Monday, May 7, 2007

చాలా రోజుల తర్వాత నిన్న అంటే ఆదివారం ఆబిడ్స్ లోని పాతపుస్తకాలు దుకాణాలకి వెళ్ళాను.
పది గంటల నుండి 12.30 దాకా ఎర్రటి ఎండలో పాత పుస్తకాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కొన్ని పుస్తకాలు కొన్నాను. ఇరవై ఏళ్ళ క్రితమైతే ప్రతి ఆదివారం దాదాపుగా వెళ్ళేదాన్ని. అక్కడే ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కొనుక్కున్నాను. ఎంతో మంది నాలాంటి వాళ్ళు అక్కడ కనపడి ఎంతో ప్రేమగా పలకరించే వాళ్ళు.ప్రతి దుకాణం ముందూ గంటల తరబడి నిలబడి ప్రతి పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కావలసినవి దొరికితే సంతోషంగా స్వంతం చేసుకునేదాన్ని.ఒక్కో సారి అద్భుతమైన పుస్తకం చాలా తక్కువ ధరకే దొరికేది.ఎంత ఆనందమో.
నిన్న అలాంటి ఆనందం మచ్చుక్కూడా కలగలేదు.అసలు తెలుగు పుస్తకాలే ఎక్కువ కనబడలేదు. బుచ్చిబాబు గారి సాహిత్య వ్యాసాలు పుస్తకం దొరికింది.క్రిష్ణశాస్త్రి గారి క్రుష్ణపక్షం కూడా అక్కడ దొరికింది. పుస్తకాలు సరే దుకాణాల ముందు మనుష్యులూ లేరు. చాలా బాధగా అనిపించింది. అవును మరి నేను కూడా చాలా సంవత్సరాలకి కి కదా వెళ్ళాను. నాలాగే అందరూ మానేసి ఉంటారు.టాయిలెట్ అవసరం పడి పక్కనే ఉన్న బిగ్ బాజార్ కి వెళ్ళాను.కడుపు నిండా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు తాగడంతో ఆ అవసరం పడింది.అంతవరకు నేనెప్పుడూ బిగ్ బాజార్ చూళ్ళేదు.ఏమి జనం.కిటకిట లాడుతూ జనం.ఆ జన ప్రవాహాన్ని దాటుకుని మళ్ళీఈ పాతపుస్తకాల షాపులవేపు,వెలవెలబోతున్న షాపులవైపు నడిచాను.

3 comments:

రాధిక said...

ఉరుకుల పరుగుల జీవితాల్లో అలసట తీర్చుకోడానికి,ఆనందం పొందడానికి వివిధ మార్గాలు.పొద్దులో వచ్చిన నాకవితలో దీనిగురించే నేను బాధపడ్డాను.మనకి మంచి పుస్తకం అలుపు తీర్చి, శక్తినిచ్చి ఆనందాన్ని కలిగిస్తే మిగిలినవాల్లకి బిగ్ బాజార్లు,మాల్స్ ఆనందాన్నిస్తాయి.ఇటువంటి వాటికి నేను కూడా అతీతం కాదులెండి.కొన్ని సార్లు అలా మాల్స్ కి ,బౌలింగ్ కి వెళ్ళి ఆనందం అనుభవిస్తూవుంటాను.

oremuna said...

నేను కూడా అదే రోజు అదే సమయంలో వెళ్ళినాను

శ్రీశ్రీ ఖడ్గ శృష్తి, కె. శివారెడ్డి కవితలు మొన్నగు ఏడు పుస్తకాలు ఓ నూట ఇరవై రూపాయల్లో కొన్నాను.

అవును, తెలుగు పుస్తకాలు తక్కువగా ఉన్నాయి, అన్నీ ఇంజినీరింగే!

ఎండల వల్ల అనుకుంట జనాలు ఎక్కువగా లేరు, అబ్బ ఏం ఎండలు, ఏం ఎండలు

Srini said...

టి.వి.లు, సినిమాలు, మాల్స్, పబ్స్ ఇలా ఇవాళ్టి మానవుడికి కావల్సినన్ని ఆప్షన్స్ ఉండడం చేత పుస్తకపఠనం బాగ తగ్గిపొయింది. ఒక 10, 15 సంవత్సరాల క్రితం నేను కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్లేవాడిని. కాలంతో పాటు పెరిగిన పనులు, బద్దకం ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ మధ్య వెళ్లడం చాలా తగ్గి పొయింది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...