Tuesday, August 3, 2010

మాట్లాడుకోవాలి

ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మే నెలలో హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణాగ్రత. ఈ రోజు ఇరవై ఆరు. నిన్నటికి ఇవాల్టికి ఎంత తేడా. బంగాళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు లైలా! క్రితం సంవత్సరం వచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంశం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లు ఎందుకు పెడతారో!
మురళి, మాధవి బయట పచ్చటి లాన్‌లో కుర్చీలేసుకుని కూర్చున్నారు.చీకటి పడినట్లయిపోయింది. డాబామీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరబూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ప్లవర్‌. ఎర్రటి రంగుతో, అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటున ఈద్‌కాచాంద్‌లాగా దర్శనమిచ్చింది నెలవంక.
''బాగా వర్షం వచ్చేట్టుంది మురళీ! లోపలికెళదాం పద'' మాధవి అంది.
''తుఫాను ఎఫెక్ట్‌ బాగానే వున్నట్టుంది. వెళదాంలే బయట చల్లగా, హాయిగా వుంది'' అన్నాడు మురళి
''నిజమే! చాలా హాయిగా వుంది. మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని ఎంత కాలమైంది. ఏమిటో బతుకంతా ఉరుకులు, పరుగులతోటే సరిపోతోంది. దేనివెంట పరిగెడుతున్నమో అర్ధం కావడం లేదు'' అంది మాధవి నెలవంకని చూస్తూ.
మురళి కాసేపు మాట్లాడలేదు. మాధవి మనసులోని బాధ అర్ధం అవుతోంది. ఇరవై రెండేళ్ళ కాపురంలో మొదటి మూడు, నాలుగు సంవత్సరాల్లో తప్ప తాము ఇలా ఇంత ఆరామ్‌గా కూర్చున్నది లేదు. కార్పోరేట్‌ కాలేజీలో పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేసే యంత్రంలా తను, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తలమునకలుగా మాధవి. డబ్బుకేం లోటు లేదు. పిల్లలకి మంచి చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు. ఖరీదైన ఇల్లు, సౌకర్యాలన్నీ వున్నాయి.
''ఏంటీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌ మురళీ.''
''ఏం లేదు మధూ! ఇలాంటి సాయంత్రాల్ని ఎన్నింటిని కోల్పోయామా అన్పిస్తోంది.''
సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరూ లాన్‌లోంచి లేచి ఇంట్లో కొచ్చారు. ''కాఫీ తాగుదామా మురళీ''
''ఈ చల్లటి వాతావరణంలో అంతకంటే కావల్సిందేముంది పద కలుపుకుందాం.''
కాఫీ కప్పులతో డైనింగు టేబుల్‌ మీద కూర్చున్నారు. గాలి ఉధృతి పెరిగింది. వాన జోరుగా పడుతోంది. ఎక్కడో పెళ పెళమంటూ పిడిగు పడిన శబ్దం. కరెంటు పోయింది.
''ఎమర్జన్సీ లైట్‌ చెడిపోయింది. కాండిల్‌ ఎక్కడుందో ఏంటో'' అంటూ మాధవి లేవబోయింది.
''ఉండు మధు! కాండిల్‌ వద్దులే.కాసేపు చీకట్లో కూర్చుందాం.''
మాధవి కూర్చుంది. చిమ్మచీకటి. అపుడపుడూ మెరుపులు. దడామని పిడుగులు. వర్షం కురుస్తున్న శబ్దం మాలతీపూల మధుర సువాసనలు. గమ్మత్తుగా హాయిగా ఉంది వాతావరణం. మురళీకి నెల క్రితమే స్ట్రోక్  వచ్చింది  . క్లాసులో పాఠం చెబుతూ పడిపోవడంతో తనని అప్పటికప్పుడు కేర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం,కాలూ చెయ్యి ఎఫెక్ట్ కావడం   ఒక్కొటొక్కటి గుర్తొచ్చాయి మాధవికి.
''మధు! ఇలా చీకట్లో కూర్చోవడం బావుంది కదూ! మన మనస్సులోకి చూసుకునే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది''.
''నిజమే మురళి! నిదానంగా నిలబడి నీళ్ళుకూడా తాగలేని వేగం, ఒత్తిళ్ళు మన ఆరోగ్యాలను ఎంత ధ్వంసం చేస్తున్నాయో మనకి అర్ధమవ్వడం లేదు. నాకెందుకో ఇరవై సంవత్సరాల క్రితం నాటి విషయాలు ఇపుడు గుర్తొస్తున్నాయి.''
''ఏ విషయాలు మనం కలిసి బతకడం మొదలు పెట్టిన నాటి కష్టాలా? అవన్నీ ఇపుడెందుకులే మధూ''
''ఆ విషయాలు కాదు మురళీ!  నాకు ఇరవై ఏళ్ళ క్రితమే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. ఆ రోజుల్లో, మన దగ్గర డబ్బులేని రోజుల్లో నువ్వు ఎంత కష్టపడి నాకు ఆపరేషన్‌ చేయించావో నాకు గుర్తుకొస్తోంది."
''వద్దు మధూ! వాటిని గుర్తు చెయ్యకు. అయినా నువ్వు నెలరోజులుగా నా కోసం చేసిన సేవ ముందు అదెంతలే. ఏదో డబ్బుల్లేక గాంధీ హాస్పిటల్‌లో...
'మురళీ! ప్లీజ్‌ అలా అనకు! నన్ను మాట్లాడనీ..నీ కోసం నేను చేసిందేమీ లేదు. ఖరీదైన హాస్పిటల్‌, స్పెషల్‌రూమ్‌, నిరంతరం నర్సు సేవ చేసారు. నేను హాయిగా ఎ.సి రూంలో వున్నాను. కానీ గాంధీలో నేను ధోరాసిక్‌ వార్డులో వుంటే నువ్వెక్కడ వుండేవాడివో నాకు తెలుసు. భయంకర దుర్వాసనలు వెదజల్లే బాత్‌రూమ్‌ల పక్కన, జనరల్‌ వార్డుల పక్కన, రోడ్డు మీద గంటల తరబడి కూర్చోవడం, రాత్రిళ్ళు అక్కడే పడుకోవడం. నాకు తెలుసు మురళీ. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో నా గుండె ఆపరేషన్‌ విజయవంతమౌతుందా లేదా అనే టెన్షన్‌, పెద్దలకి ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అటునుంచి సహాయ నిరాకరణ. ఆ రోజుల్లో నువ్వెంత మానసిక క్షోభని అనుభవించి వుంటావో నాకు తెలుసు.నన్ను ఆపరేషన్‌ ధియేటర్‌కి పంపుతూ నువ్వు కార్చిన కన్నీటి చుక్క నా బుగ్గ మీద పడి, అప్పటికే సగం మత్తులో వున్న నాకు వెచ్చగా తాకి, నేను కళ్ళు విప్పి నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే నువ్వు కన్నీళ్ళ మధ్య నవ్వావ్‌. అంతే. రెండో రోజు దాకా నాకు స్పృహ రాలేదు. ఆ పగలు, ఆ రాత్రి నువ్వెంత ఏడ్చి వుంటావో నాకు తెలుసు. ఆ తర్వాత నన్నెంత అపురూపంగా చూసుకున్నావో, ఎన్ని సేవలు చేసావో నా మనసుకు తెలుసు. ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకునేదాన్ని. చెప్పలేదు. వెలుతురులో ఇగోలు, అహాలు అడ్డొస్తాయి కాబోలు. చీకట్లో మనలోకి మనం చూసుకోగలగుతాం.'' మాధవి మాట్లాడడం ఆపింది.
''మధూ! ఇరవై సంవత్సరాలైనా నువ్వింకా ఆ విషయాలు మర్చిపోలేదా? నిజమే! నా జీవితంలో కష్టమైన కాలమది. నా స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. నీకు గుండెలో పెద్ద రంధ్రముందని మొదటిసారి డాక్టరు చెప్పినపుడు నేను బిత్తర పోయాను. ఆ తత్తరపాటును ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్ధం కాలేదు. మనమున్న స్థితిలో ఖరీదైన వైద్యం చేయించలేను. అయినా అప్పటికి అపొలోలు, కేర్‌లు ఎక్కడున్నాయ్‌? గాంధీ యే దిక్కు. అయితేనేం డాక్టర్లందరూ ఎంతో మంచివాళ్ళు. ఇప్పటిలా కమర్షియల్‌ ఆలోచనలు వున్న వాళ్ళు కాదు.''
''అవును. నేను కళ్ళు తెరిచేటప్పటికీ నా ఎదురుగా కూర్చుని వున్నారు. డా. సత్యనారాయణగారు. రికవరీ రూమ్‌లో ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. అంత ప్రత్యేక శ్రద్ధతో చూడడంవల్లే నేను బతికి పోయాననుకుంటాను.''

''మధూ! ఆ విషయం సరే! నేను కూడా నీకు చాలా దు:ఖం కల్గించాను. బతుకు బండి వంద మైళ్ళ వేగంతో పరుగెతున్నపుడు ఏమీ అర్ధం కాలేదు. నేను నా ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకున్నాను. శరీరాన్ని మిస్‌ యూజ్‌ చేసాను. నా జ్ఞానాన్ని లక్షలకి అమ్మి, యంత్రాల్ని, యంత్రాల్లాంటి విద్యార్ధుల్ని తయారు చేసాను. ఎక్కడ ఎక్కువిస్తే అక్కడికి జంప్‌ చేసి డబ్బు సంపాదనే ముఖ్యమైన ప్రాధాన్యత అనుకున్నాను. సంపాదించిన డబ్బుని ఆస్తులుగానో, వస్తువులుగానో మార్చాను. బ్లాక్‌ లేబుల్‌, రెడ్‌లేబుల్‌ అంటూ బాటిళ్ళకి బాటళ్ళు గొంతులో పోసి గుండెను ఛిద్రం చేసుకున్నాను. నీ మాట ఏనాడైనా విన్నానా? నీకసలు దొరికేవాడినా? నిన్ను చాలా హింస పెట్టాను కదా! డబ్బుతో పాటు బోలెడన్ని రోగాలూ సంపాదించాను. ఆ రోజు  క్లాసులో కుప్పకూలేవరకూ నేను ఏంచేస్తున్నానో ఎలా బతుకుతున్నాననే స్పృహే లేదు. ఆయాంసారీ! మధూ!'' మురళి గొంతు పూడుకుపోయింది.
మాధవి కుర్చీలోంచి లేచి వచ్చి మురళి వెనుక నిలబడింది. అతన్ని గుండెకి పొదుపుకుంటూ...
''మన మధ్య సారీలేంటి మురళీ! నాకు నీ ఆరోగ్యం గురించి చాలా బెంగగా వుండేది. నీ లైఫ్‌స్టయిల్‌ దిగులు పుట్టించేది. డబ్బు వెంట ఎందుకంత వెర్రిగా పరుగెడుతున్నావో అర్ధమయ్యేది కాదు. ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్ళినపుడల్లా నాకు చాలా బాధగా అన్పించేది.''
''నిజమే! బహుశ మన మొదటి రోజుల్లోని కష్టాలే నన్ను అలా పరుగెత్తించాయేమో!ఏమో!''
పెద్దగా ఉరిమింది. కళ్ళు మిరుమిట్లుగొల్పే మెరుపులు. ఫెళ ఫెళమంటూ ఎక్కడో పడిన పిడుగులు.
''ఇంక కరెంటు రాదేమో! కొవ్వొత్తి ఎక్కడుందో'' ''ఉండనీయ్‌లే మధూ! ఇపుడు కరెంట్‌తో మనకి పనేం లేదుగా. డిన్నర్‌ టైమ్‌కి చూద్దాంలే.''
''అంతేనంటావా. ఇలా చీకట్లో కూర్చుని మాట్లాడుకోవడం బావుంది. పండువెన్నెల పరవశాన్ని కల్గిస్తుంది. చీకటి చిక్కదనం కూడా ఇంత బావుంటుందనుకోలేదు.''
''బహుశా మనం చీకటిని వెలుతురును ఒకేలా చూసే దశకి చేరామేమో!''
''అంతే కాదు మురళి! ఇంతకాలం మనం దేనికో దానికి పోట్లాడుకుంటూనే గడిపాం. అది నీ ఉద్యోగమా! పిల్లల విషయమా! నేను చేసే పొరపాట్లా. సాధింపులా? ఏదైనా కానీ ఇలా కూర్చుని సావకాశంగా మాట్లాడుకున్నది లేదు. చర్చించుకున్నది లేదు. ఆవేశాలు, కావేశాలు అంతే. ఇపుడు మనమిద్దరమే మిగిలాం. పిల్లలు అమెరికా నుంచి తిరిగి వస్తారని నాకయితే నమ్మకం లేదు. నాకు నువ్వు నీకు నేను అంతే.'' మురళి జట్టులోకి వేళ్ళు పోనిస్తూ అంది.
''అవును మధూ! ఇంతకాలం ఎవరికోసమో బతికినట్టుంది. ఉద్యోగం కోసం, సంపాదన కోసం, పిల్లలకోసం పరుగులు పెడుతూ బతికాం. అదీ అవసరమే కానీ నేను మరీ విపరీతంగా ప్రవర్తించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. అలా చేసి ఉండకూడు కదా!''
''జరిగిపోయినవి తలుచుకుని బాధపడ్డం ఎందుకులే మురళీ! ఇపుడేం మించిపోలేదు. మనం కలిసి బతకడం మొదలుపెట్టినపుడు ఎంత స్నేహంగా, సంతోషంగా వున్నామో మనిద్దరికీ తెలుసు. మధ్యలో వచ్చిన వేవీ మనకి సంతోషాన్నివ్వలేదు. మన మధ్య కనబడని అగాధాన్ని సృస్టించాయి. ఈ రోజు ఎంతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకోగలిగాం. ఇది ఇలాగే కొనసాగితే ఇంతకు మించింది ఏముంటుంది?''
''రోజూ లైట్లాపేసి చీకట్లో ఓ గంట గడిపితే బావుండేట్టుంది.'' అన్నాడు మురళి నవ్వుతూ
''నువ్వు ట్లాబ్లెట్లు వేసుకోవాలి. కొవ్వొత్తి కోసం వెతకాల్సిందే.'' అంటూ మధు లేవబోయింది.
అదే క్షణంలో కరెంటు వచ్చింది.
వెంటనే ఫోన్‌ కూడా మోగింది. మాధవి లేచి ఫోనందుకుంది. కూతురు శ్రావ్య. ఫోన్‌ మురళికిచ్చి టాబ్లెట్‌ కోసం వెళ్ళింది మాధవి.
''బావున్నానురా! ఏంచేస్తున్నామా? జోరుగా వాన పడుతోంది. అమ్మ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. నిజం రా. నమ్మకం కలగడం లేదా? అయితే అమ్మనడుగు'' మాధవికిచ్చాడు ఫోన్‌.
'తల్లీ! నాన్న చెప్పింది నిజమేనే. చాలా సంవత్సరాల తర్వాత మేం బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న బాగానే వున్నాడు. మా గురించి మీరేం కంగారుపడకండి. సరేనా'' ఫోన్‌ పెట్టేసింది.
మళ్ళీ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. గడ్డ కట్టిన మాటల మూటలేవో కరిగి వర్షం నీరులా ప్రవహించసాగాయి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దవుతూ మరిన్ని మాటల్ని వెదజల్లుకుంటూ అలాగే కూర్చుండి పోయారు మురళి, మాధవి.

1 comment:

భావన said...

చాలా బాగుందండీ.. ఎన్నో కాపురాల కత.. మనసుకు తగిలే వెత ను చక్క గా చెత్రీకరించారు.. అన్ని కాపురాలు ఈ కధ లా ఆఖరులో ఐనా సుఖాంతం ఐతే బాగు :-) దురాశ అంటారా?

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...