200 పేజీల చిన్న పుస్తకం."ట్యూజ్ డేస్ విత్ మోరి" పుస్తకం పేరు.నిన్నంతా కూర్చుని మళ్ళీ చదివాను.
"బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటి" తర్వాత చాలా సంతోషంగా చదివిన పుస్తకం.మరణం అంచున ఉన్న ఒక ప్రొఫెసర్ కి అతని స్టూడెంట్ కి మధ్య కొన్ని మంగళవారాల పాటు జరిగిన హృద్యమైన సంభాషణల సమాహారం.
పదహారు సంవత్సరాల అంతరం తర్వాత వీల్ చైర్ లో ఉన్న తన ప్రియమైన ప్రొఫెసర్ ని ఒక టీవి ప్రోగ్రాంలో చూసి మిచ్ అల్బోం అతని దగ్గరకు వస్తాడు.
మొర్రీ ఒక భయానకమైన జబ్బుకు గురై మరణానికి అతి సమీపంలో ఉంటాడు.
ప్రతి మంగళవారం వారిద్దరూ కలుస్తుంటారు.ఎన్నో అంశాల మీద సంభాషణ సాగుతుంటుంటుంది.
మరణం తన ఎదురుగా నిలబడి తనని కబళించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మొర్రి మొక్కవోని ధైర్యంతో నా మరణాన్ని నే ప్లాన్ చేసుకుంటాను అంటాడు.
"నువ్వు ఎలా మరణిస్తావో అర్ధం చేసుకున్నప్పుడు నువ్వు ఎలా బతకాలో తెలుసుకుంటావు.మరణం మనకి సమీపంగానే ఉంది అని తెలిసినప్పుడు నువ్వు జీవించే పద్ధతి వేరుగా ఉంటుంది.మనం పోగేసుకునే వస్తు సముదాయం వెల వెల పోతుంది.కొత్త కొత్త వస్తువుల కోసం వెంపర్లాట ...పెద్ద కారు,పెద్ద ఇల్లు,బోలెడంత డబ్బు సంపాదించడం వీటన్నింటి మీద యావ తగ్గిపోతుంది." అంటాడు ఒక చోట.
ప్రేమ ఒక్కటే మనిషిని నిత్య నూతనంగా ఉంచుతుంది. ప్రేమ ని పంచు,అనుభవించు ,ప్రేమ ఒక్కటే నీ మరణం తర్వాత కూడా నిన్ను బతికిస్తుంది.
"మరణం జీవితాన్ని అంతం చేస్తుంది కానీ మనుష్యులతో నీ సంబంధాన్ని కాదు."
"హృదయాన్ని తెరిచిఉంచితేనే ప్రేమ వికసిస్తుంది.ప్రేమ మాత్రమే నిన్ను బతికిస్తుంది."
"సముద్రంలో నువ్వొక బిందువువి మాత్రమే.సమస్త ప్రకృతిలో నువ్వొక భాగం మాత్రమే,అతీతం కాదు."
గురుశిష్యుల సంభాషణల్లో ఇలాంటి ఆణిముత్యాలు రాలిపడుతుంటాయ్.
ఫ్రొఫెసర్ శరీరం రోజురోజూకూ కుంగి కృశించిపోతుంటుంది. శరీర అవయవాలన్నీ అదుపు తప్పిపోతాయ్.కాళ్ళు చచ్చుపడిపోతాయ్.
కనీసం టాయిలెట్కి కూడా వెళ్ళలేడు.వెళ్ళాక కడుక్కోలేడు.
అతనిలో ఏ కోశానా సెల్ఫ్ పిటీ కనబడదు.
తనని చూడడానికి వచ్చే అసంఖ్యాక అభిమానుల కష్టాలనూ,సమస్యలను వింటుంటాడు.కన్నీళ్ళు కారుస్తుంటాడు.వాళ్ళకి సలహాలు చెబుతుంటాడు.తన శరీర బాధల్ని తానే అనుభవిస్తూ "తన కుటుంబ సభ్యులకి కూడా చెబుతాడు.మీరు నా కోసం మీ జీవిత గమనాలని మార్చుకోవద్దు.నా మీద ప్రేమ చూపించండి కానీ జాలి కాదు."
"ఇతరుల్ని ప్రేమించడానికి సమయం వెచ్చించు.నువ్వెంత ప్రేమనిస్తే అంత ప్రేమ నీకు తిరిగొస్తుంది."
చదవండి ...నేనింక రాయను.
మరణాన్ని ఎలా ప్రేమించాలో,మరణం అంచుల్లో ఉంటూ కూడా జీవితాన్ని ఎలా ప్రేమించాలో అద్భుతంగా ఆవిష్కరించిన పుస్తకం.
No comments:
Post a Comment