Saturday, May 12, 2007
ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు
మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.
అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడేది. అమ్మమ్మ చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత అమ్మ మీదే పడింది.వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు తనే చూసింది.దాయాదుల పంచన ఉంటూ,తల్లిని, తండ్రిని కోల్పోయి,ఆస్తులు చేజారిపోయి అమ్మ అష్ట కష్టాలు పడిందని,అయినా తనకు పుట్టిల్లంటే,దాయాదుల పిల్లలంటే చాలా ఇష్టమని అక్క అంటుంది.
నేను పుట్టిన పది రోజులకి మా అమ్మమ్మ చనిపోయిందట.అమ్మ నన్ను మా పెద్దక్కకి వదిలేసి వెళ్ళిపోయింది.నెను ఎలక పిల్లలాగా ఇవాళొ రేపో పోతానన్నట్టు ఉండేదాన్నట.ఓ చింపిరి చాప మీద దొర్లుతూ ఉండేదాన్నట.అక్కకి తీరికైనపుడు కొన్ని పాలు తాగించేదట.
మా అమ్మ ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాకిరీ యంత్రంలా పనిచేసిది.మా తాత(మా నన్న నాన్న)కి ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.నాకు ఊహ తెలిసేటప్పటివరకు అందరూ కలిసే ఉండేవార్ళ్ళు.ఈంట్లోని ఆడవాళ్ళు పూటకి ఏభై మందికి వండి పోసేవాళ్ళట.ముందు మగవాళ్ళు,తర్వాత పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలి ఉంటేనే ఆడవాళ్ళకి.చాలా సార్లు గంజి నీళ్ళే ఉండేవని అమ్మ అంటూ ఉండేది.అమ్మ కన్నా ఉమ్మడి కుటుంబంలోని బాధలు,కష్టాలు పెద్దక్క ఎక్కువ అనుభవించింది.చెళ్ళెళ్ళ బధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా పుట్టింట్లో ఉండేదట.
మా పెద్దాక్క అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది.మా తాత వంట వస్తువుల్ని తూకం ప్రకారం ఇవ్వడం వల్ల చివరగా తినే ఆడవాళ్ళకి చాలా సార్లు ఏమీ ఉండేది కాదు.ఆడవాల్లు తిన్నరా లేదా అని ఎవరికి పట్టేది కాదట.మా అక్క వళ్ళని వీళ్ళని అడిగి ఏవేవో తెచ్చి అమ్మకి పెట్టేదట.అమ్మ తోడికోడళ్ళు ఆరుగురు.అందులో కొందరు అమ్మతో తగవులు పడేవారట.అమ్మకి తగవులంటే భయం.గొడవలంటే భయం.తగవులు మొదలైతే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకునేదట.
ఇంకా ఉంది......
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
No comments:
Post a Comment