తెలుగు యూనివర్సిటీలో ‘మహిళా అధ్యయన కేంద్రం’ ఏర్పాటు సమావేశంలో కె. లలిత ఉదహరించిన కొన్ని అంశాలు నాకు చాలా ఆసక్తిని కల్గించాయి. మహిళా అధ్యయన కేంద్రం ఎలా పని చేయాలో వివరిస్తూ చరిత్ర మరుగున పడిపోయిన, పురుషుల వెనుక వుండిపోయిన అద్భుత ప్రతిభా సంపన్న స్త్రీల గురించి పరిశోధన జరిగి, వారి జీవిత చరిత్రలు, వారి శక్తి సామర్ధ్యాలు వెలుగులోకి తేవాల్సిన పనిని ఈ కేంద్రాలు చేపట్టాలనే అర్ధంతో మాట్లాడింది లలిత.
రవీంద్రనాధ్ టాగూర్ 150 సంవత్సరాల జయంతిని దేశమంతా పెద్ద ఎత్తున పండుగలాగా చేసుకుంటున్నాం కానీ అతని సోదరి గురించి మనం మర్చిపోయాం. అలాగే విజ్ఞాన చంద్రికా గ్రంధమండలిని స్థాపించిన, ఆధునికాంధ్ర వాజ్ఞయ నిర్మాతల్లో ప్రముఖంగా పేర్కొనదగిన కొమర్రాజు లక్ష్మణరావుగారి గురించి తలుచుకుంటాం, శతజయంతులు నిర్వహిస్తాం కానీ ఆధునిక తెలుగు సాహిత్యానికి, తెలుగు సమాజానికి వేగు చుక్కలా దారి చూపి, తొలి కథను, తొలి స్త్రీల చరిత్రను రాసి, తొలి స్త్రీల సమాజాన్ని స్థాపించిన అద్భుత ప్రతిభామూర్తి లక్ష్మణరావు సోదరి భండారు అచ్చమాంబను మనం గుర్తుకు తెచ్చుకోం. వారి కృషిని గుర్తించం.” లలిత ప్రసంగం ఇలా సాగుతున్నంత సేపు నా మనసులో ఎన్నో ఆలోచనలు, ఎందరో స్త్రీ మూర్తులు రూపుకట్టసాగారు.
భారతీయ సమాజాన్ని కానీ, తెలుగు సమాజాన్ని గాని సంస్కరించి, ఉద్ధరించినవారు, దిశానిర్దేేశం చేసినవారు పురుషులే అని మనం చాలా బలంగా నమ్ముతాం. నమ్మే విధంగా చరిత్ర రచన సాగింది. సతీ సహగమన దురాచారం అంటే రాజారామ్‌మోహనరాయ్ మాత్రమే గుర్తుకొస్తాడు. స్త్రీ పునర్వివాహమంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మాత్రమే గుర్తొస్తాడు కానీ అతనిని ఆ పనికి పురికొల్పిన అతని తల్లి భగవతీ దేవి గుర్తుకు రాదు. విధవా వివాహమంటే వీరేశలింగం, వ్యవహారిక భాషోద్యమమంటే గిడుగు రామ్మూర్తి పంతులు, తొలి కథకుడంటే గురజాడ ఇలా చరిత్ర నిండా పురుషులు వారి ఘనకార్యాలు మాత్రమే కనబడతాయి. ” మనకు తెలియని మన చరిత్ర” పుస్తకం వచ్చేవరకూ తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో కూడా స్త్రీలు కనబడలేదు. వారి గొంతు స్పష్టంగా వినబడలేదు.
నిజానికి చరిత్ర రచనలో పక్షపాతం ఉండకపోయినట్లయితే చరిత్ర నిర్మాతలుగా ఎందరో స్త్రీలు కనబడివుండేవారు. కాని చాలా తెలివిగా స్త్రీలను ఇళ్ళల్లో పరదాల వెనక్కి నెట్టేసినట్టు, చరిత్ర చీకటిలోకి నెట్టేసారు. వారి కృషిని మరుగున పరచడమో, గుర్తించకపోవడమో లేక ఒక మౌనాన్ని (మహాతెలివిగా) వహించడమో చేయడంవల్ల అసంఖ్యాకంగా స్త్రీలకు చరిత్ర పొడవునా తీవ్రమైన అన్యాయం జరిగింది. వారి కృషి,ప్రతిభ, తెలివితేటలు మరుగున పడిపోయాయి.
ఉదా. ఖగోళ, గణిత, జ్యోతిశ్శాస్త్రమనగానే మనకు వరాహమిహిరుడు, అతని కొడుకు మిహిరుడు మాత్రమే గుర్తుకొస్తారు కాని మిహిరుడి భార్య ఖానా మనస్మృతి పథంలో మెదలదు. ఖానా తన అపార మేధా సంపత్తుతో తొలిసారి గణితం వేసి నక్షత్ర సంఖ్యను కనిపెట్టింది. భర్త, మామలు ఛేదించలేకపోయిన పనిని అవలీలగా పరిష్కరించి చూపిన ఖానాకు దొరికిన బహుమానం ఆమె నాలుకను తెగ్గోయించుకోవడం అని భండారు అచ్చమాంబ తన ”అబలాసచ్చరిత్ర రత్నమాల”లో రాసేవరకూ మనకు ‘ఖానా’ గురించి, ఆమె శక్తిసామర్ధ్యాల గురిచి తెలియనే తెలియదు కదా!
అలాగే డా.ఆనందీబాయి జోశి జీవితం, ఉన్నత చదువుకోసం ఆమె చేసిన పోరాటం. అమెరికా వెళ్ళి డాక్టర్ కోర్సు చదవడానికి ఆనందీబాయి చేసిన యుద్ధం సామాన్యమైందికాదు. ఆడపిల్లలకి అక్షరాలు కూడా నేర్పించని కరడు కట్టిన పురుషాధిక్య సమాజం, ఒక స్త్రీ ఒంటరిగా విదేశాలకెళ్ళి చదువు నేర్చుకోవడానికి ఎన్ని అడ్డంకులు పెట్టాలో, ఎంత వేధించాలో అంతా చేసింది. అయినా సరే. ఆనందీబాయి వాటన్నింటిని అధిగమించి, గొప్ప ధైర్య సాహసాలతో విదేశంలో తన చదువుకొనసాగించి, ఎందరికో మార్గదర్శకురాలైంది.
సంఘసంస్కర్తలంటే పురుషులు మాత్రమే గుర్తుకు వచ్చేలా చరిత్రను వక్రీకరించడంవల్ల, సాహిత్యమంతా పురుషుల సృజనే అని ప్రచారం జరగడంవల్ల ఆయా రంగాల్లో అసమానంగా కృషి చేసిన స్త్రీలు అంచులకు నెట్టేయబడ్డారు. అన్నింటా పురుషులే కేంద్రబిందువులై చరిత్రను దురాక్రమించడంవల్ల ప్రతి రంగంలోను స్త్రీలకు అపార నష్టం జరిగిందన్నది కఠోరవాస్తవం. ఇది ఒక్క స్త్రీలకే జరిగిన అన్యాయం కాదు. సమాజంలో అణిచివేయబడ్డ వర్గాలందరికీ జరిగిన ఘోర అన్యాయం.ఈ రోజు స్త్రీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు చరిత్ర పొడవుగా జరిగిన అన్యాయాలను ప్రశ్నించడమే కాదు, చరిత్రను తిరగరాయాల్సిన అవసరం చాలా వుంది. చరిత్ర చీకటిలో మినుకు మినుకు మంటున్న వెలుగు రవ్వల్ని వెలికితీస్తేనే అది సమగ్రమైన చరిత్ర అవుతుంది. లేదంటే అగ్రవర్ణాల పురుషుల చరిత్రగానే, అసమగ్రంగానే మిగిలిపోతుంది.
No comments:
Post a Comment