మనం ఉపయోగించే భాష మన సంస్కారాన్నే కాదు మన మనువాద భావాలని పట్టిస్తుంది.
.................................
నా చిన్నప్పుడు మా ఇంట్లో మా వాళ్ళంతా మా పొలాల్లో,ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళని ఇలా పిలిచేవాళ్ళు.
ఒరేయ్ ఎంకా,ఏమే సుందరదానా,ఏరా సుబ్రహ్మణ్యం,ఏమే సుబ్బీ ఇలా సాగేవి ఆ పిలుపులు.
ఓహో వాళ్ళని అలాగే పిలుస్తారు కాబోలని మా చిన్నపిల్లలం కూడా మా కన్న చాలా పెద్దదైన సుందరమ్మను ఏమే సుందరదానా అని పిలిచేవాళ్ళం.
ఏంటండి పాపగోరూ అని ఆమె చాలా మర్యాదగా మమ్మల్ని పిలిచేది.
వందలాది ఎకరాల భూములతో విర్రవీగే భూస్వాముల భాష అలాగే ఉండేది.
ఇక నేను చదువుకునే స్కూల్లో మా ఊరి కరణం కూతురు,కొడుకు చదివేవాళ్ళు.వాళ్ళని మేము అబ్బాయి గారు,అమ్మాయిగారూ అని పిలవాలి.అలాగే పిలిచేవాళ్ళం.ఒక సారి ఈ అబ్బాయిగారిని పలకతో బుర్ర పగలకొట్టాను అది వేరే సంగతి.కానీ ఆ ఊరి కరణం ఆఢిపత్య కులానికి చెందిన వాడు.వాడికి మేము తక్కువ .మాకు మా ఊళ్ళో దళితులు తక్కువ.
ఇంకో అనుభవం.నా హై స్కూల్ చదువులో నాకో క్లోజ్ ఫ్రెండ్ మా సంస్కృతం మాస్టారి కూతురు.
వాళ్ళింటికెళుతూ ఉండేదాన్ని.నన్ను ఇంటి లోపలకు రానిచ్చేవాళ్ళు కాదు.ఇంటి బయట పాకలాంటిది ఉండేది.అక్కడికి రానిచ్చేవారు.
అప్పుడప్పుడూ నా ఫ్రెండ్ తో పాటు నాకు అన్నం పెట్టేవాళ్ళు.పెరట్లో అరుగుమీద అరటి ఆకులో పై నుంచి విసిరి విసిరి వేసేవాళ్ళు కూరలు అవి.
నేను తినగానే ఆకు తీసుకెళ్ళి బయట పెంట కుప్పలో వేసేదాన్ని.నేను తిరిగి వచ్చేటప్పటికి నేను కూర్చున్న స్థలాన్ని కడిగేసి పసుపు నీళ్ళు చల్లేసేవారు నా ఫ్రెండ్ అమ్మ.ఆ రోజుల్లో అది నాకు తప్పనిపించలేదు.అంతే కాబోలు అనుకునేదాన్ని.
చాతుర్వర్ణ వ్యవస్థ,మనువాద భావజాలం,నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఇవన్నీ అర్ధమయ్యాక కదా మనమెంత దోపిడీ వ్యవస్థలో, పితృస్వామ్య బ్రహ్మణీయ భావజాలంలో నిండా మునిగి ఉన్నామో చిన్నప్పటి ఆ అనుభవాలకు వీటిని ఎలా ముడి వేసి చూడాలో అర్ధమౌతున్నది.
ఇప్పటికీ తమ అమానవీయ భాషని యదేచ్చగా వాడుతూ సమర్ధించుకుంటున్న వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తున్నది.
No comments:
Post a Comment