Monday, March 14, 2011

మళ్ళొకసారి మార్చి 8 ని తలచుకుంటూ....




మార్చి ఎనిమిది సమీపిస్తుందంటే ఒక ఉత్సాహం, ఒక సంతోషం మనసంతా కమ్ముకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఎన్నో సమావేశాలు. రాష్ట్రం నలుమూలల నుండి అసంఖ్యాకంగా ఆహ్వానాలు. ఆదోని రమ్మని ఉషారాణి, కాకినాడ రమ్మని అబ్బాయి, చేనేత మహిళల మీటింగ్‌లో పాల్గొనమని నిర్మల, పాడేరులోని అరణ్యక మీటింగ్‌కి రమ్మని మాలిని, ఆఖరికి నేను అనంతపూర్‌ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మీరు ఈ సంపాదకీయం చదివేసరికి మార్చి ఎనిమిది సంబరాలు ముగిసిపోతాయి కూడా.
నగరంలో కూడ లెక్కలేనన్ని మీటింగులు జరుగుతాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా మార్చి ఎనిమిదిన మహిళల అంశాలపై, మహిళల సమస్యలపై చర్చోపచర్చలు జరుగుతాయి. కొందరు పోరాట దినంగా జరిపితే, కొందరు ఉత్సవంలా, ఉల్లాసంగా జరుపుతారు. వందేళ్ళ చరిత్ర కలిగిన మార్చి ఎనిమిది ఎన్నో పోరాటాల్ని, మహిళల ఆరాటాల్ని, ఆర్తనాదాల్ని తనలో ఇముడ్చుకుంది. వాటన్నింటినీ గుర్తు చేసుకోవడానికి, గురి తప్పిన గమ్యాలను పునర్మినించుకోడానికి, మహిళా ఉద్యమానికి పునరంకితమవ్వడానికి మార్చి ఎనిమిదిని మించిన రోజు మరోటి లేదు.
అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ సందర్భంగా ముందుకొస్తున్నాయి. బీజింగ్‌ సదస్సు స్ఫూర్తితో మహిళలపై అన్ని రకాల వివక్షతను వ్యతిరేకంగా జరిగిన ఒప్పందం (సీడా) నేపధ్యంలో భారతదేశం మహిళల రక్షణ కోసం చాలా చర్యలను తీసుకుంది. కొత్త చట్టాలను చేసింది. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు (73,74 రాజ్యాంగ సవరణ) గృహహింస నిరోధక చట్టం 2005, లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010 లాంటివి వచ్చాయి. అయితే అసెంబ్లీ, పార్లమెంటుల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లు మొద్దు నిద్రలోనే జోగుతోంది. పనిస్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక బిల్లును చట్టరూపంలో తేవడానికి అనవసర జాప్యం జరుగుతోంది. గృహహింస నిరోధక చట్టం కూడా దేశమంతా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు రక్షణాధికారులు వ్యవస్థ ఏర్పడనేలేదు. చట్టంవొచ్చి 5 సంవత్సరాలు గడిచిపోయినా అమలులో ఎంతో నిర్లిప్తత, నిర్లక్ష్యం కనబడుతోంది. ఇంత నిర్లక్ష్యం క్షమించలేం. అలాగే ఈ చట్టం గురించిన ప్రచారం ప్రభుత్వం చేపట్టలేదు. ఒక పనికి ఆహారపథకం, ఒక పల్ప్‌పోలియో, ఒక ఆర్‌టిఐ చట్టం ప్రచారం కోసం నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం విషయంలో మాత్రం స్ట్రాటజిక్‌గా మౌనం వహిస్తోంది.
కొత్త చట్టాలొస్తున్నాయి. కొత్త కొత్త సపోర్ట్‌ సిస్టమ్స్‌ వెలుస్తున్నాయి. అయినాగానీ స్త్రీల మీద హింస ఏ మాత్రం తగ్గడం లేదు. స్త్రీలపై నేరాలు పెరుగుతున్నాయని సాక్షాత్తు జాతీయ నేర నిరోధక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నేరాలు పెరుగుతున్నాయని లెక్కలేసి చెబుతున్నారుగానీ వాటి తగ్గుదల కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం లేదు. చట్టాలు చేసాం కదా అని చేతులు దులిపేసుకునే బండవైఖరి కన్పిస్తోంది కానీ చట్టాల సక్రమ అమలుకోసం జండర్‌ స్పృహతో ఆలోచిస్తున్న దాఖలాలు లేవు.
ఈ మార్చి ఎనిమిది సందర్భంలో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అంశమొకటుంది. దేశ రక్షణకోసం సైన్యంలో చేరిన మహిళలకు జరుగుతున్న అన్యాయం. ఆర్మీలో కొనసాగుతున్న జండర్‌ వివక్ష. ఆర్మీలో పనిచేసే మహిళలకి పర్మినెంట్‌ ఉద్యోగాలివ్వకుండా 14 సంవత్సరాల దాకా టెంపరరీగా పనిచేయించుకుని ఎలాంటి పదవీవిరమణ సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి సాగనంపుతారని ఇటీవల సుప్రీంకోర్టుకొచ్చిన ఒక కేసు గురించి చదివినపుడు తీవ్ర దిగ్భ్రమను కల్గింది. అత్యంత గోప్యతను పాటించే ఆర్మీలో విషయాలు బయటకు రావడం చాలా కష్టం. కొంతమంది మహిళా అధికారులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఈ అంశం బయటకొచ్చింది. వీరిపట్ల కొనసాగుతున్న వివక్ష అంతర్జాతీయ ఒప్పందాలకు విరుధ్ధం. భారత రాజ్యాంగానికి విరుద్ధం. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో వేచి చూడాల్సి వుంది.
మార్చి ఎనిమిదికి జేజేలు పలుకుతూ, మహిళా అంశాలను సమీక్షించుకోవడానికి మార్చి ఎనిమిది సమావేశ వేదికలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ…
అందరికీ అభినందనలు తెలుపుతూ…

http://bhumika.org/archives/1710



No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...