Friday, February 10, 2012

I am happy to share


I am happy to share that I am appointed as member of Advisory Board of the Special Prison for Women, Hyderabad for a period of three years from February 7, 2012.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Now-prisoners-can-pour-out-their-woes-to-visitors/articleshow/11830055.cms

Wednesday, February 1, 2012

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం

     

గత జూలై నెలలో అమర్‌నాథ్‌ వెళ్ళి వచ్చాను. సింధు నదితో కలిసి హిమాలయాల్లో చేసిన ఆ ప్రయాణం ఆద్యంతం పరమాద్భుతంగా వుండింది. మళ్ళీ వెంటనే హిమాలయాలకు వెళ్ళగలగడం, ఈసారి గంగ వెంబడి ఉరకలెత్తిన మా ప్రయాణం ఐదురోజులపాటు సాగింది.
చార్‌ ధామ్‌ (అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, భద్రీనాద్‌) యాత్రగా పిలవబడే ఈ యాత్రని భారతీయులతో పాటు విదేశీయులు కూడా చేస్తుంటారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో, వివిధ రూపాల్లో వుండే గంగ వెంబడి సాగే ఈ ప్రయాణం ఎంతో ఉల్లాసంగాను, మరెంతో ప్రమాదభరితంగాను వుంటుంది. కొండల అంచుల మీద అపుడపుడూ విరిగిపడే రాళ్ళమధ్య, కింది లోయలో ఉధృతంగా ప్రవహించే గంగమ్మ తోడుగా అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది ప్రయాణం. అయితే చూపుతిప్పుకోనీయని సౌందర్యం దారంతా పరుచుకుని వుండి ప్రమాదాల మీదకి మనసును పోనీయదు. అపుడపుడు ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలతో పాటు, వొళ్ళంతా పులకించిపోయే సన్నివేశాలు ఎదురౌతూ మొత్తం ప్రయాణాన్ని సజీవం చేస్తాయి.
నేను, నా సహచరుడు జస్టిస్‌ వివిఎస్‌రావు, నా కజిన్‌ కలిసి 4 అక్టోబర్‌న హైదరాబాదు నుండి బయలుదేరి ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ నుండి విమానంలో డెహ్రాడూన్‌, రైలులో వెళితే హరిద్వార్‌ వరకు వెళ్ళొచ్చు. అక్కడి నుండి ఏదైనా వెహికల్‌ మాట్లాడుకుని తిరగొచ్చు. మేము డెహ్రాడూన్‌ నుంచి ఇనోవా బుక్‌ చేసుకున్నాం. మేము వెళ్ళదలుచుకున్న ప్రాంతాలు కేదార్‌నాధ్‌, బద్రీనాధ్‌, రిషికేశ్‌, హరిద్వార్‌. డెహ్రాడూన్‌ నుంచి రిషికేశ్‌ ముప్ఫై కిలోమీటర్లుంటుంది. మేము రిషీకేశ్‌లో లంచ్‌ కోసం ఆగినపుడు గంగా దర్శనమైంది. మేం దిగిన గెస్ట్‌హౌస్‌ను ఆనుకుని నిదానంగా ప్రవహిస్తున్న గంగను చూసాను. ఆ తర్వాత చూసిన వివిధ రూపాల గంగకి దీనికి పోలికేవుండదు.
లంచ్‌ తర్వాత మేము శ్రీనగర్‌ వేపు బయలుదేరాం. శ్రీనగర్‌ అంటే కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ అనుకునేరు. ఉత్తరాఖండ్‌లో వుందీ శ్రీనగర్‌. దాదాపు 80 కి.మీ ప్రయాణం తర్వాత శ్రీనగర్‌లో ఎత్తైన కొండమీదున్న గెస్ట్‌హౌస్‌కి చేరాం. ఇంగ్లీషు వాళ్ళు 1894లో కట్టించారని అక్కడ రాసి వుంది. తలుపులు డిజైన్‌ గమ్మత్తుగా, కొత్తగా వుంది. చక్కటి గాలీ, వెలుతురు వచ్చే విధంగా అమర్చిన తలుపులు బయటనుండి చూడ్డానికి బీరువాలాగా కనబడుతుంది. మేం శ్రీనగర్‌ గెస్ట్‌హౌస్‌లో కొంచెం సేపుండి, టీ తాగి, అక్కడికి అరవై కి.మీ. దూరంలో వున్న గుప్త కాశీకి బయలు దేరాం. మేం రాత్రికి బస చేసేది గుప్త కాశీలోనే. శ్రీనగర్‌ నుండి గుప్త కాశీ వెళ్ళే దారంతా కొండలతోనే నిండి వుంటుంది. మేము అక్కడికి చేరేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. గుప్త కాశీలో కారు దిగి గెస్ట్‌హౌస్‌ కి వెళ్ళేటప్పటికి కరెంట్‌ పోయింది. చిమ్మ చీకటి. కీచురాళ్ళ రొదలు. నా బ్యాగ్‌లో ఎపుడూ వుండే చిన్న టార్చిలైట్‌ సహాయంతో మెల్లగా రూమ్‌ల్లోకి చేరాం. ఆ చీకట్లో కింద నుండి ఏదో గలగల సంగీతం వినబడుతోంది. సెలయేళ్ళు దూకుతున్న సవ్వడి. గెస్ట్‌హౌస్‌ సహాయకుడు కొవ్వొత్తులు వెలిగించాడు. నేను బయటకు వొచ్చి కింది నుండి వస్తున్న సవ్వడుల వేపు చెవిపెట్టి వింటుంటే, కరెంట్‌ వచ్చేసింది. గెస్ట్‌హౌస్‌ చుట్టూ దట్టమైన అడవి. పెద్ద పెద్ద చెట్లు. కింద లోయ. ఆ లోయనుండే నీళ్ళు పారుతున్న సవ్వడి. గెస్ట్‌హౌస్‌ కుర్రాడినడిగాను. ”మేమ్‌ సాబ్‌! ఏ మందాకినీ నదీహై. కేదార్‌నాధ్‌ సే ఆతీ హై (ఇది మందాకినీ నది. కేదార్‌నాధ్‌ నుండి వస్తుంది) అని చెప్పాడు. లోయలో గలగల పారుతున్న మందాకినిని ఆ చీకట్లో చూడలేకపోయాను కానీ ఆ అద్భుత లయభరిత సంగీతాన్ని రాత్రంతా వింటూనే వున్నాను. ఉదయం పదింటికే లేచి బయటకొచ్చి చూద్దును కదా! అబ్బో! అద్భుతం. గెస్ట్‌ హౌస్‌ చుట్టూ పర్వతాలు, పెద్ద పెద్ద చెట్లు. కిందికి చూస్తే లోతైన లోయ. లోయలో పాల ధారలాగా పారుతున్న మందాకిని. హృదయం పులకించి పోయింది. ఫోటోలు తీసుకుందామని ప్రయత్నిస్తూంటే లోయలో చెట్లమీద ఎగురుతున్న కోతిమూక పళ్ళికిలిస్తూ కన్పించాయి. వామ్మో! కెమెరా లాక్కుపోతాయేమోనని (తలకోనలో ఈ అనుభవమైంది) భయపడుతుంటే గెస్ట్‌హౌస్‌ కుర్రాడు కాశీరామ్‌ కోతుల్ని బెదిరిస్తుంటే నేను ఫోటోలు తీసుకున్నాను. కాశీరామ్‌ నా వీడియో కూడా తీసాడు. నేను బయటే కూర్చొని కొండల బారుని, లోయని చూస్తుంటే ‘మనం 6.30కి ‘సరసా’ వెళ్ళాలి. రడీ అవ్వండి’ అంటూ లోపల్నుంచి హెచ్చరిక రావడంతో నేను లోపలికెళ్ళి పోయాను. మందాకిని సంగీతం లోపలిక్కూడా వినబడుతూనే వుంది.
మేము తయారై అక్కడికి పదిహేను కి.మీ. దూరంలో వున్న ‘సరసా’ అనే ప్రాంతానికి వెళ్ళాం. మాతోపాటు మందాకిని రావడం గమనించి నాకు మహా సంతోషం వేసింది. సరసా నుంచి హెలికాప్టర్‌లో మేము కేదార్‌నాథ్‌ వెళ్ళాలి. మేము టికెట్లు ముందే బుక్‌ చేసుకున్నాం కాబట్టి మొదటి ట్రిప్‌లో మేమే వెళతాం. ‘సరసా’ చేరేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. హెలీపాడ్‌ మీద రెండు హెలీకాప్టర్‌లు ముణగదీసుకుని ఆగిపోయివున్నాయి. మా బరువు చూసి మాకు బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చారు. సర్‌సా నుండి ఏడు నిమిషాలు హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తే 14,000 అడుగుల ఎత్తున ఉండే కేదార్‌నాధ్‌ పర్వతం మీద దిగిపోయాం. ఆ ప్రయాణానికి ఒక్కొక్కరికి ఏడువేలు వసూలు చేసారు. మేము మారుతున్న వాతావరణాన్ని గమనిస్తూ, హెలికాప్టర్‌ ఎప్పుడు బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాము.
ఆ రోడ్లో చాలా వాహనాలు వెళుతున్నాయి. వాటిల్నిండా టూరిస్ట్‌లున్నారు. అక్కడికి మరో పది కిలోమీటర్ల దూరంలో విష్ణుకుండ్‌ అనే ఊరుంది. కేదార్‌నాథ్‌కి గుర్రాలమీద వెళ్ళేవాళ్ళు అక్కడి నుండే బయలుదేరతారు. విష్ణుకుండ్‌ నుండి కేదార్‌నాథ్‌ పద్నాలుగు కి.మీ. కొండల అంచులమీద, మందాకినీ నది వొరవళ్ళు నడుమ ఆ ప్రయాణం రానుపోను దాదాపు ఏడు గంటలుంటుంది. అంతసేపు గుర్రం మీద కూర్చోలేక, అమర్‌నాథ్‌ ప్రయాణపు అనుభవంతో మేము హెలికాప్టర్‌ మీద వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. అయితే మేం కూర్చున్న చోటుకి ఎదురుగా కనిపిస్తున్న మంచు కొండలమీద నిమిష నిమిషానికి వాతావరణం మారుతోంది. తొమ్మిదవుతున్నా హెలికాప్టర్‌ కదిలే జాడ కన్పడలేదు. ఆ కంపెనీ మేనేజర్‌ డోగ్రి మా దగ్గర కొచ్చాడు. మమ్మల్ని బ్రేక్‌ఫాస్ట్‌కి ఆహ్వానిస్తూ, ఎదురుగా కనిపిస్తున్న లోయలో మేఘాలు కమ్ముకుని వున్నాయని, అవి క్లియర్‌ అయితే తప్ప వెళ్ళలేమని, అసౌకర్యానికి సారీ చెప్పాడు. అతనితో కలిసి వెళ్ళి వాళ్ళ క్యాంటీన్‌లో వేడివేడి పూరీలు తిన్నాం. క్యాంటీన్‌ దగ్గర నాకు రెండు కొత్త మొక్కలు కన్పించాయి. ఆకుపచ్చటి గులాబీలాగా గుత్తులు, గుత్తులుగా ఆకులు, భలేవుంది. చిన్న మొక్క తీసుకోవచ్చా అని డోంగ్రీ నడిగితే తీసుకోమన్నాడు. రెండు కొమ్మలు తుంపి బ్యాగ్‌లో పడేసుకున్నాను. నాలుగురోజులు బ్యాగ్‌లో మగ్గినా ఏమీ కాలేదు (ప్రస్తుతం అవి కోలుకుని కొత్త చిగుళ్ళొస్తున్నాయి). మళ్ళీ వెయిటింగ్‌. ఊహూ. మబ్బులు అక్కడే భీష్మించుక్కూర్చున్నాయి. మాతో పాటే వున్న చాలామంది డబ్బు వెనక్కు తీసుకుని విష్ణుకుండ్‌ వేపు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత సూర్యకిరణాలు పొడుచుకొచ్చాయి. హమ్మయ్య ఎండొచ్చింది. మబ్బు విడిపోతుంది అని సంబరపడుతుంటే అక్కడ పనిచేసే పింకీరాణి ”బాదల్‌ ఔర్‌ జ్యాదా హోజాయేగా” (మబ్బులు ఇంకా ఎక్కువౌతాయి) అని మా ఉత్సాహం మీద నీళ్ళు చిలకరించింది. ”అభీ దూప్‌ నహీ! బారిష్‌ హయేతో అచ్ఛాహై” అంది. (ఇపుడు సూర్యుడి వెలుగు కాదు. వర్షం కురవాలి) అంది. కేదార్‌నాథ్‌ కొండల్లో క్షణం క్షణం మారుతున్న వాతావరణం చూసి, ఇంక ఆ రోజుకి వెళ్ళలేం అనుకుని డోంగ్రీ సలహా అడిగాం. అతనూ ఏమీ చెప్పలేకపోయాడు. అయితే మీరు భద్రీనాథ్‌ వెళ్ళిరండి. రేపు కేదార్‌నాథ్‌ వెళ్ళొచ్చు అన్నాడు.
పన్నెండు గంటలకి మేం ‘సర్‌సా’ నుండి భద్రీనాథ్‌కి బయలుదేరాం. గుప్తకాశీలోని గెస్ట్‌హౌస్‌కి వెళ్ళి మా లగేజ్‌ తీసుకుని గోపేశ్వర్‌ వేపు బయలుదేరాం. గుప్తకాశీ నుండి బద్రీనాథ్‌ 150 కి.మీ. దూరంలో వుంటుంది. కానీ దారంతా బీభత్సంగా, కొండలతో, బండరాళ్ళతో నిండి వుంటుంది. నూటాయాభై కి.మీ. వెళ్ళడానికి దాదాపు తొమ్మిది గంటలు పట్టింది. ‘సర్‌సా’ నుంచి వెళుతున్నప్పుడు మందాకిని మనతో పాటే గలగలా పారుతూ పరుగెడుతుంటుంది. కేదార్‌నాథ్‌ కొండల్లో పుట్టిన మందాకినీ నది రుద్రప్రయాగ్‌ అనే సంగమస్థానంలో అలకనందతో కలిసిపోయి ఉనికిని కోల్పోతుంది. రుద్రప్రయాగ్‌ వరకు మందాకిని మనతో వస్తుంది.
భద్రినాథ్‌ వెళ్ళడానికి రెండు దారులున్నాయని మా డ్రైవర్‌ యూనస్‌ చెప్పాడు. ట్రాఫిక్‌ తక్కువగా వుండే మార్గంలో మిమ్మల్ని తీసుకెళతానంటూ ఓ అద్భుత ప్రపంచంలోకి బయలుదేరాడు. ఆకాశం అంచులను తాకుతున్న మహోత్తుంగ పర్వ శ్రేణులు, అంతే ఎత్తు ఎదిగిన మహావృక్షాలు. పచ్చటి పర్వతాల్లోంచి జాలువారుతున్న అసంఖ్యాకమైన జలపాతాలు. అంతెత్తు కొండలమీద అతి భారీగా వున్న ఆ వృక్ష సముదాయం,చిక్కటి అడివి. ఆకాశం కనబడకుండా అల్లుకు పోయిన మహావృక్షాలు. ఆ సౌందర్యం, ఆపచ్చదనం, ఆ జలపాతాలు కళ్ళెత్తి చూసినా శిఖరాలు కనబడని హిమాలయ శ్రేణులు ఓహ్‌!! నేను ఆ గాఢానుభూతిని అక్షరాల్లోని అనువదించ లేకపోతున్నాను. గుండె నిండా ప్రవహించింది రక్తం కాదు ఆ మహా సౌందర్యం.కళ్ళు కిటికిలై ఆ అందాన్నంతటినీ రెప్పవేయకుండా లాగేసుకున్నాయి. మలుపు మలుపులో ఓ కొత్త అనుభూతి. పైకి చూస్తే పచ్చదనపు సౌందర్యం. కిందికి చూస్తే సెలయేళ్ళు కోసెసిన రోడ్లు. రోడ్లెక్కడున్నాయి ? బండరాళ్ళు నిండిన రహదారులు. టైరు జారితే, అందరం జారేది అగాధంలా వున్న లోయలోకే. లోయలో ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకినీ మందహాసం వేపే.
మేం ప్రయాణిస్తున్న రహదారంతా ఎంత అందం పరుచుకుని వుందో, అంతే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి వుంది. అంతెత్తు కొండలమీంచి ఉరవళ్ళు, పరవళ్ళుగా దూకుతున్న సెలయేళ్ళు చాలా చోట్ల మూడొంతుల రోడ్డుని కోసేసాయి. ఆ నీళ్ళలో, కోతకు గురైన రోడ్డు మీద ప్రయాణం పరమ భయానకంగా వుంటుంది. ఇంకొన్ని చోట్ల బండరాళ్ళు దొర్లి పడుతూంటాయి. మనం దాటొచ్చిన రోడ్డు సడన్‌గా కోతకైనా గురౌతుంది. లేదా బండరాళ్ళు దొర్లిపడి మూసుకునైనా పోతుంది. చిన్న చిన్న ప్రొక్లయిన్స్‌ దారిపొడుగునా రోడ్లను క్లియర్‌ చేస్తూంటాయి. గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కల్గుతుంటుంది. సడన్‌గా యూనుస్‌ ప్రకటించాడు, ” యే జంగల్‌ మే వైల్డ్‌ యనిమల్స్‌ మిల్‌తా హై” (ఈ అడవిలో కౄరమృగాలు కనబడతాయి) అన్నాడు. పులులు, ఛీతాలు, ఎలుగుబంట్లు కనబడతాయట. అంత దట్టమైన అడవన్నమాట. మాకు అవేవీ కనబడలేదు కానీ మా కారు చూసి పరుగులెట్టిన నక్క కన్పడింది. అందరం గట్టిగా నవ్వుకున్నాం. ప్రమాదకరమైన ఈ ప్రయాణం గురించి రాయడం వెనక అందరినీ భయపెట్టాలన్న ఉద్దేశ్యం ఇసుమంతైనా లేదు. అపరిమితమైన సౌందర్యం, గుండెని నిండు రక్తంతో ఉరకలెత్తించే ఆ అందమైన, అద్భుతమైన, అపురూపమైన పరిసరాలను హాయిగా దర్శించాలంటే భయపడవద్దని, మనసును దానికోసం సిద్ధం చేసుకోవాలని చెప్పడమే నా ఉద్దేశ్యం. అమర్‌నాథ్‌ ప్రయాణ అనుభవాలను రాసినపుడు చాలామంది భయపడ్డామని నాతో చెప్పారు.
భయపడితే, భయంతో ఆగిపోతే జీవితంలో ఏమీ సాధించలేం. ఎప్పుడూ కర్ఫ్యూలతో, కాల్పులతో అల్లకల్లోలంగా వుండే మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ వెళ్ళినప్పుడు గానీ, భద్రతాదళాల కవాతుల మధ్య, మనం నిలబడిన చోటే గ్రెనేడ్‌ పేలే ప్రమాదమున్న శ్రీనగర్‌ సందర్శించినపుడు గానీ నేను భయపడలేదు. 18 వేల అడుగుల ఎత్తులో వున్న మంచుకొండల శ్రేణులతో నిండివుండే లఢాఖ్‌లోని చాంగ్లాపాస్‌ దాటి ప్యాంగ్‌ గ్యాంగ్‌ లేక్‌ చూసినపుడు ఉప్పొంగిన సంతోషం ముందు గ్రెనేడ్‌ల భయం ఏపాటిది? 140 కి.మీ. పొడవుండే ఉప్పునీటి సరస్సులో మారే రంగులు, సరస్సులో ప్రతిబింబించే ధవళకాంతులీనే హిమాలయ శ్రేణుల అందాలు, క్షణక్షణం మారే ఆ కలర్స్‌- వాటన్నింటినీ ప్రత్యక్షంగా వీక్షించడంలోని థ్రిల్‌ ముందు ఈ ప్రమాదాలు గడ్డిపరకలే నాకు. అయినా ప్రమాదం ఎక్కడ లేదు? విమానాలు కూలతాయని, రైళ్ళు పడిపోతాయని, షిప్‌లు మునిగిపోతాయని వాటినెక్కడం మానేస్తామా? సంతోషం మనచుట్టూ పరుచుకుని వున్నట్టే మరణం కూడా మన శ్వాసలోనే వుంటుంది. పుట్టుకలోనే మరణం కూడా వుంటుంది కదా! అలాగని అనుక్షణం చచ్చిపోతామేమో అని భయపడుతూ కూర్చోం కదా! సో… నేను చెప్పేదేమంటే ప్రయాణాల్లో భయాన్ని బ్యాగుల్లో సర్దుకోవద్దని. దాన్ని వదిలేస్తే, సాహసాన్ని, అద్భుతాన్ని మనతోపాటు, మన రక్తంలో కలగలుపుకోగలిగితేనే హిమాలయాల్లోని సౌందర్యాన్ని, ఆ నిశ్శబ్దాన్ని, ఆ ధవళ కాంతుల స్వచ్ఛతని తనివితీరా ఆస్వాదించగలుగుతాం.
సరే! దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తున్నాం కదా! యూనుస్‌ ఆ అడవి గురించి చాలా విశేషాలు చెబుతున్నాడు. ఆ ప్రాంతాన్ని ‘చోప్టా’ అంటారని దానికి మినీ స్విడ్జర్లాండ్‌ చాలా అందమైన దేశమని అంటారు కదా! చోప్టాని స్విడ్జర్లాండ్‌తో పోల్చారంటేనే అర్థమౌతుంది కదా! అక్కడెంత అందం వుందో! మేం ప్రయాణిస్తూన్న ఆ ప్రాంతం అత్యంత నిశ్శబ్దంగా వుంది. ఎక్కువ వాహనాలు తిరగడం లేదు. కొండలమీంచి దూకుతున్న జలపాతాల సంగీతం, లోయలో పారుతున్న మందాకినీ నది గలగల సవ్వడి, మహావృక్షాల మీద గాలి చేస్తున్న హడావుడి తప్ప మరో శబ్దం వినపడదు. పచ్చగా అల్లుకుపోయిన చెట్ల సందుల్లోంచి అపుడపుడూ దర్శనమిచ్చే నీలి ఆకాశం. కొంత ప్రయాణం సాగాక హఠాత్తుగా నీలం రంగు ఆకాశం కాస్తా నల్లటి మబ్బులతో నిండిపోయి, వర్షం మొదలైంది. ”అరే! బాప్‌ రే! బారిష్‌ షురూ హోగయా. రాస్తా ఔర్‌ ముష్కిల్‌ హోజాతా హై” (అరే! వర్షం మొదలయిందే. దారి మరింత కష్టమౌతుంది) అంటున్నాడు యూనుస్‌. వర్షంవల్ల బండరాళ్ళు దొర్లిపడడం ఎక్కువౌతుంది. సెలయేళ్ళ ఉధృతి పెరిగిపోయి రోడ్లను కోసేస్తాయి. అతను ఏమేమో చెబుతున్నాడు కానీ నా చెవులు అతను చెప్పేది వినడం మానేసాయి. ఆ చిక్కటి అడవిలో కురుస్తున్న ముత్యాల వానని, శుభ్రంగా తలారా స్నానించి, మెరుపులీనుతున్న పైన్‌ వృక్షాలనీ కళ్ళార్పకుండా చూస్తున్నాను. వాన సంగీతం వినాలో సెలయేళ్ళ సంగీతం వినాలో తేల్చుకోలేక అటు, ఇటు బెదిరిపోయే లేడి కళ్ళలా నా కళ్ళను తిప్పుతున్నాను. అంతెత్తుల నుంచి వాన చినుకుల్ని లీనం చేసుకుంటూ ఉధృతి పెంచుకుంటున్న తెల్లటి పాల ధారల్లాంటి జలపాతాలు అడుగడుగునా కనబడసాగాయి. చాలా మెల్లగా వాహనం నడుపుతున్నాడు యూనుస్‌.
తలకోనలో ఒకే ఒక జలపాతాన్ని చూసి తన్మయమై పోయిన నేను ఇన్ని వందల జలపాతాలను చూసి ఏమై వుంటానో పఠితులే ఊహించుకోవాలి. వానవల్ల, ప్రయాణం మెల్లగా సాగుతుండడంవల్ల ఆ అడవి సౌందర్యాన్ని మరికొన్ని గంటలు అనుభవించే అవకాశం దొరికింది. పన్నెండింటికి గుప్త కాశీలో బయలుదేరిన వాళ్ళం ఇంకెక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూనే వున్నాం. అయిదు గంటలు కావస్తోంది. అన్నం తిననే లేదు. నిజానికి ఈ ప్రయాణంలో మేము ఏ రోజూ లంచ్‌ చెయ్యలేదు. బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌ అంతే. మాతో తీసుకెళ్ళిన డ్రైఫ్రూట్స్‌, బిస్కట్‌లతో కాలక్షేపం చేసాం. అయినా ఆకలేస్తేగా! ”ఆకలా? దాహమా? ”ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా” కృష్ణశాస్త్రి గారి పాట పదే పదే నాలుక మీద నర్తిస్తోంది. నిజంగానే ఈ అడవిలో ఆగిపోతే…
చిరుచీకట్లు పడేవేళకి మేం కొండదిగేసాం. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? ఆ మహా సౌందర్యాన్ని చీకటి తనలో కలిపేసుకుంటూ నల్లటి తన రూపాన్ని చెట్లమీద, కొండల బారుల మీద, జలపాతాల మీద, సెలయేళ్ళమీద విస్తరించుకుంటూ పోవడం కన్పడింది. ఎత్తైన కొండ వాలుల మీద మినుకు మినుకు మంటూ వెలుగుతున్న దీపాలు, జనావాసాలు కన్పడసాగాయి. ఆ కొండలమీద ఎన్నో గ్రామాలున్నాయని యూనుస్‌ చెప్పాడు. ‘చోప్టా’ కి వీడ్కోలు చెప్పేసరికి మేం పూర్తిగా కిందికి దిగిపోయాం. కొంత ప్రయాణం సాగేసరికి రుద్రప్రయాగ్‌ సంగమం కనబడింది. కేదార్‌నాథ్‌ నుండి మాతో కలిసి వస్తున్న మందాకినికి గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మందాకినిని వొదలడానికి నాకెంత దు:ఖం కల్గిందో చెప్పలేను. అయితే నా బాధను తగ్గించడానికా అన్నట్టు, నేనున్నానులే అంటూ అలకనంద నది ప్రత్యక్షమైంది. రుద్రప్రయాగ దగ్గర మందాకిని అలకనందలో లీనమై పోతుంది. అక్కడినుండి అలకనంద దేవప్రయాగవైపు ప్రయాణమౌతుంది. మందాకినీ నది కేదార్‌నాథ్‌ కొండల్లో చారాబరీ అనే గ్లేసియర్‌లో పుట్టి, రుద్ర ప్రయాగ్‌ దాకా ప్రయాణించి, అక్కడ అలకనందలో సంగమిస్తుంది.
గంగా ప్రవాహ గమనం ఒకే తీరుగా, ఒకే పేరుతో వుండదు. రిషికేశ్‌ దగ్గర మనకు కనబడే గంగ ఎన్నో నదుల సంగమం. ఎన్నెన్నో చోట్ల, ఎన్నో నదులతో కలుస్తూ, విడిపోతూ రిషికేశ్‌ దగ్గర మనకి అఖండ గంగా దర్శనం జరుగుతుంది. రుద్రప్రయాగ్‌ తర్వాత దేవ ప్రయాగ దగ్గర చివరగా అలకనంద (గంగోత్రి నుండి వచ్చే) భాగీరధి సంగమించి ముందుకు సాగుతుంది అఖండ గంగ. గంగా ప్రవాహ గమనాన్ని ఇలా చూడాలి. దేవప్రయాగ దగ్గర అలకనంద భాగీరధి నదుల సంగమ దృశ్యం అద్భుతంగా వుంటుంది. రెండు మహాప్రవాహాల కలయిక, భిన్న వర్ణాలతో కుడివేపు నుండి అలకనంద, ఎడమవేపునుండి భాగీరధీనది సంగమించే దృశ్యం కన్నుల పండుగగా వుంటుంది. రెండు రంగుల ప్రవాహాలు ఏకవర్ణంగా, గంగామహానదిగా అవతరించే అద్భుత దృశ్యమది. అలకనంద, భాగీరధితో కలిసిపోయిందో, భాగీరధి అలకనందలో లీనమైందో తెలియడం కష్టం. రెండూ కలిసిపోయి ఏకీకరణ చెందడం వల్లనే గంగానది ఉద్భవించింది. అక్కడి నుండి రిషికేశ్‌, హరిద్వార్‌, వారణాశి, కలకత్తా, బంగ్లాదేశ్‌ వరకు గంగ ప్రయాణించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
రుద్రప్రయాగ్‌ దగ్గర మందాకినిని అలకనందలో కలిపేసు కున్నాక మా ప్రయాణం అలకనంద పక్కనే కొనసాగింది. అక్కడి నుండి భద్రినాథ్‌ వరకు మాతోనే వుంది. మేము మళ్ళీ కొండలెక్కి, లోయల్లోకి దిగి, అలకనందతో కలిసి ఏడున్నరకి భద్రీనాథ్‌ చేరాం. భద్రినాథ్‌లో భయంకరమైన చలిగా వుంది. మేము గెస్ట్‌హౌస్‌లో సామానులు పడేసి గుడివేపు వెళ్ళాం. అప్పటికే గుడి మూసేసారు. జనం నిండుగా ఉలెన్‌ వేసుకుని తిరుగుతున్నారు. వురవళ్ళలో ప్రవహిస్తున్న అలకనందను దాటి గుడివేపు వెళ్ళాలి. పెద్ద బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జికి కుడివేపున పొగలు కక్కుతూ, తెళ్ళుతూ మరుగుతున్న నీళ్ళు. హాట్‌ స్ప్రింగ్స్‌. ఇంకోవేపు ఐస్‌ గడ్డలు తేలుతూ, ముట్టుకుంటే వేళ్ళు కొంకర్లు పోయేలాంటి చల్లటి నీళ్ళు. ఇది మాత్రం చాలా గమ్మత్తుగా వుందే అనుకుంటూ, రేపు ఉదయం అన్నీ చూద్దాంలే అనుకుంటూ, అక్కడే వున్న రెస్టారెంట్‌ వేపు వెళ్ళాం. ఉదయమెప్పుడో తిన్న రెండు పూరీలు. ఆకలి దంచుతోంది. రెస్టారెంట్‌లో పెట్టింది తిని రూమ్‌ కొచ్చాం. మంచాలమీద పరుపుల్లాంటి రజాయిలు వున్నాయి. విపరీతమైన చలిగా వున్నా, స్నానం చెయ్యకుండా నాకు నిద్రరాదు కాబట్టి నాలుగు చెంబులు వేణ్ణీళ్ళు కుమ్మరించుకుని వచ్చి గడగడ లాడుతూ రజాయిలో దూరిపోయాను. పరుపులాంటి రజాయి కూడా ఆ చలినాపలేకపోయింది. స్వెట్టర్లు, సాక్సులు, గ్లౌజులు, అన్నీ తొడుక్కుని, రజాయిలో దూరినా చలిపులి ఆ రాత్రంతా తింటూనే వుంది. అంత చలి ప్రదేశంలో రూమ్‌లో హీటర్‌లు అమర్చకపోవడం పెద్దలోపం.
నిద్రలేని ఆ రాత్రి తెల్లవారుఝామున కునుకు పట్టే వేళ గుళ్ళోకెళ్ళాలి లేవండి అంటూ లేపేసారు. నాలుగున్నరకి అంత చలిలో జలకాలాడి, తయారై గుడివేపు గజగజ వొణుకుతూ బయలుదేరాం. నిజానికి నాకు గుళ్ళోకెళ్ళే పనేం లేదు. కాని గుడి చుట్టూ పరుచుకుని వున్న వాటిని చూడాలి. ముఖ్యంగా రాత్రి సరిగా కనబడని అలకనందను, హాట్‌స్ట్రింగ్స్‌ను చూడాలి. గుడి చుట్టూ పరుచుకుని వున్న హిమాలయ శ్రేణుల్ని చూడాలి. మేం తయారై గుడి దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ చాలామంది జనాలు గుమిగూడారు. మేము ఆరుగంటలకంతా అన్నీ పూర్తి చేసుకుని భద్రినాథ్‌ నుండి బయటపడాలి. ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా కేదార్‌నాథ్‌ చేరతాం.
మాతో వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్‌ మమ్మల్ని వేరే దారిలో గుడి లోపలికి తీసుకెళ్ళాడు. లోపలంతా జనం కూర్చుని వున్నారు. గట్టుమీద కూర్చున్న పురోహితులు మంత్రాలేవో చదువుతున్నారు. అభిషేకం కోసం రెండు వేలు కట్టిన వారికి స్పెషల్‌ ట్రీట్‌మెంటు దొరుకుతుంది. నేను ఒక వుడెన్‌ కర్టెన్‌ పక్కన నిలబడి అక్కడ జరుగుతున్న తంతును చూస్తూ, అపుడపుడూ ఎవ్వరూ చూడకుండా వీడియో తీస్తున్నాను. నా ఎదురుగా తమాషాగా అలంకరించుకున్న ఓ ముసలాయన కూర్చొని వున్నాడు. నన్ను కర్టెన్‌ దాటి రమ్మని పిలుస్తున్నాడు. నిజానికి అక్కడ అడుగు పెట్టడానికి కూడా లేదు. నేను చేతితోనే సంజ్ఞ చేస్తూ ఫర్వాలేదు అని చెబుతున్నాను. ఇంతలో గంట కొట్టడం మొదలు పెట్టారు. గంట కొట్టడం ఆగిపోగానే గర్భగుడిలోంచి ఓ ఆజానుబాహుడు, నల్లటి దుస్తుల్లో తలమీద నల్లని టోపీతో ప్రత్యక్షమయ్యాడు. నిజం చెప్పొద్దూ! నేను కళ్ళు తిప్పుకోలేకపోయాను. అందంగా, స్ఫురద్రూపంతో, వొళ్ళంతా వస్త్రాలతో వున్న ఆ యువకుడు భద్రినాథ్‌ గుడి ప్రధాన అర్చకుడట. అర్థనగ్నంగా, గుండ్రటి బొజ్జలతో వుండే పూజారుల్నే నేనింత వరకు చూసాను. ఇంత సలక్షణంగా దుస్తులేసుకున్న భద్రినాథ్‌ ప్రధాన పూజారి వెనక ఓ పెద్ద కథ వుంది. అతన్ని చూడగానే, ఆ ముఖంలోని నైర్మల్యం చూడగానే నాకు సాలూరి రాజేశ్వరరావు గారి తండ్రి, సాలూరి సన్యాసి రాజుగారు రాసిన అద్భుతమైన పాట, రావు బాలసరస్వతి గళంలోంచి వొలికిన మాధుర్యపు ఊట ”ఆ తోటలో నొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడెవరే… అందగాడెవరే… చంద్రబింబపు ముఖము… గండు కోయిల స్వరము…” అనే పాట, బుద్ధుడి మీద రాసిన పాట నాకు పదే పదే గుర్తొచ్చింది.
అతని పేరు భద్రిప్రసాదో, భవానీ ప్రసాదో అని నన్ను ముందుకు పిలిచిన ముసలాయన చెప్పాడు. భద్రినాథ్‌ ఆలయ ప్రధాన అర్చకుడు నన్ను అంతగా ఆకర్షించడానికి కారణం అతను ధరించిన దుస్తులు + అతను అక్కడి వారికంటే భిన్నంగా వుండడం. ఇతని వెనక వున్న కథ చాలా ఆసక్తికరమైంది. దాదాపు వెయ్యి సంవత్సరాలుగా అంటే 800 ఎ.డి నుంచి ఈ ఆలయ పూజారులుగా ఎక్కడో దక్షిణాన వున్న కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులే కొనసాగుతున్నారు. వీరిని ఆదిశంకరాచార్యుడు నియమించారని చెబుతున్నారు. అసలు భద్రినాథ్‌ విగ్రహాన్ని ఆదిశంకరుడే ఆవిష్కరించాడని చెప్తారు. అతని విగ్రహం కూడా గుడి ముందు చెక్కారు. శంరుడు 11 ఏళ్ళ వయసపుడు భద్రీనాథ్‌ ప్రాంతానికి వెళ్ళాడని, అలకనంద నదిలో నారద్‌కుండ్‌ అనేచోట అతనికి భద్రీనాథుడి విగ్రహం దొరికిందని అతనే అక్కడ ప్రతిష్టించాడని అక్కడి పూజారులు చెప్పారు. అంతే కాదు టిబెట్‌ నుండి దండెత్తి వచ్చిన బౌద్ధులు ఈ విగ్రహాన్ని పెకలించి అలకనందలో పడేసారని, అదే శంకరుడికి దొరికిందని ప్రచారంలోవున్న కథ మాత్రం నమ్మశక్యంగా లేదు. బౌద్ధుల్ని ఊచకోత కోయించాడని చెప్పుకునే ఆదిశంరుడు, బౌద్ధులు దాడి చేసి హిందూ విగ్రహాన్ని పెకలించేసారని చెప్పడం చాలా విచిత్రంగా వుంది. ఈ చర్చ మరోసారి చేద్దాం.
తీవ్రమైన చలితో గడగడలాడే భద్రినాథ్‌ ప్రాంతానికి, వేడిగా, ఉక్కగా వుండే ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో వుండే కేరళ నుండి ప్రధాన అర్చకుల్ని నియమించడం అది నంబూద్రి బ్రాహ్మణుల్ని మాత్రమే ఎంపిక చెయ్యడం వెనక శంకరుడి మతలబు ఏమిటో! ఈ పూజారిని రావల్‌ అని పిలుస్తారట. నేను చూసిన ఈ రావల్‌ బాగా చదువుకున్నవాడని చక్కటి హిందీ, ఇంగ్లీషు మాట్లాడతాడని ముసలాయన చెప్పాడు. మొత్తానికి భద్రినాథ్‌ గుళ్ళో విగ్రహమేమిటో, ఎలావుందో నేను సరిగ్గా చూడలేదు గానీ చాలా డిఫరెంట్‌గా వున్న భద్రిప్రసాద్‌ రావల్‌ మాత్రం బాగా గుర్తుండిపోయాడు.
సరే!! మేము గుడిలోంచి బయటకు వచ్చేసరికి తెల్లవారిపోయింది. ఆ ఊరి చుట్టూవున్న మంచుతో కప్పబడిన పర్వతాలు కన్పిస్తున్నాయి. అక్కడికి దగ్గరలోనే హిమాలయాల్లోకి అత్యంత అందమైన శిఖరంగా పిలవబడే నీల్‌కాంత్‌ పర్వత శ్రేణులున్నాయి. అలకానంద పుట్టింది కూడా ఆ కొండల్లోనే. ఆ ప్రాంతాన్ని మన్నా అని పిలుస్తారు. గుడి ప్రాంతం దాటి బ్రిడ్జి మీదకు రాగానే ఉరవళ్ళతో ప్రవహిస్తున్న అలకనంద కన్పించింది. బ్రిడ్జికి కుడివేపు వీటి నీటి ఊటల్లోంచి పొగలు వస్తున్నాయి. చాలా మంది ఆ చలిలో, ఆ వేణ్నీళ్ళల్లో స్నానాలు చేస్తున్నారు. ఎడంవేపు నీళ్ళల్లో వేళ్ళు పెడితే కొంకర్లు తిరిగేలా ఐస్‌ గడ్డలతో అలకనంద మహాప్రవాహం అంటే ఓ పక్క సలసల మసులుతున్న సల్ఫర్‌ స్ట్రింగ్స్‌, మరో పక్క నీల్‌కాంత్‌ కొండల్లోంచి మంచును కరిగించుకుంటూ వస్తున్న అలకనంద చల్లటి నీళ్ళు. అటూ, ఇలా ఫోటోల మీద ఫోటోలు తీసి, రెస్టారెంటులో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి భద్రీనాథ్‌కి బై చెప్పేసి కేదార్‌నాథ్‌కి బయలుదేరాం. మాతోపాటు అలకనంద కూడా బయలు దేరడం నాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది.
రాత్రి మేము ప్రయాణం చేసిన మార్గం ఎంత ప్రమాదకరంగా వుందో తెల్లారాక గాని అర్థం కాలేదు. ఇంక ఆ ప్రమాదాలను పట్టించుకునే మూడ్‌లో కూడా మేంలేం. యూసుప్‌ ఆ దారిలో జరిగిన ప్రమాదాల గురించి, ఏ వాహనం ఏ లోయలో పడిందో చూపిస్తూ చెబుతున్నాడు. అతను ఎంతో సమర్థవంతంగా కారు నడుపుతున్నాడు. ఆ దారంతా దట్టంగా వ్యాపించిన, ఎత్తైన పర్వత శ్రేణులు. శిఖరాలమీద మంచు నిండి వుండి, ఆ మంచు కరగడం ద్వారా అసంఖ్యాకంగా కిందికి దూకుతున్న జలపాతాలు. ఈ జలపాతాలు కొన్ని చోట్ల సెలయేళ్ళుగా మారి అలకనందలో కలిసిపోతున్నాయి ఈ కలయిక వల్ల అలకనంద ఓ చోట సన్నగా, ఓ చోట వెడల్పుగా కన్పిస్తుంది. మా తిరుగు ప్రయాణం చాంప్టా మీది నుండి కాకుండా రెగ్యులర్‌ దారిలో సాగుతోంది. జోషిమట్‌, గోపేశ్వర్‌లు దారిలో కనబడతాయి. మేము లంచ్‌కి ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూనే వున్నాం. ఈరోజు ఎలాగైనా కేదార్‌నాథ్‌ వెళ్ళాలి. అక్కడి వాతావరణం మెరుగైందని, తొందరగా వచ్చేయ్యమని డోంగ్రీ ఫోన్‌ చేసి చెప్పాడు.
రుద్రప్రయాగ్‌ దగ్గర అలకనందకి ఆత్మీయంగా వీడ్కోలు చెప్పాం. మళ్ళీ దేవప్రయాగ దగ్గర మిమ్మల్ని కలుస్తానులే అని అలకనంద చెప్పినట్టయ్యింది నాకు . మందాకిని నది మళ్ళీ మాతో చేరింది. మందాకినీ కామ్‌గా, కూల్‌గా ప్రవహిస్తున్నట్టనిపిస్తుంది. అప్పటివరకు అలకనంద నాతోనే కారులో నా పక్కనే కూర్చున్నంత సంబరంగా అన్పించింది. రుద్రప్రయాగ్‌ దగ్గర ఏదో పనివున్న దానిలా కారు దిగేసి, నీతో మందాకిని అప్పగించిందా అన్పించింది నాకు. మొత్తానికి మా ప్రయాణం అంతా వివిధ రూపాలతో, పేర్లతో వున్న గంగమ్మతో ఉరకలెత్తుతూ సాగింది. గుప్త్‌ కాశీ దాటి సరసా చేరేసరికి మూడయ్యింది. యూసుఫ్‌ చాలా వేగంగా, చాకచక్యంగా మమ్మల్ని తీసుకొచ్చాడు. ఆ రోజు వాతావరణం బావుందని, పదిహేను ట్రిప్‌లు హెలికాప్టర్‌లు వెళ్ళొచ్చాయని చెబుతూ, ఇపుడే కొంచెం మేఘాలు అలుముకుంటున్నాయి అని చెప్పాడు. అయ్యో! అన్పించింది మాకు. కేదార్‌నాథ్‌ పర్వతాలు కన్పిస్తున్నాయి. అక్కడక్కడ మేఘాలు నడుస్తున్నాయి. అవి దట్టంగా కమ్ముకుంటే కష్టమే. ఓ అరగంట ఆగాలన్నాడు. మేము లంచ్‌ చెయ్యలేదు. యాపిల్స్‌,డ్రైఫ్రూట్స్‌ వున్నాయి. అవి తినేసి హెలికాప్టర్‌ ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూడసాగాం.
మూడున్నరకి పిలుపొచ్చింది. లోయంతా బాగా కనిపిస్తోంది. బయలుదేరండి అనే సంకేతం వచ్చింది. మేం చాలా సంతోషంగా హెలీకాప్టర్‌లో కూర్చున్నాం. నిన్నటి నుండి ఈ ప్రయాణం కోసం ఎలా ఎదురుచూసామో గుర్తొచ్చి రిలీఫ్‌గా అన్పించింది. మొత్తానికి కేదార్‌నాథ్‌కి మా ప్రయాణం మొదలై హెలికాప్టర్‌ గాల్లోకి లేచింది. అద్భుత సౌందర్యంతో నిండి వున్న కేదార్‌నాథ్‌ కొండలవేపు ఆకుపచ్చగా మెరిసిపోతున్న లోయలోంచి హెలికాప్టర్‌ వెళుతోంది. మంచుతో కప్పబడిన కొండలు కనబడుతున్నాయి. అన్నింటిని మించిన ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మేం ప్రయాణిస్తున్న లోతైన లోయలో రెండు పచ్చటి పర్వతాల నడుమ సన్నటి పాలధారలాగా ప్రవహిస్తున్న మందాకినీ నదిని చూడటం ఓ అద్భుతానుభవం. చుట్టూ కనబడుతున్న సౌందర్యంలో మునిగి పారవశ్యంలో కొట్టుకుపోతున్న వేళ, ఎదురుగా కనబడుతున్న కేదర్‌నాథ్‌లో ఇంక దిగుతాం అనుకుంటున్న వేళ మా హెలికాప్టర్‌ను హఠాత్తుగా వెనక్కి తిప్పాడు పైలట్‌. లోయంతా బాగానే కనబడుతోంది. విజిబులిటీ బాగానే వుందనిపిస్తోంది. కానీ కెప్టెన్‌ హెలికాప్టర్‌ని వెనక్కి తిప్పి, సర్‌సాలో దింపేసాడు. అందరూ చాలా నిరాశపడ్డారు. ఏమైందో మాకు అర్థం కాలేదు. వాతావరణం అనుకూలించక మేం కేదార్‌నాథ్‌లో దిగలేకపోయాం. గుడిలోకి వెళ్ళలేకపోయినందుకు మా వాళ్ళు బాధపడ్డారు కానీ నా వరకు సంతోషంగానే వున్నాను. ఒక్కటే బాధగా అన్పించింది. కేదార్‌నాథ్‌లో దిగి మందాకిని జన్మస్థలాన్ని చూడలేకపోయానే అని లోటుగా అన్పించింది. అయితే ఆకాశంలోంచి హిమాలయాల సౌందర్యాన్ని మరోసారి దగ్గరగా చూసినందుకు నాకు సంతోషంగానే వుంది.
ఆ తర్వాత కెప్టెన్‌ మా దగ్గరకొచ్చి ‘సారీ’ చెపుతూ ఎందుకు వెనక్కి వచ్చేసాడో వివరించి చెప్పాడు. అంతా బాగానే కనిపిస్తోంది కదా! మీరెందుకు ల్యాండ్‌ అవలేకపోయారు అని అడిగాన్నేను. అది చాలదు. హెలికాప్టర్‌ నిమిషానికి ఏడు కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. మీకు కనబడింది ఒక్క సెకనుకూడా వుండదు. నేను ఏడు కి.మీ. దూరం చూడాలి. అక్కడంతా మబ్బులు, పొగమంచు కనబడుతోంది. వర్షం కూడా పడుతోంది. నాకు ఎక్కడ ల్యాండ్‌ అవాలో ఆ పాయింట్‌ కనబడదు. అలాంటి పరిస్థితుల్లో దిగడం చాలా ప్రమాదం. మీ కంటికి కనిపించేది కొంత దూరమే. నాకు కనిపించేది చాలా దూరం. అది క్లియర్‌ అయిపోతే మళ్ళీ వెళదాం. అయామ్‌ సారీ. అంటూ ఆయన వెళ్ళిపోయాడు. మేం హమ్మో! అనుకున్నాం. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ఎందుకు క్రాష్‌ అయ్యిందో కొంచెం అర్థమైనట్టు అనిపించింది.
మేం నాలుగున్నర వరకు వెయిట్‌ చేసాం. హెలికాప్టర్‌ మళ్ళీ తయారైంది. వెళదామని మనసు ఊగిసలాడింది. కానీ డోగ్రీ చెప్పింది విన్నాక ఆ ప్రయత్నం విరమించుకున్నాం. డోగ్రీ ఏం చెప్పాడంటే ”మీరు ఇపుడు వెళ్ళొచ్చు. మళ్ళీ మబ్బులు కమ్ముకుంటే మీరు తిరిగి ”సరసా”కి రాలేరు. రాత్రి కేదార్‌నాథ్‌లో వుండిపోవాలి. రేపు కూడా ఆకాశం మేఘావృతమైతే హెలికాప్టర్‌ నడవదు. గుర్రాలమీద దిగాలి. దానికి నాలుగు గంటలు పడుతుంది. రేపు సాయంత్రం డెహ్రాడూన్‌లో మీ ఫ్లయిట్‌ మిస్‌ అవ్వొచ్చు. ఇలాగే జరగకపోవచ్చు. జరగడానికి చాలా అవకాశముందని మీకు ఇప్పటికే అర్థమై వుంటుంది” అన్నాడు. ముందు రోజు నుండి క్షణ క్షణం మారుతున్న వాతావరణాన్ని చూస్తూనే వున్నాం. గుర్రాలమీద నాలుగు గంటలు కూర్చుని కొండ దిగే ఊహా భయపెట్టింది. వర్షం పడుతున్న వేళ ఆ మంచు కొండల్ని గుర్రంమీద కూర్చుని దిగడం ఎంత రిస్కో అమర్‌నాథ్‌ ప్రయాణం చూపించింది. పైగా నాలుగుగంటలు. నేను ససేమిరా అన్నాను. గుళ్ళో కెళ్ళలేక పోయినందుకు భక్తులు కొంచం బాధపడి వెళదాం అన్నారు కానీ నేను సమ్మతించలేదు. మళ్ళీ మే నెలలో వద్దాం లే అని సమాధానపడి మేం గుప్తకాశీకి తిరిగి ప్రయాణమయ్యాం.
ఐదింటికి చిరుచీకట్లు కమ్ముకుంటున్న వేళ కేదార్‌నాథ్‌ కొండలకి గుడ్‌బై చెప్పి, డోగ్రీకి థాంక్స్‌ చెప్పాం. హెలికాప్టర్‌కి మేము చెల్లించిన డబ్బు వెనక్కి ఇచ్చేసాడు. మేము ఫ్రీగా కేదార్‌నాథ్‌ కొండల్ని హెలికాప్టర్‌లో చుట్టివచ్చామన్నమాట. నన్ను హెలికాప్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళి బోలెడన్ని ఫోటోలు తీసి, తన గురించి ఎన్నో కబుర్లు చెప్పిన, అక్కడ పనిచేసే పికిరాణికి థాంక్స్‌ చెప్పి, మందాకినీనీ వెంటేసుకుని మేం గుప్తకాశీకి బయలుదేరాం. రాత్రికి శ్రీనగర్‌ వెళ్ళిపోతే బావుంటుందని, డెహ్రాడూన్‌ తొందరగా చేరొచ్చని మాట్లాడుకుని గుప్తకాశీలో ఆగకుండా శ్రీనగర్‌ వేపు సాగిపోయాం. ఆ రాత్రి శ్రీనగర్‌లో ఉండి, ఉదయమే డెహ్రాడూన్‌ బయలుదేరాం. మా ప్రయాణమంతా మందాకినీ నది పక్కనే సాగింది. శ్రీనగర్‌ నుంచి రుషికేష్‌ దాదాపు 100 కి.మీ ఉంటుంది. మేము మధ్యలో హరిద్వార్‌లో లంచ్‌ చేసి డెహ్రాడూన్‌ చేరాలని అనుకున్నాం. అయితే ఆ రోజు విపరీతమైన ట్రాఫిక్‌ వుండడంతో మా ప్రయాణం చాలా మెల్లగా సాగింది.
శ్రీనగర్‌కి రుషికేశ్‌కి మధ్యలోనే దేవప్రయాగ వుంది. దేవప్రయాగ దగ్గర ఎడంవేపునుంచి భగీరథి, కుడివేపునుంచి అలకనంద వచ్చి కలుస్తాయి. ఈ కలయికని చూసి తీరాల్సిందే. రెండు నదుల నీళ్ళు భిన్నవర్ణంలో స్పష్టంగా కనిపిస్తాయి. దేవప్రయాగలో అలకనంద, భగీరధుల సంగమం తర్వాతనే అఖండ గంగానది అవతరిస్తుంది. రుద్రప్రయాగ దగ్గర మందాకినీ అలకనందలో లీనమౌతుంది. దేవప్రయాగ దగ్గర అలకనందలో భాగీరథి కలిసిందో, భాగీరథిలో అలకనంద సంగమించిందో చెప్పలేం. రెండింటి కలయిక వల్ల ఏర్పడిన అఖండగంగ రుషికేశ్‌ వైపు వొరవడిగా సాగిపోతుంది. రుషికేశ్‌ దగ్గర గంగ మీద రెండు ఉయ్యాలల్లాంటి వంతెనలు కట్టారు. ఒకటి రామ్‌ ఝులా, ఇంకోటి లక్ష్మణ ఝూలా.
మేము భగీరథికి, అలకనందకి వీడ్కోలు చెప్పి గంగ వెంబడి బయలుదేరాం. అక్కడి నుండి గంగ చాలా విశాలంగా, ప్రశాంతంగా ప్రవహిస్తూ వుంటుంది. రుషికేశ్‌ దగ్గర ఆగి లక్ష్మణ ఝూలా మీద నడుస్తున్నపుడు గంగమీదే ఊరేగిన అనుభూతి కలిగింది. వివిధ మఠాల వ్యక్తుల ఆధ్వర్యంలో జరిగే గంగా హారతి చాలా బావుంటుంది. ఇంతకు ముందు రుషికేశ్‌ వెళ్ళినపుడు నేను ఈ గంగా హారతిని హరిద్వార్‌లోను, రుషికేశ్‌లోను చూసానా. ఈసారి మేము మధ్యాహ్నంపూట అక్కడ ఆగడంవల్ల ఈ హారతిని చూడలేకపోయాం. రుషికేశ్‌లో కొంచంసేపు ఆగిన తర్వాత మేము హరిద్వార్‌ వేపు బయలుదేరాం. మేము హరిద్వార్‌లో లంచ్‌ చెయ్యాలి. అయితే ట్రాఫిక్‌ విపరీతంగా వుంది. మూడింటికల్లా డెహ్రాడూన్‌ చేరాలి. ఈ రద్దీలో హరిద్వార్‌ వెళ్ళి రావడానికి చాలా సమయం పడుతుందని, మీ ఫ్లయిట్‌ మిస్‌ అవుతుందని యూనుస్‌ అనసాగాడు. మాకు భోజన ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఏం ఫర్వాలేదని హరిద్వార్‌ రండి అని ఫోన్‌ చేసి చెబుతున్నారు. యూనుస్‌ మాత్రం హరిద్వార్‌ వెళ్ళడానికి ఇష్టపడలేదు. ట్రాఫిక్‌ కూడా అలాగే వుంది. మేము కూడా డూన్‌కి వెళ్ళడానికే సిద్ధపడ్డాం. మూడవుతుండగా యూనుస్‌ మమ్మల్ని డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దింపేసాడు. డూన్‌ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుండి హైదరాబాదు.
ఈ ప్రయాణంలో హైలైట్‌ ఏమిటంటే మొదటిరోజునుండి, ప్రతి రోజూ, ప్రతి క్షణమూ వివిధ రూపాలలో, వివిధ నామాలతో ఉరకలెత్తిన గంగ వెంబడి చేసిన ప్రయాణం. ఎక్కడో గంగోత్రిలో పుట్టి ఎన్నెన్నో నదుల్ని కలుపుకుంటూ అఖండ గంగగా అవతరించే గంగమ్మ ఉరవళ్ళని అతి సమీపంగా చూసి పులకరించకుండా వుండలేం. మంచు శిఖరాలు కరుగుతూ, జలపాతాలుగా దూకుతూ, చిన్న చిన్న సెలయేళ్ళుగా ప్రవహిస్తూ వివిధ నదుల రూపాలలో దర్శనమిస్తూ, ఒక నదితో మరొక నది సంగమిస్తూ ఉనికి కోల్పోతూ, కొత్త రూపమెత్తుతూ, తాను ప్రవహించిన ప్రాంతమంతటా హారతులు, నీరాజనాలు అందుకునే గంగమ్మ వెంబడి సాగిన మా ప్రయాణం మరపురాని మధుర కావ్యం. హిమాలయాల్లోకి ప్రయాణం అంటే గంగనో, సింధునో పెనవేసుకోవడమే. అమర్‌నాథ్‌ ప్రయాణంలో సింధుని, కేదార్‌, భద్రి ప్రయాణంలో గంగని చూసిన తర్వాత ఇంత సౌందర్యంతో, వైవిధ్యంతో అలరారే భారత్‌ గురించి భారతీయురాలిగా పుట్టినందుకు మహా గర్వంగా వుంటుంది. ఈ దేశంలోని హిమాలయాలు, జీవనదులు వాటిచుట్టూ అల్లుకుని వున్న అద్వితీయ సౌందర్యం, ధవళ కాంతులీనే మంచు శిఖరాల సోయగాలు, ఆకుపచ్చటి లోయలు, భిన్న సంస్కృతులు, విభిన్నమైన మనుష్యులు ఎంత వైవిధ్యభరితం నా దేశం అనే గర్వం అణువణువునా పొంగుతుంది. ఉప్పొంగే గంగ వెంబడి ఉరకలెత్తిన మా ప్రయాణం మేం డెహ్రాడూన్‌లో విమానమెక్కగానే ముగింపుకొచ్చింది. అద్భుతానుభవాలను, అనుభూతుల్ని గుండెల్లో నింపుకొని  మేం హైదరాబాదు వేపు పయనమయ్యాం.
కొసమెరుపు :
కేదార్‌, భద్రినాధ్‌ ప్రయాణం చేసి వచ్చిన పదిహేను రోజులకు నేను కలకత్తా వెళ్ళాను. హౌరాబ్రిడ్జి కింద అతి విశాలంగా ప్రవహించే గంగను చూసాను. రుషికేశ్‌లో మా జట్టు వదిలేసిన గంగ కలకత్తాలో మళ్ళీ కలుపుకొంది. నీరెండపడి మిలమిల మెరుస్తున్న నీళ్ళు నన్ను చూసి గంగమ్మ నవ్వుతున్నదా అన్నంత భ్రాంతిని కలిగించింది. ఎన్ని నదుల్నో తనలో కలుపుకుంటూ ప్రవహించే గంగమ్మ వడివడిగా దూకుతూ బంగాళాఖాతంలో కలగలిసిపోయే గంగాసాగర్‌ని చూసాను. కెరటాల చేతుల్ని చాపి, తనవేపు ఉరవళ్ళతో ఉరికి వస్తున్న గంగను ఆలింగనం చేసుకుంటూ తనలో కలిపేసుకునే గంగా సాగర సంగమాన్ని సంభ్రమంగా చూసాను.
ఎక్కడో హిమాలయాల్లో, మంచు శిఖరాల్లోంచి జలపాతాలుగా, సెలయేళ్ళుగా చిందులేస్తూ, నాట్యం చేస్తూ, వొయ్యారాలు పోతూ, ఎన్నెన్నో రూపాలలో, పేర్లతో కనువిందుచేసే గంగ వేల కిలోమీటర్లు భూమిని తన అడుగుల్తో తడిపేస్తూ ఆఖరికి సముద్రంలో సేదతీరే సన్నివేశం చూడ ముచ్చటగా వుంటుంది. సమ్మోహనంగా వుంటుంది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...