...........................................
నబనీతా దేవసేన 'తవాంగ్' ప్రయాణపు అనుభవాల పుస్తకం చదవడం పూర్తిచేసి,దాని గురించి రాస్తూ అలాగే నిద్రపోయాను.
ఏ అర్ధరాత్రో మొదలైంది ఓ కల.
తెల్లారి మెలకువ వచ్చేవరకూ కొనసాగుతూనే ఉంది.
ఎప్పుడూ నా కలల్లోకి రాని ఓ స్నేహితుల గుంపు రాత్రంతా నా కలల్లోనే నాతోనే ఉన్నారు.
ఎవరనుకున్నారు... నబనీత పుస్తకాన్ని తన ఎఫ్ బీ పేజ్ మీద పరిచయం చేసిన బాలాంత్రపు ప్రసూన గారు,పి. సత్యవతి గారు,రొంపిచర్ల భార్గవి,ఉమా నూతక్కి,ప్రశాంతి,అపర్ణ తోట ఇంకా ఎవరెవరో గుర్తురావడం లేదు.
అందరం కట్టకట్టుకుని ఎటో పోతున్నాం.
చిక్కటి అడవి మధ్యలో ఓ గెస్ట్ హవుస్ లో ఆగాం.
పక్కనే తలకోన జలపాతమంత ఎత్తైన జలపాతం దూకుతోంది.ఎత్తైన పర్వతాల మధ్య నుండి వెన్నెలలు కురిపిస్తున్న నిండు పున్నమి
చంద్రుడు.
అందరం జలపాతం లో చాలా సేపు ఆడాం.
అక్కడే కూర్చుని పాటలు పాడుకున్నాం.
భార్గవి ఎన్నో పాటలు పాడారు.
అపర్ణ,ప్రశాంతి డాన్స్ చెయ్యడం మొదలు పెట్టారు.
ఇంతలో ఒక పెద్ద పక్షి ఓ పెద్ద వస్తువును మోసుకుంటూ మా పై నుంచి వెళ్ళడం చూసి అందరం దాని వెంట పరుగెత్తాం.
పక్షి నోట్లో ఉన్న వస్తువు నుంచి గలగలమని ఏవో శబ్దాలు వస్తున్నాయి.
కొంత దూరం వెళ్ళాక పక్షి ఆ వస్తువుతో సహ కిందికి దిగింది.అక్కడంతా పోలీసులు.
నేను ఒక్కదాన్ని పక్షి వేపు వెళ్ళాను.
పోలీసులు రావద్దంటున్నారు.అయినా వెళ్ళాను.అప్పుడు ఆ పక్షి అమాంతంగా ఎగిరి నా వెంట పడింది.
తెల్లగా చాలా ఎత్తుగా ఉంది పక్షి.
అది డేగ డేగ అంటూ అరిచింది ప్రశాంతి.అది నన్ను తరుముకుంటూ వచ్చింది కానీ అక్కడ చాలా మంది ఉండడం తో ఎగురుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది.
అది ఏమి మోసుకొచ్చిందో చూద్దమంటే అక్కడంతా పోలీసులే ఉన్నారు.
జలపాతం దగ్గర నుండి అందరం అడవిదారి పట్టాం.
అడవిలో విరగ కాస్తున్న వెన్నెల.అడవి దాటగానే దూరంగా మంచుతో కప్పబడిన కొండలు.బాగా చలేస్తోంది.మంట వేద్దామా అంటోంది అపర్ణ.
అడవి లో మంట వెయ్యకూడదు అంటుకుంటే కష్టం అంది ప్రశాంతి.
రాత్రంతా అలా అడవిలో పడి తిరుగుతూనే ఉన్నాం.
ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నాం.
ఇప్పుడు మన గెస్ట్ హవుస్ కి ఎలా వెళతాం.ఎక్కడుంది అన్నారు పి.సత్యవతి గారు.
మన కార్లు ఏవి ఇంక నడవలేను అంది ఉమా.
అదిగో గెస్ట్ హవుస్,అవిగో మన కార్లు గట్టిగా అరిచారు భార్గవి.
ఇలా అసంబద్దంగా,అర్ధం పర్ధం లేకుండా తెల్లారేవరకూ కొనసాగింది.
మా మర్ఫీగాడొచ్చి లేపకపోతే ఇంకెంత సేపు సాగేదో మరి.
నిద్రలేచి బ్రష్ చెయ్యడానికి సింక్ దగ్గరకు వెళ్ళగానే అక్కడి అద్దంలో కల తాలూకు ఆనందం నా కళ్ళల్లో మెరిసి ఎంత సంతోషం కలిగిందో.
నిజంగా ఇలా జరిగితే ఎంత బావుండునో కదా అనిపించింది.
No comments:
Post a Comment