........కొండవీటి సత్యవతి
చెన్నైలో విమానం గాల్లోకి ఎగిరి అమాంతం వచ్చి సముద్రం మీద వాలినట్లైనది. తీరం దాటగానే కెరటాలన్నీ కామ్ గా అయిపోతున్నాయి. బంగాళాఖాతం మీద ఓ పెద్ద పక్షి ఎగురుతున్నట్టుగా ఉంది విమానం నీడ. అనేక రంగవల్లులుఅలంకరించినట్లు రకరకాల డిజైన్లు కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి సముద్రం మీద ఎగురుతున్న విమానం పక్షిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తోంది ధరణి. అంతులేని జలరాశి. తనకు సముద్రం కొత్త కాదు. గోదావరి జిల్లాలవాళ్లకు ఏదో ఓ చోట సముద్రం, సముద్రంలో కలిసే గోదావరి పరిచయమే. కోనసీమలో పుట్టిన ధరణికి రెండూ కొత్తకాదు. కానీ అండమాన్ మీద ఆకర్షణ ఈనాటిది కాదు. ఎప్పటి నుండో చూడాలనుకుంటున్న ప్రాంతం. వస్తామని నమ్మబలికినఅందరూ చేతులెత్తిసినా ధైర్యం తెచ్చుకొని ఒక్కర్తీ బయలుదేరింది. అయితే అండమాన్ దూరదర్శన్ లో పనిచేస్తున్న శారద ప్రోత్సాహం కూడా ఈ ప్రయాణం వెనుక ఉంది.
ఊపిరాడని మార్చి నెల ఒత్తిడి ముగిసాక ఏప్రిల్ మొదటి వారంలో తన ప్రయాణం ఖరారు చేసుకుంది. శారదకి ఫోన్ చేస్తే 'వచ్చేయ్' 'వచ్చేయ్' అని భరోసా ఇచ్చింది. తన ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ మొదట ఉత్సహం చూపారు. కానీ చివరినిమిషంలో జారిపోయారు. అసలు రవళి ఉంది ఉంటే బావుండేది. కూతురు దగ్గరికంటూ అమెరికా చెక్కేసింది. ధరణి ఆలోచనల్ని చెదరగొడుతూ విమానం లాండింగ్ గురించి అనౌన్సమెంట్ వచ్చింది. పది నిమిషాల తర్వాత పోర్ట్ బ్లెయిర్విమానాశ్రయంలో ఆగింది. ధరణి విమానం దిగి శారద కి ఫోన్ చేసింది. తాను ప్రస్తుతం ఎయిర్ పోర్టుకి రాలేనని టాక్సీ తీసుకొని తాను బుక్ చేసిన హోటల్ కి వెళ్లిపొమ్మని, సాయంత్రం కలుస్తానని చెప్పింది.
లగేజ్ తీసుకోని బయటకు వచ్చింది. టాక్సీ మాట్లాడుకుని హోటల్ అడ్రస్ చెప్పింది. డ్రైవర్ చక్కటి తెలుగులో
" తెలుగువారా మేడం?" అన్నాడు
"అవును నీకు ఎలా తెలిసింది" అంది ఆశ్చర్యంగా
"అదే నా గొప్పతనం మేడం ! తెలుగువాళ్ళని ఇట్టే గుర్తుపట్టేస్తాను" గొప్పగా చెప్పాడు.
ధరణి నవ్వింది
" హోటల్ ఇంకెంత దూరముంది?"
"ఇంకో అయిదు నిమిషాల్లో హోటల్ వస్తుంది.ఆ హోటల్ నించి సముద్రం వ్యూ చాల బావుంటుంది" అన్నాడు
అతను చెప్పినట్లే అయిదు నిమిషాల్లో హోటల్ ముందున్నాడు. డబ్బిచ్చి పంపించేసింది. హోటల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక తనకి కేటాయించిన రూమ్ కెళ్ళింది. బాయ్ సామాను తెచ్చి హోటల్ లో పెట్టి వెళ్ళాడు.
డోర్ లాక్ చేసి, కర్టెన్ పక్కకి లాగి చూస్తూ, అలానే నిలబడిపోయింది. ఎదురుగా నీలాకాశం రంగులో మెరుస్తున్న సముద్రం. సముద్రం పక్కనే కొండలు. ఎంత నీలంగా ఉన్నాయి నీళ్లు. మా సముద్రం నీళ్లేందుకు ఇంత నీలంగా ఉండవో, ఒకేసముద్రం కదా! అనుకుంటే నవ్వొచ్చింది.
కర్టెన్ అలాగే తీసి ఉంచి మంచం మీద వాలిపోయింది. పడుకున్నా సముద్రం కళ్ళ ముందే ఉంది. సముద్రం వొళ్ళో పడుకున్నట్లుంది. ఈవారం రోజులూ తనతో ఉండేది సముద్రమే కాబోలు. "నేను ... సముద్రం" కవిత రాయాలనిపించింది.బద్దకంగా అలాగే పడుకుంది.
మూసుకున్న రెప్పల వెనక చందన్ అస్పష్టంగా కనిపించాడు. చందన్ తో కలిసి కదా తాను అండమాన్ చూడాలనుకుంది. ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నారు. తన బిజినెస్, తన టూర్లు అస్సలు దొరికేవాడు కాదు. తనతో పాటు రమ్మనేవాడు.ఆ బిజినెస్ టూర్లంటే తనకి విసుగు. తనని హోటల్లో వదిలేసి మీటింగులంటూ వెళ్ళేవాడు. సాయంత్రాలు, రాత్రిళ్ళు మాత్రం తనవే. అతని ప్రేమ పారవశ్యంలో పగటి విసుగును మర్చిపోయేది. కొత్త కొత్త హోటళ్లు, రెస్టారెంట్లకు తీసుకెళ్ళేవాడు.పల్లవి పుట్టిన తర్వాత బిజినెస్ తగ్గించుకుని తనతో ఉండడానికి ప్రయత్నించేవాడు. చందన్ ప్రేమ చల్లగా చందనం లాగే ఉండేది. అతనితో గడిచిన రాత్రుల మాధుర్యం పూర్తిగా చవి చూడకుండగానే ఓ అర్ధరాత్రి చందన్ తనని విడిచివెళ్ళిపోయాడు. తనని చుట్టిన చేతులు బిగిసిపోవడం, మరెప్పటికీ ఆ చేతులు తనని తాకావు అని అర్దమయ్యేటప్పటికే తన జీవితం లోంచి చందన్ శాశ్వతంగా మాయమైపోయాడు. నలభై సంవత్సరాలకే తనకి దూరమైపోయాడు. పదేళ్ళపల్లవికి తండ్రి లేకుండా పోయాడు.
కనుకొలుకుల్లోంచి వెచ్చటి కన్నీరు బుగ్గల మీదుగా చెవిలోకి జారింది. తామిద్దరి మధ్య అల్లుకున్న గాఢమైన ప్రేమబంధం పుటుక్కున తెగిపోయింది. చందన్ ప్రేమని కోల్పయిన తనకి పగటి కన్నా రాత్రులు దుర్భరమైపోయాయి. సుదీర్ఘమైనఒంటరి రాత్రులు, నిద్రలేని రాత్రులు ఎంత దుఃఖాన్ని మిగిల్చాయి.
డోర్ బెల్ మోగింది. చటుక్కున లేచి కళ్ళు తుడుచుకుని తలుపు తీసింది.
ఏం చేస్తున్నావ్? సారీ! అర్జెంట్ షూటింగ్ వాళ్ళ ఎయిర్ పోర్టుకి రాలేకపోయాను" అంటూ హడావుడిగా వచ్చింది శారద.
ఏం ఫర్వాలేదులే ... తెలుగు టాక్సీ కుర్రాడు జాగ్రత్తగా తెచ్చి దింపాడులే అంది.
"అవునా ... గుడ్ ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారులే. పల్లవి ఎలా ఉంది? ఎక్కడుంది?"
"బావుంది. నాతోరానని వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళింది"
"వస్తే బావుండేది కదా! అండమాన్ చూసేది"
"అది ఏమందో తెలుసా ? మన బంగాళాఖాతమే కదా అండమాన్ లో ఉంది. ఏం చూడాలి నువ్వెళ్ళు నేను రాను" అంది.
"అయితే తనకి అండమాన్ కన్నా అమ్మమ్మంటే ఇష్టమనుకుంటా"
"అవును. ఆ కొబ్బరితోటల్లో పడి తిరుగుతుంటారు. బోలెడు మంది పిల్లలున్నారులే."
"ఇంటికి పోదాం రారాదూ "
"లేదులే .. ఇప్పుడు కాదు. చివరలో వస్తా"
"రేపు ప్రోగ్రాం ఏమిటి?"
"చూడాలి. హేవలాక్ ఐలాండ్ అనుకుంట"
"గుడ్. రెండు రోజులు అక్కడే ఉండొచ్చు. చాలా బావుంటుంది. మంచి బీచులున్నాయి. రాధానగర్ బీచిని నువ్వు చాల ఇష్టపడతావ్. అక్కడి నుండే ఎలిఫెంట్ ఐలాండ్, కోరల్స్ చూడడం ... రెండు రోజులు ఫుల్ బిజీ ... ఎంజాయ్మెంట్"అంది శారద.
ధరణి నవ్వింది. ఆ నవ్వులో జీవం లేనట్టనిపించింది శారద కి.
"చందన్ ని నువ్వింకా మర్చిపోలేదు. నీ కళ్ళల్లో అది కనిపిస్తోంది." అంది ధరణి చేతిని అందుకుంటూ.
"మర్చిపోయినా, మర్చిపోకపోయిన చేసేదేముంది". గొంతులో నిర్లిప్తత.
"కమాన్ ధరణి! సౌందర్యం అణువణున నిండిన ప్రాంతానికొచ్చావ్. ఎంజాయ్" అంది శారద.
ధరణి ఏమీ మాట్లాడకుండా కిటికీలోంచి కన్పిస్తున్న సముద్రాన్ని చూసింది.
"అవును .. చాలా అందంగా ఉంది సముద్రం".
" ఆ ... అన్నట్టు ఎల్లుండి పౌర్ణమి కదా! పౌర్ణమి రాత్రి బంగాళాఖాతం అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు నువ్వు హేవలాక్ నుంచి తిరుగు ప్రయాణం పెట్టుకో. చిన్న షిప్ లో పైన కూర్చుంటే సూపర్"
"అలాగే శారద!"
కాసేపు ఉండి శారద వెళ్ళిపోయింది.
* * * * *
పౌర్ణమి ముందు రోజు హేవలాక్ ఐలాండ్ లో సముద్రం ఒడిలో ఉనట్టున్న తన కాటేజ్ ముందున్న కుర్చీలో కూర్చుని తదేకంగా సముద్రాన్ని చూస్తోంది ధరణి. పగలంతా బాగా తిరిగింది. బీచులన్నీ చుట్టింది. ఎలిఫెంటా బీచ్ లో సముద్ర గర్భంలోకెళ్ళి క్వారల్స్ చూసింది. సరంజామా అంతా తగిలించుకుని సముద్రం అడుగుకు వెళ్లి ఓ అద్భుత ప్రపంచాన్ని చూసింది.రంగు రంగుల చేపలు, క్వారల్స్, నాచు మొక్కలు భలే ఉన్నాయని మురిసిపోయింది. మనసంతా సంతోషంతోనిండిపోయినా ఇంత సంతోషాన్ని చందన్ మిస్ అయ్యాడే ... అసలు మనిషే మిస్ అయిపోయాడే అనే ఆలోచన కంట్లో నీటి బిందువైంది. ఎదురుగా అలుముకుని ఉన్న సౌందర్యం మసక బారిపోయింది. కళ్ళు తుడుచుకుని, కళ్ళువిప్పార్చుకుని సముద్రం మీంచి మెల్లగా పై కోస్తున్న పూర్ణ చంద్రుణ్ణి చూస్తూ కాసేపు తనని తాను మర్చిపోయింది. రేపుకదా పౌర్ణమి ఈ రోజు కూడా పెద్దగా పౌర్ణమి లాగానే ఉన్నాడే. అనుకుంటూ ఎదురుగా దృశ్యాన్ని చూస్తూ రెప్పవేయడంమర్చిపోయింది.
సముద్రం మీంచి వీస్తున్న గాలి. ఎగిసి పడుతున్న కెరటాలు, పండువెన్నెల్ని కురిపిస్తున్న నిండు చంద్రుడు. ఎన్నో రోజులుగా మనసులో గూడుకట్టున్న ఒంటరి తనం ఆ క్షణాన కరిగిపోయింది. అప్రయత్నంగా 'ఏకాంతమూ, సాయంత్రమూ ఎదనీకై వేగేనూ ... ' పాట గుర్తొచ్చి ఫోన్ తీసి గూగుల్ లో వెతికి ఆ పాటని ఆన్ చేసింది. కళ్ళు మూసుకుని ఆ పాటని, కెరటాల సంగీతంలో మిళితం చేసి వింటున్న వేళ.
" ఆ పాటంటే నాకు చాల ఇష్టమండి. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను" అంటూ వచ్చాడతను.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుస్తే ఎదురుగా నిలబడి పాటని వింటున్న మనిషి కనబడ్డాడు. చీకట్లో ముఖం స్పష్టంగా కనబడలేదు.
" నా పేరు సాగరండి ... మీ పక్క కాటేజిలో ఉన్నాను. ఇంత చక్కటి వేళ మీరు ట్యూన్ చేసిన పాట విని బయటకు వచ్చాను" అన్నాడతను.
నిజానికి ఈ సమయంలో ఎవ్వరితోను మాట్లాడాలని లేదు. తనతో తాను మాత్రమే గడపాలనుకుంటున్న ధరణి అతని చొరవకు కొంచం చిరాకుపడింది.
"అలాగా ... అని ఊరుకుంది.
" ఈ పాటని జిక్కి చాలా బాగా పాడింది. నేను ఇంకా బాగా పాడతానండి" అంటూ ఆమె పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు.
"మీరు పాటలు పాడతారా ?"
"ఏమండీ ... పాడకూడదా ?
"ఎందుకు పాడకూడదూ .... ఓ పాట పాడండి అయితే" అన్న తర్వాత ఆశ్చర్యపోయింది. ఎవరితను? ఏమిటి చొరవ ... తానెందుకు పాడమని అడిగింది.
"నా కిష్టమైన పాట పాడనా ... మీకిష్టమైన పాట పడమంటారా?"
"ఎదో ఒకటి ... సరే మీకిష్టమైన పాటే"
"చుక్కల్లే తోచావే ... ఎన్నెల్నే కాసేవే ... " అతని కంఠస్వరం మంద్రంగా మొదలై, ఆ పాటలోని వేదన ఆ చుట్టు పక్కలంతా కమ్మినట్లయింది. ధరణి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.
కళ్ళు తుడుచుకుంటున్న ధరణిని చూసి "అయ్యో! సారీ అండి ... మిమ్మల్ని బాధపెట్టానా?"
"ఏంలేదులెండి ... చాలా బాగా పాడారు."
"థాంక్స్ అండి ... మనలో సుళ్ళు తిరిగే దుఃఖానికి మంచి లేపనం ఈ చల్లటి వెన్నల రాత్రి" అన్నాడు. తనలో తను మాట్లాడుకుంటున్నట్టు.
ధరణి మౌనంగా ఉండిపోయింది. చంద్రుడు చాలా వరకు సముద్రం మీది కొచ్చేసాడు. సముద్రం మీద వెన్నల మిల మిల మెరుస్తుంది. ఇంక ఇతను వెళ్ళిపోతే బావుండును అనుకుంటున్నప్పుడు
"తిలక్ అమృతం కురిసిన రాత్రి కవిత గుర్తొస్తోందండి."
తనకెంతో ఇష్టమైన కవిత.
అడక్కుండానే కవిత మొత్తం పాటలాగా పాడేసాడు. అతను కవిత చదవడం పూర్తయ్యేసరికి ఓ ఉద్వేగ కెరటం ధరణిని కమ్మేసింది. ఎంత అందమైన కవిత ఎంత మధురంగా పాడాడు.
అతను పాడటం ఆపేసినా ధరణి కళ్ళు తెరవలేదు.
"అద్భుతంగా పాడారండి ... థాంక్స్"
"మీ కోసం పాడలేదండి ... నా కోసమే పాడుకున్నాను. ఆ వెన్నెల్లోకి ఆ సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లిపోవాలనిపిస్తోంది" అంటూ కుర్చీలోంచి లేచాడతను.
ధరణి కంగారుపడింది నిజంగానే సముద్రంలోకి వెళ్ళిపోతాడా... కానీ అతను తన కాటేజ్ లోకివెళ్ళి మళ్ళీ వచ్చాడు.
అర్థరాత్రి దాటుతోంది. సముద్ర కెరటాల సవ్వడి తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది; సముద్రం లోంచి వెన్నల పాక్కుంటూ వచ్చి ఇసుక మీద మెరుస్తోంది. ధరణి, సాగర్ కుర్చీలు వదిలి ఇసుకలో కూర్చున్నారు. వాళ్ళిద్దరి మీదా వెన్నల విరగకాస్తోంది. తన కాటేజ్ కెళ్ళి తిరిగి వచ్చాకా" నేనలా ఇసుకలోకి వెళ్తున్నాను మీరూ వస్తారా" అని అడిగాడు.
"పదండి వెళదాం" ఎవరతను? అతనితో అలా ఎలా వెళుతోంది తాను? లోపల్నించి అంతులేని ప్రశ్నలు, ప్రశ్నల్ని పక్కన పెట్టింది.
ఇద్దరూ కలిసి కెరటాల వేపు వెన్నెల్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అతను ఎన్నో పాటలు పాడాడు. ధరణి ఎన్నో మాట్లాడింది. తన ఉద్యోగం,చందన్ తో ప్రేమ, పెళ్లి, మరణం, తన లోపల ఏర్పడిన ఖాళీ ... అన్నీ ఎలాంటి సంకోచంలేకుండా మాట్లాడింది.
"తనకి పెళ్ళి ఇష్టం లేదని, ప్రయాణాలు తనకిష్టమని వీలైనప్పుడల్లా తిరగడానికే ప్రాధాన్యత ఇస్తానని, తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకునని, బోలెడు డబ్బుందని, ఖర్చు పెట్టడమే తన పనని హాస్యం జోడించి చెప్పాడు. అమ్మా, నాన్నఅమెరికాలో డాక్టర్లుగా పనిచేస్తూ చాలా సంపాయించారు. అమెరికా జీవితం నచ్చక ఇండియా తిరిగొచ్చేసానని, పెళ్లి చేసుకోమని ఇంకా వేధిస్తున్నారని అన్నాడు నవ్వుతూ.
"స్పష్టంగా చెప్పొచ్చుగా పెళ్ళి చేసుకోనని."
"ముప్ఫై ఏళ్ళొచ్చాయి ఇంకెప్పుడు చేసుకుంటావ్ రా అని మా అమ్మ గొడవ చేస్తుంది"
'తనకంటే చాలా చిన్నవాడన్నమాట ' అనుకుంది ధరణి.
ఆలా అర్థరాత్రి వరకు పాటలు, మాటలు, కబుర్లు సాగాయి.
"హఠాత్తుగా "చందన్ ఎలా చనిపోయాడు? ఆ తర్వాత మీ జీవితం .. " అన్నాడు
"హార్ట్ ఎటాక్! నా కూతురు పల్లవితోనే"
"ఓహో ! మీకు అమ్మాయి ఉంది. పల్లవి ... నైస్"
సాగర్ తో మాట్లాడుతుంటే కొత్త అనిపించడం లేదు. అతని పాట విన్నంత అలవోకగా మాటలూ నడుస్తున్నాయ్.
తన ఫోన్ లో ఏదో చూపించడానికి తనకి అతి సమీపంగా వచ్చిన అతని శ్వాస కొంచం సేపు ఉక్కిరి బిక్కిరి చేసింది ధరణిని. చందన్ తర్వాత ఎవ్వరూ తనకింత సమీపానికి రాలేదు. "మా అమ్మ, నాన్న, అమెరికాలో మా ఇల్లు" ఫోన్ లోచూపిస్తున్నాడు.
ఈ వెన్నెల, ఈ ఏకాంతం, ఈ సాగర తీరం మనసు పరి పరి విధాలా ఆలోచిస్తోంది.
వెండిలా మెరుస్తున్న ఇసక మీద హాయిగా వెల్లకిలా పడుకోవాలనిపిస్తోంది. ధరణి కెరటాల వేపు కాళ్ళు చాచి, అలలు కాళ్ళకి తగులుతాయా, అన్నంత దగ్గరగా వెళ్లి వెల్లకిలా పడుకుని,
"ఏదైనా వెన్నెల పాట పాడండి" అంది.
ధరణి పక్కనే తానూ వెల్లకిలా పడుకుని పాట పాడాడు. చంద్రుణ్ణి అందుకోవాలనుకున్నాయో ఏమో కానీ ఎగిసి వచ్చిన కెరటాలు వాళ్ళ పాదాల మీదుగా వాళ్ళని తడిపేసాయి.
పాదాలు జిల్లుమనిపించాయి. కెరటం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగివచ్చేసరికి వాళ్లిద్దరూ ఒకటిగా కనిపించి కంగారుగా వెనక్కి వెళ్ళిపోయింది కెరటం. మళ్ళీ వచ్చేసరికి వాళ్లిద్దరూ అక్కడ లేరు.
* * * * *
బంగాళాఖాతం పైన వెన్నల మనోహరంగా కురుస్తోంది. హేవలాక్ నుండి షిప్ పోర్ట్ బ్లెయిర్ తిరిగి వెళుతోంది. చుట్టూ అఖండ జలరాశి. దానిని చీల్చుకుంటూ వంగూరు షిప్ మెల్లగా వెళుతోంది. డెక్ మీద ధరణి, సాగర్ లతో పాటు ఇంకొన్నిజంటలున్నాయి. ఎవరి ధోరణిలో వాళ్ళున్నారు. ధరణి వెన్నలని దోసిళ్ళతో పట్టి తాగుతూ ఓ మూల కూర్చుంది. పక్కనే సాగర్.
"ధరణీ ! మీరు తిరిగి వెళ్ళాక నేను గుర్తుంటానా?"
ధరణీ ఏం మాట్లాడకుండా కాసేపు ఆగి పూర్ణ చంద్రుడి వైపు, అఖండ జలరాశి వేపు, ఆకాశంలో అక్కడక్కడా తేలుతున్న తెలి మబ్బుల వేపు, పండు వెన్నల వేపు సుదీర్ఘంగా మార్చి మార్చి చూస్తూ
"ఈ రాత్రి నాతో కలిసి ఉన్న ఈ వెన్నల, ఆ మబ్బు తునక, ఈ అఖాతం ... నాతో ఉన్న ఈ సమస్త ప్రకృతిలో పాటు నువ్వూ గుర్తుంటావ్ " సారీ! మీరూ గుర్తుంటారు?"
"నన్నలాగే పిలవండి! సాగర్ అనండి చాలు. థాంక్ యూ ... నేను ప్రక్రుతి ప్రేమికుడిని. నన్ను ప్రకృతిలో కలిపి గుర్తు చేసుకుంటే నాకు చాలా సంతోషం. నేనొక ప్రపంచ పర్యాటకుడిని. ఈరోజు ఇక్కడ రేపు ఇంకెక్కడో .... అండమాన్ అనుభవం నేనెప్పటికీ మర్చిపోలేను."
"సాగర్! చాల కాలంగా నా మనసు, శరీరం స్తబ్దంగా ఎలాంటి పులకింతకి నోచుకోకుండా ఉండి పోయింది. చందన్ ప్రేమని మర్చిపోలేక సతమతవుతున్నాను. అతనింకెప్పటికీ కనపడడు. ఇది వాస్తవం. నేను నమ్మాలి. గుండెల్నిండా దుఃఖంతో ఇక్కడి కొచ్చాను. నిజానికి ఆ దుఃఖాన్ని మర్చిపోవడం ఇష్టం లేదు. మర్చిపోవడం అంటే చందన్ మీద ప్రేమ లేకపోవడం అనుకుంటూ వచ్చాను. కానీ అది నిజం కాదు. చందన్ మీద ప్రేమ నా లోపల అలాగే ఉంటుంది. ఈ రోజు నీమీద కూడా చాలా ప్రేమగా ఉంది. నీ పాట , మాట, నీ సంస్కారం చాలా నచ్చాయి నాకు. నిండు చంద్రుడిని, పండు వెన్నలని ప్రేమించినట్టే నిన్నూ ప్రేమిస్తాను." ధరణి గొంతులో ఒక తన్మయం.
ఆమెకి దగ్గరగా జరిగి పాట అందుకున్నాడు.పాడుతున్న అతని పెదవి మీద ముద్దు పెట్టింది ధరణి.
దూరంగా లైట్లు కనిపిస్తున్నాయ్. పోర్ట్ బ్లెయిర్ సమీపిస్తోంది. ధరణిలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇంతకాలం తాను పోగొట్టుకుని వెతుక్కుంటున్నదేదో దొరికినంత ఉల్లాసంగా ఉంది.
పోర్ట్ బ్లెయిర్ లో షిప్ ఆగింది. ధరణి చేయి పట్టి కిందికి దించాడు. షిప్ దిగి బయట కొచ్చారు. ఇద్దరిదీ చెరో హోటల్.
"నేను ేపు ఉదయమే బయలు దేరాలి. చెన్నైలో కొలొంబో ఫ్లయిట్ పట్టుకోవాలి. వారం రోజులు శ్రీలంక ట్రిప్" సాగర్ అన్నాడు.
"నేను మరో రెండు రోజులుంటాను. చూడాల్సినవి చాలా ఉన్నాయ్. నిన్ను కలవడం నాకో గొప్ప అనుభవం. నాలో నిద్రాణంగా ఉన్న నా ఆనందాన్ని వెతికి నాకిచ్చావ్. థాంక్స్ సాగర్. వీలయితే మళ్ళీ కలుద్దాం." అతన్ని గాఢంగాహత్తుకుంది.
"ఎస్ ... ధరణి ... ఈ రెండు రోజులు... నాకూ అద్భుతమే. నా ప్రయాణాల్లో నాకు చాలా అనుభవాలెదురవుతాయి. నీతో జరిగింది చాలా విలక్షణం. నా కెందుకో అనిపిస్తోంది మనం మళ్ళీ కలుస్తామని"
"అవును ... నాకూ అలాగే అనిపిస్తుంది.. ఏమో! కలుస్తామేమో!"
"పోనీ నువ్వు కూడా శ్రీలంక వచ్చెస్తావేంటి? ఓ వారం హాయిగా తిరిగేద్దాం"
"శ్రీలంకా? చాలా ఖర్చవుతుంది. నేను రాను."
"ఖర్చుదేముందిలే ... నేను ఖర్చు పెడతాను. తర్వాత తీరుద్దువు గానిలే"
"తీర్చలేను. నాకు ఇబ్బందవుతుంది."
"ధరణీ ! డబ్బు విషయం నాకొదిలేయ్. హాయిగా ఓ వారం తిరుగుదాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లదే కదా! "
"సరే! ఒక ఒప్పందానికొద్దాం. అప్పుగా మాత్రమే నీ సహాయం తీసుకుంటాను. తొందరగా తీర్చేస్తాను."
"అయితే శ్రీలంక వస్తున్నావ్ ... వావ్ .. ఎన్ని పాటలు పాడుకోవచ్చొ ... మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ మీద షిప్ మీద వెన్నల్లో ప్రయాణం ... వెన్నల పాటలు" సాగర్ చిన్నపిల్లాడిలా ఎగిరాడు.
"ఎస్ వస్తాను. ఓకే ... బై ... రేపు కలుద్దాం".
ఈ హఠాత్ నిర్ణయం గురించి శారదకు, పల్లవికి చెప్పాలి.
* * * * *
రూమ్ చేరిన ధరణికి కిటికీలోంచి కన్పిస్తున్న సముద్రం, వెన్నల చాలా కొత్తగా అన్పించాయి. మొన్న ఉదయం తనలో గూడుకట్టిన దిగులును సముద్రం లాగేసుకున్నట్టుంది. బాత్ టబ్ లో హాయిగా పడుకుని జలకాలాడుతూ
ఈ రోజు ఎంత హాయిగా ఉందో !
"ఏమి హాయిలే ... ఇది ఏమి హాయిలే ... "
ధరణిలో నూతనోత్సహం పొంగిపొర్లుతుండగా శారద కి ఫోన్ చేసి" శారద! నేను శ్రీలంక వెళుతున్నాను. వివరాలు తర్వాత చెబుతా!" అని ఫోన్ కట్ చేసింది.
శ్రీలంక కబురు విన్న శారద ముఖాన్ని ఊహించుకుంటూ విరగబడి నవ్వింది. మళ్ళీ మళ్ళీ నవ్వింది. చాలా కాలంగా ఇలా నవ్వడం మర్చిపోయిన ధరణి ఆ రాత్రి మనసారా నవ్వింది. మనసులోని దిగులంతా మాయమయ్యేలా నవ్వుతూనేఉంది.
************
No comments:
Post a Comment