గుప్పెడు అన్నం పెట్టండి చాలు

అమ్మంటే దేవతని
అమ్మంటే అనురాగ మూర్తని
అమ్మంటే ఆది శక్తని
ఇంకా ఇంకా ఎన్నో బిరుదులు
అమ్మ గోరు ముద్దలు తినకుండా
అమ్మ లాలి పాట వినకుండా
ఎవరైనా పెరుగుతారా
అమ్మ గుర్తొస్తే.....
గోరు ముద్దలేనా గుర్తొచ్చేది
లాలి పాటలేనా గుర్తొచ్చేది
అమ్మ ఒక చాకిరీ యంత్రమని
అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని
అమ్మ ఒక సంక్షుభిత రూపమని
పగలు రేయి తేడా తెలియని
పనుల వలయంలో
అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు
అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్
అందరి కదుపులూ నింపే అక్షయ పాత్ర
తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు
కలో గంజో ఆమె కడుపు లోకి
కన్న వాళ్ళ కట్టు కున్నవాళ్ళ
కలల సాకారమే ఆమె నిరంతర క్రుషి
అమ్మతనపు ఆత్మీయతని
అన్నంలో కలిపి తినిపిస్తుంది
కట్టుకున్న వాడు నరరూప రాక్షసుడై
నరనరాన్ని నలుచుకుతింటున్నా
చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది
పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది
తన గుండెల్లో గునపాలు దిగుతున్నా
పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది
ఇంత చేసి...............
రెక్కలొచ్చిన పిల్లలు
తలో దిక్కూ ఎగిరిపోతే
గుండె చెరువై కూలబడుతుంది
అమ్మంటే దేవతని అన్నదెవరురా
సిగ్గుపడాలి మనం ఆ మాట అన్నందుకు
దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి
అమ్మని దేవతని చేసిన చోటనే
అడుక్కుంటున్న ఈ అమ్మలెవరురా
ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర రోడ్ల కూడల్ల దగ్గర
అత్యంత దీనంగా అడుక్కుంటున్న
ఈ గాజు కళ్ళ అమ్మలందరూ
దేవతలేనంటార?
అమ్మ మనిషి, అమ్మకి అన్నం కావాలి
అమ్మకి మందులు కావాలి
అమ్మకి బట్టలు కావాలి
అమ్మకి అన్నీ కావాలి
అమ్మంటే దేవతని ఒట్టి మాటలొద్దు
గోరు ముద్దలు తినిపించిన అమ్మకి
గుప్పెడు అన్నం పెట్టంది చాలు.

Comments

S said…
నాకసలు ప్రాణం విలవిల్లాడి పోతూ ఉంటుంది ఒక వారాంతం లో ఇంటికి వెళ్ళి అమ్మతో కబుర్లు చెప్పకుంటే....
radhika said…
మనసంతా ఏదోలా అయిపోయింది ఇది చదివి.ఎవరూ చెప్పకుండానే,ఎమీ అడక్కుండానే అన్నీ చేసిన అమ్మకి ఏమి చ్చినా , ఎంత చేసినా ఋణం తీరదు.
మనసంతా ఏదోలా అయిపోయింది :((((
bhavaraju said…
very good poetry on mothers love

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం