Saturday, July 24, 2010

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం…

మానవజాతిపై తన పంజాను విసిరి విధ్వంసం సృష్టిస్తున్న వైరస్‌కి పాతికేళ్ళు నిండాయి. ఈ ఇరవై అయిదు సంవత్సరాలలో కోట్లాదిమంది దీని బారిన పడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏదో మూల ప్రతిరోజూ ఎవరో మరణిస్తూనే వున్నారు. చికిత్స లేని ఈ వైరస్ సృష్టిస్తున్న విధ్వంసానికి యువత, స్త్రీలు, అమాయక పిల్లలు ఆహుతైపోతున్నారు. ఇదేమీ ప్రకృతి వైపరీత్యం కాదు. ఇంతమంది చనిపోవడానికి కారణం అందరికి తెలుసు. హెచ్ఐవి ఎలా వస్తుందో, ఎందుకొస్తుందో తెలుసు. కానీ రాకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం కాకపోవడం నిజంగా ఎంతో విషాదకరం. ఆ దిశగా ఆచరణాత్మక అడుగు జనబాహుళ్యం నుంచి పడకపోవటం మరీ విషాదం.

పితృస్వామ్య సమాజంలో పురుషుడి మీద ఆధారపడి బతుకుతున్న స్త్రీలు, తమమీద అమలవుతున్న హింసల్ని నోరెత్తి ప్రశ్నించలేని స్థితిలో వున్న స్త్రీలు, భర్తల విశృంఖల లైంగిక జీవితాన్ని తలొంచి ఒప్పుకోవడం ద్వారా, హెచ్ఐవికి గురవుతున్న వీరి ఒంటరి పోరాటాలకు అండగా నిలవడం, వారి వాణిని విన్పించడం భూమిక తన బాధ్యతగా భావించింది. ఈ సంచికలో ఎంతోమంది ఇలాంటి స్త్రీల జీవిత వ్యధలున్నాయి. గుండెల్ని మెలిపెట్టే కథలున్నాయి. వీరిపట్ల మానవీయ కోణాన్ని ఆవిష్కరించడమే మా లక్ష్యం. ఈ కథనాల్లోని స్త్రీల అసలు పేర్లను రి పట్ల గౌరవం మేరకు మార్చడం జరిగింది.

నిజానికి ప్రపంచ మానవాళి ఆరోగ్య చరిత్ర అంతా వైరస్‌తో కొనసాగిన పోరాటాల చరిత్ర.సుదీర్ఘంగా సాగుతున్న ఈ పోరాటంలో మానవుడే చిరంజీవి.

మానవ రోగ నిరోధక వ్యవస్థను క్షీణింప చేసే వైరస్ గడిచిన పాతికేళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నది. ఉత్పాదక సామర్థ్యం కలిగిన వయోవర్గాల వారికి అధికంగా సోకుతూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అనిశ్చిత భవిష్యత్తులోకి నెట్టివేసింది. నివారణ తప్ప, చికిత్సలేని ఈ వ్యాధిని అరికట్టేందుకు చైతన్యాన్ని మించి వాక్సిన్ లేదు. బాధ్యతాయుత నడవడికను మించిన నివారణా మార్గం మరొకటి లేదు. ఈ వైరస్ మానవ బలహీనతనే తన బలంగా మార్చుకుని ముప్పును కల్గిస్తున్నది. ముఖ్యంగా మానవ లైంగిక ప్రవర్తనల మీద ఒక కఠినమైన తీర్పును ప్రకటిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఇది బలంగా కేంద్రీకరింపబడుతున్న కారణంగా ఆయా దేశాలు చాలా సంక్షోభాలకు నిలయమైయ్యాయి. ఇప్పటి దాకా సాధించుకున్న ప్రగతి అంతా కళ్ళముందు ఇసుక గూడులా కూలిపోవడం అంతర్జాతీయ అనుభవాలు చెపుతున్న పాఠం. భారతదేశ విషయానికి వస్తే, రాష్ట్రానిదే హెచ్ఐవి వ్యాప్తి తీవ్రతలో అగ్రస్థానం. పధ్నాలుగు జిల్లాల్లో వ్యాప్తి తీవ్రత 2 శాతం మించిందని గణాంక వాస్తవాలు తెలుపుతున్నాయి. పదేళ్ళ కిందట హైరిస్క్ గ్రూప్‌గా గుర్తింపబడిన కమర్షియల్ సెక్స్ వర్కర్లు, ట్రక్ డ్రైవర్లు, వలసపోయే కార్మికులు వీరికి మాత్రమే వస్తుందనుకునేవారు. ఈవేళ ఇది సాధారణ ప్రజానీకం మధ్యకి కూడా వచ్చింది. ఇప్పుడు హైరిస్క్ గ్రూపంటే - చైతన్యం, అవగాహన, ఆచరణ ఎవరిలో తక్కువ వుంటుందో వారే. నిస్సహాయంగా దీని బారిన పడుతున్నది కూడా వారే.
మనుగడకోసం, మనగలగడంకోసం చేసే జీవన పోరాటంలో దీనిబారిన పడుతున్నవారు కొందరైతే, జీవన శైలిలో వచ్చిన మార్పు కారణంగా దీని బారిన పడుతున్నవారు ఎక్కువమంది. జీవిక కోసం ఈ వ్యాధి బారిన పడుతున్న వర్గంవారు ఈవేళ పూర్తి చైతన్యాన్ని కలిగి వుండడమే కాక దీనివల్ల ముప్పేమిటో గ్రహించగలిగారు. ఎటుతిరిగి జీవన శైలులు తెచ్చిపెట్టిన మార్పుల ఫలితంగా దీని బారిన పడ్డవారుగాని, పడబోతున్నవారుగాని తాము ప్రమాదంలో వున్నామనే సంగతిని గుర్తించడం లేదు.

ప్రకృతి వైపరీత్యాలు కొద్దిమందిని నిర్మూలిస్తాయేమో! కొంత ఆస్తినష్టం కల్గిస్తాయేమో! కానీ మానవ ప్రకృతి వైపరీత్య ఫలితం వర్తమానాన్నే కాక భవిష్యత్తును కూడా లేకుండా చేస్తున్నది. అందుకే ప్రతి ఒక్కరం హెచ్ఐవి/ ఎయిడ్స్ అనే అంశాన్ని గురించి తప్పకుండా ఆలోచించాలి. పట్టించుకోవాలి. ఇది నా సమస్య అని భావించాలి. ప్రతి ఇల్లూ హెచ్ఐవి/ ఎయిడ్స్ చైతన్యస్థావరంగా మారాలి. ప్రతి హృదయమూ హెచ్ఐవి సోకినవారిపట్ల ఆదరణ, సంరక్షణా కేంద్రం కావాలి.

మనం ఈ హెచ్ఐవి/ ఎయిడ్స్ లాంటి మహా వ్యాధులను సమర్థవంతంగానే ఎదుర్కోగలం. ఇది కేవలం ఎ.పి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేసే పనిమాత్రమే అని భావించకుండా, లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం చేయాల్సిన పనులని కాకుండా హెచ్ఐవి వల్ల ముప్పు తెలిసిన ప్రతి ఒక్కరూ తమ తోటివారిని చైతన్యపరచాలి. ఏ ఒక విడి వ్యక్తి సమస్య కాదని గుర్తించాలి. లేదా ఏ ఒక కుటుంబ సమస్యో, లేక ఒక గ్రామ సమస్యో అని కాకుండా ఉమ్మడి సమస్యగా భావించాలి. దీన్ని అరికట్టేందుకు నడుం బిగించాలి. తొలి విడత, మలి విడత ‘ఆశ’ కార్యక్రమం కాని, ఇప్పుడు కొనసాగుతున్న ‘బి బోల్డ్’ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ప్రచార కార్యక్రమాల లక్ష్యం కూడా చైతన్యమే. ఆ చైతన్యం ఆచరణగా అనువదింపబడడమే ఏ ప్రయత్న పరంపరల లక్ష్యమైనా.

ఇక బాల్యవివాహాలను తీసుకుంటే - పేదరికం, పనులు లేకపోవడం, చేతి వృత్తుల ధ్వంసం సృష్టిస్తున్న ఆకలి ముందు మానవీయ కోణాలన్నీ మసిబారిబోతున్నాయి. పిల్లల్ని పెంచడం, తిండి పెట్టడం అనేది వలస కార్మికులకు భరించరాని భారంగా పరిణమించి, బాల్య వివాహాలను జరిపించేసి బరువు దింపేసుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ రోజు విపరీతంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్ధలు, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. నిఘా పెట్టి ఆపగలిగినవి కొన్నే. పంధొమ్మిదేళ్ళకే పాజిటివ్‌లుగా మారిన స్త్రీలు బాల్య వివాహ బాధితులు కూడా అవుతున్న కారణం పేదరికమే. మహిళల అక్రమ రవాణా వెనుక వున్నదీ పేదరికమే. ఈ అక్రమ రవాణా ద్వారా తరలించబడిన వీరంతా సెక్స్ వృత్తిలోకి దింపబడి పాజిటివ్‌లుగా మారుతున్నారు. హెచ్ఐవి/ ఎయిడ్స్ గురించి మాట్లాడాలంటే, ఖచ్చితంగా ఈ అంశాలను సంబోధించాల్సి వుంటుంది. ఇట్లాంటి అంశాలను వెలుగులోకి తెస్తునే మెరుగైన సమాజం కోసం మీడియా మరింత బాధ్యతగా, భాగస్వామ్యాన్ని స్వీకరిస్తూ తాను వెదజల్లుతున్న సమాచారాన్ని, వినోదాన్ని పున: పరిశీలించుకోవాలి.

గ్లోబలైజేషన్‌లో వస్తు సముదాయాన్ని దిగుమతి చేసుకున్నంత తేలికగా జీవితం పట్ల మన చైతన్యాన్ని సరైన దృక్పథాలతో కూడిన జీవన విధానాలను దిగుమతి చేసుకోలేకపోతున్నాం. యువతకి సమీప గతంనుంచి గాని తమ వర్తమానం నుంచిగాని ఒక రోల్ మోడల్ ఎవరూ లేకుండా పోయారు. వారికి సామాజిక నాయకత్వం వహించగల వారు కరువయ్యారు. తామే ఒక రోల్ మోడల్‌గా రూపొందగలమన్న విలువలు, దృక్పథంతో కూడిన విద్య వారికి అందడం లేదు. జీవిత పరమార్ధమూ, ప్రయోజనమూ వాళ్ళకి అర్థం కాకుండా పోయాయి. సో! మన పాఠ్యాంశాల్లో జీవన నైపుణ్యాలను ఏ విధంగా బోధిస్తున్నామో, కుటుంబ విద్య మరియు సామాజిక విద్య బోధించాలి. ప్రస్తుతం దృక్పథమూ, దిశా నిర్దేశం లేని, వ్యక్తి కేంద్రక విద్యవైపు సమాజం వెళుతున్నది. ఒక రకంగా ఆయా వ్యక్తుల సామాజిక బాధ్యతల నించి స్వచ్ఛంద విరమణవేపు ప్రపంచీకరణ మనల్ని నెడుతున్నది.
ఆంధ్రదేశంలోని పురుషుల్లో ప్రతి అయిదుగురిలోను ఒకరు లైంగిక సుఖాన్ని వివాహ వ్యవస్థ వెలుపల కొనుక్కోవడం వల్ల అమాయకమైన మహిళలు ఏ కోణంలో చూసినా అధికాధికంగా దీని బారిన పడుతున్నారు. రిస్క్ బిహేవియర్ వున్న ఈ పురుషులు పరీక్షలు చేయించుకుని మందులు వాడుతూ భార్యకి ఆలస్యంగా చెప్పడమో, చెప్పకుండా వుండడమో చేస్తూ జాప్యం చేస్తున్నారు. పర్యవసానంగా మహిళలు చిన్నవయస్సులో దీని బారిన పడ్డం తమ ప్రాణాల్ని కోల్పోవడం, భర్తల్ని కోల్పోవడం అనే విషాదాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ సంచికను రెండోసారి కూడా తేగలగడం మాకు సంతోషాన్ని కల్గిస్తున్నా, కళ్ళకు కడుతున్న విధ్వంస దృశ్యాన్ని ఆవిష్కరించడం చాలా బాధాకరంగా వుంది. ఈ సంచిక కోసం మేము నిర్వహించిన ఇంటర్‌వ్యూలు, పాజిటివ్‌లుగా జీవిస్తున్న యువతుల జీవితాలు మనసును కలిచివేసిన మాట వాస్తవం. అయితే వారి మాటల్లోని ఆశావహ దృక్పథం, జీవితం పట్ల వారి ప్రేమ మా కళ్ళను నింపేసాయి. గుండెల్లో ఎక్కడో ఓ ముల్లు గుచ్చుకున్న వేదన. ఈ వేదనే మా చేత ఈ సంచికకు రూపకల్పన చేయించి, ఒక చైతన్య దీపికలా భూమికను తీర్చి దిద్దేలా చేసింది. ఈ సంచిక రూపకల్పనలో, సంపాదకీయం రాయడంలో నా సహ సంపాదకుడు సీతారాం అందించిన సహకారం వెలకట్టలేనిది.
ఎటూ చూసినా కటువైన వాస్తవాలు ప్రతి మూడు నాలుగిళ్ళ అవతల కన్పిస్తూ వున్నాయి. ఆంధ్రదేశపు భవిష్యత్ చిత్రపటంలో పురుషుల్ని కోల్పోయిన కుటుంబాలు, మహిళల్ని కోల్పోయిన కుటుంబాలు, పిల్లల్ని పాజిటివ్‌లుగా మిగిల్చిన కుటుంబాలు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల కుటుంబాలు మరింతగా పెరగబోతున్న వాస్తవాన్ని గమనించినపుడు భయం స్థానంలో బాధ్యత, అపోహ స్థానంలో అవగాహన, ఆందోళన స్థానంలో స్వయం నిర్దేశిత ఆచరణ -ఈ మహావ్యాధుల యుగంనించి మనల్ని అపూర్వంగా ఒడ్డుకు చేర్చగలవు అని విశ్వసిద్దాం. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, రూపొందబోయే వాక్సిన్‌ల కన్నా, విడుదల కాబోయే యాంటి రెట్రో వైరల్ డ్రగ్స్ కన్నా విలువైనవి మమత, మానవీయ స్పర్శలు. ఆ స్పర్శని ద్విగుణీకృతం చేసే ఏ చిన్న ప్రయత్నమైనా వైరష్లతో సహజీవనం చేస్తున్న మానవాళిని కాపాడగలుగుతుంది. అందుకొక ఉమ్మడి చైతన్యం కావాలి. మరి చైతన్యమంటే… అన్ని అవరోధాలను అధిగమించటం. ఎయిడ్స్ ని అంతమొందించటం. ఎయిడ్స్ రహిత ఆంధ్రదేశాన్ని స్నప్నించడం.



సురక్షితమైన లైంగిక ప్రవర్తనలను ప్రతి ఒక్కరు కలిగి వుండటం, రిస్క్ ఎవరెవరికి ఎక్కడ ఏ మేరకు వుందో గుర్తించడం, రిస్క్ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం, సుఖ వ్యాధులకు సంకోచ బిడియాలు లేకుండా చికిత్స చేయించుకోవడం, గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి పరీక్షలు తప్పక చేయించడం, ప్రసవం ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా చూడటం, పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి సోకకుండా చూడగలగటం, పెళ్ళికి ముందు తప్పని సరిగా హెచ్ఐవి పరీక్షలు జరిపించుకోవడం, ప్రతీ ఒక్కరు హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవటం, 2007 నాటికి పుట్టబోయే ఏ పసికందుకు హెచ్ఐవి రాకుండా ప్రయత్నించడం, హెచ్ఐవి సోకిన వారిని సమాదరించడం, వివక్ష చూపక పోవడం మన ముందున్న ఒక సుదీర్ఘ ప్రయాణం-

చైతన్యమే దారి దీపం- ధైర్యమే కవచం.

హెచ్ఐవి/ ఎయిడ్స్ ప్రత్యేక సంచిక


భూమిక December 2006

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...