Friday, April 6, 2007

స్నేహం

ఆత్మీయతలో ముంచి తీసినట్టుగ వుంటుంది
కనుచూపుమేరంతా
పరుచుకున్న పచ్చదనంలా వుంటుంది
గుండెకి సంబంధించిన
సుతిమెత్తని సవ్వడి లా వుంటుంది
భుజమ్మీద వాలిన
వెచ్చని స్పర్శలా వుంటుంది
గాయాలు కన్నీళై ప్రవహించేవేళ
చల్లని ఓదార్పులా వుంటుంది
నిస్సారంగా గడిచిపోయే మధ్యాహ్న్నపు వేళ
ముంగిట వాలే ఉత్తరంలా వుంటుంది
ఏకాంతపు సాయంత్రాల్ని
ఇసుకతిన్నెల మీదికి నడిపించే
సమ్మోహన శక్తిలా వుంటుంది
దిగులు మేఘాలు కమ్ముకున్నపుడు
చెప్పలేని చింతలేవో చీకాకుపెట్టేటప్పుడు
పెదవి మీద మొలిచే చిరునవ్వులా వుంటుంది
నీతో స్నేహం.......
అపూర్వం, అపురూపం
అది నా అంతరంగానికి, ఆత్మకి సంబంధించింది

3 comments:

రాధిక said...

"నిస్సారంగా గడిచిపోయే మధ్యాహ్న్నపు వేళ
ముంగిట వాలే ఉత్తరంలా వుంటుంది"
మాటల్లేవు ఈ వాక్యాలు చదివి.అచ్చూ మీరు చెప్పిన లాంటి స్నేహం,అలాంటి నేస్తం నాకుంది.

jags said...

స్నేహం అంతరంగానికి ఆత్మకి సంబందించినది అని చాలా బాగా చెప్పారు...స్నేహం మీద మీకున్న అభిప్రాయానికి విలువలకి చాలా సంతోషంగా ఉంది.

maa godavari said...

జాగ్స్ గారూ
ధన్యవాదాలు.నాకు ఆత్మీయులైన నేస్తాలు వున్నారు.అందుకే నేను అలా రాయగలిగాను.మా స్నేహాలకి ఎలాంటి కాలుష్యమూ అంటలేదు.అప్పుడే విచ్చుకున్న పువ్వులంత స్వచ్చమైన ఆత్మీయత మా మధ్య నిలిచి వుంది.అందుకే స్నేహం నా ద్రుష్టిలో అంతరంగానికి ఆత్మకి, సంబంధినది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...