టెెస్సి థామస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు. భారతదేశ మీడియానేకాక అంతర్జాతీయ మీడియా కూడా టెస్సికి నీరాజనాలు పడుతోంది. ”మిస్సెల్ వుమెన్” అని ”అగ్నిపుత్రి” అని బిరుదులిచ్చి సత్కరిస్తోంది. యావద్భారతీయ మహిళ గర్వంతో ఉప్పొంగాల్సిన సందర్భమిది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో పురుషులు పనిచేసే మిస్సెల్ డెవలప్‌మెంటు ప్రోగ్రామ్ శాఖలో, 49 సంవత్సరాల టెస్సి స్వయంకృషితో, పట్టుదలతో ఎదిగిన తీరు ఈ దేశ మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.
1988లో డిఫెన్స్ రీసెర్చి డెవలప్‌మెంట్ ఆర్గనెజేషన్ (డిఆర్‌డివో)లో చేరిన టెస్సి జన్మరాష్ట్రం కేరళ. జన్మస్థలం అల్లెప్పి. తండ్రి చిన్నవ్యాపారి. తల్లి కుటుంబ నిర్వాహకురాలు. రాకెట్ లాంబింగ్ స్టేషన్‌కు అతి సమీపంలో ఆమె పెరగడంవల్ల రాకెట్ల పట్ల గొప్ప ఆకర్షణను, ఇష్టాన్ని పెంచుకుంది టెస్సి. టెస్సి పుట్టింది కేరళలోనే కానీ పాఠశాల, కళాశాల విద్య పూర్తవ్వగానే ఆమె ఉన్నత చదువుంతా పూనాలో పూర్తయ్యింది. ఇరవై సంవత్సరాల వయసపుడే ఆమె స్వరాష్ట్రాన్ని వదిలేసి ”గైడెడ్ మిస్సైల్స్”లో మాస్టర్స్ డిగ్రీ కోసం పూనా వచ్చేసింది. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే ఆమె భర్త, భారతీయ నావికా దళంలో కమాండర్ సరోజ్‌కుమార్ పరిచయవ్వడం, అది వారిద్దరి మధ్య ప్రేమకి దారితియ్యడంతో వారు వివాహం చేసుకున్నారు. వారికి ‘తేజస్’ అనే కొడుకున్నాడు.
”కలకత్తాలో నిరుపేదల కోసం పనిచేసిన మదర్‌థెరిస్సా పేరును మా అమ్మనాన్న నాకు పెట్టారు. డి.ఆర్.డి.ఏ. తయారు చేసిన తేలికపాటి ఎయిర్ క్రాఫ్ట్ పేరు తేజస్. నా కొడుకుకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ పేరునే పెట్టుకున్నాం. వాడు ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాడు.” ”ఖండాంతర పరిధి కల్గిన అగ్ని ఖీ (5000 కి.మీ రేంజ్) జనవినాశక ఆయుధం కదా! దీని కోసం పనిచెయ్యడం మీకు ఎలా అన్పిస్తుంది అని అడిగిన ఒక విలేఖరి ప్రశ్నకు ”……మేము తయారు చేస్తున్న ఆయుధాలు శాంతి కోసమే’ అన్నారు. టెస్సి అగ్ని ఖీ ప్రాజెక్టు డెరక్టరుగా, ఈ క్షిపణి విజయంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ డి. ఆర్. డి.ఎ లో పని చేసారు. కలామ్ ఆధ్వర్యంలో సమిష్టిగా, పట్టుదలతో పనిచేయడం నేర్చుకున్నామని, శ్రద్ధగా, నిబద్ధతతో పనిచేయడం ఆయనను చూసే నేర్చుకున్నా అంటారు టెస్సి.
”టెక్నాలజీలో జెండర్ వివక్ష లేదు. నా వరకు నేను ఎప్పుడూ జండర్ వివక్షకు గురవ్వలేదు. నన్నెవ్వరూ ఆ దృష్టితో చూడలేదు. పనిలో నిబద్ధత, పట్టుదల వుంటే చాలు అన్నింటినీ దాటుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదగొచ్చు. ఇది నా అనుభవం ” అంటారు టెస్సి. 2008లో జరిగిన ఇండియన్ వుమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ టెస్సి గురించి” ఎంతో మంది భారతీయ స్త్రీలు లాగానే టెస్సి థామస్ కూడా కుటుంబం, కెరీర్‌ల మధ్య సన్నటి తీగమీద సమర్థవంతంగా నడిచి, బాలన్స్ చేసుకుని తన ప్రతిభ చాటుకుంది. భార్యగా, తల్లిగా, శాస్త్రవేత్తగా జీవితాన్ని పలుపాత్రల్లో సమర్థవంతంగా పోషించడం అంత తేలికైన విషయం కాదు. కానీ టెస్సి గెలిచి చూపించింది. భారతదేశంలో పనిచేస్తున్న వేలాది మహిళా సైంటిస్టులకు స్ఫూర్తిదాతగా నిలిచి, వాళ్ళు తమ కలల్ని సాకారం చేసుకునేలా వెన్నుతట్టింది మా టెస్సి థామన్స్.” ప్రస్తుతం టెస్సి థామస్ బృందంలో 400పై చిలుకు శాస్త్రవేత్తలున్నారు. వారిలో అధికశాతం పురుషులే. ”నేను డిఆర్‌డివోలే చేరినపుడు చాలా తక్కువ మంది స్త్రీ శాస్త్రవేత్తలున్నారు. ప్రస్తుతం వారి సంఖ్య పెరిగింది. ఇది ఇంకా పెరగాలి”.
గత జనవరిలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని శ్రీ మన్‌మోహన్‌సింగ్ టెస్సీ థామస్‌ను అత్తుత్తమ రోల్ మోడల్‌లా కీర్తిస్తూ ”పురుషాధిపత్య పోకడలని చిన్నాభిన్నం చేస్తూ ఈ రోజు టెస్సి థామస్‌లాంటి మహిళా శాస్త్రవేత్తలు తమ ప్రతిభావంతమైన ముద్రని శాస్త్రతసాంకేతిక రంగంమీద వేస్తున్నారు” అంటూ కితాబిచ్చారు. అమ్మాయిలకు ఆమె ఇచ్చిన సందేశం ”దృఢనిశ్చయం, నిబద్దతతో పనిచేస్తే మిగతావన్నీ వాటంతటవే వస్తాయి. పట్టుదల వుంటే ప్రపంచం మీ వెనకే వస్తుంది.” భారతీయ మహిళల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన అగ్నిపుత్రికి హృదయపూర్వక అభినందనలు.
1 comment:
స్ఫూర్తి కరం. జెండర్ బయాస్ క్రింద ఇలాంటి మణి పూసల గురించి .పాఠ్య అంశాలు గా ప్రవేశ పెట్టటం సముచితంగా ఉంటుంది.
Post a Comment