Sunday, January 31, 2010

మా అమ్మ పేరు మీద నిన్న అంతర్వేది లో అయిదు వేల మందికి భోజనం పెట్టాము.


మా అమ్మ పేరు మీద నిన్న అంతర్వేది లో అయిదు వేల మందికి భోజనం పెట్టాము.
నేను ఈ సందర్భాన్ని భూమిక హెల్ప్ లేయిన్ నంబర్ని ప్రచారం చెయ్యడానికి చక్కగా ఉపయోగించాను.
దురదృష్తవసాత్తు నిన్న గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది.అప్పుడు నేను అక్కడే ఉన్నాను.
చాలా మంది జనం రావడం వల్ల ఆ పడవలో ఎక్కువమంది ఎక్కారు.సాధారణంగా మా గోదావరి లో పడవ ప్రమాదాలు  జరగడం చాలా తక్కువ. సముద్రంలో పున్నమి స్నానం చెయ్యడానికి ఒచ్చి ప్రమాదం లో మరణించడం చాలా బాధాకరం.
నిన్న రాత్రి పున్నమి చంద్రుడుని  చూసి తీరాల్సిందే.
బాధిత స్త్రీలని చేరడానికి,భూమిక హెల్ప్ లేయిన్ నంబర్ని ప్రచారం  చెయ్యడానికి ఇల్లాంటి  సందర్భాల్ని ఉపయోగించుకోవాలని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను.

Sunday, January 17, 2010

ఈ సంక్రాంతి కి నేను నా కిష్టమయిన పని చేసాను


ఈ సంక్రాంతి కి నేను నా కిష్టమయిన పని చేసాను.
భోగి రోజు విజయవాడ నుండి వస్తూ బోలెడన్ని భోగి మంటలు చూసాను.
హఠాత్తుగా కురిసిన అకాల వర్షానికి కొన్ని భోగి మంటలు ఆరిపోతూ కనిపించాయి,
ఉవ్వెత్తున ఎగిసిపడిన ఇటీవలి ఉద్యామాలలా.
పెద్దపండగా రోజు నెక్లెస్ రోడ్ లో పతంగుల పండగ చూసి వస్తూ
వాల్దెన్ కి వెళ్లాను.నేను ఎంతోకాలంగా వెతుకుతున్న పుస్తకం కనబడి గొప్ప సంతోషం కలిగింది.
ఇటీవల శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయిన గోపీచన్దు గారి పుస్తకాల సర్వస్వం.
10 వాల్యూముల భండారం.మూడో వాల్యుం లో నాకిష్టమయిన "మెరుపులు మరకలు" నవల.
ఎన్నో సంవత్సరాలగా వెతుకుతున్న పుస్తకం.
1500 ఖర్చుపెట్టి పరమానందంగా ఇంటికి తెచ్చుకుని ఇదిగో మీకోసం ఈ ఫోటో తీశాను.
పండగరోజు పుస్తకం కొనడంలో గొప్ప ఆనందముంది.
మీరూ నాతొ ఏకీభవిస్తారని ఆసిస్తూ....

Saturday, January 16, 2010

ఈ రోజు ఉదయమే లేచి కెమేరా భుజానికి తగిలించి మా ఇంటి చుట్టూ తిరుగుతూ తీసినచాయాచిత్రాలివి.


ఇదిగిదిగో ఈ మొక్క చూడండి దీన్ని నా ప్రియనేస్తం గీత నాకు బహుమతిగా పదేళ్ళ క్రితం ఇచ్చింది.మా స్నేహం లాగానే అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది.

ఈ రోజు ఉదయమే లేచి కెమేరా భుజానికి తగిలించి మా ఇంటి చుట్టూ తిరుగుతూ తీసినచాయాచిత్రాలివి.

ఇదిగిదిగో ఈ మొక్క చూడండి దీన్ని నా ప్రియనేస్తం నాకు బహుమతిగా పదేళ్ళ క్రితం ఇచ్చింది.మా స్నేహం లాగానే అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది.



ఇదిగో ఈ గంధం మొక్క చూసారా అది చాలా కాలంగా ఇక్కడే ఉంది.

నేను కూర్చుని ప్రక్రుతిని ఆస్వాదించే నా ఉయ్యాల కుర్చీ

ఇదిగో ఈ చింత చెట్టు చూసారా.ఇది మాజీ హోం మంత్రి గారి ఇంట్లో ఉంది. నేను గొంగతనంగా చింత చిగురు,కాయలు కోస్తూ ఉంటానండోయ్.

ఇదిగో ఈ బారామాస్ మామిడి చూడండి దీన్ని కూడా కడియం నుంచే తెచ్చామండి. సంవత్సరమంతా కాస్తూనే ఉంటుంది.

అదిగో ఆ పోకచెట్టు చూడండి దాన్ని అండమాన్ నుంచి,

మా ఇంటి ముందు ఈ కాక్టస్ చూసారా.దాని కింద పరిచిన కోరల్స్ చూసారా.బంగాళామహాఖాతం నుండి తెచ్చినవి.

ఈ జామ మొక్క చూసారా దాని పెరు కేజీ జమ అంటారు.ఒక్కో కాయ కేజీ ఉంటుంది.దాన్ని కడియం నుంచి,

బ్రహ్మ కమలం మొక్క ని బ్రహ్మపుత్ర నది పక్కనుండి అంటే గౌహతి నుండి,

ఇవిగో ఈ సంపెంగ మొక్కల్ని చూసారా వాటిని తిరుపతి నుండి,

నాఫోటోల కార్యక్రమాన్ని చిరునవ్వులు చిలికిస్తూ చూస్తున్న 85 ఏళ్ళ మా అత్త గారు






ఈ రోజు ఉదయమే లేచి కెమేరా భుజానికి తగిలించి మా ఇంటి చుట్టూ తిరుగుతూ తీసిన చాయాచిత్రాలివి. ఒక్కో మొక్కకీ ఒక్కో కధ ఉందండోయ్ ఇదిగిదిగో ఈ మొక్క చూడండి దీన్ని నా ప్రియనేస్తం నాకు బహుమతిగా పదేళ్ళ క్రితం ఇచ్చింది.మా స్నేహం లాగానే అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. ఈ లోటుస్ పాండ్ చూసారా ఇందులో తెల్లకలువలు పూస్తాయి.


Friday, January 15, 2010

నెక్లెస్ రోడ్లో  పతంగుల హంగామా ఫోటోలు మరికొన్ని మీకోసం

Thursday, January 14, 2010

నెక్లెస్ రోడ్లో పతంగుల హంగామా చూసొచ్చా ఇప్పుడే.


హబ్బో ! ఎన్నెన్ని గాలిపటాలు,ఎన్నెన్ని రంగులు,ఎంతెంత అల్లరి,అరుపులు,కేకలు ఎంత కోలాహలమో !
తెగిన గాలిపటాల కోసం కుర్రాళ్ళ ఉత్సాహం.
ఒక్క అమ్మాయీ లేకపోవడం ఎంత నిరుత్సాహామో నాకు.
ఒకే ఒక్క ఆడపిల్ల కనబడి ఫోటో తీస్తానంటే ఇలా ముఖం దాచేసుకుంది.
అమ్మాయిలూ! ఎగరెయ్యండి ఆకాశమే హద్దుగా.
హాయిగా ఎగురుతున్న పతంగుల్ని చూస్తున్నానా
ఆదమరిస్తే మాంజా మెడకి చుట్టుకోవడం ఖాయం.

 మీ కోసం కొన్ని ఫోటోలు
                               సీసాపెంకులు నూరి తయారు చేసిన మాంజా మెడకి తాకితే ఇంతే సంగతులు చిత్తగించవలెను

Tuesday, January 12, 2010

రుచిక కేసు - రేపుతున్న ప్రశ్నలు

ఒక జెసికాలాల్‌, ఒక అరుషి, ఒక స్వప్నిక, ఒక రుచిక. ఎవరు వీళ్ళంతా? ఏం జరిగింది వీళ్ళకి. ఈ సంవత్సరాంతాన ఎందుకు వీళ్ళను తలుచుకోవలసి వస్తోంది. వీళ్ళంతా ఎందుకు అర్ధాంతరంగా చనిపోయారు? చనిపోలేదు. చంపేయబడ్డారు. కళ్ళ ముందు వరుస క్రమంలో నిలబడి నన్నెందుకు ఇంతటి మానసిక క్షోభకి, ఆపుకోలేని దు:ఖానికి గురి చేస్తున్నారు. అదుపు చేసుకోలేని కోపంతో నా కలం కూడా వొణుకుతోంది. ఏం తప్పు చేసారని వాళ్ళు మరణం అంచులవేపు నెట్టేయబడ్డారు. ఈ దేశంలో ఆడదానిగానో, ఆడపిల్లగానో పుట్టడమే వాళ్ళ నేరమా? ఇంకా ఎంతమందిని ఇలా చంపేస్తారు? చంపేసిన వాళ్ళని శిక్షించరా? శిక్షలు పడవని తెలిసేకదా చంపేస్తున్నారు.
నేను ఢిల్లీలోని కుతుబ్‌ హోటల్‌ రూమలో టి.వీ ముందు కూర్చుని, ఆనాటి సమావేశపు బడలిక నుండి సేద తీరుతున్నవేళ రుచిక కేసుకు సంబంధించిన తీర్పు గురించిన వార్తను చూసాను. పద్నాలుగు సంవత్సరాల పసిపిల్ల రుచిక లైంగిక అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 19 సంవత్సరాల తర్వాత వెలువడిన తీర్పు గురించిన వార్తను చూసాక నా గుండె ఒక్కసారిగా జలదరించినట్టయింది. నిందితుడు, అప్పటి హర్యానా ఐజి ఎస్‌.పి.ఎస్‌్‌. రాధోడ్‌ నవ్విన నవ్వు, వెకిలి, విషపు నవ్వు నా కళ్ళల్లోంచి కదలడం లేదు. భారతదేశ న్యాయవ్యవస్థ భాగోతం మీద రాధోడ్‌ ధిక్కార, నిర్లక్ష్యనవ్వు. నన్నెవరేం చెయ్యలేరు అనే పొగరుబోతు నవ్వు. పసిపిల్ల మీద దున్నపోతులా లైంగిక వేధింపులకు పాల్పడిన రాధోడ్‌, దున్నపోతు మీద వాన కురిసినట్టే న్యాయవ్యవస్థ ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళి పోయాడు. కేవలం ఆరునెలల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా. ఘనత వహించిన కోర్టువారు వెంటనే ఉదారంగా బెయిల్‌ కూడా మంజూరు చేసేసారు. పై కోర్టులో అప్పీల్‌ చేస్తానంటూ దున్నపోతు కోర్టు నుండి జారిపోయింది.
ఈ ఉదంతం మనిషన్న వాడిని మండించకుండా వుంటుందా? తన ప్రాణ స్నేహితురాలి తరఫున ఇరవై సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న ఆరాధన దు:ఖాన్ని ఎవరు అర్ధం చేసుకుంటారు? ఎవరు ఓదార్చుతారు? స్త్రీలమీద పదే పదే జరుగుతున్న ప్రాణాంతక దాడులు, లైంగిక అత్యాచారాలు, యాసిడ్‌ పొయ్యడాలు పెచ్చరిల్లి పోతూనే వున్నాయి. నిందితులు రాజకీయ అండబలంతో, డబ్బు కండకావరంతో, ఏళ్ళు పూళ్ళూ సాగే న్యాయవిచారణా వ్యవస్థ, అవినీతిలో మునిగితేలే పోలీసు వ్యవస్థల వల్ల చట్టం నుండి సునాయాసంగా తప్పించుకుపోతున్నారు. శిక్షించని న్యాయవ్యవస్థ వల్ల అత్యాచారాలకు గురౌతున్న స్త్రీలు తామే అంతమౌతున్నారు తప్ప నిందితులు కాలరెగరేసి, వెకిలి నవ్వులు నవ్వుతూ సభ్య సమాజంలో మిన్నాగుల్లా తిరుగతూనే వున్నారు మళ్ళీ మళ్ళీ కాటేేస్తూనే వున్నారు.
1990 ఆగష్టు పన్నెండు. కోటి ఆశలతో టెన్నిస్‌ తారనవ్వాలనే బలమైన ఆకాంక్షలతో అప్పటి హర్యానా ఐజి మరియు హర్యానా లాన్‌ టెన్సిస్‌ అధ్యక్షుడు రాధోడ్‌ ఆఫీసులో అడుగుపెట్టింది రుచిక. తన ఫ్రెండ్‌ ఆరాధనని వెంట తీసుకెళ్ళింది. ఆరాధనని బయటకు పంపి 14 సంవత్సరాల రుచికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు రాధోడ్‌. తిరిగి వచ్చిన ఆరాధనకి జరిగిన ఘోరాన్ని చెప్పింది రుచిక. ఆగష్టు 18న పోలీసులకు ఫిర్యాదు చేసారు రుచిక తండ్రి, సోదరుడు. రుచిక స్వదస్తూరితో జరిగిన ఘోరాన్ని రాసిచ్చింది. పోలీసులు కంప్లయింట్‌ రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేసి రాధోడ్‌ మీద నేరాన్ని ధృవీకరించారు. అప్పటి నుండి రుచిక కుటుంబం తీవ్రమైన వేధింపులకి గురౌతూ వచ్చింది. బెదిరింపులు రావడం, రుచిక ఎక్కడికెళ్ళితే అక్కడికి రాధోడ్‌ గుండాలు వెంటాడం, రుచిక సోదరుడి మీద కారు దొంగతనాలు అంటగట్టి అరెస్ట్‌ చేయడంలాంటి వికృత చర్యలకి రాధోడ్‌ పాల్పడడం మొదలుపెట్టాడు. ఒకసారి రుచిక సోదరుడిని ఆమె ముందే తీవ్రంగా కొట్టి వేధించాడు. రుచికని స్కూల్‌ నుండి తీసేసారు. పద్నాలుగు సంవత్సరాల రుచిక ఈ మానసిక వేదనని, వొత్తిడిని తట్టుకోలేక రాధోడ్‌ని తిడుతూ తన జీవితాన్ని నాశనం చేసాడని బిగ్గరగా ఏడ్చేదని తండ్రి చెప్పారు. తనెంత నచ్చ చెప్పినా, ఓదార్చినా వినేది కాదని కళ్ళనీళ్ళ మధ్య పత్రికల ముందు వాపోయాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి లోనై డిశంబరు 29, 93లో రుచిక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆరాధన, ఆమె తండ్రి కలిసి రుచిక ఆత్మహత్యకు కారకుడు రాధోడ్‌ అంటూ కేసు వేసారు. క్రింది కోర్టు ఈ వాదనని అంగీకరించినప్పటికీ హైకోర్టు అతను నిర్ధోషి అని కితాబిచ్చి వదిలేయడం, ప్రభుత్వం రాధోడ్‌కి డి.జిపిగా ప్రమోషన్‌ ఇవ్వడం జరిగిపోయాయి.
ఆరాధన తన పోరాటం ఆపలేదు. 1990 కేసు రిజిస్టరు అయినప్పటికీ 1999 వరకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ కాలేదు. రాధోడ్‌ తన రాజకీయ, పోలీసు ప్రాబల్యాన్ని ఉపయోగించి కేసును ముందుకెళ్ళకుండా చెయ్యడంతో పాటు రుచిక కుటుంబాన్ని చంఢీగడ్‌లో బతకలేని స్థితి కల్పించాడు. డి.జి.పిగా తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించడంవల్ల వారు చంఢీగడ్‌ నుంచి వెళ్ళిపోయారు. వారి తరఫున, తన స్నేహితురాలి కోసం ఆరాధన ఇరవై సంవత్సరాలు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు డిశంబరు 21, 2009న చిన్నపాటి విజయం సాధించింది. రాధోడ్‌కి కేవలం 6 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది కోర్టు.
నేరం జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత, బాధితురాలు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెకి దొరికిన న్యాయం చూసి గుండెలు బాదుకుని ఏడ్వాలో, పగలబడి నవ్వాలో తెలియడం లేదు. నేరగాడికి సంబంధించి, అతడిని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన రాజకీయ వ్యవస్థ విశ్వరూపం దిమ్మతిరిగేలా చేస్తోంది. నలుగురు ముఖ్యమంత్రులు ఈ నేరస్థుణ్ణి కాపాడుకుంటూ వచ్చిన వైనం కథలు, కథగా, వార్తాపత్రికలు ప్రచురిస్తున్న కధనాలు చదువుతుంటే, ఎంతమందిని ఎన్ని రకాలు ప్రలోభపెట్టి, బెదిరించి తన నేరాన్ని కప్పిపుచ్చుకున్న పెద్ద పోలీస్‌ రాధోడ్‌ కౄరమైన, వెక్కిరింత నవ్వు వెన్నులో వొణుకు పుట్టిస్తోంది. స్త్రీల మీద అత్యాచారాలు చేసి, కిరోసిన్‌ పోసి కాల్చి, యాసిడ్‌ పోసి రూపాలను చిదిమేసి, ఎన్నో దారుణాలు చేసే పురుషుల్ని, నేరస్థుల్ని, నిందితుల్ని, పురుషాధిక్య సమాజం ఎలా కాపాడుకుంటూ వస్తుందో ‘రుచిక’ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల్లోను పాతుకుపోయిన పితృస్వామ్యం స్త్రీలను ఎన్ని రకాలుగా రాచిరంపాన పెడుతుందో ఈ కేసులో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని నేరాలు చేసినా, కమ్ముకుంటూ, కాపాడుకుంటూ వచ్చే పోలీస్‌, పరిపాలన, న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు వున్నపుడు రుచికలాంటి పసికూనలు రాధోడ్‌లాంటి రాక్షస పదఘట్టనల కింద నలిగిపోక ఏమైతారు? రాధోడ్‌ కౄరనవ్వుకి అర్ధం ఇదే.
మరి మనమేం చెయ్యాలి? నిరాశలో కూరుకుపోదామా? నిట్టూర్చి వదిలేద్దామా? ఈ దేశంలో 50 కోట్ల మంది స్త్రీలకి గౌరవంగా, భద్రంగా, హింసారహితంగా బతికేహక్కు వుందని ఎలుగెత్తాల్సిన అవసరం, ఆవశ్యకత మరింత ఎక్కువైందని అర్ధం చేసుకుందామా? రాధోడ్‌ పురుషులందరికి ప్రతినిధి కాడు. పురుష ప్రపంచమా! పెదవి విప్పండి. మాతో గొంతు కలపండి. పోయేదేమీ లేదు. సమానత్వం వెల్లివిరియడం తప్ప.

Sunday, January 3, 2010

పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.

నిన్న సాయంత్రం మా సెనగ చేలో సాయం సంధ్య కెంజాయనీ,చలచల్లనీ శీత గాలినీ,పచ్చపచ్చని పొలాల తాజాదనాన్ని తనివితీరా ఆస్వాదించి ఇంటికొచ్చానా,
 అబ్బో ! తూరుపుదిక్కునుంచి రెండు తొనలు తీసేసిన నారింజ పండులా నిగ నిగలాడిపోతూ విదియ నాటి చంద్రుడు   (31 నిండు పున్నమి రోజు కదా)
ఈ ద్రుశ్యాన్ని కళ్ళ నిండా నింపుకొని కమనీయంగా నిద్రపోయానా ,

ఉదయం లేవగానే మరో అందమైన అనుభవం నా కోసం ఎదురు చూస్తోంది.

ఇంతకుముందు ఒకటి రెండుగా వచ్చే పిచ్చుకలు ఈ రోజు మిడతల దండు లాగా మా ఇంటి మీద వాలిపోయాయి.నేను చల్లిన బియ్యం తింటూ నా కెమేరాకి చిక్కిపోయాయి.

నేను చల్లింది గుప్పెడు బియ్యమే కానీ పిచ్చికలు పంచిన సంతోషం విలువను ఖరీదు కట్టే అక్షరాలు నా దగ్గర లేవు. మీరూ చూడండి కావాలంటే.

Saturday, January 2, 2010

ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్!




ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్.
ఒక చోట పచ్చగా ఒక చోట బంగారు రంగులో మెరిసిపోతూ మా సెనగ చేను
గోధూళి వేళ, సూర్యుడు పడమటి దిక్కున,కొండ వెనక కనుమరుగవతున్న వేళ
సెనగ చేలో,పక్షుల పాటలకి కువ కువ లాడుతూ నేను
మొక్క జొన్న కంకులు ఫైరగాలికి తలలూపుతుంటే
పారవశ్యంలో మునిగి సర్వం మరచిన నేను
భాగ్యనగర శబ్ద కాలుష్యానికి దూరంగా
బంగారు సెనగాచేలో బహు సంతోషంగా నేను
నేను చెప్పేది అబద్ధమనుకుంటే ఈ చాయా చిత్రాలు చూడండోచ్!

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...