1997 లో సంభవించిన పెను తుఫాను నర్సాపురం డివిజన్ లో ని అనేక మండలాల్లో తీవ్ర నస్టాన్ని కల్గించింది.అలాగే ఆ తర్వాత వచ్చిన వరదలు లంక గ్రామాలను ముంచెత్తాయి.రెవెన్యూ ఉద్యోగులు తుఫానుల్లో, వరదల్లో మునిగి తేలుతూ పనిచేయాల్సి ఉంటుంది.వరద ఉధ్రుతంగా ఉన్నపుడు మేము దొడ్డిపట్ల లో పడవెక్కి కనక్కాయ లంక వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి."వరద నిల్వల" పేరుతో లంక గ్రామాల్లో బియ్యం,కిరసనాయిలు,పప్పు దినుసులు,పంచదార లాంటివి నిల్వ ఉంచుతారు.కానీ ఆ సంవత్సరం వచ్చిన వరదల్లో అన్నీ కొట్టుకుపోయాయి.కనక్కాయ లంకలో ప్రజలు తిండీ తిప్పలు లేకుండా చిక్కుకుపోయారు.మేము అవన్నీ పడవలొ నింపుకుని దొడ్డిపట్ల దగ్గర ఉధ్రుతంగా, భీకరంగా ప్రవహిస్తున్న గోదావరిని దాటే ప్రయత్నం చేసాం.
గోధుమ రంగులోకి మారిన వరద నీరు,కొట్టుకొస్తున్న ఇళ్ళ కప్పులు,జంతు కళేబరాలు,చెట్లు,చెత్త తో గోదారమ్మ బీభత్సంగా ఉంది. మా పడవ భయంకరంగా ఊగుతోంది.ప్రవాహ వేగానికి అటూ ఇటు కొట్టుకుపోతోంది.మేమంతా ప్రాణాలు అరచేత పట్టుకొని పడవలో కూర్చున్నాం.గోదారమ్మ ఉగ్ర రూపం గజ గజ ఒణికిస్తోంది.అయినా అవతల తిండి, నీళ్ళు లేక అల్లాడుతున్న ప్రజలు మా కళ్ళల్లొ మెదులుతున్నారు.మా పడవ నడుపుతున్న మనిషి చాలా చాకచక్యంగా మమ్మల్ని కనక్కాయ లంక చేర్చాడు. లంక చుట్టూ అంతెత్తున నీళ్ళూ.చాలా కష్టపడి నీళ్ళల్లోనే దిగాం.లంక వాసులు మమ్మల్ని,సరకుల్నీ జాగ్రత్తగా పైకి చేర్చారు.వరద తగ్గి మామూలు పరిస్తితులు ఏర్పడే వరకు మేము లంకలోనే ఉండిపోయాం. ఎత్తు మీద మిగిలి ఉన్న తమలపాకు తోటలు,మొక్కజొన్న తోటలు,కొబ్బరి తోటల మధ్య బొండాలు తాగుతూ, మొక్కజొన్న కంకులు తింటూ గడిపేసాం.
వరద గోదారమ్మ ఉగ్ర రూపాన్ని అతి దగ్గరగా చూసిన సందర్భమది.
2000 లో నేను భూమిక కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసాను.

Comments

radhika said…
ఇప్పటిదాకా గమనించనేలేదు భూమిక నిర్వాహకులు మీరు ఒక్కరే అని.నిజం గా మీరు చాలా గ్రేట్ అండి.మిమ్మలిని ఇలా కలుసుకోవడం నిజం గా చాలా ఆనందం గా వుంది.2000 లలో రాజీనామా చేసానన్నారు మరి అప్పటివరకు ఈ భూమికను ఎలా నిర్వహించేవారు?

Popular posts from this blog

అమ్మ...అమెరికా

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు