Sunday, June 19, 2011

చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన మా నాన్న

ఈ రోజు తండ్రుల దినమట.ఇలాంటి దినం ఒకటుందని నాకు ఇంతవరకు తెలియదు.

'మనసులో మాట సుజాత' బజ్ లో రాసేవరకు తెలియదు.
తనే రాయమని కూడా అందులో కోరారు.
సరే.మా నాన్న గురించి ఎప్పుడూ రాయలేదు.
మా అమ్మ గురించి చాలా సార్లు రాసాను.
నిజానికి నేను మా నాన్న గురించి చాలా రాయాలి.
ఆయన చెయ్యి పట్టుకుని 1975 లో ఈ మహా నగరానికి వచ్చాను.
అంతర్జాతీయ మహిళా సంవత్సరం (1975) సందర్భంగా ఆడవాళ్ళకి పిలిచి ఉద్యోగాలిచ్చేస్తారని మా నాన్న నమ్మి నన్ను వెంటబెట్టుకుని హైదరాబాద్ బండెక్కేసాడు.
నా జీవితంలో పెను మార్పు కి మా నాన్న అలా బాట వేసాడు.
అది సరే. మా నాన్న పేరు చెప్పలేదు కదా!
ఆయన పేరు కొండవీటి శ్రీ రామ మూర్తి.మా అమ్మ కొండవీటి అన్నపూర్ణ.
మా నాన్న ఆరుగాలం కష్టపడే నికార్సైన రైతు.
మా తాతకి ఏడుగురు కొడుకులు.తాత కొందరు కొడుకుల్ని ప్రేమగాను,కొందరిని పని వాళ్ళుగాను చూసేవాడట. మా నాన్న పనివాడుగానే చూడబడ్డాడు.
అంటే పగలంతా పొలం పనులు, ఇంటికొస్తూ పశువులకి గడ్డి కోసుకుని,దాన్ని తలమీద మోసుకుని తేవడం,పాలుపితకడం వగైరా పనులన్నీ చేసే వాడు.పాలేర్లు కూడా ఉండే వారు.
ఒక్కోసారి మా నాన్న మిట్ట మధ్య్యాహ్నం వేళ పచ్చ గడ్డి మోసుకొచ్చి చెమటలు కక్కుతూ అలా మా వీధి అరుగు మీద పడి నిద్రపోయేవాడు.ఆయన వొంటి మీద చాలా సార్లు గోచీనే ఉండేది.
మా తాత కొడుకులకి అందరికీ కలిపి కొన్నే చొక్కాలు కుట్టేంచేవాడట.నేను మా నాన్న ఒంటి మీద చొక్కాని చాలా తక్కువ సార్లే చూసిన గుర్తు.నానా ఆదమరిచి గోచీ పోగుతో అలా వీధి అరుగు మీద పడి నిద్రపోయే దృశ్యం నాకిప్పటికీ కనిపిస్తూ ఉంటుంది.
మా నాన్న చాలా కష్ట జీవి.మా ఇంటి ఆవరణలోనే బోలెడన్ని కూరగాయలు పండించేవాడు.నేను మా నాన్నకి సహాయంగా ఉండేదాన్ని.నూతుల్లోంచి బుడ్ల జోడు(రెండు కుండలు)తో నీళ్ళు తెచ్చి పాదులకు పోసేవాళ్ళం.నాకు మా నాన్న చేసే పనులన్ని చాలా ఇష్టంగా ఉండేవి.గొడ్డలితో కట్టెలు కొట్టడం,ఆయన పశువుల కోసం చిట్టు,తవుడు కలిపేటప్పుడు నేనే కుడితి పోసేదాన్నీ.
మా నాన్న నన్ను తిట్టిన, కోప్పడిన సందర్భాలేమీ లేవనే చెప్పాలి.ఒక్క సారి మాత్రం ఆయన కోపాన్ని చూసాను.
ఒక సారి నాన్న ఆవు పాలు పితుకుతుంటే నేను దూడని పట్టుకున్నాను.దూడ సడెన్ గా నా చేతుల్లోంచి వదిలించుకుని తల్లి పొదుగులో దూరింది.నాన్న చేతిలో పాల తపేళా కిందపడిపోయింది.దాన్ని బెరించడానికి కర్ర తెమ్మంటే నేనేమో పెళుసుగా ఉన్న కర్ర తెచ్చి ఇచాను.ఆ కర్రతో కొట్టబోతే అది విరిగిపోయి ఓ కర్ర ముక్క బలంగా నాన్న చాతీని తాకింది.ఆయన పళ్ళు నూరుతూ నా మీదకోచ్చాడు గానీ నన్ను కొట్టలేదు. నాన్న నన్నెప్పుడూ కొట్టలేదు.తిట్టలేదు.
నాన్న కి నన్ను చదివించాలని చాలా కోరికగా ఉండేది.నేను చదువుకుంటానని బాగా గొడవ చేసే దాని. కానీ ఆయన ఆర్ధికంగా అస్వతంత్రుడు.పని చెYYఅడమే తప్ప పైసలు కళ్ళ చూసిన వాడు కాదు.
నాపోరు పడలేక ఒక క్రిష్టియన్ స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి తీసుకెళ్ళాడు.అయితే వాళ్ళు నేను బొట్టు,పువ్వులు పెట్టుకోకూడదని ఆంక్ష పెట్ట్టేసరికి నేను అక్కడ చదువుకోనని పెద్ద పేచీ పెట్టాను.
అప్పుడు మా నాన్న నన్ను నర్సాపురం తెసుకెళ్ళి "హిందు స్త్రీ పునర్వివాహక సహాయ సంఘం స్కూల్"అనే సంస్కృత పాఠ శాలలో జేర్పించాడు.అక్కడ సంస్కృతం తప్ప వేరే ఏమి చెప్పరు.నేను లెక్కలుగాని,సైన్స్ గాని,సొషల్ స్టడీస్ గానీ ఏమీ చదువుకోలేదు.మొత్తం అంతా సంస్కృతం మయం.
సరే ఈ చదువు సంగతి మరో సారి రాస్తాను.
మొత్తానికి మా నాన్న నాకు చదువు బిక్ష పెట్టాడు.
నన్ను ధైర్యంగా తెచ్చి మహానగరం నడిబొడ్డున వదిలి ప్రపంచాన్ని గెలుచుకోమన్నాడు.
నిన్ను నువ్వు నిరూపించుకో,ఉద్యోగం సంపాదించుకో అంటూ నన్ను మా సీతారమపురం నుంచి తీసుకొచ్చి నేను కొత్త జీవితం వేపు అడుగులేసేలా పరోక్షంగా ప్రోత్సహించినవాడు మా నాన్న.
మా నాన్న నన్ను ఆడపిల్లగానో, మొగపిల్లవాడుగానో పెంచలేదు.మనిషిగా పెంచాడు.నేను అన్ని మగ వేషాలేసేదాన్నీ. అది వేరే సంగతి.కట్టెలు కొట్టడం,చేపలు పట్టడం,చెట్లెక్కడం,ఇలాంటి పనులే నా వన్ని. అచ్చంగాయలు,గుజ్జెన గూళ్ళు,లక్కపిడతలాటలు చచ్చినా ఆడేదాన్ని కాదు.కోతికొమ్మొచ్చులు,గూటింబిళ్ళలు,గోలీకాయలు,పేకాటలు ఇవి నాకు ఇష్టమైన ఆటలు.
మా నాన్న నువ్వాడపిల్లవి,ఇలాంటి ఆటలు ఆడకూడదు అని ఏరోజూ అనలేదు.
మేము మహా రౌడిల్లాగా ఎండు సరుగుడు ఆకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టి సిగరెట్ లాగా తయారు చేసి పొగ ఊదేవాళ్ళం.
నిజానికి మేము ఆడిది ఆటా పాడింది పాట గా మా బాల్యం గడిచింది.
మా అమ్మ మా నాన్న నన్ను చెట్టు మీద స్వేచ్చగా ఎగిరే పిట్టల్లే పెంచారు.
అందుకే నా మొదటి కధల సంపుటి "ఆమె కల" వాళ్ళకి అంకితమిస్తూ"నన్ను చెట్టు మీద పిట్టల్లే పెంచిన అమ్మా నాన్నలకి అంకితం" అని రాసాను.
మా నాన్న సరైన వైద్య సౌకర్యం అందక 50 ఏళ్ళకే నాకు దూరమయ్యాడు.అప్పట్లో ఖరీదైన వైద్యం చేయించడానికి మా దగ్గర డబ్బు లేదు.
ఇప్పుడు అన్ని ఉన్నాయి కాని నాన్నే లేడు.
నాన్న జ్ఞాపకం మా ఊరులోని తోటలంత పచ్చగా నాలో మిగిలే ఉంది.
నాకు బతుకునీ,ఉనికినీ ఇచ్చిన మా నాన్నకి ఇదే నా నివాళి.

2 comments:

Tejaswi said...

బాగుందండి...మనసువిప్పి చెప్పినట్లు, నిజాయితీగా కూడా.

శుభాభినందనలు.

గీతిక B said...

ఇన్నాళ్ళూ గోదావరి గల గలల్ని చూశాను.

ఈ రోజు గోదావరి లోతుని చూస్తున్నట్టుంది...
కొంచెం భారంగా, నిర్భావంగా...

గీతిక

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...