Friday, July 23, 2021

నేనూ నా తాసిల్దార్ ఉద్యోగం

 #సప్తపర్ణి...3


యలమంచిలి అంటే వైజాగ్ దగ్గర యలమంచిలి అనుకునేరు.ఇది పశ్చిమ గోదావరి లో నరసాపురానికి,పాలకొల్లుకు మధ్యలో ఉండే చిన్న మండలం.బహు సుందరమైన మండలం.గోదారమ్మ లంకలతో కళకళలాడే మండలం.యలమంచిలి లంక,కనక్కాయల లంక లాంటి ఎన్నో లంకలున్నాయి.రాజమండ్రి నుండి నరసాపురం దగ్గర సముద్రం వేపు వడి వడిగా ఉరకలెత్తి వచ్చే గోదావరి సృష్టించిన లంకలు ఎంతో పచ్చగా,సౌందర్యం ఉట్టిపడుతూంటాయి.అలాంటి ఓ అందమైన మండలానికి నేను డిప్యూటి తాహసిల్దార్ ఉద్యోగం వెలగబెట్టడానికి 1996 లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళాను.
అప్పటి వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో సూపర్నెంట్ ఉద్యోగం.అప్పటికే 18 ఏళ్ళ సర్వీస్ ఉంది. కుర్ర మితృలతో పోటీపడి గ్రూప్ 2 పరీక్ష రాసి,గెలిచి డి టి ఉద్యోగం సంపాదించాను.సంవత్సరం పాటు హైదరాబాద్ లో ట్రయినింగ్.హైదరాబాద్ లో ఉన్న మురికివాడల విశ్వరూపం చూసింది ఈ ట్రయినింగ్ సమయంలోనే. ఆ విషయాలు విడిగా రాయాలి.నగరాల మధ్యలో ఉండే ఈ బీభత్స ప్రాంతాలతో నాకు చాలా అనుభవాలున్నాయి.తప్పకుండా రాస్తాను మళ్ళొకసారి.
సరే...శిక్షణ పూర్తైంది.అప్పాయెంట్మెంట్ తీసుకుని నరసాపూర్ రైలు ఎక్కాను.మా సీతారామపురంలో మకాం పెట్టాను.ఏలూరెళ్ళి పోస్టింగ్ అడిగితే మా ఊరికి చాలా దూరంగా ఉండే మండలం లో ఇచ్చారు.కొల్లేరుకు దగ్గరాగా ఉండే మండలమది.నేనక్కడ చేరనని మా ఊరికి దగ్గరగా ఉండే మండలం లో ఇవ్వమని జాయింట్ కలక్టర్ ని అడిగాను.ఆయన నా వేపు సీరియస్ గా చూసి మీరు హైదరాబాద్ నుండి వచ్చారా అని అడిగాడు.అవునన్నాను.మనం ఎలక్షన్లో కలిసి పనిచేసాం కదా అన్నాను.ఆయన నన్ను గుర్తుపట్టాడు.యలమంచిలికి పోస్టింగ్ మార్చాడు.మా ఊరు నుండి హాయిగా నా కైనెటిక్ మీద వెళ్ళి రావొచ్చు.అలా యలమంచిలిలో నా ఉద్యోగం మొదలైంది.
మళ్ళీ మా ఊళ్ళో ఉండే ఆనందం దొరికింది.ఈ ఉద్యోగం వల్లనే గీతతో గొప్ప స్నేహం పెనవేసింది.ట్రయినింగ్లో పరిచయం.తను వరంగల్,నేను నరసాపురం... ఓ ఉత్తరం తో మొదలైన స్నేహం అబ్బో !! ఎంత గాఢమైందో.గీతకి రాసిన ఉత్తరాల్లో నా యలమంచిలి ఉద్యోగానుభవాలు నిక్షిప్తమై ఉన్నాయ్.నా ఉత్తరాల ఫైల్ తన దగ్గరే ఉండిపోయింది.
నేను నర్సాపురం వెళుతూ నా కైనెటిక్ తీసుకెళ్ళి పోయాను.ఆ బండేసుకుని ఝామ్మంటూ మా పంట కాలువ మీదుగా,పచ్చటి పొలాల్లోంచి,కొబ్బరి తోటల్లోంచి రోజూ యలమంచిలి వెళ్ళేదాన్ని.ఆ ప్రయాణం ఎంత సుందరంగా ఉండేదంటే ...అటు ఇటు వరిచేలు,గట్ల మీద కొబ్బరి చెట్లు,వొంటిని వాటేసుకునే పైర గాలి...ప్రతి రోజు చేను ఎంత ఎదిగింది,ఏ రంగుకు మారింది,పాలుపోసుకుంటున్న కంకులు,ధాన్యంగా మారుతున్న క్రమాలు దీక్షగా చూసుకుంటూ బండి మీద వెళుతుండేదాన్ని.పొలాల్లో దమ్ము చేయడం,ఆకుమళ్ళు వెయ్యడం,నాట్లేయడం,కోతలు కొయ్యడం,ధాన్యాన్ని తూర్పారపడ్డడం,సంచుల్లోకి ఎక్కించడం,మార్కెట్టుకు తీసుకెళ్ళడం...ఈ క్రమాన్ని చాలా ఇష్టంగా,ఆసక్తి గా గమనించేదాన్ని.ఆ పనుల్లోని జీవ చైతన్యం గొప్ప సంతోషాన్నిచ్చేది.
బారులుగా నడువొంచి నాట్లేసే మహిళలు,కట్టల్ని అటు ఇటు విసిరే మగవాళ్ళు అడపా తడపా వినిపించే పాటలు...ఎంత బావుంటుందో ఆ దృశ్యం.కోసిన వరి పనల్ని రోడ్ల మీదే వేసేవాళ్ళు.ఎన్నోసార్లు ఆ పనల్లోంచి పాములు నా బండికి అడ్డమొచ్చేవి.ఒక సారి తాచుపాము తోక మీంచి బండి చక్రం వెళ్ళింది.ఇంతెత్తున లేచింది.తోకతొక్కిన తాచు అంటే ఏంటో ఆ రోజు చూసాను.నాకు పాములంటే భయం లేదు.సీతారామపురం నుండి యలమంచిలి ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆశ్వాదిస్తుండేదాన్ని.
ఆఫీసులో పని గురించి ఇక్కడ రాయను.అయితే ఫీల్డ్ లోకి,విచారణల నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. చుట్టూ గోదావరి అల్లుకున్న లంకల్లోకి తరచు వెళ్ళేదాన్ని.అక్కడికి పడవల్లోనే వెళ్ళాలి.దొడ్డిపట్ల వెళ్ళి,అక్కడి నుండి పడవలో కనక్కాయల లంక వెళ్ళేదాన్ని. గోదావరికి వరదొస్తే ఈ లంకల పరిస్థితి చాలా ప్రమాదకరం.ఆ లంకల్లో రేషన్ రిజర్వ్ స్టాక్ ఉండాలి ఎప్పుడూ. వాటిని చెక్ చేస్తూ ఉండాలి.ఒక ఉధృతమైన వరదలు హటాత్తుగా వచ్చి, లంకలోకి వెళ్ళలేని పరిస్థితి వస్తే లంకలో నివసించే వారికి అందుబాటులో రేషన్ ఉంచాలి.అపుడపుడూ వెళ్ళి చెక్ చేస్తుండాలి.కనక్కాయల లంక చాలా అందంగా ఉంటుంది.
సారవంతమైన భూమి.మొక్క జొన్న,అరటి తోటలు.ముఖ్యంగా అవిశ చెట్లకి పాకించే తమలపాకు పాదులతో నిండి ఉండి,ఆకుపచ్చగా కళకళలాడుతుంటుంది.లంకలోకి వెళ్ళినప్పుడల్లా లేత కొబ్బరిబొండాలు,కాల్చిన మొక్కజొన్న పొత్తులు...భలే రుచి.దొడ్డిపట్ల పంచాయతీ ప్రెసిడెంట్ మహిళ.ఆవిడెప్పుడూ బయటకొచ్చేది కాదు.ఆమె భర్త అన్నీ చక్కబెట్టేవాడు.ఆమెతో జరిగిన సంభాషణల్లోంచి నేనో కధ రాసాను."ముందడుగు" "ఆమె కల" కధల సంపుటిలో ఉంది ఆ కధ.
నేను యలమంచిలిలో పని చేస్తున్నప్పుడే గోదావరి మీద చించినాడ దగ్గర బ్రిడ్జి పని మొదలైంది.అక్కడికెళ్ళడం,చించినాడలో ఉండే కమ్యూనిస్ట్ రాజు గారిని కలవడం ఆయనతో కలిసి మాట్లాడుతూ భోజనం చెయ్యెడం ...చాలా బావుండేది.యలమంచిలి తాహసిల్దార్ రెటైర్ అయ్యాడు.నేనే తాహసిల్దార్.
ఆ టెం లోనే సూపర్ సైక్లోన్ వచ్చింది.భంకరమైన ఆ తుపానులో చిక్కుకుని యలమంచిలి నుండి సీతారమపురం వరకు చేసిన ప్రయాణం, అదీ రిక్షాలో,ఆ పెను గాలికి బండి నడపలేక నరసాపురం నుండి రిక్షాలో బయలుదేరి చేసిన ప్రయాణం,రిక్షా అతను నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిన అనుభవం గుర్తొస్తే ఇప్పటికీ నా వొళ్ళు జల్లుమంటుంది.ఆ తుపాను తర్వాత చాలా రోజులు ఆఫీసులోనే ఉండిపోవాల్సి రావడం,కూలిపోయిన ఇళ్ళు,పడిపోయిన చెట్లు,ధ్వంశమైన తమలపాకు తోటలు,రిహాబిలిటేషన్,నష్ట పరిహారం పంచడం....చాలా రోజులు అందులో కొట్టుకుపోయాం.
ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు ఎవ్వరూ పనిచెయ్యరు.గోదావరి జిల్లాల్లో వరదలు,తుపానులు చాలా సహజం.బాధితుల్ని చేరి,కేంప్స్ ఆర్గనైజ్ చేసి,ఫుడ్ అందచేయడం చాలా ముఖ్యమైన పని.రెవెన్యూ వాళ్ళూ అద్భుతంగా చేస్తారు.బస్తాల్లో డబ్బు పట్టుకెళ్ళి తమలపాకు రైతులకు పంచిన అనుభవం ఇప్పటికీ గుర్తుంది.
అక్కడ పనిచేసినప్పుడు నాకు నచ్చని అంశం అర్ధరాత్రిళ్ళ దాకా అధికారులు పెట్టే మీటింగులు.రెండోది ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతి, ఫ్యూడల్ మనస్తత్వాలు."పచ్చి ఫ్యూడల్" అని ఓ కవిత రాసి చాలా గొడవపడ్డాను.
నరసాపురం సబ్ కలక్టర్ తో చాలా సమస్యలొచ్చాయి.నా ఇండిపెండెంట్ మనస్తత్వం అతనికి కిట్టేది కాదు.నేను నా బండి మీద ఆయన జీప్ కి ఎదురుపడితే చాలు మీటింగుల్లో నిలబెట్టి అరిచేవాడు.జీ హుజూర్ అనడం నాకు చేతకాదుగా మరి.నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వదిలెయ్యాలనే నిర్ణయం తీసుకున్నది కూడా ఈ అంశాలవల్లనే.
వ్యక్తిగత జీవితం ఉండదు.కధలు,కాకరకాయలు,సామాజిక ఆచరణ ..వీటికి టైమే దొరకదు.నాకు భూమిక ముఖ్యం.రెవెన్యూలో కొనసాగితే భూమికలో ఏమీ చెయ్యలేను.అంతే...సర్వీస్ కమీషన్ లో ఇంకా లీన్ పీరియడ్ ఉంది.వెనక్కి వెళ్ళొచ్చు.2000 లో రెవెన్యూ లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్వీస్ కమీషన్ కి వచ్చేసాను.
భూమిక లో మొత్తం టైం పెట్టాలని నిర్ణయించుకుని 2000 సంవత్సరం చివరిలో మొత్తం గవర్నమెంట్ ఉద్యోగానికి తిలోదకాలిచ్చేసి,వాలంటరీ రెటైర్మెంట్ తీసుకున్నాను.అయితే రెవెన్యూ ఉద్యోగం నాకు అద్భుతమైన ఎన్నో అనుభవాలను,గీత లాంటి నేస్తాన్ని,కట్టల కొద్దీ ఉత్తరాలను మిగిల్చింది.యలమంచిలి అందాలను,వెన్నెల్లో గోదారి సౌందర్యాలను,మా ఊరి ముచ్చట్లను,ఏటిగట్ల నడకల్ని,పని లో ఎదురైన అనుభవాలని పేజీలకు పేజీలు గీతకు ఉత్తరాలు రాసేదాన్ని.
మొబైల్స్ లేని బంగారు కాలం ..ఉత్తరమే ముఖ్యమైంది.గీతకు కానీ.ఇంటికి కానీ ఫోన్ చెయ్యాలంటే ఎస్టిడి బూత్ ముందు లంబాచోడా క్యూలో నిలబడి ఎంతో అపురూపం గా లాండ్లైన్ కి చేసి మాట్లాడిన అనుభవం.
మా ఊర్లో ఆ రోజుల్లో టివీలు,సీరియళ్ళు లేని రోజులు.8 గంటలకంతా ఊరంతా నిశ్శబ్దంగా నిద్రపోయే వేళ నేను ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ఎస్టిడి బూత్ కెళ్ళి గీతకి ఫోన్ చెయ్యడం,చాలా సార్లు ఇంట్లో లేకపోవడం,ఆ ఆశాభంగమంతా మర్నాడు ఉత్తరం లో ప్రబింబించేది.
హమ్మయ్య... మూడేళ్ళపాటు నన్ను మురిపించి,ఆకుపచ్చటి లోకాల్లో విహరింపచేసిన యలమంచిలికి కూడా ఓ ప్రేమలేఖ రాసేసాను.
Uma Nuthakki, స్వర్ణ కిలారి and 130 others
15 Comments
6 Shares
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...