Sunday, August 22, 2010

పిట్టల తో చెట్టపట్టాల్--ఓ ఆదివారం నా అనుభవం


ఆదివారం రోజు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు.
బహుశా ఆలస్యంగా నిద్రలేవడం,ఆలస్యంగా తిండి తినడం
అన్నీ ఆరాంగా చేసుకుంటారనుకుంటాను.వారాంతపు ప్రయాణాలూ,
సినిమాలూ,బయటి ఫుడ్. మిగిలిన రోజుల కన్నా భిన్నంగా గడపాలని అందరూ అనుకుంటారు.
ఆదివారం నా వ్యవహారం కూడా భిన్నంగానే ఉంటుంది.
పొద్దున్నే లేచేసి,ప్రాణాయామం చేసేసి, ఓ పది పేపర్లు ముందేసుకుని మా మామిడి చెట్టు కింద కూర్చుంటా.ఆదివారం కనీసం పది పేపర్లు చూడ్డం నాకు ఇష్టం.
కళ్ళు అక్షరాల మీద కదులుతూనే ఉంటాయి కానీ ద్రుష్టి మాత్రం నా చుట్టూ చక్కర్లు కొడుతున్న పిట్టల మీదే ఉంటుంది.
నేను విజిల్ వెయ్యగానే ఓ వంద పావురాలు నా చుట్టూ వాలిపోతాయి.
వాటి కోసం మా ఇంట్లో జొన్నలు స్టాక్ ఉంటాయి.హాయిగా జొన్నలు తినేసి,నీళ్ళ టబ్లో మునిగి జలకాలాడతాయ్.ఆడినంతసేపు ఆడి చక్కగా రెక్క లార్చి మట్టిలో పడకేస్తాయ్.
మేము పెంచుతున్న బుల్లి కోడిపిల్లలు గున గునా నడుస్తూ తోటంతా తవ్వి పోస్తుంటాయ్.
ఈలోగా దానిమ్మ చెట్టు మీదో,జామ చెట్టు మీదొ రామ చిలకలు వాలి రొద రొద చేస్తుంటాయ్.
నేను కూర్చున్న మామిడి చెట్టు బెరడుని టక టకా పొడుస్తూంటుంది వయ్యారి వడ్రంగి పిట్ట.
లోటస్ పాండ్ దగ్గర చేప పిల్లల కోసం ఒంటి కాలి మీద దొంగ జపం చేస్తూ ఓ కొంగ బావ,
ఇంత పొడుగు ముక్కేసుకుని పాలపిట్టలాగా ఉండే మరో పిట్ట కూడా కొంగ బావతో పోటీ పడ్తుంటుంది.
ఎక్కడినుండి వస్తుందో కానీ తోక ఊపుకుంటూ,టీ,టీ అంటు చాయ్ కోసం అరుస్తున్నాట్టు అరుస్తుంది ఓ బుల్లి పిట్ట.
ఈ లోగా వెదురు బియ్యం మొక్క ఆకును అవ్లీలగా మోసుకుపోతూ తేనెపిట్ట.కన్ను మూసి తెరిచేలోగా సగం మొక్కని మోసుకుపోతుంది.గుప్పెడంత ఉండే ఈ తేనె పిట్ట ఇంత బారుండే వెదురు బియ్యాం మొక్క ఆకులో,నిమ్మ గడ్డి ఆకుల్నో మోసుకుపోయే దృశ్యాన్ని చూసి తీరవలసిందే.
ఇంకో నలుపు తెలుపు కలబోత తొ,నిమిషానికి వంద సార్లు తోక ఊపుకుటూ తిరిగే బ్లాక్ అండ్ వైట్ పిట్ట ఒగలు చూడాల్సిందే.
ఇంతలో వస్తయండీ గువ్వల జంటలు. ఆడ గువ్వ ముందు మోకాళ్ళ మీద మోకరిల్లుతూ ప్రేమ సంకేతాలు పంపే మగ గువ్వ ఒద్దిక నవ్వు పుట్టిస్తుంది.ఆడ గువ్వ బెట్టు,దాని చుట్టూ చక్కర్లు కొట్టే మగ గువ్వ .
ఈలోగా జలకాలాడి,రెక్కలార్చిన పావురాలు జంట జంటలుగా జతకట్టి తిరుగుతుంటాయ్.మగ పావురాలు కూడా గువ్వ లాగానే ఆడ పావురం ముందు నానా విన్యాసాలూ చేస్తుంది.
అంత ఎత్తు ఆకాశంలో తిరుగుతూ కింద కనబడిన కోడిపిల్లాల కోసం గద్ద రివ్వున నేల మీదకి రాబోతుంటే తల్లి కోడి కీ అంటూ హెహ్హరిక చెయ్యగానే ఝామ్మంటూ తల్లి రెక్కల్లోకి దూరిపోయే పిల్లలు.
ఈలోగా గొంతు మూగబోయిన కోకిలమ్మలు మామిడి చెట్టు మీద చేరి గుర్రుగుర్రుమంటూ యుగళ గీతం అందుకుంటాయి.ఒక్కోసారి నాలుదైదు కలిసి సామూహిక గాన కచేరి మొదలు పెట్టాయంటే చెవులు చిల్లులు పడాల్సిందే.
గోరింకలు మహా ఠీవిగా నడుస్తూ పురుగుల్ని తిటుంటాయి.
పక్కనున్న వేప చెట్టు మీద చేరి ఓ ఉడుత కొంపలంటుకున్నట్టు అరవడం మొదలు పెడుతుంది.కొన్ని మొక్క జొన్న గింజలెయ్యగానే తోక ఊపుకుంటూ దిగొచి యమ ఫాస్ట్ గా ముందు కాళ్ళతో గింజల్ని తీసుకుని నోట్లో కుక్కుకుంటుంది.
తోక కింద ఎర్రగా ఉండి టొపీ పెట్టుకుని ఉండే పిట్ట బలే హడావుడి చేస్తూంటుంది.ఈ మధ్య ఏక్తార మీటినట్టు గట్టిగా కూసే పిట్టొకటి రావడం మొదలు పెట్టింది.ఇంకో పిట్టుంది అదేమో ఎవరో పట్టుకుని దాని గొంతు పిసికేస్తున్నారా అన్నత గోలగా అరుస్తుది.
ఇంకా ఎన్నో రకాల పిట్టలు వస్తాయి.కొన్నింటి పేర్లు నాకు తెయదు.
ఇన్ని రకాల పిట్టలొస్తాయి కానీ నా కళ్ళు మాత్రం పిచ్చికల కోసం వెదుకుతుంటాయి.వాటి కోసం మా సీతారామపురం నుండి తెచ్చి కట్టిన ధాన్యపు కంకులు నన్ను వెక్కిరిస్తూ ఉంటాయి.
పిచ్చికల కోసం నేను ప్రతి రోజూ ఎదురు చూస్తాను. ఒక్కటీ రాదు.అవి బతికుంటేగా రావడానికి.
రాని పిచ్చికల కోసం నా కళ్ళల్లోంచి ఓ కన్నీటి చుక్క నా ముందున్న పేపర్ మీద పడుతుంది.నా కాళ్ళ దగ్గర పడుకున్న హాయ్(కుక్క పిల్ల) నా వేపు చూస్తుది.
దానికీ నాకూ ఆకలి మొదలై అదో రెండు బిస్కట్లూ,నేను ఓ బ్రెడ్డు ముక్కో,గుర్రం దానానో (ఓట్సండి) తినేస్తా.
మళ్ళీ బుద్ధిగా పేపర్లో తలదూరుస్తా.

4 comments:

సుజాత వేల్పూరి said...

మీ టపాలు చూస్తుంటే మీ జీవితం ఎంత సౌందర్య భరితంగా తీర్చి దిద్దుకుంటారో అనిపిస్తూ ఉంటుంది సత్యవతి గారూ! పిట్టలతో,మొక్కలతో,స్నేహితులతో సాన్నిహిత్యం పంచుకుంటూ ఆపన్నులకు అభయహస్తాన్ని అందిస్తూ..వారిని అక్కున చేర్చుకుంటూ...ఎంతమంది ఉంటారు ఇలాగ?

అదృష్టవంతులు మీరు!

cbrao said...

పిట్టలతో చెట్టపట్టాల్ ఎంత బాగా వ్రాసారండీ! భారతీయ పక్షులను పరిచయం చేస్తూ ప్రఖ్యాత పక్షి ప్రేమికుడు సలీం ఆలి The Book of Indian Birds పుస్తకం వ్రాశారు. హైదరాబాదులో లభ్యమవగలదు. ఈ పుస్తకం చదివాక పక్షుల గురించిన ఆసక్తి ఎక్కువైతే Birdwatchers Society of Andhra Pradesh లో సభ్యులుగా చేరవచ్చు.
cbrao
Mountain View (CA)

కృష్ణప్రియ said...

చాలా బాగుంది.. మీ ఆదివారం గడిపే విధానం, దాన్ని మించి మీరు చెప్పిన విధానం..

maa godavari said...

@సి బి రావ్ గారూ ధన్యవాదాలండీ.
@క్రిష్ణ ప్రియ నా రాత నచ్చినందుకు సంతోషం.మెచ్చినందుకు థాంక్స్.
నా పిట్టల లోకంలోకి వచ్చినందుకు మీకు థాంక్స్.
సుజాతా!నువ్వు నా కన్నా చాలా చిన్న కాబట్టి నువ్వు అనే పిలుస్తాను.
కృష్ణప్రియ నా కన్నా చిన్నో పెద్దో తెలియదు.
నువ్వన్న దాంట్లో కొంత వరకు నిజముంది.
జీవితాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవడానికి ఇష్టపడతాను.
అలా ఉంచుకోవడానికి ప్రకృతిని మించిన వైవిధ్యం ఇంకేమి ఉంది?నేను ఎంచుకున్న పనిలో నేను నిత్యం వినేది,కనేది దుఖమే.బాధితుల పక్షాన పని చెయ్యడమంటే మనల్ని ప్రతి రోజు బాధల కొలిమిలో కాల్చుకోవడమే.
లోపల పేరుకుపోయే ఒత్తిళ్ళు,ఉక్రోషం,ఆక్రోశం బయటకు రావాలంటే ప్రకృతిని వాటేసుకోవడాన్ని మించిన మందు లేదనిపిస్తుంది నాకు.అందుకే ఎప్పుడూ చెట్ల వెంట, పుట్టల వెంట,పువ్వుల వెంట,పక్షుల వెంట తిరుగుతుంటాను.
వాటితో కబుర్లు చెప్పడం భలే బాగుంటుంది. మనుష్యులు అవసరం లేదా అంటారేమో.
నా కోసం ప్రాణం పెట్టే నేస్తాలున్నారు.
అందుకే నేను ఎప్పుడూ స్ట్రెస్ ఫీలవ్వను.మనకి తోచినవరకూ చేసుకుపోవడమే.
నాకు నచ్చిన ఒక వాక్యం ఉంది.
"జీవితం ప్రవహిస్తూ ఉండాలి తప్ప నిలవ నీరులా ఉండిపోకూడదు."
ఈ వాక్యమే నన్ను నిత్యం నడిపిస్తుంది..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...