Friday, June 25, 2021

ప్రేమ వలయాలు 2


ఉమ...
ఇది పాత ఉత్తరం.ఇప్పుడు రాస్తే అబ్బో,కొండపల్లి చాంతాడంత అవుతుంది.
2014 సంవత్సరం వరకు ఈ అమ్మాయెవరో నాకు తెలియదు.
అంతకు ముందే నా బ్లాగ్ మాగోదావరి లో నేను రాసేవి చదివేదాన్నని పరిచయమయ్యాకా చెప్పింది.
2014 లో మాలినీ నేను అరకు,పాడేరు కొండల్లో,కోనల్లో రోజంతా తిరిగి తిరిగి విజయనగరం వచ్చేం.
అంతకు ముందు నా ప్రయాణానుభవాల పుస్తకం "తుపాకిమొనపై వెన్నెల" పుస్తకం కావాలని ఉమ మెసేజ్ పెట్టి డబ్బు పంపింది.అలా చిన్న పరిచయం.
విజయనగం లో చాగంటి తులసి గారి ఆద్వర్యంలో లోపముద్ర గారు మార్చి ఎనిమిది సందర్భంగా సత్కారం చెయ్యడం,ఆ వార్త ఉమకి చెప్పడం,తను ఆ మీటింక్ కి రావడం...మా ఇద్దరికి సంబంధించి మంచి మలుపు.
నిజానికి ఆ మీటింగ్ లో మేము ఏమీ మాట్లాడుకోలేదు.మీటింగ్ అయ్యాకా నేను మాలినీతో కలిసి వాళ్ళింటికెళ్ళిపోయాను.
నేను హైదరాబాద్ వచ్చేసాకా వాట్సాప్ ఎలా వాడాలో తనే నేర్పింది.అప్పటి వరకు నాకు వాట్సాప్ అంటే ఏంటో తెలియదు.
ప్రతి రోజు గుడ్ మార్నింగ్ చెప్పేది.అలా మొదలైంది.
ఒక రోజు హటాత్తుగా అమ్మా అని పిలిచింది.ఎందుకలా అనిపించింది అంటే తెలియదు కానీ పిలవాలనిపించింది అంది.
ప్రశాంతి నన్ను అమ్మూ అని పిలుస్తుంది.
అలా బాగా చదువుకుని,మంచి ఉద్యోగం చేస్తున్న ఓ పెద్ద పిల్లకి అమ్మనైపోయాను.
ఎవరు అలా పిలిచినా ప్రతి సారీ ఆశ్చర్యపోతాను.
ఉమ అమ్మా అని పిలిచినప్పుడల్లా తన గొంతులోని మార్దవం నన్ను చాలా కదిలిస్తుంది.
సొంత తల్లి అన్నంత ప్రేమగా ఎలా పిలవగలుగుతుంది అనిపిస్తుంది.
అమ్మా!! నా జీవితం మీరు కలవక ముందు కలిసాకా అన్నట్లు విడిపోయింది.
మీరు నా జీవితం మీద వేసిన ప్రభావం చాలా ఎక్కువ.మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను.ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అంటుంది.
ఏమి నేర్చుకున్నదో నాకు తెలియదు.
ఉమ చాలా పుస్తకాలు చదువుతుంది.ఆ చదివిన పుస్తకాల గురించి చాలా విశ్లేషణాత్మకంగా రాస్తుంది.
ఇది చాలామంది చెయ్యని పని.అందరూ పుస్తకాలు చదువుతారు కానీ వాటిని సమీక్షిస్తూ రాయడం చెయ్యలేరు.
మా పరిచయం జరిగిన తొలినాళ్ళలో మా మధ్య చాలా ఉత్తరాలు నడిచాయి.
ఒకరిని గురించి ఇంకొకరికి తెలియడానికి ఉత్తరాన్ని మించిన సాధనం లేదు.
తను మంచి కవిత్వం రాస్తుంది.
ఉమ తన ప్రేమని చాలా భావాత్మకంగా వ్యక్తం చేస్తుంది.
మాలిని ప్రేమ మనసు నిండా ఉంటుంది.
ఉమ ఇంటికెళ్ళడం అంటే నా సొంత కూతురింటికి వెళ్ళినట్టే ఉంటుంది.
అమ్మల్ని కూతుళ్ళెంత అపురూపంగా చూసుకుంటారో అలాగే నన్ను చూసుకుంటుంది.
ఇలాంటప్పుడే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుగుతుంది.
ఇంత ప్రేమని నా మీద ఎందుకు కుమ్మరిస్తారో చాలా సార్లు నాకు అర్ధమవ్వదు.
"నీ ప్రమేయం లేకుండానే నీ జీవితం లోకి ఇంకా చాలా మంది వస్తారు" అంటుంది ప్రశాంతి.
ఇదంతా ఏమిటో మరి.
ఇటీవల వైజాగ్ వెళ్ళినప్పుడు నాలుగు రోజులు ఉమతోనే ఉన్నాను.
అప్పుడు నాకు విపరీతంగా దగ్గు ఉంది. దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే గుండె మీద చెయ్యేసి ఎంత సేద తీర్చిందో.ఆ అనుభూతి నా మనసు లో అలాగే ఉండిపోయింది.
మనుష్యుల మధ్య ప్రేమల్లేవు,ఆత్మీయతల్లేవు అంటూ ఓటి మాటలు వినిపిస్తుంటాయ్ కానీ నాకు అలాంటి పరిస్థితి గురించి తెలియదు.నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళే ఉన్నారు.
ఎలాంటి కండిషన్స్ లేని,ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేని ప్రేమ...
కలిసినా, కలవకపోయినా,మాట్లాడుకున్నా,మాట్లాడుకోక పోయినా ఎప్పుడు కలిసినా ఆ ప్రేమ ఫ్రెష్ గానే ఉంటుంది.
ఊపిరాడని, ఉక్కబోతల్లేని విశాలమైన ప్రేమ.
నా చుట్టూ జిగేల్మంటూ వెలిగే వెలుతురు వలయం లో ఉన్నవాళ్ళు ఉమ,మాలిని ...ఇంకా ఎంతో మంది.
నాకు అర్ధం కాని సంగతేంటంటే ...నా వయస్సు, నన్ను అమితంగా ప్రేమించే వీళ్ళ వయస్సు.
ఇంత వయస్సు వ్యత్యాసం ఉండి కూడా అది మా స్నేహానికి అడ్డురాకపోవడం విచిత్రమే.
సాధారణంగా నా వయస్సు వాళ్ళ వ్యాపకాలు వేరే ఉంటాయి.ఆలోచనా ధోరణులు వేరే ఉంటాయి.
నా కంటే ఎంతో చిన్నవాళ్ళు నా కంపెనీ ని ఎందుకని చాలా ఇష్టపడతారు.
ఆ విషయం ఉమ చెప్పాలి,మాలిని చెప్పాలి.
ఉమా...నీ ప్రేమకి, నీ ఆత్మీయతకి ఫిదా అవుతూ,మన స్నేహం ఇలాగే కొనసాగుతుందని నమ్ముతూ...
ప్రేమతో
అమ్మ.
Uma Nuthakki, Prasuna Balantrapu and 97 others
28 Comments
1 Share
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...