Friday, June 25, 2021

కొంత నిష్క్రియాపరత్వంతో మానసిక ఆరోగ్యం


 
కొన్ని సార్లు నిష్క్రియాపరత్వం మానసిక ఆరోగ్యానికి మంచిది.
నేను సైకాలజిస్ట్ను కాదు.
మొన్న ఆదివారం కార్తిక్ వెంకటేష్ అనే ఆయన హిందు పేపర్ లో ఒక ఆర్టికల్ రాసారు."బీ ఐడిల్ బీ హేపీ" పేరుతో ఈ వ్యాసం అచ్చైంది.
ఇంటికే పరిమితమైపోయిన జీవితాలు,ఇంటి నుండి పని చేసే జీవుల కష్టాలు కళ్ళకు కట్టారు.పని,పని,పని...ఆఫీసు పనులు,ఇంటి పనులు, జూం మీటింగులు,ఎఫ్బి లైవ్ లు,ఆన్లైన్ పుస్తకావిష్కరణలు,డజన్ల కొద్దీ వక్తల ప్రసంగాలు.
రోజూ జూం మీటింగ్స్ కి అంకితమైన జీవితం.చర్చోప చర్చలు.
కళ్ళు,బుర్ర తప్ప వేరే అంగాల ప్రమేయం లేని జీవన విధానం.వేళ్ళు అసంకల్పితంగా కీ బోర్డ్ మీద డాన్స్ చేస్తుంటాయి.
ఇంటి నుండి పనిచేయడం ఎంత హింసో మొన్న నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు మా తమ్ముడి అల్లుడు ప్రత్యక్షంగా చూపించాడు.కాసేపు కుర్చీలో కూర్చుని,కాసేపు మంచం మీద పడుకుని అది కూడా కాసేపు బోర్లా,కాసేపు వెల్లీకిలా,నేల మీద బాసింపట్టు వేసుకుని ఎన్నెన్ని విన్యాసాలో.ఎంటిది నరేష్ అంటే మా బతుకులు ఇలా అయిపోయాయి.
ఈ ఉద్యోగం మానేసి చేపలమ్ముకుందామనుకుంటున్నాను.
నేను నవ్వితే మీకు అలాగే ఉంటుంది,మేమేదో ఇంట్లో ఖాళీగా ఎంజాయ్ చేస్తున్నామని మా మేనేజర్ ఏదుస్తాడు.మా పాట్లు ఎవరికి తెలుస్తాయి చెప్పండి అని నేల మీద బోర్లా పడుకుని పనిలో పడ్డాడు.
కోవిడ్ వైరస్ బీభత్స రూపం,లాక్డవున్,కర్ఫ్యూ ల నేపధ్యం ల టైం లో బతుకుతున్న మనుష్యులు విపరీతమైన ఒత్తిడి.టీవీల్లో పొంగిపొర్లే బీభత్స దృశ్య్సాలు, బయటకు వెళ్ళలేం,టివీ తెరని తప్పించుకోలేం.
ఇలాంటి నేపధ్యం లో అన్నింటిని పక్కన పడేసి,ఏమీ చెయ్యకుండా కొంత టైం మీతో మీరు గడపండి అని చెపుతున్నారు కార్తిక్.
వినడానికి బావుంటుంది కానీ ఎంతమంది ఏమి చెయ్యకుండా,ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా నిష్క్రియాపరత్వం తో ఉండగలరు. బుర్రలో ఏవో తొలుస్తుంటాయి.
వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ నేను హఠాత్తుగా చేస్తున్న పనాపేసి ఏ చెట్టు వేపో,కూస్తున్న పిట్టవేపో,నీలి నీలి ఆకాశం వేపో,నల్లటి వాన మబ్బుల వేపో,ఉదయిస్తున్న సూర్యుడి వేపో,
హడావిడిగా పాక్కుంటూ వెళ్ళిపోయే వెండి మబ్బుల వేపో,వేపచెట్టు మీద వాలి గొంతు చించుకునే కోయిల వేపో ఒక్కటేమిటి నా చుట్టూ ఉన్న సమస్తాన్ని అప్పుడే తొలిసారి చూస్తున్నంత విభ్రమంగా చూడటం అలవాటు నాకు.
ఆ అలవాటే నన్ను ఒత్తిడికి దూరం చేస్తుంది.
నాకు సాధ్యమైనంతా చెయ్యాలని చూస్తాను.వల్లకాకపోతే వదిలేస్తాను.
అయ్యో చెయ్యలేకపోయానే అనే చింత పడను.
మనల్ని మనం బతికించుకోవాల్సిన సమయమిది.మనల్ని మనం నిట్టనిలువుగా నిలబెట్టుకోవాల్సిన తరుణమిది.
అందుకే అప్పుడప్పుడూ మనతోనే మనముండాలి.మనతో ఓ చెట్టో ,పిట్టో ఉన్న అవి మనల్ని డిస్టర్బ్ చెయ్యవు.ప్రకృతి మనల్ని అస్సలు డిస్టర్బ్ చెయ్యదు.మనమే ఆ అమరికను కదుపుతాం,కూలుస్తాం కూడా.
ఈ రోజు జూం మీటింగులులూ,ఆఫీసు పనులూ అయిపోయాకా ఎదురుగా ఉన్న వేప చెట్టు,పక్కనే ఉన్న పున్నాగ చెట్టూ చూస్తూ నిలబడినప్పుడు నా మనస్సు ఖాళీగా ఉండి ఈ పచ్చదనాన్ని మాత్రమే నింపుకుంది.
Indira Jonnalagadda, Venkateswarlu Sajja and 12 others

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...