Friday, July 23, 2021

ప్రయాణమే ప్రాణవాయువు

 #సప్తపర్ణి...4

ప్రయాణమే ప్రాణవాయువు
----కొండవీటి సత్యవతి
................
మనుష్యులు ప్రయాణాలెందుకు చేస్తారు? కుదురుగా ఒకచోట ఉండకుండా కాళ్ళకి బలపాలు కట్టుకుని ఎందుకు తిరుగుతుంటారు? రకరకాల పనులమీద, వ్యవహారాల మీదా తిరిగేవాళ్ళు కొందరైతే పనీ పాటా లేకుండా గాలికి తిరిగే వాళ్ళు మరి కొందరు. కొత్త ప్రాంతాలు, కొత్త మనుష్యులు, కొత్త తిండి తిప్పలు ఇలా ఎన్నో అంశాలు మనుష్యుల్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తిప్పుతుంటాయి. కొందరికి ఇంటి నాలుగ్గోడల (ఆ ఇల్లెంత పెద్దదైనా సరే) ఇరుకును దాటి విశాల ప్రపంచంలో విహరించబుద్ధవుతుంది. ఇంటి పట్టున, నీడ పట్టున కాలు నిలవని వాళ్ళు ఎంత కష్టమైనా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. నేనెందుకు ప్రయాణాలు చేస్తాను? ప్రయాణమంటే ఎందుకంత ప్రేమ నాకు?
నా తొలి ప్రయాణం నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు చేశాను. నరసాపురం నుండి భీమవరం వరకు ముప్ఫై కిలోమీటర్ల సాహస ప్రయాణం. అప్పటివరకు మా నాన్నతో తప్ప నేను ఎవ్వరితోనూ ప్రయాణం చెయ్యలేదు. ఎనిమిదో తరగతిలో అనంతలక్ష్మి అనే క్లాస్‌మేట్‌తో కలిసి మేమెంతో ప్రేమించిన విజయలక్ష్మి గారనే టీచర్‌ కోసం చేసిన ప్రయాణం. ఆవిడ పెళ్ళి కుదిరి స్కూల్‌కి రావడం మానేసినప్పుడు, ఆమె ఇంటి అడ్రస్‌ పట్టుకుని నరసాపురంలో బస్సెక్కి రెండు గంటల ప్రయాణం తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళాం. అప్పటి మా ప్రేమ అలాంటిది. మా ఇద్దరినీ చూసి ఆవిడ హడిలిపోయి, తిట్టి మమ్మల్ని నరసాపురం బస్సెక్కించి ఇంటికి పంపించారు.
అలా మొదలయ్యాయి నా ప్రయాణాలు. యాభై సంవత్సరాల క్రితం చేసిన తొలి ప్రయాణపు తీయని అనుభవం నన్ను ఇప్పటికీ వివశురాలిని చేస్తుంది. గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో ఒక హాయి కమ్ముకుంటుంది. ఆ హాయి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ప్రయాణం నా జీవితంలో భాగమైపోయింది. చెయ్యకపోతే పూడ్చలేని వెలితిగా ఉంటుంది. అందుకే పదే పదే ప్రయాణం చేస్తుంటాను.
ప్రకృతి మీద నా ప్రేమకి, నా ప్రయాణాలకి విడదీయలేని అనుబంధం. నిజానికి నేచర్‌లోకి వెళ్ళిపోవడానికే నేను ప్రయాణాలు చేస్తాను.
గుళ్ళు, గోపురాలు తిరిగే అవసరం, అగత్యం లేవు కాబట్టి నా నడక నేచర్‌ వైపే. ఉన్నచోటునే ఉండిపోతే విశాల ప్రపంచం ఎలా అర్థమౌతుంది? ఎందుకు అర్థమవ్వాలి అనేవాళ్ళకో నమస్కారం. జీవితం ఎంత విస్తృతమైనదో ప్రపంచమూ అంతే విస్తృతం. రెండింటికీ లంకె వెయ్యకపోతే బతుకు బావిలో కప్ప లెక్కనే మిగిలిపోతుంది. నిలవనీరులా నిలబడిపోయి నీచు వాసనేస్తుంటుంది. జీవితం ప్రవాహంలా ఉరకలెత్తాలంటే ప్రయాణమే కదా సాధనం. తాజా తాజాగా బతుకును నడిపే శక్తి ఒక్క ప్రయాణానికే ఉందని నేను నమ్ముతాను. ఇది నా నమ్మకం. వేరే వాళ్ళకి భిన్నాభిప్రాయం ఉండొచ్చు.
ఆరు పదుల జీవితంలో నేనెక్కిన కొండలు, దిగిన లోయలు, తిరుగాడిన అడవులు, జలకాలాడిన సంద్రాలు, మునకలేసిన నదులూ ఎన్నని చెప్పను? ఎలా లెక్కవేసి చూపించగలను? శరీరం వడులుతున్నా మనసు నవ యవ్వనంలో నర్తించడానికి కారకాలు నా ప్రయాణాలే అని ఎలా రుజువు చేయగలను?
తొలిసారి హిమాలయాల్లో 18,000 అడుగుల ఎత్తుండే చాంగ్లాపాస్‌లోకి పయనమైనప్పుడు అందరికీ ఎదురయ్యే ఆక్సిజన్‌ కొరత నాకు ఎదురవ్వకపోవడానికి కారణం ప్రయాణంతో నా ప్రణయమే. చచ్చిపోతానేమో, ఊపిరందక ఊపిరాగిపోతుందేమో అనే భయం కన్నా హిమగిరి సొగసు, ఆకాశాన్నంటే మంచు కొండల లాలిత్యం నన్ను వశపరుచుకోవడం వల్ల, ఆ వివశత్వంలో నేను మునిగిపోవడం వల్ల ఆక్సిజన్‌ లేమి నన్ను ఏ మాత్రం బాధించలేదు. మూర్తీభవించిన ఆ సౌందర్యం ముందు మరణం ఓ లెక్కా?
భక్తి, స్వర్గం లాంటి భావజాలం బుర్రనిండా దట్టించుకుని భక్తులు చేసే అమర్‌నాధ్‌ యాత్రని నాస్తికురాలినైన నేనెందుకు చేశాను? జీవితానికి ముగింపు మరణమే… మిగిలినదంతా తంతే అని బలంగా నమ్మే నేను భక్తులు మాత్రమే చేయ సాహసించే అమర్‌నాధ్‌ యాత్ర చేయడం వెనుక ఉన్నది నా ప్రకృతి ప్రేమే. అక్కడ ప్రకృతి తయారుచేసే లింగాకార మంచు ముద్ద భక్తులకి దైవంగాను, నాకు మంచుతో కప్పబడిన ఆ ప్రాంతానికి అసాధ్యమైన ప్రయాణాన్ని సుసాధ్యం చేయడంగాను కనిపిస్తుంది. ఆ మంచు ముద్దే లేకపోతే శీతలమయమైన ఆ చోటుకి ప్రయాణం చేయడం సాధ్యం కాదు. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండే ఆ కొండవాలుల్లో ప్రయాణం ఎంత ఉద్వేగభరితమో, ఆ అనుభవం ఎంత స్ఫూర్తిదాయకమైనదో నాకు తెలుసు. బ్రహ్మాండమైన, బలమైన ప్రకృతి ముందు మనిషి అల్పత్వం తేటతెల్లంగా కనబడే మహాద్భుత ప్రాంతాలు అమర్‌నాధ్‌, కేదార్‌నాధ్‌, బద్రీనాధ్‌. వీటి చుట్టూ భక్తిని రంగరించడం వల్ల మనిషి రమణీయమైన, రసరమ్యమైన ఈ ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నాడు. తన జీవనాధారమైన నదులు పుట్టిన మంచు కొండలకి ప్రణమిల్లగలుగుతున్నాడు. నా ప్రయాణాలు ప్రకృతితో ప్రణయంతో సాగినవి మాత్రమే.
సమూహాన్ని వెంటబెట్టుకుని చేసిన ప్రయాణాలు, స్నేహితులతో చేసిన ప్రయాణాలు, కుటుంబంతో కలిసి చేసిన ప్రయాణాలు ఒక ఎత్తైతే నా ఏకాంత ప్రయాణాలు మరో ఎత్తు. నేను నాతోను, ప్రకృతితోను కలగలిసి చేసిన ప్రయాణపు మాధుర్యం నాకు చాలా ప్రియమైనది. ఆడవాళ్ళు ఒంటరి ప్రయాణాలు ఎలా చేస్తారు? అందులో చాలా రిస్క్‌ ఉంది కదా! ముఖ్యంగా అడవుల్లో చేసే ప్రయాణం అని చాలామంది అంటారు. నిజమే రిస్క్‌ ఉంది… అయినా రిస్క్‌ లేనిదెక్కడ? నేను కరోనా కల్లోలానికి ముందు రెండు ఏకాంత ప్రయాణాలు… అదీ గాఢమైన అడవుల్లోకి చేశాను. నాతో నేను బుక్‌ చేసుకున్న క్యాబ్‌ డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. కోయంబత్తూర్‌ నుండి మున్నార్‌ వరకు మహోత్తుంగ పడమటి కనుమల మహా పర్వతాలు, గాఢమైన అడవులు, సెలయేళ్ళు, జలపాతాల నడుమ నుంచి సాగిన పయనంలో ఉన్నది నాతో నేనే. నేనొంటరి అనే భావన కించిత్తూ కలగలేదు. హమ్మో! నేనొంటరిగా ఆ అడవుల్లో ప్రయాణం చెయ్యలేను అని వెనుకడుగు వేసి ఉంటే పడమటి కనుమల సౌందర్యం నా మనసులో నిండగలిగేది కాదు. గుండె ఉప్పొంగిన ఆ ఏకాంత ప్రయాణం నా మీద నాకిచ్చిన నమ్మకం, గౌరవం తక్కువదేమీ కాదు. అపరిచిత మనిషి, అపరిచిత ప్రాంతం నాకిచ్చిన భరోసాను నేను దేనితోను పోల్చలేను.
నేను చేసిన మరో ప్రయాణం నాకిచ్చిన అనుభవం బహుశా నా అన్ని ప్రయాణాలకన్నా విశిష్టమైనది. చుట్టూ స్నేహితులున్నా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం నాకు కలిసొచ్చింది. రెండు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, కవచ కుండలాన్ని నోరునొక్కి బ్యాగులో ఓ మూలపడేసి చేసిన ప్రయాణం గురించి నేను చాలా వివరంగా రాయాల్సి ఉంటుంది. అలా హఠాత్తుగా నిర్ణయించేసుకుని, అవతల పరిస్థితులెలా ఉంటాయి? రాత్రి బస ఎలా, ఎక్కడ? బాగానే ఉంటుందా లాంటి ఆలోచనల్లేని ఉన్మత్త మత్తు తలకెక్కిన సందర్భం. కళ్ళముందు అడవి, పచ్చదనం కొండలు, గుట్టలు, నదులు, జలపాతాలు, సెలయేళ్ళు తప్ప వాస్తవ పరిస్థితులు అగుపించని ఉద్వేగం, ఉన్మాదం. జోరున కంటికి, మింటికి ఏకధారగా కురుస్తున్న వర్షం, ఉరుములు, మెరుపులు… బీభత్స ప్రకృతిని వెంటేసుకుని సీలేరు అడవి గుండా సాగిన ప్రయాణం, సీతారామరాజు తిరుగాడిన చింతపల్లి, మారేడిమిల్లి, రంపచోడవరం, దేవిపట్నం, చింతూరు… నాలుగు మహా అడవుల్లో రెండు రోజులు సాగిన ఓ మహాద్భుత ప్రయాణం, నేనొక్కదానినే చేసిన ఏకాంత ప్రయాణం. ఆ అడవి నిశ్శబ్దాన్ని గురించి ఎలా వర్ణించగలను? అడవి దాటి వెళ్ళాక ఆ రాత్రి తన గెస్ట్‌హౌస్‌లో తన చుట్టమో, స్నేహితులో వచ్చినంత సహజంగా, ప్రేమగా నాకు ఆతిధ్యమిచ్చిన ఆ అపరిచిత మనిషి ప్రేమని నేను ఏ కొలమానంతో కొలవగలను? ప్రకృతిని ప్రేమిస్తే సమస్తం నిన్ను ప్రేమిస్తుందని రుజువులతో సహా ఎరుకపరిచిన సందర్భం.
నా సంభాషణంతా అడవితోనే. నా ప్రేమంతా అడవి మీదే. చెట్టు చెట్టుతోను చిత్రమైన సంభాషణ. పువ్వు పువ్వుతోను ప్రాణప్రద సంభాషణ. గాఢమైన అడవి గర్భంలో ఆకాశంలోంచి జాలువారిన వెన్నెల, వెన్నెల కూడా జారని దట్టమైన అడవిలోని చీకటి నన్నెంత పారవశ్యంలో ముంచాయో నేనెలా ఈ అక్షరాల్లో రాయగలను? జలపాతాల హోరు, సెలయేళ్ళ సంగీత కచేరి విన్పించిన రాగాలను మళ్ళీ ఎలా పాడి విన్పించగలను?
నేపాల్ వెళ్ళినప్పుడు చిన్న విమానం లో ఎవరెస్ట్ చూసే అవకాశం ఉందని తెలిసి ఆ ప్రయాణం చెయ్యాలని ఉవ్విళ్ళూరినప్పుడు చాలా మంది నిరుత్సాహపరిచారు.నేను గెస్ట్ గా ఉన్న బెంగాలి ఫ్రెండ్ ,తన కూతురిని నాతో మీరు కూడా రండి ఎవరెస్ట్ చూసొద్దాం అంటే ఆ పిల్ల ఏమన్నది "హం డర్పోక్ హై ఆంటి హం నా ఆసక్తి" మేము మహా పిరికివాళ్ళం హిమాలయాల మీద విమానం కూలిపోతుందేమో అనే భయం మమ్మల్ని వదలదు"అంది.
నేను అలా అనుకోలేదు.మహోత్తుంగ హిమగిరుల మీద ఆకాశయానం చేయడం,అతి సమీపంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చూడగలగడం నాకు దొరికిన అపూర్వమైన అనుభవం గా నేను ఉప్పొంగిపోయాను.
పైలెట్ దగ్గరగా వెళ్ళి ఎవరెస్ట్ ని చూస్తున్నప్పుడు నాలో కలిగిన ఉద్వేగాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ లేరు కానీ ఏ దేశం వాడో తెలియదు కానీ ఆ పైలెట్ భుజం మీద చెయ్యేసి థాంక్ యూ సో మచ్ అని అన్నప్పుడు "ఆర్ యూ ఎంజాయెడ్ ది ట్రిప్"అన్నాడు .ఎస్ ఐ ఎంజాయెడ్.ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవించాను అని అతనికి చెప్పాను.
నేను నా ఫ్రెండ్ భయపడినట్టు భయపడి ఆగిపోతే ఎప్పటికీ ఎవరెస్ట్ ను చూడగలిగేదాన్ని కాదు.
ప్రయాణాలతో నా ప్రణయానికి ముగింపు ఉండదు. బహుశా నా ఊపిరాగినప్పుడే నా ప్రయాణానికి కూడా ముగింపు… ఆ చివరి ప్రయాణం వరకు నా ప్రయాణాలిలాగే…
Sajaya Kakarla, Padma Priya and 44 others
6 Comments
3 Shares
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...