Friday, September 2, 2011

ఆద్యంతం మహాద్భుతం - అమర్‌నాథ్‌ ప్రయాణం











నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను. అందులోను హిమాలయాల్లోకి పయనం అంటే ఇంక ఆలోచించేదే ముంది? అమర్‌నాథ్‌ ప్రయాణం అనుకోకుండా, హఠాత్తుగా సంభవించింది.  నా సహచరుడితో పాటు నా తమ్ముడు, అతని భార్య, వాళ్ళ అక్క కూడా వచ్చారు. శ్రీనగర్‌, అమర్‌నాథ్‌ చాలా చలి ప్రాంతాలు కాబట్టి బోలెడంత ఉలెన్‌ సామగ్రితో శుక్రవారం ఉదయం మా ప్రయాణం మొదలైంది. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి శ్రీనగర్‌ బయలుదేరాం.

నాకు ఢిల్లీ నుండి శ్రీనగర్‌ వెళ్ళే దారిలో కనబడే హిమాలయాలు చూడడం చాలా ఇష్టం. హిమాలయాల మీద నుంచి విమానం వెళుతున్నపుడు, మంచుతో కప్పబడిన, మహాత్తుంగ పర్వతశ్రేణులు, లోయలు, ఆ లోయల్లోని ఆవాసాలు చూస్తున్నప్పుడు మనసు దూదిపింజెలాగా ఎగిరి, ఆ హిమాలయాలమీద తిరుగాడుతుంది. అయితే ఈసారి కొండలన్నీ నిజరూపాన్ని ప్రదర్శించాయి తప్ప ఒక్క పిసరు కూడా మంచు లేదు. పర్వతశ్రేణులు ఠీవిగా నిలుచున్నాయి శుభ్రంగా స్నానం చేసినట్టు. అది వేసవి కావడం వల్ల మంచు మొత్తం కరిగిపోయింది. నా మనసు కూడా నీరయి పోయింది మంచు కనబడక.

చలితో గడగడలాడిపోతాం కాబోలు, శ్రీనగర్‌ అంటే చలి కదా అనుకుని భుజాలమీద శాలువాలు తగిలించుకున్న మాకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఎర్రటి ఎండ ఈడ్చికొట్టింది. చురచురా కాలుస్తున్న ఎండ, ఇది శ్రీనగరా, జమ్మూనా అనే అనుమానాన్ని కలిగించింది. అంత వేడిగా వుందన్నమాట. హమ్మో! ఇంత ఎండేంటిరా బాబూ అని ఆపసోపాలు పడుతూ మా గెస్ట్‌హౌస్‌ చేరాం. అక్కడి వాతావరణం మమ్మల్ని కొంత సేదతీర్చింది. చుట్టూ కనబడే పచ్చటి, ఆకాశమంత ఎత్తు ఎదిగిన చీనార్‌ చెట్లు, గెస్ట్‌హౌస్‌ను ఆనుకుని ప్రవహించే జీలం నది మీంచి వచ్చే చల్లగాలి  తగలగానే ఎండ, గిండ అంతా మర్చిపోయాం. శ్రీనగర్‌లో  చినార్‌ మహావృక్షాలు చాలా అందంగా వుంటాయి. వందల సంవత్సరాలున్న అతిపెద్ద చెట్లు కూడా కనబడతాయి.

శ్రీనగర్‌ కొంత ప్రశాంతంగానే వున్నట్లు కనబడింది. క్రితం సంవత్సరం అల్లర్లతో అట్టుడుకింది కానీ ప్రస్తుతం మామూలుగానే వుంది. భద్రతా దళాలు కూడా తగ్గినట్లనిపించింది. ఇంతకుముందు అడుగడుగునా పోలీసుతో, సిఆర్‌ఫిఎఫ్‌ వాళ్ళో, బిఎస్‌ఎఫ్‌ వాళ్ళో కనబడే వాళ్ళు ప్రస్తుతం అక్కడ జీవితం ప్రశాంతంగా వుందన్న భ్రమ అయితే కలిగింది. మేము శ్రీనగర్‌లో చూడాల్సినవన్నీ ఆ రోజు సాయంత్రమే చూసేసాం. ముఖ్యంగా ఆపిల్‌ గార్డెన్‌లో చిన్నపిల్లలమే అయ్యాం. విరగకాసిన ఆపిల్‌ పండ్లు కనబడగానే ఆ గార్డెన్‌లోకి చొరబడి బోలెడన్ని ఫోటోలు దిగాం. శ్రీనగర్‌లో ఎనిమిదైనా చీకటి పడదు. ఎనిమిదన్నర రాత్రివేళ పగలే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మర్నాడు తొందరగా లేవాలి కాబట్టి తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చేసాం.

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్ళిన వాళ్ళలో బహుశా నేనే ఎలాంటి భక్తి భావనలు లేకుండా, ఒక అడ్వంచర్‌ యాత్రలాగా వెళ్ళానేమో అనిపించింది. ఎందుకంటే ఆ ప్రయాణం చాలా కఠినతరమైంది. అడుగడుగునా ప్రమాదం వుంది. భక్తి పారవశ్యంలో మనుష్యులు సాధారణంగా శరీర కష్టాన్ని లెక్క చేయరు. దేవుడి కోసం ఎలాంటి కష్టాన్నయినా భరించేస్తారు. నేను మాత్రం అమర్‌నాథ్‌ యాత్రని ఒక సాహసయాత్రగానే చూసాను. నాకు తెలుసు ఆ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుందో. అదొక ప్రకృతిపరమైన అద్భుతం. అంతే.

మర్నాడు ఉదయం నాలుగు గంటలకి మేము ఇనోవాలో వున్నాం. మామూలుగా అయితే ఆ వేళపుడు చలి గడగడలాడించేస్తుంది. వొళ్ళంతా ఉలెన్‌ కప్పుకుంటే కానీ తట్టుకోలేం ఆ చలిని. కానీ అంత విపరీతమైన చలేమీ లేదు. ప్లెజంట్‌గా, హాయిగా వుంది. రోడ్డుకిరువైపులా బారులు తీరిన చీనార్‌ చెట్లు, ఎత్తైన పర్వత సముదాయం కళ్ళకి పండగ చేస్తుంటే మా వాహనం వేగంగా బాల్డాక్‌ వేపు దూసుకెళుతోంది. శ్రీనగర్‌ దాటి బయటకు వచ్చేస్తుంటే దర్శనమిచ్చింది సింధూ నది. ఆ ఉరవళ్ళు, పరవళ్ళు చూసితీరాల్సిందే. హిమాలయన్‌ రేంజస్‌. మహోత్తుంగ శ్రేణులు. ఆ కొండల్లోంచి జాలువారే అసంఖ్యాకమైన జలపాతాలు, అంతెత్తు కొండల్లోంచి వేగంగా ఉరికొస్తూ సింధూనదిలో లీనమయ్యే దృశ్యాలు మనల్ని రెప్ప వేయనీయవు. అమర్‌నాథ్‌ చేరేవరకు సింధు మనతోనే వుంటుంది. మనతో పాటే ప్రయాణం చేస్తుంది. ఒక చోట సన్నటి పాయలాగా, మరోచోట మన ఊళ్ళో కాలువలంత విశాలంగా, ఉధృతిగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహవేగం నునుపు దేలిన రాళ్ళమీద గలగల సంగీతాన్ని ఆలపిస్తుంటుంది. ఆ ఉదయపువేళ, సింధునది సంగీతాన్ని వింటూ మోహపరవశులం కావాల్సిందే. అక్కడక్కడా మంచుటోపీలు పెట్టుకున్న పర్వశ్రేణులు, మంచుకరుగుతూ దిగువకు జాలువారే జలపాతాలు, ఆ జలపాతాల్ని ఆత్మీయంగా తనలో లీనం చేసుకునే సింధునది, ఆ పర్వతాల విశాలత్వం ముందు మనం మరుగుజ్జులమే అవుతాం. అపురూపమైన దృశ్యాలలో మునిగి తేలుతూ, ఆ సౌందర్యాన్నంతటిని ఔపోసన పట్టేయ్యాలన్నంత ఆత్రంతో కన్నురెప్పవేయకుండా కూర్చున్నాను నేను. మనస్సంతా మహా సంతోషంతో నిండిపోయింది. గుండెల్లోంచి రక్తం బదులు గాఢమైన అనుభూతి పొంగిపొర్లుతోంది. నేను మనిషిని మాత్రమే వాహనంలో వున్నాను. నా మనసు ఆ కొండల్లో తిరుగుతోంది. ఆ మంచులో పొర్లుతోంది. ఆ జలపాతాల్లో స్నానిస్తోంది. చల్లటి నదిలో ఈత కొడుతోంది.

నేను ఇలాంటి మానసిక స్థితిలో మునిగివుండగానే బాల్టాక్‌ వచ్చేసింది. నా కళ్ళు కూడా నేలమీదకొచ్చాయి. ఒక నిర్మానుష్య, నిరామయ స్థితిలోంచి మనుష్యులు, వాహనాలు కిటకిటలాడే స్థలంలోకి హఠాత్తుగా వొచ్చిపడ్డాం. హెలికాప్టర్ల రొద, గుర్రాల సకిలింపులు. అసంఖ్యాకంగా వెలసిన టెంట్లు, ఆప్రాంతమంతా సందడిగా, పెద్ద సంతలాగా వుంది. మేము వాహనం దిగి బయటకు రాగానే చలిగాలి గిలిగింతలు పెట్టింది. బ్యాగుల్లో వున్న ఉలెన్‌ అంతా వొంటిమీదికి చేరిపోయింది. సడన్‌గా వర్షం పడుతుంది అంటే రెయిన్‌ కోటుకూడా వాటికి తోడయ్యింది. బ్యాగుల్లో దాదాపు ఐదు కిలోల బరువు తగ్గిపోయి, మా శరీరాలు హఠాత్తుగా ఐదు కిలోలు బరువు పెరిగిపోయాయి. చుట్టూపరుచుకున్న సౌందర్యాన్ని చూస్తూ నిలబడ్డాం. మూడు హెలికాప్టర్లు జనా న్ని మోసుకువెళుతున్నాయి. ఇట్టేవెళ్ళి అట్టే తిరిగొస్తున్నాయి.

ఓ అరగంట తర్వాత మా వంతుకూడా వచ్చింది. హెలికాప్టర్‌లో ఎక్కేముందే మా బరువు చెక్‌చేసారు. అందరం బరువు పెరిగాం. సంతోషంలో ఉబ్బిపోయామనుకుంటా అని నేనంటే అందరూ నవ్వారు. ఒక్కొక్కళ్ళకి ఐదు వేలు వసూలు చేసారు హెలికాప్టర్‌ వాళ్ళు. ఇంజన్‌ ఆపకుండానే హడావుడిగా ఎక్కిస్తున్నారు. విపరీతమైన గాలి. మేము కూడా పరుగులెడుతూ వెళ్ళి కూర్చున్నాం. హెలికాప్టర్‌ గాల్లోకి లేచింది. కొండల మధ్యనుంచి వెళుతుంటే కింద సింధునది కనిపిస్తుంది. కొండల అంచులో గుర్రాలమీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వాళ్ళు చీమల బారుల్లా కన్పిస్తున్నారు. ఏడు నిమిషాల్లో హెలికాప్టర్‌ గమ్యం చేరింది. మేము దిగుతుంటే ఎవరో కామెంట్‌ చేసారు. ”వీడిదుంపతెగ ఐదువేలు తీసుకుని అయిదు నిమిషాలైనా తిప్పలేదు” అని. ఎక్కి కూర్చుని సర్దుకోగానే దిగండి, దిగండి అంటూ హెచ్చరికలు.

ఉరుకులు పరుగులతో హెలికాప్టర్‌ దిగి, మాకోసం ఎదురుచూస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ దగ్గరకు నడిచాం. అతను తెలుగువాడు. రండి రండి అంటూ మమ్మల్ని ఆహ్వానించి సి.ఆర్‌.పి.ఎఫ్‌. వాళ్ళ కేంప్‌ ఆఫీసులోకి తీసుకెళ్ళాడు. అక్కడ చలి ఎక్కువగానే వుంది. మేము కూర్చోగానే విలటరీ దుస్తుల్లో వున్న వ్యక్తి మాకు వేడి వేడి టీ తెచ్చి ఇచ్చాడు. ఆ చలిలో టీ తాగడం హాయిగా అన్పించింది. కేంప్‌లో వున్న ఆఫీసర్‌ మాకోసం గుర్రాలను మాట్లాడటం కోసం, గుర్రాల యజమానులను పిలిపించాడు. అక్కడినుండి ఆరు కిలోమీటర్లు కొండలపైన గుర్రాలమీద వెళ్ళాలి. అదికూడా అమర్‌నాథ్‌ గుహవరకు తీసుకువెళ్ళరు. అక్కడ మళ్ళీ నిటారుగా వుండే మెట్లెక్కాలి. ఒక్కొక్కరికి 800/- రూపాయలవుతుందని ఆయన మాకు వివరించాడు. మేము సరే అన్నాం. గుర్రాల వాళ్ళు గుర్రాలు తేవడానికి వెళ్ళారు. ఆఫీసర్‌ మాతో అక్కడి విశేషాలు మాట్లాడుతూ సడన్‌గా ఓ మాటన్నాడు. ఆ మాట వింటున్న వాళ్ళ గుండె ఝల్లుమంది. వెన్నులోంచి భయం జరాజరా పాకినట్లయింది. ఆయన హిందీలో ఇలా అన్నాడు. ”గుర్రాలలో సూసైడల్‌ టెండన్సీస్‌ ఇక్కడ చాలా ఎక్కువ. అవి చనిపోవాలనుకుంటే తల పక్కకు వాల్చేస్తాయి. లేదా దేనికైనా తలను కొట్టుకుంటాయి. అపుడు గుర్రంతోపాటు దానిమీద ప్రయాణించేవారికి చాలా రిస్క్‌. ఇటీవల ఒకామెని మోసుకెళుతున్న గుర్రం హఠాత్తుగా చనిపోయి కిందికి పడిపోయింది. దానిమీద కూర్చున్న మహిళ శవం కూడా దొరకలేదు. కొండల్లో మంచులో ఎక్కడికో జారిపోయింది.” అన్నాడు. నేను వెంటనే ”వాట్‌ ఈస్‌ ది ప్రికాషన్‌” అంటే ‘నథింగ్‌’ అన్నాడు. ఆ మాటలు విని అందరూ జడుసుకున్నట్టు ముఖాలు పెట్టారు. ఈ లోపు గుర్రాలొచ్చాయి. ఆయనకి థాంక్స్‌ చెప్పి టెంట్‌లోంచి బయట పడ్డాం. గుర్రాలెందుకు ఆత్మహత్య చేసుకుంటాయా అని ఆలోచిస్తూ, మాకోసం మాట్లాడిన గుర్రాలవేపు నడిచాం.

అమర్‌నాథ్‌కి అసలైన ప్రయాణం మొదలైంది. గుర్రమెక్కడం కష్టమే. నా గుర్రం నడిపే వ్యక్తి పేరు షరీఫ్‌. గుర్రం పేరు రాజా. షరీఫ్‌ సహాయంతో గుర్రమెక్కగలిగాను. అతను నన్ను పట్టుకుని కూర్చోబెట్టి, కాళ్ళకు రింగులు తొడిగాడు. రాజామీద నా స్వారీ మొదలైంది. నాలుగడుగులు వేసేసరికి ఒళ్ళంతా కదిలిపోవడం, ఓ పక్కకి జారిపోవడం. హమ్మో! ఆరు కిలోమీటర్లు దీనిమీద కూర్చోవాలా? అన్పించేలా గుర్రం మీద ప్రయాణం మొదలైంది. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ప్రయాణమది.

కొండవాలు మీద ఏమాత్రం ఎడ్జ్‌ లేనిచోట గుర్రం, దాని పక్కనే షరీఫ్‌ నడుస్తున్నారు. కిందికి చూస్తే కళ్ళు తిరిగేంత లోతైన లోయ. ఆ లోయలో ఉధృతంగా ప్రవహిస్తున్న సింధునది. గుర్రం కాలు జారితే నేరుగా పడేది నదిలోనే. మధ్యలో కొండల్లో కూడా పడొచ్చు. ప్రయాణం సాగుతున్నంతసేపు ఫరీఫ్‌ కబుర్లు చెబుతూనే వున్నాడు. సలహాలిస్తూనే వున్నాడు. ”ఆప్‌ నీచే మత్‌ దేఖో! ఊపర్‌ దేఖో! ఆస్మాన్‌ కితనా సుందర్‌ హై! పహాడ్‌ కితనా సుందర్‌ హై. ఉస్‌ కో దేఖో! నీచే మత్‌ దేఖో (కింది లోయలోకి చూడొద్దు. పైన ఆకాశం కొండలు చాలా అందంగా వుంటాయి. వాటిని చూడు గానీ కిందికి అస్సలు చూడకు) అంటూ నాకు కౌన్సిలింగ్‌లాంటిది చేస్తూనే వున్నాడు. కానీ నా దృష్టి లోయమీదే. గుర్రం ఎత్తులెక్కుతున్నపుడు వెనక్కి వాలమని, కిందికి దిగుతున్నపుడు ముందుకు వొంగమని చెబుతాడు. గుర్రాలు నడిపే వాళ్ళందరి గొంతులోంచి ‘పీఛే’, ‘ఆగే’ అనే మాటలు ఆగకుండా వినిపిస్తూనేవుంటాయి. గుర్రం పెద్ద పెద్ద బండరాళ్ళమీద కాళ్ళేసి పైకి ఎక్కుతున్నప్పుడు, వాలులోంచి కిందికి దిగుతున్నపుడు మన ప్రాణాలు అరచేతిలోకి వస్తాయి. ఎన్నోసార్లు ఇంక మనపని అయిపోయింది. పడిపోతాం అనిపిస్తుంది. మంచుమీద, మంచుకరిగిన చిత్తడిమీద గుర్రం నడుస్తున్నపుడు చాలా భయమని పిస్తుంది. ఇంతెత్తు బండలమీద షరీఫ్‌ గుర్రాన్ని ఎక్కిస్తున్నపుడు, కిందికి దిగుతున్నపుడు నేను అమ్మో! అంటూ చాలా సార్లు అరిచాను. అతను నన్ను ఒకచేత్తో పట్టుకుని జారిపోకుండా చాలాసార్లు సాయం చేసాడు.

సన్నటి కాలిబాటలాంటి దారిమీదే పోయేగుర్రాలు వచ్చే గుర్రాలు. నడిచేవాళ్ళు. ఒక్కోసారి అటు యిటు గుర్రాలు నడిచేదారిలేక ఆగిపోయేవి. మా  గుర్రం కొండ అంచుమీద నిలబడి పోయేది. కిందికి చూస్తే కళ్ళు తిరిగినంత పనవుతుంది. మెల్లగా క్రాస్‌ చేసి బయలు దేరేవి. చుట్టూ ఉత్తంగ హిమాలయ పర్వతాల శ్రేణులు. కొన్ని మంచుతో కప్పబడి, ఎండపడి ధవళవర్ణంలో మెరిసిపోయేవి. నీలం రంగు ఆకాశం. స్వచ్ఛంగా అక్కడక్కడా కొండలమీద కూర్చున్న నల్లమబ్బులు. ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఎంజాయ్‌ చేద్దామంటే, కూర్చున్నది గుర్రం మీదాయే! పడకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవడానికే కష్టంగా వుంది. సగం దూరం నడిచాక, కొన్ని ఎత్తులెక్కి, కిందికి దిగి భయంతో గడగడలాడాక ప్రయాణం అలవాటైంది. ఏమవుతుందిలే. కిందపడతాం. కానీయ్‌. అంతమంది వెళుతున్నారు. నేనెందుకు భయపడాలి. ఎంజాయ్‌ ద ట్రిప్‌. చుట్టూ అపరిమితమైన సౌందర్యం. చూడు. మళ్ళీ ఛాన్సు రాదు.’ సెల్ఫ్‌ కౌన్సిలింగ్‌ ఇచ్చుకుంటూ, షరీఫ్‌ పాడుతున్న కాశ్మీరీ పాటలు ఎంజాయ్‌ చెయ్యడం మొదలుపెట్టాను. అతనితో కబుర్లు చెప్పసాగాను. అతను తన గుర్రం గురించి విశేషాలు, అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలు, తనొకసారి వైజాగ్‌ వచ్చానని, వైజాగ్‌కి మూడు పేర్లున్నాయి కదా అని విశాఖపట్టణం, వైజాగ్‌, వాల్తేర్‌ అంటూ చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెంతమంది ఆంధ్రా ప్రయాణికుల్ని తన గుర్రంమీద తీసుకెళ్ళాడో చెప్పాడు. ఇలా కబుర్లలో మునగడం వల్ల మనసులో బిగపట్టిన భావమేదో, భయం కావొచ్చు సడలినట్లయింది.

కానీ ఆ కొండలవాలు మీద, గుర్రం మీద ప్రయాణం మాత్రం అత్యంత ప్రమాదకరమైందే. చాలా రిస్క్‌తో కూడుకున్నది. ప్రాణాలకు తెగించి ప్రయాణం చెయ్యడమే. బహుశ భక్తితో వచ్చేవాళ్ళ మనసులో ఒక భావన ఉండొచ్చు! ఇట్లాంటిచోట చనిపోయినా ఫర్వాలేదు. విధిని నమ్మేవాళ్ళు మాత్రం ఎలారాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. ఈ కొండల్లో చావాలని రాసిపెట్టివుంటే ఎవరాపగలరు అనే ఒక భరోసా వాళ్ళ మనసుల్లో ఉండొచ్చు. నాకలాంటి నమ్మకాలు లేవు. నా ప్రయాణం ప్రకృతిలోకి. నాకు అమర్‌నాథ్‌ గుహ, అక్కడ ఏర్పడే మంచు శివలింగం గమ్యం కాదు. కానీ ఆ గుహలో ఆ మంచుమూర్తి ఏర్పడకపోతే ఈ ప్రయాణమే కుదరదు. ఇంత ప్రమాదకరమైన ప్రయాణం జనాలు చేసేది ఆ మంచుమూర్తిని దర్శించుకోవడానికే. నేను దీన్నొక సాహసయాత్రగానే ఎంజాయ్‌ చేసాను. భయం, గగుర్పాటు, విభ్రమం లాంటి భావాలు అడుగడుగునా కలుగుతాయి కానీ భక్తి మాత్రం నాకసలు కలగనే కలగదు. భయం కూడా చాలా తక్కువసార్లు. హఠాత్తుగా గుర్రం ముందుకి తూలినపుడు, పెద్ద పెద్ద బండరాళ్లమీద జారినపుడు గుండె గొంతులోకొస్తుంది. ప్రయాణం మొదట్లో కెమెరా బయటకు తీసి ఫోటోలు తీసే సాహసం చెయ్యలేకపోయాను. రెండు చేతులతో గుర్రాన్ని పట్టుకోవడమే సరిపోతుంది. అయితే ప్రయాణం సగంపైన సాగాక కొంత ధైర్యమొచ్చి కెమెరా తీసి, వీడియో తీసాను. ఫోటోలు క్లిక్‌ చెయ్యడం చాలా కష్టం. వీడియో కొంచం తేలిక. నేను ప్రయాణిస్తున్న దారిని, కొండవాలుని, కిందిలోయని, సింధుని రికార్డ్‌ చేసాను. అయితే అప్పటికే చాలావరకు కిందికొచ్చేసాం. ఎత్తైన కొండల్ని షూట్‌ చెయ్యలేకపోయాను. కెమెరా పట్టుకుని పైకి కిందికి చూస్తే ఇంకేం లేదు. కిందపడటం ఖాయం. ”ఇంకెంత దూరం షరీఫ్‌ భయ్యా” అని వందసార్లు అడిగివుంటాను. ”ఆగయా! వో దేఖో, వో గుఫా హైనా వోయీ హై (అదిగో వచ్చేసాం. ఆ కన్పడే గుహే)” అంటూ చెప్పేవాడు.

ఓ గంటన్నర ప్రయాణం తర్వాత జనంతో, షాపులతో, పోలీస్‌, సి.ఆర్‌.పి.ఎఫ్‌లతో కిటకిట లాడుతున్న ప్రదేశంలో మా గుర్రం రాజా ఆగింది. చెయ్యందించి షరీఫ్‌ నన్ను గుర్రం దింపాడు. కాలుకింద పెట్టగానే ఒళ్ళంతా చాలా బరువన్పించింది. 14,000 వేల అడుగుల ఎత్తుమీద ఉన్నాం. ఆక్సిజన్‌ చాలా తక్కువగా ఉంటుంది. మాతోపాటే వున్న పోలీసాయన మమ్మల్ని సిఆర్‌పిఎఫ్‌ క్యాంపు ఆఫీసుకు వెళదామని, అక్కడ కాసేపు రెస్ట్‌ తీసుకుని పైకి వెళదామని సూచించాడు. నా పరిస్థితి ఏం బాగోలేదు. ఒక్క అడుగు వెయ్యలేకపోయాను. మెట్లెక్కడంలో, ఎత్తులెక్కడంలో నాకు చాలా సమస్యలున్నాయి. ఒకసారి మైసూర్‌ వెళ్ళినపుడు, నిటారుకొండ శ్రావణ బెల్గోడా ఎక్కడానికి ప్రయత్నించినపుడు నేను ఫెయింట్‌ అయి కిందపడిపోయాను. వాంతి చేసుకుని ఒళ్ళంతా చెమటలు పట్టి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. సగం దారిలో అలా జరగడం వల్ల నా సహచరుడు చాలా భయపడ్డాడు. మనుష్యులు మోసే డోలీ మీద మిగతా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. ఇపుడు కూడా అదే యిబ్బంది ఎదురైంది. ”మేడం! కొంచం దూరమే వుంది. క్యాంప్‌ ఆఫీసులో రెస్ట్‌ తీసుకుందురు గానీ పదండి” అంటాడు. ఊహూ! నేనొక్క అడుగెయ్యలేక కూలబడిపోయాను. కొంచం సేపు అలా కూర్చున్నాక, మంచి నీళ్ళు తాగి సేదతీరి చాలా మెల్లగా నా శరీరాన్ని ఈడ్చుకుంటూ, ఊపిరి పీల్చడంలో చాలా కష్టపడుతూ క్యాంప్‌ ఆఫీసు వరకు నడిచాను. మమ్మల్ని మోసుకొచ్చిన గుర్రాలు కిందనే ఆగిపోయాయి. మేము గుహ వరకు వెళ్ళి వచ్చాక మమ్మల్ని మళ్ళీ కిందికి తీసుకెళతాయి.

కేంప్‌ ఆఫీసులో కొంచెం సేపు కూర్చుని వేడివేడి టీ తాగాక నేను కొంత తేరుకున్నాను. అయినా మెట్లు ఎక్కి పైకి వెళ్ళే సాహసం చెయ్యలేకపోయాను. ఆరువందలు ఇచ్చి డోలీ మాట్లాడుకున్నాను. అప్పటి వరకు గుర్రం నన్ను మోసుకొస్తే, డోలీలో కూర్చోబెట్టి, బతికుండగానే నలుగురు మనుష్యులు పైకి మోసుకెళ్ళారు. కెమెరా, సెల్‌ఫోన్‌లు తీసుకెళ్ళకూడదట. మేము సిఆర్‌పిఎఫ్‌ అతిథులం కాబట్టి మమ్మల్ని చెక్‌ చెయ్యలేరు. నేను డోలీలో కూర్చుని గుహ వరకు వీడియో వేసాను. మా పోలీసాయన గమనించి ”వద్దు మేడం. ఫోటోలు తియ్యొద్దు. కెమెరా లోపల పెట్టేయండి” అని హెచ్చరించాడు. నేను కెమెరా లోపల పడేసాను. పదిహేను నిముషాల్లో డోలీ పైకి చేరింది.

అమర్‌నాథ్‌ గుహ ముందు నన్ను దింపేసారు. బూట్లు తీసేయమన్నారు. కాళ్ళు నేలమీద పెట్టగానే జివ్వుమన్నాయి. గుహ ఖాళీగా వుంది. ముంచుమూర్తి లేదు. భక్తులు తీవ్ర ఆశాభంగం పొందుతున్నారు. నిజానికి మంచుమూర్తి చాలా రోజులు క్రితమే కరిగిపోయింది. మైనస్‌ డిగ్రీ చలి వుంటేనే మంచు గడ్డకడుతుంది. చలి మాత్రం చాలా వుంది గానీ మైనస్‌ డిగ్రీ లేదు. మెట్లెక్కి వస్తున్న వాళ్ళు చాలా ఆయాసపడుతూ, ఆపసోపాలు పడుతూ వచ్చారు. శివలింగం ఇదే అంటూ చూపించారు. అక్కడేమీ లేదు. పక్కనే కొంత మంచు పేరుకొని వుంది. దాన్ని ”పార్వతి మయ్యా” అంటూ చూపించారు. పార్వతి ఇక్కడే వుందట. శివుడు కైలాసం వెళ్ళిపోయాడట. ”శివ్‌జి కైలాస్‌ చలే గయా” అని పూజారి అంటే ”పార్వతీ కో అకేలే ఛోడ్‌కర్‌ క్యోం చలే గయా” అని నేనంటే ”అయ్‌సీ బాత్‌ నహీ కరనా బేటీ” అని రెండు చెంపలూ వాయించుకున్నాడు పూజారి. నాతో వున్న వాళ్ళు నావేపు గుర్రుగా చూసారు. కాళ్ళకు చెప్పుల్లేవు. జివ్వున లాగేస్తున్నాయి. నేను అక్కడ ఒక రెయిలింగ్‌ వుంటే దాని మీద ఎక్కి కూర్చున్నాను. పూజారి నావేపు చాలా కోపంగా చూసి ”ఐసా నహీ బైఠనా హై” అన్నాడు. నేనింక అక్కడ వుండకుండా కొంచం కిందికి దిగి వచ్చేసాను.

చుట్టూ అద్భుతమైన కొండలు. మంచుతో కప్పబడి, ఎండకు తెల్లగా మెరుస్తున్నాయి. కొన్ని ఒట్టి బండలు, మంచు కానీ, చెట్లుగానీ లేవు. కొన్ని ఆకుపచ్చటి దుప్పట్లు కప్పుకున్న కొండలు. కళ్ళు చెదిరే సౌందర్యం.
అమర్‌నాథ్‌ గుహ చాలా చిన్నది. ఓ పెద్ద కొండలో ఏర్పడిన సహజమైన గుహ. ఆ గుహమీద ఓ పెద్ద రంధ్రం వుంది. ఆ రంధ్రం లోంచి మంచు మెల్లగా జారి పడుతూ లింగాకృతి దాలుస్తుంది. ఒక్కో డ్రాప్‌ పడుతూ, గడ్డ కడుతూ, క్రమంగా గుహపై భాగం వరకూ పెరుగుతుంది. నిలువుగా లింగాకృతిలో ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే మంచుమూర్తి కరిగిపోతుంది. నిజానికి వారం రోజుల్లోనే అది కరిగి పోతుందట. క్రితం సంవత్సరం మిలటరీ వాళ్ళు ఏవో రసాయనాలు పూసి కరగకుండా చేసారనే ఆరోపణలు పేపర్లలలో వచ్చాయి. ఈసారి మరి అలాంటిది చేసారో లేదో గానీ మంచుమూర్తి తెలియదు. మొత్తం కరిగిపోయింది. భక్తులు మాత్రం ప్రవాహంలా వస్తూనే వున్నారు. ఈ గుహ, మంచుమూర్తికి సంబంధించి ఒక కథ ప్రచారంలో వుంది. దాని గురించి తర్వాత రాస్తాను.

అమర్‌నాథ్‌ గుహలో నాకు అమితంగా ఆసక్తి కల్గించినవి అక్కడ తిరుగాడుతున్న నాలుగైదు పావురాలు. వాటిని పంచ పాండవులంటారట. చాలా పెద్దగా వున్నాయి. రెండు పావురాలు జంటగా ఎగురుతూ ఆడుతున్నాయి. మిగిలినవి విడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. చాలా అందంగా వున్నాయవి. మనం ఇళ్ళల్లో చూసే వాటికన్న భిన్నంగా వున్నాయి. అంత ఎత్తైన కొండలమీద పావురాలు ఎందుకున్నాయో, ఎలా అక్కడికి చేరాయో అనేది మాత్రం మిస్టరీనే. గమ్మత్తేమిటంటే అవి అందరికీ కనబడవట. నాకు ఐదు కనబడ్డాయి. అవి ఎగురుతూ బయటకెళుతూ గుహలోకి వస్తుండడం వల్ల కొంతమందికి కనబడక పోవచ్చు. అవి పంచపాండవులని, అయిదు కన్పిస్తే గొప్ప అదృష్టమనే కామెంట్లు కూడా విన్నాను. నన్ను డోలీలో మోసుకొచ్చిన రఫీక్‌ ”మాజీ! ఆప్‌! లక్కీ హై. ఆప్‌ కో పాంచ్‌కి పాంచ్‌ కబూతర్‌ మిల్‌గయా” అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. భక్తిరసం పొంగిపోర్లే చోట ఇలాంటివి బ్రహ్మాండంగా ప్రచారంలో వుంటాయి. ఆ మంచుకొండల్లో పావురాలు ఏం తిని బతుకుతాయా, మొత్తం మంచుతో కప్పడిపోయినపుడు ఈ పావురాలు ఎక్కడకు పోతాయో అని ఆలోచిస్తూ బూట్లు వేసుకోవడానికి అష్టకష్టాలు పడుతుంటే రఫీక్‌ చొరవగా బూట్లందుకుని తొడగడం మొదలు పెట్టాను. నేను వొద్దని వారిస్తూన్నా విన్పించుకోకుండా ”ఆప్‌! హమారా మా జైసే. చప్పల్‌ పెహన్‌నేసే కుచ్‌ నహీ హోగా” (మీరు మీ అమ్మలాంటి వారు. బూట్లు తొడిగితే ఏం కాదు) అన్నాడు. అయినా నాకు చాలా గిల్టీగా అన్పించింది. అతని సహకారంతో బూట్లు తొడుక్కుని, మళ్ళీ డోలీలో కూర్చుని కిందికి దిగేసాం.

సిఆర్‌పిఎఫ్‌ క్యాంపులో కాసేపు కూర్చుని, మళ్ళీ వేడిగా ఓ టీ తాగి, వాళ్ళందరితో ఫోటోలు దిగాం. అక్కడ చాలా మంది తెలుగు పోలీసులున్నారు. చిత్తూర్‌ నుండి, శ్రీకాకుళం, కర్నూల్‌ జిల్లాలకు చెందిన గురునాధరెడ్డి, ధనికుమార్‌, విద్యాధర్‌ మాకు చాలా సహకరించారు. ముఖ్యంగా నేను గుర్రం దిగి నడవలేని స్థితిలో వున్నపుడు, నా చెయ్యి పట్టుకుని చాలా జాగ్రత్తగా నడిపించిన ధనికుమార్‌కి ఎప్పటికీ కృతజ్ఞురాలనే. అలాగే ్పుష్ట్రఆఓ కమాండెంట్‌ హరీందర్‌ సింగ్‌ మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించడంతో పాటు అమర్‌నాథ్‌కి సంబంధించి ఎన్నో విశేషాలు చెప్పాడు. యాత్ర మొదలయ్యిన దగ్గర నుండి ఆగస్టు 12 వరకు అక్కడి స్థితిగతులు ఎలా వుంటాయో చెప్పాడాయన.

ఈ యాత్ర నిర్వహణ మొత్తం సిఆర్‌పిఎఫ్‌దే. యాత్రకు ముందు యాత్ర తర్వాత నిర్మానుష్యంగా వుండే ఆ ప్రాంతం రెండు నెలల పాటు జనంతో కిటకిటలాడిపోతుంది. గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్లు, దుకాణాలు, అసంఖ్యాకంగా టెంట్‌లు, అడుగడుగునా పోలీస్‌, సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు, అధికారులు ఎంతో శ్రమించి అమర్‌నాథ్‌ యాత్రను నిర్వహిస్తారు. సివిలియన్‌ అధికారులు ఒక్కరు కూడా లేరు. అంతా మిలటరీ కంట్రోల్‌ లోనే వుంటుంది. బిఎస్‌ఎన్‌ల్‌ చాలా కష్టం మీద కొన్ని లాండ్‌లైన్‌లు వేస్తుంది. వాళ్ళ మొబైల్స్‌ మాత్రమే పని చేస్తాయి. గుహదగ్గర ఏర్పాటయ్యే టెంట్స్‌, దుకాణ సముదాయం, సరుకులు అన్నింటినీ గుర్రాలు నిరంతరాయంగా మోస్తూ వుంటాయి. గుర్రం తప్ప వేరే రవాణా సదుపాయం లేదు. రెండు నెలల పాటు జరిగే మహా జాతర అది. వేలాది మంది మిలటరీ వాళ్ళు శ్రమించి, సెక్యూరిటీ కల్పించి నిర్వహిస్తారు.

ఆగస్టు పన్నెండు తర్వాత ఆ అయిదు పావురాలు తప్ప మరో పిట్ట కూడా అక్కడ మిగలదు. మంచు కురవడం మొదలైతే ఆ చుట్టు పక్కలకి కూడా వెళ్ళలేము. 30 అడుగుల మందాన మంచు కురిసి కొండలు, దారులు, సింధు నది అన్నీ కలగలిసి పోతాయట. పావురాలు ఎక్కడికి వెళతాయా? ఏం తింటాయా అని ఆలోచిస్తూ, హరేందర్‌ సింగ్‌ గారికి కృతజ్ఞతలు చెప్పి మేము మా గుర్రాలున్న చోటుకి వచ్చేసాం.
మళ్ళీ రాజా మీద సవారీ. షరీఫ్‌ చెయ్యందించి గుర్రాల మీద కూర్చోబెట్టాడు. గుర్రం మీద కిందికి దిగడం మాత్రం చాలా భయానకమైన అనుభవం. లోతుల్లోకి దిగుతున్నపుడు షరీఫ్‌ నన్ను కూడా పట్టుకుని దింపేవాడు. అలా చాలా సార్లు జరిగింది. ‘ఆప్‌ డరనా నహీ. మైహూనా” అని షారూఖ్‌ ఖాన్‌ లెవెల్‌లో భరోసా ఇచ్చేవాడు.

బిర్రబిగుసుకుపోయి, ప్రాణాలరచేత పట్టినట్లు గుర్రాన్ని గట్టిగా పట్టుకుని, ఆ లోయల్ని, నదీ ప్రవాహాన్నీ చూస్తూ, ఎదురుగా గుర్రాలొచ్చినపుడు ఇంక నా పనయిపోయింది. లోయలోకి పడ్డం ఖాయం అనుకుంటూ - అలా ఎన్నో సార్లు జరిగింది. రెండుసార్లు గుర్రం తూలి పడబోయింది. ఆ కుదుపులకి నేను కూర్చున్న జీను ఒకపక్కకి జరిగిపోయింది. అది గమనించి నన్ను దింపి జీనును సరిచేసి, తాను కప్పుకున్న ఉన్ని కోటుని కూడా దానిమీద పరిచి నన్ను మళ్ళీ జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. ఆ సన్నటిదారిలో విపరీతమైన రద్దీ. వచ్చే గుర్రాలు, పోయే గుర్రాలు. ట్రాఫిక్‌ జామ్‌లు. గుర్రాల్ని వెనక్కి నడిపించినపుడు మాత్రం గుండె జారిపోతుంది. ఆ దారిని విశాలం చెయ్యలేని నిస్సహాయస్థితి వల్లను, మామూలు రోజుల్లో అక్కడంతా మంచే వుంటుంది కాబట్టి రిపేర్లు లాంటివి కూడా జరగవు. రెయిలింగ్‌ లాంటిది కట్టడం కూడా అసాధ్యమే. అందుకే అమర్‌నాథ్‌ యాత్ర అత్యంత ప్రమాదకరంగా వుంటుంది. ప్రాణాలకి భరోసా లేని యాత్ర. ఆ సాహసయాత్ర చేసి తిరిగొచ్చామంటే తిరిగొచ్చాం. అంతే. రాలేకపోనువచ్చు. అన్నిటికి సిద్ధపడే అసంఖ్యాకంగా భక్తులు, వృద్ధులు కూడా తరలి వస్తాను. నాకు భక్తితో సంబంధం లేకపోయినా సాహసాలు చెయ్యడంతో పాటు, అత్యంత మనోహరమైన, సౌందర్యంతో నిండిన ఆ ప్రదేశానికి వెళ్ళడం ప్రాణ సమానం. ప్రాణం పోతుందేమో నన్నంత రిస్క్‌ వున్నప్పటికీ. బహుశ భక్తులు పోతే దైవైక్యంగా భావించొచ్చు. నేను పోతే ప్రకృతైక్యంగా అనుకోవాలి కాబోలు. ఇలాంటి ఆలోచనలతో గంటన్నర పైనే ప్రయాణం చేసి, ఎన్నో ప్రమాదాలను దాటి కిందికొచ్చాం.

అప్పటికి టైమ్‌ ఒంటి గంట కావస్తోంది. ఉదయం నించి టీ తప్ప మరేం తినలేదు. మా హెలికాఫ్టర్‌ రెడీగా వుందని ధనికుమార్‌ చెప్పాడు. గుర్రాలకి డబ్బులిచ్చేసాం. షరీఫ్‌కి, రాజాకి బోలెడన్ని కృతజ్ఞలు చెప్పి నేను షరీఫ్‌కి రెండు వందలు టిప్‌ ఇచ్చి గుర్రానికి బాగా తిండి పెట్టు అని చెప్పాను. నేను అంత టిప్‌ ఇవ్వడం చూసి అందరూ గయ్‌మన్నారు. ముఖ్యంగా ధనికుమార్‌, ”మేడం మీరు అంతలేసి టిప్‌లివ్వొద్దు. వాళ్ళు మిగతా వాళ్ళని పీడిస్తారు.” అన్నాడు. నాకు ఆ సలహాలేవీ బుర్రకెక్కలేదు. కొండలమీద, ఎత్తైన మెట్లమీద, కొండ అంచుమీద ఎంతో నైపుణ్యంతో గుర్రాన్ని నడిపించిన షరీఫ్‌ మీద, అతని గుర్రం రాజా మీద కలిగిన అభిమాన వ్యక్తీకరణకి అంతకన్నా మార్గం కనబడలేదు. నిజానికి ఆ గుర్రం పాదాలకి నమస్కరించాలి. షరీఫ్‌ పాదాలని కళ్ళకద్దుకోవాలి. గుర్రమెక్కి కూర్చున్న నేనే అంత కష్టపడిపోతే గుర్రంతో పాటు నడిచిన అతని శ్రమని గమనించాలి కదా. ఆ గుర్రం ఆత్మహత్య చేసుకోకుండా నన్ను సురక్షితంగా చేర్చింది కదా!. షరీఫ్‌ చాలా సంబరపడి పోయాడు. బహుశ అంత టిప్‌ ఎవరూ ఇచ్చివుండకపోవచ్చేమో అన్పించింది  అతని ముఖం చూసాక. అతని సంతోషం చూసాక నా కృతజ్ఞతాభారం కొంచం తగ్గినట్లయింది. షరీఫ్‌ని, రాజాగుర్రాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అందులో సందేహమే లేదు.

ఐదు నిముషాల్లో మమ్మల్ని హెలికాప్టర్‌ బాల్టాక్‌లో దించేసింది. అమర్‌నాథ్‌ కొండలకి గుడ్‌బై చెప్పి హెలికాప్టర్‌లో కూర్చున్నాం. తీరా తిరిగి వచ్చేటప్పుడు ఆ అందాన్నంతా అలా వదిలేసి రావడానికి ఎంత దిగులేసిందో చెప్పలేను. హెలికాప్టర్‌ లోంచి చూస్తుంటే గుర్రాలలో మేము ప్రయాణించిన దారి స్పష్టంగా కనబడుతోంది. వందలాది గుర్రాలు, మనుష్యులు చీమల బారుల్లా కదులుతున్నారు. నాలుగు రోజులు గడిస్తే నరమానవుడెవరూ కన్పించని, ఆ నిర్మానుష్య, నిశ్శబ్ద, నిరామయ పరిసరాలు నా గుండెల్లో వొదిగిపోయాయి. అమర్‌నాథ్‌ గుహ, ఆ గుహలో గుంభనంగా ఏర్పడే మంచుమూర్తి మీద గొప్ప ప్రేమ కలిగింది నాకు ఆ క్షణాన. ఆ మంచుమూర్తిని చూడటానికే కదా ఇన్ని లక్షల మంది ఇక్కడికొస్తున్నారు. భక్తిపారవశ్యంతో కొందరు ప్రకృతి ఆరాధనలో నాలాంటి అల్పసంఖ్యాకులు కొందరు అమితమైన శ్రమకోర్చి, అంతమందిని తన దగ్గరకు రప్పించుకుంటున్న మంచుమూర్తిని ముద్దాడాలన్నంత మైమరపు కలిగింది కానీ అది కాస్తా కరిగి నీరైపోయింది.

రెండున్నరకి ఇనోవాలో మా తిరుగుప్రయాణం మొదలైంది. అందరం చాలా అలిసిపోయాం. ఏమీ తినలేదు. కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా తెరిచి, మళ్ళొకసారి పర్వత సముదాయాలను, జలపాతాలను, సింధునదిని మనసారా చూస్తూ కూర్చున్నాను. అపుడపుడు కళ్ళు మూతలు పడుతున్నా, మూసిన రెప్పల వెనక కూడా అమర్‌నాథ్‌ అందాలే అలరిస్తున్నాయి. కన్ను మూసినా, తెరిచినా అద్భుత సౌందర్యమే. శ్రీనగర్‌లోకి ప్రవేశించామనడానికి నిదర్శనంగా, బారులు తీరిన చినార్‌ చెట్లు స్వాగతం పలికాయి. ఐదుగంటలకి మా గెస్ట్‌ హౌస్‌ చేరాం. చిత్రంగా ఎవరినీ ఆకలి బాధించలేదు కానీ రెండు బ్రెడ్డు ముక్కలు, వేడి వేడి కాఫీ పడేసరికి అందరికీ, అపుడు ఆకలి గుర్తొచ్చింది.

తలారాస్నానం చేసి, గెస్ట్‌ హౌస్‌ పై భాగానికి వెళితే నిదానంగా ప్రవహిస్తున్న జీలం నది కనబడింది. సింధు నది ఉరవళ్ళకి, జీలం నది నిదానానికి పోలికే లేదు. నీళ్ళ వేపు చూస్తూ కూర్చుంటే అలసట అంతా మాయమై ఫ్రెష్‌గా అయిపోయింది.

మర్నాడు శ్రీనగర్‌లో వుండే నా ఫ్రెండ్‌ వహీదా ఇంటికి వెళ్ళాం. వాళ్ళింట్లో మాటల సందర్భంలో అమర్‌నాథ్‌ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. 150 సంవత్సరాల క్రితం బూటా మాలిక్‌ అనే పశువుల కాపరి తొలిసారి అమర్‌నాథ్‌ గుహను కనుక్కున్నాడట. అతను ముస్లిమ్‌. అతను పశువుల్ని మేపుకుంటూ ఆ పరిసరాల్లో తిరుగుతున్నపుడు ఒక సిద్ధుడు ఆయనకు కనబడ్డాడట. అతనికి ఒక కమండలం లాంటిది ఇచ్చాడట. ఇంటికెళ్ళి చూస్తే దాంట్లో బంగారం వుందట. మాలిక్‌ మర్నాడు తిరిగొచ్చి చూస్తే సిద్ధుడు కనబడలేదట. సిద్ధుడి కోసం వెతుకుతూ తిరుగుతుంటే, అక్కడొక గుహ, ఆ గుహలో ఏర్పడిన మంచుమూర్తి కనబడిందట. చాలా కాలం అతనక్కడే వుండిపోయి సిద్ధుడి కోసం ఎదురుచూస్తూ ఆ మంచుమూర్తి దగ్గరే ఉండిపోయాడట. క్రమంగా ఈ వార్త బయటకు పొక్కి జనం రావడం మొదలైంది. మొదట్లో హిందువులు, ముస్లిమ్‌లు కలిసి శ్రీనగర్‌ నుండే పెద్ద ఊరేగింపుగా అమర్‌నాథ్‌కి వెళ్లేవారట. జూన్‌ నెలలో పౌర్ణమి రోజున మంచుమూర్తి పూర్తిగా ఏర్పడి, చంద్రుడిలో కళలు తగ్గే కొద్దీ, మంచు కూడా క్రమంగా కరిగిపోయేదట. పౌర్ణమి నాటికి అమర్‌నాథ్‌ చేరేలా శ్రీనగర్‌ నుంచి ఊరేగింపు బయలుదేరేదట.

క్రమంగా అమర్‌నాథ్‌ హిందువుల పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది.కాశ్మీర్‌లో వేర్పాటు వాదం మొదలై, ఉధృతమయ్యాక ముస్లింలు పాల్గొనడం తగ్గింది. ఊరేగింపు కూడా శ్రీనగర్‌ నుండి వెళ్ళడం లేదిపుడు. శ్రీనగర్‌కు దగ్గర ల్లోని పెహల్‌గావ్‌ బేస్‌ క్యాంప్‌గా రూపొందింది.  చాలా వరకు యాత్ర అక్కడ నుండే మొదలవుతుంది. ఇంతకు ముందు యాత్రికుల మీద వేర్పాటువాదుల దాడులు కూడా జరిగాయి. ప్రస్తుతం అడుగడుగునా తుపాకీ పహారాలోనే యాత్ర నడుస్తోంది.

ఇంటర్‌నెట్‌లో ఇంకొక కథ ప్రచారంలో వుంది. అమర్‌నాథ్‌ గుహకి 5000ల సంవత్సరాల చరిత్ర వుందని, పురాణాలలో దీని ప్రసక్తి వుందని, కల్హణుని రాజతరంగిణిలో అమర్‌నాథ్‌గుహ గురించి వుందని, కాశ్మీరీ రాజులు తమ వేసవి విడిదిగా అమర్‌నాథ్‌కి వెళ్ళేవారనే కథనం వుంది. అయితే అమర్‌నాథ్‌ని మొదట కనుగొన్నది మాత్రం ముస్లిమ్‌ పశువుల కాపరి బూటామాలిక్‌ అన్నదానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ కూడా వుంది. అమర్‌నాథ్‌ గుహ దగ్గర భక్తులు సమర్పించే సంపదలో ఇప్పటికీ బూటామాలిక్‌ కుటుంబీకులకు వాటా వెళుతుంది. నిజానికి ఈ యాత్ర ఇటీవలిది కాదని, ఎన్నో వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని, కాశ్మీరు, ఆఫ్గనిస్తాన్‌ పరిపాలన కింద ఉన్నపుడు ఈ యాత్రకి బ్రేక్‌ వచ్చివుండచ్చని, ఆ తర్వాతే బూటామాలిక్‌ దీన్ని తిరిగి కనుక్కొని ఉండొచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు.

హిందు ముస్లిమ్‌ల సౌహార్ద్రానికి సాక్షిగా నిలిచిన అమర్‌నాథ్‌, మతసామరస్యపు పువ్వుల్ని పూయించాలని ఆశిద్దాం. ఒక ముస్లిమ్‌ యువకుడు కనుక్కొన్న అమర్‌నాథ్‌ గుహ ఈరోజు కోట్లాదిమంది హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమవ్వడం ఎంత మానవీయంగా వుందో, నమ్మకాలు, మానవీయ కోణాన్ని తగ్గించకూడదని అర్థం చేసుకోవాలి. ఈ కోణం నాలాంటి మతాతీతంగా బతికే వాళ్ళకి గొప్ప సంతోషాన్ని కల్గించి తీరుతుంది.

శ్రీనగర్‌కి గుడ్‌బై చెప్పేసి మేము ఎయిర్‌పోర్టు వైపు బయలుదేరాం. అద్భుతానుభావాలను పంచిన అమర్‌నాథ్‌ ప్రయాణం  ఆ విధంగా ముగింపుకొచ్చింది.

6 comments:

Vineela said...

చాల చాల బాగుంది మీ ప్రయాణ విశేషాలు. మేము కేదార్నాథ్ కి వెళ్ళినప్పుడు మీ లాగే గుర్రం మీద ప్రయాని౦చాము అబ్బ గుర్రం ఎక్కినప్పుడు ఎంత భయం వేసిందో. ఆ గుర్రం అతనేమో మా తో నడవకుండా దగ్గరి దోవ లో వెళ్ళేవాడు. గుర్రలేమో అ౦చులకి వెళ్లి పోయేవి. మా పిన్ని చాల భయపడి నన్ను ఆ గుర్రం అతనితో చెప్పు అని అడిగేది. అక్కడ ఉన్న జనాభా లో నాకు కాస్త హిందీ వచ్చు. మధ్య లో తినడానికి ఆగాము. ఇక తిన్నాక మా బాధలు చూడాలి..పొట్ట అంత కదిలిపోతూ, పైన నుండి రాళ్ళ లా గుచ్చు కునేలా వర్షం. అది ఒక భయంకరమైన అనుభవం. ఇంత చేసి పైకి వెళ్ళాం. అక్కడ నేను మొత్తం తిన్నది కక్కేస..అస్సలు ఓపిక లేదు. మా బాబాయ్ నన్ను ఎత్తుకొని తీసుకు వెళ్లారు. ఇక రాత్రి ఎంత నరకం అంటే. పొద్దున్న దర్సనం..మా తో పాటు పిన్ని వాళ్ళ మామగారు వచ్చారు. అయన ని లేపుతుంటే లేవలేదు. చాల భయం వేసింది. డాక్టర్ ని పిలిస్తే అంట కొండ పైన అయన కి ఉపిరి అందక చనిపోయారు అని తెలిసింది. ఒక పెద్ద ఎదురు దెబ్బ మాకు. సో కొండ మీద ఇంకా అయన ఖర్మ కాండలు చేసి కింద కి దిగాము. ఇంత బాధ లో ఒక్కటే ఉరట ఏమిటి అంటే పచ్చటి ప్రక్రుతి. మరియు నిశ్శబ్దం గా ప్రవహించే గంగా నది. మీ బ్లాగ్ చదువుతుంటే ఆ దృశ్యాలే గుర్తు వచ్చి చాల ప్రశాంతం గ అనిపించింది. మీ బ్లాగ్ ని ఇంకా నుండి తప్పకుండ ఫాలో అవుతాను.

Tejaswi said...

Excellent...your trip as well as your narration.

anrd said...

మీరు చెప్పిన విధానం బాగుంది. కానీ చదువుతుంటే అక్కడికి వెళ్ళాలనుకునేవారికి భయాన్ని కలిగించేదిగా ఉంది. ఈ రోజుల్లో ప్రమాదాలు ఎక్కడైనా పొంచి ఉన్నాయి. ఇంటినుంచి అప్పుడే కులాసాగా బయటకు వెళ్ళినవాళ్ళు బాంబు పేలుళ్ళకు బలయిపోతున్న వార్తలూ వింటూనే ఉన్నాము. అందుకని అమర్నాధ్ వెళ్ళాలనుకునేవాళ్ళు భయపడవలసిన అవసరం అంతగాలేదు. కొంచెం భయం ఎవరికైనా ఉంటుందిలెండి..

anrd said...
This comment has been removed by the author.
anrd said...

ఇప్పుడు అమరనాధ్ లో చాలా సౌకర్యాలు ఏర్పరిచారు. అయితే అక్కడికి వెళ్ళాలనుకునేవారికి , ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవటానికి వీలుగా అక్కడి విషయాలను చెప్పటంలో తప్పులేదులెండి. అయినా కాలం కలిసి రానప్పుడు సుఖంగా ఇంట్లో కూర్చున్నా ప్రమాదం తప్పదు. కాలం కలిసివచ్చినప్పుడు ప్రమాదం అని భయపడ్డా కూడా ప్రమాదమేమీ జరగదు.

Anonymous said...

chala bavundi......... madam.

http/nashodhana.blogspot.com

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...