మార్పు మాత్రమే శాశ్వతం

ఉదయం చల్లటి గాలి మనసారా శరీరాన్ని తాకేవేళ నా నడకతో పోటీ పడుతూ ఎన్నో ఆలోచనలు.తెలిమంచుతెరలు ఎంత అడ్డం పడినా తొలిసూర్య కిరణాలు తొంగి చూసినట్టు కళ్ళకు అడ్డంపడుతున్న,దేన్నీ స్పష్టం చూడనివ్వని సంధిగ్ధాలెన్నో పటాపంచలౌతున్న చప్పుడు.
నిన్నటి దుఖ తీవ్రత ఈరోజు ఎందుకుండదు?నిన్నటి మనోవేదన, మాటలకందని మానసిక సంఘర్షణ ఈరోజు ఏమౌతుంది?హమ్మో ఇదిలేకపోతే నేను బతకగలనా?హమ్మో అది దూరమైతే నేను భరించగలనా? నువ్వు లేకపోతే నేను బతికుంటనా?నీ కోసం ప్రాణలైనా ఇచ్చేస్తాను.నువ్వు లేని జీవితాన్ని కల్లో కూడా ఊహించలేను.ఎన్ని అబద్ధాలను మోస్తూ మనిషి బతుకుతుంటాడో ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో. స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్ని అవసరమే.కానీ వాటి చుట్టూ మనం అల్లుకునే అభూతకల్పనలే వింతగా ఉంటాయి.ఆత్మ త్రుప్తి కోసం అనుకుంటూ ఎంత ఆత్మ ద్రోహం చేసుకుంటామో ఆలోచిస్తే సంభ్రమంగా ఉంది.అన్నీ శాశ్వతం,అన్నీ బంధాలూ రాతి స్వభావాన్ని కలిగి ఉంటాయి,ఎప్పటికీ మారవు అనుకోవడం లోనే అంత ఉంది చిక్కంతా.
నిజానికి ఏదీ శాశ్వతం కాదు  మార్పు ఒక్కటే శాశ్వతమైంది.చుట్టూ ప్రపంచం చలనశీలతకలిగి ఉంటుంది.
సంతోషం,దుఖం రెండూ శాశ్వతం కావు.అప్పుడే నవ్విన కళ్ళు మరో క్షణంలో కన్నీళ్ళని కురిపించొచ్చు.
అవే కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా పరిణామం చెందొచ్చు.
ప్రపంచాన్ని నడిపించేది మార్పు మాత్రమే.చలనాన్ని, చలనశీలతని అర్ధం చేసుకోగలిగితే బయట ప్రపంచం ఎలా మార్పునకు గురౌతుంతో మన మనో ప్రపంచం కూడా తీవ్రమైన మార్పులకు గురౌతుందనేది అవగాహన అవుతుంది.
జీవనది నిశ్చలంగా,నిర్మలంగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది.కానీ అదెంత చలనశీలతను కలిగి ఉంటుందో అక్కడ నీళ్ళు లిప్త మాత్రపుసేపు కూడా నిలిచి ఉండవని మనం మర్చిపోతాం.
జీవితం కూడా అంతే కదా.అన్ని బంధాలూ,స్నేహాలూ,ప్రేమలూ మనల్ని శాశ్వతంగా చుట్టుకుని ఉన్నట్టు, అవి ఎప్పటికీ మారవని ఎంత భ్రమ పడతామో కదా!ఈ క్లారిటీ ని కమ్మేసే పొగమంచు తెరలేవో  ఈ ఉదయపు వేళ జారి నా పాదాల మీద పడుతున్న భావన.
నా నడకలో మరింత ఆత్మవిశ్వాసం,ఆత్మగౌరవం.
మార్పు మీద ఎంతో ప్రేమ.శిలాసద్రుస్య బంధాల విముక్తి.మనస్సు స్వచ్చంగా,విశాలంగా ఉన్న భావన.
విశాల ప్రపంచం మీద ప్రేమ.
ఈ ఉదయం,ఈ తొలికిరణాలు,ఈ చల్లటి గాలీ ,ఈ పొగమంచూ ఈరోజుకే సొంతం.అలా అని వాటిని శాశ్వతమనుకోలేం కదా.ఇవన్నీఈ రొజున్నట్టుగానే రేపూ కావాలనుకోవడమంత వెర్రితనం మరొకటి ఉంటుందా.రేపు కొత్తగా,కాంతివంతంగా మన కళ్ళకి ఆవిష్క్రతమౌతాయిగా.
ఎంతో అద్బుతంగా,ధవళ కాంతి పుంజాలు వెదజల్లుతూ మనస్సుని మైమరపించే బ్రహ్మకమలం మర్నాటికి నిర్జీవంగా రాలిపోతుంది.
ఎంతటి ఆత్మీయ బంధమైనా,ఎంతటి వెలుగుల్ని కురిపించేదైనా అది అలాగే  శిలలా ఉండిపోతుందనుకోవడం  చాలా పొరపాటు.
మారాలి, మార్పుని ఆహ్వానించాలి.మనస్సుని మరింత విశాలం చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం