Sunday, May 13, 2007

నేను కడుపు లో ఉన్నపుడు అమ్మ ధాన్యం కొట్లో పనిచేస్తొందంట.అక్కడే నేను పుట్టానట.అప్పట్లో ఆడవాళ్ళు పురుడొచ్చేవరకు పని చేస్తూనే ఉండేవాళ్ళు.నేను పుట్టిన పద్నాలుగో రోజు మా అమ్మమ్మ చనిపోయిందట.తల్లి చనిపోయిన దుఖంలో అమ్మ నా అలనా పాలనా పెద్దక్కకి వదిలేసింది.నేను అలా గాలికి, ధూళికి పెరిగాను.
నా చిన్నతనం, నా బాల్యం ఏడు రంగుల ఇంధ్రధనుస్సంత అందమైంది.ఏభై మందున్న ఉమ్మడి కుటుంబంలో మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.చెట్లెంబడి కోతుల్లా తిరుగుతూ, దొరికిన కాయా, కమ్మా తిని పక్షుల్లా బతికేవాళ్ళం.రాత్రి మిగిలిన చద్దన్నంలో గంజి పోసుకుని ,ఆవకాయ ముక్క నంజుకు తినేవాళ్ళం.నూకలతో అన్నం చేసి గిన్నెల్లో పోసేవాళ్ళు.అది తాగేవాళ్ళం.నా బాల్యంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆంక్షలు లేని స్వేచ్చ ఉండేది.మమ్మల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు.మా అమ్మ నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు ఒక్క ఞ పకం కూడా లేదు.అలాగని విపరీతంగా పట్టించుకుని ప్రేమించిన ఞాపకం కూడా లేదు.
నేను చదువుకోవడం కొరకు చాలా పోరాటమే చేసాను.ఈ విషయంలో అమ్మ కన్నా నాన్నే నాకు అండగా నిలిచాడు.ఉమ్మడి కుటుంబంలో స్వేచ్చ లేని అమ్మ ఏం చేయగలుగుతుంది?అష్ట కష్టాలు పడి ఎన్నో అడ్డంకుల్ని దాటి,డిగ్రీ వరకు చదువుకోగలిగాను.
అమ్మ చాలా చొరవగా,ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉండేది.కుటుంబంలో ఎవరికి ఏ రోగాలొచ్చినా పూర్ణని పిలవాల్సిందే.వాళ్ళతో ఆసుపత్రులకు వెళ్ళి ఉండిపోయేదట.ఆ రోజుల్లో గుండె ఆపరేషన్లంటే పెద్ద గండాల్లంటివి.ఈ ఆపరేసన్లను తమిళనాడులోని రాయవెల్లూరు లో చేసేవాళ్ళు.అమ్మ నాలుగు సార్లు గుండె రోగుల్ని తీసుకుని రాయవెల్లూరు వెళ్ళీంది.
అక్కడి క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో పేదలకి ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేసావారు. పాత చీరలు కట్టుకుని,వంటి మీదుండే నగల్ని తీసేసి, పక్కా బీదల్లా వీళ్ళు వేళ్ళేవాళ్ళత.భాషరానిచోట, అమ్మ దాక్టర్లతో మట్లాడేదట.వండుకుని తింటూ ఆసుపత్రిలో రోగులను చూసుకుంటూ ఉండేదట.ఈ చొరవ, సహాయం చేసే మనస్సు అమ్మకు ఉండడం వల్లనే
అందరూ "పూర్ణమ్మ దేవత" అనేవారట.
ఉమ్మడి కుటుంబంలో అమ్మ ఎన్నో కష్టాలు పడింది.నాన్న వ్యాపార నిర్వాకాల వల్ల కష్టాలు పడింది. నాన్నకి శ్ర చేయడం తప్ప కల్లా కపటం తెలియదు.అలాంటి వాడు వ్యాపారం ఛెస్తే తుకారాం వ్యాపారమే అవుతుంది.
175 ముగుస్తుండగా నాన్న నన్ను హైదరాబాదు తీసుకొచ్చి మా ఆరో చిన్నాన్న ఇంట్లో వదిలాడు.నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నాన్నకి చాలా కోరికగా ఉండేది.ఆయన బ్రతికి ఉండగా నాకు ఉద్యోగం రాలేదు.నాన్న పోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది.ఆర్ధిక ఇబ్బందులకి అంతే లేదు.అల్లంటి సమయంలో నేను హైదరాబాదులో ఉండి, ఏదో కోర్సు చెయ్యడం కోసం రు350/ పంపమని అమ్మనడిగితేతనకున్న ఒకే ఒక గొలుదు తాకట్టు పెట్టి డబ్బు పంపింది.
1977 లో నాన్న చనిఫొయాడు.1979 లో నాకు పబ్లిక్ సర్వీస్ కమీష్న్లో ఉద్యోగం వచ్చింది.ఒక గది రు60 కి అద్దెకు తీసుకుని అమ్మని,తమ్ముడిని తీసుకొచ్చేసాను.అలా వచ్చిన అమ్మ 2005 మే నెలలో చనిపోయేవరకు నాతోనే ఉండిపోయింది.
నా జీవితంలోని ఎగుడుదిగుడులకి, ఎదుగుదలకి అమ్మ ప్రత్యక్ష సాక్షి.నా స్వేచ్చకి తను ఏనాడు తను అడ్డుపడలేదు.ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎపుడూ నాకు చెప్పలేదు.నేను ఏం చేసినా కరెక్టుగా, ఖచ్చితంగా చేస్తానని అమ్మకి గొప్ప నా నమ్మకం.నేను నాస్తికత్వానీ నా జీవితాచరణగా ఎంచుకుని,ఒక నాస్తికుణ్ణి ఇష్ట పడి అతనొతో కలసి ఉంటానని చెప్పినప్పుడు తను న్న్నేమి అనలేదు.
1980 లో విజయవాడలో అంత్ర్జాతీయ నాస్తిక మహా సభలు జరిగినపుడు,విజయవాడ గురించి ఏమి తెలియకుండా నేను ఒక్క దానే బయలుదేరినపుడు అమ్మ అస్సలు భయపడలేదు.వెళ్ళమనే చెప్పింది.ఆ సభల్లో నేను నా జీవిత సచరుణ్ణి ఎంచుకున్నానను.ఆ ఎంపిక చాలా గమ్మత్తుగా జరిగింది.నాస్తిక సభలు జరిగినపుడు మూధ నమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమ్మాలు చేసారు.అందులో ఒకటి నిప్పుల మీద నడవడం.నేను నిప్పులమీది నుంచి నడిచి వచ్చినపుడు పడిపోకుండా ఓ చెయ్యి నన్ను పట్టుకుంది.అతనే నా జీవిత సహచరుడ్య్యాడు.అలా మా పరిచయం జరగడం,అది స్నేహంగా పరిణామం చెందడం జరిగింది,అతను ఉండేది హైదరాబాదే కాగ్
బట్టి మా ఇంటికి వస్తూ ఉండేవాడు.అతని రాక పోకల్ని అమ్మ ఏనాడూ ప్రశ్నించలేదు.అతన్ని రిజిష్టర్ పెళ్ళి చేసుకుంటానని చెప్పినపుడు మాత్రం అమ్మ అడిగింది.సంప్రదాయ పద్ధతిలొ చేసుకోమని.నేను సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి ఛేసుకోనని,తాళి, మట్టెలు, నల్లపూసలు లాంటివి వేసుకోనని ఖచ్చితంగా చెప్పాను.నేనలా ధ్రుఢంగా చెప్పేసరికి తను ఇంకేమి అనలెదు..నీ ఇష్టం అంది. 1981 లో మేమిద్దరం అమ్మ సాక్షిగానే రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాం. అమ్మ ఎప్పటికి నాతోనే ఉంటుందని అతనికి ముందే చెప్పాను.మామూలుగా ఆడపిల్లలు అత్తారింటికి వెళతారు.నేను అత్తారింటికి వెళ్ళలేదు. నా సహచరుడే ఒక చిన్న పెట్టెతో నా గదికి వచ్చేసాడూ.అల మా సహజీవనం మొదలైంది.నేను ఆఫీసుకి,తను కోర్టుకి వెళ్ళిపోతే అమ్మే ఇంటిని చక్కబెట్టేది.
నా జీవితంలో నేను ఎప్పుడూ వంట చెయ్యలేదు.నాకు వంట చెయ్యడం ఇష్టం లేదు.అమ్మ మాకు వండి పెట్టేది.నా కర్యక్రమాల్లో మునిగితేలుతూ అసలు ఇంటి గురించి పట్టించుకునేదాన్ని కాదు.
అమ్మ ఎక్కడున్నా తనకి బోలెడు మంది స్నేహితులుండేవారు.మా ఇంట్లో మాగి అని ఓ కుక్క ఉండేది.అమ్మని మాగి అమ్మమ్మ అని పిల్లలు పిలిచే వాళ్ళు.మా ఇల్లు మాగి అమ్మమ్మ ఇల్లుగానే ప్రసిద్ధం.చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో సాయంగా ఉండడం వల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవాళ్ళు.అమ్మని నాతో పాటు మీటింగ్లకే కాకుండా పిక్నిక్లకు,విహారయాత్రలకు నాతో తీసుకెళ్ళేదాన్ని.నా స్నేహితులతో బాగా కలిసిపోయేది.
నా సహచరుడు అమ్మని అత్త అని ఏరోజు పిలవలేదు.నాతో పాటు అమ్మా అనే పిలిచేవాడు.అమ్మంటే అతనికి చాలా ప్రేమ.నేను ఇల్లు, సంసారం మొత్తం అమ్మకే అప్పగించేసాను.ఈ బాధ్యతలేవీ లేకపోవడం వల్ల వ్యక్తిగా, రచయిత్రిగా,జర్నలిష్టు గా నేను ఎదగగలిగాను.అందరిలా నేను సంసారం బధ్యతల్లో కూరుకునిపోయి ఉంటే ఏమై ఉందునో నేను ఊహించను కూడాలేను. వంట పని ఈంటి పని ఆడవాళ్ళ సమయాన్ని ఎలా మింగేస్తాయో నాకు తెలుసు.అమ్మ వల్ల నేను ఈజంఝాటం నుండి తప్పించుకోగలిగాను.
సంసార బంధనాల్లో నేనెపుడూ తామరాకు మీద నీటిబొట్టు లాగానే ఉంటాను.
అయితే అమ్మని ఇంటికే అంకితం చేసానని అనుకోవద్దు.నాతో పాటు అన్ని మీటింగ్లకి తీసుకెల్లేదాన్ని.సాహిత్య కర్యక్రమాలకి తీసుకెల్లేదాన్ని.నేను తీసుకెల్లేననడం కంటె తనే వచ్చేదంటే బావుంటుంది. నాతో పాటు బయటకి రావడం తనకి ఇష్టం. తనకి తెలియని రచయిత్రిలేదు.అందరితో ఎంతో కలివిడిగా మాట్లాడేది.నా ఫ్రెండ్స్ అందరూ తనకి ఫ్రెండ్స్.నా ఆత్మీయ నేస్తాలంతా తనకి చాలా దగ్గరి వాళ్ళు.నా కోసం ఇంటికొచ్చే వాళ్ళంతా నేను ఇంట్లో లేకపోయినా అమ్మతో హాయిగా మాట్లాడేసి వెళ్ళిపోయేవారు.
అమ్మకి జీవితం పట్ల ఎంతో ప్రేమ.


ఇంకా ఉంది....

2 comments:

cbrao said...

Mothers Day నాడు మీరు ప్రచురించిన అమ్మతో మీ అనుబంధం వ్యాసం బాగుంది.
"అతను ఉండేది హైదరాబాదే కాబట్టి మా ఇంటికి వస్తూ ఉండేవాడు."-మీ జీవిత సహచరుడి పేరు రాస్తే బాగుండేది.
నాస్తిక భావాలున్న స్త్రీలు బహు అరుదు. ఆ అరుదైన వ్యక్తి మీరైనందుకు ప్రమోదం.

మంజుల said...

చాలా వివరం గా మనసులోంచి రాశారు సత్యవతి గారూ.
మన జీవితాల్లో అమ్మది ఎంత ముఖ్యమైన పాత్రో మళ్ళి ఒకసారి గుర్తు చేశారు.
మీ వ్యక్తిత్వం గురించి నాకివ్వాళే చాలా ఆసక్తికరమైన కొత్త విషయాలు తెలిశాయి.
ఇంకా తెలుసుకోవాలని ఉంది.
మీ నుంచి నైతిక స్థైర్యం పొందాలని ఉంది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...