Sunday, October 30, 2011

జహంగీర్ దర్గాకెళ్ళి మట్టి కుండల్ని కొనుక్కొచ్చిన వైనంబెట్టిదన....


హిందూ మహిళలు


హిందూ మహిళలు

నాతో వచ్చిన పిల్లలు


మహిళలకు ప్రవేశం లేదని చెప్పే బోర్డు


దర్గా దగ్గర నేను


దర్గా ముఖ ద్వారం


నల్ల మట్టికుండల్ని అమ్మే సుగుణమ్మ
ఈ ఆదివారం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చెయ్యాలనిపించింది.
ఇంట్లో నా సహచరుడు కూడా లేడాయే.
ఒక్కదాన్ని ఏం చేయ్యాలా అని ఆలోచిస్తుంటే ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళదామా అనిపించింది.
జహంగీర్ దర్గాకి వెళ్ళాలని నిర్ణయించాను.
మా బంగ్లా లో ఉండే పిల్లల్ని కూడా  వెంటేసుకుని పదకొండింటికి నేనే డ్రైవ్ చేస్తూ బయలుదేరా.
జహంగీర్ దర్గా హైదరాబాదుకి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
షం షాబాద్ దాటాక కొత్తూర్ దగ్గర  ఎడంవైపు తిరిగి ఐదు కి.మీ లోపలికళ్ళాలి.
రోడ్డు బావుంది.ఓ గంటలో దర్గా చేరాం.జనంతో కిటకిట  లాడుతోంది.
జనాలు భాజా భజింత్రీలతో ఊరేగింపుగా వస్తున్నారు.
ఈ దర్గాలో ముస్లిం ల కన్న హిందువులు ఎక్కువగా కనబడ్డారు.
దర్గా లోపలికి మహిళలకి ప్రవేశం లేదంటూ బోర్డులు పెట్టారు.
అంటే దర్గా బయట  వారికోసం ద్వారం ఉంది.లోపలికి రానివ్వరు.
కానీ విచిత్రంగా తమని రానివ్వని దర్గాకి మహిళలే ఎక్కవ రావడం కనిపించింది.
జనాలు దేవుళ్ళుగా కొలిచే  వాళ్ళు కూడా లింగ వివక్షతని చూపించడం ఎంత దారుణమో కదా!!


దర్గా సంగతి వదిలేస్తే నేను ఎప్పటి నుండొ కొనుక్కోవాలనుకుంటున్న నల్ల మట్టి కుండలు,దాకలు,పాలుకాచుకునే కుండలు బోలెడన్ని కొనుక్కొచ్చుకున్నాను.నా నేస్తం గీతని కూడా నాతో రమ్మన్నాను కాని తనకి  కుదరలేదు.అయినా ఉన్న పళంగా బయలుదేరడానికి అందరూ నాలాగా
కాళ్ళల్లో చక్రాలు కట్టుకుని కూర్చోరు కదా.
తన కోసం కూడా ఓ సెట్ నల్ల కుండలు కొన్నా.
నల్ల మట్టి దాకలో చేపల కూర వండాలి.పొయ్యి మీద కాదు లెండి.
అదెలా వండాలో తర్వాత చెబుతాలెండి.
ఆ  అన్నట్టు మరిచా దర్గా దగ్గర  వేటలు తెగుతున్నాయ్.ఘుమ ఘుమ లాడుతూ ఉడుకుతున్నాయ్.
ఏదైనా టెంట్లో దూరి పోయి భోజనానికి కూర్చుందామా అనిపించింది కానీ పొయ్యిమీద డేగిశాలు మూడు,నాలుగింటిక్కానీ దిగవట.
లాభం లేదనికుని,కుండల్ని కార్ లో వేసుకుకుని  నగరం వేపు పయనమాయ్యం. రెండున్నరకంతా ఇంట్లో ఉన్నాం.
ఓ సండే రోజు ఉత్సాహంగా గడపాలంటే జహంగీర్ దర్గా కి వెళ్ళొచ్చు.

Thursday, October 27, 2011

తలకోనలో తకిట తకిట తందానా

తలకోన జలపాతంలో జలకాలాడాకా
ఆ అడవిలో ఎత్తైన చెట్లకి కట్టిన వంతెన మీద చిందేసినప్పటి చిత్రం

Tuesday, October 25, 2011

బంతి పూలతో దీపావళి శుభాకాంక్షలు.


మితృలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఈ బంతి పూలు మా గార్డెన్ లో పూసినవి.
 ఉదయం ఓ గంప నిండా కోసి ఈ శుభాకాంక్షలు  రాసి ఫోటో తీసాకా అందరికీ పంచేసాను.
మీ కోసం ఈ ఫోటో.

Monday, October 24, 2011

ఉత్తరం ఉత్త కాయితమేనా???


ఈ మధ్య ‘హిందూ’, న్యూస్‌ పేపర్‌లో ప్రతీ ఆదివారం ప్రచురించే ‘ఒపెన్‌పేజీ’లో ఉత్తరాల మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది.

ఉత్తరాల ప్రేమికురాలిగా నేను ఆ చర్చనంతా చదివాను. మ్యూజియమ్‌లో వస్తువులాగా మారిపోయిన ఉత్తరం గురించి బాధపడుతూ ఒకాయన చాలామంచి వ్యాసం రాసారు. ఆయన్ని సమర్ధిస్త్తూ బోలెడన్ని వ్యాసాలు, ఉత్తరాలు ఎడిటర్‌కి వచ్చాయి. వాటన్నింటిని చదువుతుంటే చాలా సంతోషమన్పించింది. నాలాంటి ఉత్తరాల పిచ్చివాళ్ళు ఇంకా చాలామందే వున్నారని సంబరమన్పించింది.
ఉత్తరం ఉత్త కాయితమేనా? కార్డు, ఇన్‌లాండ్‌ కవర్‌, ఎన్వలప్‌ ఈ మూడు సమాచార వాహికలు, ఈ సమాచారాన్ని మోసుకొచ్చే పోస్ట్‌మేన్‌/ వుమెన్‌ మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ప్రభావం చూపి వుంటాయి. బహుశ ఈ తరానికి చెందిన వాళ్ళకి ఉత్తరంతో అంత గాఢమైన అనుబంధం ఉండకపోవచ్చు. చిట్టి పొట్టి ఉత్తరాల, ఇ మెయిళ్ళ యుగమిది. వాళ్ళ కమ్యూనికేషన్‌ అంతా ఎలక్ట్రానిక్‌ వస్తువులద్వారానే. పోస్ట్‌మేన్‌/వుమెన్‌ వాళ్ళకేమీ కాడు. పోస్ట్‌మేన్‌/వుమెన్‌ కోసం ఎదురు చూడడటమంటే ఏంటో కూడా వాళ్ళకి అనుభవం కాదు. ఉత్తరం రాయడం, డబ్బాలో వేయడం, అవతలి వాళ్ళు అందుకోవడం, తిరిగి సమాధానం రాయడం. ఈ మొత్తం ప్రాసెస్‌లో వున్న ఏకాంతం, ఎదురుచూపు, ఉద్వేగం, సంతోషం, దు:ఖం- ఈ నవీన నాగరికులకి ఎప్పటికీ అనుభవంలోకి రాదు. ఆ అనుభూతి కావాలని కూడా వాళ్ళు కోరుకోవడం లేదు. నిజానికి  వాళ్ళ దృష్టిలో అదో టైమ్‌ వేస్ట్‌. ‘సెండ్‌’ బటన్‌ నొక్కగానే, కాంతి వేగంతో సమాచారం వెళ్ళిపోతుంటే ‘మీరేంటండి ఉత్తరాలు అంటూ ఊదరకొడుతున్నారు’ అంటారు. వేగం వేగం వేగం అన్నింటా వేగమే రాజ్యమేలుతున్న చోట నాలుగైదు రోజులగ్గాని అందని ఉత్తరం ఎవరిక్కావాలి?
నాకు ఇప్పటికీ ఉత్తరాలంటే వెర్రిప్రేమ. ఉత్తరం  రాయడమంటే ఎంతో ఉత్సాహం. నా ఆత్మీయ మితృలందరికీ కట్టలు కట్టలుగా రాస్తూనే వుంటాను. వాళ్ళందరి దగ్గరా నేను రాసిన ఉత్తరాల ఫై¦ళ్ళున్నాయి. స్నేహం చిగురించిన రోజున మొదలైన ఉత్తరాల ప్రవాహం- ఆ  స్నేహం మారాకు తొడిగి, పుష్పించి, ఫలించిన వైనాలు, కలిసి తిరిగిన ప్రాంతాలు, కలబోసుకున్న కబుర్లు, కలత చెందిన సందర్భాలు అన్నీ ఉత్తరాల్లో ప్రతిఫలిస్తాయి. రచయిత్రులతో చేసిన సాహితీ ప్రయాణాల సందర్భంలో రాసిన ఉత్తరాలు చాలానే వున్నాయి. సమాధానాలు రావడం మాత్రం అరుదే. అయినా నేను రాస్తూనే వుంటాను.
ఏకాంతంగా కూర్చుని ఉత్తరం రాయడం ఎంత హాయిగా వుంటుందో!!! ఉత్తరాన్ని అందుకోబోయే వ్యక్తి గురించిన ఊహాలు, చెప్పాలనుకున్న ఊసులు అక్షరీకరించిడంలో ఎంత ఆత్మీయత వొలుకుతుందో. ఉత్తరం రాస్తేనే అర్థŠమౌతుంది. వేళ్ళ కొసల్లోంచి వాక్యం తర్వాత వాక్యం జాలువారడం ఎంత మనోహరంగా వుంటుందో వర్ణించలేను.
దిగులు మంచమెక్కి ముడుచుకుని పడుకున్న ఓ మధ్యాహ్నం వేళ ఓ నీలిరంగు ఉత్తరం రెక్కలు కట్టుకొచ్చి నీ ఇంటి కిటికీలోంచి లోపలికి ఎగిరొచ్చి పడితే, ఆ  ఉత్తరాన్ని నీ ప్రాణనేస్తమో, ఊరిలో వున్న అమ్మో, నాన్నో, మేనత్తో, మేనబావో ఎవరో ఒకరు నీ అత్మీయులు అక్షరాల్లో  నిన్ను పలకరిస్తే నీ దిగులు, దు:ఖం పలాయనం చిత్తగించవా? అక్షరాల వెంబడి నీ కళ్ళు పరుగులు తియ్యవా?
ఉత్తరం రాసేవాళ్ళకి, ఉత్తరంలో తమని తాము ఆవిష్కరించుకునే వాళ్ళకి వొత్తిళ్ళుంటాయంటే నేను నమ్మను. ఉత్తరం రాయాలంటే తన లోపలికి తాను చూసుకోవాలి. చీకటి కోణాల మీద వెలుతురు ఫోకస్‌ చేసుకోవాలి. ఉప్పొంగే సంతోషాన్ని, ఉరకలెత్తే ఉత్సాహాన్నే కాదు గుండెను పిండుతున్న దు:ఖాన్ని, మనసుకు పట్టిన ముసురుని అక్షరాల్లో అనువదించేదే ఉత్తరం. తనలోని   ఉద్వేగాన్ని, ఉన్మత్తపు ఆలోచనలని ఉత్తరం లోకి వొంపేసాకా ఇంకెక్కడి స్ట్రెస్‌? ఇంకెక్కడి టెన్షన్‌. ఉదయం లేచిందగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ”వొత్తిడి” జపం చేసే ఈ తరానికి ఉత్తరం రాయడం ఎంతటి ఉల్లాసకరమైన అనుభవమో చెప్పినా అర్థం కాదు. ఈ నాటి వొత్తిళ్ళని జయించగలిగేది ఉత్తరమే! కాదనగలరా ఎవరైనా?
‘ఐయామ్‌ ఎ స్ట్రెస్‌ ఫ్రీ బర్డ్‌’  అని నన్ను నేను నూటికి నూరుపాళ్ళు నిర్వచించుకోవడానికి, ఉత్తరం ఒక కారణమైతే నేను చేసే పనిని ప్రేమించడం, నా చుట్టూ అల్లుకున్న స్నేహాలు మరో కారణం. స్నేహంలో ఉత్తరం ఓ ముఖ్య భాగం. స్నేహాన్ని సెలయేరులా ఉరికించేది ఉత్తరమే. ఇక ప్రేమలేఖల గురించి చెప్పేదేముంది? సమస్త వస్తు సముదాయాన్ని స్వంతం చేసుకుంటున్న ఇప్పటి యువతకి అదే జీవితమనుకుంటున్న వాళ్ళకిి ప్రేమలేఖ రాయడంలోని మాధుర్యాన్ని చెప్పినా అర్థం కాదు. అసలు వీళ్ళ దృష్టిలో ప్రేమ నిర్వచనమే మారిపోయింది. ఎన్నో భావోద్వేగాల్ని, అంతరంగ దు:ఖాల్ని, మానసికోల్లాసాల్ని మడత పెడితే ఉత్తరమౌతుంది. ఎవరికి వారు వొంటరులౌతున్న ఈనాటి సందర్భంలో  తోటి మనిషితో తొలకరిజల్లులాంటి సంబంధాన్ని ప్రోదిచేసే ఉత్తరం బతికి బట్టకట్టాలని ఆశించడం ఆత్యాశేనేమో!!!

Friday, October 21, 2011

ఈ గ్రామీణ స్త్రీలు అద్భుతమైన సోషల్ వర్కర్స్

ఈ ఫోటో లో ఉన్న దాదాపు వంద మంది మహిళలకు నేను రెండు రోజులుగా ట్రైనింగ్ ఇస్తున్నాను.
ఈ రోజు సాయంత్రం శిక్షణ ముగిసిన సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటో ఇది.
వీరంతా కస్తూరిబా గాంధి బాలికల  రెసిడెన్సియల్  పాఠశాలకి వారానికి ఒక సారి వెళ్ళి ఆ బాలికల బాగోగులు, వారేమైనా సమస్యల్ని
ఎదుర్కొంటున్నరా అని విచారిస్తారు.వారికి కౌన్సిలింగ్ ఇస్తారు.
వీరిని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ప్రోగ్రాం కింద నియమించింది.
వారందరికి  అడాల్సెంట్ బాలికలు ఎదుర్కునే అంశాల మీద,వారి సమస్యల మీద,బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్ మీద   రెండు రోజుల శిక్షణ నివ్వడడం జరిగింది. 

Wednesday, October 19, 2011

ఈ ఆడపిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటేసిందో!!!


నిన్న నేను నా ఫ్రెండ్ గీత కలసి పాలమాకుల లో ఉన్న కస్తూరిబా గాంధి బాలికల పాఠశాల సందర్శించాము.
నాలుగు గంటలు వాళ్ళతో గడిపాము. ఎన్నో అంశాలను వాళ్ళతో చర్చించాము.
వాళ్ళంతా గిరిజన బాలికలు.చక్కగా చదువుకుంటున్నారు.
మేము మాట్లాడిన పిల్లలు పదో తరగతి చదువుతున్నారు.
ఆడపిల్లల్ని ఇలా రెసిడెన్సియల్  స్కూళ్ళల్లో ఉంచి ప్రభుత్వం చదివిస్తే ఎంత బావుంటుంది అనిపించింది వాళ్ళ మాటలు విన్నాక.

Saturday, October 15, 2011

తారామండల పూల వనంలో తనివితీరా.....






యమ రష్ గా ఉండే లుంబిని వనం పక్కనుండే(పార్కింగ్ ప్లేస్ )తారామండల పూల వనం.
ఆకాశ మల్లెలని తారామండల పూలంటారని నాకు ఇటీవలే తెలిసింది.మా ఊర్లో అయితే కారప్పూలని(కారం వాసనేస్తాయి కదా)కాడమల్లెపూలని అంటారు.
సరే.శనివారం చల్లటి మబ్బులు పట్టి,చిరుజల్లులు కురిసే వేళ మేమిద్దరం (గీత, నేను)తారామండల పూల వనంలో ప్రవేశించాం.
ఎవరి కళాత్మక హృదయ స్పందనో కానీ బోలెడన్ని కాడమల్లి పూల చెట్లు నాటి,వాటి చుట్టూ చక్కగా రచ్చబండలు కట్టించారు.
మేము ప్రతి సంవత్సరం ఈ తోటలోకి వెళతాము.
హాయిగా ఓ రచ్చబండ మీద కూర్చుంటే ఆయాచితంగా,ఎంతో ఆత్మీయంగా మీ మీద ఆకాశమల్లెల జడివాన కురుస్తుంది.సువాసనలు వెదజల్లుతూ అలా మన మీద పూలు కురుస్తుంటే,పక్కన ప్రియ నేస్తం కబుర్లు చెబుతుంటే ఓహ్!అదెంత అద్భుతమైన అనుభవమో,ఒక్క సారి ఆ చెట్లకింద కూర్చుంటేనే అర్ధమౌతుంది.మేము బోలెడన్ని పూవులేరి,మాలలల్లిమెళ్ళో వేసుకున్నాం.తనివి తీరా పూలతో కబుర్లాడి,మా మీద రాలుతున్న పూలకి బై చెప్పి బయటకొచ్చాం.

Thursday, October 13, 2011

ఈ రోజు అబ్బూరి చాయాదేవి గారి పుట్టిన రోజు

 



ఈ రోజు ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమి అవార్డు  గ్రహీత అబ్బూరి చాయా దేవి గారి పుట్టిన రోజు.
నేను ఆవిడ కోసం తయారు చేసిన మని ప్లాంట్ ఆకు బుకే.
భూమిక ఆఫీసులో  రచయిత్రులంతా కలిసి చాయాదేవి గారి పుట్టిన రోజును ఘనంగా,సంతోషంగా సెలబ్రేట్ చేసారు.
చాయా దేవి గారు అందరికీ ఎంతో ఆత్మీయులు.అందరం ఈ రోజు ఆవిడతో కలసి లంచ్ చేసి సాయంత్రం వరకు ఆవిడతో గడిపాం.

Sunday, October 9, 2011

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం













మొన్ననే కదా అమర్ నాధ్ కి వెళ్ళొచ్చాను.
ఇంత వెంటనే మళ్ళీ హిమాలయాల్లోకి వెళతాననుకోలేదు కానీ వెళ్ళొచ్చేసాను.
అమర్ నాధ్ లో సింధు ఆవహిస్తే ఈ ప్రయాణంలో గంగమ్మ ముంచెత్తింది.
ఓకటా రెండా ఎన్నెన్ని నదుల్ని కలుపుకుంటూ గంగ ప్రవహిస్తుందో దాదాపు ఆ అన్ని ప్రదేశాల్ని ఓ ఐదు రోజులు సుడిగాలిలా చుట్టేసి వచ్చాను.బద్రీనాధ్ లో అలకనందని ,కేదార్నాధ్ లో మందాకినినీ,
రుద్రప్రయాగలో మందాకిని,అలకనంద సంగమాన్ని,
దేవప్రయాగలో అలకనంద,భద్రావతి నదుల సంగమాన్ని,
దేవప్రయాగ నుండి అఖండ గంగ  రిషీకేశ్ ,హరిద్వార్ మీదుగా వారణాశి కి పయనమవ్వడం
అన్నింటినీ హాయిగా చూసేసి వచ్చాను.
ఓ రోజంతా అలకనంద తో చెట్టాపట్టాలేసుకుని బద్రీనాధ్ కి వెళ్ళడం,
మర్రోజు మందాకిని తో మనసు పెనవేసుకుకి కేదార్నాధ్ కి వెళ్ళడం
ఓ గొప్ప అనుభవం.
గంగ చుట్టూ అల్లుకున్న హిమవత్ శిఖరాలు,
కాదు కాదు గంగమ్మని సృష్టించిన హిమాలయాల మహోత్తుంగ శిఖర సముదాయాలు
నాకు ఇంకేం కావాలి?
నదులూ, మంచు కమ్మిన మహా పర్వతాలూ,పచ్చటి అడవులూ......వాటి పక్కనే ఐదు రోజుల మా ప్రయాణం  
బతుకు ధన్యమైన   సందర్భం.
మీ కోసం కొన్ని ఫోటోలు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...