తారామండల పూల వనంలో తనివితీరా.....

చాలా రోజులుగా గీత నేను కలిసి ఓ రోజంతా హాయిగా గడపాలని ప్లాన్ చేస్తున్నాం.
మేము కలిసి గడపడమంటే సినిమాలకో,షాపింగులకో తిరగడం కాదు.
భూతాల్లాంటి బడా మాల్స్ కెళ్ళి అడ్డమైన చెత్త కొనుక్కోవడం కాదు.
మా ఇద్దరికీ ఇష్టమైన కొన్ని ప్రాంతాలు మేమే కనిపెట్టుకున్నవి,జనాలు ఎక్కువగా తిరగని ప్రశాంతమైన ప్రదేశాలు కొన్ని వెతికి పట్టుకున్నాం.
ఒకటి రామంతాపూర్లోని సంపెంగ వనం.
ఇంకోటి యమ రష్ గా ఉండే లుంబిని వనం పక్కనుండే(పార్కింగ్ ప్లేస్ )తారామండల పూల వనం.
ఆకాశ మల్లెలని తారామండల పూలంటారని నాకు ఇటీవలే తెలిసింది.మా ఊర్లో అయితే కారప్పూలని(కారం వాసనేస్తాయి కదా)కాడమల్లెపూలని అంటారు.
సరే.శనివారం చల్లటి మబ్బులు పట్టి,చిరుజల్లులు కురిసే వేళ మేమిద్దరం తారామండల పూల వనంలో ప్రవేశించాం.
ఎవరి కళాత్మక హృదయ స్పందనో కానీ బోలెడన్ని కాడమల్లి పూల చెట్లు నాటి,వాటి చుట్టూ చక్కగా రచ్చబండలు కట్టించారు.
మేము ప్రతి సంవత్సరం ఈ తోటలోకి వెళతాము.
హాయిగా ఓ రచ్చబండ మీద కూర్చుంటే ఆయాచితంగా,ఎంతో ఆత్మీయంగా మీ మీద ఆకాశమల్లెల జడివాన కురుస్తుంది.సువాసనలు వెదజల్లుతూ అలా మన మీద పూలు కురుస్తుంటే,పక్కన ప్రియ నేస్తం కబుర్లు చెబుతుంటే ఓహ్!అదెంత అద్భుతమైన అనుభవమో,ఒక్క సారి ఆ చెట్లకింద కూర్చుంటేనే అర్ధమౌతుంది.


మేము బోలెడన్ని పూవులేరి,మాలలల్లిమెళ్ళో వేసుకున్నాం.తనివి తీరా పూలతో కబుర్లాడి,మా మీద రాలుతున్న పూలకి బై చెప్పి బయటకొచ్చాం.
హిమాయత్ నగర్ లోని మినర్వా కాఫీ షాప్ పక్కనుండే నాగమల్లి చెట్టు దగ్గరకెళ్ళాం కానీపూలు దొరకలేదు.
ఆ తర్వాత సికింద్రాబాద్ పొయ్యాం.
సికింద్రాబాద్ కీస్ హై స్కూల్ పక్కనున్న స్పెషల్ చాయ్ దుఖాణం బ్లూ సీ లో వేడి వేడి చాయ్ తాగి,ఇందిరా పార్క్లోని మొగలి వనం చూడ్డానికి పయనమయ్యాం.
అప్పటికే చీకటి పడుతూండడం వల్ల మొగలి పూలను సంపాదించలేకపోయాం కాని కొంత సేపు మొగలి పొదలచుట్టూ చక్కర్లేసాం.పొదల్లోంచి మొగలి సువాసనలు వస్తున్నాయి కానీ కోసే వాళ్ళు ఎవరూలేరు.
అక్కడి నుండి తిన్నగా గీతా వాళ్ళింటికెళ్ళాం.
రాత్రికి నేనక్కడే ఉండిపోయా.గీత కూతురు బబ్బి కూడా మాతో కలిసింది.
రాత్రి చాలా పొద్దుపోయేవరకు నా లాప్టాప్ లోని చిమట వెబ్ సైట్ నుంచి పాత సినిమాపాటలు వింటూ కూర్చున్నాం.
తెల్లారాక గీతా వాళ్ళ గార్డెన్లో పని చేస్తుంటే పక్కింట్లో ఏపుగా ఎదిగిన తోటకూర మొక్క కనబడింది.నేను అమాంతంగా పక్కింట్లో చొరబడి తోటకూర కాడ పీక్కొచ్చేసా.
అదెందుకూ అంది గీత.నీకు తోటకూర కాడ రొయ్యల కాంబినేషంతో కూర చేసి పెడతానోయ్ అంటే,నువ్వు కూర చేస్తే తిన్నట్టే అన్నట్టు చూసింది.
నేను కూర చెయ్యడం, ఆహా భలేగా ఉందే అంటూ తను వాళ్ళ హస్బెండ్ తినడం చూసావా నేను కూర చెయ్యలేననుకున్నావా అంటూ కళ్ళెగరేయడం,గొప్ప మజా వచ్చిందనుకోండి.
తిన్నాకా మళ్ళి మేమిద్దరం రోడ్డెక్కాం.మలక్ పేటలో నర్సరీల వేపు వెళ్ళాం.
 నేను ఇటీవల ఇంటికి తెచ్చుకున్న కుండీలో విరగబూసే హైబ్రిడ్ సంపెంగ మొక్క కోసం వెతికి నా నేస్తానికి ఓ మొక్కని కానుకగా కొనిచ్చి నేను మా ఇంటి వేపు కారు తిప్పాను.
కొన్ని గంటల్ని నాకోసం, కేవలం నాకోసం కేటాయించుకుని ఇలా గడపడం నాకు చాలా ఇష్టం.ఇలా గడిపాక నా పనులన్నింటినీ ఎంతో ప్రేమగా,హాయిగా,ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకుంటాను.గీత లాంటి నేస్తం ఉంటేనే ఇలా గడపడం సాధ్యమౌతుంది.
మా పరిచయమై పన్నెండేళ్ళు గడిచినా మా స్నేహం నిత్య నూతనంగా,ఫ్రెష్ గా ఉండడానికి ఇదే కారణం.

Comments

Jaabili said…
miku unnatle naku kuda oka nestam undandi. ala undatam enta invaluable gift kada.. miru cheppe places note chesukuntunnanu. eppudanna hyd vaste vatiki vellachu ani.
ఇందు said…
nice.ila jeevitam lo konchem time manakantu unte ento hayiga gadichipotundi.
Krishnapriya said…
చాలా బాగుంది. ఈ సారి మీరు చెప్పిన పూదోట లోకి మేమూ ప్లాన్ చేసుకుంటాం.
నేనూ, మా స్నేహితురాలూ ఇలా ఎప్పుడో కాలేజ్ రోజుల్లో గడిపేవాళ్ళమేమో,.. తర్వాత ఎప్పుడూ లేదు :(
ఈ లింక్ తనకి పంపిస్తాను..
బాగుంది మీ విహారం...అలా మన కోసం మనం గడపగలగటం నిజంగా ఓ వరమే!

తారామండల పూలు..బాగుంది పేరు. మేము వీటిని పున్నాగ పూలు అంటాం. నిన్ననే మా కాలనిలో చెట్ల కింద పరుచుకున్న ఈ పూలని చూసి చిన్నప్పుడు వాటితో అల్లుకున్న జడలు హారాలు గుర్తుకొచ్చాయి..మీరు మళ్లీ అల్లేసుకున్నారుగా! వీటి వాసన కూడా చాలా బాగుంటుంది. కాడలనుండి తేనె పీల్చటం..రేకులతో బుడగలు చెయ్యటం..అబ్బా మళ్ళీ పిల్లలమయిపోతే ఎంత బాగుంటుందీ!
సుజాత said…
మీతో పాటూ నేనూ తిరిగిన ఫీలింగ్ వచ్చింది. అదిసరే, మలక్ పేట వెళ్ళి తాళ జాతి వృక్ష వనం చూడకుండా వచ్చారా? అక్కడ తాటి, కొబ్బరి,ఈత,పామ్, ఖర్జూరం,పోక ఇలా అన్నీ ఒకేజాతి వృక్షాలతో ఏర్పాటు చేసిన పెద్ద తోట ఉంది. ఉద్యానవన శాఖ నిర్వహణలో!

మొగలి ని నేను మా ఇంట్లో కుండీలో పెంచుతున్నా! రోజూ పొద్దున్నే చూస్తాను, పువ్వువస్తోందా లేదా అని! :-(

ఈ పున్నాగ పూల వాసన గాల్లో తేలి వస్తుంటే బావుంటుంది గానీ దగ్గరనుంచి భరించలేం! నాకతిఏ తలనొప్పి వస్తుంది. చూడ్డానికి మాత్రం ఎంతో అందంగా ఉంటాయి.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం