నీ గ్ఞాపకం
కారు మబ్బులు కమ్ముకున్నట్టుండే కలక్టరాఫీసులో
చిరు దీపంలా వెలుగుతుంటావు
నవ్వడం మరిచిపోయిన మనుష్యుల మధ్య
పువ్వు విచ్చుకున్నంత సహజంగా
చిర్నవ్వుతుంటావు
అందరిని హడలెత్తించే చిక్కుముడుల్ని
చిటికేసినంత ఈజీగా విప్పేసి
చిద్విలాసంగా నవ్వుతుంటావు
నిలవ నీరు మాత్రమే వుండే చోట
ఆశాపూరిత ఆలోచనల్ని ఆవాహన చేస్తుంటావు
నిస్తేజం నిత్యక్రుత్యమైన చోట
కొత్త గాలిలా వీస్తుంటావు
నువ్వుండె పరిసరాలు నిత్యనూతనంగా
జీవ కళల్ని విరజిమ్ముతుంటాయి
మాటలో మనసులో
ఆలోచనలో ఆచరణలో
ఆత్మవిశ్వాసం వెదజల్లుతుంటవు
నిజమోయ్ నేస్తం
నిన్ను తలచుకుంటే
అరచేతిలో వెన్నెల్ని చూసినంత ఆననందంగా వుంటుంది
అమావాస్య రోజున చందమామని చూసినంత సంబరంగా వుంటుంది.
No comments:
Post a Comment