హాయ్ అమృతా...
ఎలా ఉన్నావ్?
నేను క్రితం సంవత్సరం సరదాగా మితృలందరికీ ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను.
కానీ నేను ఆశించినదానికన్నా అంటే సరదా మాత్రమే కాక ఇంకేదో సంతోషం దొరుకుతోంది.
నాకున్న గాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ని తలుచుకుంటూ,వాళ్ళ ఆలోచనల్లో తేలుతూ లేఖ రాయడం భలే మజాగా ఉంది.
నిజానికి నాకు అంత తీరిక లేదు.ఎన్నో పనులు,ప్రయాణాలు.అయినా సరే ఇలా రాయడం లోని మాధుర్యాన్ని చవిచూస్తున్నాను కాబట్టి టైం దొరికించుకుని రాసేస్తున్నాను..ఇవి నా కోసమే.
అమృతా!! మన పరిచయం ఎప్పుడు ఎలా జరిగిందా అని ఆలోచిస్తుంటే...శిలాలోలిత ఎప్పుడూ నీ గురించి చెప్పేది..
అమృతలత గారు అచ్చం నీలాగే ఉంటారు.నిన్ను అర్మూర్ పిలవాలని తను అనుకుంటోంది.అని చెప్పిన విషయం గుర్తుంది.
ఆ తర్వాత నువ్వు ఫోన్ చేసి విజయ హై స్కూల్ ఫంక్షన్ కి ఆర్మూర్ రమ్మని పిలిచావ్.నేను ఎగురుకుంటూ వచ్చేసాను.అదే మొదటి సారి నిన్ను చూడడం.ఆ రోజు స్కూల్ ఫంక్షన్లో భలే ఎంజాయ్ చేసాను.
ఎంతో ప్రేమగా నువ్వే నాకోసం చేపలు,చికెన్ వండి వడ్డించావ్.నాకింకేదో కావాలంటే అదీ తెప్పించావ్.ఆ రోజు రాత్రి నీతోనే ఉండిపోయాను.బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం.
అదిగో అలా మొదలైంది.
ఆ తర్వాత ఎన్నో సార్లు కలుసుకున్నాం.నీతో కలిసి గడపాలనుకున్న తక్షణం బయలుదేరి ఎన్నోసార్లు అర్మూర్ వచ్చేదాన్ని.
అలా చాలా సార్లు వచ్చాను.
అలాంటి ఒక ప్రయాణం లో మనిద్దరం ఖానాపూర్ అడవిలోకి వెళ్ళాం.
ఆ అడవిలోనే నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది.
ఒక చెట్టు పై నుండి నా మీద వర్షంలా నీళ్ళు కురిసాయి.
ఇద్దరం చాలా ఆశ్చర్యపోయాం.చాలా సేపు ఆ విభ్రమ లోనే ఉండిపోయాం.
వాన కురిసిందేమో అనుకుంటూ చెట్లని నువ్వు చెక్ చేసావ్.ఒక్క చినుకు కూడా లేదు.
ఆ రోజు నా మీద జాలువారినవి ఏమి జల్లులో నాకిప్పటి వరకు అర్ధం కాలేదు.
అదొక అద్భుతమైన అనుభవంగా నా గుండెల్లో ఉండిపోయింది.
ఆ అనుభవానికి సాక్షి వి నువ్వే కదా...
ఇంకోసారి వర్ని వెళ్ళాం. పిల్లలతో చాలా సేపు గడిపాం.
కానీ ఆ రోజు వర్ని వెళుతూనో తిరిగి వస్తూనో తారగారింటికనుకుంటాను వెళ్ళినప్పుడు నేను మేక లాగా తమలపాకులు కోసుకుని తిని,నోరంతా కాల్చుకున్నాను.కారం తమలపాకులు తినడం వల్ల వారం పాటు నా నాలుక రుచులు కోల్పోయింది.
ఒక సారి మనం నిర్మల్ లో చేపల మార్కెట్ కు వెళ్ళాం. నువ్వు కారు దిగలేదు.
నాకు చేపల మార్కెట్ అంటే వల్లమాలిన ప్రేమ.మార్కెట్ అంతా తిరిగి పెద్ద చేపను కొన్నాను.
ఇంటికెళ్ళాకా ఆ చేపను నేనే వండాను కదా...నువ్వే చెప్పాలి నాకు సరిగ్గా గుర్తులేదు.
ఇలా ఎన్నో అనుభవాలు గుర్తుకొస్తున్నాయ్.
నా 60 వ పుట్టినరోజును నీ సారధ్యంలో శిలాలోలిత,ప్రశాంతి,గీత...మీరందరూ కలిసి సెలెబ్రేట్ చేసిన విధం,నాకు తెలియకుండా నా మీద తెచ్చిన పుస్తకం,మహాద్భుతం.ఎంత అందంగా,ప్రేమగా మీరు నా పుట్టిన రోజును పండగలా చేసారో నాకెప్పుడూ గుర్తుకొస్తుంటుంది.మీ ప్రేమ గుర్తొచ్చి అసంకల్పితంగా నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.ఆ పుస్తకం తేవడం లో నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు.
మీ అందరి మీద అందుకే నాకెంతో ప్రేమ.
అన్నింటి కన్నా గొప్ప అనుభవం రచయితృలందరం కలిసి నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో చేసిన సాహితీ యాత్ర.
ఆ యాత్రలో నువ్విచ్చిన ఆతిధ్యం. ఆ రాత్రి 30 మందిమి మీ ఇంటి మీద దాడి చేసాం.నీ హృదయం లాగానే నీ ఇల్లు చాలా విశాలం.అందరం అందులో ఇమిడిపోయాం.
పొచ్చర జలపాతం దగ్గర డొక్కా సీతమ్మలాగా నువ్వు ప్రేమగా తినిపించిన బ్రేక్ఫాస్ట్ అనదరికీ ఇంకా గుర్తుంది.
ఆ తరవాత కుంతల జలపాతం,మొండి గుట్ట ప్రయాణం.నీ కజిన్స్ మాకందరికీ వండి వడ్డించిన తీరు,నాటకాలేసి మీ టీం మమ్మల్ని అలరించిన విధం,గిరిగన గ్రామానికి ట్రాక్టర్ మీద చేసిన ప్రయాణం,ఆ గిరిజనుల డాన్సులు,వాళ్ళ జీవితాలు...ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవాలివి.
నువ్వు నెలకొల్పిన అపురూప తొలి అవార్డ్ నాకిచ్చావ్.ఆ రోజు అక్కినేని నాగేశ్వర్రావ్ గారు,రావు బాలసరస్వతి గార్ల చేతుల మీదుగా అవార్డ్ ను తీసుకోవడం భలె సంతోషమైంది.ఇలాంటివే ఎన్నో.
అమృతా నీకు ఉత్తరం రాస్తుంటే నీతో ఎదురైన ప్రతి అనుభవం గుర్తుకొస్తోంది.
సంక్రాంతికి మీ సిస్టర్ వాళ్ళింటికి రావడం,కల్లు,నాన్వెజ్ ఐటంస్,భోగిమంట,ఆ తోటలు...భలే అనుభవం.
ఒక సారి నీ గుడి చుట్టూ ఉన్న అడివంతా తిరిగాం గుర్తుందా?
భూమిక ప్రెసిడెంట్ గా ఆఫీసుకొస్తున్నావ్ కానీ ఎక్కువ టైం గడపలేకపోతున్నాం.
నేను ఆర్మూర్ వచ్చి చాలా రోజులైంది.
ఎందుకనో చాలా గేప్ వచ్చింది.ఇద్దరం బిజి అయ్యాం.
రావాలి.మళ్ళి ఒక సారి అడవుల్లోకి వెళ్ళాలి.
ఆ... అన్నట్టు కొంత కాలం క్రితం వాట్సాప్ లో నన్ను అల్లరిపెట్టిన విషయం మర్చేపోయాను.
హమ్మా..నాలుదైదు రోజులు ఏమి ఏడిపించావ్.బెట్టింగులు,పోటీలు నీకిష్టం.నాకేమో అవి తెలియవు.అందుకే ఏడ్పించగలిగావ్.
అమృతా...నీకు రాయడానికి కూర్చుంటే ఎన్నో అనుభవాలు తోసుకుంటూ వస్తున్నాయి.తమ గురించి రాయమంటున్నాయ్.
ఆ ప్రయాణం లోనే కదా వర్ని దగ్గర ఒక చెరువు దగ్గర బ్రహ్మాండమైన లంచ్ అరేంజ్మెంట్స్ చేసావ్.ఓ పెద్ద చెరువు,అక్కడొక చిన్న పాక అక్కడ కూర్చుని లంచ్ చేసాం.ఆ ఫోటోలు కనబడటం లేదు.ఇలాంటి ఏర్పాట్లు చేయడం లో నిన్ను మించిన దిట్టకవి మరొకరు లేరు.ఫ్రెండ్స్ అంటే నీకు మహా ప్రేమ.వాళ్ళ కోసం ఎంత బాగా అన్నీ అరేంజ్ చేస్తావో...ప్రేమగా.
ఆ... అన్నట్టు మన అమెరికా అనుభవాలు చెప్పనే లేదు.చికాగో ఆటా మీటింగ్ లో మనం చాలా ఎంజాయ్ చేసాం.అక్కడ నేను ఢామ్మని పడినప్పుడు నీ ఫ్రెండ్ డా: ఆదిలక్ష్మి గారు ఎంతో కన్సర్న్ చూపించారు.మనం ఆది లక్ష్మి గారింటికెళ్ళాం.ఆవిడ భలే దొడ్డమనిషి.
చందు వాళ్ళింట్లో ఉన్నాను.అక్కడ నాతో పేంటూ టీ షర్ట్ వేయించావ్.
షికాగో లో రోజంతా తిరిగాం.బోలెడన్ని ప్రదేశాలు తిరిగాం.మిచిగాన్ సరస్సు నాకు చాలా చాలా నచ్చింది.
నీతో కలిసి తిరిగిన అమెరికా అనుభవాలు చాలానే ఉన్నాయ్.ఆ ఫోటోలన్ని బయటకు తియ్యాలి.
ఇలా రాసుకుంటూ పోతే ఈ లెటర్ కొండపల్లి చేంతాడంత అవుతుంది.
థాంక్యూ ...నా ఫ్రెండ్ గా ఉన్నందుకు,ఎన్నో హృద్యమైన అనుభూతులను నాతో పంచుకున్నందుకు...థాంక్స్ డియర్ ఫ్రెండ్.
ప్రేమతో
సత్య
No comments:
Post a Comment