Sunday, October 24, 2010

వీరి నిబద్ధత, జీవనశైలి ఎంతో స్ఫూర్తిదాయకం

ఇటీవల కాలంలో నాకు, భూమికకు డైభ్భై, ఎనభైలు దాటిన వారితో అవ్యాజమైన ఆత్మీయ సంబంధం పెరుగుతోంది. వారందరికీ నేనంటేను, ముఖ్యంగా భూమిక అంటేను విపరీతమైన ప్రేమ. వారి జీవన శైలి, క్రమశిక్షణ, నిబద్ధతల నుండి నిత్యం ఎంతో నేర్చుకోవలసింది వుంటూనే వుంటుంది. వారి ఆచరణకు, కార్యకలాపాలకు వయస్సు అడ్డుపడుతున్న దాఖలాలు నాకెపుడూ కనబడలేదు.

చిల్లరిగె స్వరాజ్యలక్ష్మిగారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళి ఆవిడ జీవన శైలి చూసి నోటమాట రాలేదు నాకు. పడుకునే మంచానికి ఒక వైపు వంట, మరో వైపు రాసుకునే బల్ల. నడవడంలో ఇబ్బంది వుండడంవల్ల, ఒంటరిగా వుంటుండడంవల్ల ఆవిడ చేసుకున్న ఏర్పాటు అది. రాయాలనే ఆవిడ తపన, తనున్న స్థితి పట్ల ఎలాంటి విచారమూ వ్యక్తం చేయని ఆవిడపట్ల నాకెంత అభిమానం కలిగిందో చెప్పలేను.

కథల మాస్టారిని చూస్తే కూడా నాకు చాలా సంతోషంగా వుంటుంది. ఆయన ‘కథా నిలయం’లో వున్నంత కాలం క్రమం తప్పకుండా ‘భూమిక పత్రిక అందింది’. ‘ధన్యవాదాలు’ అని ఉత్తరం రాసేవారు. కధల సేకరణని యజ్ఞంలా నిర్వహించిన కారా మాస్టారు ఇంకా ఇంకా కథానిలయం అభివృద్ధి చేయాలని తపన పడుతూనే వున్నారు. ఆయనతో మాట్లాడటం ఓ అద్భుతానుభవంలా వుంటుంది.

అబ్బూరి ఛాయదేవిగారిని చూస్తుంటే నాకెపుడూ అబ్బురమే. ఆవిడ వయస్సును జయించారా అన్పిస్తుంది. ఎన్నెన్ని బాధ్యతలు నిర్వహిస్తారో ! సమావేశాలు, సభలు, పుస్తకాలకి ముందు మాటలు, అభినందనలు అబ్బో! ఆవిడ కార్యకలాపాల లిస్ట్‌ కొండపల్లి చాంతాడంత. సమయపాలన, స్వయం నిర్వహణ అంశాలలో ఆవిడ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

నాకెప్పటినుండో ఆత్మీయురాలు, నా పట్ల ఎంతో ప్రేమని కురిపించే శారదా శ్రీనివాసన్‌గారు. మొదటిసారి ఆవిడని చూసినపుడు నేను పొందిన అనుభవం వర్ణించడం నా తరం కాదు. ఎందుకంటే చిన్నప్పుడు రేడియోలో ఆవిడ నాటకాలు విని ఆవిడని ఎపుడైనా చూడగలనా అని కలలు కన్నదాన్ని. ఆవిడని చూడడమే కాదు ఆవిడ ప్రేమని కూడా పొందడం నాకు గొప్ప అనుభవం. ఆవిడ లైబ్రరీలోంచి తీసుకుని ఎన్నో పుస్తకాలు చదివాను. ఈ రోజుకీ ఆవిడ గొంతులోంచి నా మీద అభిమానం కురుస్తూనే వుంది.

చెన్నైలో వుండే వి.ఎ.కె. రంగారావుగారి ఉత్తరాలు ఎంతో కళాత్మకంగా వుంటాయి. భూమిక గురించి ఆయన తరుచూ రాస్తూంటారు. కవరు మీద చక్కటి బొమ్మలు అతికించి కళాత్మకమైన తీరులో పంపుతారు. మొన్నటికి మొన్న భూమికకు విరాళం పంపిస్తూ పోస్ట్‌ చేసిన కవరు మీద చిరునవ్వులు చిలికిస్తున్న ‘మొనాలిసా’ బొమ్మని ఏదో పుస్తకంలోది కత్తిరించి కవరు మీద అతికించారు. ఆయన రాసే ఉత్తరం ఎంత ఉత్తేజాన్నిస్తుందో కళాత్మకమైన కవర్లు అంతగానూ స్ఫూర్తిదాయకంగా వుంటాయి.

సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు. ఎనభై ఆరు సంవత్సరాల వయస్సులో ఆవిడ ఒంటరిగా వుంటూ కూడా నా చుట్టూ బోలెడు మంది వున్నారు, ఎంతో మంది వచ్చిపోతూ వుంటారు, నాకు ఒంటరితనం అన్పించదు అంటారు. పూలతో కబుర్లాడుతూ నేనో కవిత రాస్తే దానికి ఆవిడ స్పందించిన తీరు అద్భుతం. తన బాల్యానుభవాలతో సహా ఎన్నింటినో గుర్తుకు తెచ్చుకుంటూ ఆవిడ రాసిన ప్రతిస్పందన ఈ సంచికలోనే వుంది. నిజానికి అలా స్పందించేవాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు.

వేములపల్లి సత్యవతి గారు సమాజానికి స్ఫూర్తినందించేవారి గురించి రాయాలని తపన పడుతుంటారు. వేళ్ళు సహకరించక పోయినా సరే ఆవిడ రాస్తూనే వుంటారు. ఇటీవల సూర్యదేవర రాజ్యలక్ష్మిగారి మీద పెద్ద వ్యాసం రాసి, వద్దంటే కూడా వినకుండా స్వయంగా ఆఫీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. ఆవిడ కుడి చేతి బొటన వేలుకి బాండ్‌ఎయిడ్‌ వేసే వుంది. అంత పెద్ద వయస్సులో ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేసి వచ్చిన ఆవిడని చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. వేములపల్లి సత్యవతిగారి నిబద్ధత అంత గొప్పగా వుంటుంది.

పి. సత్యవతి గారి గురించి రాయాలంటే చాలానే రాయాలి. ఆవిడ రిటైర్‌ అయ్యాక కంప్యూటర్‌ నేర్చుకుని, ఇంటర్‌నెట్‌ వాడుతూ, తన బ్లాగుని కూడా నిర్వహిస్తున్నారు. తెలుగులో చక్కగా తనే టైప్‌ చేసి తన కాలమ్‌ పంపుతారు. అలనాటి రచయిత్రులు గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా తన కాలమ్‌లో రాస్తున్నారు. ఈ నిబద్ధత అందరిలోను వుంటే స్త్రీవాదం ఇంకా పరిపుష్టమౌతుందికదా.

ఆర్‌. శాంతసుందరిగారి పనితీరు, జీవనశైలి ఎంతో భిన్నంగా వుంటాయి. హిందీ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి హిందీలోకి ఆవిడ చేసే అనువాదాలు అసంఖ్యాకంగా, ప్రణాళికాబద్థ్దంగా నడుస్తూ వుంటాయి. ఇంట్లో తన అనువాద పనిని ఒక క్రమశిక్షణతో, నియమిత పనిగంటలతో ఖచ్చితంగా చేస్తారు. ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్రని ఆవిడే రాసారా అన్నంత అద్భుతంగా అనువాదం చేసారు.

ఇలా రాసుకుంటూ పోతుంటే ఈ లిస్ట్‌ ఈస్ట్‌ గోదావరిదాకా సాగుతుంది. సుజాతామూర్తిగారి ఆత్మీయత, వి. హనుమంతరావుగారి ఆదరణని మర్చిపోలేను. సింగమనేని నారాయణగారు, కేతు విశ్వనాథరెడ్డిగారు, కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లాది సుబ్బమ్మగారు, చేకూరి రామారావు, సి.నారాయణరెడ్డిగార్ల సాహిత్య ప్రయాణం అపురూపమనిపిస్తుంది. మల్లు స్వరాజ్యంగారి పోరాటపటిమ గురించి ఇదే సంచికలో సమగ్రంగా వుంది.

వీరందరి గురించి ఎందుకు రాస్తున్నట్టు అని పాఠకులకు అనిపించవచ్చు. ఎందుకు రాస్తున్నానో కొంతవరకు అర్ధమయ్యే వుండాలి. ఇంత వయస్సు మీద పడినా, శరీరం సహకరించకపోయినా సరే వీరు కనపరుస్తున్న నిబద్ధత, స్పందన, క్రమశిక్షణలకి ప్రణమిల్లాలనే నేను రాశాను. వీరిలో కనిపిస్తున్న స్పందన, చురుకుతనం యువతలో గాని, మధ్య వయస్కులైన మేధావుల్లోగానీ ఎందుకు కన్పించడం లేదనే వేదనే నా చేత రాయించింది. వీరి నుండి ఎంతో నేర్చుకోవలసింది వుంది. సామాజిక సమస్యలపట్ల బండబారిపోతున్న నేటి తరం వీరినుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో వుంది. నా మీద, భూమిక మీద అపారమైన అభిమానం, ఆత్మీయత కురిపిస్తున్న ఈ అపూర్వ సీనియర్‌ సిటిజన్స్‌కి, మేధావులకి, రచయితలకి ‘ సీనియర్‌ సిటిజన్స్‌డే ‘ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

Tuesday, October 19, 2010

జెండర్ స్పృహ లేని పోలీసులు- జీవన్మరణ సమస్యల్లో బాధిత మహిళలు.


మొన్న గురువారం నేను, నా దగ్గర రెసెర్చ్ అసోసియేట్ పని చేస్తున్న ముజీబా కలిసి పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చాం.
రామంతాపూర్లో ఉన్న డిటెక్టివ్ ట్రైనింగ్ సెంటర్ ఇది జరిగింది.
ఈ ట్రైనింగ్ కి హాజరైన వారంతా వివిధ రాష్ట్రాలకు కేరళ,తమిళనాడు,ఉత్తరాఖండ్,గుజరాత్,మహరాష్ట్ర,ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు.
ఎస్సైలుగా,ఏఎస్సైలుగా పని చేస్తున్నవారు.
పిసీపిఎండీటి చట్టం గురించి నేను క్లాస్ తీసుకున్నాను.
మొదట ముజీబా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసింది.ఆ తర్వాత గంటన్నసేపు నేను క్లాస్ తీసుకున్నాను.
ఆడపిల్లల హక్కుల గురించి,పడిపోతున్న సెక్స్ రేషియో గురించి,సెక్స్ రేషియో పడిపోతే,సమాజంలో ఆడపిల్లలు తగ్గిపోతే ఎదురయ్యే అసమతుల్యత,స్త్రీలపై పెచ్చుమీరిపోయే హింస మొద్లైన అంశాలను గురిచి మాట్లాడుతూ వాళ్ళను చర్చలోకి దింపాను.
వీధి వీధినా వెలిసిన అల్ట్రాసౌండ్ పరీక్షా కేంద్రాలు,లింగనిర్ధారణ పరీక్షలు జరుపుతున్న డాక్టర్లు,ఆడపిండాలను అమానుషంగా చంపేస్తున్న వైనాలు వివరించాను.
అమ్మలే ఆడపిల్లల్ని చంపేస్తున్నారంటూ స్త్రీలకు స్త్రీలే శత్రువులు అంటూ ఓ వంకర వాదన తెచ్చాడు ఒక అధికారి.దాని మీద చాలా చర్చ జరిగింది.
ట్రైనైంగ్ కి హాజరైన ప్రతి ఒకరికి జెండర్ శిక్షణ ఆవశ్యకత చాలా ఉందనిపించిది.
ఓ అరగంట జెండర్ క్లాస్ తీసుకున్నాను.
తమ వద్దకు వచ్చే బాధిత స్త్రీలతో వీళ్ళు చాలా ఇన్సెసిటివిటితో ప్రవర్తుస్తారని అర్ధమైంది.
ఓ రెండు గంటలపాటు వాళ్ళతో గడిపాకా చాలా బలంగా అనిపించిన అంశం నెXట్ బాచ్కి పిసిపిఎండిటి ఏక్ట్ కన్నా కంప్లీట్ జెండర్ శిక్షణ అవసరం చాలా ఉందని.ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ కి అదే విషయం చెప్పి,ఈ సారి జెండర్ శిక్షణ క్లాసు కోసం పిలవమని చెప్పి అక్కడి నుండి బయటపడ్డాం.
ఫీడ్ బాక్ లో మా క్లాస్ అద్భుతంగా ఉందని చాలా కొత్త అంశాలు నేర్చుకున్నామని చెప్పారు అందరూ.
మాతో గ్రూప్ ఫోటో కావాలని అడిగి తీసుకున్నారు.

Sunday, October 17, 2010

మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం

ఈ వారం ది వీక్ పత్రికలో మల్లికా సారా భాయ్ రాసిన వ్యాసం చదివాకా 45 సంవత్సరాల నాటి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.

మల్లిక తన కాలంలో బెజవాడ విల్సన్ అనే ఆయన గురించి రాస్తూ ఆయన పాకీ పని వారి గురించి చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు.
ఈ విల్సన్ అనే ఆయన హర్ష్ మందిర్ రాసిన పుస్తకం లోని పాత్ర.
మల్లిక రాసింది చదువుతుంటే నా కళ్ళల్లో ఎందుకు నీళ్ళొచ్చాయి?
ధారగా కారుతున్న ఈ కన్నీళ్ళు నా గత స్మృతుల్ని కడుగుతాయా?
నేను ఆరవ తరగతి చదువుతున్నపుడు మా నాన్న కొబ్బరికాయల వ్యాపార నిమిత్తం నరసాపురంలో ఉండేవాళ్ళం.మా నాన్న 25 రూపాయలు అద్దె ఇచ్చి అద్దె ఇంట్లో ఉండేవాడు.
మా ఇంటి పక్క పరకాల ప్రభాకర్ వాళ్ళ ఇల్లు ఉండేది.మేమంతా కలిసి ఆడుకునే వాళ్ళం.ఆ విషయాలు మళ్ళీ రాస్తాను.
మేము అద్దెకున్న ఇంటికి టాయ్ లెట్ ఉండేది కాదు.మరుగుదొడ్డి ఉండేది.ఆ దొడ్లో ఓ పది ఇటికలు వేసి ఉండేవి.అదే మా లెట్రిన్ అన్నమాట.
రోజూ ఉదయమే ఒకామె తట్ట తీసుకుని వచ్చి మలాన్ని చేతులతో,ఓ చిన్న రేకు ముక్క సాయంతో ఎత్తి తట్టలో వేసుకుని తట్టని తలమీదో చంకలోనో పెట్టుకుని వెళ్ళేది.
మేము ఎంత ఘోరంగా ప్రవర్తించే వాళ్ళమో ఇప్పుడు తల్చుకుంటే
నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక.
ఒకా రోజు ఆమె రాకపోతే శాపనార్ధాలు పెట్టడమే.
నిజానికి ఆమె ఒక్క రోజు రాకపోతే మా బతుకు ఘోరమే.
ఆమె వస్తే ముఖం చూడకపొయ్యేది.రాకపోతే తిట్ల దండకం అందుకునేది.
చేతులతో మలం ఎత్తే పనికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పటి నుండి,దానికి సంబందించిన రచనలు చదువుతున్న కొద్దీ నాలో నా చిన్నప్పటి అనుభవాలు సుళ్ళుతిరుగుతూనే ఉన్నాయి.
ఎప్పటికైనా ఈ అమానుషం గురించి రాయగలనా అని అనుకునే దాన్ని.
తెలిసో తెలియకో నేనూ ఈ అమానవీయ కార్యంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతూ,దుఖపడుతూ,వేదనపడుతూ చిన్నప్పుడు నేను విసర్జించిన మలాన్ని తలమీద మోసిన ఆ తల్లికి పాదభివందనం చేస్తూ ఈ ఉద్యమంలో నా వంతు క్రుషి చెయ్యడానికి బద్దురాలనౌతున్నాను.
ఈ నెలాఖరునాటికి చేతులతో శుభ్రం చేసే పాకీ దొడ్లు ఉండరాదనే ఉద్యమానికి మద్దతు పలుకుతూ,నా తప్పును సరిదిద్దుకునే ఏ పనికైనా సరే నేను రడీ అవుతున్నాను.
ఇలాంటి అమానవీయ,అమానుష ఆచారాలకు పాతర వేద్దాం రండి.
చేతులతో మలాన్ని ఎత్తే మహాపచార పనికి వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి మితులారా!
మలాన్ని ఎత్తే మహా తల్లులకి పాదాభివందనం చేద్దాం.

Friday, October 15, 2010

అబ్బూరి చాయాదేవి గారి పుట్టినరోజు -చదువుకునే పిల్లిగారు

సెప్టెంబర్ 13 ప్రముఖ రచయిత్రి,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత అబ్బూరి చాయాదేవి గారి పుట్టిన రోజు.సెప్టెంబర్ 10 ప్రముఖ కవయిత్రి  సుజాతా పట్వారి పుట్టిన రోజు.
ప్రతి నెల భూమిక కార్యాలయంలో జరిగే రచయిత్రుల సమావేశం లో ఆ నెలలో పుట్టిన వారి పుట్టినరోజును జరపుతాం.
భూమిక ఆఫీసులో సరదాగా రచయిత్రుల సమక్షంలో వేడుకగా వీరద్దరి పుట్టినరోజును జరిపాం.చాయా దేవిగారికి ఎంతో ఇష్టమైన పిల్లిబొమ్మని నేను కానుకగా ఇచ్చాను.తోకని కాండిల్ స్తాండ్ గా చేసుకుని కాండిల్ వెలుతురులో చదువుకుంటున్న పిల్లిబొమ్మ అది.
కొవ్వొత్తి ఆర్పకుండా వెలిగించి ఆవిడకిచ్చాను.
ఆవిడ బోలెడు సంబరపడ్డారు.

Tuesday, October 12, 2010

గంగకి వరదొచ్చింది

(గ్రామీణ మహిళల్ని పీక్కు తింటున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఆగడాల గురించిన కధ)
 అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక కూడా అలాగే వున్నాయి.

Saturday, October 9, 2010

షర్మిలా ఇరామ్‌ కోసం చెమ్మగిల్లుతున్న కళ్లతో..........


షర్మిల
విడుదలైనప్పటి ఫోటో
ఆ ఒక్క రోజే ముక్కులో ట్యూబ్ ఉండదు

నిరసన శిబిరంలో

సెప్టెంబర్‌ 23న జర్నలిస్ట్‌ జ్యోతి పున్వాని నుండి వచ్చిన ఒక ఇమెయిల్‌ నన్ను తీవ్రమైన దు:ఖానికి గురి చేసింది. ఆ ఇమెయిల్‌ సారాంశం ఏమిటంటే గత పది సంవత్సరాలుగా ఇంఫాల్‌లో నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, చాలా ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు పొడసూపుతున్నాయని, దీర్షకాలంగా నిరాహారంగా ఉండడమే దీనికి కారణమని డాక్షర్లు అంటున్నారని, షర్మిల కోసం నా అణువణువూ దు:ఖంతో నిండిపోయింది. ఎవరీ షర్మిలా? ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఆమె కోసం మనసెందుకు ఇంత

ఆరాటపడుతోంది? కళ్ళలోంచి జలాజలా కన్నీళ్ళెందుకు ఉబికి వస్తున్నాయి?
షర్మిలా ఇరామ్‌ పేరు తలుచుకుంటేనే ఒక ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. ఆమెను చూడగలిగితే...ఇంకెంత సంతోషం కలుగుతుంది. నిలువెత్తు త్యాగం, నిర్ధుష్టమైన ఆచరణ ఆమెను ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. పది సంవత్సరాలుగా నోటి ద్వారా ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా మణిపూరి ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఇరామ్‌ జీవితం ఎంతో ఆదర్శపూరితమైంది.
 నేను 2009 మార్చిలో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్ట్‌ల సమావేశంలో పాల్గొనడానికి  మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ వెళ్ళాను. మార్చి 7 వ తేదీన సాహసనారి షర్మిలాను ప్రత్యక్షంగా చూశాను.
 ఆమెతో కలిసి నడిచాను. జైలు నుండి విడుదలైన వెంటనే ఆమె తిరిగి నిరాహారదీక్షలో కూర్చున్నపుడు ఆమెతో పాటు శిబిరంలో కూర్చున్నాను. ఆ రోజు ఆమె వజ్ర సంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. షర్మిలా ఆరోగ్యం బాగా లేదని వస్తున్న వార్తలు అందుకే నాకింత దు:ఖాన్ని కల్గిస్తున్నాయి.
 షర్మిలా సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతా దళాల చేతుల్లో హత్యలకు, అత్యాచచారాలకు బలయ్యే స్త్రీల కన్నీటి కథనాలు వింటుండేది. శాంతి యాత్రల్లో పాల్గోనేది. 2000, నవంబర్‌ 2న 'మాలోమ్‌' అనే ప్టటణంలోని బస్టాండులో అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధులు పదిమంది సాధారణ పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిలా తీవ్రంగా చలించిపోయింది. 'మాలోమ్‌' పట్టణం ఇంఫాల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటన జరగానికి ముందే షర్మిలా శాంతి యాత్ర నిర్వహణ కోసం 'మాలోమ్‌'కి వచ్చింది. తాను అక్కడ ఉన్నపుడే జరిగిన ఈ దారుణ సంఘటన ఆమెను కుదిపేసింది. శాంతి ర్యాలీ ఆలోచన విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకు పూనుకోవాలని షర్మిలా నిర్ణయించుకుంది. మణిపూర్‌లో భద్రతా దళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన ''ఆర్మ్‌డ్‌ పొర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ ఆక్ట్‌ 1958ని రద్దు చేయాలంటూ అమరణ నిరాహార దీక్షకు దిగాలనే  తీవ్ర నిర్ణయాన్ని తీసుకుని, తల్లితో చెప్పినప్పుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి, కూతురికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతి కఠినమైన నియమం పెట్టింది. తను మొదలు పెట్టిన కార్యంలో విజయం సాధించే వరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టింది తల్లి. అందుకు కూడా షర్మిల ఒప్పుకుని, నవంబరు 4, 2000లో తన అమరణ నిరాహార దీక్ష  ప్రారంభించింది. పది సంవత్సరాలుగా, నేటికీ ఆమె దీక్ష కొనసాగుతోంది. అమరణ దీక్షలో ఉన్న షర్మిలను ఆత్మహత్యా ప్రయత్నం నేరం కింద అరెస్ట్‌ చేసి, బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌ వేసి ద్రవాహారం పంపిస్తూ ఇంఫాల్‌లోని జిఎన్‌ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమెను బంధించారు. ఈ నేరం కింద ఒక్క సంవత్సరం మాత్రమే జైలులో ఉంచే వీలుండడంవల్ల ప్రతి సంవత్సరం ఒక రోజు ఆమెను విడుదల చేసి, ఆమె మళ్ళీ దీక్షలో కూర్చుని ఆహారం ముట్టదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేసి బంధించడం గత పది సంవత్సరాలుగా ఈ తంతును మణిపూర్‌ ప్రభుత్వం నడుపుతోంది. 2009 మార్చి 7వ తేదీన ఆమెను విడుదల చేసినపుడు మేము ఇంఫాల్‌లో ఉండడంవల్ల ఈ అద్భుతమూర్తిని చూడడం, ఆమెతో కొంత సమయం గడపడం జరిగింది. ఆ మరునాడే అంటే మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం రోజున షర్మిలను అరెస్ట్‌ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.

బలవంతంగా ముక్కులోకి ట్యూబ్‌ పెట్టి ఆమెకు ద్రవాహారాన్ని ఎక్కిస్తున్నారు.

 ఈ పదేళ్ళ కాలంలో షర్మిల, వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలవలేదు. చూడలేదు. నిరక్షరాస్యురాలైన, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. 'మీరు మీ బిడ్డను చూడడడానికి ఎందుకు వెళ్ళలేదు' అని విలేకరి ఆమెను ప్రశ్నించినపుడు ఆమె ఇచ్చిన సమాధానం 'నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన దృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలచలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు తనను చూడదలుచుకోలేదు' అంది. షర్మిల కూడా మేమందరం శిబిరంలో ఉన్నపుడు తన తల్లి గురించి 'నేను మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంత కాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్ను చూడొద్దన్నాను కదా అని అంటుందేమోననీ భయంతో అమ్మ ఉన్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు
తచ్చాడాను' అని షర్మిల అన్నప్పుడు మా అందరి కళ్ళల్లోను నీళ్ళు తిరిగాయి.

షర్మిల నిరాహార దీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004లో మణిపూర్‌ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమాదేవి అనే మహిళ అత్యాచారానికి, హత్యకు బలైనపుడు మణిపూరి స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకు ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్‌ రైఫిల్స్‌ హెడ్‌ క్యార్టర్స్‌ ముందు నగ్నంగా నిలబడి 'భారత సైనికులారా మమ్మల్నీ రేప్‌ చేయండి.' అంటూ  మణిపూర్‌ తల్లులు నిర్వహించిన నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెర పరిచింది.భద్రతాదళాల ఆగడాలు, అత్యాచారాలు ఏ తీరులో సాగుతున్నాయో, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో యావత్‌ ప్రపంచానికి తెలియచెప్పింది ఈ నగ్న ప్రదర్శన.


 ఒక ఇంటర్వ్యూలో బిబిసితో మాట్లాడుతూ 'మణిపురి ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతి కోసం' అంటూ ప్రకటించిన నలభై ఏళ్ళయినా నిండని బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారత దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరు సల్పుతుంది. తన ప్రాణాలను తృణప్రాయంగా తన ప్రజల కోసం వదిలేయడానికి సిద్ధపడిన షర్మిల జీవితం ఇప్పుడు అత్యంత ప్రమాదపుటంచులకు చేరింది. దిన దినమూ క్షీణిస్తోందని అక్కడి నుండి వస్తున్న వార్తలు చెబుతున్నాయి. బక్క చిక్కిన ఈ బలహీన ప్రాణం గురించి భారత ప్రభుత్వం విచారిస్తున్న దాఖలాలుగానీ, ఆమె కోరుతున్నట్లుగా ఎఎఫ్‌ఎస్‌పిఏ   చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నంగానీ కనుచూపు మేరలో కనపడ్డం లేదు. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని గుండె గుబగుబలాడుతోంది. షర్మిలా కోసం గట్లు తెంచుకుంటూ దు:ఖం ఉబికివస్తోంది.

Tuesday, October 5, 2010

తారామండల పూల వనంలో తనివితీరా.....

చాలా రోజులుగా గీత నేను కలిసి ఓ రోజంతా హాయిగా గడపాలని ప్లాన్ చేస్తున్నాం.
మేము కలిసి గడపడమంటే సినిమాలకో,షాపింగులకో తిరగడం కాదు.
భూతాల్లాంటి బడా మాల్స్ కెళ్ళి అడ్డమైన చెత్త కొనుక్కోవడం కాదు.
మా ఇద్దరికీ ఇష్టమైన కొన్ని ప్రాంతాలు మేమే కనిపెట్టుకున్నవి,జనాలు ఎక్కువగా తిరగని ప్రశాంతమైన ప్రదేశాలు కొన్ని వెతికి పట్టుకున్నాం.
ఒకటి రామంతాపూర్లోని సంపెంగ వనం.
ఇంకోటి యమ రష్ గా ఉండే లుంబిని వనం పక్కనుండే(పార్కింగ్ ప్లేస్ )తారామండల పూల వనం.
ఆకాశ మల్లెలని తారామండల పూలంటారని నాకు ఇటీవలే తెలిసింది.మా ఊర్లో అయితే కారప్పూలని(కారం వాసనేస్తాయి కదా)కాడమల్లెపూలని అంటారు.
సరే.శనివారం చల్లటి మబ్బులు పట్టి,చిరుజల్లులు కురిసే వేళ మేమిద్దరం తారామండల పూల వనంలో ప్రవేశించాం.
ఎవరి కళాత్మక హృదయ స్పందనో కానీ బోలెడన్ని కాడమల్లి పూల చెట్లు నాటి,వాటి చుట్టూ చక్కగా రచ్చబండలు కట్టించారు.
మేము ప్రతి సంవత్సరం ఈ తోటలోకి వెళతాము.
హాయిగా ఓ రచ్చబండ మీద కూర్చుంటే ఆయాచితంగా,ఎంతో ఆత్మీయంగా మీ మీద ఆకాశమల్లెల జడివాన కురుస్తుంది.సువాసనలు వెదజల్లుతూ అలా మన మీద పూలు కురుస్తుంటే,పక్కన ప్రియ నేస్తం కబుర్లు చెబుతుంటే ఓహ్!అదెంత అద్భుతమైన అనుభవమో,ఒక్క సారి ఆ చెట్లకింద కూర్చుంటేనే అర్ధమౌతుంది.


మేము బోలెడన్ని పూవులేరి,మాలలల్లిమెళ్ళో వేసుకున్నాం.తనివి తీరా పూలతో కబుర్లాడి,మా మీద రాలుతున్న పూలకి బై చెప్పి బయటకొచ్చాం.
హిమాయత్ నగర్ లోని మినర్వా కాఫీ షాప్ పక్కనుండే నాగమల్లి చెట్టు దగ్గరకెళ్ళాం కానీపూలు దొరకలేదు.
ఆ తర్వాత సికింద్రాబాద్ పొయ్యాం.
సికింద్రాబాద్ కీస్ హై స్కూల్ పక్కనున్న స్పెషల్ చాయ్ దుఖాణం బ్లూ సీ లో వేడి వేడి చాయ్ తాగి,ఇందిరా పార్క్లోని మొగలి వనం చూడ్డానికి పయనమయ్యాం.
అప్పటికే చీకటి పడుతూండడం వల్ల మొగలి పూలను సంపాదించలేకపోయాం కాని కొంత సేపు మొగలి పొదలచుట్టూ చక్కర్లేసాం.పొదల్లోంచి మొగలి సువాసనలు వస్తున్నాయి కానీ కోసే వాళ్ళు ఎవరూలేరు.
అక్కడి నుండి తిన్నగా గీతా వాళ్ళింటికెళ్ళాం.
రాత్రికి నేనక్కడే ఉండిపోయా.గీత కూతురు బబ్బి కూడా మాతో కలిసింది.
రాత్రి చాలా పొద్దుపోయేవరకు నా లాప్టాప్ లోని చిమట వెబ్ సైట్ నుంచి పాత సినిమాపాటలు వింటూ కూర్చున్నాం.
తెల్లారాక గీతా వాళ్ళ గార్డెన్లో పని చేస్తుంటే పక్కింట్లో ఏపుగా ఎదిగిన తోటకూర మొక్క కనబడింది.నేను అమాంతంగా పక్కింట్లో చొరబడి తోటకూర కాడ పీక్కొచ్చేసా.
అదెందుకూ అంది గీత.నీకు తోటకూర కాడ రొయ్యల కాంబినేషంతో కూర చేసి పెడతానోయ్ అంటే,నువ్వు కూర చేస్తే తిన్నట్టే అన్నట్టు చూసింది.
నేను కూర చెయ్యడం, ఆహా భలేగా ఉందే అంటూ తను వాళ్ళ హస్బెండ్ తినడం చూసావా నేను కూర చెయ్యలేననుకున్నావా అంటూ కళ్ళెగరేయడం,గొప్ప మజా వచ్చిందనుకోండి.
తిన్నాకా మళ్ళి మేమిద్దరం రోడ్డెక్కాం.మలక్ పేటలో నర్సరీల వేపు వెళ్ళాం.
 నేను ఇటీవల ఇంటికి తెచ్చుకున్న కుండీలో విరగబూసే హైబ్రిడ్ సంపెంగ మొక్క కోసం వెతికి నా నేస్తానికి ఓ మొక్కని కానుకగా కొనిచ్చి నేను మా ఇంటి వేపు కారు తిప్పాను.
కొన్ని గంటల్ని నాకోసం, కేవలం నాకోసం కేటాయించుకుని ఇలా గడపడం నాకు చాలా ఇష్టం.ఇలా గడిపాక నా పనులన్నింటినీ ఎంతో ప్రేమగా,హాయిగా,ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకుంటాను.గీత లాంటి నేస్తం ఉంటేనే ఇలా గడపడం సాధ్యమౌతుంది.
మా పరిచయమై పన్నెండేళ్ళు గడిచినా మా స్నేహం నిత్య నూతనంగా,ఫ్రెష్ గా ఉండడానికి ఇదే కారణం.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...