Tuesday, October 14, 2008

భూమిక స్నేహ హస్తం

12.10.2008 ఈనాడు ఆదివారం లో వచ్చిన వ్యాసం.

భర్త సాధింపులు, అత్తమామల వేధింపులు, ఉద్యోగంలో ఒడుదొడుకులు...సమస్య ఏదైనా కానీ పరిష్కార దిశలో మహిళలకు ఆసరాగా నిలుస్తోంది 'భూమిక' హెల్ప్‌లైన్.

1800 425 2908


స్త్రీవాద పత్రిక 'భూమిక' నిర్వహిస్తోన్న హెల్ప్‌లైన్ నెంబర్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది టోల్‌ఫ్రీ నెంబరు. ఒక్క ఫోన్‌కాల్‌తో మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు వీరు. చదువు, ఉద్యోగం, గృహహింస, చట్టపరమైన చిక్కులు, మానసిక ఇబ్బందులు... ఇలా అన్ని రకాల సమస్యల నుంచి స్త్రీలకు విముక్తి కలిగించేందుకు ఈ హెల్ప్‌లైన్ సాయపడుతోంది.

15 ఏళ్లుగా స్త్రీ అభ్యుదయానికి అక్షరసాయం చేస్తున్న భూమిక 2006లో ఈ హెల్ప్‌లైన్‌ను వెుదలుపెట్టింది. 'చాలా మంది మహిళలు తమ సమస్యల్ని ఉత్తరాల ద్వారా భూమికకు తెలియజేసి సరైన దారి చూపమని అర్థించేవారు. అలాంటి వారికి సమాచారం లేదా పరిష్కారం దొరికే మార్గం చూపేవాళ్లం. ఎక్కువ మందిని ఆదుకోడానికి హెల్ప్‌లైనే సరైన మార్గమని భావించి ప్రారంభించాం' అని చెబుతారు భూమిక సంపాదకులు
కె.సత్యవతి. హెల్ప్‌లైన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం 'ఆక్స్‌ఫామ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది.

మాటే మంత్రం ఆమెది అత్తవారింట్లో నచ్చని పెళ్లి. భర్త లేని సమయంలో అత్తమామలు మానసికంగా శారీరకంగా హింసించేవారు. మూడేళ్లు అదే పరిస్థితి. కానీ ఒక్కసారైనా ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓరోజు తలపై కట్టెతో కొట్టారు. రక్తం కారుతుండగా బయటకు పరుగుతీసింది. ఓ ఇంటి ముంగిట స్పృహతప్పి పడిపోయింది. ఆ సమాచారం భూమికకు అందింది... నిమిషాల్లో 108తో పాటూ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పూర్తయిన తర్వాత రక్షణ గృహంలో ఆశ్రయం కల్పించారు. కొన్నాళ్లకు అత్తమామలతోపాటు భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా జీవించడం వెుదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. కాస్త అటూ ఇటుగా ఇలాంటి నేపథ్యంతో భూమిక దృష్టికి వచ్చే కేసులు నెలలో అయిదు వరకూ ఉంటాయి.

ఆలుమగల మనస్పర్థల పరిష్కారానికీ భూమిక వేదికగా నిలుస్తోంది. తమ బాధలు పంచుకోడానికి ఎవరూ లేరని ఫోన్ చేసేవారూ, ఉన్న వాళ్లెవరూ తమని పట్టించుకోవడం లేదని చెప్పేవారూ... రోజులో పది మందైనా ఉంటారు. సమస్యను చెప్పుకోడానికీ, బాధను పంచుకోడానికీ ఓ ఆత్మీయ నేస్తం కావాలి... అది భూమిక రూపంలో వాళ్లకి దొరికింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలపాటు గొంతులో దాచుకున్న బాధ
ఒక్కసారి బయటకు వస్తుంది. 'ఫోన్ చేసినవారి మాటల్ని చాలా ఓపికతో వింటాం. ఒక్కోసారి గంటకు పైగానే మాట్లాడతారు. అయినా మేం విసుగుచెందం. అన్నీ విన్నాక సలహా లేదా సూచన చెబుతాం. తుది నిర్ణయం వారిదే. ఒక నిర్ణయానికి వచ్చాక సమస్య పరిష్కారానికి మా వంతు సాయం చేస్తాం' అని చెబుతారు భూమిక ప్రతినిధులు.

ఎల్లలు దాటి


రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి వీరికి ఫోన్‌లు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సమస్యల పరిష్కారానికి వీరిని ఆశ్రయించేవారు ఎక్కువ. అమెరికాలోని దక్షిణాసియా దేశాల మహిళల బాగోగులు చూసే 'మానవి' స్వచ్ఛంద సంస్థ తెలుగువారి సమస్యల పరిష్కారానికి భూమిక సాయం తీసుకుంటోంది. ఉద్యోగాల ఆశతో వెళ్లి విదేశాల్లో వోసపోయిన వారు స్వదేశం చేరుకోడానికీ వీరే దిక్కు. హెల్ప్‌లైన్ సేవలు జిల్లాలకూ విస్తరించాలనే భూమిక లక్ష్యం ఇపుడు నెరవేరింది. భూమిక స్ఫూర్తిగా ప్రభుత్వం ఇందిర క్రాంతిపథం సభ్యులచేత ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. వీరంతా భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు పది జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారు శిక్షణలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ అధికారుల ఫోన్ నెంబర్లూ వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూలనుంచి సమస్య వినిపించినా తక్షణ పరిష్కారం కోసమే

ఈ ఏర్పాట్లు. బాధితులు ఆయా జిల్లాల్లో ఉండే మానవహక్కుల సంఘాలు, లోక్ అదాలత్, మహిళా కమిషన్ ద్వారా లబ్ధిపొందడానికీ సాయపడతారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకూ భూమిక వాలంటీర్లు ఉన్నారు. వీరిలో మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలకి చెందిన వారు ఎక్కువ. న్యాయ సంబంధ సలహాల కోసం ప్రతి శనివారం న్యాయవాదితో ఫోన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడే వెసులుబాటు ఇటీవల ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిత్యం ఉండనే ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయి అల్లాడే మహిళలను అందులోంచి బయటపడేలా చేయడంలో 'భూమిక' హెల్ప్‌లైన్ కీలక భూమిక వహిస్తోందనడంలో సందేహం లేదు.

Saturday, October 11, 2008

''బెల్‌ బజావో''-గంటకొట్టండి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి మారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి.
బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు.
19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
మహిళలపై గృహహింసలో జాతీయ సగటు 37శాతం
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే 14శాతం మంది భౌతిక హింస, 35 శాతం మంది లైంగిక హింసను అనుభవిస్తున్నారు.

గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంట స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగ్ పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియామకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.
నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయాల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్నసూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, "బ్రేక్‌ త్రూ" http://www.bellbajao.org/ అనే అంతర్జాతీయంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.
ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియోలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియోలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగ్ బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతాడు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.
ఈ చిన్న వీడియోలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంటూ ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను మిత్రులారా? గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీరూ భాగస్వాములు కండి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...