ఈ రోజు మధ్యాహ్నం ఎండవేళ విసుగ్గా,చిరాగ్గా ఇంట్లో వున్నవేళ
ఓ నీలిరంగు ఉత్తరం పిట్ట అలా అలా ఎగురుకుంటూ వచ్చి నా ముంజేతి మీద వాలింది.అద్భుతం.
విసుగంతా మాయమైపోయింది.ఎన్నాళ్ళకెన్నాళ్ళకి.చాలా రోజులుగా కంటాక్టులో లేని శుభ రాసిన ఉత్తరమది.ఇటీవల మా ఊ రెళ్ళినప్పుడు నా అడ్రస్సు సంపాదించి ఈ ఉత్తరం రాసిందట.
శుభ రాసే ఉత్తరాలు, ఆ చేతి వ్రాత నాకు చాలా ఇష్టం.
మేమిద్దరం ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం.బోలెడన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.
నాకు ఉత్తరం రాయడమంటే ఎంతో ఇష్టం.నా ప్రియ నేస్తాలకి నేను రాసిన ఉత్తరాలు ఫైళ్ళల్లో నిండి ఉన్నాయి.వళ్ళు వాటిని భ ద్రంగా దాచుకున్నారు.ఎన్నో సార్లు హాయిగా కూర్చుని వాటిని చదువుకోవడమూ ఉంది.
జయ అని నాకు 30 సంవత్సరాలుగా ఆత్మీయురాలైన ఓ నేస్తముంది.మా స్నేహం నిత్యనూతనంగా అలరారుతూనే ఉంది.ఈ 30 ఏళ్ళలో తనకు నాకు మధ్య నడిచిన ఉత్తరాలు ఇంకా భద్రంగా ఉన్నాయి.నాకు సంబంధించి నా 30 ఏళ్ళ జీవితం వాటిల్లో దాగి ఉంది. ఇప్పుడు వాటిని చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో వర్ణించలేను.బతుకుపోరాటం,అప్పటి ఆశయాలు, ఆరాటాలు,ఆవేశాలు,ఉద్యమాలు,ఉద్యోగాలు ఒకటా రెండా ...ఎన్నో ఎన్నెన్నో...చదువుకున్న పుస్తకాలు,చూసిన ప్రదేశాల వివరాలూ.అన్నీ అక్షరబద్దమై ఉన్నాయి.
నా వరకు నేను మా ఊరికి దూరమవ్వనట్టుగానే ఉత్తరాలకి దూరమవ్వలేదని చాలా గర్వంగా చెప్పగలను.ఇప్పటికి నేను ఉత్తరాలను ప్రేమగా,ఆత్మీయంగా నా ప్రియ నేస్తాలకి రాస్తూనే ఉన్నాను.
నా ద్రుష్టిలో ఉత్తరమనేది ఉత్త కాయితం ముక్క కాదు.ఉద్వేగాల గని.ప్రవహించే జీవ నది.గుండెలోని ఊసుల్ని వేళ్ళ కొసల ద్వారా వ్యక్తీకరించేదే ఉత్తరం.

Comments

radhika said…
మీరు అద్రుష్టవంతులు.నేను కూడా.http://snehama.blogspot.com/2006/12/blog-post_13.html
Virtual said…
I don't agree with your political ideas