నా నేస్తం

పువ్వులా నవ్వుతుంది
వెన్నెల్లా తాకుతుంది
ఆమె వేళ్ళ కొసల్లోంచి
ఆత్మీయత జాలువారుతుంది
ఆమె సాన్నిధ్యం
అంతులేని ఆనందాన్ని ఆవిష్కరిస్తుంది
ఆమె నవ్వు అలల్లా గాల్లో తేలి వచ్చి
నన్ను చైతన్యంతో నింపుతుంది
ఆమె స్పర్శ
పైరగాలిలా వొళ్ళంతా హాయి గొల్పుతుంది
ఆమె నడకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది
ఆమె జ్ఞాపకం
నా పెదవి అంచు మీద చిరునవ్వు సంతకం
ఆమె స్నేహం అపురూపం,అపూర్వం,అనితరసాధ్యం
ఆమె ఎడబాటు
భరించలేని నిస్తేజం,అంతు తెలియని నిశ్శబ్దం
ఆమె కలయిక
గుండెల్లో గులాబీల గుబాళింపు
సంపెగలూ,చమేలీలు కలగలసిన
సువాసనల ఉత్సాహపు పలకరింపు.

Comments