Saturday, July 10, 2010

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మహిళా సహాయ కేంద్రాలు

భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం, మహిళా సాధికారతవంటి కార్యక్రమాలతో ఆక్స్‌ఫాం ఇండియా పనిచేస్తోంది.
మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవహక్కుల విఘాతంగా పరిణమిస్తున్న నేపధ్యంలో బాధితుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లలో మహిళా సహాయక కేంద్రాలను నెలకొల్పడమన్నది ఒక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ప్రతిపాదన గురించి పదే పదే ప్రస్తావిస్తూ తొలిదశలో పది పోలీస్‌స్టేషన్‌లలో సపోర్ట్‌ సెంటర్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించి ఉన్నారు.
2004లో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రాంగణంలోకి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఆక్స్‌ఫాం, స్వార్డ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సహాయక కేంద్రం ప్రారంభమైంది. ఈ సహాయ కేంద్రం ఏర్పాటు నేడు పౌర సమాజమూ, ప్రభుత్వం మధ్య అద్భుత సమన్వయ సహాకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
ఈ అనుభవంతోనే వరంగల్‌, కరీంనగర్‌, అనంతపురంలో కూడా ఈ సహాయ కేంద్రాలు ఏర్పడినాయి. ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్‌ లోని ఉమన్‌ ప్రొటక్షన్‌ సెల్‌ ప్రాంగణంలో రాష్ట్రస్థాయిలో పనిచేయడానికి మరొక సహాయ కేంద్రం ఏర్పాటయింది. (జూన్‌ 23న అదనపు డి.జి.పి. ఏ శివనారాయణ, ఐపిఎస్‌, ఎస్‌. ఉమాపతి, ఐపిఎస్‌, ఐజి, సిఐడిగార్లు ఈ సెంటర్‌ను ప్రాంభించారు. ఆక్స్‌ఫామ్‌ మానేజర్‌ శ్రీ అన్వర్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసరు రంజనా దాస్‌, భానుజ, నారాయణస్వామి (అనంతపురం) గిరిజ, అధిక సంఖ్యలో పోలీసులు, రచయిత్రులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆక్స్‌ఫాం, ఎ.పి.పి.ఎస్‌, భూమికల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ నడుస్తుంది.
హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో శ్రీ దామోదర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ పర్యవేక్షణలో మార్చి 5, 2010 నాడు ఒక సహాయ కేంద్రం మొదలైంది. ఇప్పటివరకు 64 కేసులు వీరి కేంద్రంలో రిజిస్టరు అయ్యాయి. ఒక్క హన్మకొండ చుట్టు పక్కల మండలాల నుంచే కాక మొత్తం వరంగల్‌ జిల్లా నుండి బాధిత మహిళలు ఈ పోలీస్‌స్టేషన్‌కి వస్తున్నారు. 24 కేసులను ఇక్కడ పరిష్కరించగలిగారు. కొన్ని కేసులు ప్రాసెస్‌లో వున్నాయి. కొన్ని కేసుల్ని రక్షణాధికార్లకు పంపితే కొన్ని కోర్టుకు వెళ్ళాయి. ఈ సెంటర్‌కి వస్తున్న మహిళలు ఎక్కువ శాతం గృహహింస బాధితులు. అలాగే బహుభార్యాత్వం కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తున్నాయని కౌన్సిలర్స్‌ చెప్పారు.
ఈ సెంటర్‌లో ప్రొఫెషనల్‌ వర్కర్స్‌ జయ, విశ్వజలు ఉదయం నుండి సాయంత్రం వరకు వుంటారు. బాధిత స్త్రీలతో మాట్లాడతారు.
ఈ సపోర్ట్‌ సెంటర్‌ మా స్టేషన్‌లో రావడం వల్ల మాకు వత్తిడి చాలా తగ్గింది.రకరకాల సమస్యల మీద వచ్చే మహిళలకి సెంటర్‌లో వుండే సోషల్‌ వర్కర్స్‌ చాలా సహకరిస్తున్నారు. మా దగ్గర చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళతో చెప్పుకోగలుగుతున్నారు. సివిల్‌ సోసైటీకి, పోలీసులకి మధ్య ఇలాంటి సమన్వయం చాలా బావుంది. ఈ సెంటర్‌ చాలా ఉపయోగకరంగా వుంది.
రవికుమార్‌, ఎస్సై, హన్మకొండ పోలీస్‌స్టేషన

కృషి సపోర్ట్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌, కరీంనగర్‌

కరీంనగర్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఏర్పాటులో జిల్లా ఎస్‌.పి శ్రీ శివశంకర్‌రెడ్డి గారి సహకారం చాలా వుంది. ఆయన వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధ తీసుకుని, ఈ సెంటర్‌ని మొదలు పెట్టించారు. స్థానికంగా పనిచేస్తున్న కృషిి సంస్థ ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ పనిచేస్తుంది. శ్రీ గోపిచంద్‌ కృషిి డైరెక్టర్‌గా వున్నారు.
ఇప్పటివరకు ఈ సెంటర్‌కి 49 కేసులు వచ్చాయి. ఇందులో 42 కేసులు పరిష్కరింపబడగా మిగిలిన కేసులు ప్రాసెస్‌లో వున్నాయి. గృహహింసకు సంబంధించిన కేసులే అధికంగా వస్తున్నప్పటికీ వివాహేతర సంబంధాలు, బహు భార్యాత్వ కేసులు కూడా వస్తున్నాయి. సురేఖ, మంజులలు సోషల్‌ వర్కర్క్‌గా ఈ సెంటర్‌లో పనిచేస్తున్నారు. జిల్లా ఎస్‌.పి స్వయంగా మహిళా పోలీస్‌ స్టేషన్‌కి రిఫర్‌ చేసిన కేసులో సెంటర్‌లో పనిచేస్తున్న సోషల్‌ వర్కర్స్‌ సమర్ధవంతంగా చర్యలు తీసుకోగలిగారు. ఎన్‌టిపిసిలో పనిచేసే ఒక వ్యక్తి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భార్యాపిల్లలను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. కలత చెందిన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైంది. కోలుకున్నాక జిల్లా ఎస్‌పిని కలిసి న్యాయం చేయమని కోరింది. ఆయన సెంటర్‌కి రిఫర్‌ చేసారు. సోషల్‌ వర్కర్స్‌ ఆమెతో సావధానంగా మాట్లాడి విషయాలు తెలుసుకుని ఆమెకు మానసిక స్థైర్యాన్నిస్తూ కౌన్సిలింగు చేసారు. ఆమెకు అన్ని రకాలుగాను ధైర్యం చెప్పి, ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిన భర్తను పోలీసుల సహాయంతో అరెస్ట్‌ చేయించి రిమాండ్‌కు పంపగలిగారు.గృహహింస నిరోధక చట్టం 2005 గురించి ఆమెకు వివరించి ఆమెకు కావలసిన ఉపశమనాల గురించి కూడా ఆమెకు వివరించడం జరిగింది.
సంప్రదించాల్సిన ఫోన్‌ నెం. 9963026110
మా పోలీస్‌స్టేషన్‌లో సపోర్ట్‌ సెంటర్‌ వచ్చినాక మా పనిభారం చాలా తగ్గింది. సమస్యలతో వచ్చిన మహిళలపట్ల సెంటర్‌లో వున్న సోషల్‌ వర్కర్స్‌ వెంటనే స్పందించి వాళ్ళతో సానుకూలంగా సావధానంగా మాట్లాడతారు. మాలాగే ఫీల్ట్‌ విజిట్‌ కెళ్ళి వాళ్ళ సమస్యల్ని అర్ధం చేసుకుంటారు. చాలా ఓపికగా కౌన్సిలింగు చేస్తారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం చాలా బావుంది. మేము, వాళ్ళు కలిసి బాధిత స్త్రీలకు అండగా వుంటున్నాం. నిజానికి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోను ఇలాంటి సపోర్ట్‌ సెంటర్లుండాలి. రకరకాల సమస్యలతో మా దగ్గరకొస్తారు. ఈ సెంటర్‌లో కూర్చొబెట్టి వివరంగా మాట్లాడాల్సిన అవసరం వుంటుంది. వాళ్ళకి ఏమేమి సహాయాలు అందుబాటులో వుంటాయో కూడా వివరిస్తారు. ఈ సెంటర్‌ కొచ్చిన స్త్రీలు పోలీస్‌స్టేషన్‌కి వచ్చామని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.
సువర్ణ, ఎస్సై మహిళా పోలీస్‌స్టేషన్‌, మంకమ్మతోట, కరీంనగర్‌

1 comment:

gajula said...

support centres anni prajasanghalanu,youth organisationsnu,mahilasangalanu,ila andarini kalupukuni panicheste inka ekkuva samasyalanu pariskarinchavacchu.gajula

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...