రుచిక కేసు - రేపుతున్న ప్రశ్నలు

ఒక జెసికాలాల్‌, ఒక అరుషి, ఒక స్వప్నిక, ఒక రుచిక. ఎవరు వీళ్ళంతా? ఏం జరిగింది వీళ్ళకి. ఈ సంవత్సరాంతాన ఎందుకు వీళ్ళను తలుచుకోవలసి వస్తోంది. వీళ్ళంతా ఎందుకు అర్ధాంతరంగా చనిపోయారు? చనిపోలేదు. చంపేయబడ్డారు. కళ్ళ ముందు వరుస క్రమంలో నిలబడి నన్నెందుకు ఇంతటి మానసిక క్షోభకి, ఆపుకోలేని దు:ఖానికి గురి చేస్తున్నారు. అదుపు చేసుకోలేని కోపంతో నా కలం కూడా వొణుకుతోంది. ఏం తప్పు చేసారని వాళ్ళు మరణం అంచులవేపు నెట్టేయబడ్డారు. ఈ దేశంలో ఆడదానిగానో, ఆడపిల్లగానో పుట్టడమే వాళ్ళ నేరమా? ఇంకా ఎంతమందిని ఇలా చంపేస్తారు? చంపేసిన వాళ్ళని శిక్షించరా? శిక్షలు పడవని తెలిసేకదా చంపేస్తున్నారు.
నేను ఢిల్లీలోని కుతుబ్‌ హోటల్‌ రూమలో టి.వీ ముందు కూర్చుని, ఆనాటి సమావేశపు బడలిక నుండి సేద తీరుతున్నవేళ రుచిక కేసుకు సంబంధించిన తీర్పు గురించిన వార్తను చూసాను. పద్నాలుగు సంవత్సరాల పసిపిల్ల రుచిక లైంగిక అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 19 సంవత్సరాల తర్వాత వెలువడిన తీర్పు గురించిన వార్తను చూసాక నా గుండె ఒక్కసారిగా జలదరించినట్టయింది. నిందితుడు, అప్పటి హర్యానా ఐజి ఎస్‌.పి.ఎస్‌్‌. రాధోడ్‌ నవ్విన నవ్వు, వెకిలి, విషపు నవ్వు నా కళ్ళల్లోంచి కదలడం లేదు. భారతదేశ న్యాయవ్యవస్థ భాగోతం మీద రాధోడ్‌ ధిక్కార, నిర్లక్ష్యనవ్వు. నన్నెవరేం చెయ్యలేరు అనే పొగరుబోతు నవ్వు. పసిపిల్ల మీద దున్నపోతులా లైంగిక వేధింపులకు పాల్పడిన రాధోడ్‌, దున్నపోతు మీద వాన కురిసినట్టే న్యాయవ్యవస్థ ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళి పోయాడు. కేవలం ఆరునెలల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా. ఘనత వహించిన కోర్టువారు వెంటనే ఉదారంగా బెయిల్‌ కూడా మంజూరు చేసేసారు. పై కోర్టులో అప్పీల్‌ చేస్తానంటూ దున్నపోతు కోర్టు నుండి జారిపోయింది.
ఈ ఉదంతం మనిషన్న వాడిని మండించకుండా వుంటుందా? తన ప్రాణ స్నేహితురాలి తరఫున ఇరవై సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న ఆరాధన దు:ఖాన్ని ఎవరు అర్ధం చేసుకుంటారు? ఎవరు ఓదార్చుతారు? స్త్రీలమీద పదే పదే జరుగుతున్న ప్రాణాంతక దాడులు, లైంగిక అత్యాచారాలు, యాసిడ్‌ పొయ్యడాలు పెచ్చరిల్లి పోతూనే వున్నాయి. నిందితులు రాజకీయ అండబలంతో, డబ్బు కండకావరంతో, ఏళ్ళు పూళ్ళూ సాగే న్యాయవిచారణా వ్యవస్థ, అవినీతిలో మునిగితేలే పోలీసు వ్యవస్థల వల్ల చట్టం నుండి సునాయాసంగా తప్పించుకుపోతున్నారు. శిక్షించని న్యాయవ్యవస్థ వల్ల అత్యాచారాలకు గురౌతున్న స్త్రీలు తామే అంతమౌతున్నారు తప్ప నిందితులు కాలరెగరేసి, వెకిలి నవ్వులు నవ్వుతూ సభ్య సమాజంలో మిన్నాగుల్లా తిరుగతూనే వున్నారు మళ్ళీ మళ్ళీ కాటేేస్తూనే వున్నారు.
1990 ఆగష్టు పన్నెండు. కోటి ఆశలతో టెన్నిస్‌ తారనవ్వాలనే బలమైన ఆకాంక్షలతో అప్పటి హర్యానా ఐజి మరియు హర్యానా లాన్‌ టెన్సిస్‌ అధ్యక్షుడు రాధోడ్‌ ఆఫీసులో అడుగుపెట్టింది రుచిక. తన ఫ్రెండ్‌ ఆరాధనని వెంట తీసుకెళ్ళింది. ఆరాధనని బయటకు పంపి 14 సంవత్సరాల రుచికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు రాధోడ్‌. తిరిగి వచ్చిన ఆరాధనకి జరిగిన ఘోరాన్ని చెప్పింది రుచిక. ఆగష్టు 18న పోలీసులకు ఫిర్యాదు చేసారు రుచిక తండ్రి, సోదరుడు. రుచిక స్వదస్తూరితో జరిగిన ఘోరాన్ని రాసిచ్చింది. పోలీసులు కంప్లయింట్‌ రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేసి రాధోడ్‌ మీద నేరాన్ని ధృవీకరించారు. అప్పటి నుండి రుచిక కుటుంబం తీవ్రమైన వేధింపులకి గురౌతూ వచ్చింది. బెదిరింపులు రావడం, రుచిక ఎక్కడికెళ్ళితే అక్కడికి రాధోడ్‌ గుండాలు వెంటాడం, రుచిక సోదరుడి మీద కారు దొంగతనాలు అంటగట్టి అరెస్ట్‌ చేయడంలాంటి వికృత చర్యలకి రాధోడ్‌ పాల్పడడం మొదలుపెట్టాడు. ఒకసారి రుచిక సోదరుడిని ఆమె ముందే తీవ్రంగా కొట్టి వేధించాడు. రుచికని స్కూల్‌ నుండి తీసేసారు. పద్నాలుగు సంవత్సరాల రుచిక ఈ మానసిక వేదనని, వొత్తిడిని తట్టుకోలేక రాధోడ్‌ని తిడుతూ తన జీవితాన్ని నాశనం చేసాడని బిగ్గరగా ఏడ్చేదని తండ్రి చెప్పారు. తనెంత నచ్చ చెప్పినా, ఓదార్చినా వినేది కాదని కళ్ళనీళ్ళ మధ్య పత్రికల ముందు వాపోయాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి లోనై డిశంబరు 29, 93లో రుచిక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆరాధన, ఆమె తండ్రి కలిసి రుచిక ఆత్మహత్యకు కారకుడు రాధోడ్‌ అంటూ కేసు వేసారు. క్రింది కోర్టు ఈ వాదనని అంగీకరించినప్పటికీ హైకోర్టు అతను నిర్ధోషి అని కితాబిచ్చి వదిలేయడం, ప్రభుత్వం రాధోడ్‌కి డి.జిపిగా ప్రమోషన్‌ ఇవ్వడం జరిగిపోయాయి.
ఆరాధన తన పోరాటం ఆపలేదు. 1990 కేసు రిజిస్టరు అయినప్పటికీ 1999 వరకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ కాలేదు. రాధోడ్‌ తన రాజకీయ, పోలీసు ప్రాబల్యాన్ని ఉపయోగించి కేసును ముందుకెళ్ళకుండా చెయ్యడంతో పాటు రుచిక కుటుంబాన్ని చంఢీగడ్‌లో బతకలేని స్థితి కల్పించాడు. డి.జి.పిగా తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించడంవల్ల వారు చంఢీగడ్‌ నుంచి వెళ్ళిపోయారు. వారి తరఫున, తన స్నేహితురాలి కోసం ఆరాధన ఇరవై సంవత్సరాలు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు డిశంబరు 21, 2009న చిన్నపాటి విజయం సాధించింది. రాధోడ్‌కి కేవలం 6 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది కోర్టు.
నేరం జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత, బాధితురాలు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెకి దొరికిన న్యాయం చూసి గుండెలు బాదుకుని ఏడ్వాలో, పగలబడి నవ్వాలో తెలియడం లేదు. నేరగాడికి సంబంధించి, అతడిని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన రాజకీయ వ్యవస్థ విశ్వరూపం దిమ్మతిరిగేలా చేస్తోంది. నలుగురు ముఖ్యమంత్రులు ఈ నేరస్థుణ్ణి కాపాడుకుంటూ వచ్చిన వైనం కథలు, కథగా, వార్తాపత్రికలు ప్రచురిస్తున్న కధనాలు చదువుతుంటే, ఎంతమందిని ఎన్ని రకాలు ప్రలోభపెట్టి, బెదిరించి తన నేరాన్ని కప్పిపుచ్చుకున్న పెద్ద పోలీస్‌ రాధోడ్‌ కౄరమైన, వెక్కిరింత నవ్వు వెన్నులో వొణుకు పుట్టిస్తోంది. స్త్రీల మీద అత్యాచారాలు చేసి, కిరోసిన్‌ పోసి కాల్చి, యాసిడ్‌ పోసి రూపాలను చిదిమేసి, ఎన్నో దారుణాలు చేసే పురుషుల్ని, నేరస్థుల్ని, నిందితుల్ని, పురుషాధిక్య సమాజం ఎలా కాపాడుకుంటూ వస్తుందో ‘రుచిక’ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల్లోను పాతుకుపోయిన పితృస్వామ్యం స్త్రీలను ఎన్ని రకాలుగా రాచిరంపాన పెడుతుందో ఈ కేసులో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని నేరాలు చేసినా, కమ్ముకుంటూ, కాపాడుకుంటూ వచ్చే పోలీస్‌, పరిపాలన, న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు వున్నపుడు రుచికలాంటి పసికూనలు రాధోడ్‌లాంటి రాక్షస పదఘట్టనల కింద నలిగిపోక ఏమైతారు? రాధోడ్‌ కౄరనవ్వుకి అర్ధం ఇదే.
మరి మనమేం చెయ్యాలి? నిరాశలో కూరుకుపోదామా? నిట్టూర్చి వదిలేద్దామా? ఈ దేశంలో 50 కోట్ల మంది స్త్రీలకి గౌరవంగా, భద్రంగా, హింసారహితంగా బతికేహక్కు వుందని ఎలుగెత్తాల్సిన అవసరం, ఆవశ్యకత మరింత ఎక్కువైందని అర్ధం చేసుకుందామా? రాధోడ్‌ పురుషులందరికి ప్రతినిధి కాడు. పురుష ప్రపంచమా! పెదవి విప్పండి. మాతో గొంతు కలపండి. పోయేదేమీ లేదు. సమానత్వం వెల్లివిరియడం తప్ప.

Comments

webtelugu said…
WEBTELUGU.COM the Telugu topsites directory
==========================================

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site here www.webtelugu.com
Indian Minerva said…
అన్ని సాక్ష్యాలు పక్కాగా వున్న తీవ్రవాద దాడులకేసునే సంవత్సరానికి పైగా విచారించిన ఘనత మనకుంది. ఆ విధంగా ఇది పెద్ద వింతకానక్కరలేదు అదీ పెద్దల అండదండలున్నాయనుకుంటే . ఈ విషయంలో హీరో ఎవరంటే ఆ ఆరాధన అనే అమ్మాయి. తన స్నేహితురాలి జీవితాన్ని నాశనంచేసిన ఇలాంటి గాడిదకు వ్యతిరేకంగా ఇన్నేళ్ళపాటూ పోరాడుతున్నందుకు తనకు జోహార్లు.

కోర్టు నేరనిరూపణ ఐన సందర్భాల్లోనూ ఈ ఆరునెలల-వెయ్యిరూపాయల శిక్షలు వెయ్యటం దారుణం. ఇలాంటివాళ్లను చిత్రహింసలు పెట్టి "ఇంతకంటే మరణమే మెరుగురా భగవంతుడా" అనుకునే పరిస్థితుల్లో 'బ్రతకనివ్వాలీ'.
మనలాంటి స్తబ్దమైన ప్రజాస్వామ్యం, మన్నుతిన్న పాములా పడిఉండే న్యాయస్థానాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో! లాంగ్ హాండ్స్ ఆఫ్ అవర్ లా అని రొమ్ము విరుచుకొని చెప్పుకుంటాం. ఎంతటి లాంగ్ హాండంటే, ఫలానా వెధవ నిందితుడని నిర్ధారించటానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. వాడికి ఆర్నెల్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టింది. దీనికి కారకులైన ప్రతి పోలీసువాడిని, ప్రతి న్యాయవాదిని, న్యాయమూర్తులను కూడా చట్టం శిక్షించాలి.

పధ్నాలుగేళ్ళ వయసులో అత్యాచారానికి గురైన బాలిక ఎంత తల్లడిల్లి ఉంటుందో. తన మూలంగా కుటుంబానికి వస్తున్న కష్టాలు చూసి ఆత్మహత్య చేసుకున్నదంటే, ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుంది. ఒక ఇంజనీరుగానో, డాక్టరుగానో, టెన్నిస్ క్రీడాకారిణిగానో ఉండాల్సిన బాలిక ఆత్మహత్య చేసుకున్నదంటే "రాఠోడ్" లాంటి వెధవలే కాకుండా, వాళ్ళకి ఊతమిస్తున్న న్యాయస్థానాలు కూడా కారణమే.

సిగ్గుపడాల్సిన దౌర్భాగ్యపు ప్రజాస్వామ్యం మనది.
ఎన్నో సమస్యల కలయికకు దర్పణం ఈ కేసు. ఏది మొదట మార్చాలి ఏది తరువాత మార్చాలి అనేదానికన్నా అన్నీ సమూలంగా మార్చాలి అనేదే సరైన సమాధానం కానీ అది సాధ్యమా!
సత్యవతి గారూ, క్షమి౦చ౦డి. ఇక్కడ మీలా౦టి వారి లోప౦ చాలా కనిపిస్తో౦ది. మీ వేదననూ, అ౦కిత భావాన్నీ, నిబద్దతనూ నేను అనుమాని౦చట్లేదు, అవమాని౦చట్లేదు కానీ, మీ సమర్థత ఎ౦త? మీ మనస్సు నొప్పిస్తే క్షమి౦చ౦డి. కానీ దీన్ని చదివి మీరొక్కసారి ఆలోచి౦చగలిగితే అ౦తే చాలు.

ఏదో ఒకటి చేయగలిగిన పరిస్తితుల్లో(కనీస౦ మీ అభిరుచి, వృత్తి పర౦గా) ఉన్న మీరు ఇ౦తవరకూ దీనికోస౦ ఏ౦ చేశారు. ఇటువ౦టి ఎన్నో బాధలను మీరు వినో, చూసో ఉ౦టారు. ప్రతిసారీ ఏదో ఒక తక్షణోపాయాలతో సమస్యలను తప్పి౦చట౦తో బాటు సమస్యలకు దీర్ఘకాలిక,శాశ్వత పరిష్కారాలను ఆలోచి౦చారా?

"పోలీస్‌ రాధోడ్‌ కౄరమైన, వెక్కిరింత నవ్వు వెన్నులో వొణుకు పుట్టిస్తోంది" అ౦టూ గు౦డె జలదరి౦పును మీరే ప్రదర్శిస్తే, ఇక సామాన్యుల(పురుషుడైనా, స్త్రీ అయినా) స౦గతి ఎ౦త?
మీలా౦టి స్త్రీవాదులు, ఇటువ౦టి స౦దర్బాలలో నెపాన్ని పురుషాధిక్య సమాజ౦పై నెట్టివేసి, నాలుకు కన్నీటి చుక్కలు రాల్చేస్తే సమస్యలు పరిష్కార౦ కావు. మరో మగ మృగ౦ దీని స్పూర్తిగా మరి౦త విజృ౦భిస్తు౦ది. అ౦తె౦దుకు ఈ స౦దర్బ౦లో కాకపోయినా, అనేక స౦దర్బాలలో స్త్రీలే సాటి స్త్రీలను దారుణ౦గా హి౦సిస్తారు. కనుక, సమస్యను స్త్రీవాద కోణ౦లో కాకు౦డా, మానవతా దృక్పద౦తో పరిశీలి౦చ౦డి. కానీ ఒక స్త్రీగా, మీరు వారి సమస్యలపట్ల ఎక్కువ శ్రద్ద చూపి౦చట౦ తప్పుకాదు, కానీ స్త్రీవాద౦ పేరుతో సమాజ౦లోని ఒక బలమైన వర్గాన్ని దూరము౦చొద్దు.

ఉదాహరణకు, ఎ౦తోమ౦ది మహిళా/పురుష నేతలతో స౦భాషి౦చగలిగిన మీలా౦టి వారు, ఈ రాథోడ్ సమస్య విషయ౦లో ఎ౦త contribute చేశారు? కనీస౦ మీ పరిధిలో సానుభూతి పరులను స౦ఘటిత౦ చేసి ఆతని హోదాకు(అహానికి) భ౦గ౦ కలిగి౦చే కార్యక్రమాలకు రూపకల్పన చేయ౦డి. వాడి కుటు౦బ సభ్యులను కలుసుకొని, సమస్యను వివరి౦చి వారి అభిప్రాయాలను కనుక్కో౦డి. వాడికి వాడి తోటి వారి బహిర౦గ మద్దతునే ఉపస౦హరి౦చ౦డి. అతని పెళ్ళా౦, పిల్లలు, స్నేహితులు, సహోద్యోగులు అతన్ని(కనీస౦ బహిర౦గ౦గా) తిరస్కరిస్తే తన పరిస్తితేమిటో ఆలోచి౦చ౦డి. వాడెక్కడికెళ్ళినా వాడిని జనాలు గుర్తు పెట్టుకునేటట్లు చేయ౦డి. ఇక జన్మలో వాడు గానీ, వాడ్ని గమనిస్తున్న వారు గాని, అటువ౦టి పనులు చేయడానికి జ౦కుతారు. ఇవి ఏ మానవహక్కుల పరిధిలోకో, చట్ట అతిక్రమణ క్రి౦దకో రావు. చట్టాలు వ్యక్తులను శిక్షి౦చలేనపుడు, సమాజమే ఆ పనిని చేయాలి. చట్ట ప్రకార౦ వ్యక్తి తప్పి౦చుకోగలిగినా, సమాజ౦ ను౦చి ఇటువ౦టివారు తప్పి౦చుకోకూడదు.

ఏదో నాలుగురోజులు గొడవచేసి, మళ్లీ మరో గొడవరాగానే దాని మీదకు గె౦తి, కొన్ని రోజులకు అన్నీ మరిచిపోయేకన్నా, ఇటువ౦టి విషయాలను విడువకు౦డా అ౦తిమ ఫలిత౦ తేలేవరకూ సాధి౦చే, లేక సాధి౦చేవారికి తోడ్పడే వ్యవస్థను మీలా౦టి స౦స్థలు స౦ఘటిత౦గా ఎ౦దుకు ఏర్పాటు చేసుకోకూడదు? కొన్ని సమస్యలకు స్థానిక౦గా, రాధోడ్ లా౦టి పెద్ద తలకాయలు సృష్టి౦చే సమస్యలకు స౦ఘటిత౦గా పోరాడవచ్చు. ఉదాహరణకు రాధోడ్ కు వ్యతిరేక౦గా పోరాడుతున్న అరు౦ధతికి కావలసిన సాయమ౦ది౦చట౦, విచారణ త్వరగా ముగి౦చగలిగే సహాయ౦/ఒత్తిడి తీసుకురావడ౦ ఆమెకు ఎ౦తో ఉత్సాహాన్నిస్తు౦ది. వివిధ స్థాయిల్లో (విద్యార్థులు, వివిధ వృత్తినిపుణులు, బాధితులు, ఇతరత్రా) మేధావి బృ౦దాలను ఏర్పాటు చేసి,ఇటువ౦టి సమస్యలకు మార్గాలను అన్వేషి౦చవచ్చు.

ఇక దీర్ఘ్హకాలిక పరిష్కార౦, చిన్న పిల్లలకు లై౦గిక విద్యలా౦టి వాటికి ఉద్యమాలు చేయట౦ బదులు, సామాజిక స్పృహను కలిగి౦చే విద్యన౦ది౦చటానికి ప్రయత్ని౦చవచ్చు. కొన్ని దశాబ్దాల క్రిత౦ మనదేశ౦లో ఉన్న జనాలకు ఉన్నవి, ప్రస్తుత౦ అభివృద్ది పేరుతో పోగుట్టుకున్న మానవ స౦భ౦దాలు, సమాజ౦ పట్ల తన బాధ్యత, పర్యావరణ స్పృహ లా౦టి విద్యన౦ది౦చటానికి అన్ని విద్యావ్యవస్థలను కోరవచ్చు.. పిల్లలుగా నేర్చుకున్న నీతిని మనుషులు అ౦త సులభ౦గా మరచిపోలేరు. కనీస౦ మన తరువాతి తరమన్నా మనకన్నా మెరుగైన సమాజ౦లో జీవిస్తారు.
పెదరాయుడు గారు చెప్పినట్లుగా ఇలాంటి వాటిని స్త్రీవాద ధోరణితో కాకుండా మానవతా ధోరణితో చూడాల్సి వుంది.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం