ప్రేమంటే.......

రెండు హృదయాల కలయిక మాత్రమే ప్రేమా?
హృదయాల కలయిక అంటే ఏమిటి?
ప్రేమ ఇంత సంకుచితమా?
పసిమొగ్గల పాలబుగ్గల మీద మన పెదవిముద్ర ప్రేమ కాదా?
చెంగున ఎగిరే లేగ దూడని అమాంతంగా పట్టుకుని గుండెకి హత్తుకోవడం ప్రేమ కాదా?
విత్తును చల్లి,మొలక తొలిరేక విప్పుకుంటున్నప్పుడు
ఉప్పొంగే ఉద్వేగం ప్రేమ కాదా?
చెట్టు మీద,పుట్ట మీద,చెలమ మీద
మబ్బు మీద, మంచు మీద, మహా సాగరం మీద
కెరటం మీద,కాంతి పుంజం మీద
మనసులో విరజిమ్మే మధురోహలు ప్రేమ కాదా?
ప్రేమతో పెంచిన చెట్టు కొమ్మల్ని తుంచడానికి జంకుతామే
గుండె నిండా ప్రేమించానని గుండె విప్పి చూపించావే
ఆమె గొంతు కొయ్యడానికి నీకు చేతులెలా వచ్చాయిరా?
దీనికి ప్రేమ అని పేరు పెడతావా సంకుచిత పిశాచీ
ప్రేమ నిండిన హృదయంలోకి
ఈ కత్తులు,కఠార్లు,ఆసిడ్ బాటిళ్ళూ
అనుమాన పెను భూతాలు ఎలా వచ్చాయిరా అక్కుపక్షీ
అమ్మని ప్రేమించేవాడు మరో అమ్మ కన్న ఆడపిల్ల మీద
 హింసల్ని అమలుచేస్తూ ,అదీ తాను ప్రేమించానని
ప్రగల్బాలు పలికే "ప్రేమికుడా"
ప్రేమంటే విశాలం,ఉన్నతం
ప్రేమంటే హృదయాలు ఇచ్చి పుచ్చుకోవడమే కాదురా
ప్రేమంటే పంచడం,ప్రపంచమంతా చల్లడం
పంచే కొద్దీ ఊరుతుందిరా ప్రేమ
లోతు బావిలో తేటనీరు ఊరినట్టు
ప్రేమకు హద్దులు గియ్యకురా ప్రేమోన్మాదీ
హద్దుల్లొ ఉంచినదేదైనా హరించిపోతుంది.

Comments

gajula said…
maaku chance lekundaa meere thitteshaaru

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం