Friday, July 23, 2021

ప్రకృతితో చెట్టపట్టాల్

 నేను పుట్టింది, పెరిగింది ఒక ఆకుపచ్చటి గ్రామంలో. ఎన్నో రకాల తోటలు ఊరి నిండా ఉండడం, ఎప్పుడూ ఆ చెట్లమీదే కోతుల్లాగా ఎగరడం, ఆ చెట్ల పండ్ల మీదే తినే తిండికి ఆధారపడడంతో చెట్లతో గాఢమైన అనుబంధం ఏర్పడింది. అడవిలో ఉండే మహావృక్షాలైనా, మా సీతారామపురంలో ఉండే తోటలైనా నాకు వొక్కటే. ఏ చెట్టైనా ప్రియమైందే నాకు.

చెట్ల తర్వాత నా అనుబంధం నీళ్ళతో మరింత గాఢంగా పెనవేసింది. మా ఊరి పిల్లకాలువైనా మా ఊరికి దగ్గరగా ప్రవహించే గోదావరి నదైనా, ఇంకొంచం దూరంలో ఉప్పొంగే సముద్రమైనా అన్నీ ఒకటే నాకు. ఎక్కడో ధవళేశ్వరం నుండి మా ఊరి మీదగా ప్రవహిస్తూ వెళ్ళి ఉప్పుటేరులో కలిసే గోదావరిని, మా పెద్దకాలువ రూపంలో చూస్తూ, నడుస్తూ స్కూల్‌కి వెళ్ళిన నాకు మా కాలువతో, కాలువ మీద దారి పొడుగునా నీళ్ళను ముద్దాడే పెద్ద పెద్ద నిద్రగన్నేరు చెట్లంటే ఎంత వ్యామోహమో. పురాతనమైన ఆ చెట్లు నా చిన్నతనం నుండీ నా కళ్ళల్లో అలాగే ఉండిపోయాయి. పచ్చని చెట్లు, గోదావరి, సముద్రం, పంట పొలాలు ఇవన్నీ నా జీవితంతో పెనవేసుకుపోయి ఉన్నాయి. నేను పుట్టింది ధాన్యం కొట్లో. ధాన్యమంటేనే ప్రకృతికి ప్రతిరూపం. ప్రకృతి నుంచి నేను ఎన్నడూ విడివడలేదు కాబట్టి తిరిగి ప్రకృతిలోకి అంటే ఏంటో నాకు అర్థం కాదు. పల్లెలో ఉన్నా మహానగరంలో ఉన్నా నా చుట్టూ ప్రకృతి పరివేష్టించి ఉంటుంది. అది నీలాకాశం పున్నమి నాటి వెన్నెల, అమావాస్య రాత్రి చుక్కల వెలుగులు, వాన కురిస్తే పరిమళించే మట్టి వాసనలు, చినుకు జారితే మొలకెత్తే చిన్న మొక్క... ఇవన్నీ ఎక్కడికీ వెళ్ళిపోలేదు. నేచర్‌ తన నియమానుసారం తన కర్తవ్యాలన్నీ నిర్వహిస్తుంది. సూర్యోదయ, సూర్యస్తమయాలు రోజూ చూసినా కొత్తగానే ఉంటాయి. జలపాతాలు దూకుతూనే ఉంటాయి. సెలయేళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి. మహారణ్యాలు ఉప్పొంగుతూనే ఉంటాయి. ఒకే అడవి వందసార్లెళ్ళినా వంద రకాలుగా దర్శనమిస్తుంది. ఒకే చెట్టు ఎన్నో రకాలుగా సాక్షాత్కరిస్తుంది. ఆకురాలినప్పుడు, చిగురులేసినపుడు, మొగ్గలొచ్చినపుడు, పువ్వులొచ్చినపుడు, కాయలో, పండ్లో వచ్చినపుడు ఎంతో విభిన్నంగా కనిపిస్తుంది. కావలసిందల్లా చూడగలిగిన కన్ను. ఆ కన్ను చూపించే దృశ్యాన్ని గుండెల్లో నిక్షిప్తం చేసుకోగలిగిన విశాలత్వం, ప్రేమతత్వం.
నేను ప్రకృతికి దూరంగా లేను, కాబట్టి బ్యాక్‌ టూ నేచర్‌ అనేది నాకు వర్తించదు. కానీ చాలా మందికి వర్తిస్తుందది. ప్రకృతిని నాశనం చేసుకుంటూ సృష్టించే వస్తువుల మీద వ్యామోహం ఇప్పటి మనుష్యుల్ని పట్టి పీడిస్తున్న పెద్ద రోగం. పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద కార్లు, లెక్కలేనన్ని ఆస్తులు కూడగట్టాలనుకోవడం, విపరీతంగా ఇళ్ళను అలంకరించుకోవాలనే యావ, అదే స్థాయిలో ఆభరణాలతో శరీరాలను నింపుకోవాలనే తాపత్రయం... ఇలా ఎన్నో రకాల ప్రకృతి విరుద్ధ జీవన విధానాలు మనుష్యుల చుట్టూ విపరీతమైన స్ట్రెస్‌ను జనరేట్‌ చేస్తున్నది. మానవ జాతితోపాటు జీవరాశులన్నింటికీ ప్రాణధారం, జీవాధారమైన భూమి ఎప్పుడైతే అమ్మకపు సరుకైందో, రియల్‌ ఎస్టేట్‌ కబంద హస్తాల్లో చిక్కుకున్నదో అప్పుడే మనిషికి ప్రకృతికి సంబంధం తెగిపోయింది. నేలతల్లిని వేలం వేసి కోట్ల కింద విలువ ఎపుడు మొదలైందో అప్పుడే మనిషులు ప్రకృతికి కాకుండా పోయారు.
‘అభివృద్ధి’ పేరుతో విధ్వంసకాండకి పాల్పడే కార్పోరేట్‌ క్రూరత్వం కరెన్సీ నోట్లుగా పరిణామం చెందుతుంది. అది లక్షలాదిగా చెట్లు కూలుస్తుంది, నదుల్ని దారిమళ్ళించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతుంది. కొండల్ని పిండిచేసి మైనింగ్‌ చేస్తుంది. కోట్లాది ఆదివాసీల్ని ప్రకృతి నుండి బలవంతంగా విడగొట్టి వారికి అనువుగాని ప్రాంతాలకి విసిరేస్తుంది. సముద్రం మీద ఆధారపడి, సముద్రంతో కలిసి బతికేవాళ్ళ సముద్రాన్ని గుంజుకుంటుంది. అడవి గర్భాల్లోంచి ఆదివాసుల్ని వెళ్ళగొడుతుంది. కార్పోరేట్లకి దాసోహమనే ఆధునిక ప్రభుత్వాల వికృతత్వం మనుష్యులకి సహజంగా ఉండే ప్రకృతితో సంబంధాలని గొడ్డలితో నరికినట్లు నరికేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మనిషిలో ఉండే దురాశ, స్వార్థం, వస్తువుల పట్ల ప్రేమ... ప్రకృతిని ప్రేమించాల్సిన చోట ప్రకృతిని విధ్వంసం చేసి తయారు చేసే వస్తువుల పట్ల వ్యామోహం వల్లనే మనుషులు ప్రకృతికి దూరమైపోతున్నారు. ఇప్పుడిప్పుడే బ్యాక్‌ టు నేచర్‌ అంటూ పలవరిస్తున్నారు. పచ్చదనాల కోసం కలవరిస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎన్ని వస్తువుల్ని పోగేసుకున్నా వస్తు దాహం తీరేది కాదు. ఆ దాహం ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు. చుట్టూ ఎన్నో రూపాల్లో ఆవరించి, అడుగడుగునా ప్రత్యక్షమయ్యే ప్రకృతి, ప్రకృతితో మమేకత మాత్రమే మనిషికి నిజమైన ఆనందాన్నిస్తుంది. ఇది నా ఆలోచన, ఆచరణ కూడా. అందుకే నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను.
నేను స్త్రీవాదిగా స్త్రీ అంశాల మీదే ఎక్కువగా రాసాను. నా కథలన్నీ రోజువారీ జీవితంలో స్త్రీలు ఎదుర్కునే వాస్తవ సమస్యల మీదే రాసాను. కథల్లో వేదన, దుఃఖం, కష్టాలు, కన్నీళ్ళు చుట్టుముట్టి ఉన్నాగానీ, ఛాన్స్‌ దొరికతే ఆ కథలోకి ప్రకృతి చొరబడిపోతుంది. ఉదాహరణకి ‘‘తిరగరాయ్‌’’ కథ ఒక మహిళ వొంటరితనపు వేదన చుట్టూ అల్లబడినా అనివార్యంగా అందులోకి బంగాళా ఖాతపు సౌందర్యం చొచ్చుకొచ్చింది. నట్టనడి సముద్రంలో పౌర్ణమి వెలుగులు మెరిసిపోయాయి. కెరటాల సవ్వడికి స్పందించని హృదయముంటుందని నేననుకోను.
ప్రకృతితో నాకున్న గాఢానుబంధం నా కథల్లో కన్నా నా ప్రయాణానుభవాల్లో ఇంకా బాగా వ్యక్తమౌతుంది. విశాలమైన ప్రపంచంలోకి తెగిన గాలిపటం గాలివాటుగా చేసే ప్రయాణాల్లాంటి నా ప్రయాణాలు. దీనర్థమేమంటే గమ్యముండని ప్రయాణమన్నమాట. ప్లాను చేసుకుని చేసిన ప్రయాణాలు కాదు. అడవి ఎప్పుడూ రా… రమ్మని పిలుస్తూంటుంది. అది ఆదిలాబాదు అడవా, నల్లమల అడవా, మారేడుమిల్లి గాఢారణ్యమా, ఏదో ఒక అడవితో నిరంతరం నా సంభాషణ సాగుతుంటుంది. నా ప్లానుల్లేని ప్రయాణాల్లోకి నేనెవరినీ ఆహ్వానించను. ఎక్కువ భాగం ఏకాంత ప్రయాణాలే. అడవితోనో, సముద్రంతోనో, నదులతోనో, జలపాతాలతోనో ఏకాంత సంభాషణలే నాకిష్టం. ఇవన్నీ నా లోపలికి నేను చేసే ప్రయాణాలే. నాతో నేను తప్ప ఇంకెవరూ ఉండరు. నా మాటలన్నీ నా చుట్టూ ఉన్న ప్రకృతితోనే. నా పారవశ్యమంతా ప్రకృతి గాఢత్వంతోనే. ఈ అనుభవమంతా చాలాసార్లు నా అక్షరాల్లోకి జాలువారుతుంది. నాతో కలిసి ప్రయాణం చెయ్యలేని వాళ్ళు ఖచ్చితంగా నా అక్షరాల్లో నా వెంట ప్రయాణం చేస్తారు. నాతో అడవుల్లోకి వస్తారు. సముద్ర కెరటాల మీద చిందేస్తారు. నాకు అలవోకగా, ఎలాంటి ప్రయత్నం లేకుండా అలవడిన కళ నా రచనాశైలి. పాఠకుల్ని నా వెంటేసుకుని తిప్పేకళ. సంఘటల్ని దృశ్యమానం చెయ్యగల నేర్పు నాకు అవలీలగా అలవడ్డాయి. ‘‘మీతో పాటు మమ్మల్ని ప్రయాణం చేయించారు. గాఢమైన అనుభూతిని కలిగించారు’’ అనే కాంప్లిమెంట్స్‌ ఎక్కువే. బహుశా ప్రకృతితో పెనవేసుకు సాగే నా ఏకాంత ప్రయాణాలు, ప్రకృతి ప్రేమ తప్ప వేరే ఏ ఇతర అంశం కనబడకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. అమెరికా వెళ్ళినా, నేపాల్‌ వెళ్ళినా నా తిరుగుడంతా అడవుల్లోనో, కొండల్లోనో సాగుతుంది తప్ప అక్కడ బడా మాల్స్‌లో తిష్టవేసే వస్తు సామాగ్రి మీద ధ్యాస ఉండదు. కాబట్టి ప్రయాణం మొదటి నుండి చివరి దాకా ప్రకృతి మాత్రమే పలకరిస్తుంది. పులకింపచేస్తుంది. నేపాల్‌లో హిమాలయ శ్రేణులు, ఎవరెస్ట్‌ శిఖరాన్ని అతి సమీపంగా చూడగలగడం, లాఢాఖ్‌లోని పాన్‌గాంగ్‌ సరస్సును చూసి, సృశించగలడం, తూర్పు కనుమల మహా సౌందర్యం, పడమటి కనుమల ఆకుపచ్చటి అందాలు... ఇవన్నీ చూసిన నా కళ్ళు ధన్యతను పొందాయి. కన్ను చూసిన దృశ్యం గుండెల్లో నిక్షిప్తమై, వేళ్ళ కొసల్లోంచి అక్షరాలుగా జాలువారడం, నా ఆనందాన్ని అక్షరాలుగా ఎగరేయగలగడం నేను సాధించిన విజయం. ప్రకృతి నాకు ప్రసాదించిన గొప్ప విజయం. ప్రకృతి నుంచి నాకు అందే ప్రతి అనుభూతిని నేను అక్షర రూపంలో అందరికీ పంచెయ్యాలనే తపన పడతాను. నా ఆనందం నా గుండెల్లో నిలవుండిపోకూడదు. పదిమందికీ ధారాళంగా పంచెయ్యాలి. దీనికి అక్షరాలకు మించిన సాధనం లేదు కదా! అందుకే నా రచనల్లోకి ప్రకృతి వర్ణన అప్రయత్నంగా వచ్చి చేరిపోతుంది. రచనలో వొదిగిపోతుంది తప్ప అధిగమించిపోదు.
దాదాపు ముఫ్పై సంవత్సరాలుగా నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను.
నన్ను నేను ఇలా నిర్వచించుకుంటాను.
సోషల్‌ ఏక్టివిస్ట్‌, ఫెమినిస్ట్‌, ఎథీస్ట్‌.
నాకు రాయడం చాలా ఇష్టం. అయితే నేను చేస్తున్న పనివల్ల నేను రాయడం చాలా తగ్గిపోయింది. భూమిక సంపాదకీయాలు, కాలమ్స్‌, ప్రయాణానుభవాలు తప్ప కథ రాయడం తగ్గిపోయింది. నాకు వస్తువులకి కొదువలేదు. నా చుట్టూ ఎప్పుడూ విషాదం, సమస్యలు, సవాళ్ళు తారట్లాడుతుంటాయి. నేను చేస్తున్న పనివల్ల ఎదురౌతున్న విషాదమిది. ఇరవైనాలుగ్గంటలూ హెల్ప్‌లైన్‌లో కౌన్సిలర్‌ల చెవుల్లో మారుమ్రోగేది విషాదం, దుఃఖం, కన్నీళ్ళు. పోలీస్‌ స్టేషన్‌లలో, సెంటర్‌లలో కూడా ఈ హింసాయుత దుఃఖాలే. ఉదయం లేచిన దగ్గర నుండి మా కౌన్సిలర్‌లు దాదాపు వందమంది బాధితులతో మాట్లాడతారు. ప్రాంతాలు వేరైనా కన్నీళ్ళు అవే. దానిలోని ఉప్పదనమూ అదే. రాత్రయ్యేటప్పటికి దుఃఖం, వేదన, రోదన పాయలు పాయలుగా నన్ను చేరుతుంది. కౌన్సిలర్స్‌ తాము విన్న హింసాయుత, బాధామయ కథనాలని నా ముందు పరుస్తారు. ప్రతిరోజు ఇంత దుఃఖాన్ని వినాల్సిందే, చదవాల్సిందే. బాధితులకి పరిష్కార మార్గాలు అన్వేషించి, సూచించాల్సిందే. సహానుభూతితో వాళ్ళను సమస్యల్నుండి బయటపడేలా వివిధ దారుల్ని వాళ్ళకి చూపించాల్సిందే.
ఇన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నా నాకు విసుగు, ఇంక చాలు అనే భావాలు ఎందుకు కలగడం లేదు?
నా పనిని ఎందుకింకా ప్రాణప్రదంగా చేస్తున్నాను?
ప్రతిరోజు ఎంతో మంది బాధిత స్త్రీల కథనాలను, దుఃఖాలను ఎలా వినగలుగుతున్నాను? దీనికి సమాధానం చాలా సింపుల్‌. నేను చేస్తున్న పనిపట్ల ప్రేమ, నిబద్ధత, బాధితుల పక్షాన నిలబడాలనే ప్రగాఢమైన కాంక్ష. ఇవే నన్ను నడిపిస్తున్నాయి. అంతే. నేను ప్రతి రోజూ వినే దుఃఖం నా చెవులు దాటి గుండెల్లోకి వెళ్ళి తిష్ఠ వెయ్యకుండా నన్ను కాపాడేది నా ప్రకృతి ప్రేమ. ప్రకృతితో మమేకత.
అదెలా సాధ్యం అంటారా?
నా పనిలోని వేదన నన్ను ముంచెయ్యకుండా ఉంచడానికి నా ఎదురుగా కనిపించే నెలవంక చాలు. అమావాస్య రాత్రి వెలిగే నక్షత్రాలు చాలు. ఆ నాటి సూర్యస్తమయ దృశ్యం, చెట్లుమీద కూర్చుని అలుపెరుగకుండా కూసే పిట్ట, అప్పుడే పూసిన పారిజాత పువ్వు.... ఇలా మన చుట్టూ ప్రకృతి కమ్ముకుని ఉంటుంది. చూసే కన్నుండాలి కానీ సమస్తం ప్రకృతిమయమే. అందుకే నేను వినే బాధల గాధలు నన్నేమీ చెయ్యలేవు. వాటిల్లో మునిగిపోతే నేను డిప్రషన్‌లోకి వెళ్ళిపోవాల్సుంటుంది. కానీ నేను నిత్యం ఆనందంగానే ఉంటాను. నా ఆనందం ఎక్కడి నుండి వస్తుంది అంటూ నేను చేసిన అన్వేషణ ‘ఆనందార్ణవం’ పుస్తకమైంది.
అసలైన, నిజమైన, సహజమైన ఆనందం లభించేది ప్రకృతి నుంచే అని అర్థం చేసుకున్నాను. నా జీవితాన్ని అలాగే మలుచుకున్నాను. పుస్తకం తప్ప ఏ వస్తువూ అదెంత విలువైంది (డబ్బుల్లో) అయినా నాకు పట్టదు. నా దృష్టి అటు మళ్ళదు. అవన్నీ పోగేసుకుని, అందులోంచి ఆనందాన్ని పిండుకోవాలని అస్సలు అనిపించదు. ప్రకృతితో గాఢమైన తాదాత్మ్యం ద్వారానే దీనిని సాధించగలిగాను. దీని వల్లనే అది కావాలి, ఇది కావాలి అనే గొంతెమ్మ కోరికలు లేవు. అసాధ్యమైన కోరికలు లేవు కాబట్టి నాకు స్ట్రెస్‌ ఉండదు. ‘అయామ్‌ ఏ స్ట్రెస్‌ ఫ్రీ బర్డ్‌’ అని గర్వంగా చెప్పుకుంటాను. స్ట్రెస్‌లు, టెన్షన్‌లు నా డిక్షనరీలో లేని పదాలు. నా జీవన విధానంలోనూ లేని పదాలు.
అడవిని చేతుల్లోకి తీసుకోవాలనే దురాశ లేదు. అడవికి ఆది, అంతం లేదు. అడవిని స్వంతం చేసుకోవాలనే స్వార్థం లేదు. నేను ఎక్కడుంటే అక్కడ అడవి ఉంటుంది. నా అడవిని నేను తయారు చేసుకుంటాను. ఎన్నో గాఢమైన అడవుల్ని చూసాను. మైమరచిపోయాను తప్ప ఈ అడవిని స్వంతం చేసుకుందామని అనుకోలేదు. అడవి ఎవరి స్వంతమూ కాదు. అడవి గర్భంలో నివసించే ఆదివాసులకి మాత్రమే అడవి చెందుతుంది. నేను అడవి మనిషినే కానీ అడవి మీద నాకెలాంటి హక్కు ఉండకూడదు. సూర్యాపేటలో ఒకాయన 70 ఎకరాల్లో అడవిని పెంచాడు. ఆయనంటాడు కదా! ‘‘ఈ భూమి నాదే కానీ నేను పెంచిన అడవి నాది కాదు. అడవిలో ఉన్న సమస్త జీవరాశులకూ చెందుతుంది. నేను వాటిలో భాగమే. అడవిని ఎలా స్వతం చేసుకుంటాం’’.
ప్రకృతితో నా చెట్టపట్టాల్‌, సముద్రంతో నా చిందులు, గోదారి ఒళ్ళో పారవశ్యాలు, జలపాత స్నానాలు, అడవి గర్భంలోకి అలిసిపోని నడకలు... అన్నీ రాసేసాను.
నా వెనక ఉన్న పున్నాగ పూల చెట్టుమీద కూర్చుని ఏదో పిట్ట ఆపకుండా కూస్తోంది. దాని సంగతేదో చూడాలి కదా అందుకే ఈ వ్యాసానికి ఇక్కడ ఫుల్‌స్టాప్‌ పెట్టేసా....
- కొండవీటి సత్యవతి
Uma Nuthakki, Rompicharla Bhargavi and 21 others
4 Comments
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...