షర్మిలా ఇరామ్‌ కోసం చెమ్మగిల్లుతున్న కళ్లతో..........


షర్మిల
విడుదలైనప్పటి ఫోటో
ఆ ఒక్క రోజే ముక్కులో ట్యూబ్ ఉండదు

నిరసన శిబిరంలో

సెప్టెంబర్‌ 23న జర్నలిస్ట్‌ జ్యోతి పున్వాని నుండి వచ్చిన ఒక ఇమెయిల్‌ నన్ను తీవ్రమైన దు:ఖానికి గురి చేసింది. ఆ ఇమెయిల్‌ సారాంశం ఏమిటంటే గత పది సంవత్సరాలుగా ఇంఫాల్‌లో నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, చాలా ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు పొడసూపుతున్నాయని, దీర్షకాలంగా నిరాహారంగా ఉండడమే దీనికి కారణమని డాక్షర్లు అంటున్నారని, షర్మిల కోసం నా అణువణువూ దు:ఖంతో నిండిపోయింది. ఎవరీ షర్మిలా? ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఆమె కోసం మనసెందుకు ఇంత

ఆరాటపడుతోంది? కళ్ళలోంచి జలాజలా కన్నీళ్ళెందుకు ఉబికి వస్తున్నాయి?
షర్మిలా ఇరామ్‌ పేరు తలుచుకుంటేనే ఒక ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. ఆమెను చూడగలిగితే...ఇంకెంత సంతోషం కలుగుతుంది. నిలువెత్తు త్యాగం, నిర్ధుష్టమైన ఆచరణ ఆమెను ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. పది సంవత్సరాలుగా నోటి ద్వారా ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా మణిపూరి ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఇరామ్‌ జీవితం ఎంతో ఆదర్శపూరితమైంది.
 నేను 2009 మార్చిలో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్ట్‌ల సమావేశంలో పాల్గొనడానికి  మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ వెళ్ళాను. మార్చి 7 వ తేదీన సాహసనారి షర్మిలాను ప్రత్యక్షంగా చూశాను.
 ఆమెతో కలిసి నడిచాను. జైలు నుండి విడుదలైన వెంటనే ఆమె తిరిగి నిరాహారదీక్షలో కూర్చున్నపుడు ఆమెతో పాటు శిబిరంలో కూర్చున్నాను. ఆ రోజు ఆమె వజ్ర సంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. షర్మిలా ఆరోగ్యం బాగా లేదని వస్తున్న వార్తలు అందుకే నాకింత దు:ఖాన్ని కల్గిస్తున్నాయి.
 షర్మిలా సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతా దళాల చేతుల్లో హత్యలకు, అత్యాచచారాలకు బలయ్యే స్త్రీల కన్నీటి కథనాలు వింటుండేది. శాంతి యాత్రల్లో పాల్గోనేది. 2000, నవంబర్‌ 2న 'మాలోమ్‌' అనే ప్టటణంలోని బస్టాండులో అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధులు పదిమంది సాధారణ పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిలా తీవ్రంగా చలించిపోయింది. 'మాలోమ్‌' పట్టణం ఇంఫాల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటన జరగానికి ముందే షర్మిలా శాంతి యాత్ర నిర్వహణ కోసం 'మాలోమ్‌'కి వచ్చింది. తాను అక్కడ ఉన్నపుడే జరిగిన ఈ దారుణ సంఘటన ఆమెను కుదిపేసింది. శాంతి ర్యాలీ ఆలోచన విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకు పూనుకోవాలని షర్మిలా నిర్ణయించుకుంది. మణిపూర్‌లో భద్రతా దళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన ''ఆర్మ్‌డ్‌ పొర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ ఆక్ట్‌ 1958ని రద్దు చేయాలంటూ అమరణ నిరాహార దీక్షకు దిగాలనే  తీవ్ర నిర్ణయాన్ని తీసుకుని, తల్లితో చెప్పినప్పుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి, కూతురికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతి కఠినమైన నియమం పెట్టింది. తను మొదలు పెట్టిన కార్యంలో విజయం సాధించే వరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టింది తల్లి. అందుకు కూడా షర్మిల ఒప్పుకుని, నవంబరు 4, 2000లో తన అమరణ నిరాహార దీక్ష  ప్రారంభించింది. పది సంవత్సరాలుగా, నేటికీ ఆమె దీక్ష కొనసాగుతోంది. అమరణ దీక్షలో ఉన్న షర్మిలను ఆత్మహత్యా ప్రయత్నం నేరం కింద అరెస్ట్‌ చేసి, బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌ వేసి ద్రవాహారం పంపిస్తూ ఇంఫాల్‌లోని జిఎన్‌ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమెను బంధించారు. ఈ నేరం కింద ఒక్క సంవత్సరం మాత్రమే జైలులో ఉంచే వీలుండడంవల్ల ప్రతి సంవత్సరం ఒక రోజు ఆమెను విడుదల చేసి, ఆమె మళ్ళీ దీక్షలో కూర్చుని ఆహారం ముట్టదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేసి బంధించడం గత పది సంవత్సరాలుగా ఈ తంతును మణిపూర్‌ ప్రభుత్వం నడుపుతోంది. 2009 మార్చి 7వ తేదీన ఆమెను విడుదల చేసినపుడు మేము ఇంఫాల్‌లో ఉండడంవల్ల ఈ అద్భుతమూర్తిని చూడడం, ఆమెతో కొంత సమయం గడపడం జరిగింది. ఆ మరునాడే అంటే మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం రోజున షర్మిలను అరెస్ట్‌ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.

బలవంతంగా ముక్కులోకి ట్యూబ్‌ పెట్టి ఆమెకు ద్రవాహారాన్ని ఎక్కిస్తున్నారు.

 ఈ పదేళ్ళ కాలంలో షర్మిల, వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలవలేదు. చూడలేదు. నిరక్షరాస్యురాలైన, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. 'మీరు మీ బిడ్డను చూడడడానికి ఎందుకు వెళ్ళలేదు' అని విలేకరి ఆమెను ప్రశ్నించినపుడు ఆమె ఇచ్చిన సమాధానం 'నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన దృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలచలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు తనను చూడదలుచుకోలేదు' అంది. షర్మిల కూడా మేమందరం శిబిరంలో ఉన్నపుడు తన తల్లి గురించి 'నేను మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంత కాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్ను చూడొద్దన్నాను కదా అని అంటుందేమోననీ భయంతో అమ్మ ఉన్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు
తచ్చాడాను' అని షర్మిల అన్నప్పుడు మా అందరి కళ్ళల్లోను నీళ్ళు తిరిగాయి.

షర్మిల నిరాహార దీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004లో మణిపూర్‌ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమాదేవి అనే మహిళ అత్యాచారానికి, హత్యకు బలైనపుడు మణిపూరి స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకు ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్‌ రైఫిల్స్‌ హెడ్‌ క్యార్టర్స్‌ ముందు నగ్నంగా నిలబడి 'భారత సైనికులారా మమ్మల్నీ రేప్‌ చేయండి.' అంటూ  మణిపూర్‌ తల్లులు నిర్వహించిన నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెర పరిచింది.భద్రతాదళాల ఆగడాలు, అత్యాచారాలు ఏ తీరులో సాగుతున్నాయో, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో యావత్‌ ప్రపంచానికి తెలియచెప్పింది ఈ నగ్న ప్రదర్శన.


 ఒక ఇంటర్వ్యూలో బిబిసితో మాట్లాడుతూ 'మణిపురి ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతి కోసం' అంటూ ప్రకటించిన నలభై ఏళ్ళయినా నిండని బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారత దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరు సల్పుతుంది. తన ప్రాణాలను తృణప్రాయంగా తన ప్రజల కోసం వదిలేయడానికి సిద్ధపడిన షర్మిల జీవితం ఇప్పుడు అత్యంత ప్రమాదపుటంచులకు చేరింది. దిన దినమూ క్షీణిస్తోందని అక్కడి నుండి వస్తున్న వార్తలు చెబుతున్నాయి. బక్క చిక్కిన ఈ బలహీన ప్రాణం గురించి భారత ప్రభుత్వం విచారిస్తున్న దాఖలాలుగానీ, ఆమె కోరుతున్నట్లుగా ఎఎఫ్‌ఎస్‌పిఏ   చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నంగానీ కనుచూపు మేరలో కనపడ్డం లేదు. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని గుండె గుబగుబలాడుతోంది. షర్మిలా కోసం గట్లు తెంచుకుంటూ దు:ఖం ఉబికివస్తోంది.

Comments

భాను said…
ఈ రోజే మీరు మ్యాగజిన్ లో రాసింది చదివానండి. ఆ మధ్య ఎప్పుడో పేపెర్ లో చదివాను. కాని ఈ రోజు మీరు రాసింది చదివి పూర్తిగా తెలుసుకొనే అవకాశం లభించింది. నిజంగా జర్నలిస్ట్లుగా మీరంతా కలిసి ఏమి చేయలేర. చదువుతుంటే బాదనిపించింది. మీకు మెయిల్ చేద్దామనుకున్న కాని అనుకోకుండా మీ పోస్ట్ కనిపించింది. మంచి విషయం రాసారు.
శిశిర said…
2003లో మొదటిసారి షర్మిల గురించి చదివానండి. అప్పటినుండి ఆమె గురించిన అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. నిజంగా ఆమె ఒక ధీర. ధృడ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ చాలా ప్రమాదకరంగా ఉంది అంటే చాలా బాధగా ఉంది. భారత ప్రభుత్వం కనీసపు స్పందన కూడా చూపకపోవడం విచారకరం.
Chandra Latha said…
చాలా దుఃఖం తో చదివాను మరోసారి శర్మిల గారి పరిస్థితి గురించి. ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతం గా ఆమె చేస్తున్న పోరాటం ఇలా ముగియబోతుందా ..?విజ్ఞులంతా ఆమె వెంటున్నా , న్యాయం ఆమెకు దూరం గా నే ఉన్నదన్న వాస్తవం ,పై నుంచి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ..ప్చ్ .

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం