుక్కోడానికైనా రాధానగర్‌ బీచ్‌ కెళ్ళాలి. మేమలా చిత్తరువుల్లా కూర్చుని వున్నపుడు జెయిమ్‌ వచ్చాడు. మేము మెల్లగా లేచి మా కారువేపు నడవసాగాం. నేను బోలెడన్ని డెడ్‌ కోరల్స్‌ ఏరుకున్నాను. రకరకాల డిజైన్లవి. మాకు గెష్టహౌస్‌ దొరకలేదు కాబట్టి పోర్ట్‌ బ్లేయర్‌కి తిరిగి వెళ్ళాలి.

మా కారు షిప్‌ ఎక్కాల్సిన యార్డ్‌ వేపు వెళుతోంది. జెయిమ్‌ ఆ ద్వీపం గురించి ముచ్చట్లు చెబుతున్నాడు. అక్కడ అందరూ కష్టపడి పనిచేస్తారని, పని లేకపోవడమంటూ వుండదని చెబుతూ, కొబ్బరికాయలు తీయడం, ఏరడం, పోకకాయలు తెంపడం,
వాటిని సేకరించడంలాంటి పనులు సంవత్సరమంతా వుంటాయట. టూరిష్ట్‌లకు సంబంధించి కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మా హేవలాక్‌లో ఎవ్వరూ పేదవాళ్ళు లేరు అంటూ చాలా గర్వంగా చెప్పాడు. పోకచెట్టు మీద ఎగబాకుతున్న మనిషి, ఓ చెట్టునుండి ఇంకో చెట్టుకు దూకుతూ కంటబడ్డాడు. సన్నగా, రివటలాగా వుండే పోక చెట్టు చాలా సులువుగా ఒంగుతుంది. ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుకు చాకచక్యంగా దూకుతుంటారు. మేము కారు దిగి కొన్ని పోకకాయలు ఏరి తెచ్చుకున్నాం. మేము షిప్‌ ఎక్కే ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఐదుగంటలైంది. వండూర్‌ రెడీగా వుంది. స్వామినాధం మా కోసమే ఎదురు చూస్తున్నాడు. జెయిమ్‌కి డబ్బు చెల్లించేసి అతనికి గుడ్‌బై చెప్పాం. షిిప్‌ ఎక్కడానికి నిలబడినవారిని, ఆ ద్వీపానికి చెందినవారిని గమనిస్తుంటే అందరి నోళ్ళు ఒకే లయలో కదలడం చూసి జెయిమ్‌ని అడిగాం ఏం తింటున్నారు అందరూ అని. 'గుట్కా', పాన్‌పరాగు అన్నాడు నవ్వుతూ. హేవలాక్‌లో ప్రతి వొక్కర గుట్కా తింటారని. గుట్కా వ్యాపారం చేసి లక్షలు సంపాదిస్తారని కూడా చెప్పాడు.

మేం షిప్‌లోకి ఎక్కగానే అది బయలుదేరింది. సూర్యాస్తమయ సమయం. పడమటి దిక్కు సింధరం రంగులోకి మారింది. అప్పటివరకు నీలి ఆకాశంతో పోటీ పడిన సాగర జలాలు క్రమంగా నలుపు రంగుకి మారుతున్నాయి. షిప్‌ వేగంగా వెళుతోంది. చల్లటిగాలి హాయిగా తాకుతోంది. అపుడే ఓ అద్భుతాన్ని చూసాన్నేను. పడమటి ఆకాశంలో అస్తమించే సూర్యుడు అచ్చం చంద్రుడిలాగానే వున్నాడు. తూర్పు దిక్కుకు చూద్దునుకదా వెండివెన్నెలలు వెదజల్లుతూ పౌర్ణమి చంద్రుడు.రెండు బింబాలు ఒకేలా వున్న అపూర్వ దృశ్యమది. క్రమంగా సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు. చుట్టూ దీపాలులేని అఖండజలరాశి.సముద్ర మధ్యంలో మా షిప్‌. నీళ్ళల్లోకి మిల మిల మెరుస్తూ కురుస్తున్న వెన్నెల. నేను నిశ్శబ్దంగా ఒక మూలకి కూర్చుండిపోయి, ప్రకృతిలో లీనమైపోయను. రావ్‌ హైదరాబాద్‌నుంచి వచ్చిన ఒక పోలీసాఫీసర్‌తో కబుర్లలో పడ్డాడు. నేను మాత్రం మాట పలుకు లేకుండా బంగాళాఖాతం మీద మనోహరంగా కురుస్తున్న వెన్నెల్లో తడుస్తూ, తన్మయమౌత తరించిపోయాను. నా ఆనందాన్ని నా ఆత్మీయ నేస్తాలతో పంచుకున్నాను. సముద్రం మధ్యలో సెల్‌ఫోన్‌లు పనిచేయడం ఆశ్చర్యమే. నా కళ్ళతో నేను అనుభవించిన ఆనందాన్ని నా మిత్రుల చెవుల్లో విన్పించడానికి సెల్‌ఫోన్‌ భలే ఉపయోగపడింది. సంతోషం ఇతరులతో పంచుకోవడానికే అని గాఢంగా నమ్ముతాను. వెన్నెల్లో గోదారిని చూసాను గాని వెన్నెల్లో సముద్రం అందాన్ని ఇప్పుడే చూస్తున్నాను.క్రమంగా దీపాలు కనబడసాగాయి. దూరంగా పోర్ట్‌బ్లేయర్‌ ఐలాండ్‌ కనబడుతోంది. దీపాలు దగ్గరయ్యే కొద్దీ వెన్నెల వెలుగులు మసక బారసాగాయి. మా వెంట తెచ్చు కున్న అరిశెలు, మురుకులు స్వామినాధానికిచ్చేసాం. అతను చాలా సంతోషపడిపోయాడు. మాకిచ్చిన ఆతి ధ్యానికి ధన్యవాదాలు చెప్పి మేము 'వండూర్‌'' దిగేసాం.

మర్నాడు మా ప్రోగ్రామ్‌ జైలు లోపలి కెళ్ళి చూడ్డం. రోస్‌ ఐలాండ్‌, పీక్‌ పాయింట్‌ (ఎతైన ప్రదేశం) చూడ్డం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌్‌ చేసి సెల్యూ లర్‌ జైలుకి వెళ్ళాం. మొదటి రోజు రాత్రిపూట సౌండ్‌ అండ్‌ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌లో చూసిన జైలు. ఏడు పొడవాటి గోడల్లాగా ఒక వైపు మాత్రమే సెల్‌ తలుపు లుండేలా చాలా ప్లాన్డ్‌గా కట్టిన కరకు నమూనా. ఖైదీలు ఒకరి ముఖాలొకరికి కనబడవు. వందలాది ఖైదీలను బంధించి, చిత్రహింసలు పెట్టి, ఉరితీసిన భయంకరమైన ఆ జైలు సందర్శనం ఒంటిని జలదరింపచేసింది. ఖైదీలను ఏ విధంగా హింసించేవారో చూపించే బొమ్మలు వున్నాయక్కడ. ఒకేసారి ముగ్గురిని ఉరితీసే గది, వాసానికి వేలాడుతున్న ఉరితాళ్ళు. వీరసావర్కార్‌ గది. ఆవరణలో ఓ పెద్ద రావిచెట్టు వుండేదని, ఈ జైలులో జరిగిన అకృత్యాలను మౌనసాక్షి అదేనని గైడ్‌ చెప్పాడు. సునామీకి ఆ చెట్టు కూలిపోయి, దాని స్థానంలో ఓ పిల్లచెట్టు మొలిచింది. చాలా సేపు ఆ చెట్టు ముందు నిలబడ్డాను. నాతో ఏదో చెప్పాలన్నట్లు ఆకులు గలగల లాడాయి. గుస గుసగా ఏదో చెప్ప ప్రయత్నించాయి.

మనసంతా భారమైపోయింది. అదే మూడ్‌తో సునామీకి బాగా దెబ్బతిన్న రాస్‌ఐలాండ్‌ చూడ్డానికి వెళ్ళాం. పోర్ట్‌ బ్లెయిర్‌కి కన్పిస్తూ వుంటుంది ఈ చిన్న ద్వీపం. అక్కడ బ్రిటిష్‌ వాళ్ళ ప్రాభవ చిహ్నాలు చాలా వున్నాయి. క్లబ్‌లు, చర్చి, వాళ్ళ క్వార్టర్స్‌, టెన్నిస్‌ కోర్టుల్లాంటివన్నీ ప్రస్తుతం కూలిపోయి, ఆ శిధిలాల్లోంచి చెట్టు మొలుచుకొచ్చాయి. ఆ చెట్లు భవనాల ఆకారంలో గమ్మత్తుగా వున్నాయి. సునామీ తీవ్రంగా తాకిన ద్వీపమిది. అక్కడ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ వుంది. అందులో సునామీ కెరటాల్లో తన కళ్ళ ముందే తన భార్య ఎలా కొట్టుకుపోయిందో ఓ భర్త రాసిన ఉత్తరం వుంది.అన్నింటికన్నా నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అక్కడి నుండి స్ఫష్టంగా కనబడే సెల్యూలర్‌ జైలు, సెంట్రల్‌ టవర్‌. జైలరు, అధికారులు ఇక్కడి నుండి కూడా జైలును కంట్రోలు చేసేవారని అర్ధమైంది. ప్రస్తుతం ఇక్కడ జనమెవ్వరూ నివసించడంలేదు. టూరిష్ట్‌లు మాత్రమే తిరుగుతున్నారు.
అక్కడి నుండి పోర్ట్‌బ్లెయిర్‌ మొత్తం కనబడే 'పీక్‌ పాయింట్‌' కి వెళ్ళాం. చిక్కటి అడవిలోంచి కొండెక్కడం, ఆ కొండమీంచి సముద్రం, చిన్నా చితకా ఐలాండ్స్‌ కనబడ్డాయి. పోర్ట్‌బ్లెయిర్‌ చుట్టూ వుండే సముద్రం కన్పడింది. అడవిలోంచి ఏవో జంతువుల అరుపులు, పక్షుల కిలకిలలు కింద సముద్ర కెరటాలు. చాలా అందమైన ప్రదేశం. మేం తిరుగు ప్రయాణంలో కొండ దిగుతుంటే''తెలుగు ప్రాధమికోన్నత పాఠశాల'' పేరుతో తెలుగులో రాసి వున్న బోర్డ్‌ కన్పడింది. భండారిని అడిగితే ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారని చెప్పాడు.
మర్నాడు మ్యూజియమ్‌ చూసాం. అండమాన్‌ చరిత్రకి అద్దం పడుతూ ఎంతో సమాచారముందక్కడ. ఇక్కడ ఈ దీవుల చరిత్ర కొంత రాయాల్సి వుంటుంది. అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌ గురించి 1777 వరకు బయట ప్రపంచానికేమీ తెలియదు. 1777లో బ్రిటిష్‌ వాళ్ళు జరిపిన సర్వేలోనే ఇవి బయట పడ్డాయి. అంతవరకు ఈ ద్వీపాల్లో బయట నుంచి అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. ఆదిమ మానవులుగా పిలవబడే ''నెగ్రిటాస్‌'' ''మంగోలాయిడ్స్‌'' జాతి ఆదివాసులు శతాబ్దాలుగా ఇక్కడ బతుకుతుండేవారు. ఇక్కడ మొదట అడుగు పెట్టింది ఇంగ్లీషు వాళ్ళే. వారి రాజకీయ అవసరాల కోసం, ఖైదీలను ఉంచడం కోసం సెంటిల్‌మెంటుగా దీన్ని మార్చేసారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వేలాది దేశ భక్తుల్ని ఈ సెటిల్‌ మెంట్లలో నిర్భధించేవారు. ఆ తర్వాత సెల్యూలర్‌ జైలు కట్టారు. ఆ తర్వాత జపాన్‌ వాళ్ళు దాడి చేసి ఈ దీవుల్ని ఆక్రమించు కున్నారు.1947లో భారతదేశానికి సిద్ధించిన స్వతంత్రంతోపాటు అండమాన్‌, నికోబార్‌లు కూడా స్వతంత్రయ్యాయి.
అండమాన్స్‌కి వలస వచ్చిన వాళ్ళలో బెంగాలీయులే అధికులు. ప్రభుత్వ పాలసీ ప్రకారం, పునరావాస కార్యక్రమాల్లో భాగంగా 'సెట్లర్స్‌'గా వీళ్లు వచ్చారు. ఈ పునరావాస కార్యక్రమం 1949 నుండి 70 వరకు కొనసాగింది. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌) నుండే ఎక్కువ మంది ఇక్కడికొచ్చారు. అలాగే ఎంతోమంది 'ఎక్స్‌సర్వీస్‌మెన్‌' నికోబార్‌ దీవుల్లో పునరా వాసం పొందారు. వీరిలో పంజాబీలు, మరాఠీలు, మళయాళీలు, తమిళులు, తెలుగు వాళ్ళు వున్నారు. ఇలా బ్రిటీష్‌వాళ్ళు అడుగుపెట్టి, ఈ దీవుల ఉనికిని కనుక్కుని, తన రాజకీయ అవసరాలకు వాడుకున్న తరువాత , ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులు ఇక్కడ చొరబడ్డారు. ఈ నాగరీకుల ప్రవేశంతో అప్పటివరకు స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసులు లోపల్లోపలికి కుంచించుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అండమాన్స్‌లో వున్న 572 దీవుల్లో ఆదివాసులు కొన్ని దీవుల్లో మాత్రమే వున్నారు. నికోబార్‌ ఐలాండ్స్‌లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. జరువాలు, షోమ్‌పెన్‌, గ్రేట్‌ అండమానిస్‌, ఓగ్గ్సు, సెంటీనలీస్‌ అనే ఐదు తెగలకు చెందిన ఆదిమమానవులు, నాగరీక సెట్లర్స్‌ చర్యల వల్ల ప్రమాదంలో వున్నారని ఇటీవల భారత ప్రభుత్వ ఆదివాసీ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తెగలవారిని ''కుతూహలంగా'' చూసేవారే తప్ప వారి సమస్యలు వీరికి అర్ధం కావని కూడా పేర్కోనడం గమనించాలి.
నికోబార్‌ ఐలాండ్‌కి మేము వెళ్ళలేక పోయా౦ కానీ అక్కడి ఆదివాసులకు సంబంధించి అనేక చిత్రాలు మ్యూజియంలో ప్రదర్శించారు. వారి ఇళ్ళు, ఆహారపుటల వాట్లు వస్త్రధారణ ఎంతో భిన్నంగా వుంటాయి. సునామీలో వేలాదిగా నికోబార్‌లో వుండే ఆదివాసులు చనిపోయరని, కొన్ని ద్వీపాలు శాశ్వతంగా సముద్రంలో కలిసి పోయాయని రాసివుంది. నికోబార్‌ ఐలాండ్‌ వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి, రక్షణ ఏర్పాట్లు అవసరమని, ఆదివాసులు ఎవరినీ నమ్మరని, ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదమని భండారి మాకు చెప్పడంతో మేము ఆ ప్రస్తావన వదిలేసుకున్నాం.
అద్భుతానుభవాల్ని గుండెల్లో పదిల పరుచుకుని అండమాన్‌ ద్వీపానికి, గెష్ట్‌హౌస్‌ సిబ్బందికి వీడ్కొలు పలికి మేము చెన్నైె విమానం ఎక్కాం. విమానం అనంతజలరాశి మీద ఎగురుతుంటే దాని నీడ చేపలాగా నీళ్ళల్లో కనబడింది. ఎన్నో ద్వీపాలు. నీలిరంగు నీళ్ళు చుట్టుకున్న ఆకుపచ్చటి ఐలాండ్స్‌. అండమాన్‌లో గాల్లో ఎగిరి చెన్నైలో దిగేవరకు రవ్వంత భమి కనబడదు. నీళ్ళే నీళ్ళు. చెన్నైలో దిగేటప్పుడు ఓ గమ్మత్తు జరిగింది. ల్యాండ్‌ అవడానికి విమానం చాలా కిందకి దిగింది. అయితే ఎందుకనో దిగకుండా కిందే ఎగురుతూ తిన్నగా వెళ్ళసాగింది. నెల్లరు దాటి పులికాట్‌ మీదుగా వెళ్ళి వెనక్కి తిరిగింది. నాయుడుపేట, తిరుపతి రోడ్డు స్ఫష్టంగా కన్పడుతుంటే నాకు ప్రతిమ గుర్తొచ్చింది. ప్రతిమా! మీ ఊరి మీద ఎగురుతున్నానని అరిచి చెప్పాలన్పించింది.సెల్‌ఫోన్‌ వాడనిస్తే ఫోన్‌లో చెప్పేదాన్నేమో! చెన్నై చుట్టూ చక్కర్లు కొట్టి లాండ్‌ అయ్యిుంది విమానం. మేము హైదరాబాద్‌ ప్లయిట్‌ కోసం ఎదురుచస్తూ లాంజ్‌లో కూర్చున్నాం.
ఓ మహా నిశ్శబ్ధ్దంలోంచి, పచ్చటి ప్రకతిలోంచి, నీలాల సంద్రపు కౌగిలిలోంచి విడివడి మళ్ళీ జనారణ్యంలోకి అడుగు పెట్టడంతో మా అండమాన్‌ ద్వీపాలయత్ర ముగింపుకొచ్చింది. జనాభాతో కిటకిట లాడుతున్న ఈ ప్రాంతాలెక్కడ 572 ద్వీపాలకు కలిపి నివసిస్తున్న నాలుగు లక్షల మంది ఎక్కడ. అందులో బెంగాలీలు, మళయాలీలు, తెలుగు వాళ్ళు, ముస్లిమ్‌లు, క్రిష్టియన్‌లు కలిసి మెలిసి సామరస్యంగా జీవించే అండమాన్‌ ఓ అద్బుత యత్రా స్థలం. ప్రకృతికి అతి సమీపంగా, శబ్దరాహి త్యంలో తరించాలనుకునే వాళ్ళకి చక్కటి గమ్యం. ప్రకృతి ప్రేమికులను పారవశ్యంలో ముంచేయగల మహాసంద్రం బంగాళాఖాతం అడుగడుగునా పాదాలను తాకుత మనల్ని పునీతుల్ని చేస్తుంది. పునరాగమనకాంక్షని రగిలిస్తుంది. మళ్ళెపుడు...అంటూ మనల్ని బలంగా తనవేపు లాక్కెళ్ళిపోగల మహా ఆకర్షణ అండమాన్‌.

Sunday, May 11, 2008

"లాడ్లి గర్ల్ చైల్డ్ కాంపెయిన్ జాతీయ మీడియా అవార్డ్"

మిత్రులకు ఒక శుభ వార్త.
మీతో ఓ మంచి కబురును పంచుకుందామని ఉంది.
నాకు మార్చి నెలలో దక్షిణ ప్రాంతానికి గాను ఒక అవార్డ్ వచ్చింది. ఆ విషయాన్ని మీతో పంచుకున్నాను కూడా.
ప్రస్తుతం నాకు "లాడ్లి గర్ల్ చైల్డ్ కాంపెయిన్ జాతీయ మీడియా అవార్డ్" వచ్చింది.
15 వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగే ఒక ఫంక్షన్ లో ఈ అవార్డ్ ప్రదానం జరుగుతుంది.స్త్రీల అంశాల గురించి , ఆడపిల్లల హక్కుల గురించి నేను భూమిక లో రాసిన సంపాదకీయాలకు,ఇంక అనేక ఇతర పత్రికలలో రాసిన వ్యాసాలకు గాను ఈ జాతీయ అవార్డ్ ప్రకటించడం జరిగింది.నేను 15 వ తేదీన డిల్లీ వెళుతున్నను అవార్డ్ స్వీకరించడానికి.తిరిగొచ్చాకా మీకు ఆ విశేషాలు చెబుతాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...