Posts

Showing posts from November, 2008

ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.

Image
ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.


కర్నూల్ వచ్చా నిన్న రాత్రి.ఉదయాన్నే వాకింగ్ చేద్దామని జాతీయ రహదారి(హైదరాబాద్ చిత్తూర్ పోయే దారి)మీదకి వచ్చాను.రాత్రి కురిసిన వానకి తోడు పొగమంచు జోడై దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.రోడ్డుకి అటు ఇటు పచ్చటి తివాచీ పరిచినట్టు ,దట్టంగా పొగమంచు ఆవరించిన సెనగచేలు,గుత్తులు గుత్తులుగా కంకులేసిన జొన్న చేలు,మరోపక్క పసుపారబోసినట్టు విచ్చుకున్న పొద్దు తిరుగుడు పూలతో కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు చేలు. ఆ చల్లటి వేళ ప్రక్రుతి ఎంత రమణీయంగా ఉందో నేను రాయడం కాదు చూసితీరాల్సిందే.

మెలమెల్లగా తూరుపు ఎర్రబారుతోంది.భానుడి తొలికిరణాల స్పర్శని అనుభవిస్తూ ఎందుకో అలవోకగా పశ్చిమానికి తిరిగానా నా నోట్లోంచి వావ్ అంటూ ఓ కేక దూసుకొచ్చింది.

వానజల్లు లేకుండా విచ్చుకున్న రంగురంగుల ఇంధ్రధనుస్సు.ఓ క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను.పొగమంచు కురుస్తోంది కాని వర్షం లేదే.సూర్య కిరణాలు మంచు మీద ఏటవాలుగా పడితే కూడా రెయిన్ బో వస్తుందా?(ఆ తర్వాత తెలిసింది ఆ టైం లో టౌన్ లో వాన పడిందని)

పచ్చదనం ,ఇంధ్రధనుస్సు నాతో చెట్టాపట్టలేసుకుంటూ నాతో నడిచాయంటే నమ్ముతారా మీరు?

ఒక్కదానివీ జాతీయ రహదారి మీ…

మార్పు మాత్రమే శాశ్వతం

ఉదయం చల్లటి గాలి మనసారా శరీరాన్ని తాకేవేళ నా నడకతో పోటీ పడుతూ ఎన్నో ఆలోచనలు.తెలిమంచుతెరలు ఎంత అడ్డం పడినా తొలిసూర్య కిరణాలు తొంగి చూసినట్టు కళ్ళకు అడ్డంపడుతున్న,దేన్నీ స్పష్టం చూడనివ్వని సంధిగ్ధాలెన్నో పటాపంచలౌతున్న చప్పుడు.
నిన్నటి దుఖ తీవ్రత ఈరోజు ఎందుకుండదు?నిన్నటి మనోవేదన, మాటలకందని మానసిక సంఘర్షణ ఈరోజు ఏమౌతుంది?హమ్మో ఇదిలేకపోతే నేను బతకగలనా?హమ్మో అది దూరమైతే నేను భరించగలనా? నువ్వు లేకపోతే నేను బతికుంటనా?నీ కోసం ప్రాణలైనా ఇచ్చేస్తాను.నువ్వు లేని జీవితాన్ని కల్లో కూడా ఊహించలేను.ఎన్ని అబద్ధాలను మోస్తూ మనిషి బతుకుతుంటాడో ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో. స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్ని అవసరమే.కానీ వాటి చుట్టూ మనం అల్లుకునే అభూతకల్పనలే వింతగా ఉంటాయి.ఆత్మ త్రుప్తి కోసం అనుకుంటూ ఎంత ఆత్మ ద్రోహం చేసుకుంటామో ఆలోచిస్తే సంభ్రమంగా ఉంది.అన్నీ శాశ్వతం,అన్నీ బంధాలూ రాతి స్వభావాన్ని కలిగి ఉంటాయి,ఎప్పటికీ మారవు అనుకోవడం లోనే అంత ఉంది చిక్కంతా.
నిజానికి ఏదీ శాశ్వతం కాదు  మార్పు ఒక్కటే శాశ్వతమైంది.చుట్టూ ప్రపంచం చలనశీలతకలిగి ఉంటుంది.
సంతోషం,దుఖం రెండూ శాశ్వతం కావు.అప్పుడే నవ్విన కళ్ళు …

మనకేమైంది నేస్తమా

నిన్నలా చూడడం నా కెంత శిక్షో నీకు తెలుసా
 చిరుగాలికి రావి ఆకులు గలగలాడినట్టు
పారిజాతాలు జలజలా రాలిపడినట్టు
తెరలు తెరలుగా మొగలి రేకుల్నివిడదీసినట్టు
సహజంగా, సెలయేరు దూకినంత స్వచ్చంగా
నవ్వే నువ్వు
నీ నవ్వుతో నన్ను వెలిగించే నువ్వు
కన్నీళ్ళు కన్నీళ్ళుగా కరిగిపోవడం
ఆ కన్నీళ్ళకి కారణం నేనే కావడం
అబ్బ! నాకెంత గుండె కోతో నీకు తెలుసా?
ఒకరి సమక్షం ఇంకొకరికి ప్రాణమైన చోటే
ఒకరినొకరం స్ప్రుశించలేకపోవడం
ఎంత విషాదం?
ఒకరికొకరం ప్రాణంగా
స్నేహానికి నిర్వచనంలా నిలబడిన
మనం ఈ రోజు ఎందుకింత నిస్సహాయులమైనాం నేస్తమా!

దిబ్బపాలెం లో కుప్పకూలిన కొంపా గూడు.

Image
ఆ తరువాత మేం ఆ పక్కనే ఉన్న దిబ్బపాలెం గ్రామం వెళ్ళేం.
భూకంపమొచ్చి కుప్పకూలిపోయాయా?శత్రురాజుల దాడిలో కూల్చేయబడ్డాయా అన్నంత హ్రుదయవిదారకంగా ఉన్నాయక్కడ కూలిన ఇళ్ళ ద్రుశ్యాలు.కడుపులో చెయ్యిపెట్టి దేవినట్టయ్యింది. ఎవరి ఇళ్ళను వాళ్ళే కూల్చేసుకుంటున్న దారుణ ద్రుశ్యాలు.ఇళ్ళు,బళ్ళు, కమ్యూనిటి హాళ్ళు ఒకటేమిటి-దిబ్బపాలెంలో అన్నీ మట్టి దిబ్బలే.ఇటుకల పోగులే.ఒంటరిగా దిగులుగానిలబడ్డ పెరళ్ళ ముందు
ప్రేమగా పెంచుకున్న మొక్కలు."వీళ్ళంతా ఎక్కడికెళ్ళారు?" అన్న ప్రశ్నకు గూళ్ళు కూలిపోయాయిగా.చెట్టుకొకరు.పుట్ట కొకరుగా చెదిరిపోయారు.ఎవరెక్కడికెళ్ళేరో ఎవరికి తెలుసు?తమ సొంత గ్రామం.సొంత పరిసరాలు.సొంత మనుషులు.ఆ గ్రామంతో పెనవేసుకున్న అనుభవాలు.గుండె దిటవునిచ్చే సామూహిక నివాస ప్రాంతం.ఏది?ఏమైంది?ఏకాకులై ఏకాంత వాసాలకి తరలిపోయిన ఆ ప్రజల జీవన శిధిలాల్లా దిబ్బపాలెంలో కూలిన ఇళ్ళ దిబ్బలు.కార్పోరేట్ కసాయితనానికి నిదర్శనంలా కనబడుతున్న సముద్రం చుట్టూ వెలుస్తున్న వైర్ల ఫెన్సింగ్.నిర్వాసితులైన ప్రజలకి ఫోటోలు తీస్తూ,వారిపై అవాకులు,చెవాకులు పేలిన ప్రభుత్వ ప్రత్యేక అధికారిబండతనం,లేకితనం.ఉన్న ఇంటిని కూల్చేసి,వలస పొమ్మనడం…

తూర్పు కనుమల్లో వెల్లువెత్తిన స్త్రీల కన్నీటి ప్రవాహాలు

Image
భూమిక ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రచయిత్రుల సాహితీ యాత్ర ఈసారి ఉత్తరంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయమైంది.అక్టోబుర్ 17 న నలభై మంది అందులో ముప్పైకి పైగా రచయిత్రుల తో మా యాత్ర మొదలైంది.ఉత్త్రాంధ్ర లో జరుగుతున్న వివిధ సామాజిక ఉధ్యమాల అధ్యయనం, వాకపల్లి సందర్శనం మా యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు.
మేం విశాఖలో దిగిన వెంటనే అల్పాహారం చేసేసి గంగవరం, దిబ్బపాలెం వైపు వెళ్ళిపోయాం. గంగవరం పోర్టు నిర్వాసితుల గురించి మీడియా లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే.గంగవరం గ్రామ ప్రజల గుండె ఘోషను అక్షరీకరించడానికి నా కలానికున్న బలమెంతో నాకు తెలియదు కానీ "మా సముద్రం పోయింది"అనే మాట పదేపదే చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది.సముద్రం మా జీవనాధరం.చేపలు పట్టుకుని బతికేటోల్లం.మమ్మల్ని మా సముద్రం నుంచి వేరు చేస్తే మేం బతికేదెట్లా?మేం పని చేసుకు బతుకుతామంటే మీకు చెక్కులిస్తా..ఇక్కడి నుండి పొమ్మంటారేమిటి?ఉద్యోగాలిస్తామన్నరు.ఇల్లు కట్టించి ఇస్తామన్నరు.ఇంకా ఏమేమో ఇస్తామన్నారు.అవన్నీ మాకెందుకు?మా సముద్రాన్ని మాకిచ్చేస్తే చాలు కదా?కన్నీళ్ళ వేడికోలు.
గంగవరంలో మహిళలు సాహసోపేతమైన ఉద్యమం నడిపారు.జై…